అవును, నేను దేశద్రోహినే!

husain_motherindia_0

 

-గుఱ్ఱం సీతారాములు

~

 

తారీకులూ దస్తావేజులు, రాజులూ రాణులూ జరిపిన ముట్టడి కి  అయిన ఖర్చు, జమా ఖాతాల శిధిలాల మీద నిర్మితమయిన జాతుల చరిత్రలకు నూతన బాష్యాలు మొగ్గ తొడుగుతోన్న  తరుణం లో జాతీయత చర్చ ప్రాధాన్యత సంతరించుకున్నది. యురోపెయన్ సమాజాల్లో వికశించిన ప్రజా పోరాటాల చైతన్యం మీద నిర్మితమయిన అరువు తెచ్చుకున్న భావన జాతీయత అని కొందరు సామాజిక శాస్త్ర కారుల భావన. జాతీయత అంటే ఒక ప్రాదేశిక ప్రాంతం లో బ్రతికే ఒకే రకమయిన ఆశలూ,అలవాట్లూ, ఆకాంక్షలతో కూడిన ప్రజాశ్రేణులతో తో కూడిన  ఊహాజనిత మయిన భావన. భావోద్వేగాలు పెల్లుభికిన ప్రతి చారిత్రిక సమయం లో జాతి ఉనికి, అస్తిత్వం పలు రూపాలు గా మారుతూనే ఉంది. ఈ తాత్విక చర్చను ఆండర్సన్ మొదలు పార్థ చటర్జీ నుంచి అంబేద్కర్, ఫూలే నిర్మించిన భావనలు, మారుతున్న సామాజిక పోరాటాల వెలుగులో పదునెక్కుతున్న సందర్భం. అలోషియస్ లాంటి తత్వవేత్తలు అసలు ఈ  దేశం లో జాతీయత ఉట్టి డొల్ల అనీ,  ఏకరూప జాతి లేని జాతి నేడు జాతీయతగా పరిగణలో ఉందనీ, ఇక్కడి జాతీయత హిందూ మనువాద పునాదుల మీద నిర్మించ బడినదీ అని చేసిన సూత్రీకరణలు, నిజాలూ మన కళ్ళముందే ఉన్నాయి .

 

ఇరవయ్యో శతాబ్దపు మొదటి బాగం లో మూడో ప్రపంచ దేశాల విముక్తి పోరాటాల స్పూర్తితో ప్రభావితం అయిన గాంధీ ప్రవచించిన జాతి ఆందోళనలు, బొంబాయి నగరాన వినాయక పందిర్ల లోగిళ్ళలో తిలక్ ప్రేరేపిత  జాతీయ ఉద్వేగ భావనలు అంతిమంగా ఏ విలువలను ప్రభోదించాయో చర్చకన్నా, ఈ దేశం లో సంఘీయుల నుండి వామపక్ష మేధో వికాశం దాకా  జాతీయతకు ఒక ప్రామాణిక నిర్వచనం ఉందా? అనే ప్రశ్నా వేయడం అసందర్భం మాత్రం కాదు. జాతి పోరాటాలు వికశించాలి అనే భావనలో ఉన్న సమూహాలు నేడు జరుగుతున్న  జాతీయ చర్చల్లో ఉదాసేనంగా ఉండడం వెనక హిందూ జాతీయ భావన కు భిన్నమయిన ఆలోచన వాళ్ళకు ఉందా అనే ప్రశ్నా ఉత్పన్నం కాకపోదు. ఇలా జాతీయ ఉద్వేగాలు పెల్లుభకడానికి  రోహిత్ ఆత్మహత్య ఒక సందర్భాన్ని ఇచ్చింది.

