పీడ కల 

gopi

లోగో: భవాని ఫణి

 

~
(చూస్తూ  ఉండగానే  ఇంకో రాజధాని మన కోసం  వెలిసింది. ఈ వెలుగు వెనక అన్నీ వెలుగులే కాదు, కొన్ని చీకట్లూ వున్నాయి. చింతలూ వున్నాయి. బతుకు వెతలూ  తలరాతలూ వున్నాయి. అరుదుగా  రాసే  అతి నిక్కచ్చి  కథకుడు  దారా గోపి. అనేక సంవత్సరాల కిందట  గోపి “గుడిసె ఏసోబు.కథలు” ఒక సంచలనం. గోపి కలం నించే  మళ్ళీ  ఇన్నాళ్ళకి  ఈ రాజధాని కథలు)
*
కృష్ణా కరకట్ట మీద, చుట్టూ పచ్చని పంటపొలాల మధ్య నడుస్తున్నా.
ఒక పక్క నది … ఇంకో పక్క మా వూరు.
అరటి తోటలు…
కూరగాయల తోటలు…
ఆకుకూరల తోటలు… పూల తోటలు…
ఒక్కటేంటి… ఎన్ని రకాల తోటలో….
యెవురో యెనకపక్కనుండి బుజంమీద కండవ లాక్కుండు.
యెనక్కి సూత్తే నవ్వుతుండు.
ఒయ్ ఎవురయ్య నువ్వు అనేలోపు లుంగి పంచ లాక్కుండు.
మల్లీ నవ్వుతుండు.
నా కండవ, లుంగీ లాక్కునే ప్రయత్నం చేశా
నన్ను తోసేసి సొక్కా లాక్కోబోయిండు..
నవ్వుతుండు… నన్ను ఎగతాలి సేత్తుండు.
దిగ్గున మెలుకువొచ్చింది… కళ్ళు తెరిచి చూసా…
అప్పుడర్ధమైంది… ఇదంతా కలని.
యిదేం కల? ఒంటిమీద గుడ్డలు గుంజుకున్నడు?!
ఆచ్చర్యమేసింది… భయంకూడా…
మంచమ్మీదనుండి లేసి గుడిసెలోంచి బయటికొచ్చా..
బయట పండు ఎన్నెల… తొలి కోడి కూసినట్టుంది…
మల్లీ యింట్లోకొచ్చా…
పిల్లలూ, తనూ నిద్రపోతున్నారు.
మంచంమ్మీద పక్కసరిసేసి, దుప్పటి దులిపి పడుకున్న.
“యేంటి మెలుకువొచ్చింది”
కప్పుకున్న దుప్పటి ముసుగు తీసి అడిగింది.
“ఏం లేదే… యేదో కలొచ్చింది”
“పీడ కలా? మంచికలా?”
“యేదో పిచ్చిదే… ఒంటిమీద గుడ్డలేవురో లాక్కున్నట్టు… సూసి నవ్వుతున్నట్టు”
“అదేం కల? పిచ్చికల”
నేనేం మాట్లాడలేదు.
తనే అంది… “దరిద్రపు కల… కాసిన్ని మంచినీలు తాగిపడుకో… “
నాకు మల్లీ మంచమ్మీదనుండి లేవాలనిపించలేదు. అట్టే పడుకున్న. ఇక నిద్రకూడా పట్టేట్టు లేదు.
అటూ, యిటూ దొర్లినా నిద్రొచ్చేట్టు లేదు.
“మంచినీల్లు తాగావా? పోనీ పక్కకి తిరిగన్నా పడుకో”
పక్కకి తిరిగి పక్కలో వున్న సంటిగాడిమీద సెయ్యేసి పడుకున్న. నిద్రొచ్చేట్టులేదు. కలే గుర్తొత్తంది.
“అదేం కల! ఒంటిమీద బట్టలు గుంజుకోటం యేంటి”
ఆలోసిత్తుండగానే తెల్లారింది. పిల్లలు, తనూ నిద్ర లేచారు.
“యేంటి తెల్లార్లూ పిచ్చికలలు కని తెల్లారేక నిద్రపోతున్నవా?”
