కబాలి గురించి ఎందుకు మాట్లాడాలంటే….

 myspace
    ఇప్పుడే ఓ మిత్రుడు ఫోన్ చేసేడు, “కమర్షియల్” సినిమా గురించి నువ్వు రాయడాన్ని (నా బ్లాగ్ పోస్టు చూసి) ఎవరో తప్పు పట్టేరని చెప్పేడు.
  నేను చెప్పేను, నా ఫ్రెండ్ కి, కబాలి గురించి ఎందుకు రాసేనో. సినిమా చూసివచ్చిన వెంటనే నా అభిప్రాయం చెప్పాలనిపించి అక్కడ కొంచెమే రాసేను. ఇంకొంచెం వివరంగా ఇక్కడ.
  దాదాపు పదేళ్ళ క్రితం నేను మలేసియా వెళ్ళేను, ఆఫీసు పనిమీద. కౌలాలంపూర్, పెనాంగ్ ప్రాంతాల్లో తిరిగేను వార్తల కోసం. మిత్రులతో కలిసి ఈ రెండు ప్రాంతాల్లోని తమిళులను కూడా కలిసేను. హోటళ్లలో, చిన్న చిన్న షాపుల్లో, కొన్ని బస్తీల్లో వున్న ఇండియన్లతో (అంటే, ప్రధానంగా తమిళులతో) మాట్లాడేను.
   మొట్టమొదటి సారిగా కబాలీశ్వరన్ గురించి నేను విన్నది అప్పుడే. అక్కడ వున్న తమిళులకు ఆయన ఒక ఫోక్ హీరో అని అర్ధం అయింది. వందల ఏళ్ల క్రితం అక్కడికి వెళ్లి సెటిలై, ఆ దేశవాసులైన తమిళులకు ఆయన ఓ ముఖ్యమైన నాయకుడు. అంతకంటే ఆ తర్వాత ఆయన గురించి విన్నాలేదు. ఆయన రాజకీయాలు, నడిపిన మాఫియాల గురించి తెలీదు. తెలుసుకోవాలని ప్రయ్నత్నించిందీ లేదు.
   అప్పటికే కమర్షియల్ హీరోగా పేరు సంపాదించిన రజనీకాంత్ సినిమా ‘శివాజీ’ కూడా అప్పుడే రిలీజ్ అయింది. ఆ సినిమా చూడడం కోసం అక్కడ బారులుతీరిన జనాన్ని చూసి నాకు ఆశ్చర్యం కలిగింది.   ఆయన ప్రధానంగా, తమిళనాడు నుంచి ఉద్యోగాలకోసం, చిరుద్యోగాలకోసం 1947 తర్వాత వలస వెళ్లిన వాళ్లకు (సినీ) హీరో.
   రజనీకాంత్ కబాలీశ్వరన్ పాత్ర చేస్తున్నాడంటే నాకు అందుకే పెద్ద ఆశ్చర్యం కలగలేదు. కబాలీశ్వరన్, రజనీకాంత్ — ఇద్దరూ అక్కడ పాపులరే.  రెండు పాపులర్ ఇమేజెస్ కలిస్తే హిట్టవుతుందనేది నిర్మాతల లెక్క.
  రజనీకాంత్ కి కబాలి మార్కెట్ విలువ తెలుసు. అటు డయాస్పోరా మార్కెట్, ఇటు దేశంలో అసలు మార్కెట్. దళితుడైన పా. రంజిత్ కు రజనీకాంత్ లాటి కమర్షియల్ హీరో, దేశం కాని దేశంలో అణచివేతకు గురైన తమిళులవైపు నిలుచున్న కబాలి పాత్ర వేస్తే విషయం నలుగురికీ చెప్పవచ్చుకున్నాడు.
  కబాలి గురించి రంజిత్ పరిశోధన బాగా చేసేడు. ఇది నేను చెప్పిన మాట కాదు. కబాలి సినిమా గురించి మలేసియా తమిళుల వైపునుంచి ‘కౌలాలంపూర్ పోస్ట్ లో విశ్లేషించిన విసిత్ర మాణికం రాసేరు. కబాలి సినిమా గురించి మనకి ఎందుకు అని అనేవాళ్ళందరూ తప్పక చదవాల్సిన వ్యాసమిది.
సినిమా చూసేముందు — ముఖ్యంగా మలేసియాకి బయట వున్నవాళ్లు — చదివితీరాలని ఆమె అంటుంది. ఈవ్యాసం చదవక ముందొక సారి (తెలుగు వెర్షన్), చదివిన తర్వాత ఒకసారి (తమిళ వెర్షన్) చూసిన కొలీగ్ చెప్తోంది — ఎంతగా కెనెక్ట్ అయిందో.
  కబాలి పాత్రని అడ్డం పెట్టుకుని పా. రంజిత్ ఎంత గొప్పగా మలేసియా తమిళుల (ముఖ్యంగా మలేసియా దేశ వాసులైపోయిన తమిళుల) జీవితాన్ని చిత్రీకరించాడో ఆమె చెప్తుంది. ఉద్యోగాల్లో, సమాజంలో మైనారిటీలైన తమిళులు అనుభవించిన, అనుభవిస్తున్న వివక్షని దర్శకుడు గొప్పగా పెట్టుకున్నాడని చెప్తుంది.
