చీకటీగలు-3

 

 

‘‘ఈ లమ్డ్మీ చీకటీగల్కి మనుషులకీ దగ్గర సంబంధం… ఇంకోళ్ళని ప్రశాంతంగా వుండి చావనీవివి… ఎక్కడా లేనట్టు సరిగ్గా కళ్ళముందూ పుళ్ళమీదా వాలి… చీకాకు… చీకాకు’’ అన్నాడు శ్రీమన్నారాయణ..

‘‘ఇవి ఈగలా దోమలా ఏంటివి సారివీ… వీనెమ్మ… ఛీత్‌’’ విసురుకుంటూ రంగరాజడిగాడు..

‘‘ఈగజాతే, అయిన్యాట్స్‌’’ అంటారు వీట్ని మనల్నే కాదు పశువుల్ని చంపుకుతింటాయివి… సైంటిఫిక్నేమ్‌ హిపల్యాటస్‌ పుసిలానో ఇంకోటోమరోటో అంటారు.

లంజపదోత్పత్తి దగ్గర్నించి చీకటీగల శాస్త్రీయనామానికెళ్ళిపోయాడు శ్రీమన్నారాయణ… అసలు మృచ్ఛకటికం దగ్గర మొదలుపెడతానన్న మనిషి… ఎటిమాలజీ నుంచీ ఎంటమాలజీకి ఛలాంగుమని గెంతగ బుద్ధి… కాస్త అబ్బురంగానే చూశాను శ్రీమన్నారాయణ వైపు… ఇంత బుద్ధికలిగీ జీవితాన్ని సుఖవంతం ఎందుకు చేసుకోలేకపోయాడితను? అసలు సుఖం అంటే ఏమిటి? పెళ్ళాం బిడ్డల్తో గొడవల్లేకుండా రోజూ మూడుపూట్లా కోరిందో, దొరికిందో తృప్తిగా తింటూ చీకూ చింతా లేకుండా నిద్రపోగలగడమేనా? ఎవరిస్తారు అసలు సిసలైన సుఖానికీ ఆనందానికీ సరైన నిర్వచనం… అంతా సాపేక్షమే కదా? నీకు సుఖవంతమైంది అతనికి అస్సలు కాకపోవచ్చు. రంగరాజులూ, కంఠం వేరువేరు నిర్వచనాలివ్వొచ్చు… కోట్లాదిమంది కలిగున్న ప్రమాణాలు అత్యంత సాధారణమైనవి… సహజాతాలకు సంబంధించినవి. వాటికతీతంగా వుంటే గింటే దేవుడుండొచ్చు. ఎటు తిరిగీ జీవితాన్ని వీటి చుట్టుతా చేర్చి కుట్టేసుకుంటారు. నిజానికి వీటికతీతంగా జీవితం అస్తిత్వం కలిగుందా? వుండగలదా? అడగాలి శ్రీమన్నారాయణ్ణి… అతను దేవుడిన్నమ్మడు… ‘‘అసలు సిసలు జీవితమంటే తనకిచ్చ వచ్చిన రీతిలో మనగలగడం. సమాజపు కొలతకావల స్వచ్ఛంగా స్వేచ్ఛగా వుండగలగడం’’ అన్నాడో మాటు.

రంగరాజునీ, కంఠాన్నీ చూసా… అసలు రంగరాజు బడి నడుపుతాడంటే ఆశ్చర్యం. ఏదో వ్యాపకం కావాలి కాబట్టి స్వంతస్థంలో షెడ్లేసి స్కూలు నడుపుతున్నాడు శతకోటి కుక్కగొడుగుల్లో అదోటి. ఓ డొక్కు కారుంది కూడా… ఎప్పుడూ నిశ్చింతగా గడుపుతాడు. పద్యాలూ, పాత సాహిత్యమంటే చాలా ఇష్టపడతాడు. వాడి బండముక్కు పక్కనున్న కళ్ళల్లో ఒక నిరంతర చైతన్యముంటుంది. ఊళ్ళో గ్యాసు కనెక్షన్నించీ ఏకనెక్షనుకైనా దారి చూపించగల్డు ‘‘నువ్వా లెక్చరుద్యోగానికి రిసైన్నూకు సార్‌.. జూనియర్కాలేజి పెడ్దాం… రెండేండ్లలో ఎట్టుంటాదో చూడు’’ అని నాతోటెన్నిమాట్లో అన్నాడు. వీళ్లందరి జీవితపు పరిధులు కొలిచేముందు నా జీవితమేమిటో నాకు తెలుసా? నిజ్జెంనిజంగా నే సుఖంగా వున్నానా? బ్రతుకుతూనా? జీవిస్తూనా? ఆకలి లోపల యుద్ధం చేస్తోంది…

