ఒడ్వని దుక్కం

 

 

-బండారి  రాజ్ కుమార్

~

కొందరు ఏడ్వడానికే పుడుతరు
దుక్కమే జీవితమైనట్లు బతుకుతరు
బతుకంతా దుక్కనదిని ఈదుతనే ఉంటరు
ఒడ్వని దుక్కాన్ని గుండె సందుగలో దాసుకుంటరు
సెమట సుక్కలై బొట్లు బొట్లుగ రాలిపోతరు
సంబురానికి నవ్వుదమనుకుని కన్నీటి జలపాతమైతరు

ఆ రెండు కండ్లు… ఎదురుసూపుల పడవలైతయి
కరువుల సుత కళకళలాడే సెర్వులైతయి
ఎప్పుడూ ఒట్టిపోని ఊటచెలిమెలైతయి

కొన్ని నీడలు వెంటాడుతయి
వెంటాడే నీడలు వేటాడుతయి
తప్పు జరగకముందే శిక్షలు ఖరారైతయి

ఎన్నియుగాలు  సై సూశినా
కన్నీళ్లు ఉప్పగనే అనిపిస్తయి
ఇంత బతుకు బతికి…
ఏం నోసుకున్నరని
నొసల్లు ఎక్కిరిత్తయి

నీ అతుకుల బతుకు బొంతకు అంటిన మరకల్ని తుడ్వాలంటె…
ఆ మాత్రం…దుక్కపువానలో తడవాల్సిందేలే !

*

మీ మాటలు

 1. Kcube Varma says:

  Chala baagundi raj kumar garu dukha nadilo eedaalsinde…

 2. Naveenkumar says:

  ఎన్నియుగాలు సై సూశినా
  కన్నీళ్లు ఉప్పగనే అనిపిస్తయి
  ఇంత బతుకు బతికి…
  ఏం నోసుకున్నరని
  నొసల్లు ఎక్కిరిత్తయి.. liked it sir..

మీ మాటలు

*