మేముకోరుకుంటున్నకళింగం!

 

 

చికాగో ఆటా సభలో… ఉత్తరాంధ్ర కధా ప్రయాణం పై  అట్టాడ  అప్పల్నాయుడు  ప్రసంగానికి ఇది వ్యాసరూపం    

*

         అందరికీ నా నమస్కారాలు. ఇవ్వాళ నాకెంతో ఉద్వేగంగా ఉంది.శ్రీకాకుళానికీ చికాగోకీ రాజకీయ నెత్తుటి సంబంధముంది. ఆ నెత్తుటి సంబంధమే నన్ను ఆటా సభలో పాల్గొనేట్టు చేసిందనుకుంటాను.నాకిచ్కిన సమయమ్ లో సాధ్యమయినంత మేరకు వందేళ్ళ పై బడ్డ ఉత్తరాంధ్రా కధను సంక్షిప్తంగా మీ ముందుంచుతాను.

దిక్కుపేరుతో పిలువబడే ఒక దిక్కుమాలిన ప్రాంతం…ఉత్తరాంధ్ర. కళింగాంధ్ర అనే చారిత్రాత్మక పేరు చెరిగిపోయింది. గోదావరి నుంచి మహానది దాకా కళింగాంధ్ర అంటారు. ఇవ్వాళ ఆ సరిహద్దులు కుదించుకోవాలి. మాకు గూడా ఇపుడా కళింగం   మేముకోరుకుంటున్నకళింగం.  అదేఉత్తరాంధ్ర.

ఆధునిక తొలి తెలుగుకధ !దిధ్దుబాటు’ అనంటే ఇవ్వాళ అందరూ అంగీకరించకపోవచ్చుగానీ,కళింగాంధ్ర తొలి ఆధునిక కధ మాత్రం దిధ్దుబాటు అని చెప్పే హక్కు మాకుంది. కళింగ సమాజం ప్రయాణించిన మేర కళింగ కధ కూడా ప్రయాణించింది. సంస్కరణవాదం,జాతీయోద్యమం,అభ్యుదయోద్యమం,విప్లవోద్యమం…తర్వాతి ప్రపంచీకరణ,విధ్వంశ వ్యతిరేక ప్రజాఉద్యమాల వెంట కళింగకధ నడచింది. తొలి ఆధునిక కధ వచ్చిన 1910 నాటికి కళింగాంధ్ర…జమీందారీ,ఈనాందారీ పాలనతో పాటు ఆంగ్లేయుల పెత్తనంతో ముప్పేట పాలనలో వుండేది. దాదాపు 37 చిన్నా,పెద్దా జమీందారీలు,మరికొన్ని ఈనామ్ దారీలు. ఫ్యూడల్ భావజాలం ..నిండివుంది. అగ్రవర్ణ, ఉత్పత్తేతర కులాల వారికి మాత్రమే విద్యా,ఉపాధి అవకాశాలు.

ఆంగ్లేయుల పాలన రెండు రకాల ప్రభావాలను వేసింది. వారి ఆధునిక శాస్త్రీయ భావజాలమూ,ప్రజాస్వామిక ధోరణులూ…విద్యా,ఉపాధి అవకాశాలు పొందిన ఉత్పత్తేతర కులాలపై…సంస్కరణవాద ప్రభావాన్ని వేస్తే: ముప్పేట పాలనలో కష్హ్టఫలం నష్టపోయిన ఉత్పత్తికులాల పై తమ ఉపాధికోసం సమరబాట పట్టాల్సిన స్తితి కలిగించింది. అడవిమీద హక్కు కోల్పోయిన ఆదివాసీలు సమరం చేస్తే పితూరీలన్నారు వాటిని ఆంగ్లేయులు. జమీందారీ రైతులు ఇచ్చాపురం నుండి చెన్నపురి దాకా రైతు రక్షణయాత్ర చేసారు. గ్రామీణవ్రుత్తుల వారు విధ్వంసానికి గురయ్యారు. కళింగనేల బొమ్మా,బొరుసూ స్తితి ఇది.

