తేలియాడే మేఘాల్లో  … తనూజ  

 

సోలో ట్రావెలింగ్ 

 

వి. శాంతి ప్రబోధ

~

ఒక్కదాన్నే .. నేనొక్కదాన్నే..

ఇదే మొట్టమొదటిసారి ఎవ్వరూ వెంటలేకుండా ఒంటరిగా ప్రయాణం..
బెంగుళూర్ కో,  చెన్నైకో, పూనేకో   కాదు.  చిన్ననాటి నుండి కళ్ళింతలు చేసుకుని బొమ్మల్లో చూసి మురిసిన  హిమాలయాలలో తిరుగాడడం తనను చూసి తనే ఆశ్చర్యపోతోంది తనూజ.

 

అద్భుతంగా .. కొత్తగా గమ్మత్తుగా.. నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసి నాకు నన్నే ప్రత్యేకంగా నిలబెడుతూ .. బయటి ప్రపంచం తెలియకుండా పెరిగిన నేను నేనేనా…  అనే విస్మయాన్ని వెన్నంటి వచ్చిన ఆనందం ..  ఆశ్చర్యం మనసు లోతుల్లోంచి పెల్లుబికి వచ్చి ఆమెని ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నాయి .

 

నా కళ్ళ ముందున్న ప్రకృతిని చూస్తుంటే నేను ఉన్నది ఇండియాలోనేనా ..అనేంత  వైవిధ్యం .. ఆ చివర నుండి ఈ చివరికి ఎంత వైరుధ్యం …?

ఒకే దేశంలో ప్రాంతానికీ ప్రాంతానికీ మధ్య మనిషి ఏర్పాటు చేసుకున్న సంస్కృతీ సంప్రదాయాలు , ఆచార వ్యవహారాలు , భాషలు మాత్రమే కాదు ప్రకృతి కూడా విభిన్నంగానే . విచిత్రంగానే ..  ఆ భిన్నత్వమే.. నూతనత్వం వైపు పరుగులు పెట్టిస్తూ..  కొత్తదనం కోసం  అన్వేషిస్తూ.. భావోద్ద్వేగాన్ని కలిగిస్తూ.. మనసారా  ఆస్వాదిస్తూ… తనువంతా ఉత్సాహం నింపుతుందేమో .. ???  ఒంకర టింకర ఎత్తుపల్లాల గతుకుల రోడ్డులో కదులుతున్న మహీంద్రా జీప్ లాగే ఆమె ఆలోచనలూ .. ఎటునుండి ఎటో సాగిపోతూ ..
తననే పట్టి పట్టి చూస్తున్న బాయ్ చూపులు, హోటల్ ఫ్రంట్ డెస్క్ వాళ్ళ చూపులూ  గుర్తొచ్చాయామెకి .  రూం బాయ్ మొహమాటంలేకుండా హైదరాబాదీ అమ్మాయిలు చాలా ధైర్యవంతులా..  ఆశ్చర్యంగా మొహం పెట్టి మనసులో మాట అడగడం,  విదేశీ మహిళలు ఒంటరిగా రావడం తెలుసు కానీ భారతీయ మహిళలు ఇలా రావడం తానెప్పుడు చూడలేదనడం జ్ఞాపకమొచ్చి ఆమె  హృదయం ఒకింత  గర్వంగా ఉప్పొంగింది. తనకిచ్చిన గొప్ప  కాంప్లిమేంట్ గా ఫీల్ అయింది.

 

దేశంలో ఏ మూలకెళ్ళినా భారతీయ సంస్కృతిలో ఆడపిల్లల స్థానం ఎక్కడో తెలిసిందే కదా.. ఎంత మిస్ అయిపోతున్నారు అమ్మాయిలు అని ఒక్క క్షణం మనసు విలవిలలాడింది. కానీ, కళ్ళ ముందు తగరంలా మెరిసే మంచు కొండల  సుందర దృశ్యాలు కదిలిపోతుంటే  వాటిని మదిలో ముద్రించుకుంటూ మళ్లీ ఆలోచనల్లో ఒదిగిపోయింది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తనూజ.
మనసులోంచి ఎగిసివచ్చే ఆలోచనల్ని అనుభూతుల్ని ఎక్జయిట్ మెంట్ ని ఎప్పటికప్పుడు పంచుకునే మనషులు లేరనే చిన్న లోటు ఫీలయింది ఆ క్షణం.

వెంటనే హ్యాండ్ బాగ్ తెరిచి ఫోన్ అందుకుంది. సిగ్నల్స్ లేవు.
ప్చ్..  నా పిచ్చిగానీ ఈ హిమపర్వత శిఖరాలపైకి నేను వచ్చానని ఫోన్  సిగ్నల్స్ నాతో పాటు పరుగెత్తుకొచ్చేస్తాయా ? తనలో తనే  చిన్నగా నవ్వుకుంది.  ఆత్మీయనేస్తం మనోరమ ఇప్పుడుండి ఉంటే .. ప్చ్ .. యూ మిస్స్డ్  ఎ లాట్ మనో .. అవును, నిజ్జంగా  మనో .. మనని ఒక వ్యక్తిగా కాకుండా ఆడపిల్లగా చూడ్డం వల్ల ఎంత నష్టపోతున్నామో ..
నీతో చాలా చెప్పాలి మనో.  చూడు నా జీవితంలో ఇంతటి అద్భుతమైన క్షణాలు కొన్ని ఉంటాయని అసలెప్పుడయినా అనుకున్నానా .. అనుకోలేదే.  కానీ ఆ క్షణాలను మనవి చేసుకునే చొరవ ధైర్యం మనలోనే ఉన్నాయని ఇప్పుడిప్పుడే అర్ధమవుతోంది. వాటిని మనం తెలుసుకోవాలి. మన జీవితంలోకి తెచ్చుకోవాలి. ఆ క్షణాలిచ్చిన వెలుతురులో మన జీవితపు బండిని మనమే నడుపుకోవాలి.

నువ్వు  నా మాటల్ని చిన్న పిల్లల మాటల్లా తీసుకోకుని నవ్వుకుంటావని తెలుసు .  అయినా చెప్తున్నాను , మన జీవితపు  పగ్గాలు మన చేతిలోకాకుండా మరొకరి చేతిలో ఉంటే ఎలా ఉంటుందో స్పష్టంగా అర్ధమవుతోంది.  నాలో పొరలు పొరలుగా కప్పడిపోయిన ఊగిసలాటల పొరలు రాలిపోతూ.. కరిగిపోతూ ఉన్నాయి.

 

ఈ ప్రయాణం జీవితం పట్ల ఒక స్పష్టమైన అవగాహన  ఇచ్చింది… అది తెల్సుకోలేకపోతే .. ఎంత మిస్సవుతామో, ఎంత కోల్పోతామో నాకిప్పుడు స్పష్టమవుతోంది.
అవును మనో .. నివ్వెంత మిస్ అయ్యావో మాటల్లో చెప్పలేను మనసులోనే మాట్లాడేస్తోంది తనూజ మిత్రురాలు మనోరమతో.  నీలాకాశంలో తేలిపోతున్న మేఘాల్లో ఒక మేఘమాలికలా తనూ తేలిపోతున్నట్లుంది ఆమెకు .

ఈ రోజు టూరిజం డిపార్ట్మెంట్ వారి వాహనంలో  గ్యాంగ్ టక్ నుండి ఎత్తు పల్లాల గతుకుల రోడ్డులో కొన్ని గంటల ప్రయాణం.