కేంద్రీయ విద్యాలయాల్లో వికృత క్రీడకు బలయిన దళిత పరిశోదకుడు వేముల రోహిత్ చావు ఈ దేశం లో దనావాలంలా ఒక వెల్లువను,ఆ వెల్లువ వెలుగులో లబ్ది పొందిన రాజకేయ బెహారులూ, వ్యవస్థీకృత మయిన చట్టబద్ద హత్యలకు కారణాలు వెతక కుండా, ఉద్యమ బంతిని కాంగ్రెస్ కోర్ట్ లో ఉంచేందుకు అన్నివిధాలా ప్రయత్నం జరిగింది. ఖైర్లాంజి నుండి లక్షిమ్ పేట దాకా  ముజాఫర్ నగర్ నుండి రోహిత్ దాకా జరిగిన ఘోరాల మీద ఒక్క ప్రకటనా చేయని రాహుల్ గాంధి కి హటాత్తుగా దళితులు గుర్తుకు వచ్చారు.  ఈ చర్యలను పక్క దోవ పట్టించే క్రమం లో డిల్లీ లో దేశ భక్తులకూ, దేశ ద్రోహులకూ మధ్య నలిగిన ఒమర్ ఖాలీద్ , అనిర్భవ్ బట్టచార్య , కన్నయ్య, లు  దేశానికి దేశ అంతర్గత రక్షణకు ముప్పుగా పరిగించ బడి రోహిత్ చావును డిల్లీ చుట్ట్టూ తిప్పి సప్పున చల్లార్చిన యుక్తి ఈ దేశ అలాగా జనాలకు నిజంగా అర్ధం గాలేదు.

కన్నయ్య జైలు నుండి విడుదల అయ్యాక అయన స్వరం లో మార్పు ఎవరూ పసిగట్ట లేకపోయారు. ఈ దేశంలో అసమ అభివృద్ధికీ , అసమానతలకీ  కారణ భూతులు అయిన రాబందుల నుండి ఆజాది కావాలి అని అనడం వెనక ఈ దేశం లో జరుగుతున్న విముక్తి పోరాటాలను నిర్వీర్యం చేయడమే. గణేశ పందిళ్ళ నుండి పురుడు పోసుకున్న అఖండ భారతానికీ కన్నయ్య  కలగంటున్న ఆజాదీ కి నాకయితే తేడా ఏమీ కనిపించడం లేదు. ఈ చర్చను జాతీయ చర్చలో ఇరికించేందుకు జరుగుతున్న కుట్ర అర్ధం జేసుకోవాలి.

అమరుడు ప్రొఫెసర్ నాగప్ప గారి సుందర్రాజు గురించి అందరికీ పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేకున్నా రెండు దశాబ్దాల కింద హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో విద్యార్ధి నాయకుడిగా, పరిశోదకుడిగా ఒక గొప్ప కవి, కథా రచయతగా సుపరిచితులు. అవి మండల్ కమిషన్ రిపోర్ట్ బయటికి వచ్చిన రోజులు. ‘గ్రామాలకు తరలండి’ నినాదాలు విశ్వ విద్యాలయాల్లో జేగురు రంగు అక్షరాలు తడి ఆరని రోజులు. దేశంలో ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్ది, అధ్యాపక వైరి వర్గాలు రిజర్వేషన్ అనుకూల వ్యతిరేకులుగా నిట్టనిలువు చీలిన సందర్భం. అప్పుడప్పుడే మొదటి తరం దళిత బహుజన విద్యార్డులు గ్రామీణ ప్రాంతం నుండి నగరానికి కాసింత కుల చైతన్యం తో వస్తున్న దశ.  దళితుల్లోనూ అంటరాని వాళ్ళు ఉన్నారనీ, ఆ కడగొట్టు అలగా జనాలూ జనాభా లెక్కల్లో భాగమే అనీ, దళితుల్లో అంతర్గత రిజర్వేషన్ పంపకాల్లో కూడా అనుకూల వ్యతిరేక వర్గాలుగా చీలి పోయిన సందర్భం.