“అదేం లేదే… నిద్రేడ పట్టింది”
“మరి లేవ్వా? పొలానికి పోవా?”
ఇక లేవక తప్పలేదు. మీదున్న దుప్పటి తీసి మంచమ్మీదనుంచి లేసి బయటికొచ్చిన. గుమ్మం ముందు రోడ్డుమీద శానామందున్నారు.
శీను, ప్రసాదు, రాంబాబు, యెంకటేసు, గోపాళం … శానమందే… రాతి బల్లమీద కూసున్నారు.
బద్దకంగా వొల్లరిసుకుంట ఆల్లకాడికెల్లిన.
“ఏంట్రా సూరీ నీకిప్పుడు తెల్లారిందా?”
 శీనుగాడు ఎకసెక్కంగ పలకరిచ్చిండు.
“యిప్పుడేంట్రా తొలికోడి కూసినప్పుడే మెలుకువొచ్చింది. యేదో పీడకలొచ్చింది… తర్వాత నిద్ర పట్టలేదు.”
“పీడకలొచ్చిందా? మానాయనే… యికనుంచి అదేపనిలే… పిచ్చికలలేం కర్మ మంచికలలు కూడా కనుకుంటా మంచమ్మీదనే వుండొచ్చు”
“యేమైందిరా?”
“యీడిప్పుడే నిద్రలేచిండు. సెప్పండ్రా యేమైందో”
“పేపర్లో, టీవీల్లో మనూళ్ల  పేర్లే పలుకుతున్నయ్. తెలవదా?”
ఇసుగొచ్చింది నాకు.
“యెహే, యేమైంది సెప్పండ్రా” అని గట్టిగా అరిసిన.
“ఉండ్రా బాబూ… యెందుకరుతున్నవ్… “
“మరి లేకపోతే ఏంట్రా. సంగతేంటో సెప్పకుండా ఎకసెక్కాలేంటి పొద్దున్నే”
“సర్లే .. ముందా నిద్రకళ్ళు తుడుసుకో… మనూళ్ళనే రాజధానిగా ప్రకటించారు. రాజధాని ఇక్కడే కడతారంట”
శీను చెప్పిండు. కానీ నాకేం అర్ధం కాలేదు.
“అయితే యేంటట?”
“యేంటంటవేంట్రా? రాజధాని కట్టేది మన భూముల్లోనే”
“అంటే”  అన్న బుర్రగోక్కుంట. నాకింకేం అర్ధం కాలేదు.
అక్కడున్నోల్లంతా పగలబడి నవ్వుతున్నారు నన్ను సూసి.
“ఏంట్రా యీడు మరీను… యింకా అర్థం కాలేదా? మన పొలాల్లోనే రాజధాని కడతారంటారా. మన పొలాలు తీసుకుంటారంట”
ఒక్కసారి దిమ్మదిరిగినట్టయింది. నోటెంట మాటరాలేదు. తెల్లారుజామునొచ్చిన కల గుర్తొచ్చింది… భుజమ్మీద కండవా, ఒంటిమీద లుంగి లాక్కొని నవ్వుతున్న మనిసి కనిపిచ్చిండు.
“వార్నీ … యిదేరా తెల్లారుజామున నాకొచ్చిన కల… ఒక మనిషి నా భుజమ్మీద కండవా, ఒంటిమీద లుంగీ లాక్కొని, సొక్కా కూడా లాక్కోటానికి సెయ్యేసిండు… పైగా నవ్వుతుండు”
కలగురించి సెప్పిన… అందరూ నవ్వుతున్నారు..
“మేం పేపర్లు, టీవీల్లో సూత్తే నువ్వు కల్లోనే సూసినావా…”
“ఒరేయ్ మల్లెల్లి పొడుకో… యింకేం జరుగుద్దో మాకంటే నీకే ముందు తెలుసుద్ది”
అందరూ నవ్వుతూ యెగతాలి సేత్తన్నారు.
ఇక అక్కడ ఉండలేకపోయా. యింట్లోకొచ్చిన. మనసేదో పరిపరి విధాల పోతంది.
