పంటల్లో మంటలు

gopi

తెల్లారగట్టే పొలానికిపోయి పనులు సేసుకోటం మాకలవాటు. కోడికూయకముందే పొలానికెల్టం, పంటకి నీల్లు పెట్టడం రొజూ మాపని. పూలు, కూరగాయలు, ఆకుకూరలు అన్నీ తెల్లరిపాటికల్లా కోసి గంపల్లోకో, గోనె సంచుల్లోకో పేర్చి సిద్ధంగా ఉంచుతాం. విజయవాడ నుంచి మారుబేరగాళ్ళు వొచ్చి ఆటోల్లోనో, సిన్న లారీల్లోనో మార్కెట్టుకు తీసుకుపోతారు. అక్కడ సిల్లర బేరగాళ్లకి అమ్ముతారు. ఇంకొంతమంది సిల్లర బేరగాళ్ళు ఈల్లకాడ కొనుక్కొని సిటీ కాలనీల్లోకి పోయి అక్కడ అమ్ముకుంటారు.
పంట తక్కువ పండించే రైతు కూరగాయలు, ఆకుకూరలు సైకిలు మీదనో, మోటర్ సైకిలు మీదనో సిటీకి తీసుకెళ్లి అమ్ముకుంటారు. మావూళ్ళో ఇంకొంతమంది అచ్చంగా యాపారం సెసోల్లు నాబోటి సిన్న రైతు కాడ కూరగాయలు, ఆకుకూరలు కొని పక్కన పల్లెటూళ్లకెళ్లి అమ్ముకుంటారు.
నాది మొత్తం అరెకరం పొలం; అందులో అయిదు సెంట్లు కొత్తిమీర, అయిదు సెంట్లు పుదీనా వుంది. మిగతా 40 సెంట్లలో పది సెంట్లు వంకాయలు, పది సెంట్లు బెండ కాయలు, పది సెంట్లు గోంగూర, పది సెంట్లు తోటకూర వేశా. పంట తక్కువే. అందుకే మా వూరి బాబురావుగాడు మోటరు సైకిలు మీదొచ్చి పొద్దున్నే పంట తీసుకుపోతడు.  సుట్టుపక్కల ఊళ్లళ్లో తిరిగి అమ్ముకుంటడు. ఆడు పొలంలోకి వచ్చేపాటికి వంకాయలు, బెండ కాయలు, గోంగూర, తోటకూర కోసి కట్టమీద పెడతా. ఆడొచ్చి అన్నీ బండిమీద బుట్టలో యేసుకొని పోయి మధ్యాన్నానికల్లా అమ్ముకొని ఇంటికొత్తడు.
నా అరెకరం పొలం నాకు పని సరిపోద్ది. దాని పంట బాబురావు గాడి యాపారానికి సరిపోద్ది.
నేనూ, నా పెళ్ళాం అప్పుడప్పుడు రైతుల పొలాల్లో పనికి కూడా పోతం. ఇద్దరికీ మంచి కూలే వసద్ది. పెద్దగా దూరం పనులకెల్లం… మా పొలంకాడ దగ్గర్లోనే అరటి తోటలు, మల్లెపూలు, బంతిపూల తోటలు ఉన్నయ్. ఆపొలాల్లో పనికే పోతం.
ఇయ్యాల బాబురావు ముందే వొచ్చిండు. ఆడికి గోంగూర, తోటకూర కోసి కట్టలు కట్టి యిచ్చిన. వంకాయలు,  బెండకాయలు సెరో అయిదు కేజీలకొచ్చినియ్. అన్నీ కలిపి ఆడికిచ్చి, ఆడెల్లగానే నేనూ యింటిముఖం పట్టిన. యింటికెల్లి వొక ముద్దతిని కూసేపు అట్టా మంచమ్మీద పడి కునుకేత్తే మల్లీ మాపిటేల పొలానికి పోయి నీల్లు కట్టొచ్చు.