‘‘రాజా, రా మనిద్దరం వెళ్దాం మందుకి, నేనట్నుంచటే కొంప చేరుతా…. బండికూడా లేదు.. పద…’’ అని రంగరాజు భుజమ్మీద చెయ్యేసి శ్రీమన్నారాయణవైపు చూసి ‘వెళ్తా’ అన్నా…

చివర్రౌండేస్తూ ‘‘ఆగండి…’’ అంటూ కంఠం అడుగుబొడుగు వేసేసాడు.

‘‘ఉదయాన్నే ఆ గాడ్దికొడుకొచ్చి గొడవ చేస్తే కబుర్జేస్తా వచ్చేయ్యి’’ అన్నాడు శ్రీమన్నారాయణ.

రంగరాజులూ నేనూ సందులోంచీ మెయిన్రోడ్డు మెగుల్లోకొచ్చేసాం…

‘‘ఒరేయ్‌ రాజా ఉదయాన్నే శ్రీమన్నారాయణ్ణి పలకరించెళ్ళు వీలైతే నీతో పాటు స్కూలుకు తీసుకుపో… యీ మనిషి మొండీ… వాడు మూర్ఖుడూ’’ అన్నాడు.

‘‘ఏం గాదులే నేన్లేనా… నువ్‌ మల్లా చెప్పాల్నా సార్‌’’ నిర్లక్ష్యంగా రంగరాజు గొణిగాడు…

చీకటే ఎక్కువగా వున్న గతుకురోడ్డుమీద… మెదళ్ళమీదావరించిన మత్తుపొరతో… కొద్దేళ్ళుగా పరిచయస్తుమయిన, నేనూ రంగరాజునబడే యీ వ్యక్తీ అత్యంత సన్నిహితుమైనట్టు నేను వాడి భుజం చుట్టూతా చెయివేసి… వాడినించీ యోజనాల దూరంలో అస్తిత్వం కలిగి… ఓ తాత్కాలికమయిన మజిలీ కలిగిన అతి చిన్న ప్రయాణం చేస్తూ…

‘‘సార్‌, కాలే సార్ని చూసొస్తాసార్‌…. మార్నింగే… పాట పోయింతర్వాత యింకేం కాలేసార్‌… ఆర్మోనియం బెలోస్కి బొక్కపన్నట్టు కదసార్‌. ఆదివిశ్ను సార్‌కి క్లోజ్‌సార్‌… మంచిదోస్తు సార్‌’’ రంగరాజులు యింకా ఏదేదో మాట్లాడుతోన్నాడు.

ఎవరు కాలే? ఎవరీ రంగరాజు? సంగీతకారుడు కాలే చావకుండా ఎందుకు బతికాడూ? కాలూచెయ్యీ మాటా పడిపోయి… కోలుకుంటాడో లేదో తెలీని మృతసదృశమయిన అస్తిత్వంతో. అందరూ విసుక్కొంటూంటే… మలమూత్రాలకూ, ముద్దకూటికీ యింకొకళ్ళను విసిగిస్తూ…. బతుకా అదీ? నేనెట్లా చస్తా? వీడు యీ రంగరాజుల్గాడెట్లా చస్తాడూ… మేమంతా బతికేవున్నామా? అసలు చావంటే ఏమిటీ? సెన్సేషన్స్‌… టర్మినేషనాఫ్‌ ఆల్‌ బయలాజికల్‌ ఫంక్షన్స్‌… అమ్మో! భయం మృత్యుభీతి… నెక్రోఫోబియా… రంగరాజులేదో సణుగుతునే వున్నాడు. నడుస్తున్నా కూడా…. కళ్ళముందు చీకటీగలు మూలుగుతునే వున్నాయి… కాలేను హస్పిటల్లో చూట్టానికి మనసంగీకరించట్లే… వెళ్ళనని తీర్మానించేసుకున్నా…