పొలాలు పోతే ఎట్టా? బతికేదెట్టా? ఏం పనులు సేసుకోవాలా? ఏం తినాల?
అంతా అయోమయంగా ఉంది. ఏం తోచట్లా…
అయినా ఇదేం కల? తెల్లారగానే ఇదేం వార్త?
“ఓయ్… నిన్నే… “
యింట్లోకెల్తూ పిలిసిన. అది పొయ్యికాడ కూసుంది. తెల్లారిందంటే పిల్లోల్లకి ఆకలేసద్ది. వొండి వొక ముద్ద ఆల్లకెయ్యకపోతే గోలే.
“ఏంటీ” పొయ్యికాడ కూసోనే అరిసింది.
“యింట్లోకి రావే”
“వత్తన్నా…. ” లేచి యింట్లోకొచ్చింది.
ఏంటి సంగతి అన్నట్టు నా మొహంలోకి సూచింది.
“తెల్లారుజామున కలొచ్చిందని సెప్పాగా… “
“అవును సెప్పినవ్… అదేదో మనిసి ఒంటిమీద గుడ్డలు లాక్కున్నాడనీ… “
“ఆఁ … అదే … గుడ్డలు కాదే … బతుకే లాక్కుంటన్నారు”
“ఏంటయ్యా నువ్వు సెప్పేది… “
“అదేనే మనూళ్ళని రాజధానిగా యెన్నుకున్నారంట”
“యెవురయ్య… యెవురు యెన్నుకుంది”
“యింకెవురే … గవర్మెంటోల్లు…”
“అయితే?”
“అయితేంటి నీ మొకం… మన పొలాలు తీసుకుంటారంట… అందులోనే రాజధాని బిల్డింగులు కడతారంట…”
“యెందుకు?”
“యెందుకేంటే పిచ్చిమొకమా… మనకి కూడా ఒక హైదరాబాదు కావాలిగా?”
“అదెందుకయ్యా?”
“యెందుకంటావేంటి? కోర్టు, మంత్రులకి, ఎమ్మెల్యేలకి యిళ్ళు అన్నీ కావాలంట. అయ్యన్నీ యిక్కడే మన పొలాల్లోనే కడతారంట”
“యెవురు సెప్పారు నీకు?”
“అదిగో … రోడ్డుమీద ఆల్లందరూ అంటన్నారు”
బయటికొకసారి తొంగిసూసింది. ఆళ్లంతా యింకా అక్కడే కబుర్లాడుతున్నారు.
“ఆళ్ల మాటలకేం గానీ… ”  అని మళ్ళీ తనే అంది “పెద్ద పెద్ద ఊళ్ళన్నీ వొదిలి మనూళ్లకే వత్తరా యేంటి నీ పిచ్చి గాని.. ఆళ్ళు సెప్పటం … నువ్వు నమ్మటం”
నావైపు యెగా దిగా సూసి మళ్ళీ పొయ్యికాడికెల్లింది.
తను సెప్పేది నిజమేనేమో అనిపించింది ఒక్క సారి. అదే నిజమైతే బాగుండు అనిపించింది. పొలాల్లేకపోతే యెలా? యేపని సేసుకోవాలి? ఏంతిని బతకాలి?
పిచ్చెక్కినట్టుంది. ఏం తోచట్లేదు. ఎటూ పాలుపోట్లేదు.
ఇక లాభం లేదు. ఒక్కసారి కరకట్ట మీదకి ఎల్లొత్తే యేమైనా తెలుసుద్దేమో అనుకుంట అలా బయటికొచ్చిన.
“ఏడకెల్తన్నవ్” పొయ్యిమీద అన్నం కుండ దింపుతూ అడిగింది.
“యాడికి లేదులే… కరకట్ట దాకా పోయోత్త” అనుకుంటా రోడ్డున నడక మొదలెట్టిన.
***
పచ్చని పంట పొలాలు…
యేడాది పొడుగునా పంటలే
సిన్నప్పుడు మా తాత సెప్పిండు యేడాది పొడుగునా వంద రకాల పంటలు పండుతాయంట యిక్కడ.
