ఆధునిక తెలుగు కవితా సదస్సు

 

 

 

~

ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో మొదలైన ఆధునిక తెలుగు వచన కవిత్వం ప్రస్తుతం తెలుగు సాహిత్య ప్రక్రియలన్నిటిలోకీ అత్యున్నత స్థాయిలో కొనసాగుచున్నది. కవుల సంఖ్య, వెలువడుతున్న కవితల, కవితా సంపుటాల సంఖ్య, కవిత్వ పాఠకుల సంఖ్య, పత్రికలలో కవిత్వానికి దొరుకుతున్న స్థలం వంటి ఏ ప్రమాణాలతో చూసినా, కవితల వస్తు శిల్పాల విశిష్టత దృష్ట్యా చూసినా, కవిత్వంలో ప్రతిఫలిస్తున్న సామాజిక సమస్యల, పరిష్కారాల, అనుభూతుల దృష్ట్యా చూసినా కవిత్వానిదే అన్ని ప్రక్రియల్లోకీ అత్యున్నత స్థానం. వెయ్యి సంవత్సరాల తెలుగు లిఖిత సాహిత్య చరిత్రలో ఎనిమిది వందల సంవత్సరాలకు పైగా ఏకైక, అతి ప్రధాన ప్రక్రియగా రాజ్యం చేసిన కవిత్వం ఇవాళ అనేక ప్రక్రియల్లో ఒకటిగా ఉన్నప్పటికీ సమాజపు ఆదరణలో తన గత వైభవాన్ని కోల్పోలేదు.

మరీ ముఖ్యంగా గత అర్థశతాబ్ది పరిణామాలనే చూస్తే తెలుగు కవిత్వ ప్రక్రియ విప్లవవాదం, స్త్రీవాదం, దళితవాదం, బహుజనవాదం, మైనారిటీవాదం, ప్రాంతీయవాదం వంటి సామాజిక ఉద్యమాలతో జవజీవాలు పెంచుకుని పరిపుష్టమయింది. తెలుగు కవిత్వం అంతకుముందు తెలియని వస్తువులనూ, శిల్ప శైలీ పద్ధతులనూ, నుడికారాన్నీ ఎన్నిటినో గత నాలుగైదు దశాబ్దాలలో సంతరించుకున్నది. ఈ కవిత్వ సంరంభాన్ని సన్నిహితంగా పరిశీలించడం ఆసక్తిదాయకంగా, ప్రేరణాత్మకంగా ఉంటుంది.

అటువంటి ఆసక్తిదాయకమైన, ప్రేరణాత్మకమైన పనికి దేశ రాజధానీ నగరంలో వేదిక కల్పించాలనీ, ఢిల్లీ లోని తెలుగువారికి ఈ కవిత్వ రుచులు ఉదాహరణప్రాయంగానైనా అందించాలనీ ఒక ప్రయత్నం చేస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాలనుంచీ,   విభిన్న దృక్పథాలకు, కవితా పద్ధతులకు ప్రాతినిధ్యం వహించే ఏడు మంది కవులతో ఒక రోజంతా కవిత్వం గురించి చర్చించడానికీ, వారి కవిత్వాన్ని వినడానికీ, ఇతర ప్రభావశీల కవిత్వం గురించి తెలుసుకోవడానికీ ఢిల్లీ లోని తెలుగు వారికి ఇది ఒక అరుదైన అవకాశం.

అంతే కాక సాహిత్యానికి రంగస్థలానికి ఉన్న దగ్గర సంబందాన్ని దృష్టిలో పెట్టుకొని, ప్రఖ్యాత రంగస్థల కార్యకర్త , కేంద్ర  సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత మాయా కృష్ణరావు గారి “Walk the Talk” ఏకపాత్రాభినయంను ఏర్పాటు చేయడం జరిగింది.

Sadassu

మీ మాటలు

  1. K.WILSON RAO says:

    జయహో కవిత్వం!

మీ మాటలు

*