ఈ గంట గణగణ మోగాలి..!

 shool

 

 

గౌరవ మంత్రివర్యులు గంటా శ్రీనివాసరావు గారికి-

నమస్కారం!

సార్.. మీతో మాట్లాడడానికి మాకు అవకాశం లేదు. అందుకే వుత్తరం రాస్తున్నాము. పేరు లేదని ఏదో ఆకాశ రామన్న వుత్తరమనుకోకండి. ఇది రాసేది ఒక్కరమే అయినా యివి మా బడి పిల్లలందరి అభిప్రాయాలు వరుసగా మీకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే మీరు మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి, యింకా ప్రాధమిక – మాధ్యమిక –  ఉన్నత – సాంకేతిక – చదువుల మంత్రి మీరు. అంటే.. మీరు మా మంత్రి!

మన ప్రధానమంత్రిగారిలాగే మన ముఖ్యమంత్రిగారిలాగే మీరూ దేశ విదేశాల్లో తిరగడం తప్పు కాదు. కాని అక్కడైనా యెక్కడైనా మన దేశ ప్రతిష్ట జెండా కర్రలా- మనకుండాల్సిన వెన్నెముకలా- నిటారుగా వుండాలి! తలెత్తుకు తిరగాలి! రండి బాబూ రండి.. మా దేశంలో వ్యాపారాలు చేసుకోండి.. యవ్వారాలు చేసుకోండి.. మా దేశంలో తాగడానికి నీళ్ళు లేకపోయినా మీకు నీళ్ళిస్తాం.. మాదేశంలో ప్రజలకు పవర్ కట్లున్నా మీకు పూర్తి కరెంటు యిస్తాం.. మా వాళ్ళు భూముల కోసం సొంత అన్నదమ్ములే తలలు పగలగొట్టుకొంటున్నా, పోలీసుల్ని పెట్టయినా కొట్టయినా కేసుకట్టయినా కాల్పించయినా ప్రజలదగ్గర లాక్కొనయినా పీక్కోనయినా మీకు కావలసినంత భూమి యిస్తాం. మా దేశంలో ప్రజలకి వొక్కో రాయితీ తీసేసి.. రాయితీలు లేకుండా చేసి.. మీకు మాత్రం అడిగినన్ని రాయితీలు యిస్తాం.. అని దండోరా వేసుకు తిరుగుతున్నప్పుడు ‘దేశం పరువు తీసేస్తున్నార్రా’ అని చెప్పకేం ఈ దేశ నాయకులని తిట్టుకున్నాం. తిట్టుకుంటూనే వున్నాం!

మీరనుకోవచ్చు.. యివన్నీ నాకెందుకు రాస్తున్నారని? చెప్పాము కద సార్.. మీరు మా మంత్రి. మా విద్యార్థుల మంత్రి. అంతే కాదు, మీరు కూడా యీ మధ్య పై దేశముకెళ్ళి మా పరువు తీసారు. మా పరువు అంటే మా బడి పరువు. మన బడి పరువు!

మేము పేపర్లో చదివాము. కొలంబస్ నుండి ఆవార్త వొచ్చింది. మీరు యిక్కడికి మన దేశానికి వొచ్చాక కూడా అవే మాటలన్నారు. ఆ వార్తా చదివాము. యాభై లక్షలు విరాళంగా యిస్తే, అలా యిచ్చిన వారి పేర్లను, లేదా వారు సూచించిన వారి పేర్లను స్కూళ్ళకు పెడతాము.. అన్నారు. అలాగే పది లక్షలు యిస్తే తరగతి గదులకు పేర్లు పెడతాము.. అన్నారు. మా బడిలో చదివే ఆడపిల్లలు యేమంటున్నారో తెలుసా సార్.. లక్ష రూపాయలు యిస్తే యేకంగా టాయిలెట్స్ కట్టించి మరీ వారి పేర్లేకాదు, వారి మొత్తం కుటుంబం పేర్లూ పక్కనే శిలా ఫలకం మీద మీ పేర్లూ పెడతామని కూడా మీరు చెప్పివుంటే బాగుణ్ణు అని అనుకున్నారు. మీరు అమెరికాలో పర్యటనలో వున్నప్పుడే ఆ పని సిగ్గులేకుండా చెయ్యాల్సింది అని అన్నారు. ఓహియో తెలుగు సంఘం, టాకో వారు నిర్వహించిన సభలో మీరు పాల్గొన్నప్పుడే టాయిలెట్ల విషయమూ ప్రకటించి వుండాల్సింది..