 ఓ వంద, రెండొందల సంవత్సరాల తమిళుల వ్యథాభరిత జీవితంలోని కొన్ని భాగాల్ని తీసుకుని కథ రాసుకున్నాడని ఆమె అంటుంది. సరిగ్గా ఇంతే కాలంలో దళితులు అనుభవించిన అవమానాలపై, దాష్టీకాలపై సత్యనారాయణ గారు రాసిన ‘మా నాన్న బాలయ్య’ పుస్తకంతో రంజిత్ అందుకే కనెక్ట్ అయ్యాడు.
     ఆఖరికి, సినిమా ముగిసేక కబాలీని కాల్చడానికి వఛ్చిన ‘టైగర్’ కూడా ఎంత రియలిస్టిక్ పాత్రో ఆమె రాస్తుంది.
   మలేసియా జనాభాలో ఏడు శాతం మాత్రం వున్న, అట్టడుగున వున్న ప్రజల (పెద్ద ఉద్యోగాలు, వ్యాపారాల కోసం వచ్చేవాళ్లు కాదు) గురించిన కథ ఇది. స్కోప్ చిన్నదే కావచ్చు. కానీ, ఇది మెయిన్ స్ట్రీమ్ సినిమా కథా వస్తువు కావడం, కథకు ప్రొటాగనిస్ట్ రజనీకాంత్ కావడం విశేషం.
  రజనీకాంత్ సినిమా ఇలా ఎందుకుంది, దీనికన్నా బ్రహ్మోత్సవం బెటర్ అని, బోయపాటి శ్రీను, వినాయక్  లాటి వాళ్ళు రజనీకాంత్ కి ఓ గొప్పహిట్ ఇచ్చి ఉండేవారని రాసేవాళ్ళు తప్పక చదవాల్సిన వ్యాసమిది. (బోయపాటి, వినాయక్ ఎలా తీసి వుండేవాళ్ళు? కబాలీలో ‘కెవ్వుకేక’ లాటి పాట పెట్టివుండేవాళ్ళు. ఓ అరవై సుమోల్ని ఎగిరించి పేలించి వుండేవాళ్ళు.)
 పా. రంజిత్ కాని, రజనీకాంత్ కాని — They are limited by the character. ఈ సంగతి అర్ధం చేసుకోకపోతే ఈ సినిమా ఓ ‘రోబో’ లాగో, ‘శివాజీ’లాగో, లేకపోతే ‘బాషా’లాటి ఓ గాంగ్ స్టర్ సినిమాలా లేదని అనిపిస్తుంది.
  ఆ మూసలోకి వెళ్లకుండా పా. రంజిత్ ఎంత కష్టపడ్డాడో సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. సూపర్ మేన్, బేట్  మేన్, స్పైడర్ మేన్, టార్జాన్ – అన్ని సూపర్ హీరోల కంటే ఎక్కువ శక్తివంతుడైన రజనీకాంత్ కాదు ఈ సినిమాలో వున్నది. ఈ సినిమాలో రజనీకాంత్ పాత్ర అంతకంటే ఎక్కువ నిడివివున్న, లోతువున్న రక్తమాంసాలతో ప్రజలమధ్య తిరిగిన ఓ నాయకుడు, ఓ డాన్. అందుకే, రజనీ గిమ్మిక్కులకు ఈ సినిమాలో చోటులేదు. ఆ సంగతి రంజిత్ ముందుగానే చెప్పేడు.
  పా. రంజిత్ ట్విట్టర్ id @beemji . ఇది సరిపోతుంది, ఆయన కబాలి పాత్రని ఎలా చూపించదలుచుకున్నాడో. అందుకే, ‘కబాలి’ మా నాన్న బాలయ్య’ పుస్తకం పట్టుకుంటాడు. నల్ల రంగు మీద వున్న వివక్షగురించి మాట్లాడగలుగుతాడు.సూటు, బూటు ఎందుకువేసుకోవాలో మాట్లాడతాడు. వ్యవస్థీకృతమైన హింసని, అందులో భాగమై, అలాటి పరికరాలతోనే ఎదిరించాలనుకున్నాడు కబాలి. ఇది సరైన పరిష్కారం కాదని, ఈ పోరాటాలకి శాస్త్రీయమైన రాజకీయ దృక్పథం తోడవకపోతే అవి నిలవవన్నది వేరే చర్చ. కానీ, ఈ సినిమా కథ ప్రధానంగా కబాలి జీవితంనుంచి తీసుకున్నది. అది దాని పరిమితి.
  ఈ నేపథ్యంతో చూడకకుండా, బాషాలాగా, సుల్తాన్ లాగా, లేకపోతే ఇంకో బ్లాక్ బస్టర్ సినిమాలాగా, లేకపోతే వాటికి మించిన సినిమాలాగా ఉంటుందని ఊహించుకుని, అలా లేదని సినిమాని write off చెయ్యడం ఏం న్యాయం.
  సినిమాలో ‘మాయానది’ పాట, దాన్ని చిత్రీకరించిన విధానం గొప్పగా వుంది. రాధికా ఆప్టే హుందా నటన చాలా బాగుంది.
   అందరికీ సినిమా నచ్చాలనేం లేదు. ఇంకా బాగా తీసివుండొచ్చని కూడా అనొచ్చు.  కానీ, బయో పిక్ లను చూసే విధానం ఇది కాదేమో?
(కబాలి సినిమా చూసొచ్చేక రాసిన చిన్న బ్లాగ్ పీస్: http://kv-kurmanath.blogspot.in/2016/07/blog-post.html)
*

