మానవుడితో…

 

 

-బాలసుధాకర్ మౌళి

~

( చ‌ల‌సాని వ‌ర్థంతి స‌భ‌ ఈ 24 ఉదయం  9.30గంట‌ల‌కు  విశాఖ‌ప‌ట్నం పౌర గ్రంథాల‌యం, ద్వార‌కాన‌గ‌ర్‌

అధ్య‌క్ష‌తః వ‌ర‌వ‌ర‌రావు
చ‌ల‌సాని ప్ర‌సాద్ సాహిత్య స‌ర్వ‌సం – 1 ఆవిష్క‌ర‌ణ‌
ఆవిష్క‌ర్తః కృష్ణాబాయి)

*

రెండేళ్ల కిందటి సంగతి – విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో ‘జనకవనం సభ’ ప్రారంభకులుగా కె. శివారెడ్డి గారు వచ్చారు. పబ్లిక్ లైబ్రరీకి దగ్గర్లోనే ఏదో హోటల్లో రూం.

సాయంత్రం సభ అయింతర్వాత – శివారెడ్డి గారు వున్న హోటల్ రూంకి వెళ్లాను. ఒక అరగంట సేపు కవిత్వం – వర్తమానం ..ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్న తర్వాత – ‘ హాఫ్ చేతుల తెల్లని షర్ట్, వొక మామూలు ప్యాంట్ ‘ వేసుకుని ‘చలసాని ప్రసాద్ గారు’ వచ్చారు. అదే మొదట – నేను ఆయనతో మాట్లాడింది. ఆయన గొంతుని, మాటని దగ్గరగా వినడం. చూడడం.. నాకు మిగిలిన అనుభవాలు. అంతకు ముందు విజయనగరంలో, విశాఖలో వొకటి, రెండు సభల్లో చూసాను. శ్రీశ్రీ కి పరమ భక్తుడని, విప్లవానికి నిబద్ధుడని -నేను ఆయన గురించి విన్నవి. చలసాని గారి సాహిత్యంతో పరిచయం వుంది నాకు. ఆయన వ్యాసాలు, కవిత్వం చదివాను. ‘జైలు’ మీద రాసిన అతని కవిత్వం, ఆ కవిత్వ నిర్మాణం నన్ను ఆశ్చర్యపరుస్తుంటుంది.

ఆ రోజు శివారెడ్డి గారే నన్ను చలసాని గారికి పరిచయం చేసారు. నా కవిత్వసంపుటి గురించి చెప్పి.. ఆయనకి వొక కాపీ యిమ్మన్నారు. నేను బ్యాగ్ లోంచి తీసి.. ఆయనకు అందించాను – ‘ గురుతుల్యులు… చలసాని ప్రసాద్ గారికి’ అని రాస్తూ –   ఆయన వొక నిమిషం అటు యిటూ తిప్పి చేతిలో వుంచుకున్నారు. నేను చాలా ఆనందపారవశ్యానికి లోనయ్యాను. అదే ఆయనతో తొలుత నేను వుండటం.

మళ్లీ..

2015 ఏప్రిల్లో విశాఖలోనే ‘వైజాగ్ ఫెస్ట్’ లో భాగంగా ‘పుస్తక మహోత్సవం’ లో వొకసారి కలిసాను. వీక్షణం బుక్ స్టాల్ ముందు కూర్చున్న  ఆయన వద్దకు వెళ్లాను. నేను ఆయనకు జ్ఞాపకంలో లేను. ‘ఆనాటి హోటల్లో శివారెడ్డి గారితో వున్నప్పటి సందర్భం’ – గుర్తుచేసాను. గుర్తు తెచ్చుకున్నారు. ‘ఓహో నువ్వా… ‘ అని వొక చిరునవ్వు నవ్వి నా చేతిని తన చేతుల్లోకి తీసుకున్నారు. మళ్లీ మురిసిపోవడం నా వంతు.

ఆ తర్వాత..