ఆ సంక్షుభిత దశలో రాటు దేలిన ఆణిముత్యం నాగప్పగారి సుందర్రాజు. ఎమ్మే చదివి కేంద్ర ప్రభుత్వ అత్యున్నత  జూనియర్ రీసెర్చ్ ఫెలో షిప్  పొంది, పరిశోదన కోసం  హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిధ్యాలయం లో ఇంటర్వ్యూ కు  వచ్చిన సుందర్రాజు మాటల్లో కాటిన్యం , నిచ్చిత మయిన అభిప్రాయాలు చూసి ‘వీడు ప్రమాద కారి, వీణ్ణి విశ్వవిద్యాలయం లోకి రానిస్తే ప్రమాదం అని భావించి ఎలా అయినా రీసెర్చ్ లో సీట్ రాకుండా చేయాలి అని నువ్వు ‘’దేశ ద్రోహివి’అని అన్నారు. ఆనాడు కోపంతో ఊగిపోయి విచక్షణ కోల్పోయి నాలుగు తన్నలేదు. కానీ మను స్మృతిని విశ్వవిధ్యాలయ కరదీపిక గా ఉపయోగించుకునే అపర దేశభక్తునిగా అనిపించుకోవడం ఆయన ఆరోజు అనుమానగా భావించి  ‘అవును నేను దేశ ద్రోహినే’ అనే దీర్గ కవిత రాసాడు. ‘అమ్మ చెమటను అక్షరాలుగా మలుచుకొని అయ్యవార్లకు అంజలించా’ అని ‘పాద రక్షలు పాలిష్ చేయాల్సిన వాడిని పద్యములు పాడుతున్నాను’ ‘చదవు రాదని జంధ్యం రెండు మార్కులిస్తే విదిరాతని ఊరకుండా యుజిసి తో పోటీ పడి జేఆర్ ఫ్ సాదించు కున్నాను’ అందుకే నేను దేశద్రోహిని. కేవలం ‘నన్నయ్యకు నమస్క రించ నందుకు, విశ్వనాధుని విధానం కాదన్నందుకు, శేషేంద్రవీ వేయి పడగలె’ అన్నందుకు, ‘ఊరవతల ఉండమంటే ఊరు ఎవరిది అని అన్నందుకు’ విశ్వవిద్యాలయాలు ఆర్య జాతి సొత్తు’ అని. ఆదిపత్య సాహిత్య కారుల కుటిల చరిత్రను తిరగరాసే ప్రయత్నం చేయగల సత్తా ,  ఉన్నోడు కనుక సుందర్రాజు ను వెలివాడ లకు పరిమితం చేయాలనే కుట్ర. అలా అలాగా జనాలు తమ కాలి ధూళితో మలినం చేస్తున్నారు కాబట్టి , సుందర్రాజు, వేముల రోహిత్, సెంథిల్ కుమార్, పుల్యాల రాజు, కన్నయ్య, అనిర్భావ్  నుంచి ఉమర్ ఖాలిద్ దాకా ఇప్పుడు దేశద్రోహుల జాబితాల్లో  కలిసారు. ఇందులో కొందరు బ్రతుకు బారం అయి బలవన్మరణం పొందారు. మరికొందరు బ్రతుకు మీద ఆశతో ఏటికి ఎదురు ఈదుతూ జాతీయతకు కొత్త అర్దాలు కనిపెట్టే క్రమం లో కత్తుల వంతెన మీద నడుస్తున్నారు.