కొన్ని పంటలు 45 రోజుల్లో సేతి కొత్తే, యింకొన్ని 90 రోజులకి, మిగతాయి 120 రోజులకి తయారు.
నాబోటి కూలోళ్ళకి నిత్యం పనుంటది. మా యింట్లో మొగుడూ పెళ్ళం యిద్దరం రోజు కూలీపనికొత్తం. నాకూలి 400 రూపాయలు. నా పెళ్ళానికి 250 రూపాయలు.
నాకిద్దరు పిల్లలు… కొడుకు బళ్ళోకెళతండు. బిడ్డ సిన్నది. ఆళ్ళమ్మతోనే వుంటది.
“ఏంట్రా సూరిగా… పొద్దున్నే పొలానికా?”
యెదురుగా మావూరి పెద్ద రైతు సుబ్బయ్య నాయుడుగారు.
“యెల్లెల్లు… యింకెంతకాలంలే”
“అదేంటయ్యా… అంతమాటన్నారు?”
“ఏంటంటావేంట్రా? నీకింకా తెలవలేదా? మనది రాజధాని ప్రాంతం ఇకనుండి. మన పొలాల్లోనే బిల్డింగులు కడతారు. మంత్రులు, అధికారులు అందరూ ఇక్కడే ఉంటారు”
“మరి మనం?”
“మనం ఇక్కడే ఉంటాం. కాకపోతే ఈపొలం పనులు గట్రా ఉండవు.”
“ఈ పనులు లేకపోతే మనం బతికేదెట్టాయ్యా?”
ఇప్పుడు సుబ్బయ్య నాయుడు గారు సెపుతుంటే రాత్రి నాకొచ్చిన కల, పొద్దున్నే సీను గాదోళ్లు సెప్పింది నిజమని నమ్మకం కలిగింది.
“పెద్ద పట్టణం కట్టబోతుంటే బతికేదెట్టా అంటావేంట్రా? మీ బామ్మర్ది హైద్రాబాదులో బ్రతకట్లేదా? రేపు నువ్వూ అంతే.”
తాపీగా సెప్పిండు సుబ్బయ్య గారు.
“నా బామ్మర్దంటే … అక్కడ ఏదో అపార్టుమెంట్లో వాచెమేనో ఏదో అన్నడు.”
“ఆ అదే… రేపు ఇక్కడ అలాంటి అపార్టుమెంట్లే వందలకొద్దీ వస్తాయ్. అప్పుడు నువ్వెంటి, నీ బామ్మర్ది కూడా ఇక్కడికే రావొచ్చు.”
నా వీపుమీద మెత్తగా సరసి నవ్వుకుంటూ ముందుకెళ్లిండు సుబ్బయ్య నాయుడు గారు.
“ఏంటి అపార్టుమెంట్లో వాచ్మేనుగా పనిసేయాలా? అదేం బతుకు? ఇప్పుడు మా తాత సంపాదించిన అరెకరం పొలంలో సక్కగా కూరగాయలు, ఆకు కూరలూ పండించుకుంటా దర్జాగా బతికేస్తున్నా. నాకు నేనే రాజుని. ఇప్పుడేంటి వాచ్మెను పనా?”
భయం వేసింది. గుండె దడ దడగా కొట్టుకుంటంది. నిజమేనా? నేను వాచ్మెనుగా మారిపోవాల్సిందేనా? నా అరెకరం పొలం పోతదా?
ఈ సుబ్బయ్య నాయుడు గారేంటి ఇంత ధీమాగా ఉన్నడు? మా ఊళ్ళో పెద్ద ఆసామి అలా అన్నడేంటి?
నిజమేనా? నేను వాచ్మెనుగా మారిపోవాల్సిందేనా? నా అరెకరం పొలం పోతదా?
బుర్ర వేడెక్కినట్టయింది.
తెల్లారుజామునొచ్చిన పీడకల మల్లీ గుర్తొచ్చింది.
ఒంటిమీద గుడ్డలెవరో లాక్కుంటున్నారు… నన్ను సూసి నవ్వుతున్నారు.

