తెలుగు వాడి బావుటా !

 

సూర్య-కుమారి-గూటాల-గారు

లండన్ లో తెలుగు భాషా, సాహిత్యాలు అనగానే అందరికీ గుర్తుకు వచ్చే పేరు గూటాల కృష్ణ మూర్తి గారే! 88 ఏళ్ల వయసులో గత వారం విశాఖపట్నంలో జూలై 13, 2016 నాడు పరమపదించారు అన్న వార్త ఎంతో విచారం కలిగించింది. ఆయనతో నేను గడిపిన మధుర స్మృతులు మననం చేసుకుంటూ ఆయన ఈ ఆత్మీయ నివాళి సమర్పిస్తున్నాను.

అది 1980 వ సంవత్సరంలోమంచి రోజున మా మహాకవి శ్రీశ్రీ గారి కవితలని అప్పుడే హ్యూస్టన్ లో అడుగుపెట్టిన మంచి గాయని చంద్రకాంత చేత పాడించి ఓ గ్రామఫోన్ రికార్డు చేస్తే ఎలా ఉంటుందీ అనే ఆలోచన దువ్వూరి అనంత అచ్యుత నారాయణ రావు గారు అనే మా ఊరి పెద్దాయన కి వచ్చి నన్ను సంప్రదించి దానికి మహాకవి శ్రీశ్రీ గారి అనుమతి సంపాదించే బాధ్యత నా మీద  పెట్టారు. శ్రీశ్రీ గారికి ఫోన్ చేసే ధైర్యమూ, ఆ నాటి ఇండియా ఫోన్ కాల్ కి అయ్యే వంద డాలర్లు డబ్బూ నా దగ్గర లేక నేను వెంటనే శ్రీశ్రీ గారి మద్రాసు చిరునామాకి భయం, భయంగానే ఉత్తరం వ్రాశాను.  ఆయన దగ్గర నుంచి రెండు నెలలు అయినా సమాధానం రాకపోతే “గొప్ప వాళ్ళతో అంతేలే” అనుకుని ఆశ వదిలేసుకుంటూ ఉండగా లండన్ నుంచి ఓ ఉత్తరం వచ్చింది. ‘మనకి లండన్ లో ఎవరూ తెలీదే’ అని ఆశ్చర్యంగా ఆ ఎయిరోగ్రాం ఉత్తరం తెరిచి చూస్తే అది శ్రీశ్రీ గారి నుంచే! ఆయన ప్రస్తుతం లండన్ లో గూటాల కృష్ణ మూర్తి గారి ఇంట్లో ఐదారు నెలలు గా ఉన్నట్టూ , నా మద్రాసు చిరునామా ఉత్తరం ఆయనకి బట్వాడా చేయగా అందినట్టూ, చంద్రకాంత చేత పాడించడానికి అభ్యంతరం లేదు అనీ, తను అమెరికా వచ్చి దాన్ని ఆవిష్కరించే అవకాశం ఉందా అని అడగడం ఆ ఉత్తరంలో సారాంశం.

EPSON MFP image

ఆ విధంగా నాకు గూటాల గారితో పరోక్షంగా పరిచయం అయింది. ఆ సమయంలో గూటాల గారు ఒక తెలుగు వాడు కనీ వినని ఒక మహత్తరమైన కార్య సాధనలో ఉన్నారు. తెలుగు సాహిత్య చరిత్రలో మొదటి సారిగా ఒక కవి స్వదస్తురీతో, ఆ కవితని ప్రతిబింబించే ఉన్నత స్థాయి బొమ్మలతో సహా పుస్తక రూపంలో ముద్రించి దానికి అనుబంధంగా ఆ కవి స్వయంగా చదివిన ఆ కవిత ని ఆడియో కేసెట్ గా అనీ కలిపి ఒక అపురూపమైన కానుకగా రూపొందించడమే ఆ మహత్కార్యం.  గూటాల గారు ఎన్నుకున్న కవి మహాకవి శ్రీశ్రీ . ఆ కవిత మహా ప్రస్థానం. ఆ చిత్రకారుడు బాపు. వారిద్దరినీ,శ్రీశ్రీ గారి సతీమణి సరోజ గారినీ, తోడుగా పురిపండా అప్పల స్వామి గారినీ ఆయన లండన్ ఆహ్వానించారు. ఈ బృహత్ కార్యం తలపెట్టడానికి మరొక ప్రధాన కారణం ఆ మహా ప్రస్థానాన్ని అత్యున్నత స్థాయి ప్రచురణని పరిశీలనకి పంపించి తద్వారా మహాకవి శ్రీశ్రీ గారికి నోబెల్ బహుమానానికి ప్రయత్నం చెయ్యడం. ఆయన ప్రణాళిక ప్రకారం శ్రీశ్రీ గారు సతీ సమేతంగా లండన్ లో గూటాల గారి ఇంట్లో ఆరు నెలలు ఉన్నారు. ఆయన ఆశయాలకి అనుగుణంగా బాపు గారు ఎంతో స్ఫూర్తితో వేసిన నాలుగే నాలుగు అద్భుతమైన బొమ్మలతో “మహా ప్రస్థానం” ఆడియో కేసెట్ తో సహా 1981 లో ప్రచురించబడింది. అమెరికాలో ఆ పుస్తకాన్ని కిడాంబి రఘునాథ్ గారు పంపిణీ చేశారు. కేవలం 100  కాపీలు మాత్రమే ముద్రించబడిన ఆ అపురూపమైన పుస్తకం 90 వ కాపీని నాకు గూటాల గారు స్వయంగా నా కోరిక మీద హ్యూస్టన్ వచ్చి నాకు బహూకరించారు. నా అదృష్టానికీ, ఆయన ఔదార్యానికీ ఇంత కంటే నిదర్శనం   ఏం కావాలీ?

