చీకటీగలు-4

 

2

 

ఉదయాన్నే సగం చీకటి బాత్రూంలో గడ్డానికి నురగ పట్టించి… మాడిపోయిన బల్బున్చూసి నన్ను నేను తిట్టుకుంటూ వేళ్ళతో తడుంకుంటూ గడ్డం గీక్కుంటూంటే…

హాల్లో మాటల్వినిపించాయి… సుభద్ర ఎవర్నో పలకరిస్తూ మాట్లాడ్తోంది… స్పష్టాస్పష్టంగా వున్న ఆ యింకో గొంతుకను గుర్తించేందుకు కొన్ని క్షణాలు పట్టింది.. కంఠం… కంఠమది… నీలకంఠమూర్తి… అంతుదయాన్నే… ఏమయి  వుండొచ్చు… చేబదులుకొచ్చుంటాడా…? సుభద్రను డైరెక్టుగా అడిగే చనువుందతనికి… వెళ్ళేసరికి సోఫాలో చేత్తో స్టీలుగ్లాసు పట్టుకుని ఊదుకుంటూ కాఫీ తాగుతున్నాడు…డైనింగ్‌టేబిల్మీద ఏదో బట్టలంగడి సంచీ పెట్టుంది.

‘‘గుడ్‌మార్నింగ్సర్‌… వంకాయలు.. బామ్మరిదొచ్చాడు… వాడికో రెండెకరాల తోటుందిగా… ఫ్రెష్గావున్నాయి. కనకమిమ్మన్జెప్తే రాత్తిర వచ్చేసారు త్వరగా మీరెళ్ళింతర్వాత మేషారేమీ మాటాళ్ళే..? అంతా వాళ్ళావిడ అబ్బాయీ గొడవే… ఏమిటోలేండీ జీవితాలు’’ పొడిపొడిగానే విశదంగా తానొచ్చిన కారణం… రాత్రినేనొచ్చేసింతర్వాత విషయాలు చెప్పేసాడు.

గుమ్మం బైటికొచ్చి యిద్దరం సిగరెట్లు వెలిగించాం… సుభద్రకింట్లో సిగరెట్‌ కాలిస్తే మంట, చీదరించుకుంటుంది…

‘‘రాత్తిర రంగరాజుల్చెప్పాడు… ఆఫ్‌ కదా మేషార్ని పిల్చుకునెటేనా తీసికెళ్ళమని… వాళ్ళబ్బాయి తోటి గొడవకదా… అందుకనీ టిఫిన్లు కాంగానే వెళ్తా మేషార్దగ్గర్కి… గొడవేమేనా వుంటే ఫోన్‌ కొడతాలెండి మీకు… వంకాయలు లేతగా బావున్నాయి చూడండి… వస్తా…’’ స్ట్యాండేసిన మోపెడ్‌ పెడల్‌ తొక్కుతూ స్టార్ట్‌ చేయడానికి యత్నిస్తున్న నీలకంఠాన్ని చూస్తూ…. మరో సిసిఫస్‌ అనుకున్నా…

ఈ మాటు శ్రీమన్నారాయణ్తోటి మృచ్ఛకటికం కాదు మిత్‌ ఆఫ్‌ సిసిఫస్‌ గురించి మాట్లాడాలి. కేమూ… అబ్సర్ట్‌… అస్తిత్వవాదం… దేముడూ… ఆత్మహత్యా… చివర్న కాఫ్కా గురించి కేమూ అభిప్రాయాలూ..

లోపల్నించీ నా మొబైల్‌ రింగ్‌… పంఖ్‌హోతెతో… సలామత్‌ హుస్సేన్‌ ఫ్లూట్‌.. సిగరెట్‌ ఆఖరి దమ్ము పీల్చి విసిరేసి లోపలికెళ్ళా.

రోజుకోమాటు జీవితాన్నలా పీల్చేసి గిరాటేయ్యగల్గితే! లివ్‌ యువర్‌లైఫ్‌ వన్స్ ఎడే… వీలయ్యే పనేనా… సుఖాలూ… ఆనందాలు ఎదురుపడి భుజాల్తట్టి పకరించినా గుర్తుపట్టలేని యాంత్రికత్వం… ఈ రోజు నిన్నటికి ఫ్యాక్సిమలీ… రేపీరోజుకి నకలు.