మీ మాటలు

 1. Jhansi Papudesi says:

  Chaduvuthunte naake dadochesindi….vaallu ela brathukutharo ento! Saili superb! Chala baavundi!

 2. D Subrahmanyam says:

  ఎంత కదిలించేలా అక్కడ ప్రజల బాధను రాసారండి. అక్కడ భూముల అమ్మకానికి పాపం రేయనక పగలనక మన ముఖ్యమంత్రి తిరగని దేశం లేదు పట్నం లేదు. ఇక్కడ నిర్వాసితులయ్యే ప్రజల బాధ ఎవరు తీరుస్తారో ఊహించుకోడానికే భయంగా ఉంది.

 3. దేవరకొండ says:

  నడుస్తున్న చరిత్రని అక్షరబద్ధం చేశారు రచయిత. మనుషుల కోసమే మనవలసిన రాజ్యం మనుషుల్ని విడగొట్టి బలహీనుల్ని చేసి, దోపిడీ వ్యవస్థను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటుందో వార్తా పత్రికల్లో వచ్చే వార్తల్లో కాక రాజ్య స్వభావాన్ని బట్టబయలు చేసే ఇటువంటి రచనల్లో ప్రజలకు అందుతుంది. ఉత్పత్తి కారకాల్లో ప్రధానమైన భూమిని అందునా పచ్చని పంట పొలాల్ని anutpaadaka (unproductive ) అవసరాలకు వాడుకోవడం అన్యాయం, అవివేకమే కాదు, నైతికంగా నేరం, ఘోర పాపం. రాజకీయ రంగుటద్దాల్లోంచి చూసే వారికి ఆ రాక్షసత్వాన్ని సమర్ధించాలనిపించవచ్చు. ఒక సామాన్య రైతు మనసు ఎన్ని జన్మలెత్తినా వాళ్లకు పట్టదు. చిన్న రైతు మనసును సహజంగా చిత్రించిన రచయిత గోపి గార్కి అభినందనలు. (పైన ఇంగ్లిష్లో రాయవలసి వచ్చిన పదం ఇందులో చేయడం కుదరడం లేదు. ఎవరైనా ప్రయత్నించగలరు)

  • పచ్చని పంట పొలాలు వదిలేసి కొంచెం దూరంగా యేడాదికి ఒక పంట పండే పొలాల్లో రాజధాని నిర్మించుకోమని అక్కడి ప్రజలు చెప్తున్నారు, పర్యావరణ, తదితర మేథావులు చెపుతున్నారు.

 4. MUDDANA SUDHAKARA RAO says:

  మల్లన్న సాగర్ రైతుల గురించి కూడా మేధావులు, కవులు, మీడియా సరిగా స్పందించాలి

 5. Very disappointing attempt.

  అసలు ఇది కథనా లేకపోతే వ్యాసమా అనే ప్రశ్నను పక్కన పెడదాము కాసేపు. ఒక విషయము గురించి కథ రాద్దాము అనుకునేప్పుడు దాని గురించి రవంతైనా రిసర్చి చెయ్యాలి అనేది కనీస అవసరము. వ్రాసే భాషలో మాండలీకము/యాస లాంటి వాటిని వాడదాము అనుకున్నప్పుడు అవి కృతకముగా ఉండకూడదు అలాగే ఆ ప్రాంతవాసుల యాసని ప్రతిబింబించాలి. ఈ రెండు విషయాలను గాలికి వదిలేయటము ఈ రచనలో ప్రస్ఫుటముగా కనపడే ప్రాథమికి లోపము.