సార్.. మన దేశంలో చదువుకొనే పిల్లలకి ఉచ్చపోసుకోవడానికి కూడా లేదూ అంటే సిగ్గు చేటు కాదా సార్.. మీ తెల్ల చొక్కాల మీద మురికి మాకందరికీ కనిపిస్తోంది, మీది మీకు కనిపించడం లేదా సార్.. ప్రభుత్వంలో వున్న మీకు ప్రభుత్వమంటే గౌరవం లేదా సార్.. ‘ప్రభుత్వ పాఠశాల’ అంటే బాగోలేదా? ‘సర్కార్ స్కూల్” అంటే బాగోలేదా? మీకీ దృష్టి వుండడం వల్లే కొందరు మా బడులను ‘దుంపల బడి’ అంటున్నారు. మీకు లేని సిగ్గు మాకేల? అని యిన్నాళ్ళూ వూరుకున్నాం. కాని మా బడి యెంత దిక్కుమాలిన పరిస్థితుల్లో వుందో మీరు విదేశాల్లో అడుక్కుంటూ వుంటే మీకు లేదేమో గాని మాకు అవమానంగా వుంది సార్. సార్.. మమ్మల్ని మీరు ముష్టివాళ్ళను చేసేసారు సార్.. ప్రభుత్వంలో వున్న మీరు ముష్టెత్తుకుంటుంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మేము ముష్టివాళ్ళం కాక మరేమీ అవుతాం సార్..?

నిజం సార్.. మా బడికి కోట్ని గురుమూర్తి గేటు కొనిచ్చాడు.. గేటు మీద ‘ధర్మదాత కోట్నిగురుమూర్తి గారిచే దానము చేయబడినది’ అని వుంటుంది. ‘గది గచ్చులు పెంట భాస్కరమ్మ జ్ఞాపకార్ధం’ అని వుంటుంది. ‘గోడలకు చెక్క సున్నాలు చేయించినవారు బెహరా జగన్నాథ్’ అని రంగుల అక్షరాలతో రాయించి వుంటుంది. తాగే నీళ్ళ డేక్సా మీద ‘బిస్వజిత్ పాఠక్ గారి పాప సునంద రజస్వల సందర్భంగా యిచ్చిన కానుక’ అని వుంటుంది. డేక్సా సరే, ఆఖరికి చైను కట్టి వుంచిన నీళ్ళు తాగే గ్లాసు మీద కూడా ‘చైన్లు మాస్టారు గృహప్రవేశం సందర్భంగా యిచ్చినది’ అని వుంటుంది. బ్లాకు బోర్డులు, బెంచి బల్లలు, టేబుళ్లు, కుర్చీలు, హెడ్ మాస్టారి చైరు దాక.. అన్నీ దానం చేసినవే! ధర్మం చేసినవే! దయ తలచినవే!

సార్.. ఈ పేర్ల వెనుకన యెవరి పేర్లున్నాయో తెలుసా సార్..? ‘సత్యమేవ జయతే -మహాత్మా గాంధి’, ‘దేశమును ప్రేమించుమన్నా మంచియన్నది పెంచుమన్నా -గురజాడ, ‘దేశ భాషలందు తెలుగు లెస్స -శ్రీకృష్ణదేవరాయలు’, ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా- ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా- పొగడరా నీ తల్లి భూమి భారతిని- నిలుపరా నీ జాతి నిండు గౌరవము! -రాయప్రోలు సుబ్బారావు’, ‘ మా తెలుగు తల్లికి మల్లెపూదండ – మాకన్న తల్లికి మంగళారతులు -శంకరంబాడి సుందరాచారి’… యిలా యెంతోమంది గది పెచ్చులు రాలిపడ్డప్పుడే పెచ్చులతో పాటు రాలిపోయారు. గోడలు కూలినప్పుడే గోడలతో పాటే కూలిపోయారు. వెల్ల వేసినప్పుడే వెల్ల కింద వుండి చెరిగి పోయారు! దారి చూపే పేరున్న దీపదారులే కాని దాన ధర్మాల పేర్ల కింద ఆరిపోయారు! అగుపడకుండా పోయారు!

సార్.. మీకు తెలుసా? మాబడిలో యిప్పటికే వొక్కో తరగతి గదికి వొక్కో పేరుంది. ‘చాచా నెహ్రూ తరగతి గది’, ‘కోడి శ్రీరామ మూర్తి తరగతి గది’, ‘ఆదిభట్ల నారాయణ దాసు తరగతి గది’, ‘కవికోకిల సరోజినీ నాయుడు తరగతి గది’, ‘సర్వేపల్లి రాధాక్రిష్ణన్ గది’, ‘ఐన్ స్టీన్ తరగతి గది’, ‘అబ్దుల్ కలాం తరగతి గది’, ‘కల్పనా చావ్లా ప్రయోగ శాల’, ‘భగత్ సింగ్ ప్లే గ్రౌండ్’.. యిలా చాలా వున్నాయి సార్.. పెట్టుకున్నాం సార్.. కావాలంటే మీరు మా బడికొచ్చి చూడండి సార్.. మదర్ ప్రామిస్ సార్..