ఈ స్తితిలో సమాజం లోని ఫ్యూడల్ భావజాలం లోని చెడుని  వ్యతిరేకించే, ముఖ్యంగా మత మౌడ్యాన్ని,అవిద్యను,స్త్రీ పట్లవివక్షను,  బాల్యవివాహాలను  వ్యతిరేకిస్తూ సమాజాన్ని భావజాల రంగం లో సంస్కరించే సాహిత్యం 1910 నుంచీ దాదాపు 1945 దాకా వచ్చింది.గురజాడ రాసిన దిద్దుబాటు,మెటిల్డా,పెద్దమసీదు,దేవుళ్ళారా మీ పేరేమిటి…సంస్కర్తహ్రుదయం కధల్లో పైన చెప్పిన సంస్కరణవాద భావజాలమే కన్పిస్తుంది. ఆ తర్వాతి తరం రచయితలు…పూడిపెద్ది వెంకటరమణయ్య,వలివేటి బాలక్రిష్ణ్,స్తానాపతి రుక్మిణమ్మ,పిల్లలమర్రి వేదవతి,విశ్వనాధ కవిరాజు,కాలూరి నరశింగరావు,మండపాక పార్వతీశ్వరశర్మ మొదలయినవారు కూడా గురజాడ బాటలోనే,కధలు రాసారు.

నీలాటిరేవు,అమ్మోరుదేవత,క్షవరకల్యాణం,యుక్తిమాల ,దయ్యాలు వంటి శీర్షికల్తో కధలు రాసారు. స్తానాపతి రుక్మిణమ్మ…ఆనాటి నీలాటిరేవు ఆడవారికి ఒక సమావేశ స్తలంగా అనేక విశయాలు కలబోసుకునే ప్రదేశంగా యెలా ఉపయోగపడేదో కధలు రాసారు. అలాగే దయ్యాల గురించీ. ఆనాడు దయ్యం పడని ఆడది లేదని కందుకూరి గారు వ్యాఖ్యానించారంటే దయ్యాల ప్రభావం యెంతటిదో తెలుస్తుంది. ఇక,పూడిపెద్ది వారయితే ప్రజల నానుడిలోని అనేక సామెతలను కధలు చేసారు…కాకర పువ్వు వచ్చి కాళ్ళమీద పడితే,నొచ్చిందా అనడగడు,ఈ ముండ సంసారం నేను చెయ్యలేనమ్మాఅన్న సామెతతో ఒక కధ, ఓపిక ఉందని ఇద్దర్నిపెళ్ళాడితే,ఒకామె తెల్లవెంట్రుకలనూ,  మరొకామె నల్లవెంట్రుకలనూ పీకిందట…సామెత కధ. వీరు పూలగుత్తి అనే పత్రికను కూడా కధల కోసం నడిపేరు.

మొత్తానికి గురజాడ గారన్నట్టు…మంచీ,చెడుల విచక్షణ,మంచివేపు మార్చే సంస్కరణ వాదమూ ఈ తరం కధల్లో చూస్తాం.వీరిలో మరి కాస్తా ముందుకు చూసినవారు…శెట్టి ఈశ్వరరావు,పండిత అ.న.శర్మ. ఈశ్వరరావు గారి హిందూ,ముస్లిం:తిండిదొంగ కధలు,అ.న.శర్మగారి..వారసత్వం కధ కేవలం ఆదర్శవాద దృష్టి గాక,నిజ జీవితాన్ని చిత్రించి చూపాయి.