ఆయన మా ఇంట్లో ఉన్న వారం రోజులూ మా ఆవిడ గిరిజ మీద ఎంతో అభిమానం పెంచుకున్నారు. ఇద్దరిదీ విశాఖ పట్నమే కదా! వాళ్ళ ‘యాస’ లో హాయిగా మాట్లాడుకునే వారు. పైగా శ్రీశ్రీ గారూ అక్కడి వారే. గూటాల గారు రాక ముందే శ్రీశ్రీ గారు అమెరికా రావడం, హ్యూస్టన్ లో ఆయన స్వహస్తాలతో సిప్రాలి రాయడం జరిగింది. కానీ గూటాల గారి ‘మహా ప్రస్థానం’ వెనక నోబెల్ బహుమానం ఆసక్తి ఉంది కాబట్టి గూటాల గారు ఆ సంగతులు కొన్ని నాతో పంచుకున్నారు. ఉదాహరణకి శ్రీశ్రీ గారికి నోబెల్ బహుమానానికి అంతకు ముందు ఆ బహుమానం అందుకున్న రచయితలో, ఇతర అర్హతలు ఉన్న వారు మాత్రమే ఆయన పేరు, కవిత సూచించాలి అనే నిబంధన ఉందిట. అందుకని గూటాల గారు శ్రీశ్రీ గారిని ప్రొఫెసర్ బట్లర్  ఇంటికి తీసుకెళ్లారుట. లోపల డ్రాయింగ్ రూమ్ లో కూచున్నాక బట్లర్ గారు ఇప్పుడే వస్తాను అని లోపలికి వెళ్ళారుట. అక్కడ బల్ల మీద ఉన్న లండన్ టైమ్స్ పేపర్లో సగం పూర్తి చేసి ఉన్న క్రాస్ వర్డ్ పజిల్ శ్రీశ్రీ గారు చూసి, అది తీసుకుని పూర్తి చేశారుట. ఈ లోగా బట్లర్ గారు వెనక్కి వచ్చి ఆ పూర్తి చేసిన క్రాస్ వర్డ్ పజిల్ చూసి గుండెలు బాదుకుని ‘అయ్య బాబోయ్, నేను పొద్దున్న ఆరు గంటల నుంచీ తంటాలు పడుతున్నాను. మీరు ఎలా చెయ్య గలిగారూ?” అని ఆశ్చర్య పోయారుట. మరి శ్రీశ్రీ గారి మహా ప్రస్థానాన్ని నోబెల్ ప్రైజ్ కి పంపించే ఉంటారు కదా!

EPSON MFP image

తెలుగు కవిత తో పాటు ఇంగ్లీషులోకి ఒరిజినల్ తర్జుమా కూడా పంపించినా, ఈ వార్త తెలుసుకున్న కొందరు తెలుగు ప్రముఖులు తమ అనువాదాలు కూడా పంపించి అవే ఒరిజినల్ అని చిన్న వివాదం సృష్టించి మహా ప్రస్థానానికి లేకుండా పుణ్యం కట్టుకున్నారూ అని  కానీ తరువాత తెలిసిన వార్త. ఇక్కడ విశేషం ఏమిటంటే గూటాల గారూ, శ్రీశ్రీ గారూ కూడా ఇది ఎక్కువగా  పట్టించుకున్నట్టు లేదు. ఆ రోజుల్లో గూటాల గారితోటీ, శ్రీశ్రీ గారితోటీ కాస్తో, కూస్తో నేను సన్నిహితంగా ఉండే వాణ్ని కాబట్టి ఈ మాట  చెప్పగలుగుతున్నాను.  ఆనాటి మహాప్రస్థానం పుస్తకానికి బాపు గారు ఎంతో అరుదుగా -ముళ్ళపూడి వెంకట రమణ గారితో కలిసి కాకుండా – తనంత తనే వ్రాసిన ముందు మాట, అప్పుడు వేసిన బొమ్మలు ఇందుతో జతపరుస్తున్నాను.

ఇంతకీ గూటాల గారికి ఇంత ఆసక్తికి కారణం ఆయనకి ఆంగ్ల సాహిత్యం మీద ఇంగ్లీషు వారికి కూడా లేని పాండిత్యం ఉండడం. ఆయన జీవిత చరిత్ర చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన 1928 లో పర్లాకిమిడిలో పుట్టారు. చిన్న తనంలోనే తండ్రిని పోగొట్టుకున్నారు. మధ్య ప్రదేశ్ లోనూ, విజయనగరం లోనూ పెరిగి, విశాఖ పట్నం ఎవి ఎన్ కాలేజ్ లో రోజులలోనే ఆయన లోక్ నాయక్ జయ ప్రకాష్ నారాయణ్ ప్రభావానికి లోనై చదువులలో వెనకబడ్డా, 1955 లో ఆంధ్రా యూనివర్సిటీ లో ఇంగ్లీష్ లిటరేచర్  ఆనర్స్ పూర్తి చేశారు. ఆ తరువాత అమలాపురం లోనూ, మధ్య ప్రదేశ్ లో బిలాస్ పూర్ లోనూ ఆంగ్ల ఉపాధ్యాయులు గా పని చేశారు. సాగర్ విశ్వవిద్యాలయంలో పరిశోధకుడిగా ఉండి, 1962 లో  కేవలం గుమాస్తా ఉద్యోగం కోసం  లండన్ వెళ్ళిన గూటాల గారు అక్కడే 1967 లో డాక్టరేట్ చేశారు. తరువాత ఇన్నర్ లండన్ ఎడ్యుకేషన్ అథారిటీ సర్వీసులో చాలా విద్యాలయాలలో అధ్యాపకులు గా పని చేశారు.  విద్యావంతురాలైన వెంకట రమణ గారిని వివాహం చేసుకున్నారు. ఆ దంపతులకి ఇద్దరు మగ పిల్లలు, ఒక అమ్మాయి ఉన్నారు.

