కొన్ని మిగిలే ఉంటాయి ..

 

-మహమూద్

~

అర్ధనిమిళిత నేత్రాలతో
ఎడారి తడిని మోస్తూ కొన్ని ఒయాసిస్సులుంటాయి

బయట వెదుకుతూన్న
సముద్రాలేవో లోపల్లోపల సుడులు తిరుగుతూంటాయి

స్పర్శ నావలను
దేహసముద్రం పై వొదిలే
కొన్ని పవన ప్రవాహాలు సాగుతూ ఉంటాయి

ఇంకొన్ని మిగిలే ఉంటాయి

కళ్ళ కొలను నుంచి చూపు నీళ్ళను తోడుకొని
చుట్టు పక్కల
చిలకరిస్తూ ఉండాలి

కళ్ళకి ఇచ్చినట్టు చూపుకి విరామమివ్వకు

ఇంకా కొన్ని మిగిలే ఉంటాయి
జాగురూకత లేకపోతే

ఆకాశ సముద్రం నుంచి
ఉదయపు చేప్పిల్లలు జారిపోతాయి

రాలిన మొగ్గల చోటే
నవీన చిగురులను తొడుక్కుంటూ
ప్రాచీన వృక్షాలు నిలిచి ఉంటాయి

ఆకులు రాలిన రుతుదేహపు ఎండుతనాన్ని తొలచి
పచ్చదనపు ఆఛ్ఛాదన తొడిగే తొలకరి చినుకులు
చిలిపి సయ్యాటలాడతాయి

2

ఏమీ లేదని
అంతా ముగిసిందని
వెనుతిరగడం కాదు
ఒక్కసారి
ఆగి తప్పక చూడాలి

ఏవో కొన్ని మిగిలే ఉంటాయి

మోముల పై పత్రహరితపు చిరునవ్వులతో
ఆకు స్నేహితులు చేతులూపుతుంటాయి
చల్లదనపు వ్యక్తిత్వాన్ని ఆలంబన చేసుకున్న
అడవి ఆత్మీయులు పచ్చబాటను పరిచి ఉంటాయి

నీ పేరు మీద ఎదురుచూపుల రుణాన్ని తీసుకొని
నీవు చేసిన మంచేదో నీకు తిరిగిచ్చేయాలనుకునే నీ పరిసరాలను పసిగట్టాలి నీవు
మంచితనం ఒకసారిస్తే తిరిగి తీసుకునే రుణం కాదని సముదాయించాలి

పూరించాల్సిన ఖాళీలు ఎప్పుడైనా ఉండనే ఉంటాయి

ఆకస్మిక విరమణ కు అల్విదా చెప్పు

****
చివరి శ్వాస
ఆడుతున్నపుడు కూడా
నీ పెదవుల మధ్య
కొన్ని వసంతాలు
కొంత పచ్చదనాన్ని పరచి
నీ పాదాల కాగితం మీద
గడ్డి కలాలతో
నీ మస్తిష్కంలోనే ఉండిపోయిన
కొన్ని భావాలని
కవితలా మలచడం బహుశా మిగిలే ఉంటుంది
3
నువ్వొదులుకున్నావనుకున్న
హస్తాలలో ఇంకొన్ని
మైత్రి వనాల జావళీలు
జారిపోకుండా చూసుకో

సప్తవర్ణాలతో నింపడానికి
ఒక శూన్యం ఎపుడూ ఉండనే
ఉంటుంది.

*

మీ మాటలు

*