ఆరు ముత్యాలున్న అడవి!

 

-భవాని ఫణి

~

wild tales1

రోడ్డు మీద మన మానాన మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరో తెలీని వ్యక్తి వచ్చి మనల్ని తీవ్ర పదజాలంతో దూషిస్తేనో లేక అవమానిస్తేనో మనమేం చేస్తాం?. ఈ ప్రశ్నకి ఒక్కటే సమాధానం ఉండదు. ఎవరికి వారు, వారి వారి పరిణితిని బట్టీ, విజ్ఞతని బట్టీ, ధైర్యాన్ని బట్టీ, అవకాశాన్ని బట్టీ,పరిస్థితుల్ని బట్టీ విభిన్నంగా స్పందిస్తారు. మనుషులందరిలో ఉండే భావోద్వేగాలు ఒకే విధమైనవి అయినప్పటికీ, వారవి ప్రదర్శించే స్థాయిలో మాత్రం హెచ్చు తగ్గులు తప్పనిసరిగా ఉంటాయి. నిజానికి కాస్తంత వివేకమో, భయమో ఆపలేనప్పుడు, పగా ప్రతీకారాలు మనిషిచేత ఎటువంటి నీచ కార్యాలనైనా చేయించగలవు. ఎంతటి అధమ స్థాయికైనా దిగజార్చగలవు. విచక్షణని కోల్పోయేలా చేసి, అతని స్వంత గౌరవాన్నీ, మర్యాదనీ, ధనాన్నీ, ప్రాణాన్నీ కూడా పణంగా పెట్టించగలవు. చివరికి అతడిలోని పశు ప్రవృత్తిని వెలికి తీయగలవు.
అటువంటి పగనీ, ప్రతీకారాన్నీ కథా వస్తువుగా తీసుకుని మనిషిలోని సహనపు స్థాయిని ఒక విభిన్నమైన కోణంలోనుండి సమీక్షించి నిర్మించిన బ్లాక్ కామెడీ చలన చిత్రం “వైల్డ్ టేల్స్” (Spanish: Relatos salvajes). 2014 లో విడుదలైన ఈ ‘అర్జంటైన్ – స్పానిష్’ సినిమా, అర్జెంటీనా సినిమా చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది.  2015 ఫారిన్ లాగ్వేజ్ ఆస్కార్ కి నామినేట్ చేయబడింది కూడా . పోలిష్ సినిమా “ఇదా”తో పోటీపడి గెలవలేకపోయినా ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల అభిమానాన్నీ చూరగొంది.
wild-tales-2
ఆరు భాగాలు గల ఈ యాంథాలజీ చలన చిత్రపు మొట్టమొదటి కథ “Pasternak”. ఒక విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణీకులంతా, తామందరూ ఒక సారూప్యతని కలిగి ఉండటాన్ని గమనిస్తారు. వీరంతా ఏదో ఒక సమయంలోనో, సందర్భంలోనో Pasternak అనే వ్యక్తిని మోసంచెయ్యడమో, ఇబ్బందికి గురి చెయ్యడమో చేసిన వారే. Pasternak ఆ విమానానికి కేబిన్ చీఫ్ అనీ, వారంతా ఒకే విమానంలో ప్రయాణించడం యాదృచ్ఛికం కాదని వారు గుర్తించేలోపుగానే ఆ విమానం నేలకూలిపోతుంది. ఇక్కడ ఈ కథ ద్వారా చెప్పదలుచుకున్నది ఏమిటంటే, ఎంత చిన్న విషయంలోనైనా అన్యాయానికి గురికావడమనేది మనిషిని తీవ్రంగా బాధిస్తుంది. కొందరు కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకుని వదలిస్తే, మరి కొందరు తిరుగుబాటు బాట పడతారు. రెండూ చెయ్యలేక పదే పదే అన్యాయానికి, అసమానత్వానికీ బలవుతున్నానని ఒక వ్యక్తి భావించినప్పుడు, అతను తీవ్రమైన మానసిక సంఘర్షణకి లోనై చివరికి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుని, తనకి తోచిన రీతిలో న్యాయాన్ని పొందే ప్రయత్నం చేస్తాడు.  “Pasternak”,అందుకు సరైన ఉదాహరణ.