కట్ట మీద నడుత్తుంటే మాగొప్ప ఆనందంగా ఉంటది. రెండు పక్కలా పచ్చని పంట పొలాలు. ఒకపక్క అల్లంత దూరాన నది, ఇంకోపక్క పంటపొలాలకవతల మా వూరు… సూట్టానికి బాగుంటది. పెద్ద పెద్దోల్లు కార్లేసుకొని ఈ కట్టమీదకి వత్తారు పచ్చని పొలాలు సూడ్డానికి, సల్లటి గాలి నది మీదనుంచొచ్చి పొలాల్లోకెల్తది. అబ్బో యెంతబాగుంటదో …
యిక యీ పంటలు కనిపించవేమో!? రాజధాని బిల్డింగులొత్తయ్…. యీ గాలికూడా వుండదేమో!?
వొల్లు జలదిరించినట్టనిపించింది.
యింతలోనే దూరంగా అరుపులు, కేకలు యినిపించినయ్…. ఆపక్కకి తలతిప్పి సూసిన… అరిటి తోటలో మంటలు… జనం తోటవైపు పరుగెత్తుతున్నారు.
ఒక్కసారి గూండాగినంత పనయింది. పచ్చటి పొలంలో మంటలేంటి?
బయమేసింది. వెంటనే తేరుకొని నేను కూడా ఆ కాలే పొలం దిక్కు పరుగెత్తిన.
అరిటి తోటలో కరంటు మోటరు ఉన్న పాక కాల్తoది. మంటలు నేలమీద పాకుతున్నయ్. పొలంలోని నీళ్ల పైపులు కాలిపోతున్నయ్. దగ్గర్లో నీల్లు లేవు మంటలార్పటానికి. ఎవురికాళ్ళు అటూ, యిటూ పరుగెత్తుతున్నారు.
“ఒరేయ్ ఆ పొలంలో మోటరు ఆన్ చేయాండ్రా”
ఎవురో పెద్దగా అరిశారు. ఇంతలోనే పక్కపొలంలో మోటర్ ఆన్ అయింది. తగలబడుతున్న పాక మీదకి పైపు పెట్టి నీళ్లు కొట్టారు.
పాక కాలిపోయింది.
కరెంటు మోటర్ కాలిపోయింది.
పొలంలో నీళ్ల పైపులు కాలిపోయినియ్.
బూడిదే మిగిలింది.
యింతలో పొలం ఆసామి వొచ్చిండు.
గుండెలు బాదుకుంట ఏడుత్తుండు.
ఐదెకరాల అరిటి తోట… మంటలకు పొగసూరింది. అరిటి గెలలు నల్లబడ్డయ్.
బుజమ్మీద కండవా తీసి కళ్ళు తుడుసుకుండు.
“ఏంట్రా యిది? ఎట్ట జరిగింది?” గుంపులో ఒకాయన అడిగిండు.
“ఏమో, ఎవురికి తెలుసు? సిగిరెట్టు, బీడీ ముక్క ఎవురన్న యిసిరుంటే ఆంటుకుందేమో!?”  యింకొకాయన అన్నడు.
“యెహే నోర్ముయ్యండ్రా… సిగిరెట్టు, బీడీ ముక్కలు పక్కమీదికేవుడెత్తాడు.”
“అసలిట్టా ఎప్పుడూ జరగలేదు. పంట పొలాల్లో ఈ మంటలేంట్రా?”
“ఎవుడు సేసుంటాడు ఈపని?”
“ఆడు మనిషా, పశువా?”
“నోటికాడి కూడుకి నుప్పు పెట్టిన ఎదవ ఎవుడ్రా?”
తలొక మాట… తలొక తిట్టు…
ఎప్పుడూ లేదిలా… పంట పొలాల్లో మంటలా …
గుండె చెరువైంది. పంట కోశాక మళ్ళీ దుక్కి దున్నే ముందు చెత్త ఏదన్నా ఉంటే రైతే దగ్గరుండి నిప్పు పెట్టి తగలబెడతడు. అంతేగానీ యిలా పంటకే నిప్పు పెట్టడు. మోటరు షెడ్డు కూడా కాల్చుకుంటడా!!??
అందరం అక్కడే కూసున్నం. యింతలో పోలీసు జీబొచ్చింది. జీబులోంచి పోలీసులు దిగారు. ఆరుగురు పోలీసులు. తోటలోకి నడుసుకుంట వచ్చారు.
