చెరగదు ఆ దస్తూరి!

Gutala (1)

 

-జగద్ధాత్రి

~

జనవరి 4 2004 మోజాయిక సాహితీ సంస్థ రిజిస్టర్ అయి స్థాపించబడిన రోజు. ఆరోజే రామతీర్థ తెలుగు లోకి అనువాదం చేసిన టి.ఎస్. ఇలియట్ ‘ద వేస్ట్ లాండ్’ ‘వృధాత్రి’ పేరిట ఆవిష్కరణ. ఆరోజు హోటల్ మేఘాలయ లో రోజంతా జరిగిన సాహిత్య సభలో ఎందరెందరో మహానుభావులు, సాహితీ మూర్తులు. ప్రఖ్యాత కవి కె. శివారెడ్డి , అద్దేపల్లి, ఆదేశ్వరరావు గారు, ఇంకా ఎందరో. సభకు ప్రత్యేక ఆకర్షణ లండన్ నుండి వచ్చిన గూటాల కృష్ణ మూర్తి గారు. ఆరోజు ఆయనని , అచ్యుతరామరాజు గారిని గులాబీ మాలలతో సత్కరించుకోవడం మా సాహిత్య సంస్థకు
శుభారంభంగా భావించాము.

అనువాదాల ఆవశ్యకతను గూర్చి కొన్ని మాటలు మాట్లాడేరు గూటాల. ఇక ఆరోజు సాయంత్రం మా సాహితీ మిత్రుడు ప్రముఖ కవి ఏవిఆర్ మూర్తి తీసుకువెళ్లగా గూటాల దంపతులను దర్శించుకున్నాం, నేను శివారెడ్డి గారు ఇంకా కొందరు సాహితీ మిత్రులు. ఎంతో ఉత్సాహం తో సిగరెట్టు తాగుతూ ఆయన చెప్పిన కబుర్లు ఇప్పటికీ గుర్తు న్నాయి. శ్రీశ్రీ లండన్ వచ్చినప్పుడు తాను వచ్చిన పనిని కొంత వెనుక బెట్టినట్టు ఒక నాడు జి.కె. కి అనిపించి ,  ఆమాటే అంటే ఆ తర్వాత తాను వచ్చిన పని పూర్తి చేసేవరకు శ్రీశ్రీ మందు సేవించలేదని, చివరికి తను ఉండలేక బీరు
తాగేవాడినని, కనీసం అది కూడా తాగ కుండ పని పూర్తి చేసి అప్పుడు తాగాడు శ్రీశ్రీ అని చెప్పారు. శ్రీశ్రీ కోసం ఒక గదిని ప్రత్యేకంగా పెట్టి
అందులో ఆయనకి కావల్సిన మదిరను ముందే ఏర్పాటు చేసానని నవ్వుతూ చెప్పేరు.
ఆయనతో ఉన్న ఆయన శ్రీమతి తో కూడా నేను కాసేపు ముచ్చటించాను. ఎందుకంటే అక్కడ ఉన్న వారందరిలోనూ మహిళను నేనొక్కతినే. ఆమె తో మాట్లాడుతూ ఉంటే ఎన్నో కబుర్లు. ప్రొఫెసర్ గా పని చేసిన ఆమె కూడా విద్యావేత్త, కావడం గొప్ప విషయం. అయితే ఆవిడ సైన్స్ ప్రొఫెసర్ . నాతో జి.కె. సాహిత్య పిచ్చి గురించి ఆవిడ కంప్లెయింట్లు ప్రేమగా చెపుతుంటే భలే మధుర స్మృతిగా మిగిలింది
ఆరోజు మా మదుల్లో ఇప్పటికీ.