 రెండో కథలో, లేట్ నైట్ కావడం వల్ల నిర్మానుష్యంగా ఉన్న ఒక హోటల్ కి ఒక వ్యక్తి రావడం, అక్కడ పని చేసే ఒకమ్మాయి అతన్ని, తన తండ్రి చావుకు కారకుడిగా గుర్తించడం, తన బాధని తనతో పాటుగా పని చేసే ఒక ముసలి వంటామెతో పంచుకోవడం, ఆ  ముసలామె ఈ  అమ్మాయి అడ్డు చెబుతున్నా వినకుండా  ఆ వ్యక్తిని చంపెయ్యడం జరుగుతుంది. ఇక్కడ ముసలామె, అమ్మాయి ప్రతీకారాన్ని తనదిగా భావించి ముక్కూ మొహం తెలీని వ్యక్తిని పొడిచి చంపేస్తుంది. ఇందుకు కారణమేమిటా అని ఆలోచిస్తే, ఒకప్పుడు ఆమె ఎదుర్కొన్న అన్యాయానికి  ఈ విధంగా న్యాయం పొందినట్టుగా భావించి ఉండవచ్చని అనుకోవచ్చు. లేదా తన సహోద్యోగిని బాధ ఆమెని అంతగా కదిలించి అయినా  ఉండవచ్చు. లేదంటే ఆమెలోని హింసాత్మక ప్రవృత్తి అటువంటి సందర్భం కోసం వెతుక్కుంటూ ఉండి కూడా ఉండవచ్చు. మొత్తానికి ఈ కథ వేరొకరి పగకి ప్రతీకారం తీర్చుకోవడమనే అంశాన్ని గురించి చర్చిస్తుంది. ఈ కథ పేరు “The Rats”.
ఇక మూడవ కథ “The Strongest” తాత్కాలికమైన చిన్నపాటి రోడ్ రేజ్ సంఘటన కలిగించే కసీ, ద్వేషానికి సంబంధించినది.  కారుకి దారివ్వని కారణంగా రోడ్డు మీద మొదలైన చిన్న గొడవ ఇద్దరు వ్యక్తుల్ని ద్వేషంతో రగిలిపోయేలా చేసి, చివరికి ఇద్దర్నీ కాల్చి బూడిద చేస్తుంది. తాత్కాలికమైన ఆవేశం, తర్వాత కలిగే కష్టనష్టాల గురించి కూడా ఆలోచించనివ్వనంతగా విచక్షణని పోగొడితే ఏం జరుగుతుందో తెలియజేస్తుందీ కథ.
పాలక వ్యవస్థలో గల లోటుపాట్లూ, అది చూపే నిర్లక్ష్యం కారణంగా సామాన్య ప్రజానీకంలో ఏర్పడే అసహనం, అసంతృప్తుల యొక్క  తీవ్ర రూపాన్ని అతిశయంగా చూపిస్తుంది నాలుగో కథ “Little Bomb”. పార్క్ చెయ్యకూడని స్థలమని స్పష్టమైన సూచనల్లేని ప్రదేశాలనించి, తన కార్ ని మాటి మాటికీ తీసుకెళ్లి జరిమానా వేస్తున్న నిర్లక్ష్యపు వ్యవస్థపై కోపంతో,
అసంతృప్తితో Simón Fischer అనే వ్యక్తి, ఒక గవర్నమెంట్ ఆఫీస్ ని బాంబ్ తో పేల్చేస్తాడు. ఈ కథలో మాత్రం సమాజంలో కదలిక ఏర్పడినట్టుగా, Simón న్యాయాన్ని పొందే దిశగా అడుగు వేస్తున్నట్టుగా  అనిపించే విధంగా ఉంటుంది ముగింపు. మొదటి మూడూ పూర్తి స్థాయి హింసాత్మక ప్రతీకారానికి చెందిన కథలైతే, ఇది మాత్రం చైతన్యంతో కూడిన హింసగా దర్శకుడు అభిప్రాయపడ్డట్టుగా కనిపిస్తుంది.
