ఆఖరి మెట్టుపైనుండి..

 

 

 

                                                         రామా చంద్రమౌళి

 

 

ఇక్కడనుండి చూడు.. ఈ ఆఖరి మెట్టుపైనుండి

ముషాయిరా.. రాత్రిని కాల్చేస్తూ కాల్చేస్తూ

ఎలుగెత్తిన స్వరాలను మోసుకుంటూ గాలిలో .. ఒక దుఃఖజీర

ప్రక్కనే నిరంతరమై ప్రవహిస్తూ.. నది.. నిశ్శబ్దంగా –

ఔనూ.. శరీరంలోని ప్రాణం శబ్దిస్తుందా

పాదాలు ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పుడు

అందుకోవాలని అలలు పడే యాతన.. ఒక వియోగ జీవక్షోభ

గజల్ గాయని  ఒక్కో వాక్యకణికను

యజ్ఞం లోకి సమిధగా అర్పిస్తున్నపుడు

అక్షరాలు.. అగ్నిబిందువులై తేలి వస్తూంటాయి గాలిలో

సముద్ర జలాలపై లార్క్ పక్షుల్లా –

భూమిలో విత్తనమైనా, పిడికిట్లో నిప్పైనా

ఎన్నాళ్ళు దాగుంటుంది

మొలకెత్తడం.. దహించడం అనివార్యం కదా –

 

అర్థరాత్రి  దాటుతూంటుంది.. అంతా మత్తు.. స్వరమధురిమ మైకం

వజ్రాల హారాలేవో తెగిపోతున్నట్టు

దీపజ్వాలలేవో తీయగా కాలుస్తూ నిశ్శేషపరుస్తున్నట్టు

శరీరం ఉంటుంది

కాని ఉన్మత్తచిత్తయైన ఆత్మ ఉండదు

అడవివంటి అంతరంగం నిండా వందలవేల పక్షుల కలకలం

ఒక మనిషి  సున్నా ఔతుండగా..  మరొకరు ఒక ఒకటౌతారు

సున్నా ప్రక్కన ఒకటి.. ఒకటి ప్రక్కన సున్నా

విలువలు విలోమానులోమాలై

వడ్రంగి పిట్టొకటి తాటిచెట్టును ముక్కుతో పొడుస్తున్న చప్పుడు

పెక్ పెక్ పెక్

తొర్ర ఎక్కడేర్పడ్తోందో తెలియదు

 

రాత్రి ముషాయిరాకు వస్తున్నపుడు

సందు మలుపు చీకటి నీడలో

వీధికుక్క అతనిలోని మరకను పసిగట్టి

మొరిగిన చప్పుడు .. ఫడేళ్మని తెగిన ఫిడేల్ తీగ

పశ్చాత్తాపం ఎప్పుడూ భళ్ళున పగిలిన పింగాణీ పాత్రే

ముక్కలెప్పుడూ తిరిగి అతకవు

కరిగించాలి.. అతకనివాటిని కరిగించాలి

విరుగుట.. పగులుట.. అతుకుట

జీవితమంతా ఆత్మరక్షణే-

ఆరిన దీపం చుట్టూ.. రెండు చేతుల దడి

చివరికి ముందర ఒక ఖాళీ పాత్ర

నిండడంకోసం ఎదురుచూపు

మాసిన గోడలపై .. ఉమ్మేసిన పాన్ మరకలు

ఎక్కడిదో గాలిలో తేలివస్తూ

నిన్నటి ముషాయిరాలో పాడిన ఎంగిలిపాట ఖండిత వాక్యం

కానీళ్ళోడ్తూ-

ఇంకా తెల్లవారక ముందే

నది ఒడ్డుపై ఎవరో.. జలహారతిస్తున్నారు

రెండు చేతుల్లో ఇత్తడి పళ్ళెం ధగధగా మెరుస్తూ .. ఎర్రగా మంట

ఆకాశం తగలబడి పోతోంది –

 

*

 

 

 

 

Sent to Sri Afsar SARANGA

Dt: 12-04-2016

 

మీ మాటలు

  1. K.WILSON RAO says:

    రామా చంద్రమౌళి గారంటే నా అభిమాన కవి . అంతే కాదు వారి రచనలు ** అంతర , అంతర్దహనం, స్మృతిధార , ఎటు ** చదివాను. గొప్ప అనుభూతి పొందాను. వారి కవిత్వమన్నా, వారన్నా నాకు ఎంతో అభిమానం . మంచి కవిత్వం రాయడమే కాకుండా మంచి వ్యక్తిత్వమున్న మనిషి. వారి కవిత్వం గురించి ఇంతకన్నా ఏమి చెప్పగలను
    ” పశ్చాత్తాపం ఎప్పుడూ భళ్ళున పగిలిన పింగాణీ పాత్రే
    ముక్కలెప్పుడూ తిరిగి అతకవు
    కరిగించాలి.. అతకనివాటిని కరిగించాలి”… ఈ ఒక్క వాక్యం చాలదా కవిని పట్టుకోవడానికి.

    • raamaa chandramouli says:

      విల్సన్ రావు గారూ,
      ధన్యవాదాలు.మియు అభిమానం నన్ను ముగ్ధుణ్ణి చేసింది.

      – మౌళి

  2. sayyad sabir hussain says:

    ముక్కలెప్పుడూ తిరిగి athakavu. కరిగించాలి… అతకని వాటిని కరిగించాలి.. ఆఖరి మెట్టు కవిత సూపర్. కవి రామా చంద్రమౌళి గారికి అభినందనలు. kankrit రోజుల్లో కూడా సుతిమెత్త్తని సున్నుండలాంటి కవితలు చదివిస్తున్న సారంగకు కూడా

మీ మాటలు

*