ఈ భరోసా…ఎంతవరకు?!

murugan

-దగ్గుమాటి పద్మాకర్

~

నేను నా వృత్తిరీత్యా ఇప్పటివరకు రకరకాల స్కూళ్లలో లక్షమంది పైగా విద్యార్థులతో వారి క్లాసుల్లో  10-15 నిముషాల సమయం గడుపుతూ ఉంటాను. వారంతా 2-7 తరగతుల మధ్య చదువుకునే పిల్లలు.  వారితో మాట్లాడే విషయాలు ముఖ్యంగా వాళ్లందరూ తమకి ఒక మెదడు ఉందని గుర్తించడం, అదే చాలావరకు తమని నడిపిస్తుందని పలు ఉదాహరణలతో గ్రహించేలా చెయ్యడం.  అలాగే ఆమెదడుని వారు తమ అదుపులో ఉంచుకోవాలని కూడా గ్రహించేలా చెయ్యడం, అందుకు కొన్ని ప్రాక్టికల్గా ఉదాహరణలు చూపించడం.  సందర్భాన్ని బట్టి వారెందుకు
చదువుకుంటున్నారో, అక్షరం విలువేమిటో కూడా వివరించడం చేస్తుంటాను.

ఈక్రమంలో ఒకసారి 4 వ తరగతి పిల్లలని క్లాసులో భాషకి, లిపికి తేడా చెప్పమన్నాను.  వారికి పెద్దగా అర్ధం కాలేదు.  సరే మాటకీ, అక్షరానికీ తేడ
తెలిస్తే చెప్పమన్నాను.  తెలిసిందేగదా, పిల్లలకి అవకాశం ఇవ్వంగాని ఇస్తే ఆలోచనలు మథిస్తారు!

ఒకమ్మాయి అంది, మూగవాళ్లు ఇతరులతో మాట్లాడాలంటే మాటలు రావుగాబట్టి అక్షరాల్లో రాసి చూపిస్తారు అనింది.  అందరితోపాటు నేనూ చప్పట్లు కొట్టాను.  నేను ఆతర్వాత చొరవ తీసుకుని భాషవల్ల  ఇంకో ముఖ్యమైన  ప్రయోజనం చెప్తానన్నాను.  “ఇప్పుడు ఇక్కడ అక్షరం వల్ల ప్రయోజనం గురించి  మనం మాట్లాడుకున్న విషయం మనం కొద్దిరోజులకి మర్చిపోతాం! ఇవన్నీ , ఇంకో వంద సంవత్సరాలకైనా ఇతరులు తెలుసుకోవాలంటే ఎలా? అక్షరమే గదా సాధనం” అన్నాను. ఈ అక్షరాల వల్లనే గదా మీరు టెక్స్టు పుస్తకాల ద్వారా ఎవరో ఎప్పుడో రాసిన
అనేక విషయాలు తెలుసుకో గలుగుతున్నారు అన్నాను.

2

సరే! ఇదంతా ఎందుకంటే కోర్టులు అక్షరం విలువని ఇన్నాళ్లకు గుర్తించాయి! జడ్జీలు వాయిదాలు, పాయింట్లు, తీర్పులు డిక్టేట్ చేస్తుంటే టైపిస్టులు అక్షరాలు సృష్టిస్తుంటారు గాబట్టి జడ్జీలనడిగితే అక్షరాలు సృష్టించే వాళ్లకంటే ఆలోచనలు సృష్టించే వాళ్లే గొప్పవాళ్లని తప్పకుండా
ఒప్పుకుంటారు.  ఇటీవల పెరుమాళ్ మురుగన్ కేసువిషయమై ఇచ్చిన తీర్పులో మద్రాసు హైకోర్టుకూడా ఒప్పుకుంది. కోర్టుల్లో ఇదొక గుణాత్మకమైన మార్పుగా గోచరిస్తుంది.  ఆలోచనలని ఔపోసనపట్టి అక్షరాలకు ఒక కళారూపాన్ని జతచేసి రచనలుచేసే వాళ్లని “మీరు రాయండి” అని; “ఒక కళారూపమైన సాహిత్యంలోని భావాలు నచ్చనివాళ్లు నచ్చకపోతే పుస్తకం మూసేసుకోవచ్చు” అనీ  కోర్టు ఒక రచయిత భుజం తట్టినట్టుగా మద్రాసు హైకోర్టు పెరుమాళ్ మురుగన్ కి భరోసా ఇవ్వడం నిజానికి హృదయాలు పులకించే విషయం.