‘బాణల్లో వంకాయ వేసాను… మగ్గింతర్వాత స్టౌ ఆఫ్‌ చెయ్యి… చేసి… మద్దిలేటి దగ్గర ఇడ్లీ వడా కట్టించుకోన్రా… నేను సాయంత్రం లేట్‌. వసంతతో షాపింగ్‌.. స్నానానికి వెళ్తున్నా… తలుపు ఆటోలాక్‌ చేసి వెళ్ళు’’ భుజాన టవల్తో బాత్రూంలోకదృశ్యమైన సుభద్ర.

మనిద్దరం ఒకరికొకరం ఏమవుతాం సుభద్రా… నీకూ నాకూ కలిపి ఒక జీవితమంటూ వుందా? వాట్యామైటుయూ? అన్‌ వాటార్యూ టుమీ? ఇద్దరం కలిసి ఒకే వంకాయ కూరా… ఒకే గిన్నెలో అన్నం… ఒకే గిన్నిచారూ… మజ్జిగా… కలిసి వేరువేరుగా… విడివిడిగా… వేరు వేరు కంచాల్లో… నేత్తో నేనూ.. జిడ్డు లేకుండా నువ్వు భోంచేసి… నువ్వో ఆఫీసుకూ… నేనో ఉజ్జోగానికీ విడివిడిగా వెళ్ళి… వేరు వేరు పను చేసి… సాయంత్రానికి ఒకే కొంపకు చేరి… క…ల…సి… బతుకుతున్నాం. భలేగా వుంది… ఆలోచించే కొద్దీ అసంబద్ధత. మన మన జీవితాలకో పర్పసుందా? అసలిన్ని కోట్ల కోట్ల జనాలకి లక్ష్యాలూ, గమ్యాలూ వున్నాయా? వాళ్ళల్లో తొంభై అయిదు శాతం అసంబద్ధతనీ అసంగతాన్నీ మొనాటనీలనీ ఓ నిర్వికల్పతగా చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నామనుకుంటూ… బండరాయిని కొండమీదకి తొళ్ళిస్తూ… పదే పదే జారి కిందికి దొళ్ళే దాన్ని మళ్ళీ కొండ దిగొచ్చి పైకెగదోస్తూ… సమాధానాల్లేని ప్రశ్నల్తో ప్రశ్నలూ కాదు ప్రశ్నే ఒకటే…

ఏమిటి? ఏమిటీ జీవితానికీ, ప్రపంచానికీ అర్థం. అన్న నిరంతరప్రశ్న… వాళ్ళ శరీరాలే పెద్ద ప్రశ్నార్థకమై… మళ్ళీ సాలామత్‌ ఫ్లూట్‌ ‘హెల్లో’ కంఠం.

‘‘మేషార్దగ్గిరకెళ్తున్నా సార్‌.. వస్తా అంటే బయటికి తీసుకెళ్తా.. మళ్ళీ ఫోన్జేస్తామీకు… వంకాయలు బావున్నాయి చూడండి…వుంటా…’’

ఇంకో రెండ్రోజులు వంకాయగురించే మాట్లాడ్తాడేమో కంఠం.

భలే భలే కంఠం బామ్మర్ధి తోటనించొచ్చిన నేవళమైన వంకాయలు రెండ్రోజులు… నాలుక చివర్నించీ ముడ్డివరకూ జీవితపు కొలతైపోయింది. నిజమే వంకాయకూర వాసన వంటింట్లోంచీ తలవాకిట్లోకొచ్చి గుబాళిస్తూ బయటకు దారిచూసుకుంటోంది. శ్రీమన్నారాయణ ‘వంకాయా – మనిషి జీవితం’ ఓ గాఢమైన అసంబద్ధ పరిశీలన గురించి మాటాడవూ… మై ఫుట్‌.

అసహనం… చీకాకు… నేనెవరో తెలీని నామీద ఎందుకో నాకు కోపం…

లోపలికెళ్ళి మూత్తీసి మూకుట్లోకి ముక్కుపెట్టి వంకాయవేపుడు వాసన పీల్చా… యింత ముందుటి సిగరెట్‌ అవశేషంతో వంకాయకూర వాసన భేషుగ్గా అనిపించింది. దాన్నోమాటు కెలికి మూతపెట్టేసి స్టౌ కట్టేసి… ప్లాస్టిక్బుట్టా, క్యాసరోల్‌ తీసుకుని నా తాళం చెవిని జేబిలోకేసుకుని, తలుపు ఆటో లాక్జేసి… బయటి ప్రపంచమని భ్రమించే యింకా విస్తృతమైన నాలోకే ప్రవేశించా…