ఇక్కడ మనకు కావాల్సింది జాతి, జాతీయతా లాంటి క్లిష్టమయిన భావనల చర్చలోకి పోవడం కంటే ఎందుకు ఈ దేశం లో కొన్ని కులాలు మతాలే తమ జాతీయ శీల పరీక్షకు గురి కావాల్సి వస్తోంది అనేది తీవ్రంగా చర్చించాల్సిన తక్షణ అవసరం. జాతీయ ఉద్యమ స్పూర్తితో బ్రిటిష్ కు వ్యతిరేకంగా పనిచేసినోల్లని  ‘టెర్రరిస్టు, అని ముద్రేసుకున్న దశనుండి ప్రత్యామ్నాయ రాజకీయ విస్వాశాన్నికలిగి ఉన్నందుకు నక్షలైట్ గా అతివాదిగా ముద్రవేసిన దశ  మొదలు ఇరవై ముప్పై లలో ‘వందేమాతరం’ అన్నందుకు ఉస్మానియా నుండి పదుల సంఖ్యలో బహిష్కరణకు గురయిన రోజు నుండి, డెబ్బయ్యో దశకం లో విధ్యార్ది నాయకుడు జార్జ్ రెడ్డిని కాషాయదళం ధూల్ పేట కిరాయి హంతకులతో అమానవీయంగా చంపబడినప్పుడు, ఉస్మానియా ఇంజనీరింగ్ హాస్టల్లో అరుణ్ కుమార్ ని అత్యంత క్రూరంగా కోసి చంపడం వెనక జాతీయ శీల పరీక్షలో భిన్నాభిప్రాయం ఉండడం అనేది దాచేస్తే దాగని సత్యం. ఈ హత్యల వెనక ఈ దేశంలో నమ్మిన విస్వాశాలకు జరిగిన శిక్షలు. ఈ విదంగా  జాతీయభావనకు భిన్నమయిన రాజకీయ విశ్వాసాల ను క్రూరంగా చిదిమినప్పుడు, అరాచకంగా మారిన ఉస్మానియాను సంతోష్ రెడ్డి మొదలు , వివేక్ విద్యాసాగర్ శ్రుతి దాకా నాగేటి చాళ్ళలో  త్యాగాల విత్తనాలు చల్లి అమరులు అయిన పరంపరను అనేక పౌర ప్రజాస్వామిక వాదులు కొనసాగిస్తూనే ఉన్నారు. నాడు ఉస్మానియాలో అరాచకాలు మితిమీరి  ప్రజాస్వామ్యం కనుమరుగు అయినప్పుడు  ప్రజా ఉద్యమ వెలుగులో నాటి కాషాయ  విద్యార్ది నాయకుడు  చంద్రారెడ్డి చావు ఉస్మానియా లో దళిత బహుజన శ్రేణులకు  కాసింత గాలి పీల్చుకొనే వెసులుబాటు కలిగింది. ఆ తర్వాత మారిన పోరాటాల నేపధ్యం మూలంగా  ఇఫ్లూ, హైదరాబాద్ యూనివర్సిటీ,   జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ కేంద్రంగా పెల్లుభుకున్న నయా సాంస్కృతిక అస్తిత్వ భావనలు వాళ్లు లేవనెత్తిన అంశాలు ఇప్పుడు జాతీయ భావన చుట్టూ పరిబ్రమిస్తున్నాయి. అవి ఏ ఒక్కరోజో ఊడిపడ్డవి కావు. వాటివెనక ఎనభయ్యో దశకం లో పెల్లుభికిన  మండల్ కమిషన్ వెలుగులో , చుండూరు, కారం చేడు రగిల్చిన కసి తో వచ్చిన స్ఫూర్తి నేడు కేంద్రీయ విశ్వ విద్యాలయాలలో ఇప్పుడిప్పుడే పురి ఇప్పుకుంటోంది .ఒక ప్రజా స్వామిక ప్రాతినిధ్యం ఇప్పు డిపుడే మొగ్గలు తోడుకుంటోంది. దళిత బహుజన విద్యార్థుల సమన్వయం నేడు అగ్రవర్నాలను  గంగ వెర్రులెత్తే లా చేస్తున్నాయి . ఒక మెరుగయిన సమాజం కోసం ఒక ప్రజాస్వామిక స్ఫూర్తి కోసం ఆహార హింస కు వ్యతిరేకంగా ఉద్య మిస్తున్నారు, పురాణాల గుట్టును నిట్ట నిలువుగా ఛీల్చేస్తున్నారు.  ఆ చైతన్యాన్ని చిదిమేసే క్రమం లో మనువాదం స్వైర విహారం చేస్తోంది ఆ క్రమం లోనే నాటి సెంథిల్ కుమార్, మాదిరి వెంకటేష్ , ముదశిర్ ఖమ్రాన్ , మరియు మొహమద్ మొయిన్, రోహిత్ వేముల  దాకా అ సహజ  ఆత్మ హత్య గటనలు.