ఆటోలో ఎట్లా కూచున్నానో తెలీదు… ఆటోవాడు ‘‘దిగు… దిగూ’’ అన్డంతో, దిగి వాడికో పది కాయితమిచ్చి… ఇంటికి చేరుకున్నా… తలుపు తెరిచేవుంది. టీవీ ఆన్లోవుంది…. టీవీ ఎదురుగా…. ఓ ఘనీభవించిన భావరాహిత్యం…

చైతన్యరాహిత్య ప్రతిరూపం…

ఓ కామనాలేమి…

ఓ ఎండిపోయిన చెరువులోకి దూకేసిన ఆకాశం…

నాతోపాటు రెండు దశాబ్దాలు ఉంటూ లేకుండా వున్న ఓ పరిచిత భౌతిక రూపం…. అపరిచిత వ్యక్తిత్వం…

సుభద్ర… సోఫాలో…

శ్రీమన్నారాయణ షెడ్డులో రేగిన ఆకలి, ఆవిరైపోయింది… క్యాంటిన్‌ కుర్రాడు ప్లాస్టిక్‌ సంచిలో బంధించి తెచ్చిన పరిమళాలు లీగా గుర్తున్నాయి. చాపమీద నూనె పీల్చుకున్న న్యూస్పేపర్‌ పొట్లాంలో మిరబ్బజ్జీలూ… ఎగిరిపోతున్న ఆకలి చిత్రానికి గాలమేసి లాగి పట్టి కళ్ళముందుకు తెచ్చుకునే ప్రయత్నం చేసా… ‘‘తింటావా? తిన్నావా?’’ జవాబాసించని ప్రశ్న… అసలక్కర్లేని ప్రశ్న…

‘‘నేన్తింటాలే… సిన్మాచూడు’’

మనిషి ఏం కోరుతూ జీవితాన్ని సాగదీసుకొంటాడు? అసలు నాలాంటి వాళ్ళకి ‘రేపు’ ఎందుకు? ఈ సుభద్రకు రేపటి మీద కామనుంటుందా? ఇన్ని కోట్లాదిగా కామనారహిత అస్తిత్వాలెట్లా వుంటాయి? నేనొకణ్ణే యిట్లా ఊహిస్తున్నానేమో! కోటి కోర్కెల్తో ఆశల్తో…. కొత్త ప్రభవా మీది నమ్మకంతో… నేనూ నాలాంటి వాళ్ళం తప్ప అందరూ మరుసటి ఉదయం తలుపు తెరుస్తారేమో! లేపోతే ఇన్నిన్ని వేల ఏళ్ళుగా మానవుల మనుగడెలా సాధ్యపడుతుందీ? ఇట్లా ఈ బొమ్మజెముడాలోచన్లతో చీకాకు పడే బదులు… కోట్లజనాల్లా భగవదస్తిత్వ భరోసాతో బ్రతకడం మేలేమో! ఉంటే గింటే వుండి ఛస్తే అంతా వాడే చూసుకుంటాడు… మంచికీ వాడే, రోజువారీ రొచ్చుకూ వాడే కారణం… అనుకుంటూ… కళ్ళుమూసుకుని, మనకై మనం నిర్మించుకున్న ఓ రూపాన్ని తల్చుకుని… ‘ఒరేయ్‌ దేముడా! నన్ను బాగా చూడూ, నా పెళ్ళాం బిడ్డల్ని బాగా చూడూ, దండిగా డబ్బులియ్యీ, నా కూతురికి పెళ్ళీ, నాకొడుక్కుజ్జోగం, నీ గుడికో మెట్టు కట్టిస్తా… నేన్చేసుకున్న దానికంటే ఘనంగా నీకూ పెళ్ళిచేస్తా….’ మళ్ళీ వాడికో అందమయిన ఆడదేవతను తయారుచేసీ… మనకు గలీజులైన మలమూత్రాల రొచ్చు వాడికి పెట్టకుండా… భలే మనిషండీ దొంగగాడ్దికొడుకు…. నిజమే కదా…. వాడికి గోపురాలు కడతాడు, కల్యాణమండపాలు కడతాడు, అన్నీ పకడ్బందీగా కట్టేస్తాడు… దేముడికో కక్కసు మాత్రం చరిత్రలో కట్టిందాఖలాలు లేవు… వున్నాయా? వాడేం మానవమాత్రుడా? దేముడండీ… వాడికి పెళ్ళాం కావాలి… బిడ్డలు కావాలి… యుధ్ధాలు కావాలి… వాహనాలు కావాలి… నగరాలు కావాలి… కానీ మనిషికున్న రొచ్చు మాత్రముండకూడదు… వాడికాకలుండదు… నిద్రుండదూ… ఛావస్సలుండదు… పడిశెం లాంటివి పట్టవు… ముక్కుంటుందిగానీ చీదడు… కొండకచో వాడే మర్మావయపురూపం తీసుకుని… నిటారుగా ఆరేడడుగులెత్తు లేచుంటాడు… కానీ మనం ఆ రూపానికి బూతుపదం వాడకూడదు. సిల్లీ…. క్వైట్‌ సిల్లీ…. బట్‌ ఫాసినేటింగ్‌…. దేముడ్ని సృష్టించినప్పుడే మనిషి క్రియేటివిటీ గొప్పదనం తెలుస్తుంది… ఎన్ని ఊహలూ… ఎంతచిత్రణో… గొప్ప గొప్ప కవితాత్మకమై పురాణేతిహాసాలూ, నృత్యాలూ… చిత్రలేఖనం… శిల్పం… ఆ దేముడనబడే ఒకే ఒక కల్పన్చుట్టూ ఎంత ప్రతిభావంతంగా నిర్మించాడు మనిషీ… గొప్పోడివిరా మనిషీ…