నేను ఒక్కదాన్నే .. థ్రిల్లింగ్ గా .  ఆ  తర్వాత వచ్చింది చాంగు లేక్.

 

నెత్తి మీద నుండి తేలిపోయే మేఘాల్లోను , కళ్ళముందు పొగమంచులా కదిలిపోయే  మబ్బుల్లోంచి ఈ మూడు గంటల ప్రయాణం.. ఓహ్ .. అమోఘం. అద్బుతం.  ముందున్నవి కన్పించనంతగా మేఘం కమ్మేసి .. ఓ పక్క ఎత్తైన కొండలు మరో వైపు లోతైన లోయలు. వాటి అంచులో ప్రయాణం ప్రమాదపుటంచుల్లో ఉన్నట్లే సుమా..!.  వాహనం ఏమాత్రం అదుపు తప్పినా , డ్రైవర్ ఏ కొద్ది అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతులు.  ప్రతి టర్నింగ్ లోనూ హరన్ కొడుతూ చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ .. కమ్మేసిన మేఘం కింద దాగిన సరస్సు ను  చూసి నాలో నిరాశా మేఘం.

 

అంత కష్టపడి వచ్చానా..  లేక్ కన్పించలేదు.  పన్నెండు గంటలయినా సూర్యకిరణాల జాడలేదు.  నిస్పృహతో నిట్టుర్చాను.

అది గమనించాడేమో .. దగ్గరలో  బాబా హర్భజన్ సింగ్ ఆలయం ఉందని డ్రైవర్ చెప్పాడు.

అక్కడికి బయలు దేరా.  పాత టెంపుల్ నుండి  కొత్త టెంపుల్ కి వెళ్ళే దారిలోనే  టాక్సీ డ్రైవర్ ఇల్లు ఉందని తన ఇంటికి ఆహ్వానించాడు.
ఆహ్హాహ్హ.. నాకు వినిపిస్తోందిలే నువ్వేమంటున్నావో .. నీకు బుద్దుందా అని అచ్చు  మా అమ్మలాగే .. తిట్టేస్తున్నావ్ కదూ..? నువ్వు అట్లా కాక మరోలా ఆలోచిస్తావ్ .. ?

కానీ ఇప్పుడు చూడు, నేను ఒంటరి ఆడపిల్లననే భావనే కలుగలేదు తెలుసా ..?!.

 

జనసంచారం లేని కొత్త ప్రాంతం.  డ్రైవర్ వాళ్ళింటికి రమ్మనగానే వెళ్ళాలా వద్దా అని ఒక్క క్షణం ఆలోచించాను కానీ అది భయంతో కాదు.  శరీరాన్ని చుట్టుకున్న మేఘాల అలల ఒడిలో ప్రయాణం ఎక్కడ మిస్ అవుతానో అన్న మీమాంసతోనే సుమా .  నాకిక్కడ పగటి  కాపలాలు రాత్రి కాంక్షల విచారాలు అగుపించలేదబ్బా …

 

ఇంతటి ప్రతికూల వాతావరణంలో వీళ్ళు ఎలా ఉంటారో .. అనుకుంటూ  డ్రైవర్ తో మాటలు కలిపాను.

ప్రకృతి సౌందర్యం గొలుసులతో కట్టేసినట్లుగా ఉన్న నేను ఇప్పటివరకూ అతని వాహనంలోనే ప్రయాణించానా .. కనీసం అతని  పేరయినా అడగలేదన్న విషయం స్పృహలోకొచ్చి అడిగాను .
అతని  పేరు గోవింద్.  చిన్న పిల్లవాడే. ఇరవై ఏళ్ళు ఉంటాయేమో . చురుకైనవాడు.   చాలా మర్యాదగా మాట్లాడుతున్నాడు. అక్కడి వారి జీవితం గురించి చెప్పాడు.
మేం వెళ్లేసరికి వాళ్ళమ్మ చేత్తో ఏదో కుడుతోంది.  చేస్తున్న పని ఆపి లేచి తల్లి మర్యాదగా లోనికి  ఆహ్వానించింది.  తండ్రి పగటి నిద్రలో ఉన్నాడు.

నేను మాట్లాడే హిందీ ఆమెకు అర్ధం కావడం లేదు.  ఆమె మాట్లాడే టిబెటియన్ సిక్కిం భాష నాకు తెలియదు.

 

పేదరికం ఉట్టిపడే చెక్క ఇల్లు వారిది. చాలా చిన్నది కూడా . లోపలికి వెళ్ళగానే  రూం హీటర్ వల్ల వెచ్చగా ఉంది.   వాళ్ళమ్మ చేస్తున్న పని ఆపి వెళ్లి పొగలు కక్కే టీ చేసి తీసుకొచ్చింది.  నేను టీ తాగనని నీకు తెలుసుగా .. వాళ్ళు నొచ్చుకుంటారనో లేక  ఆ కొంకర్లు పోయే చలిలో వేడి వేడి టీ తాగితే హాయిగా ఉంటుందనో  గానీ ఆ నిముషంలో వారిచ్చిన టీకి నో అని చెప్పలేకపోయాను .

daari 2

వారిచ్చిన హెర్బల్ టీ  ఆస్వాదిస్తూ పాడి ఉందా అని ఆడిగా.  నాలుగు జడల బర్రెలు ఉన్నాయని అవి టూరిస్ట్ సీజన్ లో వారికి ఆదాయాన్ని తెచ్చి పెడతాయని చెప్పారు. ఎలాగంటే ప్రయాణ సాధనంగా జడల బర్రెని వాడతారట .  నాకూ అలా ప్రయాణించాలని కోరిక మొదలైంది.

 

పాలు, పెరుగు కోసం జడల బర్రె పాలే వాడతారట. చనిపోయిన దాని చర్మంతో చాల మంచి లెదర్ వస్తువులు ప్రధానంగా షూ చేస్తారట .  వాళ్ళింట్లో తయారు చేసిన రకరకాల చేతి వస్తువులు చాలా ఉన్నాయి .  అన్ సీజన్ లో వాళ్ళు ఇల్లు కదలలేరు కదా .. అలాంటప్పుడు ఇంట్లో కూర్చొని తమ దగ్గరున్న వస్తువులతో హండీ క్రాఫ్ట్స్ చేస్తారట.  టూరిస్ట్ సీజన్ లో వాటిని టూరిస్ట్ లకు అమ్ముతారట .  వాళ్ళమ్మ చేసిన వస్తువులు చాలా బాగున్నాయి. వేటికవి కొనాలనిపించినా రెండు హ్యాండ్ బ్యాగ్స్ మాత్రమే కొన్నాను. నీ కొకటి , నాకొకటి .

 

తర్వాత గోవిందు వాళ్ళ నాన్నను లేపి నన్ను పరిచయం చేశాడు. తమ భాషలో ఏదో చెప్పాడు. ఆ తర్వాత కొద్ది సేపటికి వాతావరణం కాస్త అనువుగా మారుతుండడంతో మేం చాంగులేక్ కేసి వెళ్ళిపోయాం.

 

టూరిస్టులు ఎవరూ కనిపించలేదు. చుట్టూ ఎత్తైన పర్వతాలు తప్ప .  దగ్గరకు వచ్చేవరకూ అక్కడ ఒక లేక్ ఉన్న విషయమే తెలియదు. అలాగే వేచి చూస్తున్నా .. గాలికి కదలాడే సన్నని ఉల్లిపొర తెరల్లా నెమనెమ్మదిగా మేఘం తరలి పోతూ .. వెలుతురు పలచగా పరుచుకుంటూ ..