రెండేళ్ళ కింద అఫ్జజ్ గురు ఉరితీత సందర్భంగా ఈ దేశ సామూహిక భావాల సంతృప్తి కొరకు ఒక  ఉరి అవసరం అని ఒక చట్టబద్ద హత్యను సమర్దించుకుంది. అదే క్రమంలో ముంబై అల్లర్ల బాధ్యడు అని అభియోగం మోపబడిన  యాకుబ్ మెమన్ ఉరి శిక్ష వ్యతిరేకంగా  దేశవ్యాప్తంగా జరిగిన నిరసన లో రోహిత్ వేముల పాల్గొని దేశ ద్రోహి గా మారాడు.  అంతా రోహిత్ చావుకు కారణాల వెతుకులాటలో ఉన్నారు. కానీ  ఎదిగొచ్చిన కొడుకు అర్దాంతరంగా తన ప్రస్థానాన్ని అసంపూర్తిగా ముగిస్తే, అంతిమ సంస్కారలకీ, అయిన వాళ్ళ చుపుకూ నోచుకోకుండా వెలివాడ లో పుట్టిన రోహిత్ ని వెలివేసి   ఒక దిక్కులేని అనాధ శవం లాగా చాదర్ ఘాట్ మురికి కాలవలో కాల్చేసి, బూడిద పక్కేనే ఉన్న మూసీలో కలిపేసారు. కర్కశ పోలీసుల అమానవీయమైన ఈఘటన అందరినీ కలచివేసింది. రాజ్యం రోహిత్ చనిపోయాక ఆయన శవానికి బెదిరింది  ఎక్కడో గుంటూరు జిల్లా  గురజాల లో పుట్టిన రోహిత్ అసహజ మరణం చట్ట బద్ద హత్య వెలివాడ నుండి చాదర్ ఘాట్  మురికి కాలవలో అంతర్ధానం అయింది.

కానీ  ఆ చావు లేవనెత్తిన ప్రశ్నల కు జవాబులు ఇంకా బాకీనే. రోహిత్ హత్య  ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని , కోట్లాదిమంది బడుగు జీవుల ఉనికిని అపహాశ్యం చేసింది. అలా ఈ దేశం సహనం కోల్పోయిన ప్రతి సందర్భం లో భారతమాత సామూహిక సమర్ధనగా తన సహనాన్ని నిరూపించుకుంది.  నేడు దేశ భక్తులకూ, దేశాన్ని అమ్ముతున్న ద్రోహులకూ మధ్య యుద్ధం జరుగుతోంది. స్వదేశీ నినాదం తో గద్దెనెక్కిన మోడీ అరుదుగా ఈ దేశ నేల మీద ఉంటున్నాడు మిగతా కాలం అంతా గాలిమోటార్ల మీద తిరుగుతూ అపారమయిన ఖనిజ సంపద ను బడా దేశాల కు అమ్ముతూ, నమ్ముకున్న నేల చె రబడుతుంటే ప్రాణాలు ఫణంగా అడ్డుపెడుతున్న ఆదివాసుల మీద వైమానిక దాడులులకు పురిగోల్పుతున్న సంక్షుభిత సమయం లో ఒక నాస్తికుడు, ఒక ప్రజాస్వామిక వాది అయిన ఉమర్ ఖాలిద్ కోల్పోయిన తన ముస్లిం అస్తిత్వాన్ని మళ్ళీ కోరుకుంటున్నాడు. ఎందుకంటె తాను ముస్లింగా ఉంటూ కూడా నిజమయిన దేశభక్తున్ని కావాలి అనే ప్రయత్నం లో ఉండు పుట్టుక కారణంగా దేశద్రోహుల జాబితాలో కలుపుతున్న కారణాల వెతుకు లాటలో ఉండు. జోరుగా తెలంగాణా ఉద్యమం జరుగుతున్న కాలంలో  కలవని కనురెప్పల్లా ఉన్న రెండు సాంస్కృతిక ప్రేమలను  గ్లిసరిన్ కళ్ళతో ఒలికించిన తెలంగాణా మాత  ఇప్పుడు ఏం చదవాలో చదవకూడదో ప్రవచనాలు ఇస్తోంది.