ఒక్కోసారి మన వల్ల ఎదుటివారికి అన్యాయం జరుగుతున్నప్పుడు కూడా, అది మనకి జరుగుతున్న అన్యాయంగా ఊహించుకుని, ఎదుటి వ్యక్తికి కూడా అటువంటి అభిప్రాయాన్నే కలిగించగలిగితే ఎలా ఉంటుందన్నది ఐదో కథ “The Proposal”. తన కుమారుడు చేసిన ఒక కార్ యాక్సిడెంట్ నేరాన్ని తనపై వేసుకునేందుకు తోటమాలిని ఒప్పిస్తాడు ధనికుడైన ఒక వ్యక్తి. కానీ ఒప్పందం సమయంలో లాయరు, ప్రాసిక్యూటరు, తోటమాలీ డబ్బు విషయంలో తనని మోసం చేస్తున్నారని భావించి, వారికి కూడా అదే అభిప్రాయాన్ని కలిగించి చివరికి
తనకి కావలసిన విధంగా ఒప్పందాన్ని కుదుర్చుకుంటాడతను. అంతా అతనికి అనుకూలంగా జరిగిపోబట్టి సరిపోయింది కానీ ఆ ఒప్పందం కుదరకపోతే తన కన్నబిడ్డని పోగొట్టుకోవాల్సి వస్తుందన్న నిజాన్ని, అతను తన కోపానికి పణంగా పెడతాడు.
కొత్తగా పెళ్లైన ఒకమ్మాయి, తను ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి వేరే అమ్మాయితో శారీరక సంబంధం ఉందన్న విషయాన్ని తెలుసుకుని తట్టుకోలేకపోతుంది. ఆ కోపంలో, ఆవేశంలో ఆమె తీవ్రమైన దుఃఖానికి లోనై, తన సహజమైన మృదుత్వాన్నీ, సామాజిక లక్షణాన్నీ కోల్పోతుంది. తత్ఫలితంగా తీవ్రమైన విశృంఖలత్వాన్నీ, హింసాత్మక ధోరణినీ ప్రదర్శించి తన పెళ్లి పార్టీలోనే విధ్వంసాన్ని సృష్టిస్తుంది. చివరికి భర్త చొరవతో స్పృహలోకి వచ్చి సర్దుబాటు చేసుకుంటుంది. ఈ కథ బ్లాక్ కామెడీ అన్న పదానికి పూర్తి న్యాయాన్ని చేకూరుస్తుంది. అమ్మాయి రోమినా ప్రదర్శించే ‘గాలొస్ హ్యూమర్’ చాలా అసహజమైందే అయినప్పటికీ,  నవ్వడానికి కూడా మనస్కరించనంతగా మనల్ని తనలో లీనం చేసుకుంటుంది. ఇది ఈ యాంథాలాజీ సినిమా కథల్లోని ఆఖరి కథ “Till Death Do Us Part”. రోమినాగా నటించిన ‘ఎరికా రివాస్’ అద్భుతమైన నటనా చాతుర్యాన్ని ప్రదర్శించింది.
ఈ కథలన్నిటినీ కలిపే చక్కని సంగీతం, ‘ఇది ఒక కామెడీ సినిమా సుమా’ అని చెప్పే ప్రయత్నం చేసినా, ఆలోచింపచేసే థ్రిల్లర్స్ గానే మనం వీటిని స్వీకరిస్తాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే “అన్యాయాన్ని ఎదిరించగలిగినప్పుడు కలిగే ఆనందానికి చిరునామా”గా ఈ చలన చిత్రాన్ని అభివర్ణిసాడు దర్శకుడు Damián Szifron.
*

మీ మాటలు

  1. రమణమూర్తి says:

    మీ పరిచయం బాగుంది.

    ఈ సినిమా చూసి ఓ సంవత్సరం పైనే అయింది. అన్ని కథలూ విడివిడిగా బానే ఉన్నా – సినిమా అంతా చూసాక, వాటిమధ్య చెప్పుకోవాల్సినంత లింక్ లేదేమో అని మాత్రం అప్పట్లో అనిపించింది!

    • Bhavani Phani says:

      మీరన్నది నిజమే sir , దర్శకుడు పన్నెండు కథల్ని వేరు వేరుగా రాసుకుని వాటి మధ్యన లింక్ ఉందని గమనించి, అందులో ఆరు కథల్ని సెలెక్ట్ చేసుకుని ఈ సినిమా తీసారట. కాబట్టి లింక్ కోసం వెతుక్కోవాల్సి వచ్చిన మాట వాస్తవం. మీ స్పందనకు ధన్యవాదాలు .

  2. Suparna mahi says:

    అద్భుతమైన రివ్యూ…. చదవగానే చూడాలనిపించేంత గొప్పగా రాశారు….
    టూ గుడ్…& థాంక్యూ…

మీ మాటలు

*