కానీ ఏడాది కిందటి వరకూ “మిలార్డ్” అంటూ బ్రిటిష్ సాంప్రదాయాన్ని కొనసాగించిన కోర్టులనుంచి మనం ఇలాంటి భరోసాలు నిరంతరం ఆశించడం అత్యాశే కావచ్చు.

3

అయితే కనీసం పెరుమాళ్ మురుగన్ కారణంగా అయినా కళా సాహిత్య రంగాలకు మద్రాసు హైకోర్టు ఈ రకంగా అయినా వెన్నుదన్నుగా నిలవడం వెనుక కారణాలు అన్వేషిస్తే నావరకు అనిపిస్తున్నదొకటే.  వెల్లువెత్తుతున్న వర్చువల్ మీడియాలో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఎలాంటి కత్తిరింపులు, ఎవరి అనుమతులు అవసరం లేకుండా దూసుకెళుతున్న కాలంలో మనం వుండడమే ఇందుకు కారణం.  కళాకారులపై రాజ్యాంగ
వ్యవస్థలో భాగమైన పోలీసులు ఫ్యూడల్ భావాజాలానికి కొమ్ముకాస్తూ నియంత్రించినప్పుడు వారి చర్యలు ప్రపంచమంతా క్షణాలలో ప్రచారం, ప్రసారం జరిగిపోతున్నాయి. ఈ పరిణామం కారణంగా అభివృద్ది చెందిన దేశాలు భారతదేశాన్ని అభివృద్ది చెందుతున్న దేశంగా కాక ఇంకా వెనకబడ్డ దేశంగానే గుర్తించడం జరుగుతుంది.  అలాంటప్పుడు భారత దేశంలో పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థ కంట్రోల్లో లేదనే సంకేతాలు ప్రచారమవుతాయి.  బహుశా పెరుమాళ్ మురుగన్ కేసులో న్యాయ వ్యవస్థపై ఈరకమైన వత్తిడి కూడా పనిచేసి వుండే అవకాశం వుంది.

4

అయితే, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇంకా మాట్లాడితే ఏరకమైన స్వేచ్ఛ గురించి అయినా ఇటీవలికాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం కాస్త జాగ్రత్తగా మాట్లాడుకోవలసి వుంటుంది.

సమాజంలోని ప్రజలకు తగినంత మెచ్యూరిటీని, ప్రాపంచిక జ్ఞానాన్ని అందించే సామాజిక వ్యవస్థలని చిదిమేసి బట్టీ విద్యా విధానంతో జ్ఞానాని
తెల్లకాగితంగా మిగిల్చి వ్యవస్థ అందించే స్వేచ్ఛ చివరికి ఏ పరిణామాలకి దారితీస్తుందో ఇటీవలి సంఘటన ఒక ఉదాహరణ. వయోజనుడైన ఒక పాతికేళ్ల ఐటీ ఉద్యోగి కార్పొరేట్ హాస్పిటల్ ప్రకటనలని నమ్మి ఎత్తు పెరగడానికి కనీసం ఇంట్లోకూడా చెప్పకుండా తన రెండుకాళ్లను తెగ్గొట్టించు కోవడం  వ్యక్తిగత స్వేచ్ఛయొక్క దుష్పరిణామమని చెప్పుకోవాలి.  అంటే ఈదశలో వ్యక్తిగత స్వేచ్ఛ అనేది చివరికి వినియోగదారుడిగా మారే స్వేచ్ఛకి దారితీస్తుంది.