ఇక జాతీయోద్యమాన్ని చిత్రించిన కధలకు వస్తే…ఇక్కడినుండి తక్కువ కధలే వచ్చాయి. బహుశా అప్పటి రచయితలు సంస్కరణవాద భావజాల ప్రభావితులేమో. కందుకూరి ప్రభావితం చేసినంతగా అల్లూరి ప్రభావితం చేయలేదేమో. ప్రజాపోరాటాలపట్లగానీ,జాతీయోద్యమం పట్లగానీ…సంశయాలే యెక్కువేమో అన్పిస్తుంది,కాంగ్రెస్ సభ ల మీద గురజాడ వ్యంగ్య రచన…మనకు ఈ అనుమానాన్ని కలిగిస్తుంది. అయితే…జాతీయోద్యమ సందర్భాన్ని కధనం చేసిన రెండు కధలు చెప్పుకోవచ్చు…ఒకటి..బంకుపల్లి రామజోగశాస్త్రి గారి విమలాదేవి కధ,మరొకటి…గోవిందరాజు రామశాస్త్రి గారి నీళిజోళ్ళమరమ్మత్తు కధ.జాతీయోద్యమం లో పాల్గోనందుకు భర్తను వ్యతిరేకించి,భర్తను వదిలేసి ఉద్యమం లోకి నడచిన ఓ స్త్రీ కధ విమలాదేవి కధ. పాత సాంప్రదాయాలే కాదు,పాత పాలనలే కాదు దేశం మరమ్మత్తు చేయబడాలని తెలిపే కధ నీళిజోళ్ళ మరమ్మత్తు కధ.

ఇక స్వాతంత్ర్యం రావడం,మనల్ని మనం పాలించుకోవడం…ప్రజల జీవితంలో యెటువంటి మార్పు లేకపోవడం…మన స్వాతంత్ర్యం ఒక మేడిపండు,మన దారిద్ర్యం ఒక రాచపుండు అన్న స్తితిని గమనించిన రచయితలు…పాలనను విమర్శించడం,ప్రజల బాధలను వివరించడమ్…కధనం చేసారు. బొమ్మిరెడ్డిపల్లి సూర్యారావు,అవసరాల సూర్యారావు,మసూనా,భరాగో,బలివాడ కాంతారావు తదితరులు…చీకటిరోజులు,ఒడ్డుదాటినవాడు,పడగనీడ,పూర్ క్రీచర్స్,గమనశ్రమ వగయిరా శీర్షికల కధలు రాసేరు. వీరిలో అవసరాల వారి సమ్మె కధ అప్పట్లోనే  కాంగ్రేస్ పై ఇప్పటికి సరిపోయే వ్యాఖ్య చేస్తుంది. వీధులు తుడిచేవారు సమ్మె చేస్తుంటే,ఆ సమస్య పట్టించుకోకుండా…వీధులు దుమ్ముపట్టినాయని కాంగ్రేస్ వాలంటీర్లు…చీపుర్లు పట్టి వీధులు ఊడ్వడం చేస్తారు…దాన్ని వ్యాఖ్యానిస్తూ…కాంగ్రెస్ తన గత కీర్తిని తానే ఊడ్చి వేస్తోందంటాడు  రచయిత.

ఈ దశల కధలను రావిశాస్త్రి అయ్యో,అయ్యో కధలన్నారు. నిజానికి ఆయనకూడా ఆరు సారో కధలు రాసారు. గానీ త్వరలోనే మారని పాలన రీతుల వెనుక గల రాజ్య స్వభావాన్ని గుర్తించారు.బహుశా అప్పటికే వామపక్ష భావజాలం కళింగాన చోటుచేసుకోవడంతో…చాసో,రావిశాస్త్రి,కారా,శ్రీపతి వంటివారు పాలకులది ఒక వర్గమనీ,ప్రజలది ఒక వర్గమనీ..ఇది వర్గసమాజమనీ,వర్గసమాజం లో ఏదీ వర్గాతీతంగా ఉండదనీ తెలియపరిచే కధలు రాయడం జరిగింది.చాసొ గారి…కుంకుడాకు,భల్లూకస్వప్నం,బూర్జువాకుక్క,రావిశాస్త్రి గారి పిపీలికం,సారాకధలు,కారాగారి యగ్యం …అభ్యుదయ దృక్పధాన్ని అందించే కధలు. తాను యెవరో ఎరుక పొందాలనుకునే ఒక చీమకు శత్రువయిన ఒక సర్పం …తాను కష్టజీవి అని ఎరుకను కలిగించిందనీ,శత్రువుని శ్రమజీవులంతా కలిసి యెదుర్కొని హతమార్చడాన్ని ఈ కధలో చిత్రించారు.  రావిశాస్త్రి గారి పిపీలికం ఒక గొప్ప మార్క్సిస్ట్ తాత్విక కధ. దాదాపు మూడు పంచవర్ష ప్రణాళికలు ధనిక,పేదలమధ్య వ్యత్యాసాన్ని పెంచాయి.ఇటు కళింగాంధ్రలో కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం,తెలంగాణా సాయుధపోరాట ప్రభావం,అరసం యేర్పాటు,ఆదివాసీప్రాంతాల్లో సంగాల నిర్మాణం,పాలకవర్గవ్యతిరేక ఉద్యమ వాతావరణం నిండివుండిన కాలమ్ లో కారా మాస్టారి యగ్యం కధ వచ్చింది.తొలి తరం రచయిత- అప్పు తీర్చడానికి తన సంతానాన్ని వారసుడిగా పెంచదలచిన ఒక తండ్రిని…వారసత్వం అనే కధలో చూపిస్తే…కారా మాస్టారు…అప్పు కోసం సంతానం బానిస బతుకు బతకడానికి వీల్లేదని,సంతానాన్ని గ్రామ పంచాయితీ మండపం సాక్షిగా చంపిన ఒక తండ్రిని చూపిస్తారు. భవిష్యత్ తరం బానిసలు కాగూడదనే ఆకాంక్షతో విముక్తి పోరాటబాట నడచింది శ్రీకాకుళ రైతాంగం.దాని పూర్వదశను యగ్యం చూపింది.

