13 జులై 1931

 

-అవ్వారి  నాగరాజు
~
1
ఎటు వైపునుండయినా దీనిని మొదలు పెట్టవచ్చునని తెలిసాక
అటూ ఇటూ కదలజాలక బంధితమై  ఉన్న చోటునుండీ ఇంటినుండీ కరుడుకట్టిన నిశ్చలప్రవాహాలలాంటి రోడ్లమీదకు ఉరకాలనుకునే నిస్సహాయపు రాత్రి నుండీ
కొంచెం భయంతో మరికొంచెం ఆసక్తితో మరణాన్ని తప్ప మరొకదాన్ని ఆవాహన చేయజాలని
రోజుల గుండెలమీద నెమ్మదిగా కదలాడుతున్న ఒకానొక పురా భారము నుండీ
నుదుటి మీద నీకోసం కేటాయించిన వరుస సంఖ్యను సదా ఊహిస్తూనే ఉంటావు
2
 రోజులు  నీలాగే వొట్టిపోతున్నపుడు లేదా నీవే  రోజులన్నింటిలాగా వొట్టిపోతున్నపుడు
జీవితం అర్ధాంతరమని  గీతగీసి మరీ చెప్పడానికి
 ఇంటిలో నీ తల్లో ఎవరో మరెవరో ఒక ఆడకూతురు నీ ఎదురుగానే తిరగాడుతున్నప్పుడు
 బిడ్డల చావుని తప్ప మరేదీ నమ్మనంత ధ్యానంగా వారు  మృత్యువుని మోసుక తిరుగుతున్నప్పుడు
నువ్వు వాళ్ళని ఊరకే అలా చూస్తూ ఉండలేవు
ముఖాల మీద కదిలీ కదలాడని ఒక పలుచని తెరలాంటి దాన్ని చదవకుండానూ ఉండలేవు
3
ముందుగానే తెలిసిపోయే భవిష్యత్తులాంటి
లేదా ఇంతకు ముందెప్పుడో సరిగ్గా అలాంటిదాన్నే అనుభూతి   చెందిన  పీడకలల ప్రయాణపు దారిలాంటి
చంచలిత దృశ్యాదృశ్యాల కలయికలలో
ఇదేరోజున నిన్ను జీలం నదీ శీతలజలాల చెవియొగ్గిన చప్పుళ్ళలో
ఇంకా రాళ్ళను విసిరేందుకు ఏరుతున్న రహదారులమంటల కశ్మీర్ లోయలలో
దుఃఖించినట్టూ గుండెలవిసేలా బాదుకున్నట్టూ
కాకుండా ఇక ఎలా రాయగలవూ?
*

మీ మాటలు

  1. పఠాన్ మస్తాన్ ఖాన్ says:

    చదివించాక చలించక వుండలేకున్నాను…

  2. హ్మ్మ్. అర్ధం అవుతుంది. గుండెలు బాదుకొనే ఆ బాధ.

  3. Telugu.venkatesh says:

    సలుపు …సలుపు…

  4. కె.కె. రామయ్య says:

    దేశవిద్రోహం (charges of sedition) కేసుపై అరెస్ట్ చెయ్యబడిన అబ్దుల్ కాదిర్ అనే యువకుడి విడుదలకై 1931 జూలై 13న శ్రీనగర్ సెంట్రల్ జైలు బయట జరిగిన ఆందోళనలను కంట్రోల్ చేయడానికి కాశ్మీర్ మహారాజా హరిసింగ్ యొక్క డోగ్రా ఆర్మీ జరిపిన కాల్పుల ఘటనలో 21 మంది ముస్లిం నిరసనకారులు చనిపోయారు. ఈ ఘటనను నిరసిస్తూ జమ్మూ కాశ్మీర్ లో అప్పటి నుంచి ప్రతి యేటా జులై 13ను సెలవు దినంగా ( అమరుల దినంగా ) పాటిస్తున్నారు. దీని పర్యవసానం గా 1934 లో Muslims Conference (MC) పార్టీ ఆవిర్భవించడం, 1946లో “Quit Kashmir” నినాదం, తదుపరి వేర్పాటువాదాలకు నాంది పలికింది.

Leave a Reply to రమాసుందరి Cancel reply

*