రెండు మూణ్ణెళ్లు పోయాక ఆయన ఇక లేరని వార్త తెలిసింది. జూలై 25, 2015 న విశాఖలో ఆయన ఇంటి వద్ద ఆయన పార్దీవ దేహాన్ని చూడడమే చివరిసారి. ఒక స్వాప్నికుడు – ఒక మానవుడు.. నాకు తెలిసిన కొన్ని నెలలకే భౌతికంగా లేకపోవడం నన్ను చాలా బాధకు లోను చేసింది. వెంటనే ఆయన అంతిమ యాత్రకు వెళ్లటం – నా తీవ్ర కాంక్ష. చాలా ఉద్విగ్నంగా అనిపించింది. మనసులో ఆ ఉద్విగ్నతతోనే విశాఖ బయలుదేరాను. అంతిమ యాత్రకి ముందు – చలసాని ప్రసాద్ గారి ఇంటి వద్దే జరిగిన సభలో వి.వి, కాత్యాయని విద్మహే గారు, వివిధ ప్రజాసంఘాల బాధ్యులు యింకా చాలా మంది చలసాని జ్ఞాపకాలను రుద్ధకంఠంతో పంచుకున్నారు.

సభంతా వొక గంభీర వాతావరణం పరచుకుంది. అలాంటి సభల్లో వుంటేనే నేను వున్నట్టనిపించింది. జీవించినట్టనిపించింది. నిజంగా ప్రాణంతో వున్న మనుషుల మధ్య బతికినట్టనిపించింది. వొక వీరుని మరణం గొప్ప స్ఫూర్తిని ఇస్తుంది. ” నా హృదయం దుఃఖించింది – స్పూర్తిని పొందింది. ” వక్తల మాటల్లో చలసాని గారి ‘ఆ గొప్ప ఆకాంక్ష’ గురించి అప్పుడే విన్నాను. అదే : ” తలుపుల్లేని ఇళ్లు, జైళ్లు లేని దేశం, తరగతి గదులు లేని బడులు ” నిజంగా అది అందరి ఆకాంక్ష కూడా. నేను… అప్పుడు అందరి ముఖాల్లోకి చూసాను. ఎవరి ముఖంలోనైనా కురవడానికి సిద్ధంగా వున్న మేఘాలే కనిపించాయి. ముఖాల అడుగున వున్న తేజోవంతమైన కాంతీ కనిపించింది.

chalasani

అంతిమ యాత్ర మొదలయ్యింది.

రాష్ట్రం నలుమూలల నుంచి తెలిసిన, తెలియని అనేక మంది మనుషులతో నడవడం, ప్రయాణించటం – నా జీవితంలో వొక ఉద్విగ్నపూరిత అనుభవం. విశాఖ రోడ్డు మీద యాత్ర సాగి.. A.U medical institute కి దేహాన్ని అప్పగించటం – చలసాని గారితో అనుబంధం వున్న వొక్కొక్కరు వెళ్లి ఆయన దేహం ముందు భోరున విలపించటం – ఇంక నాలో కంపనం మొదలయ్యింది. వరవరరావు, పాణి, కె. వరలక్షి గారు, అరసవిల్లి కృష్ణ గారు , ప్రసాద వర్మ గారు, కెక్యూబ్ వర్మ గారు, రివేరా, అద్దేపల్లి ప్రభు గారు వొకరా ఇద్దరా అనేకులు అనేకులు. నేను వరవరరావు గారి దగ్గరకు వెళ్లి నిల్చొన్నాను- అంతకు వొకసారి కలిసాను.  నా కవిత్వం చదివానని చెబుతూ..  అనంతమైన ప్రేమ  నిండిన ఆ చేతులతో నన్ను దగ్గరకు తీసుకున్నారు. ఆ చేతులు నాకు అలాగే అనిపించాయి.

ఇక.. ఎనభై యేళ్ల పైబడిన నిర్జీవదేహాన్ని అక్కడ అప్పగించాక.. నాకు దేన్నో వెతుక్కోవాలనిపించింది. వెతుక్కుంటూ వెళ్లాలనిపించింది. సముద్రం గుర్తొచ్చింది. తిన్నగా సముద్రానికే నడిచాను.

సముద్రం , జనం – వొక్కటేనేమో.

జనంలో వున్నప్పుడూ, సముద్రం దగ్గర వున్నప్పుడూ – వొకే అనుభూతి. ఈసారి అనుభూతి – దుఃఖం. రెండింటి దగ్గరా దుఃఖమే. అన్ని అనుభూతులకూ, అనుభవాలకూ వాహిక ‘కవిత్వమే’  అవుతుంది.