మరిప్పుడు యెలాంటి పేర్లు వొస్తాయి సార్? జొన్నలగడ్డ జోగేస్వరరావో.. చౌదరి మురళీ మన్మధరావో.. పూసపాటి నారాయణ రాజో.. వేదుల కాంతమో.. పెంట లక్ష్మీ కాంతమో.. యిలానో మరోలానో దాతల పేర్లు మా బడికీ తరగతి గదికీ పెట్టారే అనుకోండి.. యెవరైనా అడిగితే యేమని చెప్పాలి? మా తమ్ముడో చెల్లో అడిగితే యేమని చెప్పాలి? దేశభక్తులా? కారు!, దేశ నాయకులా? కారు!, కవులూ కళాకారులా? కారు!, శాస్త్రవేత్తలా? కారు, స్వాతంత్ర్య సమర యోధులా? కారు!, సంఘ సేవకులా? కారు!.. మరెవరు? అనంటే బాగా డబ్బు సంపాదించిన వాళ్లనో.. లేకపోతే మన బడికి బెంచి బల్లలు కొనిపెట్టారనో.. గది కట్టారనో గోడ కట్టారనో.. యిటుకలు యిచ్చారనో.. లేదూ అంటే మన పేద గవర్నమెంటుకు డబ్బులిచ్చి ఆదుకున్నారనో.. చెపితే బావుంటుందా? దేశంపట్ల భక్తిని కలిగి వుండడం కన్నా- ప్రజల కష్టసుఖాలు యెరిగిన నాయకులుగా వుండడం కన్నా – కవిత్వములోనో కళలలోనో రాణించడంకన్నా – తమ జీవితాన్నిచ్చిన శాస్త్రవేత్తలకన్నా – సంఘ సేవకులకన్నా – దేశం కోసం ప్రాణాలిచ్చిన సమర యోధులకన్నా – అన్ని కష్ట నష్టాలు పడేకన్నా డబ్బు సంపాదిస్తే సుఖము. సౌఖ్యము. కీర్తి. కాబట్టి బాగా చదువుకొని బాగా డబ్బు సంపాదించాలి.. డబ్బు ముందు అన్నీ దిగదుడుపేనంటే.. యేదో యెక్కడో బాగోలేదు సార్. మంచిది కాదు సార్.. మంచిగా లేదు సార్.. సారీ సార్..

జనం కూడా గుర్తుపెట్టుకోరు సార్.. యిప్పుడు నవీన్ జిందాల్ యెంతమందికి తెలుసు సార్.. జిందాల్ ఫ్యాక్టరీ వల్ల కొంతమందికి తెలుసు. తండ్రి ఓం ప్రకాష్ జిందాలే తెలీదు. నవీన్ జిందాల్ అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ యెట్ డల్లాస్ లో చదువుకొని, ఆర్ధిక సాయం చేసినందుకు అక్కడ అతని పేరుతో ‘నవీన్ జిందాల్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంటు’ అని వొకటి పెట్టారు. చెప్పనా సార్.. మనదేశంలో జిందాల్ అంతడబ్బు యెలా సంపాదించాడు అని ఆలోచిస్తారు గాని వేరేలా ఆలోచించరు. డబ్బు లేనివాళ్ళంతా డబ్బు వున్న వాళ్ళదగ్గర యెలా వుందో వచ్చిందో ఆలోచిస్తారు. మీ మంత్రులు కూడా డబ్బు యెలా సంపాదిస్తున్నారో మా తలిదండ్రులూ టీచర్లూ మాట్లాడుకుంటూ వుంటే వింటూనే వుంటాము. అలా తెలిసిన విషయాలే యివి.