మీ మాటలు

  1. sailajamithra says:

    ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా కమల్ హాసన్ గారిది

  2. కె.కె. రామయ్య says:

    దేశం కాని దేశంలో (మలేసియాలో) అణచివేతకు గురైన, అట్టడుగున వున్న తమిళ ప్రజలమధ్య తిరిగిన ఓ నాయకుడు, వివక్షతని, వ్యవస్థీకృతమైన హింసని ఎదిరించిన ఓ డాన్ కబాలి … కబాలీశ్వరన్ పాత్రలో రజనీకాంత్ … అతని చేతిలో “మా నాన్న బాలయ్య” పుస్తకం … దర్శకుడు పా. రంజిత్ ను అబినందించటానికైనా ఈ సినిమా చూడాలి. కూర్మనాథ్ గారికి ధన్యవాదాలు.

    తెలంగాణా గ్రామీణ జీవితాల్లో పొరలు పొరలుగా ఎదురయ్యే పేదరికం, సామాజిక వెలి, అంటరానితనం, శ్రమ దోపిడీ, కష్టాల కడగండ్ల వంటి వాటన్నింటిపై ఓ దళిత కుటుంబం సాగించిన యుద్ధాన్ని కళ్లకు కట్టినట్టు రాసిన “మా నాయన బాలయ్య” పుస్తకం ( ఆంగ్లమూలం: వై. బి. సత్యనారాయణ, తెలుగు అనువాదం: పి. సత్యవతి ) కినిగె లో ఇక్కడ దొరుకుతుంది : http://kinige.com/book/maa+naayana+balaiah

  3. THIRUPALU says:

    ఇంప్రెషనిజానికి గురై చాలా అపార్థం చేసుకున్న , జనం గురించి జనరంజక మైన కబాలి సినిమా అని తెలిసి చాలా సంతోషపడుతున్నాము. మాట్లాడ దగిన సినిమా! నిజమే!