నిట్టాడి లేని నిర్బాగ్యం నుండి కర్కషమయిన కాటిన్యం నుండి ఒక నిప్పు కణాన్ని కన్న రోహిత్ తల్లి ప్రత్యమ్నాయ జాతీయతను ఎన్నుకున్నది. రాజ్యం దృష్టిలో రోహిత్ తల్లి వేముల రాధిక  ఇప్పుడు  దేశ ద్రోహి.  అలా దేశద్రోహుల జాబితా లో గతం నుండే నమోదు అయిన అరుందతి రాయ్ మొదలు కంచ ఇలయ్య దాకా ఈ దేశ జాతీయ పరీక్షలో విఫలం అవడం మూలంగా దేశ ద్రోహుల జాబితాలో కల్పబడ్డారు. గోవింద్ పన్సారే మొదలు,నరేంద్ర ధబోల్కర్, కన్నడ సాహితీ వేత్త కల్బుర్గి గా ఈ నరహంతక వేటకొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కంచె ఐలయ్య మీద వేట మొదలయ్యింది.

ఉస్మానియా కేంద్రంగా సాగిన అన్ని సాంస్కృతిక పోరాటాల లోనూ కంచ ఐలయ్య వేసిన సైద్దాంతిక భూమిక ఉంది. అది ఎద్దుకూర పండగ కావచ్చు, నరకాశూర, రావణా శూర, మహిశాశూర అమరత్వాన్ని పొలిటి సైజ్ చేస్తూ దళిత బహుజన సాంస్కృతిక పోరాటం గా మార్చిన క్రమం కావొచ్చు, వీటి వెనక  ఐలయ్య  ఉన్నాడనే అక్కసుతో కుట్ర ఇప్పుడు మొదలయింది.  శాకాహారం జాతీయ వాదానికి వ్యతిరేకం అనీ, భారతమాత కేంద్రక ఆలోచనలకు భిన్నమయిన జాతీయభావనకు ఊపిరులు ఊదిన ఆయనను చంపేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి . భారత మాత సవితి బిడ్డలుగా బ్రతకడం కన్నా ‘భీం భూమికి జై’ అన్న నినాదం ఇచ్చినందుకు ఆయన ఇప్పుడు దేశద్రోహుల జాబితాలో కల్పబడ్డాడు. ఇలా ఉపేక్షిస్తే ఆ జాబితాలో మనం అందరం చేరే రోజు ఎంతోదూరంలోలేదు. ఫూలే-అంబేద్కర్ తాత్విక చింతనల వెలుగులో నూతన జాతి అస్తిత్వం పురుడు పోసుకోవడం నేరాల్లో కెల్లా నేరం.

విశాల ప్రజా, పౌర పోరాటాల నిర్మాణం ద్వారానే ఈ ప్రమాదం నుంచి బయటపడగలం. ఈ క్రమంలో నేను దేశద్రోహిని అని చెప్పడానికీ చింతించడం లేదు. ఒక వేల నిజంగా భారత మాత ఉన్నా ఆ భారతమాత ను  బర్బాదీ చేస్తున్న ద్రోహులెవరో తేల్చుకోవాల్సిన చారిత్రిక అవసరం ఇప్పుడు మనందరి మీదా ఉంది.