మెయిన్రోడ్డెక్కుతూంటే షట్టరెత్తుతూ మోటార్సైకిల్‌ మొకానిక్‌ కనిపించాడు. బైక్‌ స్టార్ట్‌ కావట్లేదన్న విషయం గుర్తొచ్చి… ఆగి వాడికి చెప్పి… ముందుక్కదిలా… కదిల్తే బండి లే పోతే మొండి…. మోటార్సైకిల్తో సబంధం లేకుండా మెటా ఫిజిక్స్‌ మాట్లాడిన పిర్సిగ్‌ పుస్తకం జెన్‌ అండ్‌ ది ఆర్ట్‌ ఆఫ్‌ మోటార్సైకిల్‌ మెయింటెనెన్స్‌’ గుర్తొచ్చింది. లక్ష కాపీలమ్ముడు పోయిన పుస్తకం. అచ్చుకు ముందు వందకంటే ఎక్కువమంది పబ్లిషర్స్‌ ఛీత్కరించిన పుస్తకమది. నేను శ్రీమన్నారాయణ్ణి ‘వంకాయ – జీవితం ఓ గాఢమైన పరిశీలన’ గురించడగడం, అసంబద్ధం కానేకాదు.. లేదు కాక గాదు.

వం…కా..య్‌…

జీ…వి…తం…

****

ఒకే రోజును పదేపదే ఏళ్ళతరబడి జీవిస్తూ రావడమన్నది జరుగుతూనే వున్నది. గమనించని వాళ్ళకి జీవించడమన్నది వుండదు… గమనించే వాడికదో యాతన అది కేవలం బతికుండడం… అన్న స్పృహ వాడిని ఎటువేపుకి నెడుతుందో… చీకట్లోకి, అర్థరాహిత్యంలోకీ… బతకడం మానేసి జీవించడంకోసం మరణించడం వేపుకి నెడుతుందేమో…. కాదు కాదు… అర్థమవని దాన్ని అర్థం చేసుకునే తీవ్రమైన కసరత్తులాగా. మర్సట్రోజు పేజీలో అర్థం. విడివడి కనబడ్తుందన్న ఆశతో… తనకు తెలీకుండా మొదలై… తనకు తెలీకుండానే అంతమయ్యే పుస్తకాన్ని చదువతొన్నట్టుగా వుంటుందేమో ఆ భావన…

అంతా అబ్సర్డే అని ప్రతొక్కరూ అనుకుంటూంటే, యిన్ని వేల సంవత్సరాలుగా… యిన్నిన్ని… ఇంతింత నాగరికతలుగా… ఐతిహ్యంగా కళగా… మనిషి ఎదుగుదలుండేదా? నిజమే జాతి. ఏ లక్ష్యమూ, గమ్యము లేకుండానే వున్నా… తర్వాత్తర్వాత ఏదో ఓ దానికి తగిలేలా కొక్కేన్ని విసిరి కాలం తాడు పట్టుకు ముందుకు పాకడముంటుంది కదా? లెట్మీ లివ్‌ ఫర్‌ మై అన్నోస్‌ బ్యూటిఫుల్‌ మారో… దో ఫాంలెస్‌ అండ్‌ ఏలియన్‌.. అయ్‌ లవ్‌ మై టుమారో.

అర్థం కాని తత్త్వం వుంటుంది. అది నీ చేతకాని తనమే అననుకుంటే ఓ తృప్తి వుంటుంది. ఈ అసంబద్ధ జీవితానికో అర్థం ఖచ్చితంగా వుందీ… అది నీకు… నీకు బోధపడట్లేదంతే.. కన్‌స్ట్రక్ట్‌ ద మీనింగ్‌ టుది సీమింగ్లీ మీనింగ్లెస్‌… నాకు ఈజిప్షన్‌ చిత్రలిపి అర్థం కాదంటే నా చాతకానితనమే…. అసలా చిత్రలిపికి అర్థమేలేదంటం అసలు అబ్సర్డిటీ.

నిస్సంగత్వే నిర్మోహత్వం… నిర్మోహత్యే నిశ్చలతత్వం

నిశ్చలతత్వే జీవన్ముక్తిః

జీవితాన్నుండీ విడి వడి… బయటినించీ దాన్ని చూస్తూ దానిపట్ల మోహాన్నొదిలేసేసి… స్టెబిలైజయిపోతే చాలు… ఈ భారం నిన్నొదిలేస్తుంది… శబ్బాషో… భజగోవిందం పాడుకుంటూ అస్తిత్వవాదపు అబ్సిర్టిటీ నించీ తప్పించుకోవచ్చు.