EPSON MFP image

బాపు రేఖల్లో సూర్యకుమారి

ఈ జీవిత వివరాలు సాధారణంగానే కనపడవచ్సును కానీ ఆయన ఆంగ్ల సాహిత్యంలో 1890 వ దశకాన్ని ఔపోసన పట్టి ఆ విక్టోరియన్ దశకంలో వచ్చిన రచనల మీద విస్తృతమైన పరిశోధనలని చేసి ఆంగ్ల సాహిత్యంలో సుస్థిర స్థానం కలిగించారు. అలనాడు CP బ్రౌన్ వేమన కవిత్వాన్ని వెలుగులోకి తీసుకు వచ్చినట్టుగా ఫ్రాన్సిస్ థామ్సన్ కవిత్వానికి  గూటాల గారు ప్రాచుర్యం కలిగించారు. ఆయన సంస్థాపించి దశాబ్దాల పాటు నిర్వహించిన ఫ్రాన్సిస్ థామ్సన్ లిటరరీ సొసైటీ, ద 1890 సొసైటీ లు యావత్ ఆంగ్ల సాహిత్య ప్రపంచానికి ఆదర్శ ప్రాయాలుగా నిలిచాయి.  1890 దశకం లో పురి విప్పుకున్న ఫ్రాన్సిస్ థామ్సన్, రస్సెల్, టి.ఎస్. ఎలియట్, బెర్నార్డ్ షా, సోమర్సెట్ మామ్ మొదలైన వారి సమగ్ర  రచనలని, వారి జీవిత విశేషాలని ఆయన సేకరించి తన లైబ్రరీ లో పొందు పరిచారు. ఆయన నిర్వహించే ఆంగ్ల సాహిత్య సభలలో  తెలుగు కవులైన ఆరుద్ర, తిలక్ మొదలైన వారి కవిత్వాన్ని అంగ్ల కవులకి పరిచయం చేసే వారు. ఈ నాడు తెలుగు భాషని ప్రపంచ భాషగా చేసి పారేద్దామని మన వంటింట్లోనే సభలు నిర్వహించుకుంటూ జబ్బలు చరుచుకునే వారికి గూటాల వారి అలనాటి ప్రయత్నాలు కనువిప్పు కలిగించాలి కానీ గుడ్డి వాడికి లోకమంతా చీకటే కదా!

గూటాల గారి జీవితంలో అత్యంత ఆశ్చర్యకరం, ఆచరణలో మామూలు వారికి అసాధ్యం అయినది ఆయన స్వయానా ఆచరించి చూపించే గాంధేయ వాదం. నమ్మండి, నమ్మకపొండి….ప్రతీ ఏడాది అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు, అలాగే జనవరి 30 గాంధీ వర్థంతి నాడు ఉదయం 10 గంటల నుంచీసాయంత్రం ఐదు గంటల వరకూ లండన్ లోని టావిస్టాక్ స్క్వేర్ లో ఉన్న మహాత్ముడి విగ్రహం దగ్గర కూర్చుని చరఖా తిప్పుతూ నూలు వాడికే వారు. ఇలా ఎన్నేళ్ళు చేశారో నాకు తెలీదు కానీ  అసలు భారత దేశం లోనే అందరూ మర్చిపోయిన మహాత్ముడి దివ్య  స్మృతులని   పరాయి దేశం లో ఎవరైనా, ఎక్కడైనా ఈ విధంగా మననం చేసుకుని ఆచరించే వారు ఇంకెవరైనా ఉన్నారేమో నాకు తెలీదు.

1982 లో గూటాల గారు హ్యూస్టన్ వచ్చాక, మా పరిచయం ఇరవై ఏళ్లకి పైగా ఉత్తరాల ద్వారానే జరిగింది. ఆయన చాలా చిన్న, చిన్న  ఉత్తరాలు ఎంతో ఆర్టిస్టిక్ గా వ్రాసీ వారు. ;ఇంత బాగా ఎలా రాస్తారు, గురువు గారూ ?’ అని అడిగితే ‘ఆ రోగం బాపు దగ్గర నుంచి అంటింది’ అన్నారు నవ్వుతూ. వారిద్దరికీ ఉన్న అనుబంధం మాటలకి అందనిది. నేను 2005 లో అని జ్ఞాపకం – ఓ సారి బాపు గారి ఇంటికి మద్రాసు వెళ్ళినప్పుడు ఆయన ‘జికే’ గారి గురించి మాట్లాడి నాకు పరిచయం చేశారు. అన్నట్టు, జికే అనేది గూటాల గారి కలం పేరు. ఆ కలం పేరుతో ఆయన కథలూ, వ్యాసాలూ వ్రాసే వారు. జుబ్బా లేని అబ్బాయి, భాజ గోవిందం, కుకునం (వంట చెయ్యడం), క్లిననం (గిన్నెలు కడగడం), కననం (పిల్లల్ని కనడం) మొదలైనవి ఆయన రచనల్లో కొన్ని.  గూటాల గారు “ఋషి పుంగవుడు” “కర్మ యోగి” అన్న  అన్న బాపు గారి మా మాటలు  తర్వాత సంవత్సరం ఒక అతిముఖ్యమైన పని మీద లండన్ లో గూటాల గారి ఇంట్లో వారం రోజులు ఉన్నప్పుడు ప్రత్యక్షంగా అనుభవం లోకి వచ్చింది.