మరో విషయం.. ఆమధ్య వొక టీవీ వాళ్ళు.. ఆంధ్రులు.. ప్రవాసాంధ్రులు.. పూర్వ విద్యార్థులు.. వాళ్ళనీ వీళ్ళనీ అందర్నీ పిలిపించి.. ‘నీ బడి పిలుస్తోంది.. సాయం కోరుతోంది’ అని గజల్ శ్రీనివాస్ తో పాట పాడించి.. మరీ పెద్ద పెద్ద ప్రోగ్రాములు చేసారు. ప్రభుత్వ పాఠశాలలు దీనంగా హీనాతి హీనంగా వున్నాయని అందరూ చెప్పారు. మేము చాలా సంబరపడ్డాము. అంతా కలిసి ప్రభుత్వాన్ని అడుగుతారనుకున్నాం. నిలదీస్తారని అనుకున్నాం. ప్రభుత్వంలో దానికో శాఖ వుంది.. మంత్రి వున్నాడు.. విద్యకి కూడా బడ్జెట్ వుంది.. మాట్లాడుతారు.. అని ఆశ పడ్డాం. లేదు, అడగలేదు. అవస్థ యిది అని వ్యవస్థని అడగలేదు. అడుక్కున్నారు. తప్పితే హక్కులు మరిచిపోయారు. కలిగిన వాళ్ళని జాలి చూపించమన్నారు. దయ చూపించమన్నారు. మన వూరు.. మన మట్టి.. మన బడి.. అని సెంటిమెంటుల ఆయింట్ మెంటులు రాసారు. లక్షల బడుల్లో వంద బడులు అదీ అప్పటికి బాగుపడితే చాలా? వుమ్ముతడి పనులు తప్ప శాశ్వత పనేనా యిది? ఇచ్చిన వాళ్ళ ఔదార్యం యెంత కాలముంటుంది? ఎందరికి వుంటుంది? అదికూడా బడి నుండి వెళ్లి బాగా చదువుకొని బాగుపడిన వాళ్ళు వున్నప్పుడే. లేనప్పుడు? లేదు! అంతే! మా బడులనుండి బాగా చదివి వెళ్ళిన వాళ్ళు లేరు. మా బడులు అలాగే వున్నాయి. అప్పటికీ వినాయక చవితికీ దసరాకీ చందాలు అడిగినట్టు డబ్బా పట్టుకు వెళ్లి అడుక్కున్నాము. బడిలో ‘బడికి సాయం చేయండి’ అని రాసి హుండీ కూడా పెట్టాము. అది గుడా? హుండీ నిండడానికి!? బడి కదా?!

సార్.. హక్కుగా అడగాల్సిన వాటికి.. అమలు పరచాల్సిన వాటికి.. అడుక్కోవడం బాగోలేదు సార్.. ఒకరి దయా దాక్షిణ్యాలమీద యెల్లకాలము నడవదు సార్.. మా పెద్దలు చెప్పారు సార్.. సార్ మీ మంత్రులంతా ప్రయివేటు బడుల ప్రారంభోత్సవానికి వస్తుంటారు. తప్పితే వొక్క సారి మా బడిలోకి రండి సార్.. స్లాబ్ పడిపోదు. పెంకులు జారి నెత్తి పగలదు. గోడ కూలి గాయం కాదు. పోనీ తలకు హెల్మెట్ పెట్టుకొని, వొంటికి బులెట్ ప్రూఫ్ తొడుక్కొని, సెక్యూరిటీ సిబ్బందిని పిలుచుకొని రండి సార్.. ఒక్క రోజుకి అలా అయితే భయపడితే యెలా సార్.. మేం నిత్యమూ చిన్నపిల్లలతో సహా యిక్కడే చదువుకుంటాము. వుంటాము. మేం మీరు పెట్టిన మీటింగులకి మా హెడ్ మాష్టారు చెపితే యెండలో రోడ్డు పొడుగునా నిలబడి మీకు స్వాగతాలు పలక లేదా సార్.. మానవహారాలు కాట్టాము సార్.. మరిచిపోయారా సార్..?

ప్రయివేటు విద్యాసంస్థలకి వేల యెకరాలు యిస్తున్నారే.. యెంకరేజ్ చేస్తున్నారే.. పెద్ద మాటలు అనుకోవద్దు, మేం రోజూ పేపరు చదువుతాము.. సార్.. ప్రయివేటు రంగాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.. మరి ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వం కాక యెవరు ప్రోత్సహిస్తారు? లేదు సార్.. ప్రభుత్వం ప్రోత్సహించడం లేదు సార్.. సార్ యేమిటో సార్.. ప్రభుత్వరంగంలో వున్నవన్నీ నీరసించి నశించి పోతున్నాయి.. అది విద్యయినా.. వైద్యమైనా.. యేదయినా.. ప్రభుత్వ బడులు వెనక బడితే అధికారులూ మంత్రులూ వెనకబడినట్టు కాదా? మాకేనా మార్కులు? మీకుండవా? ప్రభుత్వ బడులు దీటుగా నడపకుండా మూసేస్తే పోతుంటే మీరు ఫెయిల్ అయినట్టా? పాసయినట్టా?

