కులవృత్తుల వేదన బయటికి రావాలి

 

devendar

అన్నవరం దేవేందర్ ప్రముఖ తెలుగు కవి. 2001లో “తొవ్వ” కవితా సంకలనంతో మొదలై, నడక, మంకమ్మతోట లేబర్ అడ్డా, బుడ్డుపర్కలు, బొడ్డుమల్లె చెట్టు, పొద్దు పొడుపు, పొక్కిలి వాకిళ్ళ పులకరింత కవితా సంపుటాలు ప్రకటించారు. గత రెండు దశాబ్దాలుగా కవిత్వం రాస్తూ ఇప్పటికి పది పుస్తకాలు ప్రచురించారు. ఇటీవల “బువ్వకుండ” దీర్ఘ కవితను వెలువరించారు. ప్రధానంగా తెలంగాణ జీవన దృశ్యాన్ని, బహుజన దృక్పథాన్ని, ప్రపంచీకరణ పర్యవసానాలను కవిత్వీకరించారు. తెలంగాణ ప్రజల భాషను కవిత్వ భాషగా తనదైన శైలిలో ప్రయోగిస్తున్న వారిలో ముఖ్యులు అన్నవరం దేవేందర్.

ప్రపంచీకరణ, ఉదారవాద ఆర్ధిక విధానాలు, సాంకేతిక పురోగతి కుల వృత్తులను కనుమరుగు చేస్తున్నది. ఈ క్రమంలో కుమ్మరి వృత్తికి సంబంధించిన వస్తువును తీసుకుని దీర్ఘ కవితగా వెలువరించిన అన్నవరం దేవేందర్ గారితో బూర్ల వేంకటేశ్వర్లు జరిపిన ముఖాముఖి.

 

  • దేవేందర్ గారూ! కుల వృత్తి మీద దీర్ఘ కవిత వేశారు కదా! ప్రస్తుతం కుల వృత్తుల పరిస్థితి ఏమిటి? కుల వృత్తుల కొనసాగింపు పై మీ అభిప్రాయమేమిటి?

 

  • కుల వృత్తులు కూలిపోవడమనేది ఒక విషాదకర దృశ్యమే ఐనా కులవృత్తులు నిలపాలని ఎవరూ కోరుకోరు కోరుకోవలసిన అవసరం కూడా లేదు. వీటిని అధిగమించి బహుజనులు ఎదిగి రావాలె. ఇవి ప్రాచీన కళా శాస్త్ర సాంకేతిక నైపుణ్య రూపాలు. బహుజన కులాల శ్రమ జీవులంతా సామాజిక శాస్త్రవేత్తలు. కుండను కనిపెట్టడమనేది మెసపుటేమియా నాగరికత నాడే కనిపించింది. నూలు వడకడం, వంట వండడం మొదలైన మానవ నాగరికత పరిణామానికి మూల బీజాలు. ఈ టెక్నాలజీ కి, కళకు వాళ్ళు పేటెంట్ దారులే. ప్రపంచంలో ఎక్కడున్న వాళ్లైనా ఈ వృత్తులు కలవాళ్ళు తొలి నాగరికతకు బీజాలు వేసిన వాళ్ళే. ఈ వృత్తులల్లో కళతో పాటు సమాజోపయోగం కూడా ఉంటది. ఇది పర్యావరణానికి కూడా హాని చేయనిది. ఒక్క మిషన్ వందల చేతులను ఇరగ్గొట్టింది, ఒక కంప్యూటర్ రెండు వందల  టైపు మిషన్ లను లేకుండ చేసింది. ప్రపంచంలో ఏది కొత్తగ కనిపెట్టినా అది అంతకుముందున్న  వ్యవస్థకు విఘాతం కలిగిస్తది. అది అనివార్యమే, దాన్ని ఆపలేం. కాబట్టి దాన్ని అంది పుచ్చుకోవాల్సిన అవసరం ఉంటది. వ్యవసాయ రంగంలో నాగళ్ల స్థానంలో, ఎడ్లబండ్ల స్థానంలో ట్రాక్టర్లు వచ్చినయ్, పొలం కోతలకు హార్వేస్టర్ లు వచ్చినయ్. ఇంకా అన్ని రంగాల్లోకి వస్తయ్. వీళ్ళు కూడా ఇతర ఆధునిక వృత్తులలోకి అప్ గ్రేడ్ కావాల్సిన అవసరం ఉన్నది.

 

  • బువ్వకుండ దీర్ఘ కవిత రచనకు ప్రేరణ ఏమిటి? గతంలో ఏవైనా దీర్ఘ కవితలు రాశారా?

