మునివేళ్ళ మీది పుప్పొడి!

 

 

-జి. సత్య శ్రీనివాస్

~

విశ్వకవి ‘ stray birds ’ ,బోల్లోజు బాబా  ‘స్వేచ్చా విహంగాలు’ అనువాదం చదువుతునప్పుడు నా అరచేతి ఆకాశం నుండి ఎగిరే గాలి పక్షులు రెక్కల తివాచీ పై పయనించేట్టు చేసింది. అందుకే, ముందుగా బొల్లోజు  బాబా  ముని వేళ్ళని ముద్దాడాలనిపిస్తుంది. సరిగ్గా వందేళ్ళ మునుపు అచ్చయిన స్ట్రె బర్డ్స్  ద్వారా కవిత్వంలో మరో కొత్త ఒరవడిని విశ్వ కవి సృష్టించారు. చైనీస్ ఆధునిక కవిత్వానికి, చైనీస్  వెదురు వేణువు లోనుండి వీచే గాలికి విశ్వకవి కొత్త రుతువుగాలి  కల్పించారు అని  చైనీస్ సాహిత్య కారులే అన్నారు. అటువంటి కవితలలోని భావాన్ని పొల్లుపోకుండా ,చక్కని నైపుణ్యం తో అనువదించారు బొల్లోజు బాబా .

అనువాదం ఒక నెరేటివ్ రీసర్చ్ , ఒక వైవిధ్యమైన ప్రక్రియ. అది భాషా నైపుణ్య పరిధులు దాటే ఏరు.ఎందుకంటే అది కవిని,అనువాదకుడ్ని , పాటకుడ్ని, బాషకల్లుకున్న సాంస్కృతిక మూలాల్లోకి తీసుకువెళుతుంది. అందరూ కలిసి నది ఒడ్డున చేసే ప్రయాణాన్ని బొల్లోజు బాబా గారు ఏర్పచ గలిగారు. మన అడగుజాడల గుర్తులు ఇసుక మబ్బు  గూళ్ళలోని నీటి చుక్కలా  మిగిలి వుంటాయి.

దేశ దిమ్మరి పిల్ల మూకల్లారా

మీ పాద ముద్రలను నా పదాలపై విడువండి.

అనువాదంలో ఒక ఇజ్స్ తో బాటు అల్లుకుపోయిన Colloquialness,నేటివిటీ వుంది.  దానితో బాటు అనువాదానికి కావాల్సిన స్వేచ్చ మంత్రం ధ్వనిస్తుంది. అది ఈ కవితలో స్పష్టంగా కనబడుతుంది

వసంతపు దరహాసాలను కావలి కాసేది

మట్టి అశ్రువులే

ఈ స్వేచ్చకు రహస్యం తెగింపు కూడా అవసరమని చెబుతోంది.అనువాదంలో వుండే కీలకమైన ఇబ్బంది వేరు వేరు బాషల మధ్య వుండే వ్యాకరణ రూపంలోని వైవిధ్యం.కొన్ని పోలి వుంటాయి ,మరి కొన్ని భిన్న దృవాలు గా వుంటాయి. అందుకే అనువాదానికి ప్రేమపూరితమైన బాధ్యతతో  నిండిన స్వేచ్చవుండాలి. రవీంద్రుడు కాక మరొకరు స్ట్రె బర్డ్స్ ని ఆంగ్లంలోకి అనువాదం చేసి వుంటే అది మరోలా వుండేది.కారణం భారతీయ ఆంగ్లం లో స్ధానిక పోపు సామాగ్రిని మిళితం చేయడం చాల అవసరం.  ఆయన అనువాదం తన గూటి పక్షుల్ని, గగనం లోని మరో మార్గంలో లోకి తనే  ఎగరేసాడు. బాబా కి  ఆ  మార్గాన్ని పట్టుకునే స్వచ్చమైన, స్వేచ్చమైన  చూపుంది.

baba

What you are you do not see, what you

see is your shadow.