  ఇందులోని అరఎకరము ఉన్న బడుగురైతు విషయమే తీసుకుందాము. ఏ విధముగా చూసుకున్నా ఆ రైతు (ఇలాంటి అర్థము పర్థము లేని రచనలు చదవకుండా సరిగ్గా అవగాహన ఏర్పరచుకుంటే) ఇవాళ కోటీశ్వరుడు. ఖరీబు భూమి అని వ్రాసారు కాబట్టి ఓపెన్ మార్కెట్ లో ఆ అరఎకరము భూమి విలువ కోటి పైనే. ఈ లింకుని చూడండి. https://www.facebook.com/teluguyankee/posts/1097758746936367?notif_t=like&notif_id=1468624405934490 అలా కాకుండా ల్యాండు పూలింగులో గవర్నమెంటుకి ఇద్దాము అనుకుంటే, వచ్చే పది సంవత్సరాలలో ఇంట్లో కూర్చుని సంవత్సరానికి కనీసము 30 వేలు వస్తుంది. ముందు ముందు డెవలప్ అయ్యాక 800 గజాల (అర ఎకరానికి) వస్తుంది. అప్పుడు దాని విలువ ఏంటనేది మీరే ఊహించుకోండి. ఇంకా డీటెయిల్సు కావాలంటే ఇలాంటి లింకులు చాలా ఉన్నాయి. http://indianexpress.com/article/india/india-news-india/land-acquisition-a-new-capital-city-in-farmland/ .

  ఇకపోతే యాస భాష విషయము. నేను కృష్ణమ్మ దగ్గిరలో పెరిగిన పల్లెటూరివాడిని. నాకు తెలిసి మా ప్రాంతములో ఎవరూ కూడా ఈ యాసను వాడరు. నవ్వుతుండు, యేసిండు లాంటి పదాలు ఉదాహరణ.

  An earnest request to writers – please please do some due diligence before writing about a contemporary topic.

 6. పే కామెంటులో మొదటి లింకును తప్పు ఇచ్చాను. ఈ లింకుకి వెళ్ళండి. http://avenue.in/plots-land-prices-in-amaravati-ap-crda-landpooling-townships/

 7. సురేష్ గారు… “అర ఎకరం పొలం ఉన్నవాడు కూర్చొని తినొచ్చు… కోటీశ్వరుడు” అని facebook క్లిప్పింగ్ పెట్టడంలోనే “దోపిడీ తత్వం” ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. కష్టపడి పని చేసే రైతులు, రైతు కూలీలు “కూర్చొని తినాలి” అనుకోరు. ఇలాంటి దోపిడీ తత్వాన్ని పక్కన పెడితే ఆ బాధలు అర్ధవు అవుతాయి. అరెకరం ఉన్న వాళ్లే కాదు 25, 50, 75 ఎకరాలు ఉన్న అనుమోలు గాంధీ, మల్లెల శేషగిరి రావు లాంటి రైతులంతా అక్కడ ఇప్పటికీ పోరాటం చేస్తున్నవారే. “కూర్చొని తినాలనే” యావ ఉన్నప్పుడు ఇలాంటి విషయాలు అసంబద్ధంగానూ, అనవసరంగానూ, అర్ధం లేనివి గానూ కనిపిస్తాయి. అది వర్గ తత్వం. ఇంకొంత రాజకీయ అభిమానం కూడా కలుస్తుంది. అదంతా మీకు ఆగ్రహాన్ని తెప్పించి అక్షర రూపం ఇచ్చింది. మీ లాగా సమర్ధించే వాళ్ళు ఉన్నట్టే వ్యతిరేకించే వాళ్ళూ ఉన్నారు, భయంతో తటస్థంగా ఉన్నవాళ్లు ఉన్నారు. ఇంకో విషయం మందడం గ్రామంలో, బోరుపాలెం గ్రామంలో నాకు వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. మందడం గ్రామంలో క్రైస్తవ మిషనరీ వారికి చెందిన 16 ఎకరాల భూమిని నేను కౌలుకు చేశాను.
  ఇక మాండలికం/యాస గురించి మాట్లాడినప్పుడు — మీబోటి వారికి కూలి జనం ఎలా మాట్లాడతారో తెలియకపోతే అది నా తప్పు కాదు. భాష ఉచ్చారణను అక్షర రూపంలో పెట్టటంలో కొంచెం తేడా ఉండొచ్చేమో గాని మాండలికం అది కాదు అంటే మీరు ఈప్రాంతాన్ని, ఈ ప్రాంత ప్రజల్ని ప్రత్యేకించి పేద ప్రజల యాసను మర్చిపోయారని ఇలా ఒప్పేసుకున్నారు.
  మరో విషయం … మీరు ఆశించే వ్యాఖ్యలు కూడా “సుబ్బయ్య నాయుడు పాత్ర” చెప్పింది… అలాంటి వాళ్ళూ ఉన్నారు. రచయితగా అది కూడా నేను గుర్తించానని అంగీకరించలేక పోవటంలోనే ఈ కథ వాస్తవానికి ఎంత దగ్గరగా ఉందో అర్ధం అవుతోంది. ఫేస్ బుక్కుల్లోంచి బయటకొస్తే అక్కడ వినిపించే రెండు మూడు వాదనలు కూడా వినిపిస్తాయి.

