పెరుమాళ్ మురుగన్ కి అక్షరాలా పునర్జన్మ!

image of judgement

-రమా సుందరి 

~

“పెరుమాళ్ మురుగన్ మరణించాడు. అతను దేవుడు కాదు. మళ్ళీ అవతారమెత్తడు. అసలు అవతారాలను నమ్మడు. ఇప్పటి నుండి పెరుమాళ్ మురుగన్ ఒక టీచరుగానే బతుకుతాడు.”

పోయిన  జనవరి 12న పెరుమాళ్ మురగన్, తమిళ నవల మాదోరుబాగన్ రచయిత తీవ్ర మనో వత్తిడితో యిచ్చిన  ప్రకటన.

“తనలో దాగున్న అత్యంత ప్రతిభతో సహా రచయితకు పునర్జన్మ ఇద్దాము. పెరుమాళ్ మురగన్ నువ్విక రాయి.”

ఈ సంవత్సరం జులై 5న రచయిత పెరుమాళ్ మురగన్ కు మద్రాస్ హై కోర్టు జడ్జి సంజయ్ కిషన్ కౌల్ యిచ్చిన గొప్ప హామీ.

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను  శక్తివంతమైన శబ్దార్ధంతో వ్యక్తీకరించిన తీర్పు యిది. న్యాయస్థానాల అర్ధం కానీ పరిభాషకు భిన్నంగా – హృదయానికి దగ్గరగా, కవితాత్మకమైన భాషలో వెలువడిన ఈ తీర్పు సంవత్సరన్నర కాలంగా రచయితలు, కళాకారులు పడుతున్న మనో వేదనపై చిరుజల్లులు కురిపించి ఊరట కలిగించింది. సాహిత్యాన్ని, చట్టాన్ని  సమతూకంలో తూచి జయహో అనిపించుకొన్నది. “పుస్తకం అరుదుగా గాయం చేస్తుంది. ఎందుకంటే దాన్ని మూసి వేయటం తేలిక” అన్న ఒక రచయిత సల్మాన్ రష్దీ లాగానే “చదవటం యిష్టం లేకపోతే, పుస్తకాన్ని విసిరి కొట్టు” అంటూ మద్రాస్ హైకోర్ట్ జడ్జిలు సంజయ్ కిషన్ కౌల్, పుష్ప సత్యన్నారాయణలు రచయితల పక్షం వహించారు.

సంజయ్ కిషన్ కౌల్ కళాకారుల పట్ల ప్రేమతో వ్యవహరించటం, కళాత్మక సృజనకు గౌరవం యివ్వటం ఈ రోజు కొత్త కాదు. 2008లో ప్రవాసంలోకి వెళ్ళి పోయిన ఎమ్మెఫ్ హుస్సైన్ కు దన్నుగా ఇదే జడ్జి నిలబడ్డారు. ఆ రోజు ఢిల్లీ హై కోర్టు జడ్జిగా ఉన్న సంజయ్ కౌల్  ప్రాచీన, నవీన కళలు నగ్నత్వాన్నిఎప్పుడూ ఉపయోగించుకొన్నాయని  ఆ నాటి తీర్పులో పేర్కొన్నారు. స్త్రీ పురుషుల మధ్య కలయిక, లైంగిక పూజ.. ఈ రెండిటినీ ప్రాచీన కళ ఎప్పుడు తోసి పారేయలేదని చెప్పారు. అదే వాక్యాన్ని ఈ రోజు పెరుమాళ్ మురుగన్ కేసులో సంజయ్ మళ్ళీ వాడారు. ఎమ్మెఫ్ హుస్సైన్ తీర్పులో ఆయన దేశం ఎదుర్కొంటున్న పెద్ద ప్రమాదం ఛాందసవాదం అని చెప్పారు. ఇప్పుడు పెరుమాళ్ మురుగన్ కేసులో ‘మన సహనపు హద్దులు కిందకు పడిపోతున్నాయి. నిజమో అబద్దమో, ఎవరైనా సామాజిక ఆచరణ గురించి రాస్తే అది మనకు ఎంత మాత్రము ప్రమాదకరం కాదు’ అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీ నుండి ఆర్ధిక శాస్త్రంలో పట్టా పొంది,  కాంపస్ లా కాలేజ్ నుండి ఎల్ ఎల్ బీ డిగ్రీ పొందారు సంజయ్. మద్రాసు హైకోర్టుకు రాక ముందు ఆయన పంజాబ్, హర్యానా హై కోర్టులకు చీఫ్ జస్టిస్ గా ఉన్నారు.