పాచిరంగు చిన్నపూల లుంగీలోకి దూరా… ఒంటికాలినృత్యం చేస్తూ ప్యాంటూడదీసుకున్నా… ఇంకో రౌండేసుంటే బావుండేదేమో… బాత్రూంలో ఒంటేలుకి పోతే ఆల్కహాల్‌ వాసన గుప్పుమంది…. ఇట్లాంటి చిత్రణలు మన్తెలుగుసాహిత్యంలో కనబడవెందుకో అశ్లీలానిపేరు. ఏ ఫిలిప్‌రాతో… మిన్‌కుందేరాలో రాస్తే… అహ్హహ్హ ఎంత రియలిస్టిక్‌గా రాసారండీ అనేయగలరు…. కుందేరా మరీనూ కథలో ఓ అధ్యాయానికి ‘యూరినేషన్‌’ అని పేరే పెట్టేశాడు. రాత్‌ మరీనూ తండ్రీ కొడుకు కలిసి ఒంటేలు పోస్తున్న చిత్రాన్ని వివరిస్తూ ‘‘నాన్న ధార పేనిన తాడులా వస్తోంది…. నాది పీలగా దారప్పోగులా వుంది’’ అని కథానాయకుడి చేతనిపిస్తాడు.. రాత్‌ ఇక కాల్పనిక సాహిత్యం రాయననేసాడు. చూడాలి… చూడాలి… నాలిక్కి శతకోటి క్షమాపణల్చేప్పి… చల్లన్నం బొక్కి ప్లేట్‌ని సింక్‌లో పారేసి…. గుమ్మంబైటికొచ్చి సిగరెట్‌ వెలిగించుకున్నా…

నేను దింపినా దింపకపోయినా ఈ రోజనబడే కాలభాగానికి తెరపడినట్టే…. ఏమిటీ కాలం? ఎప్పటిదీ కాలం?

ఉదయ సాయంత్రాలూ..