 

చుట్టు ముట్టు ధవళ కాంతులతో మెరిసే పర్వతాల నడుమ దోబూచులాడే మేఘపు తునకల కింద చంగూలేక్ . నా కళ్ళను నేనే నమ్మ లేకపోయానంటే నమ్ము.  అప్పటివరకూ ఈ అందాలను మేఘం చీకటి దుప్పటిలో దాచేసిందా..  కళ్ళ గుమ్మం ముందు అద్భుత సౌందర్యం కుప్ప పోసినట్లుగా .. రెప్పవాల్చితే ఆ సౌందర్యమంతా కరిగి మాయమవుతుందోనని ఊపిరి బిగబట్టి చూశాను .
తెల్లటి మేఘ విహంగాల  మధ్యలోంచి నడచి వస్తున్న జడల బర్రె  మసక మసకగా అగుపిస్తూ . అది ఎక్కవచ్చా.. మనసులోంచి ప్రశ్న పైకి తన్నుకొచ్చింది.  డ్రైవర్ విన్నట్లున్నాడు . మీ కోసమే దాన్ని నాన్న తీసుకొస్తున్నాడు. ఎక్కి సరస్సు చుట్టూ తిరిగి రావచ్చని చెప్పడంతో ఎగిరి గంతేసింది మనసు.
పొట్టి మెడతో నల్లగా పొడవైన జుట్ట్టు చిన్న చెవులు, రంగు కాగితాలు చుట్టి అలంకరించిన కొమ్ములు ,  దాని వీపుపై వేసిన దుప్పటి మన గంగిరెద్దులపై వేసినట్లుగా వేసి ఉంది . కాకపొతే బలంగా కనిపిస్తోంది .

 

మేఘం పోయి వెలుతురు బాగా పరుచుకుంది.  గంట క్రితం ఇక్కడ ఎంత చీకటి .?  పది అడుగుల దూరంలో ఉన్నది అస్సలు కన్పించనంతగా ..
నెమ్మదిగా జడలబర్రె మీద ఎక్కుతుంటే కొంచెం భయమేసింది . ఎక్కడ పడేస్తుందోనని.  నా కెమెరా గోవింద్  కిచ్చి ఫోటోలు తీయించుకున్నా. వాళ్ళ నాన్న యాక్ కి కట్టిన ముకుతాళ్ళు పట్టుకొని ముందు నడుస్తూ లేక్ చుట్టూ తిప్పుకోచ్చాడు .  అప్పుడు నా మనసులో కలిగిన ఉద్వేగాన్ని, అనుభూతుల్ని, అద్వితీయ భావాన్ని  నీకు సరిగా అనువదించగలనో లేదో .. సందేహం ..
వింతగా అనిపిస్తోందా మనో .. చిన్నప్పుడెప్పుడో యాక్ ఫోటో పుస్తకాల్లో చూడడం , చదవడం గుర్తొస్తోందా .. ఆ యాక్ పై కూర్చొని చంగూలేక్ చుట్టూ చక్కర్లు కొట్టి వచ్చా .

 

అక్కడి బోర్డ్ ఇంగ్లీషు, టిబెటియన్ భాషల్లో ఉంది. మనవాళ్ళు  చంగూ లేక్ అంటే ట్సొంగు లేక్ అని టిబెట్ వాళ్ళు అంటారట.   ఈ సరస్సు  సిక్కిం -టిబెట్ బార్డర్ కు దగ్గరలో తూర్పు దిశలో  ఉంది.  ఆ లేక్ కి వెళ్ళే దారి  కొన్నిచోట్ల బాగుంది. కొన్ని చోట్ల కనస్ట్రక్షన్ లో ఉంది. అక్కడ కొండ చరియలు విరిగి పడడం తరచూ జరుగుతూ ఉంటుందట.  కాబట్టి రోడ్లు తరచూ పాడయి పోతుంటాయట.  కంగారు పడకు తల్లీ .. నేను వెళ్ళిన సమయంలో కొండచరియలు విరిగిపడడం జరగలేదులే. అందుకే  ప్రతి మూడు నెలలకొకసారి రోడ్డు వేస్తూనే ఉంటారట. జీప్ కుదుపుతో కొన్ని సెకన్ల పాటు ఆమె ఆలోచనలకు చిన్న అంతరాయం.  ఆవెంటనే మళ్ళీ మనో వీధిలో ఆప్తమిత్రురాలు మనోతో ముచ్చట్లాడుతూ .

 

మనో తిట్టుకుంటున్నావా ..  ఎంత తిట్టుకుంటావో తిట్టేసుకో .. ఇప్పుడు హోటల్ చేరగానే ఫోన్ చేస్తాగా ..  గాంగ్ టక్ లో దిగగానే చేశాను .  అంతే.  నువ్వు నా కాల్ కోసం ఎంత ఆత్రుతపడుతున్నావో ఉదయం నీ మిస్డ్ కాల్స్ చూస్తే అర్ధమవుతోంది.  నిన్న గురుడాంగ్ మార్ లేక్ నుండి రాగానే చేద్దామనుకున్నా .. సిగ్నల్స్ లేక చేయలేకపోయాను.  ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజు చేస్తాలేవే ..

 

ఆ .. అన్నట్టు , నా పర్యటనలో  ముందటి రోజుల  విశేషాలు చెప్పలేదు కదూ .. నేను గ్యాంగ్ టక్ లో ముందే బుక్ చేసుకున్న హోటల్ చేరానా .. హోటల్ రూంలోంచి దూరంగా కనిపిస్తూ రా రమ్మని ఆహ్వానిస్తున్న హిమాలయాలు, వాటి చెంత చేరాలని ఉవ్విళ్ళూరుతున్న మనసును కొన్ని గంటలు ఆపడం ఎంత కష్టమయిందో..అప్పటికప్పుడు వెళ్లిపోలేను కదా .. !

 

నిరంతరం వచ్చే టూరిస్టులతో నిండి ఉండే హోటల్ వారికి ఇంకా చాలా విషయాలు తెలిసి ఉంటాయనిపించింది.  ఎటునుండి ఎటు వెళ్ళాలి అని మ్యాప్  పరిశీలించా .
నేనున్న హోటల్ లోని టూరిస్టులతో పిచ్చాపాటి మాటలు కలిపాను . వాళ్ళలో బెంగాలీ టూరిస్టులతో పాటు  కొద్దిమంది  విదేశీయులు  ఉన్నారు.   మరుసటి రోజు ఉదయం బయలుదేరి  త్రికోణంలో ఉండే గురుదాంగ్ మార్  లేక్, లాచుంగ్  ఆ తర్వాత యుమ్మాంగ్ ల ప్రయాణం పెట్టుకున్నామనీ , వాళ్ళ వాహనంలో మరో ఇద్దరికి చోటుందని మాటల్లో  చెప్పారు వాళ్ళు.  ఆ హిమపర్వతాల యాత్ర మహాద్బుతంగా ఉంటుందని విని వున్నాను కదా .

daari 9

వెంటనే ట్రావెల్ డెస్క్ వాళ్లతో మాట్లాడాను. వాళ్ళు టూరిజం డిపార్టుమెంటుతో  కాంటాక్ట్  ఏర్పాటు చేశారు . అదే రోజు నా ఫోటోలు, వివరాలు తీసుకుని మరుసటి రోజు నా ప్రయాణానికి పర్మిట్ వచ్చేలా చేశారు. ఇది  ఏప్రిల్ మూడో వారం కదా .. టూరిస్టులు మరీ ఎక్కువగా లేరు. ఇకనుండీ రోజు రోజుకీ పెరుగుతారట.  అదే టూరిస్టులు ఎక్కువగా ఉండే సమయాల్లో  పర్మిట్ రావడంలో ఆలస్యం కావచ్చట.  నేను వెళ్ళింది పీక్ టైం కాదు కాబట్టి నాకు వెంటనే పర్మిట్ వచ్చేసింది.   నేనూ వాళ్లతో జత కలిశాను . నలుగురు బెంగాలీలు, ఒక విదేశీ నేనూ వెళ్ళాం. ఖర్చు తగ్గుతుంది కదాని అందరం కలసి ఒకే వాహనంలో వెళ్ళే ఏర్పాటు.  మొత్తం మూడురోజుల ప్రయాణం.