చెప్పుకోవాలంటే యువత ఎక్కువగా వున్న భారతదేశంలో రాబోయేకాలంలో ఇలాటి ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలెక్కువ. ఇప్పటికే మన సినిమాలలో చూపించి చూపిస్తున్నట్టు గుణగణాలతో సంబంధం లేకుండా ఆకర్షణే ఆధారంగా జరిగే ప్రేమపెళ్లిళ్లకి ఒకలెజిటమసీ వచ్చేసింది.  మన సినిమాలలో మొదట హీరో స్నేహితులు,  ఆతర్వాత కాలేజీ లెక్చరర్లు, ఆతర్వాత చివరికి తల్లిదండ్రులు అంతా హీరో ప్రేమని సఫలం చెయ్యడానికి ప్రయత్నించేవారే!   కారణాలేవైతేనేం 18 దాటిన వాళ్లకి మద్యం సేవించే స్వేచ్ఛ వచ్చేసింది.  మద్యం అమ్మకాలకి ప్రభుత్వమే టార్గెట్స్ పెట్టి  అమ్మిస్తూంది.  ఇండైరెక్టుగా మద్యం హాయిగా తాగొచ్చని సందేశాలు పంపుతూ ఎక్సైజ్ డిపార్ట్ మెంట్ చేత డ్రగ్స్ కి, గంజాయికీ వ్యతిరేక ప్రచారం చెయ్యిస్తుంది.  మీడియా అంతా పేజీలకింత అనేదశ దాటి టోకుగా కూడా అమ్ముడు పోతున్నాయి. ఈదశలో ఇప్పుడు రచయితలకి అందిన స్వేచ్ఛని కూడా మనం కాస్త జాగ్రత్తగా విశ్లేషించుకోవలసి వుంది.

5

సమాజంలో స్వేచ్ఛకి మితిమీరిన ప్రాచుర్యం లభించాక ఆ పదానికి ఒక ఆచరణీయత, అనుసరణీయత ప్రజల్లో లభిస్తుంది.  ఇప్పుడున్న వాతావరణంలో స్వేచ్ఛని ఎక్కువగా పైపై వర్గాలే వినియోగించుకుంటాయి.  అంటే  కార్మికులు యూనియన్లు పెట్టుకునే హక్కుని నిరాకరిస్తూ యజమానుల సంఘం మాత్రం క్రియాశీలంగా పనిచేసినట్టు అన్నమాట.  ఇలాంటి సంఘటనలు భారత దేశంలో కోకొల్లలు.
ప్రభుత్వాలు తమపార్టీలకు నిధులందించే ఇండస్ట్రియలిస్టుల కొమ్ముకాయడం , ఎన్నికల హామీలు గాలికి  వదిలి నియంతృత్వ పోకడలు పోతున్నప్పుడు క్రమేపీ ప్రజా సమూహాల గొంతెత్తే హక్కు, నిరసన తెలిపే హక్కు, అన్యాయాన్ని ప్రతిఘటించే హక్కు… ఇలాంటివన్నీ ప్రభుత్వాలు కాలరాస్తున్నప్పుడు దృతరాష్ట్ర న్యాయం ప్రదర్శించే కోర్టుల పట్ల పెరుమాళ్ మురుగన్ విషయంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఒకింత సానుకూలత కలిగిస్తుందనేది రచయితలుగా మనం మరిచి పోకూడదు.

పెరుమాళ్ మురుగన్ కి ఇచ్చిన స్వేచ్ఛని అడ్డం పెట్టుకుని  కోర్టులు తాము మరింత ప్రజాస్వామికంగా వున్నట్టు మనని నమ్మిస్తాయి. నిజానికి హక్కులు, స్వేచ్ఛ కారణంగా వర్ధిల్లే బూతు సాహిత్యం ఎక్కువ!  కోర్టుల నిస్సహాయత బయట పడేది ఇక్కడే!

అసలు పెరుమాళ్ మురుగన్ భయానికిగురై రచయితగా తాను మరణించినట్టు ప్రకటించడానికి కారణమైన సంస్థలు, అధికార వ్యవస్థలను కూడా కోర్టులు ఏమీ చెయ్యలేవన్నది నిజం.  ఒకవేల అలాచేయాలని అనుకున్నా అది కత్తి పట్టుకుని పైపైకి వచ్చేవాడిని కళ్లురిమి అదుపు చేయాలనీ అనుకోవడం లాంటిదే! ఆపరిమితి కోర్టులకున్నది.  కోర్టుల నిస్సహాయత గురించి చెప్పుకోవలసి వస్తే మన రాజకీయాలు ఎంత దుర్మార్గమైనవి అంటే అవి ఒక సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ చేతకూడా పబ్లిగ్గా కన్నీళ్లు పెట్టించ గలవని మనకి తెలిసిన విషయమే.