గంటలూ… నిమిషాలూ…

నిన్నలూ… రేపులూ…

ఏడాదులూ… శతాబ్దాలూ…

యుగాలు యుగాలు గడుస్తూ కాలశరం దూసుకుపోతూ…

ఎడిరగ్‌టన్‌… ఎంట్రపీ… ధర్మోడైనమిక్స్‌… కాలేజీపాఠాలు కాకుండా నానా చెత్తా చదివితే యింతే… నాకెందుకీ రొచ్చూ…? జ్ఞానానికంతేమిటీ? శ్రీమన్నారాయణేం చదివుంటాడూ, దాదాపు ప్రతి విషయం గురించీ కొద్దోగొప్పో మాట్లాడ్తాడు… ఆయనకి ఆ పిల్ల మైత్రికి ఏం సంబంధం… అతనింట్లో పెళ్ళాం కొడుకుల్తోటెందుకు దెబ్బలాడాడు. లమ్డీ మనుషుంటాడు. చీకటీగల్తో పోలుస్తూ… నేనూ చీకటీగనేనా? ఎవర్కో… సుభద్రకా? బయటి జనాలకా? సుభద్ర, బయటి జనాలు నాకు చీకటీగలేనా? ఏమిటో ల్యాటిన్‌ పదం చెప్పాడు గుర్తురావట్లే…. లోపలికి తొంగి చూసా… సుభద్ర లేదు…. గవర్నమెంటుద్యోగం చేస్తుంది… తను బాగానే సంపాదిస్తుంది. ఎప్పుడో ఇరవైయేళ్ళక్రితం… యాదృచ్ఛికంగా నా జీవితంలోకి ప్రవేశించింది. ఉండిపోయింది. ఒక్క ఏడాదీ ఏడాదిన్నర పాటు శారీరక వ్యామోహల్తో బానే గడిచింది. తర్వాత్తర్వాత మా మా అస్తిత్వాల గురించిన పోరాటం ప్రారంభమయి.. ఎవరిది వాళ్ళం గెల్చుకున్నాం. పెళ్ళయిన మూడేళ్ళకు సర్వీస్‌ కమిషన్‌ రాసి ఉగ్యోగం తెచ్చుకుంది. నైమిత్తికావసరాలకు తప్ప మా మధ్య సాధారణ సంభాషణలు నడవ్వు… ఈ చిన్న కొంప కూడా తన్దే…. లోనింకా కడుతోంది బ్యాంకుకి ఈయంఐ ద్వారా… ఇప్పుడు దాదాపు ఒకర్నొకరు తాకడానిక్కూడా సందేహించే పరిస్థితి. తన బాగుకో నా బాగుకోసమో పిల్లలు కగలేదు. ఇద్దరికి కామన్‌గా ఉన్న గుణం చదవడం. తనూ పుస్తకాలు కొంటుంది. ఎప్పుడైనా నాకు చెబుతుంది. ఫలాని ఫలాని పుస్తకం బావుంది చూడూ… అనో… లేదూ ఫలాని పుస్తకం దొరకలేదు తెచ్చిపెట్టమనో…. ఇంతకీ ఇరవైయేళ్ళ పరిచయిస్తులమ్మేం. ఆమెకో యిద్దరు స్నేహితులున్నారు. ఇద్దరూ ఆమెకంటే చిన్నవాళ్ళు. అక్కా, అక్కా అంటూ యీమె చుట్టూ తిరుగుతుంటారు. ఒకట్రెండు సార్లు వాళ్ళిళ్ళలో ఫంక్షన్కూడా కలిసెళ్ళాం. బండి వెనక్కూచున్నా… తగలకుండా జాగ్రత్తగా కూచుంటుంది. ఇద్దర్లో ఒకరం. హఠాత్తుగా తప్పుకున్నా ఏ విధమైన కదలికా యిద్దరి జీవితాల్లో వుండదనద్నది ఖాయం. వుంటుదేమో… తాత్కాలికంగానయినా వుండాలి. ఎన్నో ఏళ్ళుగా దార్లో రోజూ కనిపించే ఓ పెద్ద బండరాయినెవరో హఠాత్తుగా పగలగొట్టి తీసేస్తే కలిగే శూన్యంలాంటిది. తర్వాత దాని రాహిత్యానికలవాటు పడిపోతామంతే ఏమో ఆమె అంతరంగంలోకి తొంగి చూసే ప్రయత్నం నేనెన్నడూ చేయలేదు. ఆమే అంతే… ఈ మాత్రం దానికి కలిసుండడం దేనికీ అంటే అలవాటు పడిపోయాం… నాకూ శుభ్రమయిన కూడూ గూడూ లభ్యమవుతున్నాయి. ఆమెకీ ఓ సాంఘికపరమైన గుర్తింపు…. ఓ సోషల్‌ ఐడెంటిటీ… మరట్లాంటప్పుడు శ్రీమన్నారాయణన్నట్టు తను నాకో, నేను తనకో చీకటీగలెట్లా అవుతాం…

ఆలోచించి ఆలోచించి అలుపొచ్చేసింది… చిన్నగా మగత కమ్ము కుంటోంది… తలుపేసి గదిలోకొచ్చి నా బెడ్‌మీద వాలిపోయా…

(సశేషం)

కాశీభట్ల వేణుగోపాల్ @9550079473

మీ మాటలు

*