నువ్వొక పుస్తకం రాస్తావు. ఆ పుస్తకం 5000 కాపీల వరకు అమ్ముడు పోతుంది. దాని అనేక అవార్డులు వస్తాయి. ఒక నాలుగు సంవత్సరాలు గడిచాక అది ఇంగ్లీష్ లోకి అనువాదం అవుతుంది. హటాత్తుగా కొందరు వ్యక్తులు అది మత భావాలను అవమానిస్తుందని బయటకు వస్తారు. అందులో భాష అసభ్యంగా ఉందంటారు. అసభ్యమైన అంశాలు ఉన్నాయని, అవి స్త్రీలను అవమానిస్తున్నాయని మొదలు పెడతారు. కులాన్ని భ్రష్టు పట్టిస్తుందని అంటారు. నడిరోడ్డులో పుస్తకాన్ని తగలబెడతారు. బంద్ కు పిలుపు యిస్తారు. ఊర్లో షాపులు బలవంతంగా మూయిస్తారు. (వ్యాపారస్తులు చాలా మందికి సాహిత్యం అంటే ఏంటో కూడా తెలియదు) కొంతమంది స్త్రీలు కూడా ఈ ఆందోళనకారులతో ఉంటారు. జిల్లా పాలనా యంత్రాంగానికి అది శాంతిభద్రతల సమస్యగా కనిపిస్తుంది. కలక్టరు ఆఫీసులో కట్టా(ఖాప్) పంచాయితీ జరుగుతుంది. రచయిత మెడలు అధికారులు వంచుతారు. ఆయనకు ‘సమ్మన్స్” జారీ చేస్తారు.  జరిగిన విషయాలకు ‘తీవ్ర పశ్చాత్తాపం’ ప్రకటిస్తున్నానని రచయిత అంటే ఆ పదాన్ని ‘షరతులు లేని క్షమాపణ’గా మార్పిస్తారు.

ఈ మొత్తం వ్యవహారంలో ఉన్న డొల్లతనాన్ని మద్రాసు హైకోర్టు తప్పు పట్టింది. ఒక నవల తన స్వభాషలో నాలుగు సంవత్సరాలు నానింది అంటే అది ప్రజల ఆమోదం  పొందినట్లే. ఇంగ్లీష్ అనువాదం తమిళ మాతృకకు ఆధునిక రూపం మాత్రమే. అందులో తమిళంలోని వాడుక పదాలు కానీ, నుడికారాలు కానీ, జనపదాలు వాడే మొరటు భాష కానీ ఉండవు. సొంత భాషలో లేని అసభ్యత ఇంగ్లీషులో ఎలా కనిపించింది? అని ప్రశ్నించింది. పాలనా యంత్రాంగానికి ఈ పుస్తకం పట్ల ఎలాంటి అభ్యంతరం లేకుండానే నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. శాంతి భద్రతల పేరుతో అది ఇప్పుడు ఈ విషయంలో కలగచేసుకొన్నది. కళలు సంస్కృతులకు సంబంధించిన విషయంలో ప్రభుత్వ యంత్రాగం ప్రమేయం ఎంతవరకు ఉండాలి అని హైకోర్టు ప్రశ్నించింది. ఒక కళాకారుని వ్యక్తీకరణను చంపటానికి కేవలం ఒక గుంపు ఆవేశాన్ని ప్రాతిపాదికగా తీసుకోకూడదని చెప్పింది. పాలనా యంత్రాంగంతో కూడిన ఈ చట్టాతీత కోర్టులు తమ సొంత సిద్దాంతాల తోటి సామాజిక, నేర విషయాలను పరిష్కరించబూనుకోవటాన్ని తప్పు పట్టింది. మాట్లాడిన తరువాత స్వేచ్ఛ కాపాడక పోవటం అంటే ‘మాట్లాడటానికి స్వేచ్ఛ’  అనే మాటకు అర్ధం ఉండదని స్పష్టం చేసింది.