*

మీ మాటలు

  1. థాంక్స్ అఫ్సర్, ఈ వ్యాసం రోహిత్ చని పోయినప్పుడు రాసా. అన్ని ప్రధాన స్రవంతి పత్రికలకూ పంపా ఎవరూ
    దీని ప్రచురణకు ఒప్పుకోలేదు. కమ్యూనిస్ట్ , విప్లవ కారుల పత్రికలకూ ఇది దేశ ద్రోహి రాసిన వ్యాసం లాగానే కనబడింది. ఒక టి అర్ధం అయింది ఏది రాయాలో ఏది ప్రచురణకు నోచుకోవాలో అలానే నువ్వు రాయాలి.ఇంకోలా రాస్తే ఎంత మీకు కబాలికి పట్టిన గతే పట్టుద్ది .

  2. Sashanka says:

    కన్నయ్య జైలు నుండి విడుదల అయ్యాక అయన స్వరం లో మార్పు ఎవరూ పసిగట్ట లేకపోయారు. ఈ దేశంలో అసమ అభివృద్ధికీ , అసమానతలకీ కారణ భూతులు అయిన రాబందుల నుండి ఆజాది కావాలి అని అనడం వెనక ఈ దేశం లో జరుగుతున్న విముక్తి పోరాటాలను నిర్వీర్యం చేయడమే. గణేశ పందిళ్ళ నుండి పురుడు పోసుకున్న అఖండ భారతానికీ కన్నయ్య కలగంటున్న ఆజాదీ కి నాకయితే తేడా ఏమీ కనిపించడం లేదు. ఈ చర్చను జాతీయ చర్చలో ఇరికించేందుకు జరుగుతున్న కుట్ర అర్ధం జేసుకోవాలి.
    ——–
    రోహిత్ మరణం వేడి చల్లారటం వెనుక కన్నయ్య కుట్ర. ఆరెస్సెస్ కీ కన్నయ్యకీ తేడా లేదు. ఇలాంటి లోతయిన విశ్లేషణ మరింత కొనసాగించండి.

    -శశాంక

  3. jilukara says:

    దేశద్రోహి గుర్రం సీతారాములు.. చాల బాగుంది. జాతి భావన మీద కమ్యూనిస్టులు, మావోయిస్టులు అభిప్రాయాలు మార్చుకున్నారా? కుల వ్యతిరేక పోరాటాలను జాతి వ్యతిరేక పొరాటాలని అనుకోలేదా? వర్గ విచ్చిన్నవాదాలుగా ముద్రవేసి అంబెడ్కర్ ను శివసాగర్ ను అవమానించలేదా? వర్గం అంటే వాళ్ళ దృష్టిలో భారత జాతి అనే కదా? దేశభక్తి విషయంలో కమ్యూనిస్టులకు, కాషాయవాదులకు పెద్ద తేడా కనిపించదు కదా? కులం ఉన్నత వరకు ఈ దేశంలో జాతి నిర్మాణం కాదని, కులం పునాదుల మీద ఒక జాతిని, నీతిని నిర్మించ లేరని గాంధీ కి సమాధానం చెప్తే, మీ అంబెడ్కర్ కుల సంఘాలు వద్దన్నాడని కమ్యూనిస్ట్ పార్టీలు వాదించారు కదా. మావోయిస్టు పార్టీ కూడా అదే మాట్లిడింది కదా.. మావోయిజాన్ని, అంబేద్కరిజాన్ని కలిపి రాతలు రాసే మేధావులు కూడా నిజాలు చెప్పటం లేదు. అప్పుడప్పుడు ఈ దేశద్రోహి రాస్తుంటాడునుకోండి. ఐలయ్య కు మద్దతు పలికినందుకు ధన్యవాదాలు. కానీ, ఇప్పటివరకు మావోయిస్టు పార్టీ అధికారికంగా ఐలయ్యకు మద్దతు పలకలేదు. ఇదేమి జాతీయవాదమో తేలాలి.

మీ మాటలు

*