ఈ కాలం లో అప్పటిదాకా మధ్యతరగతి ఇళ్ళల్లో ఉండిపోయిన కధ…వీధుల్లోకీ,బజారులోకీ,పంటపొలాల్లోకీ నడచింది..రెక్కాడితేగానీ డొక్కాడని శ్రమజీవులను,అల్పజీవులను సాహిత్యం లోకి   తీసుకువచ్చింది.

శ్రీపతి నర్తోడు,పతంజలి..మోటుమనిషి,రావిశాస్త్రి..రాకెట్టప్పారావు, కారా…అప్పల్రాముడుఆనాటి కష్టజీవులూ..కష్టఫలితాన్ని కోల్పోయిన నష్టజీవులు. సర్వేజనా సుఖినోభవంతు అని అమాయకంగా ఆశించిన గురజాడ తరం నుండి ఈ తరం…శ్రామిక జన సుఖినోభవంతన్న శ్రామికవర్గధోరణికి కధను నడిపింది.

ఆ తర్వాత శ్రీకాకుళ గిరిజన రైతాంగపోరాటం సాయుధరూపం తీసుకోవడం…ఆ పోరాటం లో మేధావులూ,ఉపాధ్యాయులూ,కవులూ పాల్గోవడం,విశాఖ విద్యార్దులు..రచయితలారా మీరెటు వేపు అని ప్రశ్నించడం,విరసం యేర్పాటు…కళింగసాహిత్యావరణం లోకి రక్తసిక్త సాయుధ గిరిజనుడొచ్చాడు. అడివంటుకుంది,ఇదేదారి,తీర్పు,పులుసు వగయిరా భూషణం గారి కధలు, నర్తోడు,నక్సలైట్ రాత్రులు వంటి శ్రీపతి కధలు,ఎన్నెస్ ప్రకాశరావ్,ప్రకాశరావ్,బి.టి.రామానుజం వగయిరా కధకులు విప్లవకధా పతాకను యెగురవేసారు.

శ్రీకాకుళాన్ని కల్లోలితప్రాంతంగా ప్రకటించడం,అడవినీ,గిరిజనగూడేలనూ దగ్దం చేయడమ్,ఎన్ కౌంటర్ పేరిట చంపడం…మొత్తానికి ఉద్యమాన్ని అణచివేయడం చేసిన ప్రభుత్వం ఇంకోవేపు సంక్షేమ పధకాల పేరిట ప్రజలకు ఆశలు రేకెత్తించి ఉద్యమానికి దూరం చేయడం ఎనభయిల నాటి కళింగ స్తితి. ఈ స్తితిని భూషణం గారి కొత్తగాలి కొన్ని కధలూ,అప్పల్నాయుడి పోడు..పోరు, కొలతలు…కధలు చిత్రించాయి.