అందరం లేసి నిలబడ్డం.
“ఏంటయ్యా… ఏంటి … ఈ మంటలేంటి?” ఒక పోలీసాయన అడిగిండు.
“పాక కాలిపోయిందండి” ఎవురో సెప్పిండు.
“ఎలా కాలింది?” పోలీసాయన మమ్ముల్నీ, కాలిన పాకాని సూసుకుంట అడిగిండు.
“ఏమోనయ్యా… మంటలు చూసి మేం పరుగెట్టుకుంటా వచ్చినం. మంటలు ఆర్పే ప్రయత్నం చేసినం.”
“ఎవరిదీ పొలం?”
“నాదేనయ్యా” అనుకుంటా, కండవతో కళ్ళు తుడుసుకుంటా వచ్చిండు ఆసామి.
“నీ పేరేంటి?” పోలీసాయన గట్టిగనే అడిగిండు.
“సత్యనారాయణ “
“ఆఁ … ఏం పేరూ?”
“సత్యనారాయణ సార్”
“పాకెలా కాలింది?”
“తెలవదయ్యా… మంటలు చూసి నేనొచ్చా.. అప్పటికే వీళ్లంతా ఉన్నారు.”
“సరే… మేం చూస్తాంలే… పంట కాల్చిన వెధవెవ్వడో దొరక్కపోడు… మేం చూసుకుంటాం లే… ఇక ఇళ్ళకెళ్ళండి.”
పోలీసాయన అందరికేసి సూసిండు. ఆచూపుతో అందరం అక్కణ్ణుంచి కదిలాం.
నేను ఆలోసిత్తన్న… ఏంటిది… పంట పొలాల్లో ఈ మంటలేంటి… పంటలు తగలబెట్టటం ఏంటి…
మనసు పరిపరి విధాలా ఆలోసిత్తంది.
ఇంటికొచ్చిన గాని మనసు కుదుట పళ్ళేదు.
అన్నీ ఆలోచనలే… ఎందుకిలా జరిగింది.
***
యింట్లో టీవీ పెట్టా… వార్తలు … అన్ని టివీల్లోనూ ఒకటే వార్త… రాజధాని పంట పొలాల్లో అగ్ని ప్రమాదం…
“దోషుల్ని పట్టుకుంటాం” అని పోలీసులు.
“ఇది రాయలసీమ వాళ్ళ కుట్ర… ప్రతిపక్షం కావాలనే ఈ దుశ్చ్యర్యకు పాల్పడింది” మంత్రి గారు…
“రైతుల్ని,, ప్రజల్ని బెదిరించడానికే ప్రభుత్వం ఈపని చేసింది.” ఇంకో నాయకుడు.
నాకేం అర్ధం కాలేదు.
పంట పొలాల్లో అగ్ని ప్రమాదం ఏంటి? రాయలసీమ వాళ్ళైతే మాత్రం పంట తగలబెడతారా?”
ఇది నిజంగా ప్రమాదమా లేక రాజకీయమా!!??
అన్నీ ప్రశ్నలే… జవాబే లేదు.
జవాబు అధికార్లు చెప్పటం లేదు  మంత్రులు చెప్పటం లేదు. నాయకులు చెప్పటం లేదు.
అసలేం జరిగింది? మంటలెట్టా  రేగాయి? పంటపొలం ఎట్టా కాలిపోయింది?
***
సాయంత్రం ఊరు ఉలిక్కి పడింది.
పోలీసు జీబులు ఒకదానెంట ఇంకొకటి…. అబ్బో … ఎన్ని జీబులో… ఎంతమంది పోలీసోళ్లో….
“రాజధాని ప్రాంతంలో అగ్ని ప్రమాదం వంటి అరాచక చర్యలు జరుగుతున్న సందర్భంగా గ్రామాల్లో విస్తృత పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయటమైనది. అనుమానించదగ్గ వ్యక్తులు కనిపిస్తే వెంటనే  సమాచారం ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి.”
ఒక పోలీసు జీబులోనుండి మైకులో ప్రకటన….
***

మీ మాటలు

*