నీవేమిటనేది నువ్వు దర్శించలేవు

నీవు దర్శించేది నీ ఛాయా

అనువాదం కూడా ఇంతే. అనువాదం ద్వారా కవి మనో భావ బాషని అనువాదకుడు ఇది అనువాదం అని నొక్కివక్కా ణిoచకుండా చెపుతూనే ,మూలాన్ని ,తన – మన అన్న బేధం లేకుండా ఆస్వాదించేలా చేయాలి.అప్పుడే మూల బీజంలో మొలకెత్తే గుణం పొదిగివుంటుంది,అది పరివ్యాపిస్తుంది. సహజంగానే మూలం లోని తాత్విక సంచారి నైజం అనువదoలోనూ వచ్చింది. బీజం లోని మొలకెత్తే గుణం పోలేదు. కారణం విశ్వకవే బెంగాలీనుండి ఆంగ్లంలోకి అనువదించుకున్న మూల ఆనువాదకుడు, అది ఇంకెన్ని బాషల్లో అనువాదమైనా పరివ్యాప్తి చెదే గుణం పోదు.   ‘స్వేచ్చా  విహంగాలు’ తో ప్రయాణం అంటే ,ఈస్ట్ కోస్ట్ లో హౌరాకి వెళ్ళినట్టు.

మన బాషనుండి,ఆంగ్లం లోకి అనువాదం మళ్ళీ వేరే ప్రాంత బాషలోకి అనువాదం అంటే. తెలియందేముంది మన ప్రాంతంలో మాట్లాడే ఆంగ్లానికి కూడా మన రంగు, రుచి, సువాసన వుంటాయి.వందేళ్ళ చరిత్ర గల ఈ పుస్తకానికి మనం నివాళిగా మన కవితల్ని మనమే ఆంగ్లంలో అనువదించి మనమే నేటి గ్లోబల్  విలేజ్లో  మనమే నాటుదాం అని,నేటి తరానికిచ్చే  పచ్చటి స్పూర్తి. పుస్తకం మొత్తం చెప్పేదిఇదే తత్త్వం.

విహంగం తానొక మేఘాన్నైతే

బాగుణ్ణనుకొంటుంది

మేఘం

తానొక విహంగాన్నెందుకు కాలేదా అనుకొంటుంది……

 

మన భావవ్యక్తీకరణ, దాని రూపం మన జనపదాల్నుండి వచ్చిన ఆస్తి, దీన్ని ముందు తరానికి అందించడం అంటే, బాషల కుటుంబ చెట్టు సంరక్షణే. అది జరగాలంటే దీనిని విధ్వంసం చేసే అనువదీకరణకు అడ్డుకట్ట వేయాలి. అందుకు కవిత్మాకంగా అలోచిండడం కంటే గొప్ప ఆయుధం లేదు. అనువాదం అన్నది మూల రూపాన్ని మళ్ళీ నాటే సృజనాత్మక ప్రక్రియ. పలు  చోట్లున్న   పాటకులని, కవికి అందించి ,పాటకులకి కొత్త చిగుర్లని చూపించే దృష్టి. రాతలు కొనసాగాలి వాగుల్లా,వంకల్లా…

చిన్నారి గడ్డిపోచా

నీ పాదం చిన్నదే కావచ్చు కాని

పుడమి మొత్తం నీ అడుగుల కిందే వుంది.

‘స్వేచ్చా విహంగం” గా వెళుతునప్పుడు అక్కడక్కడా కాలిబాటలో అరికాలిలో చిన్ని రాళ్ళు గుచ్చు కుని మనం ఎక్కడున్నాం అని గుర్తుచేసినట్టు చిన్న ఇక్కట్లున్నాయి. అవి మూల స్పర్శ .పరిమళాన్ని వదిలేసిన జాడలు. ఇది అనువాదంలో , లీనమైపోవడం వల్ల  ఏర్పడే పొరపాట్లు  తప్ప తెలిసి చేసినవి కాదు. ఎందుకంటే ,  ప్రతి పదానికి నిఘంటువులో మనకి కావాల్సిన అర్ధం దొరకదు,ముఖ్యంగా కవిత్వానికి.