దయచేసి డబ్బుకోసం ధరలు నిర్ణయించి బడిని బద్నాం చేయకండి. చేస్తామంటారా? అంతకన్నా ముందు వొక పని చేయండి. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమో.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమో.. భారత ప్రభుత్వమో.. అని కాక యిక్కడ పెట్టుబడులు పెట్టే టాటా ప్రభుత్వమో.. బిర్లా ప్రభుత్వమో.. రిలయన్స్ ప్రభుత్వమో.. విప్రో ప్రభుత్వమో.. హేచ్సీయల్ ప్రభుత్వమో.. హిందూజా ప్రభుత్వమో.. అదాని ప్రభుత్వమో.. అని పేరు మార్చుకోండి అంటే మార్చుకుంటారా? వాళ్ళంతా మన పేద దేశంలో డబ్బుగలవాళ్ళు.. వాళ్ళ వ్యాపారాల వల్ల మనకు ఉపాధి కలుగుతోంది అని అంటే పేర్లు మార్చేస్తారా? అంతెందుకు.. మీ ప్రభుత్వ శాఖల పేర్లు అయినా మార్చేస్తారా? మన చదువుల శాఖే వుంది. ప్రాధమిక విద్యని విజ్ఞాన్ విద్యనో భాష్యం విద్యనో కృష్ణవేణి విద్యనో మార్చమంటే మార్చేస్తారా? అలాగే మాధ్యమిక విద్యని చైతన్యా నారాయణల ‘చై.నా’ విద్యాశాఖ అని మార్చమంటే మార్చేస్తారా? మీకు కోర్టులు కూడా అనుకూలంగా వున్నాయి. ఈమధ్య విద్యా విషయాల మీద కోర్టు స్పందించింది. ప్రభుత్వ బడులను ప్రభుత్వం నడపలేకపోతే ప్రయివేటుకి అప్పగించమంది. అప్పుడే చాలా మంది ప్రయివేటు విద్యా వ్యాపారులు అందుకు సిద్ధంగా వున్నామని అన్నట్టుగా కూడా పేపర్లో చదివాము. అంచేత మీరు సిద్ధమే అయితే యింక మీకు శాఖ వుండదు! మీ అవసరమూ వుండదు!

సరే సార్.. ఆఖరిగా వొక మాట.. మా బడిలో పేద్ద సరస్వతీ దేవి పటం వుంది సార్.. అది కూడా మా బడికి యెవరో బహుమతిగా యిచ్చిందే సార్.. దానమిచ్చిందే సార్, జిల్లా ఫస్టు వొస్తే. సార్.. మా సరస్వతీ దేవి యెలా వుంటుందో తెలుసా సార్.. తెల్ల చీర కట్టుకొని చేతిలో వీణతో హంస మీద కూర్చొని మెరిసిపోతుంటుంది సార్.. ఆ చీర గురించి చాలా సార్లు మా అమ్మకు చెప్పాను సార్, సరస్వతీ దేవి అందమంతా చీరలోనే వుందని! కాని సార్.. యిప్పుడెప్పుడు చూసినా సరస్వతీ దేవి అందంగా కనిపించడం లేదు సార్.. తెల్ల చీర మాసిపోయి చిరిగిపోయి వీణ తీగలు తెగిపోయి ఆముఖంలో నవ్వు మాయమైపోయి దిక్కుమాలిన దానిలా వుంది సార్.. అచ్చం మాలాగే!

పెద్ద వుత్తరం రాస్తే చేట భారతమని చదవరట గదా సార్.. అందుకే రాయాలని వున్నా రాయకుండా ఆపేస్తున్నాము. తప్పులుంటే మన్నించండి. అయినా వొక తప్పు వల్ల వొంద తప్పులు జరుగుతాయి. మా తప్పులు అలాంటివేనని అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాము!

మళ్ళీ నమస్కారాలతో-

మీ

విద్యార్థులు

(ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధినీ విద్యార్థులు)

మీ మాటలు

 1. sasikala says:

  👌👌👌

 2. ఓలేటి శ్రీనివాసభాను says:

  గుండెను తాకింది జగదీశ్వరరావు గారూ..

 3. బాగుంది.మంత్రి గారిని కళ్ళు తెరిపించారు
  మంచికంటి

 4. Rachakonda. Srinivasu says:

  బావురమని ఏడ్వాలనిపించింది .ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాథాయూనిగ
  బాగోదేమోని గుండె దిటవు చేసుకొన్నా.

 5. mskk jyothi says:

  బాగాలేని విషయాలని గురించి బాగా రాశారు.

మీ మాటలు

*