 

వింటున్నావా మనో .. ఆ ప్రయాణం ఆద్యంతం అత్యద్భుతం . ఉదయం 11 గంటల సమయంలో గ్యాంగ్ టక్  నుండి మా ప్రయాణం ఆరంభమైంది. ఎత్తైన మంచు కొండలు , లోతైన లోయలు , దట్టమైన అడవులు దాటుతూ  అద్భుత అందాలతో అలరారే గ్రామాలను పలకరిస్తూ   సాయంత్రం 6 గంటలకి లాచుంగ్ చేరాం.

 

లాచుంగ్ 10వేల అడుగుల ఎత్తులో ఉన్న చిన్న పట్టణం. అక్కడికి వెళ్ళే దారిలో మంచు కరిగి ప్రవహిస్తూ  కొండలపై నుండి కిందకు సవ్వడి చేస్తూ జారిపోయే జలపాతాలు .. ఆ రోజు రాత్రి బస లాచుంగ్ లోనే. అక్కడి నుండి యుమ్తంగ్ లోయ చూసి పాములాగా మెలికలు మెలికలు తిరిగి షార్ప్ కర్వ్స్ తో ఉండే  రోడ్డులో  జీరో పాయింట్ కు చేరాం .. అదంతా మంచుతో నిండి ఉంది. మంచు కరుగుతూ  పాయలు పాయలుగా రాళ్ళను ఒరుసుకుంటూ పల్లంకేసి జారిపోతూ చేసే గలగలలు .. తీస్టా నదిలోకి పరుగులుపెడుతూ చేసే సవ్వడులు ..

 

ఆ నదితో పాటే ఉరకలు వేస్తూ కొండా కోనల్ని పలుకరిస్తూ అలా వెళ్లిపోవాలనిపించింది ఆ క్షణం.. తీస్టా నది బంగ్లాదేశ్ మీదుగా ప్రయాణించి  బ్రహ్మపుత్ర నదిలో ఐక్యం అవుతుందట. తిరుగు ప్రయాణం  మళ్లీ లాచుంగ్,  చుగ్తాంగ్ మీదుగానే లాచన్ చేరి అక్కడే బస చేశాం. మూడో రోజు  తెల్లవారు జామున 3గంటలకే  బయలుదేరి  8 గంటలకి  గురుడాంగ్ మార్  లేక్ కి చేరాం. మార్గ మధ్యలో తంగు వ్యాలీ లో ఆగి బ్రేక్ పాస్ట్ చేసాం.

 

లాచన్ నుండి దాదాపు ఐదు గంటల ప్రయాణం అత్యద్భుతంగా … ప్రపంచంలోని ఎత్తైన సరస్సులలో రెండోదట గురుడాంగ్ మార్ లేక్  చేరాం.  భూమికి 17100 అడుగుల ఎత్తులో ఉన్నాం.

 

ఏయ్ నీకు తెలుసా .. ?

ఎంత హిమపాతం ఉన్నప్పటికీ  వాతావరణం ఎంత మైనస్ డిగ్రీలలో ఉన్నప్పటికీ  గురుడాంగ్ మార్ లేక్ లోని  నీరు కొంత ప్రాంతంలో  గడ్డకట్టదట.  బుద్దిస్ట్ మాంక్ గురు పద్మసంభవ అక్కడి నీళ్ళు ముట్టుకొని తాగి దీవించడం వల్లే ఆ నీటికి పవిత్రత వచ్చిందనీ, అందుకే ఆ ప్రాంతంలోని నీరు గడ్డకట్టదని సిక్కిం ప్రజల నమ్మకం అని నాతో కలసి ప్రయాణం చేసిన బెంగాలీలు చెప్పారు.  చలికాలంలో అక్కడికి ఎవరూ వెళ్ళలేరు. చూడలేరు కదా ..? వెళ్ళడానికి ఎవరికీ పర్మిషన్ ఇవ్వరు అన్న సంగతి తెలిసిందే కదా .. అలాంటప్పుడు ఆ ప్రాంతంలో నీరు గడ్డ కట్టిందో లేదో ఎవరికైనా ఎలా తెలుస్తుంది చెప్పు ?

 

గురుడాంగ్ మార్ లేక్ నీరు  తిస్టా నదికి ప్రధాన సోర్స్ ల్లో ఒకటి అట. ఈ లేక్ కి చుట్టు పట్ల మరో రెండు లేక్స్ ఉన్నాయి. వాటికి మేం  వెళ్ళలేదు. ఇండో – టిబెట్ సరిహద్దులో ఉన్న ఈ  మూడు సరస్సులను చూడాలంటే  ఆర్మీ పర్మిషన్ తప్పని సరి అవసరం. తీస్టా నదిలో దిగి ఆ స్వచ్ఛమైన నీటిలో కాసేపు ఆడుకున్నాం. ఆ నీటి అడుగున ఉన్న గులక రాళ్లు నునుపుదేలి ఎంత స్వచ్ఛంగా మెరిసిపోతున్నాయో .. నువుంటే ఆ రాళ్ళన్నీ మూటగట్టుకు వచ్ఛేదానివి . నీ కాక్టస్ ల చుట్టూ అలంకరించడానికి .
అక్కడ ఉన్నంత సేపూ నేను నా దేశంలోనే ఉన్నానా అనే సందేహం.  కానీ ,   సిక్కిం ఉన్నది మనదేశంలోనే కదా ..  ఈశాన్య రాష్ట్రాలు దేశ సరిహద్దుల్లో ఉన్నాయి కాబట్టి  సరిహద్దు ప్రాంతాల్లోకి ఎటు వైపు వెళ్ళాలన్నా ఆర్మీ అనుమతి తప్పనిసరట .  సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా దళాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతంలో పొటోలు నిషేధం.  లేక్ దగ్గర పొటోలు తీసుకోవడానికి ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు.  ఫోటోలు .. వీడియోలు నీకోసం సిద్దం చేస్తున్నాలే ..

 

ఆ చెప్పటం మరిచాను మనో ..  ఆర్మీ కాంపస్ ఉన్న దగ్గర చాలా నిబంధనలు.  బార్దర్స్ కి వెళ్ళే కొద్దీ మిలటరీ వాళ్ళ భద్రత చాలా ఎక్కువ. జీబ్ డ్రైవర్ చెప్పినా వినకుండా నేనెళ్ళి ఫోటో తీయబోయాను ఎక్కడనుండి చూసాడో ఏమో జవాను ఆరిచేశాడు .