EPSON MFP image

మా ఇద్దరినీ మరింత దగ్గరగా కలిపినది టంగుటూరి సూర్య కుమారి….ఆయనా, చాలా మంది దగ్గర వాళ్ళు పిలుచుకునే పేరు ‘సూర్య’. టంగుటూరి సూర్య కుమారి పేరు వినని వారు, ఆవిడ పాడిన శంకరంబాడి సుందరాచారి గారి ‘మా తెలుగు తల్లికీ మల్లె పూ దండ’ వినని, పాడని, పాడించని తెలుగు వారు ఉండరు. నేను ఆవిడని ఒక్క సారే చూశాను- ఆవిడ హ్యూస్టన్ వచ్చినప్పుడు. కానీ ఆవిడ మద్రాసులో కళా కారిణి గా ఎదుగుతున్న తొలి రోజులలో మా చిన్నన్నయ్య బాగా సన్నిహితుడు..– అనగా 1957 లో టాగూర్  వ్రాసిన ‘చిత్ర’ అనే చిన్న నాటకాన్ని తన పాటలతో ‘చిత్రార్జున’ అనే ఒక పెద్ద డాన్స్ డ్రామా గా రూపొందిస్తున్న రోజుల్లో దానికి దర్శకులు సింగీతం శ్రీని వాస రావు అయితే మా చిన్నన్నయ్య ప్రభాకర మూర్తి రాజు, నటుడు విజయ చందర్ అసిస్టెంట్ దర్శకులు. సూర్య కుమారి లండన్ లో స్థిరపడి 1973 లో హెరాల్డ్ ఎల్విన్ ని వివాహం చేసుకుని , కళాకారిణి గా అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చుకుని ఏప్రిల్ 25, 2005 న పరమపదించారు.

ఎలిజబెత్ మహారాణి తో 1968 లో ఒక సారి, 1972 లో రెండో సారి కరచాలనం చేసి , జూలై 11, 1972 నాడు బకింగ్ హం పేలస్ మధ్యాహ్న విందు భోజనం అంకితం చెయ్యబడిన ఏకైక తెలుగు …ఆ మాట కొస్తే భారతీయ కళాకారిణి టంగుటూరి సూర్య కుమారి—జికె గారికి ‘సూర్య’ గా ఆత్మీయురాలు. సంతానం లేని సూర్య కుమారి అంత్యక్రియలు గూటాల గారే నిర్వహించారు. సూర్య మరణం తరువాత ఆమె జీవిత సమగ్రంగా ఒక అద్వితీయమైన గ్రంధంలో నిక్షేపించాలి అని గూటాల గారు తలపెట్టారు. ఇలాంటివి ప్రభుత్వాలు, విశ్వ విద్యాలయాలు, పెద్ద సంస్థలూ చెయ్య వలసిన ఇటువంటి పనిని వాటి వాటి దౌర్భాగ్యానికే వదిలేసి, గూటాల గారు ఏక వ్యక్తి సంస్థ గా ఈ బృహత్ కార్యాన్ని తలకెత్తుకున్నారు. దానికి బాపు గారు కొమ్ము కాశారు. అమెరికాకి సంబంధించి సూర్య జీవిత విశేషాలు సంపాదించే గురుతర బాధ్యత ‘బాపు’ గారి సలహా మీద నాకు అప్పగించారు గూటాల గారు. “మీ గురించి బాపు గారు చాలా చెప్పారు” అన్నారు ఉపోద్ఘాతంగా ఆ ఫోన్ కాల్ చేసినప్పుడు. “నా గురించి ఆయన ఏం చెప్పారో కానీ, మీ గురించి నాకు చాలానే చెప్పారు. భలే భయం వేసింది’ అన్నాను సమాధానంగా…

మొత్తానికి 2005 లో ఆమెరికాలో సూర్య కుమారి జీవితం గురించి ఆయన సేకరించిన వివరాలు నాతొ పంచుకుని నేను చెయ్య వలసిన పనులు స్పష్టంగా ఆయన ‘విజన్’ నాకు అర్థం అయ్యేలా చెప్పారు. ఆ ప్రయత్నంలో నాకు పున:పరిచయం అయిన వారు సూర్య పిన్ని కుమార్తె, ఆమె ఇండియా రోజులలో ఇంచు మించు పెర్సనల్ సెక్రటరీ గా అన్ని వ్యవహారాలూ చూసుకునే ఇవటూరి అనసూయ గారు (బొకా రేటన్) ఒకరు. వైజాగ్ లో 1960 దశకం లో నేను ఇవటూరి అనసూయ గారింటికి వెళ్ళే వాడిని. గూటాల గారి ద్వారా మళ్ళీ మాట్లాడే అవకాశం వచ్చి. ఫ్లారిడా లో ఉన్న ఆవిడ వృద్దాప్యంలో ఇంట్లో సహాయానికి ఇండియా నుంచి వచ్చి రెండేళ్ళు ఉండడానికి ఒక నర్సుని ఇక్కడికి రప్పించడానికి నేను సహాయం చేశాను. అనసూయ గారితో మూడు వారాల క్రితం నేను మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడుతూ బాగానే ఉన్నారు కానీ ఆ తరువాత కొద్ది రోజులలో ఆవిడ అనారోగ్యంతో పరమపదించడం ఎంతో విచారకరం.

EPSON MFP image

గూటాల గారి సూచన మీద అప్పుడు హ్యూస్టన్ లో ఉండే దేవగుప్తాపు శేష గిరి రావు గారినీ, తదితరులనీ మొత్తం అమెరికాలో ‘వెతికి’ పట్టుకుని, వారి చేత సూర్య కుమారి మీద వ్యాసాలు వ్రాయించ గలిగాను. ఇంకా అనేక పద్దతులలో సూర్య కుమారి అమెరికా ఫోటోలు సంపాదించ గలిగాను. ఉదాహరణకి న్యూయార్క్ లో సూర్య కుమారి నివసించిన అపార్ట్ మెంట్ ఫోటో కి మిత్రులు కలశపూడి శ్రీని వాస రావు గారిని కోరితే ఆయన శ్రమ పడి అక్కడికి వెళ్లి ఆ రోడ్డు జంక్షన్ తో సహా ఫోటోలు తీసి పంపించారు. ఈ సమాచారం అంతా పట్టుకుని నేను 2006 లో లండన్ వెళ్లాను. ఎప్పుడో 1982 లో కలుసుకున్న తరువాత , ఫోన్ లో చాలా సార్లు మాట్లాడుకున్నా అప్పటికే 75 ఏళ్లు దాటిన గూటాల గారి ఆరోగ్య పరిస్థితి కానీ, మరే విధమైన వ్యక్తిగత వివరాలు కానీ నాకు తెలియవు. కేవలం సూర్య కుమారి పుస్తకానికి నేను సేకరించిన వ్యాసాలూ. ఫోటోలు తీసుకెళ్ళి ఆ పుస్తకం రూప కల్పన మీద పనిచెయ్యడం కోసమే నా లండన్ ప్రయాణం. అప్పటికే ఆ  పుస్తకం ఆయన నడిపే విదేశాంద్ర ప్రచురణలు, వీలుంటే వంగూరి ఫొండేషన్ ఆఫ్ అమెరికా తో సంయుక్తంగానూ ప్రచురిస్తే బావుంటుంది అనీ అనుకున్నాం. ఆ విషయాలు కూడా వ్యక్తిగతంగా మాట్లాడుకుంటే బావుంటుంది కదా అని కూడా మా ఇద్దరి ఉద్దేశ్యం. లండన్ లో వారం ఉండి అక్కడి నుంచి నేను ఇండియా ప్రయాణం పెట్టుకున్నాను.