‘ఫ్రాన్సిస్ థామ్సన్’ 1890 లలో పుట్టి 1907 లో మరణించిన గొప్ప ఇంగ్లీషు కవి. అతని గురించి పరిశోధన చేశారు జికె. అంతే కాదు ఫ్రాన్సిస్ థామ్సన్
సోసైటీ పెట్టి కొన్నాళ్లు ఒక పత్రిక కూడా నడిపారు. 1890 పొయెట్రీ సొసైటీనaపేరిట జికె చేసిన సాహిత్య పరిశోధన  అమోఘం. ఆంగ్లేయులకే వారెరుగని వారి కవులను పరిచయం చేసేరు గూటాల. ఇక తెలుగు తల్లికి ఆయన చేసిన సేవ విదేశాంధ్ర ప్రచురణలు స్థాపించి శ్రీశ్రీ మహాప్రస్థానం ని మహాకవి స్వదస్తూరిలో నమోదు చేయించి ఆ గీతాలను శ్రీశ్రీ స్వరం లో రికార్డ్ చేసి కేసెట్ను ఆ ఫాసిమైల్ ఎడిషన్ లోనే వెనుక ఒక చిన్న బాక్స్ లా పుస్తకం లోనే పెట్టి ప్రచురించారు. మేము వెళ్ళిన రోజు ఒక్క పుస్తకాన్ని శివారెడ్డి గారికి బహుకరించారు. తర్వాత పురిపండా వారి  పులి పంజా కూడా అలాగే తీసుకొచ్చారు.

శంకరంబాడి వారి ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ’ను తన గాన సుమస్వరం లో అజరామరంగా అందించిన టంగుటూరి సూర్యకుమారి గురించి చాలా ఖరీదైన పుస్తకాన్ని వెలువరించారు. ఈ పుస్తకం లో ఆమె జీవిత విశేషాలను తెలియజేసే ఫోటోలు అన్నీ ఒక ఆల్బమ్ లా పొందు పరిచి ప్రచురించారు. సాంకేతికత ఇంకా ఇంత అభివృద్ధి చెందని ఆరోజుల్లో ఒక మహాకవి స్వరాన్ని దస్తూరిని భావి తరాలకు మిగిల్చిన  గొప్ప సాహితీ ప్రేమికుడు గూటాల.మరొక విషయం ఈరోజు సీనియర్ కధకుడు జయంతి వెంకట రమణ ని కలవడం జరిగింది. జి.కె. వారికి మేన బావ అని
తెలిసింది. అయనను కన్న బాబు అని పిలిచేవారట . ఎప్పుడూ ఇంగ్లీష్ పుస్తకం చదువుతూ ఉండెవాడు. 1956 నుండి సాన్నిహిత్యం అని గుర్తు చేసుకున్నారు .
ఏదేశమేగినా ఎందు కాలిడినా ఎంత కీర్తి గడించినా తెలుగు తల్లి ముద్దు బిడ్డగానే మిగిలి, తిరిగి మాతృ దేశం లోనే అసువులు బాసిన మహనీయుడు జికె. ఆయనకి సాహితీ జగత్తు అక్షర  నివాళి సమర్పిస్తోంది.

*

మీ మాటలు

 1. D. Subrahmanyam says:

  గూటాల కృష్ణమూర్తి గారి గురించి ఇంకో మంచి పరిచయం. అభినందనలు జగద్ధాత్రి గారూ , అభినందనలు. మన రావి శాస్త్రి గారి మాటల్లో చెపితే “వెంతయినా మన వోయిజోగోడు సానా గొప్పోడు తల్లీ, వెటంతావ్”

 2. కె.కె. రామయ్య says:

  లండన్ కురు వృద్ధుడు; బ్రిటన్ లో తెలుగు బ్రౌన్; మనసా, వాచా, కర్మణా గాంధేయవాది; శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ ని మహాకవి స్వదస్తూరిలో నమోదు చేయించి ఆ గీతాలను శ్రీశ్రీ స్వరంలో రికార్డ్ చేయించిన మహనీయుడు; మన జాతి అస్తిత్వ ప్రతీకల్ని ఎలా గౌరవించుకోవాలో దారి చూపిన; (13 జూలై, 2016 న విశాఖలో అసువులు బాసిన); మహనీయుడు శ్రీ గూటాల కృష్ణమూర్తి గారికి సాహితీ జగత్తు అక్షర నివాళి సమర్పిస్తోంది.

 3. Doctor Nalini says:

  గుటాలని శ్రీశ్రీ ని కలిపిన ఘనత చలసాని ప్రసాద్ ది.

 4. K.WILSON RAO says:

  పన్నేడేండ్ల క్రితపు తీపి గురుతులు.. ఈ సందర్బంగా ఇలా.. కృష్ణమూర్తి గారు లేని లోటు ఎలా… అదృశ్య శక్తి ఏదో ఆయన్ను జన్మ స్థలానికి లాక్కొచ్చినట్టుంది. ఆ మహనీయునికి అశ్రు నివాళి

మీ మాటలు

*