దృశ్యభ్రమణం లోంచి…

 

 

 -దాసరాజు రామారావు

~

అట్లా నడుస్తుంటానా

మూల మలుపు తిరగ్గానే
సూర్యుడెదురుపడి ఆలింగనం చేసుకుంటడు
రోడ్డుమీది పేపరొకటి ఎగిరొచ్చి నా ముఖానికి అతుక్కుంటది
మితృని కవిత అచ్చయిందేమో
అడుగు తీసిన్నో లేదో
ఎప్పుడొచ్చిందో నా కాళ్ళచుట్టు  అల్లుకుపోతుంటదా  కుక్కపిల్ల
ఏమంత తినడానికి పెట్టినానని…
ఇంతలో వెనకనుంచి నిద్రలేపే కోడిపుంజు లాంటి కరుకైన పిలుపు
నన్ను గుర్తు పట్టే,గుర్రుమనే ఆపాత మధురమైన గురువర్యుని గొంతుదే

దుకాండ్లు తెరుస్తున్నరు
పోటీలు మొదలైనయి
అమ్మడం,కొనడం గొప్పపని కిందే లెక్క
ఎవలకు వాండ్లు బతకడానికి ఏర్పాట్లు చేసుంటున్నట్లే
500 నోటుకి చిల్లరెవరిస్తరు
ఆ మిల్క్ బూత్ లో అడగొచ్చా
పాలలాంటి మనసుంటుందా వాడికి

రోడ్డు  రన్నరై  దూసుకెల్తున్నది
అడుగులు పడుతున్నా అక్కడే కూలబడ్డట్లున్నానా …

అన్ని ధ్వనుల దాడిల అంతరంగ సంభాషణ
ఇవాల్టి సినిమా సాంగ్ లా, ఎవరికీ పట్టని  లిరిక్కయింది
ఆ గుడిదగ్గర భక్తుల కోలాహలం
అసంతృప్త జనాభా ని ,నమోదు చేసుకుంటున్నాడా దేవుడు
బిచ్చగాడా చెట్టుకొరిగి కునుకుపాట్లు పడుతున్నడు
ఈ మాయామేయజగంబుతో పట్టి లేనట్లు

కాలుకింద కంకరముక్క గుచ్చుకొని,అమ్మని తలచుకొంటానా…

సున్నితపుత్రాసుల శెక్కరి తూచుతూ
కరెన్సీని కటినంగా వసూల్ చేస్తున్నడు ఆ షాపువాడు
స్కూల్ గేట్లోకి వెళ్ళక ,చదువులమ్మి హఠం చేస్తున్నది
రోబో గ తయారవ్వడం ఇష్టం లేక
ఈ పాటను కాపీ చేసుకొమ్మంటూ
జేబులో సెల్ అరుస్తున్నది
ఒనరూ నెనరు  దానికి పట్టదు
వలస వచ్చిన ఆ వృద్ధ దంపతులు
వీధి మూలన మిర్చి బజ్జీలు వేసి
అమ్మకానికి ఆశతో చూస్తున్నారు
వయసై పోయినందుకు శిక్షింపబడాలేమో

నడుస్తున్నానా,ఆలోచిస్తున్నానా,ఆవేదిస్తున్నానా ….

కొంచెం ఆకాశం మేఘమయమై
కంట్లోవాస్తవమేదో కనుమరుగై నట్టు-
శూన్యావరణలో నేనొక్కడినే కట గల్సినట్టు-

డేట్ల గేట్లు దాటుకుంటూ పోవడమే
నుదుటి ముందు సూర్యుని లాంటి ఉనికేదో
ఉదయిస్తూ ఉండాలనుకోవడం నుంచి పారిపోవడమే

పరిశుభ్రమైన గాడ్పులు వీస్తూ
మనసుల్ని గిలక్కొట్టి ,వెన్న తీస్తున్నట్లు  కలలొస్తుంటాయి ఇప్పటికీ…

కలల్ని ప్రచారం చేయడం
బాగుంటుందేమో
నడకకు గమ్యం దొరికే అవకాశం
ఉంటుందేమో

*

మీ మాటలు

 1. Naveenkumar says:

  హౌ బ్యూటిఫుల్ ..హౌ పెయింఫుల్ ..హౌ ట్రూత్ఫుల్..

 2. కె.కె. రామయ్య says:

  ఆవ్ మల్ల! ఇట్ఠాటోడిని సూరీడెదురుపడి ఆలింగనం చేసుకుంటడు!!

  బతుకునొప్పి గురించి నువ్వెంత చెప్పినా అర్థం కాలేదప్పుడు ( అమ్మ సంతకం )
  ( http://patrika.kinige.com/?p=3363 ) /
  శిథిలాల మధ్య విహరిస్తున్న పూర్వీకుల మనోగతం ( వెలితి ) /
  అణగదొక్కిన చరిత్ర కిప్పుడు పట్టాభిషేకం ( జననీ జయకేతనం )
  http://telugu.oneindia.com/sahiti/kavitha/2013/dasaraju-rama-rao-poem-velithi-119479.html

 3. dasaraju ramarao says:

  స్పందనలకి సలాములు

 4. veerabhadrappa.choppa says:

  నైస్ kavitha

మీ మాటలు

*