నేను అనుకున్నట్టుగా గూటాల గారు కానీ, మరెవరూ కానీ లండన్ ఎయిర్ పోర్ట్ కి రాలేదు. నేను లండన్ వెళ్ళడం అదే మొదటి సారి. ఎలాగో అలాగా కష్ట పడి, భారీ సూట్ కేసులతో లండన్ ‘ట్యూబ్’ ..అంటే అండర్ గ్రౌండ్ రైళ్ళు పట్టుకుని,  తర్వాత లండన్ కేబ్ పట్టుకుని మొత్తానికి బర్టన్ రోడ్ మీద ఉండే గూటాల గారి ఇంటికి వెళ్లి తలుపుకొట్టాను. అది ఒక టౌన్ హోమ్ …అంటే మూడు అంతస్తులలో ఎపార్ట్ మెంట్ లా ఉండే చాలా ఇళ్ళు ఒకే బిల్డింగ్ లో వరసగా ఉంటాయి. అప్పటికే ఆ పెట్టెలు మొయ్య లేక చచ్చే ఆయాసం వచ్చింది. బజ్జర్ మోగగానే స్పీకర్ లోంచి తలుపు తోసి లోపలికి వచ్చి , ఎదురుగా కనపడే మెట్లు ఎక్కి మూడో అంతస్తుకి వచ్చెయ్యండి.” అన్నారు గూటాల గారు తెలుగులో.  నేను అలాగే లోపలికి వెళ్లి, సూట్ కేసులు లోపలి గుమ్మంలో వదిలేసి మెట్లెక్కి పైకి వెళ్లాను. పైన ఒక చిన్న గదిలో పడక్కుర్చీలో నోట్లో పైపు తో గూటాల గారు నన్ను ఆహ్వానించారు. చుట్టూ కొన్ని వందల పుస్తకాలు. అంతా చిందర వందరగా ఉంది. ఓ మూల చిన్న కిచెన్. ‘కాఫీ ఇమ్మంటారా?” మెల్లిగా, అతి మెల్లిగా లేచారు గూటాల గారు. నేను బొత్తిగా ఉహించని విధంగా అడుగులో అడుగు వేసుకుంటూ కిచెన్ కేసి నాలుగే నాలుగు అడుగులు వేసి ‘గిరిజ భోజనం మళ్ళీ తినాలని  ఉంది. అప్పుడే ఇరవై ఏళ్లయి పోయింది. మీతో తీసుకు రావలసింది. బావుండును” అన్నారు.

అప్పటికి నాకు ఆయన “ఋషి పుంగవుడు, కర్మ యోగి’ అని బాపు గారు ఎందుకు అన్నారో అర్థం అవడం మొదలు పెట్టింది. ఆయన భార్యా, పిల్లలూ ఇండియా లోనూ, అమెరికాలోనూ ఉన్నారు. ఈయన ఒక్కరే, నడవ లేని పరిస్థితిలో, ఇతర కారణాలు ఎలా ఉన్నా, లేక పోయినా తను చెయ్యదల్చుకున్న సాహిత్య పరమైన కార్యక్రమాల కోసమే అనుకోవాలి- లండన్ లో చాలా ఏళ్ళుగా, ఏకాంతంగానే, జీవితం గడుపుతున్నారు. ఆయన తలపెట్టిన కార్యక్రమాలలో  టంగుటూరి సూర్య కుమారి పుస్తకం ఒకటి. 1890ల నాటి ఆంగ్ల రచయితల సమగ్ర జీవిత విశేషాలు, వారి రచనల ప్రచురణ మరొకటి. ఆ గది క్రింద అంతస్తులో మరొక చిన్న గది. అక్కడ ఒకే ఒక్క పడక. అక్కడ కూడా కొన్ని వందల పుస్తకాలు. మొత్తం కుటీరం అంతా ఇంతే! పుస్తకాల మయం. ఆ నాడు మహా కవి శ్రీశ్రీ,  బాపు , ఈ నాడు నా బోటి సర్బ సాధారణ మానవుడు ఆతిధ్యం పొందినది అక్కడే. ఎవరైనా ఇంటికి వస్తే గూటాల గారు ఎక్కడ నిద్ర పోతారో తెలియదు. పై గదిలో ఆయన పడక్కుర్చీ పక్కనే డజన్ల కొద్దీ ఫైల్స్ లో సూర్య కుమారి పుస్తకానికి ఆయన ఎలా సేకరించారో తెలియదు కానీ, మొత్తం మెటీరియల్ అంతా అద్భుతంగా ఆర్గనైజ్ చేసి ఉంది. మరో బల్ల మీద నేను ఆయనకీ అప్పుడప్పుడూ పంపిస్తున్న మా పుస్తకాలు అన్నీ ఉన్నాయి. అన్నింటి కన్నా పైన బాపు గారి తిరుప్పావై ఉంది. మరో మూల..అవును గాంధీ గారి చరఖా..దాని మీద ఒక పూల దండ!