తొంభయిలనాటికి ప్రవేశించిన సరళీకరణా,ప్రయివేటీకరణా,ప్రపంచీకరణా తమ ప్రభావాన్ని కళింగాంధ్రలో గూడా కలిగించాయి. నడువని పరిశ్రమలు (జూట్,సుగర్) ,ప్ర్రూర్తిగాని నీటిప్రాజెక్టులు, ఫైనాన్స్ కంపెనీలు,ఫోర్లైన్ల రోడ్లూ, మార్కెట్ పంటల జూదం లో ఓడిన రైతులూ, ఉపాధులు కోల్పోయిన గ్రామీణ చేతివ్రుత్తులవారూ… వలసబాట పట్టిన బతుకులు…వీటిని శ్రీకాకుళసాహితి… గావలికధలు, వంశధారకధలు, జంఝావతికధలు,వేగావతికధలు పేరిట సంకలించింది. బమ్మిడి జగదీశ్వరరావు … మట్టితీగలు, గంటేడ గౌరునాయుడు…ఒక రాత్రి రెండు స్వప్నాలు,సువర్నముఖి…సువర్నముఖి   కధలు,మరి కొందరి కధాసంపుటాలు దాదాపు దశాబ్దకాలపు మార్పుల్ని చిత్రించాయి. ఆ తర్వాత వర్తమానమ్ లో కళింగాంధ్రాలోకి విదేశీకంపెనీలతో పాటూ, ఇతరప్రాంతాల పెట్టుబడుల ప్రవాహం రావడమ్…ఇక్కడి పంటభూములను సెజ్ లుగా మార్చడం,ధర్మల్,అణువిద్యుత్ కుంపట్లు పెట్టడం,అడవీ,కొండల్లోని అపార ఖనిజాలను దొలుచుకు పోవడం,సముద్రతీరాన్ని యురేనియం కోసం, మత్స్యసంపదకోసం జల్లెడపట్టడం…ఈ పరిణామాలకు వ్యతిరేకంగా మైదాన ప్రాంతాన రైతులు, దళితులు,బహుజనులూ,అటవీప్రాంతాన ఆదివాసీలు, తీరప్రాంతాన మత్స్యకారులు పోరాడుతున్నారు.

తాము కోల్పోయే  నేలకోసం,. ఉపాధికోసం ఉద్యమిస్తున్నారు…ఈ స్తితిని.. మల్లిపురం జగదీశ్…శిలకోల,గాయం,బల్లెడనారాయణమూర్తి…ఉద్దానంకధలు,బజరా…హింసపాదు,గౌరునాయుడు…మాయ,అప్పల్నాయుడు..సందిగ్దాకాశమ్,దయ్యపుభరోసా, వంటి కధల్లో గమనించవచ్చు. అలాగే చింతకింది శ్రీనివాసరావ్, కె.యెన్.మల్లీశ్వరి,  డాక్టర్.బి.ఎసెన్.మూర్తి,పి.వి.బి.శ్రీరామమూర్తి,ఎ ఎన్ జగన్నాధశర్మ వంటివారి కధల్లో వర్తమాన కళింగజీవితాన్ని చూడవచ్చు.

ముగించే ముందుగా…కొందరు విలక్షణ రచయితల గూర్చి చెప్పవల్సివుంది. వ్యక్తుల గుణగణాల మీదా,వ్యక్తుల ప్రవర్తనల మీదా తాత్విక విమర్శగా కొన్ని కధలూ,మరికొన్ని మానవజీవితం లో యెదురయే ఘటనల గూర్చిన చింతనను తెలిపేకధలు రాసిన బలివాడ కాంతారావు గారూ,హాయి అయిన హాస్య కధలు రాసిన భరాగో గారూ,వేటకు సంబంధించిన కధలు రాసిన అల్లం శేషగిరిరావుగారూ, రాజుల శిధిలవైభోగాలను రాసిన…పూసపాటి క్రిష్ణమ్రాజు,దాట్ల నారాయణమూర్తిరాజూగారూ.. వీరితోపాటూ తప్పకా చెప్పుకోవాల్సిన విలక్షణ,విశిష్ట రచయిత పతంజలి గారు. ఈ విలక్షణ,విశిష్టరచయితల రచనలు కళింగాంధ్రా కధా పతాకకు వన్నె తెచ్చిన రచనలు.