  • కాజ సురేశ్ says:

   గోపిగారు – నా పోష్టు మళ్లీ చూసాను. నాకు ఎక్కడా “అర ఎకరం పొలం ఉన్నవాడు కూర్చొని తినొచ్చు… కోటీశ్వరుడు” అని ఉండటము కనపడలేదే. మీ కథలో లో లాగా నేను in-between-the-lines ఏమీ వ్రాయలేదు. తిన్నగా ఒకటే పాయింటు అడుగుతున్నాను. ఆ బడుగు రైతు భవిష్యత్తు మీరు కథలో చెప్పినట్టు భయంకరముగా ఉన్నదా? “దోపిడీ తత్వము”, “వర్గ తత్వము” లాంటి cliched పదాలను, “కూర్చుని తినాలనే యావ, రాజకీయ అభిమానము” లాంటి అసంబద్ధ ప్రలాపాలను నా గురించి ఏమీ తెలియకుండా మీకు మీరే ఊహించేసుకుని నా మీద ప్రయోగించమాకండి. నిజముగా మీ రాతలు ద్వారా మేలు చేద్దాము అనుకుంటే అలాంటి రైతులకి సరైన సలహా ఇవ్వండి. కోటి రూపాయలతో కూర్చుని తినమని చెప్పమాకండి (నేను చెప్పలేదు). నా పోష్టులో వ్రాసినట్టు ఆ డబ్బు కొన్ని ప్రాంతాలలో బడుగు రైతుని బడా రైతుగా మార్చగలుగుతుంది. మరిన్ని ఎకరాలు కొనుక్కుని షంషేరుగా కష్టపడి వ్యవసాయము చేసుకోమనండి అలాంటి సలహాలు ఇవ్వండి. అంతే గాని ఇలాంటి బూజుపట్టిన, కాలము చెల్లిన భావాలను రచనలలో నూరిపోయకండి.

   ఇక భాష గురించి అంటారా.. “నా బోటి వారు” అంటే “ఏ బోటి వారు” అనే భావన మీకుందో నాకు తెలియదుకానీ – మళ్లీ ఒకసారి జాగర్తగా మీ రచనని చూసుకోండి.

   ఈ పోష్టులో నాది ఇదే ఆఖరి కామెంటు. అన్నట్టు నాకు దోపిడీకి టైము అయ్యింది. శలవు

 8. సురేష్ గారూ, మీవ్యాఖ్యలు మీకే కనిపించడం లేదంటే నేనేం చేయగలను? “అరెకరం పొలం ఉన్న బడుగు రైతునే తీసుకుందాం.” “ఏరకంగా చూసినా అతను కోటీశ్వరుడే.” తర్వాత ఇంకోచోట “ఇంట్లో కూర్చుని సంవత్సరం పొడవున” ఇవి కనిపించలేదా?
  అక్కడ పొలం అమ్ముకుంటే ఇంకోచోట ఎక్కువ పొలం కొనుక్కొని పెద్దరైతుగా మారొచ్చు అని మీరనుకున్నట్టే కొంతమంది రైతుల మాచర్లవైపు, మార్కాపురం వైపు వెళ్ళి భూములు కొన్నారు. కానీ అవి పొలాలు అవ్వాలంటే నీళ్ళెక్కడ? భూమి ఉన్నచోటల్లా పొలం అవదు. నీళ్ళున్న చోటభూమి మాత్రమే పొలం అవుతుంది.

మీ మాటలు

*