EPSON MFP image

బాపు మాట

ఆ తరువాత వారం రోజులూ ఇద్దరం సూర్య కుమారి పుస్తకం మీదే పనిచేశాం. ఒకే ఒక్క సారి కష్టపడి బయటకి వచ్చి బస్సులో వెళ్లి కూరలు, మందు సామగ్రి కొనుక్కుని వచ్చాం. ఆయనకీ చాలా ఇష్టమైనదీ, రోజూ వండుకునేదీ తోటకూర పప్పు. అది మోపులు, మోపులు కొన్నారు. బిల్లు నేను చెల్లిస్తానంటే ‘కాదంటానా? సూర్య పుస్తకానికి ఆ డబ్బు వాడుకుంటాను’ అన్నారు. ఆ వారం రోజులలోనూ, ఆయన వ్రాసిన కథలు – ఆయా పత్రికలలో ఉన్నవి చదివాను. “మీ  లైబ్రరీ లో ఉన్న 1890 ల నాటి ఆంగ్ల కవుల పుస్తకాల విలువ ఎంత ఉంటుంది సార్ ?” అని అడిగితే “ఏమో కానీ ఒక మిలియన పౌండ్స్ కి ఇన్స్యూరెన్స్ చేశాను” అన్నారు…నా గుండె గుభేలు మనేలా. అవే కాదు. ఆయన దగ్గర ఉన్న అపురూపమైన కలెక్షన్ లో సరోజినీ నాయుడు గారు కవిత్వం వ్రాసుకున్న ఒక పెద్ద పుస్తకం. ఆ మహా కవయిత్రి స్వదస్తూరీతో, అక్కడా, అక్కడా కొట్టి వేతలు, మార్పులు, చేర్పులతో, ఆ నాటి ఇంక్ లో ఉన్న ఆ మేనుస్క్రిప్ట్ పేజీలు నా చేతులతో తిరగేస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. ఇప్పుడు అవన్నీ ఎక్కడున్నాయో? ఏమిటో? గూటాల గారి లాంటి కారణ జన్ములు సేకరించిన అటువంటి అపురూప సంపదని దాచుకునే అదృష్టం ఉండీ,  ఆ అవకాశాలు అంది పుచ్చుకుని గర్వించే ఆలోచనలు లేని దౌర్భాగ్యులు తెలుగు వారు అని అప్పుడప్పుడూ నాకు అనిపిస్తూ ఉంటుంది. బతికి బావుంటే ఏనాడైనా ‘తెలుగు సారస్వత భవనం” అనే నిర్మాణం చేసి మన సాహితీవేత్తలు వాడిన వస్తువులు, స్వదస్తూరీతో ఉన్న వారి రచనలు మొదలైనవి పదిల పరచాలని నాకు ఎంతో కోరికగా ఉంది.  కానీ అమరావతిలో అంగుళం కూడా ఖాళీ లేదు అలాంటి వాటికి!

EPSON MFP image

మొత్తానికి సూర్య కుమారి పుస్తకం మెటీరియల్ అంతా మద్రాసు లో బాపు గారికి అందించడం నాకు గూటాల గారు నిర్దేశించిన పని. మా ఇద్దరికీ సంయుక్త ప్రచురణ మీద ఒప్పందం కుదరక పోయినా నాకు ఇబ్బంది కలగ లేదు. ఒక మహత్కార్యం లో, బాపు గారు, గూటాల గారు లాంటి మహానుభావుల దిశానిర్దేశం లో ఒక చారిత్రక పుస్తక ప్రచరణ లో అతి చిన్న పాత్ర వహించగలగడమే నా పూర్వ జన్మ సుకృతం. నేను చేసిన సహాయానికి గూటాల గారు “Suryakumari-Elvin” అనే 270 పేజీల పుస్తకం Acknowledgements లో ఒక కృతజ్ఞతా వాక్యం వ్రాశారు. అది చాలు. ఇందుతో పాటు ఆ అపురూపమైన గ్రంధం ముఖ చిత్రం. బాపు గారు వేసిన సూర్య కుమారి చిత్రం, సూర్యకుమారితో గూటాల గారి ఫోటో ఇక్కడ జత పరుస్తున్నాను.

EPSON MFP image

లండన్ లో 2006 తరువాత ఆపుడప్పుడు ఫోన్ లో పలకరించుకుంటూనే ఉన్నా, 2012 లో ఒక సారి లండన్ వెళ్ళినప్పుడు డా. వ్యాకరణం రామారావు గారు, వింజమూరి రాగ సుధా, నేనూ ఆయన్ని చూడడానికి వెళ్లాం. మళ్ళీ 2014 లో లండన్ లో నాలుగవ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు సందర్భంగా ఆయన్ని ప్రధాన అతిథిగా సత్కరించడానికి నేనూ, డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారూ, డా. దాసోజు రాములు గారూ ఆయనింటికి వెళ్లాం. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది కానీ ఎక్కడికీ వెళ్ళే శారీరక పరిస్థితి లేదు. అయితే అందరం కలిసి గూటాల గారితో CP బ్రౌన్ సమాధి దర్శించుకున్నాం. Wheelchairలో తీసుకు వెడుతున్నా ఆ మాత్రం కదలిక కూడా  భరించ లేక ఆ సమాధికి ఆయన దూరం నుంచే నమస్కారం పెట్టుకున్నారు. అదే నేను ఆయన్ని ఆఖరి సారి చూడడం.

కొన్ని నెలల క్రితం ఆయన కుటుంబం ఆయన్ని విశాఖపట్నం తరలించినట్టు యార్లగడ్డ గారి ద్వారా తెలిసింది. ఈ వ్యాసం లో కొన్ని విషయాలు ఆయన ద్వారా నాకు తెలిసినవే!.  వచ్చే నెల ఇండియా వెళ్ళినప్పుడు గూటాల గారిని చూద్దాం అనుకుంటూ ఉండగానే ఆయన నిర్యాణ వార్త తెలిసింది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిస్తూ.. జికె అనే గూటాల కృష్ణ మూర్తి గారికి ఈ అశ్రు నివాళి అర్పిస్తున్నాను..