6

నాలుగు రోజుల కిందట  ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో ఒక కేసులో బెయిలుపై బయటికి రాగానే మరొక ధర్నా కేసంటూ వెంటనే అరెస్టు చేసి వెంటనే కోర్టుకి పెట్టారు. ఆయనేం మావోయిస్టు కూడా కాదు.  ప్రతిపక్ష ఎమ్మెల్యే.  సహజంగా పోలీసులకి వుండే పవర్ ఇది. ఈ పవర్ గురించే రావిశాస్త్రి తనకథల్లో పదేపదే చెప్పింది. కోర్టులు కూడా అధికార వ్యవస్థల్లో మరో వ్యవస్థ కాబట్టి సహజంగా తనకి కలిగిన “కళ్లురిమే” అదృష్టాన్ని అనవసరంగా  కాలదన్ను కోవడానికి సిద్ధపడవు.

కొన్నిసార్లు కోర్టులు పార్లమెంటుని సైతం ప్రశ్నిస్తున్నట్టు అనిపిస్తాయి గాని టెక్నికల్గా బాహాటంగా దొరికితే తప్ప అవి ప్రభుత్వాల పీక
పట్టుకోవన్నది నిజం.  ప్రభుత్వాలే మద్యం అమ్మకాలు చేయించడాన్ని, ప్రజాభిప్రాయాన్ని అవహేళన చేస్తూ ఎమ్మెల్యేలు అధికార పార్టీల్లోకి
మారడాన్ని, కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు కొమ్ముకాసి దేశ సంపదని దోచి పెట్టడం గానీ ప్రశ్నిస్తూ కోర్టులు సుమోటోగా కేసులు పెట్టినప్పుడు
కోర్టుల్లో గుణాత్మక మైన మార్పులు వచ్చాయని మనం నమ్మొచ్చు.

అందాకా తప్పేమీ లేదు మిత్రమా!

ప్రపంచం అంతటా నీ అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని కొల్లగొట్టడానికి ఒక డ్రామా నడుస్తూ ఉంటుంది.  ఈడ్రామాని నువ్వు జీవితం అనే మొత్తాన్ని ఖర్చుచేసి టిక్కెట్టు కొని చూస్తున్నావు.  నిజమా  కాదా అని అనుమానించడంలో తప్పేమీలేదు.  ప్రతి మార్పునీ, ప్రతి తీర్పునీ ఒక గీటురాయి మీద గీసి చూసుకో!

*     *      *      *

మీ మాటలు

  1. Ramana Yadavalli says:

    “ప్రపంచం అంతటా నీ అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని కొల్లగొట్టడానికి ఒక డ్రామా నడుస్తూ ఉంటుంది. ఈడ్రామాని నువ్వు జీవితం అనే మొత్తాన్ని ఖర్చుచేసి టిక్కెట్టు కొని చూస్తున్నావు. నిజమా కాదా అని అనుమానించడంలో తప్పేమీలేదు. ప్రతి మార్పునీ, ప్రతి తీర్పునీ ఒక గీటురాయి మీద గీసి చూసుకో!”

    పద్మాకర్ గారూ, ఎంత చక్కగా రాశారండీ! హేట్సాఫ్ టు యు!

  2. చాలా చక్కని ఆలోచనాత్మక ప్రయోజనకరమైన సమతుల్యత తో కూడిన సందేశాత్మకమైన రచన…చాలా నిక్కచ్చిగా ఆచితూచి బాగా కసరత్త్త్తు చేసి చక్కని కుదింపు మధింపు తో రాయబడింది…కానీ కొన్ని కోణాలు ఇంకొన్ని టచ్ చేస్తే ఇంకా బాగుండేది…కాళ్ళు కత్తిరించుకున్న అబ్బాయితో పాటు..స్వేచ్ఛ విషయం లో ప్రేమ వ్యవహారాలలో కాకుండా ఇంకొన్ని కూడా టచ్ చేయవలసింది…ఇంకా సమగ్రంగా ఉండేది..

  3. Aruna.Gogulamandaa says:

    వండ్రఫుల్లీ స్టడీడ్ అండ్ ప్రెజెంటేడ్. వెరీ అనలిటికల్ అండ్ రీసెర్చెడ్ ఆర్టికిల్. తాంక్యూ పద్మాకర్ గారూ.