మోటార్సైకల్‌ మెకానిక్కొచ్చాడు. పిర్సిగ్‌ స్నేహితుడ్ని సూదర్‌ల్యాంఢ్‌ని నేను… రిపేరీ తెలీదు… బయట్నించెవడేనా వచ్చి యీ కటారా జీవితాన్ని బాగచేసి సాఫీగా నడిచేట్టు చేస్తాడని చూట్టం తప్ప ఏం తేలీదు… ఎవడొస్తాడూ బయట్నించీ దేముడా….? నూటికి తొంభై తొమ్మది మందికి అది దేముడే…

నలభై ఏళ్ళైంది రాబర్ట్‌ పిర్సిగ్‌ ఈ పుస్తకం రాసి.

‘‘ప్లగ్గు కీన్చేశినా సార్‌. ఏం ప్రాబ్లమ్‌ లేదు.. కానీ ఎందుకైనా మంచిది… ఒకసారి సర్వీసింగ్‌కి యియ్యండి…’’ అని నా జీవితానికన్నట్లు భరోసా యిచ్చి వెళ్ళిపోయాడు మెకానిక్‌….

నేనూ, సుభద్రా విడివిడిగా కలిసి… ఒకే మద్దిలేటి హోటల్నించీ తెచ్చిన ఇడ్లీవడా విడివిడి కంచాల్లో పెట్టుకు ఎవళ్ళకి వాళ్ళం, పచ్చడి ఎక్కువతో నేనూ తక్కువతో సుభద్రా తిని కొండమీదకు గుండు ఎగదోయడానికి సిద్ధమయ్యాం… ఒకాడ సిసిఫస్‌… యింకో మగ సిసిఫస్‌…

****

పన్నెండుకు రంగరాజుల్దగ్గర్నించీ కంఠం ఫోన్జేశాడు.

‘‘మేషారు గదిలో లేరు సార్‌… చాల్సేపు గద్దగ్గర వెయిట్చేసా… వూహూఁ… వాళ్ళింటి చుట్టూ కూడా ఓ రెండు రౌండ్లేసా… అక్కడా జనాల్లేరు… యింకిక్కడికి రాజా దగ్గిర కొచ్చుంటారేమోననిటొచ్చా… వూహూ. వుండండి రాజా మాటాడ్తాట్ట… కాస్సేపు నిశ్శబ్దం తర్వాత ‘నాలుగో చీటి నేన్తీస్కుంటానని ముందే చెప్పినాగదనా… వుండు సార్తోని మాట్లాడి నీతో మాట్లాడ్తా….’ సార్‌. నేన్సార్రాజాని మన్సార్యాడికి బొయ్యింటాడ్సార్‌. నాకాడిక్కూడా రాల్యా… కంటమన్న గూడా వూరల్లా దేవులాడొచ్చె నీగ్గూడా తెలిసేట్టు లేదుగదా…?’’ ఆగాడు రంగరాజు…

‘‘లేదులే ఎక్కడికీ వెళ్ళే అవకాశం లేదు…. ఏం గొడవా జరిగినట్టు కూడా లేదుకదా… మజ్జాన్నమ్మూడుకు నాక్ల్కాసులైపోతాయి. ఫోన్చేసొస్తా…’’ అని ఫోన్కట్చేసి… శ్రీమన్నారాయణకి రింగిచ్చా…. స్విచ్ఛాఫ్‌ అనొస్తోంది…. మూడుసార్లు ప్రయత్నించా… విసుగేసింది… ఎందుకో అప్రయత్నంగా ‘చీకటీగలు’ అన్నపదం గుర్తొచ్చింది. వెను వెంటనే ఓ వెర్రి చిర్నవ్వు మొలిచింది.

ఎవరు ఎవరికి చీకాకు కలిగిస్తున్నారు.

సుభద్రకు నేను తక్కువే…. సుభద్రకూడా నాకు చీకాకు కలిగించదు.

రంగరాజు సాధ్యమయినంతమేరా అందరికీ ఊరట కలిగించే పన్లేచేస్తాడు… కంఠం తన మానాన్తాను బతుకీడుస్తుండాడు. భార్యా కూతుర్దగ్గరెట్లా వుంటాడో తెలీదు.

(సశేషం)

మీ మాటలు

*