యెదురుచూసే నేలలా…

arun

వుత్తర్ ప్రదేశ్ బిజనోర్ లో ఫిబ్రవరి 16, 1972 లో పుట్టిన డా. అరుణ్ దేవ్ తన వున్నత విద్యను జవహర్‌లాల్‌  నెహ్రూ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసారు. యువకవి,విమర్శకులైన అరుణ్ దేవ్ “క్యా తో సమయ్” అనే తన కవితా సంకలనాన్నీ 2004 లో భారతీయ జ్ఞానపీఠ్ ప్రచురిస్తే, “కోయితో జగాహ్ హో” అనే మరో సంకలనాన్నీ వాణిప్రకాషన్ వారు ప్రచురించారు. వీరి కవితలు నేపాలీ,అసామీ,ఆంగ్లం,మరాఠీ భాషల్లో అనువదింపబడ్డాయి.గత అయిదు సంవత్సరాల నుంచి సమాలోచన్ అనే హిందీ అంతర్జాల పత్రికను నడుపుతున్నారు.

అరుణ్ దేవ్ గారు కవిత్వమంటే మానవత్వపు అనువాదంగా భావించే కవి.ఆయన కవిత్వం రాస్తూ నాగరికతను రాస్తుంటారు. దీని భూగృహంలో శవమైన విలువలు వుంటాయి.స్త్రీలు,పిల్లలు,నలుపు ముఖం కలవారి శాపంతో భయానకమౌతున్న యీ నాగరికతలో: రోజూ వొక నది మరణిస్తుంటుంది, వొక పక్షుల జాతి మాయమౌతుంటుంది, వొక జానపద పాట తన ప్రాణాలను కోల్పోతుంటుంది. యీ కవి మరో ప్రపంచాన్ని ఆశిస్తూ రాస్తుంటాడు.యితని కవిత్వంలో పొడిబారిన,వాడిన ముఖాల్లోని దుఖం పాఠకులను వెంటాడుతుంటుంది.

వారసత్వం
————–

పగటి వెలుగులో
పసిపిల్లవాడి యేడుపు కరిగిపోయింది
అక్కడే దగ్గరలోనే వొక తల్లి వుంది
ఆమె ముఖంలో
ఆ పసిపిల్లవాడి కలలు, దుఖపు క్లేశాలూ వున్నాయి.

ఆ తల్లి కోరికలో
వెన్నెల రాత్రి వుంది
ఘాఢమైన రాత్రి వాసనలో
అస్పష్టంగా పాడే కొన్ని కీచురాళ్ళు
వుదయం వొక ఆశలా
కొన్ని జాముల కోసం యెదురు చూస్తోంది

అమ్మ లాలిపాటలోని చంద్రుడు యెక్కడికో వెళ్ళిపోయాడు
అక్కడ వొక భయానక స్వరం విన్పిస్తోంది
అందులో నుంచి శతాబ్దాల నాటి పాత గీతాలు విన్పిస్తున్నాయి
అందులో వొక యెడారి వుంది
తాను దానిలో నడచి వెళ్తూవుంది యెందుకో తెలియదు

పిల్లవాడిపై యెండ
యెడారిలా రాలుతోంది
ఆమె యెండమావిలో జింక వొకటి పరుగెత్తుకుంటూ వచ్చింది
సీతాకోకచిలుక వెనుకగా విడివడి వెళ్ళిపోతూ రంగులు
పిల్లవాడి వీపుపై
ఆశకు ముందు వుండే దీర్ఘ నిరాశలు
కాల్చిన గురుతులు వున్నాయి

తల్లి దిగులుగా వుంది
పచ్చగడ్డి కోసం యెదురుచూసే నేలలా

అనువాదం, పరిచయం: పఠాన్ మస్తాన్ ఖాన్ 

*

మీ మాటలు

  1. చక్కని కవిత…అనువాదం పరిచయం కూడా సరళం గా ఎపెక్టివ్ గా ఉంది. అభినందనలు .ధన్యవాదములు మస్తాన్ గారు

  2. srinivasulu says:

    అనువాదం అచ్చూ మౌలికమైనట్టు , కవిత సునాయాసంగా చదివించిన ఆర్ద్రత ప్రశంశనీయాం ….అనునాదం అందిందిస్తున్న సారంగవారికి ధన్యవాదాలు మస్తాన్ గారికి కృతజ్ఞతలు

  3. పఠాన్ మస్తాన్ ఖాన్ says:

    సరళా గారికి,శ్రీనివాసులు గారికి ధన్యవాదాలు…

  4. పఠాన్ యిమ్రాన్ ఖాన్ says:

    This poem I didn’t get but the silent cry of this child made me little sad.

  5. Suparna mahi says:

    గొప్ప పరిచయానికీ, ఇంత చక్కని అద్భుతమైన అనువాదానికి ధన్యవాదాలు & అభినందనలు అన్నయ్యా…

  6. పఠాన్ మస్తాన్ ఖాన్ says:

    ధన్యవాదాలు యిమ్రాన్ ఖాన్,మహీలకు, మీ ఆదరణకు…

మీ మాటలు

*