  4. THIRUPALU says:

    Excelent aarTical అండీ! వ్యవస్థలోని చాలా విషయాలు తడి మారు . చాలా వ్యాఖ్యలు కోట్ చేసుకో దాగినవి ఉన్నాయి కానీ, మచ్చుకి **వయోజనుడైన ఒక పాతికేళ్ల ఐటీ ఉద్యోగి కార్పొరేట్ హాస్పిటల్ ప్రకటనలని నమ్మి ఎత్తు పెరగడానికి కనీసం ఇంట్లోకూడా చెప్పకుండా తన రెండుకాళ్లను తెగ్గొట్టించు కోవడం వ్యక్తిగత స్వేచ్ఛయొక్క దుష్పరిణామమని చెప్పుకోవాలి.** ఇది మన వ్యవస్థ ఉత్పత్తి చేసే జ్ఞానం ఇలా ఉంటుందనేది ఒక నమ్మ లేని నిజం! వ్యవస్థ నుండి నేర్చుకున్న జ్ఞానంతో వ్యవస్థను అర్ధం చేసుకోలేక పోవడం ఈ దేశ ప్రజలకు పట్టిన ఖర్మ కాదా !

  5. ఆర్.దమయంతి. says:

    * మీడియా అంతా పేజీలకింత అనేదశ దాటి టోకుగా కూడా అమ్ముడు పోతున్నాయి. ఈదశలో ఇప్పుడు రచయితలకి అందిన స్వేచ్ఛని కూడా మనం కాస్త జాగ్రత్తగా విశ్లేషించుకోవలసి వుంది.
    *కోర్టుల నిస్సహాయత గురించి చెప్పుకోవలసి వస్తే మన రాజకీయాలు ఎంత దుర్మార్గమైనవి అంటే అవి ఒక సుప్రీం కోర్టు ఛీఫ్ జస్టిస్ చేతకూడా పబ్లిగ్గా కన్నీళ్లు పెట్టించ గలవని మనకి తెలిసిన విషయమే.
    – ఉన్నదున్నట్టు మొహం మీద కొట్టినట్టు రాశారు పద్మాకర్. ఈ సమాజం మొత్తం దుమ్ము, ధూళీ, బురదతో పేరుకుపోయింది అంటే అందుకు కారణం ప్రభుత్వాలు, రాజకీయాలు అని ఖఛ్చితంగా చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం మీ అక్షరం.
    నీళ్లు లేక గ్రామాలకు గ్రామాలు ఖాళీ అవుతున్నాయి. న్యాయం లేక దేశం విలవిల్లా డుతొంది. బలమున్న వాడిదే రాజ్యం అన్న చందాన తయారయింది పరిస్థితి.
    లిక్కర్ – ఎన్నో లక్షల కుటుంబాల తీవ్ర మైన సమస్య. మనిషి జీవన మనుగడనే మంట పాలు చేస్తున్న ఈ విష పరిస్థితికి కారణం ప్రభుత్వం అంటే ఎంత సిగ్గు చేటు.
    కాపాడవలసిన వారే కాల్చేస్తుంటే ఏం చెప్పాలి?
    మాటలన్నీ శోకాలవుతున్న స్త్రీల దీన హీన గతుల గురించి ఏమని రాయగలం?

    • >> “ఈ సమాజం మొత్తం దుమ్ము, ధూళీ, బురదతో పేరుకుపోయింది అంటే అందుకు కారణం ప్రభుత్వాలు, రాజకీయాలు అని ఖఛ్చితంగా చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం మీ అక్షరం”

      సమాజం కుళ్లిపోటానికి మనం (అంటే ప్రజలు) తప్ప మిగతా అందరూ కారణమా?