 

గురుడాంగ్మార్ లేక్ కు 5 కిలోమీటర్ల ఆవల చైనా సరిహద్దు తెలుసా .. ? ఇవన్నీ చూస్తుంటే .. నాలో ఓ కొత్త శక్తి ఊటలు పుట్టుకొచ్చి ప్రవహిస్తున్నట్లుగా .. పుస్తకాలు ఎన్ని చదివితే ఈ అనుభవం వస్తుంది ..? ఆ..,  చెప్పు ?  ఎన్ని వర్క్ షాప్స్ లో పాల్గొంటే ఈ అనుభూతి వస్తుంది ? నాతో వఛ్చిన వాళ్లంతా ఎంతో మర్యాదగా స్నేహంగా ఉన్నప్పటికీ  నా అనుభవాలు, అనుభూతులు పంచుకుందామని నీకు ఫోన్ చాలా సార్లు  ట్రై చేశా .. ప్చ్ ..  సిగ్నల్స్ లేవు . ఎయిర్ టెల్ వాళ్ళ యాడ్ మనని మోసం చేసింది కదూ .. బియస్ యన్  యల్ నెట్వర్క్  కాస్త ఫర్వాలేదు . బెంగాలీ మిత్రులు అదే వాడుతున్నారులే .

నేనేం చేయనూ … నన్ను తిట్టుకోకు మనో . నెట్వర్క్ ని తిట్టుకో .. సరేనా …మనో
అటుచూడు .. ఉదయం వెండిలా మధ్యాహ్నం బంగారంలా మెరిసి సాయంత్రం ఎర్రగా  మారిపోయిన ఈ పర్వతశిఖరాలు చీకటిలో కరిగిపోతున్నాయ్ .. ఎంత అద్భుతమయిన దృశ్యమో ..

 

ఈ రోజు వెళ్ళివచ్చిన  చంగూ లేక్  టూర్ కి కూడా అప్పుడే  ప్రోగ్రాం ప్లాన్ చేసుకున్నా కదా..  ఉదయమే లేచి  ప్రయాణం కోసం మాట్లాడుకున్న వాహనం కోసం ఉద్వేగంతో ఆత్రుతతో ఎదురుచూపులు .  నీకు నవ్వు వస్తుందేమో .. చెప్తే ..  తనూజ మొహంలో సన్నని నవ్వు మొలిచింది . ఈ పనుల్లో పడి నీకు గానీ అమ్మ నాన్నలకు గానీ రాగానే ఫోన్ చేయలేక పోయాను.  ఈ రోజు రూం కి వెళ్ళగానే అమ్మా నాన్నలకి నీకు ఫోన్ చెయ్యాలి అనుకుంటూ హ్యాండ్ బాగ్ లో ఉన్న మొబైల్ తీసి మళ్లీ చూసింది.  ఊహు..  నెట్వర్క్ లేదు.

 

అమ్మ నాన్న గుర్తు రాగానే  కొద్దిగా నెర్వస్ గా ఫీలయింది ఆమె. ప్రస్తుతం నేనెక్కడ ఉన్నానో అమ్మకో నాన్నకో తెలిస్తే …చెప్పేస్తే .. అమ్మో..  ఇంకేమన్నా ఉందా ..?!
వాళ్ళని అంత ఇబ్బంది పెట్టొద్దని, మనసులో చేరి రొదపెడ్తున్న తపనని, కోరికని కాదనలేని సంఘర్షణ .  నాలో నేను ఎంతో సంఘర్షణ పడ్డ తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంది అని సర్ది చెప్పుకోనే  ప్రయత్నం చేసింది తనూజ.  కానీ, నన్నింత చేసిన తల్లిదండ్రులకు చెప్పకుండా రావడం తప్పు అనే ఫీలింగ్ ఆమెను వదలడం లేదు. ఎప్పుడూ లేనిది ఇప్పుడు గిల్టీగా అనిపిస్తూ .. వాళ్ళని ఒప్పించుకుని వస్తే ఈ గిల్టీనెస్ ఉండేది కాదేమో .. ఇంకా ఎక్కువ ఆనందించే దాన్నేమో ..అనుకుందామె.
హిమాలయ సోయగాల లోయలల్లోకి జారిపోతూన్న తనూజ మనస్సులోకి, కళ్ళ ముందుకి అన్న ట్రావెల్ చేస్తానన్నపుడు ఇంట్లో జరిగిన సంఘటనలు ప్రత్యక్షమయ్యాయి.

***                          ***                            ***
అన్న ఒంటరిగా ట్రావెలింగ్ చేస్తానంటేనే అమ్మ అసలు ఒప్పుకోలేదు. ఇంటా వంటా లేదు , ఏమిటీ తిరుగుళ్ళు  అని గోల చేసింది.   లేకపోవడమేంటి .. మా నాన్న ఆ రోజుల్లోనే కాశీ యాత్ర కాలినడకన చేసోచ్చాడని గొప్పగా చెప్పింది నాన్నమ్మ.  చివరికి ఎట్లాగో నాన్నమ్మ సహకారంతో అన్న  పెద్ద వాళ్ళని ఒప్పించుకోగలిగాడు.  అదే నేనయితేనా  చాన్సే లేదు. అస్సలు ఒప్పుకోరు. అందుకే గదా ఈ సాహసం చేసింది.

 

నా కోరిక చెప్తే నవ్వి తీసి పడేసేవారు . అది తనకి తెలియనిదా ..? అంతగా చూడాలని ఉంటే పెళ్ళయ్యాక మీ ఆయనతో కలసి వెల్దువులే అంటారు. లేదా ఫామిలీ ట్రిప్ ప్లాన్ చేద్దాంలే అంటూ నన్ను బుజ్జగించ చూస్తారు . కాని ఒక్క దాన్ని పంపడానికి ససేమిరా అంటారు.  ఉద్యోగం కోసం బెంగుళూరు పంపడానికే అమ్మ చాలా ఆలోచించింది.  అతికష్టం మీద ఒప్పించుకోవాల్సి వచ్చింది. . ఏమన్నా అంటే ఆడపిల్లలకి భద్రత లేదు. పెళ్లిచేసేస్తే మా బాధ్యత తీరిపోతుంది  అంటూ మొదలుపెడుతుంది. నాన్నదీ అదేమాట. పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు కూడాను. పెళ్లి అయితే భద్రత ఎలా వచ్చేస్తుందో .. ? వచ్చేవాడికి ఇవేమీ నచ్చకపొతే … ? నచ్చిన పని చేయలేకపోతే వచ్చే నిస్పృహ , నిరాశ లతో  నిస్తేజంగా ఉండే మెదడు ఆలోచించడం మానేసి రాజీ పడిపోతుందేమో..మిగతా అమ్మాయిల్లాగే తన జీవితమూ పరిమితం అవుతుందేమో .. ఎన్నెన్నో  సందేహాలూ ప్రశ్నలూ కలవరపరిచాయి.