సంస్కరణవాద భావజాలంతో ఆరంభమయిన కళింగ కధ,సమరబాటనూ నడచి..విఫలమయిన విప్లవాన్నించి వర్తమానం దాకా కళింగసమాజ ప్రయాణాన్ని చిత్రిస్తూనే ఉంది.

మీ మాటలు

  1. చొప్ప.వీరభధ్రప్ప says:

    కలింగాంధ్ర సాహిత్యాన్ని సంక్షిప్తంగా వివరించారు. వ్యాసం చాల విజ్ఞాన మందించింది .మరిన్ని లేదా ఒక్కొక్కర్ని గూర్చి వ్రాస్తే? అని అడగడం అత్యాశ అవుతుందేమో….వారియిష్టం వారికి వందనాలు

  2. అప్పల్నాయుడు అట్టాడ says:

    వీరభద్రప్పగారూ…
    నమస్తె..నిజానికి మీరన్నట్టు వ్యాసం చాలా సంక్షిప్తం. ఉత్తరాంధ్ర కధ మీద నేను ఇప్పటికే నాలుగైదు వ్యాసాలు రాసాను…విపుల లోనా,తెలుగుపసిడి లోనా,ఇంకా మరికొన్ని చోట్ల. ఇటీవల ఆంధ్రజ్యోతి లో వివిధ లో (నవంబర్.30) ఈ వ్యాసానికి కాస్తా పెద్దది రాసాను.అందులో కలింగ కధకులను నాలుగు తరాలుగా విభజించి వివరించాను. ఆ వ్యాసం చూసి ఒక సాహిత్యాభిమాని…ఆ నాలుగు తరాల కధలన్నీ సంకలించమని,ప్రచురణకు సహకరిస్తామని అన్నారు, ఆ పనిలో ఉన్నా. కనుక మీరు కోరినట్టు అందరి వివరాలూ,కధలూ అప్పుడు లభ్యమవుతాయి…

  3. కె.కె. రామయ్య says:

    అట్టాడ అప్పల్నాయుడు గారు, విప్లవాన్నించి వర్తమానం దాకా కళింగసమాజ ప్రయాణాన్నిచిత్రీకరించిన రావిశాస్త్రి గారు, సిక్కోలు భూషణం గారు, భరాగో గార్లు మెచ్చిన విశాఖ త్రిపుర గారికి కళింగలో కాసింత చోటివ్వరా. బీనాదేవి గారిని కళింగాంధ్ర సాహిత్య సృష్టికర్తగా ప్రస్తావించలేదెందుకు? బమ్మిడి జగదీశ్వరరావు గారు మా సెడ్డ పదునైనోడే కానీ, తనకన్నా సీనియర్ విశాఖ మాండలీకంలో రాసిన గొరుసు జగదీశ్వర రెడ్డి గారూ తప్పక చెప్పుకోవాల్సిన రచయిత. వొందానాలతో

    • అప్పల్నాయుడు అట్టాడ says:

      రామయ్యగారూ..
      నమస్తే…
      ఉపన్యాస కాలపరిమితి రీత్యా,సామాజిక చలనాన్ని చిత్రించిన కధలనూ,కధకులనూ నమూనాగా పేర్కొన్నాను.మీరన్నట్టగ త్రిపుర,బీనాదేవీ కళింగ కధాకేతనాలు..
      మీరన్న గొరుసే కాదు కె.వి.కూర్మనాద్ వంటి కొంతమందిని పేర్కొనాలి గాని పరిమితి రీత్యా వదిలేసాను..ఇంతకముందు వ్యాసాల్లో మరింత వివరంగా రాసాను,అయినా వారందరికీ వందనాలు…యెత్తి చూపిన మీకు ధన్యవాదాలు..