  6. దేవరకొండ says:

    అసలు శీర్షికలో ఉన్న ప్రశ్నయే మొత్తం విషయాన్ని చెబుతోంది. వ్యవస్థను, అది కుదురుగా నిలబడ్డ తాత్విక భూమికను సరిగా అర్ధం చేసుకున్న వారే ఇలాంటి రచనలు చేయగలరు. చెదురు మదురుగా వ్యక్తులపై, వారి ఉదారతపై ఆధారపడి అనివార్యంగానో అనాలోచితంగానో కాకతాళీయంగానో జరిగే న్యాయాన్ని సాధారణీకరించడానికి ధైర్యం చాలక పోవడం ఎంత సహజమో అంత సహజంగా రాశారు ఈ వ్యాసాన్ని. వ్యవస్థ మీది అపనమ్మకాన్ని అంతర్లీనంగానూ బాహాటంగాను వ్యక్తం చేసిన రచయిత పద్మాకర్ గార్కి అభినందనలు. ఇలా ఆలోచింప చేసే రచనలు మరిన్ని రచయిత చేయగలరని ఆశిస్తూ…..

  7. అవసరమైన రచన.న్యాయస్థానాల్లో కూడా అంతా ఒక పద్ధతిలోనే జరగదు. కొన్ని సార్లు న్యాయమూర్తుల వ్యక్తిగత అభిప్రాయాలు పనిచేస్తాయి. కాకపోతే ఇపుడు జరిగిందైతే మంచి పరిణామమే. దీన్ని జనరలైజ్‌ చేసి ఇక మంచే జరుగుతుందని ఆశించలేం.

  8. చందు తులసి says:

    ప్రతీ మార్పునూ…తీర్పునూ గీటురాయితో పరీక్షించాల్సిందే తప్పదు.
    సమాజాన్ని, మార్పులను …..అర్థం చేసుకోవడానికి మీ లాంటి వారు రాసే వ్యాసాలు చాలా ఉపయోగపడతాయి సార్.
    మీలో మంచి కథారచయితే కాదు.. మంచి రాజకీయ విశ్లేషకుడు వున్నారు.
    మీరు తరచుగా రాయాల్సిన అవసరం వుంది పద్మాకర్ సాబ్..

  9. Raghavender reddy says:

    మీరు మామూలు టీచర్ అని అర్థమైంది. కాని, ఒక మాములు టీచర్కు ఇంత తాత్వికత ఉంటుందా? అందరు సార్లు ఇలా ఉంటే సమాజం ఎలా ఉంటుందో. ఉన్నత న్యాయస్థానం జడ్జీ గారు కన్నీరు పెట్టడంలో నిజాయితీ లేదు. అది కూడా మనం సరిగా అర్థం చేసుకోవాలి. ఉన్నత పదవుల విషయంలో పదవి ఎలా వచ్చిందన్నది పక్కనపెడితే, వచ్చిన తర్వాతనైనా సమాజం కోసం కొత్తగా ఆలోచించిన వాళ్ళు ఎందరు? నాకయితే శేషన్ గుర్తుకు వస్తాడు. ఎన్నికల సంస్కరణల్లో భూకంపం సృష్టించినవాడు శేషన్. మరి న్యాయవ్యవస్థలో అలాంటి మొనగాళ్ళు ఏరి? అలాంటి వాళ్ళు రాక పోతే న్యాయవ్యవస్థ కొద్దిగానైనా బాగు పడుతుందని ఆశించలేం. ‘న్యాయం చేయడంలో జాప్యం చేస్తే అన్యాయం చేసినట్లే’ అనే ప్రాథమిక సూత్రాన్నే సమాధి చేసే ఈ న్యాయమూర్తులు అసలు ఎట్లా న్యాయమూర్తులు అవుతారు? ప్రధాన న్యాయమూర్తి కన్నీటిని అందరూ ఖండించాలి.

  10. akbar pasha says:

    ఇప్పుడు జేఎన్యూ విద్యార్థులు ఈ దోపిడీ వ్యవస్థలో ఏమి జరుగుతోందో లోకానికి చక్కగా చాటి చెపుతున్నారు. రాజ్యాన్ని దీటుగా ఢీకొంటున్నారు. కన్హయ్యకుమార్ ప్రసంగాలు ఈ దేశవాసులకు, ముఖ్యంగా మన తెలుగు వారికీ అర్థమయితే బాగుండును.

  11. పద్మాకర్,
    ఈ ఆర్టికల్ లోని కంటెంట్ దాని బాగోగుల సంగతి సరే కానీ, లాజిక్ ని క్రూడ్ గా కాక మానవీయంగా చెప్పే మీ శైలి మనసుని కదిలిస్తుంది. మీరు చెప్పినదానితో ఏకీభావం ఉన్నా లేకున్నా ఆలోచింపజేస్తుంది. ఆలోచింపజేయడం అక్షరం సాధించే మొదటి విజయం.