  4. Aranya Krishna says:

    కబాలిని చాలామంది గ్లోరిఫై చేశారని అనిపించింది. మొదటి సగంలో కొన్ని హ్రద్యమైన సన్నివేశాలు మినహా సినిమాకి అసలు ఆత్మ లేదు. సినిమా కమర్షియల్గా తీసినందుకు అభ్యంతరం లేదు. కానీ అసలు విషయం కుడా ఏమీ లేదు. వివక్షకు వ్యతిరేక పోరాటాన్ని గాన్ స్టార్ల కార్యకలాపాలకు మార్చిన దర్శకుడి విఙ్ఞతనేమని ప్రసంసించాలి? రజనీ పరిచయ సన్నివేశంలో చూపించిన ఓ పుస్తకం, చివర్లో అణగారివర్గాలకు చెందిన వారి వేషభాషలకు సంబంధించిన రజనీ పరోక్ష డైలాగుల ప్రస్తావన తప్పితే సినిమాలో దళిత చైతన్యం నేతి బీరకాయలో నెయ్యి చందమే. రెండో భాగమైతే అగమ్యం! ఒక మంచి పాయింట్ వున్న కథని చేతులారా పాడుచేశాడు దర్శకుడు. సినిమాకి అదనపు కలెక్షన్స్ కోసం ఒక ఆఫ్టర్ థాట్ గా దళిత్ యాంగిల్ని తెర మీదకి తెచ్చారేమో అనిపిస్తున్నది. సినిమాలో అయితే అది శూన్యం. ఇంతకంటే గొప్పగా కమల్ సినిమా నాయకుడు వచ్చింది. అందులో మార్జినలైజ్డ్ సెక్షన్స్ మీద అమలయ్యే ప్రభుత్వ, ప్రైవేట్ హింసా రూపాలు, వాటిని నాయకుడు ధిక్కరించి, ఎదురుకునే తీరు, ఆ ప్రాసెస్లో భాగంగా అనివార్య ప్రతిహింస, నేరం బాగా చూపించారు.

  5. sayyad sabir hussain says:

    మన తెలుగోళ్లు సినిమా చూసే విధానం కేవలం టైంపాస్ .నిజంగా వీళ్లకు టేస్ట్ లేదనిచెప్పవచ్చు. ఒక హీరో , అతడి పక్కన ఇద్దరు హీరోయిన్లు. హీరో ఒక్కడే పాతిక మందిని కొడుతుంటాడు. హెరాయిన్ శరీర ప్రదర్శన చేస్తుంటుంది. ఇలా సినిమా చూడటం అలవాటై పోయిందనుకుంటా. అందుకే దళితుల మీద ఇప్పటిదాకా సరైన సినిమా రాలేదు. mahilalu ఎదుర్కొంటున్న వివక్ష మీద కూడా చెప్పుకోదగ్గ చిత్రం రాలేదు. ఇక ముస్లింల జీవితాలను స్పృశించిన సినిమా లేక పోగా వారిని vugravaduluga choopinchi పబ్బం గడుపుకునే సినిమాలు chaalaa వచ్చాయి. ఇలాంటి moosa ప్రేక్షకులకు కబాలి అర్ధం kaakapovadamlo vinthemiledu.

  6. rani siva sankara sarma says:

    ఫార్ములా కథ అనేది యిటు ఉద్యమకారులకు అవసరం. వ్యాపారానికీ అవసరం. ఒక హీరో లేక నాయకుడు శత్రువుని ఖతం చేసి సమాజాన్ని ఉద్ధరించడం అనేది వ్యాపారాత్మకము విప్లవాత్మకమున్నూ. మధ్యలో పేదవాళ్ళో దళితుల గురించో కొన్ని డైలాగులు. సమస్య ఒక వర్గానికి కులానికి ప్రత్యేకమైనదిగా కనబడకూడదు . పరిష్కారము మూసలోనిదై ఉండాలి. డ్రగ్సు మాఫియా, హీరో గన్ను పట్టుకొని వీరోచితంగా నిర్ములించడం.
    నిజంగా వర్తమాన దళిత కథ వేరేగా ఉంటుంది. ఆవుమాంసం తిన్నారని హింసిస్తే, చచ్చిన గొ డ్లని రహదారిలో పడెయ్యడం. యిది ఫార్ములాగా మారగలదా ?

Leave a Reply to కె.కె. రామయ్య Cancel reply

*