 

Night’s darkness is a bag that bursts

with the gold of the dawn.

 

రాత్రి చీకటి తిత్తి

సువర్ణోదయం లా పగిలింది

పగిలింది అనే పదానికి బదులుగా విచ్చుకుంది అంటే బాగుoటుంది. కారణం అనువాదం  ఒక శీర్షాసన ముద్ర, కొన్ని జాగ్రత్తలు అవసరం ,వాట్ని విస్మరించలేం,న్యూయాన్సెస్ ని పట్టుకోవాలి.

That which ends in exhaustion is death,

but the perfect ending is in the endless.

అలసటలో  ముగిసేది మృత్యువు మాత్రమే,

సంపూర్ణ ముగింపు అనంతంలోనే వుంది.

అనువాదం ఫర్ఫెక్షన్ కాదు ,పసి పిల్లల అడుగుల సవ్వడి, అవి తడబడే అడుగులు కావు, ఇరువురి చూపులకి  నడకలు నేర్పే లయలు. ‘స్ట్రె బర్డ్స్’  నాకై  నేను ,ప్రపంచానికి ‘కవిత్వ’ మాధ్యమం లో ఆలాపించే ప్రవచనా గీతం. ఆ గీతాన్ని ‘స్వేచ్చా విహంగాలు’ గా  చదువుతునప్పుడు సీతాకోకచిలుక ని పట్టుకుని వదిలేసిన తర్వాత దాని పుప్పిడి మునివేళ్ళకి సింధూర తిలకంలా అద్దుకుంటుంది. అందుకే బాబా మునివేళ్ళని మరోసారి ముద్దాడుతూ…

 

*

 

 

 

మీ మాటలు

  1. K.WILSON RAO says:

    బొల్లోజు బాబా గారి రెండు పుస్తకాల ఆవిష్కరణకు నేను కూడా హాజరైన వారిలో వున్నాను
    ఆరోజు, బాబా గారు అనువదించిన రవీంద్రనాథ్ ఠాగూర్ గారి కవిత్వం గురించి సత్య శ్రీనివాస్ గారి ప్రసంగం విన్నాను. ఈరోజు ఆ ప్రసంగ పాఠం చదివాను . చాలా ఆనందం వేసింది. నేను పుస్తకం ఇంకా చదవలేదు గాని ప్రసంగం విని, ఈ రివ్యూ చదివి నా అవగాహన మేరకు, గొప్ప కవిత్వాన్ని గొప్పగా అనువదించిన బొల్లోజు బాబా గారికి, అంతే స్థాయిలో మంచి విశ్లేషణ చేసిన సత్య శ్రీనివాస్ గారికి అభినందలు.

  2. Chinaveerabhadrudu says:

    స్వేచ్చా విహంగాలు’ తో ప్రయాణం అంటే ,ఈస్ట్ కోస్ట్ లో హౌరాకి వెళ్ళినట్టు. Beautiful !

  3. THIRUPALU says:

    సూపర్!

  4. Thank you Sri. Sathya Srinivas garu, for a wonderful and deep review
    thanks alot

  5. Kcube Varma says:

    విశ్వకవిని ఇన్ని పేజీలలోకి అనువదించిన బాబా గారికి అభినందనలు..
    బాబా గారికి అండగా ఇంత మంచి విశ్లేషణ అందించిన సత్యశ్రీనివాస్ సార్ కు ధన్యవాదాలు…

  6. prl swamy says:

    బొల్లోజు మంచి కవి. దానికి తోడు మంచి అనువాదకుడు .నేనంటాను స్వచ్ఛమైన హృదయ మున్నవాడే మరింత స్వచ్ఛమైన అనువాదాన్ని చేయగలడు .బొల్లోజు సఫలీకృతుడయ్యాడని రెక్కలు విప్పిన స్వేచ్చావిహంగాలు కూడా మనం ఎగిరితే చాలు .

Leave a Reply to satya srinivas Cancel reply

*