  12. కె.కె. రామయ్య says:

    మన రాజకీయాల దుర్మార్గాన్ని, కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసి దేశ సంపదని దోచిపెడుతున్న వ్యవస్థని, రావిశాస్త్రి తనకథల్లో పదేపదే చెప్పిన పోలీస్ పవర్ని … నిలువరించలేని కోర్టుల నిస్సహాయతనీ గురించి (రచయిత పెరుమాళ్ మురుగన్ భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు అనుకూలంగా మద్రాస్ హైకోర్టు తీర్పునిఛ్చినా) ఆలోచించమంటున్న పద్మాకర్ గారు, హేట్సాఫ్ టు యు!

  13. @ ఆర్.దమయంతి.
    “ఈ సమాజం మొత్తం దుమ్ము, ధూళీ, బురదతో పేరుకుపోయింది అంటే అందుకు కారణం ప్రభుత్వాలు, రాజకీయాలు అని ఖఛ్చితంగా చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం మీ అక్షరం”

    @ anil s royal
    “సమాజం కుళ్లిపోటానికి మనం (అంటే ప్రజలు) తప్ప మిగతా అందరూ కారణమా?”

    నిజానికి ప్రజలే అసలు సిసలు కారణం. అలాంటి ప్రభుత్వాలు ఏర్పరచే రాజకీయవేత్తలను ఏరి కోరి చట్టసభలకు పంపిస్తున్నది వారే గనుక.

    ఒక దృష్టాంతం చూడండి. ఒక అన్యాయం కళ్ళముందే జరుగుతుంటే నిస్సహాయంగా చూస్తాం తప్ప ఖండించం, ఎదిరికించం. ఆ ఎదిరికించలేకపోవడంలో కూడా ఒక సహేతుకమైన కారణం ఉంది. మనం ఎదిరికించినా కూడా మనకు మన ప్రక్కనే నిలబడి చూస్తున్న వాళ్ళ నుంచి వ్యక్తిగతంగా గాని కలిసికట్టుగా గాని సమర్ధన రాదు. అమ్మో మనం కూడా వెళితే మనను కూడా కొడతాడో/పొడుస్తాడో/చంపుతాడో అనే భయం వారిలో(లేక మనలో) ఆవరిస్తుంది. దాంతో వాళ్ళు మౌనంగా లోలోపల అయ్యో ఇంత అన్యాయమా అని మధనపడుతూనే చేతలుడిగి చూస్తుంటారు. దానితో ఒంటరిగా అన్యాయాన్నెదిరికించడానికి మనకు ధైర్యం చాలదు. అన్యాయం చేస్తున్న వాడికి/వారికి దాంతో ధైర్యం పెరుగుతుంది. వాడి చేతిలో ఉన్న ఆయుధమో లేక వాడితో ఉన్న గ్యాంగో వాడికి అదనపు బలాన్నిస్తుంది. ఇదొక పార్టు.

    కలగజేసుకున్న సందర్భంలో పోలీసుల రంగ ప్రవేశం తరువాత జరిగిన అన్యాయాన్ని మనం ఏకరువు పెట్టినా బాధితుడికి న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. అలా జరిగిన దాఖలాలు కూడా నూటికొకటో, కోటికొకటో. ఖచ్చితంగా పోలీసులు కండబలం, ధనబలం ఉన్న వారి వైపునే ఉంటారు.
    అది కాక మనం సాక్ష్యాలకు గాను పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు ల చుట్టూ ఎన్నాళ్ళు/ఎన్నేళ్లు మన పనులు మానుకుని తిరగాలో ఎవరికీ తెలియదు.

    అంటే సమాజంలో మనం నీతిగా నిజాయితీగా నిర్భయంగా మసలే పరిస్థితులు సృష్టించుకోవడంలో, వ్యవస్థలను క్రియాశీలంగా మలుచుకోవడంలో ఫెయిల్ అవడంలో రాజకీయ నేతలకన్నా, ప్రజల ఫెయిల్యూరే ఎక్కువ. ఉదాహరణగా మనం పదే పదే పక్కా అవినీతి పరులను, రౌడీలను, సమాజానికి కంటకంగా ఉన్న వారిని, చట్టసభలకు పంపటం దేని క్రిందికి వస్తుంది? మనమంతా వారి దౌష్ట్యాలను సమర్ధిస్తున్నట్లు కాదూ? ఇది ఆగే/తెగే వివరం కాదు గానీ ఖచ్చితంగా సమాజం కుళ్లిపోటానికి మనమే (అంటే ప్రజలు) కారణం.