 

ఉద్యోగం కోసం విశాల ప్రపంచంలోకి అడుగుపెట్టాక చాలా చదువుతోంది, తెలుసుకుంటోంది. తనను తాను విశాలం చేసుకుంటోంది ..తనలోని చీకటిని, నిశబ్దాన్ని బద్దలు చేస్తూ కలలను చిగురింపచేసుకునే ప్రయత్నమేగా  ఈ ప్రయాణం. జీవితమంటే ఖరీదైన ప్రాంతాల్లో  తిరగడం, డబ్బుతో సంతోషం కొనుక్కోవడమా కానే కాదు.  నిజమైన  జీవితాన్ని అనుభవించాలంటే, ఆస్వాదించాలంటే , ఆనందించాలంటే మారుమూల గ్రామాలోకి  ఎవ్వరూ వెళ్ళడానికి సాహసించని ప్రదేశాలకు వెళ్ళాలి. వారి జీవితాన్ని పరిశీలించాలి  . వాళ్లతో కరచాలనం చేసి వాళ్ళలో ఒకరుగా కలసిపోవాలి . అప్పుడే కదా జీవితం తెలిసేది .   మొదటి ప్రయాణం టూరిస్టులా వెళ్లి రావాలి.  ఆ తర్వాతే ట్రావెలర్ అవతారం ఎత్త్తాలని ఎన్నెన్ని ఆలోచనలో ..    తన ఆలోచనల ఆచరణ  సాహసమో.. దుస్సాహసమో.. కాలమే చెప్పాలి.
తన ఆలోచనలు చిన్ననాటి  మిత్రురాలు , కొలీగ్ అయిన మనోరమతో చెప్పినప్పుడు చెడామడా తిట్టింది. ఇవ్వాళా రేపు బస్టాపులోనే ఒంటరిగా నిల్చోలేని పరిస్థితి . ఇంట్లో ఉన్న ఆడదానికే భద్రత కరువైన పరిస్థితుల్లో సోలో ట్రవేలింగా .. వెధవ్వేషాలు మాని బుద్దిగా పెద్దలు చెప్పినట్టు నడుచుకోమని లేదంటే ఇప్పుడే  అమ్మతో చెప్తానని బెదిరించింది. చుట్టూ ఉన్న అద్భుతాలని అనుభవించాలన్న ఒకే ఒక కోరికతో ప్రపంచాన్ని చుట్టివచ్చిన భారతీయ మహిళ మెహర్ మూస్ గురించి చెప్పాను.

 

అప్పుడు చెప్పింది మనసులో మాట.

తనకీ ఇలాంటి ప్రయాణాలంటే ఇష్టమే అయితే అవి ఊహల్లోనే  కానీ ఆచరణ సాధ్యంకాదని కొట్టిపారేసింది.  అందుకే ఆచరణ సాధ్యం కాని వాటి గురించి ఆలోచించడం అనవసరమని తేల్చేసింది మనోరమ .

 

తనకేమో అన్న సోలో ట్రావెలింగ్ స్పూర్తి. అన్న వెళ్ళినప్పుడు తను ఎందుకు వెళ్ళకూడదు అన్న పంతం. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోగలనన్న ధీమా .

 

ఆడపిల్లలు ఎవరైనా ఇలా వెళ్ళారా అని ఇంటర్నెట్ లో వెతికా . మెహర్ మూస్ , అంశుగుప్త, షిఫాలి , అనూషా తివారి వంటి మహిళా బ్యాక్ పాకర్స్  చెప్పిన విశేషాలు విపరీతంగా ఆకర్షించాయి.  మరి నేను అలా ఎందుకు వెళ్ళలేను అనే ప్రశ్న .. నాలో నన్నే తినేస్తూ .. నా జీవితానికి నేనే కర్తని , కర్మని, క్రియని  అని నా ఆలోచనలు స్థిరపరచుకున్న తర్వాతే మనోతో విషయం చెప్పింది. చర్చించింది.   ప్రతి రోజూ నా  కదలికలు ఎటునుండి ఎటో చెప్పాలన్న ఒప్పందం మీద  మనో ఒప్పుకుంది. అలా చెప్పడం నాకు చిరాకనిపించినా సరే అనక తప్పలేదు.    బయలుదేరేటప్పుడు , తనుండే  వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో అమ్మాయిలు ఇదేం పాడు బుద్ది అని గుచ్చుకునే చూపులు  పిచ్చిదాన్ని చేసి వెటకారపు వ్యాఖ్యానాలు    దీనికి స్క్రూ లూజు అని నవ్వుకోవడం  అన్నీ గుర్తొచ్చాయి
***                       ***                     ***
ఆలోచనల్లో ఉండగానే హోటల్  వచ్చేసింది. ఫ్రెష్ అయి వచ్చి టీ తాగుతూ బయటికి చూస్తే చిక్కటి చీకటి మూసిన కిటికీ .. ఈ నాలుగు రోజులుగా  జరిగిందంతా తలచుకుంటే మళ్ళీ ఆశ్చర్యం ఆమెలో. ఇది కలా .. నిజంగానే ఇదంతా జరిగిందా .. చెయ్యి గిల్లుకుంటూ నవ్వుకుంది .

 

అమ్మకి ఫోన్ చేసి పలుకరించాలి.  నాలుగు రోజులైంది వాళ్ళతో మాట్లాడి మొబైల్ అందుకుని రింగ్ చేసింది. లైన్ కలిసింది.  కుశల  ప్రశ్నల వర్షం కురిపించింది.  కూతురి  గొంతులో నిండిన ఉత్సాహం అమ్మకి ఆమెను చూసినంత ఆనందం తృప్తి  కలిగినట్లనిపించింది.  కూతురికి అమ్మని నాన్నని  చూసినంత సంతోషం.  ఒకసారి స్కై ప్  లోకి వస్తావా అమ్మ ప్రశ్న.
అమ్మని స్కై ప్ లో చూడాలని మనసు తొందర పెట్టింది. కాని వెంటనే తనను తను సర్ది చెప్పుకుంటూ ఇప్పుడా .. రేపెప్పుడయినా వస్తాలే అమ్మా .. ఇంటర్నెట్ సరిగ్గా లేదు అని చెప్పి అప్పటికి తప్పించుకుంది.   వాళ్ళని మోసం చేస్తున్నానా ..  కళ్ళు మూసుకుని ఆలోచనలతో నిద్రలోకి జారుకున్న  తనూజ ఫోన్ మోగడంతో ఉలిక్కి పడి లేచి ఫోన్ అందుకుంది. అవతలి వైపు మనోరమ .

Kadha-Saranga-2-300x268
‘అసలు నీకు బుద్దుందా … ప్రతిరోజూ కాల్ చేయమని ఎన్ని సార్లు చెప్పాను. ‘ గద్దించింది.
‘ నేనేం మాట్లాడను .. పో ..’  ,
‘తనూ .. ఆ మాట అనకే తల్లీ.. అసలు విషయం చెప్పు ఎలా ఉన్నావ్? నీ కోసం ఎప్పటి నుండి ట్రై చేస్తున్నానో తెల్సా .. అవుటాఫ్ రీచ్ అని వస్తోంది. అసలు ఏ పని చేయలేకపోయాను. ఏదన్నా జరగరానిది జరిగితే .. అమ్మావాళ్ళకి నేనేం సమాధానం చెప్పగలను మనసంతా గుబులు గుబులుగా .. భయం భయంగా … నీ గొంతు విన్నాక ప్రాణం లేచొచ్చింది’.
‘ చుట్టూ అడ్డుగోడలు కట్టేసుకుని అది దాటితే ఏమవుతుందోనన్న భయంతో రోజూ చచ్చే వాళ్లతో నేను వేగలే .. ‘
తనూజని పూర్తి కానివ్వకుండానే, ‘ అంత వద్దులేవే  .. ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు ఫోన్ చేసెయ్యి ..సరేనా,  నన్ను డిస్ట్రబ్ చేస్తున్నానని ఏమాత్రం అనుకోకు.  ఇంతకీ అసలు నీ ట్రిప్లో ఎలా ఉన్నావో చెప్పనే లేదు ‘
‘ తేలిపోతున్నట్లుందే .. మేఘాల్లో తేలిపోతున్నట్లుందే .. ‘రాగయుక్తంగా తనూజ గొంతు
‘ జోరుమీదున్నావు  తుమ్మెదా.. ఆ జోరెవరికోసమే తుమ్మెదా .. ‘ చిరునవ్వుతో మనో అందుకుంది.
‘ఎవరికోసమో ఏంటి ? నాకోసం. అచ్చంగా నా కోసమే .  అంబరాన్ని అందే సంబరంలో ఉన్నా,  ఈ మజా ఏంటో అనుభవిస్తే గానీ అర్ధం కాదులే .. ఎంత కాన్పిడెన్స్ బిల్డప్ అవుతుందో ..