*

మీ మాటలు

 1. D. Subrahmanyam says:

  గూటాల కృష్ణమూర్తి గారి గురించి ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారూ రాసిన వ్యాసం లో మంచి పరిచయమయితే వంగూరి చిట్టెన్ రాజు గారూ ఇంకా విస్తృతమయిన వివరాలు ఇచ్చి తెలుగు వారికి ఆ మహా మనిషి గురించి తెలిపినందుకు హార్దిక అభినందనలతో పాటు కృతజ్జ్ఞతలు తెలుపుతున్నాను. “గూటాల గారి లాంటి కారణ జన్ములు సేకరించిన అటువంటి అపురూప సంపదని దాచుకునే అదృష్టం ఉండీ, ఆ అవకాశాలు అంది పుచ్చుకుని గర్వించే ఆలోచనలు లేని దౌర్భాగ్యులు తెలుగు వారు అని అప్పుడప్పుడూ నాకు అనిపిస్తూ ఉంటుంది. బతికి బావుంటే ఏనాడైనా ‘తెలుగు సారస్వత భవనం” అనే నిర్మాణం చేసి మన సాహితీవేత్తలు వాడిన వస్తువులు, స్వదస్తూరీతో ఉన్న వారి రచనలు మొదలైనవి పదిల పరచాలని నాకు ఎంతో కోరికగా ఉంది. కానీ అమరావతిలో అంగుళం కూడా ఖాళీ లేదు అలాంటి వాటికి!” అన్న చిట్టెన్ రాజు గారి మాటలతో అంగీకరిస్తున్నాను .

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   మీ స్పందనకి ధన్యవాదాలు, సుబ్రహ్మణ్యం గారూ..

   • Kandukuri Ramu says:

    చాలా బాగుంది. కృతజ్ఞతలు.
    -Kandukuri Ramu

 2. అపురూప వ్యక్తికి నిరుపమాన నివాళి!!!

  ~ లలిత

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ధన్యవాదాలు. ఏదో ఆయనతో నాకున్న పరిచయాన్ని అక్షర రూపంలో పెట్టాను. అంతే!

 3. voleti venkata subbarao says:

  రాజు గారు – – శ్రీ గూటాల కృష్ణ మూర్తి ఇక లేరు అన్న పిడుగుపాటు వంటి వార్త మీ నివాళి చదువుతూంటే తెలిసింది . చాలా బాధ కలిగింది . నేను ఒక సందర్భం లో నేను యూ .కె . లో ఉండగా వారిని ఫోన్ లో పలకరించి పరిచయం చేసుకుంటే -ఆయన ఎంతో ఆప్యాయంగా మాట్లాడి – టంగుటూరి సూర్యకుమారి గారి పుస్తకం విషయమై ప్రస్తావించి – ఆ విశేషాలను ఎన్నిటినో నాతో పంచుకోవడం నేను మరువలేను . బాపు గారి ప్రస్తావన కూడా మా సంభాషణ లో చోటుచేసుకుంది -ఆ విషయాలన్నీ అటు తరువాత నేను బాపు గారి చెవిన వేసాను – ఆయన ఎంతో ఆనందపడ్డారు -అలా ఇద్దరు మిత్రుల స్నేహ మాధుర్యాన్ని నేను చవి చూడగలిగిన అదృష్టం నాది జి కెగారి స్మృతి కి నా నివాళి

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   మిత భాషి అయిన గూటాల గారితో మాట్లాడడమే ఓ ఎడ్యుకేషన్…మీరూ, నేనూ ఆ అదృష్టానికి నోచుకున్నాం.

 4. మీరు ఈ మధ్య వ్రాస్తున్న వ్యాసాలన్నీ విషాదభరితమైనవే అయినా ఇంత గొప్పవాళ్ళ సహచర్యం పొందిన మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ అనుభవాలు మాతో పంచుకున్న మీ సహృదయం అభినందనీయం. ఇంతటి మహామహుల జీవితం గురించి వ్రాయకుండా సినిమాలు, ఇంకా చవకబారు సాహిత్యం గురించి మాత్రమే వ్రాసే మన తెలుగు పత్రికల గురించి ఏమి చెప్పాలో తెలియడం లేదు. తెలుగు వాళ్ళ దురదృష్టం!!

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   శుభ గారూ,

   నేను కావాలని అలాంటి వ్యాసాలు మాత్రమే వ్రాయడం లేదు. ఆత్మీయులైన వారు అనుకోకుండా పై లోకాలకి వెళ్లి పోయినప్పుడు వారి జ్ఞాపకాలని పంచుకుంటున్నాను, అంతే!…నా మామూలు తరహా కథలూ, కమామీషులు సారంగా, మధురవాణి , కౌముది లో నిరాటంకంగా వ్రాస్తూనే ఉన్నాను. వీలుంటే అవి కూడా చదవండి. మీ స్పందనకి చాలా ధన్యవాదాలు.

 5. rani siva sankara sarma says:

  దీనిలో చలం ముందుమాట ఉందా?

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   లేదు శర్మ గారూ..కానీ మహాప్రస్థానం తో పాటు శ్రీశ్రీ గారి అనేక ఇతర రచనలు ఆయన దస్తూరీ లో ఉన్నాయి. అన్నింటికీ కలిపి శ్రీశ్రీ గారి ఉపోద్ఘాతం ఉంది.

 6. కె.కె. రామయ్య says:

  ప్రముఖ సాహితీవేత్త గూటాల కృష్ణమూర్తి గారికి ఆత్మీయ నివాళి సమర్పించిన వంగూరి చిట్టెన్ రాజు గారికి కృతజ్ఞతలు. తెలుగునాట, వీలుంటే విశాఖలోనే, జి.కె. స్మారక సంస్థ ఏర్పాటుచేసే విషయంలో మీ ప్రయత్నాలు మానకండి.