    సందర్భానుసారంగా ఈ రోజు (17.07.2016) పేపర్ లో వచ్చిన వార్త చూడండి :
    ఆంధ్ర జ్యోతి హెడ్లైన్ : ప్రజలే సైన్యం.
    టర్కీ లో సైనిక తిరుగుబాటు .. విఫలం. విప్లవ స్ఫూర్తితో ప్రజాస్వామ్యానికి జనం పహారా .
    జవాన్లపై భీకర దాడి. చితక్కొట్టి బందీలుగా పట్టుకున్న ప్రజానీకం.

    ఈ తరహా విప్లవ ఆలోచనలు – తమకేది మంచో ఆలోచించి, ఆచరించే మనస్తత్వం జనంలో ఉన్నపుడే సమాజానికి మంచి జరిగేది. కుళ్లిపోకుండా ఉండేది.

    అనిల్ ఎస్ రాయల్ గారు, ఆర్.దమయంతి గారు, పద్మాకర్ గారు, ఇతర పాఠకులు నా అభిప్రాయంతో ఏకీభవిస్తారని ఆశిస్తాను. విషయమంతా సబ్జెక్టుతో interwoven (ఒక దానితో ఒకటి అల్లు కొన్న) గనుక
    ప్రధాన విషయంతో deviate కాలేదని భావిస్తాను.
    సరళ మోహన్ గారన్నట్లు మరిన్ని విషయాలతో మరింత సమగ్రంగా ఉంటే బాగుండేదని నా ఆలోచన కూడా.
    ఏమైనప్పటికి ఒక చక్కని విశ్లేషణ. వివరణ. అభినందనలు.

  14. ఎస్ ఆర్ బందా says:

    ‘ఈ భరోసా ఎంతవరకూ’ అని ప్రభాకర్ గారు వేసిన ప్రశ్న సామాజిక దృక్పథమూ సకారాత్మకమైన ఆలోచనా వున్న ప్రతి వ్యక్తీ వేసుకోవాల్సిందే. ఒకవైపు కొత్తకొత్త ఉత్పత్తి / లాభాల టార్గెట్లని సాధించాలనే తాపత్రయంతో తొందరతొందరగా సాగుతున్న ఆర్ధిక వ్యవస్థలో, దానిలోని అంతర్వ్యవస్థలైన సామాజిక, న్యాయ, నైతిక వ్యవస్థల్లో ప్రస్ఫుటంగా కనిపించే కొన్ని లోపాలుండటం సహజమేననుకుంటున్నాను. మీరూ నేనూ మనమందరమూ రోజూ చూసే ప్రపంచంలో బలంగా వీస్తున్న కంజ్యూమరిజం గాలులు ఆ లోపాలమీదినుంచి దృష్టిని చాలా త్వరగా మళ్ళించేస్తున్నాయి. అక్కడక్కడా అప్పుడప్పుడూ ప్రభాకర్ గారిలాంటి స్పష్టమైన, నిశితమైన, స్థిరమైన ‘చూపు గలవారి ప్రశ్నలు, ఆ గాలికి తలవంచని గడ్డిపోచల చందమే అవుతాయి. ఫ్రభాకర్ గారిలా ఆలోచించి, ఆచరణలోకి తేగలిగినవారి సంఖ్య ఎక్స్‌పొనెన్షియల్ గా పెరిగినప్పుడే ఆ ప్రశ్నలకి సమాధానాలుందొరికి, తద్వారా కొంతకాలానికి మార్పులూ రాగలుగుతాయని నా నమ్మకం.

  15. sasikala says:

    మీ లాంటి వారు ఇలా గీటు రాయి పై వ్రాసి చూపిస్తే మేము తెలుసుకుంటూ ఉంటాము , బాగుంది

Leave a Reply to THIRUPALU Cancel reply

*