 

ఈ కవిత : అప్పుడే – సముద్రం దగ్గరే రాసుకున్నాను.

chalasani1

 

 

కొన్ని ఉద్విగ్నక్షణాల మధ్య..

 

 

మౌనంగా పిడికిళ్లెత్తి

జోహార్లు చెబుతున్న దృశ్యమే కళ్ల ముందు –

ఏ స్వప్నాలు

కెరటాల్లా ఎగిసివస్తున్నాయో

ఏ దుఃఖాలు

లావాలా ఉబికి వస్తున్నాయో

ఆత్మీయులు

భుజం భుజం కలిపి కొత్త వారధిని నిర్మిస్తున్నవాళ్లు

ఏం కాకపోయినా

కన్నీళ్లు కార్చినవాళ్లు

ఎక్కడ నుంచో

పిడికెడు స్థైర్యాన్ని పొందినట్టు

అక్కడికక్కడే కాసింత స్ఫూర్తిని పొందినవాళ్లు

అంతా వొక దగ్గరే

అమరుని దేహం చుట్టూ చేరి

రేపటిని వాగ్దానం చేస్తున్నారు

 

2

 

తీరం వెంబడి నడుస్తున్నాను

వొక దిగులును దిగమింగుకుంటూ

గొంతెత్తి

అమరత్వాన్ని గానం చేస్తున్న

వొక సమూహాన్ని

అలల ఘోషలో పోల్చుకుంటున్నాను

ఇసుకపర్రల మీద

పాదాల గమ్యాన్ని వెతుక్కుంటున్నాను

చుట్టూ

జనసమూహం

సముద్రంతో

తమని తాము విభిన్నరూపాల్లో

వ్యక్తం చేసుకుంటూ…

 

3

 

సముద్రానికా శక్తి ఎక్కడినుంచొస్తుందో…

ఊయలలూపుతుంది

లాలిస్తుంది

అట్నుంచి యిటు

ఇట్నుంచి అటు తోస్తూ

ఈనిన దూడని

నిలబెడుతున్న తల్లి ఆవులా

అచ్చం

విప్లవాగ్నిలా…

 

4

 

వెళ్తూ వెళ్తూ

కొన్ని ఉద్విగ్నక్షణాల్ని

రక్తనాళాల్లోకి ఊదుకుంటున్నాను –

 

( చలసాని గారితో అల్పకాల పరిచయాన్ని తలచుకుంటూ… )

 

 

చలసాని గొంతులో …https://www.youtube.com/watch?v=IfqTbEzYAzo

మీ మాటలు

  1. కె.కె. రామయ్య says:

    ఒక స్వాప్నికుడు – ఒక మానవుడు, విప్లవానికి నిబద్ధుడు చలసాని ప్ర‌సాద్ గారితో తన అనుబంధం, జ్ఞాపకాలను ఉద్వేగభరితంగా పంచుకున్నబాలసుధాకర్ మౌళి గారికి నెనర్లు.

  2. చలసాని గారితో కొంత పరిచయమైనా ఎంతో ఉద్విగ్నంగా మీ భావాలను పంచుకున్నారు. మేము మా చిన్నప్పటినుంచి చూసిన ప్రసాద్ గారి గురించి రాయాలంటే మాటలు రావడం లేదు. అమ్మ కోసం పుస్తకం అందలేదని ఎన్ని వందల సార్లు ఫోన్ చేసారో ,మళ్లీ అందాక అంతే వెంటనే ఆ పుస్తకం గురించిన మాటలు పంచుకున్నారు. ప్రసాద్ గారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయాక నాకు ప్రత్యేకంగా రాసి పంపిన పుస్తకం అందింది. అందిన మరు క్షణమే ప్రసాద్ గారితో ఉన్న కొన్ని జ్ఞాపకాలను పంచుకోవాలనిపించింది. అదీ చెయ్యలేకపోయాను. ఇప్పుడు మీ స్మరణ చూసి కనీసం ఇప్పుడైనా రాయకపోతే అనుకుంటూ మళ్లీ ప్రసాద్ గారిని గుర్తు చేసినందుకు ప్రసాద్ గారికి నివాళులు అర్పిస్తూ రజని

మీ మాటలు

*