  ” బ్రిటన్ లో తెలుగు బ్రౌన్ – గూటాల కృష్ణ మూర్తి ” డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారి వ్యాసం ( ఆదివారం ఆంధ్ర జ్యోతి 18 జనవరి 2009 ) సరసభారతి ఉయ్యూరు వారి క్రింది లింకులో చూడవచ్చుఁ

  https://sarasabharati-vuyyuru.com/2012/01/27/%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%9F%E0%B0%A8%E0%B1%8D-%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B1%81%E0%B0%97%E0%B1%81-%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B0%E0%B1%8C%E0%B0%A8%E0%B1%8D/

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ధన్యవాదాలు, రామయ్య గారూ..మీరు సంకలనం చేసి ఫంబు లో పెట్టిన వ్యాస సముదాయం అన్నీ చదివాను…ఈ సారంగ వ్యాసం తో సహా…చాలా బావుంది. ధన్యవాదాలు.

 7. Gangisetty Lakshminarayana says:

  మీ వ్యాసం చదవడం ఒక అద్భుతమైన అనుభవం. ఆ మహామహుని సాన్నిధ్యం లో మేమూ గడిపినంత అనుభవం.

 8. g b sastry says:

  శ్రీ రాజు గారు
  ఎంతో బాగా రాసారండి,ఒక గొప్ప సాహిత్యాభిమాని,ఒక గొప్ప కవి,
  ఒక గొప్ప చిత్రకారుని గురించి ఒకే సారి ముగ్గురు గొప్పల గురించి చదివినేను తెలుగు వాడిగా చాలా గొప్ప ఫీలై పోయాను
  ఇంత ఆనంద సమయంలో ఆ ముగ్గురి గొప్పల్లో ఒక గొప్ప విగ్రహాన్ని విరిచిన తోటి తెలుగువారి గురించి తలచుకొని సిగ్గు పడకుండా ఉండలేక పోతున్నాను.
  విడివడిన వదలలేని ద్వేషాల గుండెల్లో పెట్టుకున్న వారి గురించి జాలి పడ కుండా ఉండ లేకున్నాను.
  అలజడులు,అరమరికలు,ద్వేషాలు విడిపోయిన ప్రాంతాల
  కలిసున్న కాలపు,బిడ్డపోయినా తప్పని పురిటి కంపులవే.
  ఆకంపు వేర్పాటుకోరినవారికింపుగాను,కలిసున్నబాగుండు
  అనుకొన్నవారికి కంటగింపుగాను ఉండక తప్పని దుస్థితదే
  ఓ గులుకు రాణి
  అనుకోని నన్ను నేను ఓదార్చుకున్నాను
  ప్రాతఃస్మరణీయుల గూర్చి ఇంత చక్కగా చెప్పిన మీకు నమస్కారాలు.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ధన్యవాదాలు, శాస్త్రి గారూ,

   ఎంతో చెయ్యాలి అని ఎంతో మంది అనుకుంటారు. కానీ ఆచరణలో పెట్టేవారు తాము చేయదలచుకున్న పని చేసుకుంటూ పోతారు. వాళ్ళే కారణ జన్ములవుతారు.

 9. Aranya Krishna says:

  చిట్టెన్ రాజుగారూ! మీ వ్యాసం చదవటం ఒక గొప్ప అనుభూతిని కలిగించింది. గూటాల కృష్ణమూర్తి గారికి నివాళి అయినప్పటికీ ఇందులో శ్రీశ్రీ, బాపు, సూర్యకుమారి వంటి మహామహుల గురించి మీరు వివరించిన తీరు హృద్యంగా వుండి కదిలించింది. గూటాల కృష్ణమూర్తిగారి గురించి ఎన్నో విషయాలు తెలియచేసారు. ధన్యవాదాలు.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   మీ స్పందనకి ధన్యవాదాలు…

 10. విన్నకోట రవిశంకర్ says:

  రాజు గారు – మీ నివాళి చాలా సమగ్రంగా ఉంది. గూటాల కృష్ణ మూర్తి గారి గురించి ఎన్నో సార్లు విన్నాను గాని, ఇన్ని వివరాలు మీ వ్యాసం వల్లనే తెలిసాయి. నిరాడంబరురులైన ఇటువంటి మహనీయులు నిజంగా చిరస్మరణీయులు. వారికి నా శ్రద్ధాంజలి. శ్రీశ్రీ మహా ప్రస్థానంతోబాటు పురిపండా అప్పలస్వామి గారి “పులిపంజా” కూడా గూటాల కృష్ణమూర్తి గారి ప్రచురణగా వచ్చినట్టు గుర్తు.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   మీ స్పందనకి ధన్యవాదాలు… నాకు తెలియనివి ఇంకా చాలానే ఉన్నాయి…..ఎప్పటిలాగానే మనకి తెలిసినది తక్కువ ..తెలియనిది ఎక్కువ…

 11. దత్ says:

  అద్భుతమైన వ్యాసం చదివిన భావన…తెలుగోడి సారస్వత శౌర్యం తెలుగోడే పట్టించుకోవదానికి అమరావతికి తీరిక లేకపోవడం దారుణం….మహనీయుని గురించి తెలిపిన మీకు కృతజ్ఞతాభివందనాలు.

  • వంగూరి చిట్టెన్ రాజు says:

   ధన్యవాదాలు, మహాశయా. వ్యాపారస్తులు రాజ్యం ఏలితే వారి ఆస్తులు పెరుగుతాయి. సాంస్కృతిక స్పృహ ఉన్న వాళ్ళు అధికారంలో ఉంటే …సంస్కృతి రాజ్యం ఏలుతుంది. ఇదే చరిత్ర మనకి పదే, పదే చెప్పిన నగ్న సత్యం.

   ఏమంటారు?

మీ మాటలు

*