 

  • మల్ల ప్రపంచీకరణ నుంచే మొదలు పెడితే, ఈ ప్రపంచీకరణతో చాలా వృత్తులు పూర్తిగ అంతరించి పోతయ్. ముందు తరాలకు ఈ వృత్తుల గురించి తెలిసే అవకాశం కూడ లేదు. నేను కుమ్మరి కుల వృత్తి నుంచి రావడం వల్ల దీనిలోని కళాత్మకతను, నైపుణ్యాన్ని, మూలాల్ని సాహిత్యంలో రికార్డు చెయ్యాలను కున్నా. ఐతే, ముఖ్యంగా మిత్రుడు జూలూరు గౌరీ శంకర్ వెంటాడే కలాలు పేరుతో పదిహేనేండ్ల కిందనే చాలా కుల వృత్తుల కవిత్వాన్ని తీసుకచ్చిండు. దాన్ని రివైజ్ చేసే క్రమంలో మళ్ళీ రాయాలనే ప్రేరణ దొరికింది. గతంలో కూడ తెలంగాణ మీద నేలపాట, గుండె పాట అనే పేరుతోని రాసిన, నా బాల్యం గురించి కూడా పెద్ద కవితలు రాసిన కానీ, దీర్ఘ కవితలుగా రాయలేక పోయిన. ఆఖరి ముచ్చట అనే పేరుతోని రైతు చనిపోతూ చెప్పే స్వగతం గురించి దీర్ఘ కవిత రాయాలని తపన ఉండే. ఇవన్నీ ప్రేరణగా ఇప్పుడు “బువ్వకుండ” వచ్చింది.

 

  • తెలంగాణ ఉద్యమ సాహిత్యం  గురించి, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పరిస్థితి గురించి వివరిస్తారా?

 

  • గడిచిన దశాబ్దం అంటే 2014 కు ముందు దశాబ్ద కాలం దాకా తెలుగు సాహిత్యాన్ని తెలంగాణ సాహిత్యమే ఏలింది. ప్రధానంగా తెలంగాణ ఉద్యమం అణచి వేయబడ్డ తెలంగాణ భాష, సామెతలు, పాత్రలను సాహిత్యంలో ప్రతిష్టించింది. తెలంగాణ వచ్చిన తర్వాత చాలా కలాలు ఆగిపోయినయ్. తెలంగాణ ఆకాంక్ష కవిత్వం దాదాపుగా నిలిచిపోయింది. కానీ, తెలంగాణ విశిష్టతను తెలిపే తొలిపొద్దు, తంగేడు వనం లాంటి కవితా సంపుటాలు వెలువడ్డాయి. ఐతే, తెలంగాణ ఏర్పడంగనే సమసమాజం ఏర్పడ్డట్టు భావించవల్సిన పనిలేదు. కోస్తా ఆంధ్రా కమ్మ పాలన నుండి చేతులు మారి తెలంగాణ పాలన ఆరంభమైంది. రూపం మారినా పాలక వర్గ స్వభావ సారాంశంలో పెద్దగా ఆశించాల్సిందేమీ ఉండదు. సంస్కృతి, చరిత్ర నిర్మాణంలో పాలనాపరమైన తెలంగాణతనం మాత్రం కనిపిస్తున్నది. కవి తన గొంతును సవరించుకోవల్సిన అవసరం ఉంటది ఎపుడైనా.

 

  • మీరు తెలంగాణ భాషలో గత రెండు దశాబ్దాలుగా రచనలు చేస్తున్నారు కదా! తెలంగాణ భాష గురించి ఏమంటారు?

 

  • తెలుగు సాహిత్యంలో తెలంగాణ భాష అద్భుతంగా ఇమిడి పోయింది. తెలంగాణ భాష స్వభావరీత్యా నాదాత్మకమైన భాష. తెలంగాణ భాషలో ప్రాస, లయాత్మకత సహజంగ ఉండి వినసొంపుగ ఉంటది. ఇది సాహిత్య ప్రామాణికతను సాధించుకున్నది. నిజానికి తెలంగాణ వ్యవహార భాషను సాహిత్యంలోకి రానీయకపోవడం వల్ల దూరమైంది కానీ, దీనిలో ఏ భావాన్నైనా వ్యక్తీకరించే సత్తా ఉన్నది. సోమన , పోతన, సురవరం, వానమామలై, కాళోజీలాంటి వాళ్ళు వాళ్ళ సాహిత్యంలో వాడిండ్రు. 1956 తర్వాత రెండున్నర జిల్లాల భాష ప్రమాణ భాష చేసి, అదే ప్రసార మాధ్యమ భాష చెయ్యడం వల్ల తెలంగాణ భాష నిరాదరణకు గురైంది. నా దృష్టిలో భాషకు ప్రామాణికత ఉండడమే ఆధిపత్య భావజాలం.