నా వెనుకో ముందో ఎవరో ఒకరు ఉండి నన్ను పోలీసింగ్ చేస్తున్నారన్న ఫీలింగ్ లేదు.  రొటీన్ వర్క్ నుండి ఎప్పుడు బ్రేక్ కావాలంటే అప్పుడు రెక్కలు కట్టుకొని ఎగిరిపోవాలని నిశ్చయించేసుకున్నా ..

కొత్త ప్రాంతాలు , కొత్త మనుషులు, కొత్త విషయాలు నా ఆలోచనల్లో .. నన్ను నా విధానాల్ని మార్చేస్తూ .. ప్రకృతిలో ఒదిగిపోయి పోయి చేసే ప్రయాణాలు .. జీవితం పట్ల కొత్త ఉత్సహాన్నిస్తున్నాయి తెలుసా … ‘
అవతలి వైపు నుండి ఏ చప్పుడూ రాకపోవడంతో ‘ వింటున్నావా .. ‘

‘ ఆ .. వింటున్నా నే .. నీ ఉద్వేగాన్ని .. ‘ మనోరమ  పూర్తి చేయకుండానే అందుకుని

‘ఇక్కడేమో సిగ్నల్స్ సరిగ్గా లేవు, ఒక్కోసారి బాగానే  లైన్ కలుస్తుంది. ఒక్కోసారి కలవదు ‘

ఆ తర్వాత కొద్ది మౌనం
‘ ఊ.. ఇప్పుడు చెప్పు . బయటికొచ్చి నడుస్తూ మాట్లాడుతున్నా .. బయటేమో చలి గిలిగింతలు పెడ్తూ .. ‘
‘దూది పింజల్లా ఎగిరిపోయే మేఘంలా కేరింతలు కొట్టే నీ స్వరం చెప్తోంది నీవెలా ఉన్నావో ..నీవింత ప్రత్యేకంగా..భిన్నంగా ఎలా ఆలోచిస్తావ్ ? నికార్సైన నిన్ను చూస్తే చాలా గొప్పగా ఉంది ‘
‘ఆ చాలు చాలు మునగ చెట్టెక్కియ్యకు..డ్హాం డాం అని పడిపోతా ..

అది సరేగానీ, వింటున్నావా మనో ..

ఈ రోజు సిల్క్ రూట్ లో ప్రయాణించా తెలుసా ..?’
‘వాట్..  సిల్క్ రూట్.. ? అంటే, పరవస్తు లోకేశ్వర్ గారి “సిల్క్ రూట్‌లో సాహస యాత్ర“ గుర్తొస్తోంది. నువ్వూ  ఆ రూట్లో ప్రయణించావా .. రియల్లీ ?’ సంబ్రమాశ్చర్యంతో  అడిగింది మనోరమ
‘అవునే, చంగూలేక్ నుండి నాథులా పాస్ కి బయలు దేరాను. 17 కి . మీ. దూరమే కానీ ప్రయాణం చాలా సమయం తీసుకుంది. ఘాట్ రోడ్లో ఆకాశాన్నంటే పర్వత శిఖరాలను చుట్టేస్తూ అగాధాల లోతులను అంచనా వేస్తూ మేఘాలను చీల్చుకుంటూ సాగే ప్రయాణం అత్యద్భుతం అంటే అది చిన్న మాటేనేమో.. శ్వాసించడం మరచి చూస్తుండి పోయా ..
‘ నాదులాపాస్ అంటే ఇండియా చైనా బార్డర్ క్రాసింగ్ ప్రాంతం అనుకుంట కదా ‘
‘ఓ నీకూ కాస్త ప్రపంచ జ్ఞానం ఉందే .. ‘ నవ్వుతూ  తనూజ
‘ఆ.. నా బొంద , ఏదో నీ ప్రయాణం పుణ్యమాని ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నాలే .. కానీ , అసలు విషయాలు చెప్పు ‘
‘అవును దేశ సరిహద్దు ప్రాంతమే ఇది,  ప్రయాణ సాధనాలేమీ లేని రోజుల్లో ఈ రూట్లోనే వర్తక వ్యాపారాలు జరిగేవట.’
‘ రియల్లీ .. గ్రేట్.. చెప్పు చెప్పు నీ సాహస యాత్ర గురించి చాలా చాలా వినాలని ఉంది ‘ ఉత్సుకతతో మనోరమ
‘ చెప్తూంటే ఏమిటే నీ తొందర .. ఈ రూట్ 1962 యుద్ధం తర్వాత మూసేసారట. మళ్లీ 2006లో రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందం తర్వాత తెరిచారట. ఏడాదిలో ఆరునెల్లకు పైగా మంచుతో గడ్దకట్టుకుపోయే  ఈ రూట్లో ఒకప్పుడు అంతర్జాతీయ వ్యాపారం జరిగేదని తెలిసి ఆశ్చర్యపోయాను.

 

ఇప్పుడయితే  విదేశీయులకి  నాధులాపాస్ లో ప్రవేశం ఉండదట.  అక్కడ సిక్కిం , టిబెట్ ప్రజలు తమ ఉత్పత్తులు తెచ్చి అక్కడ అమ్ముకుంటూ ఉంటారు.   వాళ్ళు వ్యాపారం సాగించే ప్రదేశంలో మన మార్కెట్ యార్డ్ లో ఉన్నట్లుగా షెల్టర్స్ ఉన్నాయి. అవి ఈ మధ్యనే కట్టారట.  సోమ , మంగళ వారాల్లో వారి వ్యాపారాలకు సెలవు. అందుకే నాదులాపాస్ మూసేసి ఉంది. నేను వెళ్ళింది మంగళవారం కదా. నాకు ముందుగా  ఆ విషయం తెలియదు .  అందుకే  అక్కడ నుండి బార్డర్ క్రాస్ చేయలేకపోయా.    చైనా టిబెట్ ని ఆక్రమించాక చాలామంది టిబెటియన్లు , ఇండియా, నేపాల్ దేశాలకు వచ్చేశారని చాలా విషయాలు  గోవింద్ చెప్పాడులే .’
‘రేపు ఎక్కడికెళ్తున్నావ్ ..? ‘

‘రావంగలా  ప్రపంచంలో అక్కడ మాత్రమే కనిపించే పక్షుల్ని చూడాలి. అక్కడి నుండి పెల్లింగ్ వెళ్ళాలి . అక్కడ ట్రెకింగ్ చేయాలనుకుంటున్నా ‘
‘  కీర్తి శిఖరాల కోసం కాదు, ఆడపిల్లల విశ్వాసానికి రెక్కలు తొడిగి వెలుగును వెతుక్కుంటూ వేసే అడుగులో అడుగు వేయలేకపోయినా నిన్ను చూస్తే గర్వంగానూ .. ‘ మనోరమ మాటలకడ్డు వచ్చి

‘ భయంగాను ఉంది.అదేగా నువ్వు చెప్పాలనుకున్నది.  ఇదిగో ఇలా అమ్మమ్మ అవతారం ఎత్తావంటే ఫోన్ పెట్టేస్తా .. ‘ నవ్వుతూ బెదిరించిన తనూజ.