  4. అప్పల్నాయుడు అట్టాడ says:

    నిజమే సార్..రామయ్యగారూ…
    టైం లిమిట్..సామాజిక చలనాన్ని చిత్రించిన కధలు చెప్పడం వరకు ప్లాన్ చేసి మాటాడాను,కానీ వ్యాసం లో మీరన్న పేర్లు రాయాల్సిందే.గతం లో నా వ్యాసాల్లో రాసాను. త్రిపుర,గొరుసు,బీనాదేవీ ఇంకా ఉన్నారుసార్..
    పేర్కొనని వాళ్ళు…అందరికీ నా వందనాలు.

  5. అప్పల్నాయుడు అట్టాడ says:

    రామయ్యగారూ
    నమస్తే..
    ఉపన్యాస కాలపరిమితి రీత్యా నేను సామాజిక చలనాలను చిత్రించిన కధలనూ,కధకులనూ పరిమితంగా పేర్కొన్నాను. మీరన్నట్టు..త్రిపుర గారూ,బీనాదేవీ కళింగ కధకు గౌరవ పతాకలు యెగురవేసినవారే. ఇంతకు ముందు రాసిన వ్యాసాల్లో దీని కంటే వివరంగా రాసాను. గొరుసే కాదు,కె.వి.కూర్మనాద్ వంటి మరికొంత మందిని పేర్కొనాలి. నాకు వీరందరూ అభిమాన రచయితలు. కాకపోతే ఉపన్యాస కాలపరిమితి…ఈ లోపాలకు కారణాలు…

  6. Kcube Varma says:

    ఉపన్యాస వ్యాసం పరిమితులు ముద్రణకు వచ్చేసరికి అధిగమిస్తే ఇంకా వైశాల్యం పెరిగేది. అయినా బాగుంది. అభినందనలు

    • అప్పల్నాయుడు అట్టాడ says:

      వర్మా..
      చాలా సంతోషం…మీరన్నట్టు వివరంగా అంతకుముందు వివిధ లో రాసాను. ఇప్పటికి ఇది అమెరికా లో ఉత్తరాంధ్ర కధా పరిచయానికి ఒక అవకాశంగా తీసుకొని ఆ ఉపన్యాస కాలపరిమితి లో అలా చలనాన్ని చెప్పే కధలనే పేర్కొన్నాను.
      మీ స్పందనకు ధన్యవాదాలు..

  7. అప్పలనాయుడు గారూ,
    ఉత్తరాంధ్ర కథ గురించి మీరు వీలైనప్పుడల్లా రాయడం, మాట్లాడడం అభినందనీయం. మన కథ గురించి తెలుగు ప్రజలందరికీ పరిచయం చేస్తుండడం మంచి కృషి.
    చిన్న సందేహం. విఫలమైన విప్లవాలు ఏమిటి? అవి విఫలమయ్యాయా లేకపోతే సెట్ బేక్ కి గురయ్యాయా?
    మీకు వీలైనప్పుడు వివరంగా రాస్తే బాగుంటుంది.

  8. అప్పల్నాయుడు అట్టాడ says:

    కూర్మనాద్ గారూ,
    మీ స్పందనకు క్రుతగ్యతలు.
    విఫలమా…వెనకపట్టు పట్టడమా…?
    నలభయ్యేళ్ళుగా మళ్ళీ శ్రీకాకుళపోరాటం…రివైవ్ కాలేదు. అది విఫలమా,వెనకపట్టా…యేమనను?
    పోనీ…మరిన్ని దశాబ్దాలకు కూడా అవుతుందన్న… ఆశా కనబడడం లేదు. ఇంకెక్కడో పునరుథానమయిందనొచ్చు…విప్లవం అలా అవుతుందనీ అంటారు. నేను శ్రీకాకుళం గురించే ఆ పదం రాసాను…
    ఇంతకంటే వివరంగా రాయలేను… అసలు ఈ పదం మీద మీ ప్రశ్నకు మౌనం వహిద్దామనుకున్నాను. కానీ మీరు అన్యదా భావిస్తారని …ఈ మాటలయినా..

మీ మాటలు

*