 

  • ప్రస్తుత తెలుగు సాహిత్య స్థితి ఎట్లా ఉన్నది? నేటి తరం సాహిత్య స్పృహ ఎట్లా ఉన్నది?

 

  • ఒక పదేండ్ల కిందట తెలుగు సాహిత్యమంటే దిన వార మాస పత్రికలే అనుకున్నం. కానీ, వాటికి పదింతల సాహిత్యం  ఇప్పుడు అంతర్జాలంలో వస్తున్నది. ఫేస్బుక్, వాట్సప్, బ్లాగ్ లాంటి గ్రూప్ లతో పాటు  అంతర్జాల పత్రికల్లో అద్భుతమైన కవిత్వం, సాహిత్యం వెలువడుతున్నది. ఈ పత్రికలు సాహిత్యం కోసమే ప్రత్యేకంగా వేలువడుతున్నయ్. యువతరం దీన్ని పట్టుకున్నది. ఆర్ట్స్ సైన్స్ విద్యార్థులతో పాటు ఇంజనీరింగ్ విద్యార్థులు కూడ కథలు కవిత్వం రాస్తున్నరు. ఫేస్బుక్ లో కవి సంగమం, సాహితీ సేవ, సాహితీ సవ్వడి, ఇట్లా ఎన్నో గ్రూప్ లు వేల మంది సాహిత్యాన్ని దినదినం పోస్ట్ చేస్తున్నయ్. కరీంనగర్ జిల్లాలో కూడా ఎన్నీల ముచ్చట్ల పేరుతో మూడు సంవత్సరాలుగ వెలువడుతున్న కవిత్వం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. తెలుగు సాహిత్యానికి ఇప్పుడు పెద్దగా వచ్చిన ముప్పేమీ లేదు. రాశితో పాటు వాసిని కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది.

 

  • చివరగా…. కుండ మీద కుండ పేర్చినట్లుండే మీ కవిత్వ దొంతరలో బువ్వకుండలోని కొన్ని కవిత్వ పాదాల్ని ఉదహరిస్తారా?
  •  “మట్టిని లోహం పురాగ మింగింది/అయినా మన్ను పరిమళం మిగిలే ఉంది/కళాత్మకతలో ఉత్పాదకత దాగి ఉన్న కుల కశ్పి/ చేతి వేళ్ళ నుంచే ఆణి ముత్యాల్లాంటి కుండలు గురుగులు గూనలు రాలిపడుతయి”.

“ చేతి పనులన్నీ కవిత్వం అల్లినట్లే/ అందంగా నులక మంచం నేసుడు/ నూలు పోగుల అల్లికలతో రంగు రంగుల చీర/ పసురం తోలుతో కిర్రు చెప్పులు ముడుసుడు/ తాళ్ళు పగ్గాలు దందెడ్లు వడివడిగా పేనినట్టుగ/ బాడిశతో నాగండ్లు అమిరిచ్చుడు/ కర్రు గడ్డ పారకు మొన పెట్టినట్లుగనే/ వ్యవసాయ దారులు తినే దినుసులు పండిచ్చినట్లుగ/ సకల కుల వృత్తులు ఊరూరి సూర్యులు/ ఊరు పరస్పర సామాజిక సేవల వాకిలి/ ఉత్పత్తి సేవలు ఒక సామాజిక సన్నివేశం/ సమాజానికి బహుజనులు అందించిన బహుమానం/ తరతరాలుగ కొనసాగుతున్న వారసత్వం”.

“మట్టి నుంచే ప్రపంచానికి పట్టెడు ధాన్యం/ మట్టే వస్తుసేవలకు మూల్యాంకనం/ మట్టి కుండతో మొదలైన మనిషి జీవితం/మట్టి కుండతోనే అగ్గిల మాయం”.

 

మీ మాటలు

  1. B.Narsan says:

    Good interview brothers…a meaningful discussion took place.

  2. B.Narsaiah says:

    గుడ్ ఇంటర్వ్యూ బ్రదర్స్ …

  3. Ramesh Kumar says:

    Nice job both of you

  4. Amarendra Dasari says:

    కులవృత్తుల విషయం లో దేవేందర్ గారి ఆలోచనలు చాలా సమంజసం గా ఉన్నాయి ..మంచి ఇంటర్వ్యూ..అభినందనలు, థాంక్స్

  5. బూర్ల వెంకటేశ్వర్లు says:

    స్పందించిన అందరికీ ధన్యవాదాలు

Leave a Reply to Ramesh Kumar Cancel reply

*