 

మళ్ళీ  తానే ‘  స్వచ్చమైన నీలాకాశంలో పొదిగిన పచ్చదనపు కౌగిలిలో పరవశిస్తూ మంచు బిందువులను ముద్దాడుతూ సాగిన ప్రయాణం,   తారకలతో స్నేహం .. ఎంత అద్భుతంగా ఉంటుందో  నీకెలా చెప్పగలను ..? ‘ నిశబ్దంగా మెరిసే తారకల్ని కొత్త ఆకాశం కింద నిలబడి చూస్తూ తనూజ
‘కవిత్వం వచ్చేస్స్తున్నట్లుందే .. మనసు పలికే భావాల్ని అక్షరాల్లో పరిచేస్తే బాగుంటుందేమో ..తనూ ‘ ఆమె ఎగ్జయిట్ మెంట్ ని గమనించి అంది మనోరమ

‘అహహా హ్హా .. జోక్ చేస్తున్నావా .. నీ మొహం..  నాకు కవిత్వం రావడం ఏమిటి ? ‘
కొద్దిగా ఆగి ‘ మనసులోని భావాల్నివెంటనే  పంచుకొనే నేస్తం లేదనే దిగులు.

ఆహ్హః లేకపోవడమేంటి.. నీతో నేనున్నాగా  నీ మనోకి  పోటీగా  అంటోంది నా లాప్ టాప్.’
‘ఏమిటీ ఆ బుల్లి పెట్టె నేను ఒకటేనా .. ?’ వేగంగా తోసుకొచ్చ్చిన మనోరమ ప్రశ్న
‘కాకపోతే మరి’ అంటూ కాసేపు మనోరమని  ఉడికించింది తనూజ
ఆ తర్వాత ‘ఏ రోజుకు ఆ రోజు నా అనుభవాల్ని పంచుకునేది ఈ ఎలక్ట్రానిక్ డైరీ తోనే కదా .. ఒకరోజు చెప్పకపోతే మరుసటి రోజు వచ్చే అనుభవాలు ముందటి రోజు అనుభూతుల్ని , ఉద్వేగాల్ని ఎక్కడ కప్పి వేస్తాయో .. ఏ మూలకు తోసేస్తాయో అన్న సంశయంతో హృదయ భాషని అక్షరాలుగా నిక్షిప్తం చేసేస్తున్నాను. ఏదేమైనా నా పర్యటన ఆద్యంతం అద్బుతంగా ..ఆహ్లాదకరంగా .. సాగుతోంది. ‘

‘ఆ.. అన్నట్టు నేనిచ్చిన  పెప్పర్ స్ప్రే , స్విస్ నైఫ్ , విజిల్ నీ బాగ్లోనే ఉన్నాయిగా ‘ ఏదో గుర్తొచ్చిన దానిలా సడెన్గా అడిగింది

‘ఊ .. ఉండక అవెక్కడికి పోతాయి ?  భద్రంగా ఉన్నాయిలే …’

‘నీకో విషయం తెల్సా .. గురుడాంగ్ మార్ లేక్ వెళ్ళిన మూడు రోజుల యాత్రలో నా సహా పర్యాటకుల్లో కొత్తగా పెళ్ళయిన ఓ జంట తప్ప అంతా పురుషులే .  అంతా చాలా మర్యాదగా వ్యవహరించారు.  సిక్కిం లో పబ్లిక్ ప్లేసెస్ లో సిగరెట్లు కాల్చడం గానీ , పాన్ మసాలాలు తినడం గానీ నేను చూడలేదు. కొద్దిగా ఆశ్చర్యం అనిపించి స్థానికుల్ని అడిగాను .  బహిరంగ ప్రదేశంలో సిగరెట్ కాలిస్తే ఖచ్చితంగా ఫైన్ వేస్తారట. అదే విధంగా గుట్కాలు , పాన్ మసాలాలు అమ్మనే అమ్మరు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం’

‘రియల్లీ ..గ్రేట్ కదా .. మరి మన దగ్గర అలా ఎప్పుడు చూస్తామో ..?,,
‘నిజమేనే ..పరిసరాలే కాదు మనుషులూ స్వచ్చంగానే అగుపిస్తున్నారు’ అంటూ తలకు చుట్టిన స్కార్ఫ్ వదులు చేసుకుంటూ రూం లోకి అడుగుపెట్టింది తనూజ .
‘నీ  గొంతులోని ఉత్సాహం , ఉద్విగ్నత అనిర్వచనీయమైన నీ ఆనందాన్ని తెల్పుతోంది. మన ఇళ్ళలో స్త్రీల తెలివి, ధైర్యం , ఆత్మవిశ్వాసం మండే పోయ్యిలో వండే వంటకే అంకితమయిపోతున్నాయి ..’ మనోరమ మాటలకి అంతరాయం కలిగిస్తూ లైన్ కట్ అయింది.

 

మళ్ళీ మళ్ళీ  ప్రయత్నించింది తనూజ . నెట్వర్క్ సిగ్నల్ దొరకడం లేదు.  బయటికి వెళ్ళాలంటే చల్లటి గాలి విసిరికొడ్తాంది అనుకుంటూ బెడ్ మీద వాలింది తనూజ.
మనోరమ చివరి మాటలే ఆమె మదిలో మెదులుతున్నాయి.

 

నిజమే .. మహిళ జ్ఞానం, తెలివితేటలు, ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం పువ్వుకే అతుక్కున్న పరాగధూళిలా ఇంటికే కాదు.   నాలుగ్గోడలనుండి విశాల ప్రపంచంలోకి  సాహసంతో ప్రవహించాలి. అద్భుతమైన జగత్తులో తనదైన అజెండాతో ముందుకు సాగాలి. ఈ విశాల ప్రపంచంలో తనకో చిరునామా సృష్టించుకోవాలి.  కానీ నాలా చాటుగా కాదు.   సగర్వంగా తలెత్తుకుని..  రేపటి మహిళ గురించిన ఆలోచనల్లో  తనూజ .

మీ మాటలు

 1. Soma Sekhara Rao Markonda says:

  స్వచ్చమైన నీలాకాశంలో పొదిగిన పచ్చదనపు కౌగిలిలో పరవశిస్తూ మంచు బిందువులను ముద్దాడుతూ సాగిన ప్రయాణం, తారకలతో స్నేహం .. ఎంత అద్భుతంగా ఉంటుందో…..
  …. మహిళ జ్ఞానం, తెలివితేటలు, ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసం పువ్వుకే అతుక్కున్న పరాగధూళిలా ఇంటికే కాదు. నాలుగ్గోడలనుండి విశాల ప్రపంచంలోకి సాహసంతో ప్రవహించాలి. అద్భుతమైన జగత్తులో తనదైన అజెండాతో ముందుకు సాగాలి. ఈ విశాల ప్రపంచంలో తనకో చిరునామా సృష్టించుకోవాలి….

  చాలా బావుంది మీ వ్యాసం, మీ యాత్రా ప్రయత్నం. అభినందనలు.

 2. శాంతి ప్రబోధ says:

  మీ స్పందన తెలిపినందుకు ధన్యవాదాలు సోమశేఖర్ రావు గారూ

 3. ఎంత చక్కగా కాశ్మీరాన్ని వొర్ణించారు కళ్ళకు కట్టినట్లుగా చెప్పారు మీ రచన శైలి చాల బాగుంది మీ నుండి మరిన్ని రచనలు రావాలని ఆశిస్తూ మీకు శుభాకాంక్షలు

మీ మాటలు

*