ఇంత వివాదానికి కారణమైన మదోరుబాగన్ లో ఉన్న కధాంశం కేవలం పిల్లలు లేని తల్లిదండ్రులకు సమాజం నుండి వచ్చే వత్తిడి గురించిన అంశం మాత్రమే. ఆ వత్తిడి స్త్రీ, పురుషులకు యిద్దరికీ ఉన్నప్పటికీ  స్త్రీల మీద పడే భారం చర్చించటమే ఈ కధలోని  అంశం. పెళ్లయ్యి పన్నెండు సంవత్సరాలు అయిన తరువాత కూడా సంతానం కలగక పోవటం కాళి(పురుషుడు), పొన్న(స్త్రీ)లకు పెద్ద సమస్యగా దాపురిస్తుంది. అలాంటి సందర్భంలో తిరుచెంగొడులో ఉన్నఅర్ధనారీశ్వర ఆలయానికి జరిగే తిరనాళ్ళలో పధ్నాలుగోనాడు జరిగే రధోత్సవ సమయంలో అపరిచితులైన మగవాళ్ళతో సంపర్కించి స్త్రీలు సంతానాన్ని పొందుతూ ఉంటారు. అలా పుట్టిన పిల్లలు దేవుడి పిల్లలుగా చలామణి అవుతుంటారు. ఈ కధలోని పొన్న కూడా అలా సంతానాన్ని పొందటానికి ప్రయత్నిస్తుంది.

Kishan-Kaul_YT

ఒక కధ సమాజం మీదా ఎలాంటి ప్రభావం కలుగచేస్తుందో తెలుసుకోవాలంటే  రచయిత చెప్పుల్లో కాళ్ళు పెట్టి చూడాలని కోర్టు వ్యాఖ్యానించింది. అంతేకాదు వివిధ స్థాయిల, వయసుల పాఠకుల దృష్టి కోణం నుండి కూడా చూడాలని అభిప్రాయపడింది. హేతుబద్దత, బలమైన వ్యక్తిత్వం, దృఢమైన మనస్తత్వం కల వ్యక్తి దృష్టికోణాన్ని గీటురాయిగా తీసుకోవాలి కానీ, చిన్న చిన్న విషయాలను ప్రమాదకరంగా భావించే వారి దృష్టికోణాన్ని స్టాండర్డ్ గా తీసుకోకూడదని కోర్టు వ్యాఖ్యానించటం విశేషం. అలా చూస్తే ఈ కధలో తప్పు ఏమీ కనబడలేదని కూడా చెప్పింది. ఈ కధ నవలీకరణ చెందిన చరిత్ర కాదని, జనపదాల్లో ప్రచారంలో ఉన్న సంగతులనే రచయిత కాల్పనికం చేశాడని చెప్పింది. ఇది విజేతల చరిత్ర కాదనీ, సామాన్యప్రజలు రోజూవారి పడుతున్న కష్టాల కధ అని చెప్పింది. కోర్టు స్త్రీల వైపు నిలబడి..   స్త్రీలు పరపురుషుడితో, అందునా అపరిచిత పురుషునితో స్త్రీలు సంపర్కానికి యిష్టపడరనీ, పిల్లల కోసం సమాజం వాళ్ళను ఆ పని పురికొల్పి వుండే అవకాశం ఉందని అన్నది.

ఈ కేసు విచారణలో ఉన్నప్పుడు ప్రచురణకర్తల వైపు నుండి వాదించిన లాయర్ సురేశ్ కొన్ని ప్రాధాన్యత కలిగిన  సంగతులు ముందుకు తీసుకొని వచ్చారు. ‘రధోత్సవంనాడు పిల్లలు లేని స్త్రీలందరూ పురుషుల కోసం వీధుల్లో సంచరిస్తుంటారు’ అని పెరుమాళ్ రాయటం స్త్రీలకు అవమానకరం అని పెరుమాళ్ మీద దాఖలు చేసిన పిటీషన్ ను ఉద్దేశిస్తూ సురేశ్ వర్ధమాన కాలంలో స్కానింగ్ సెంటర్లను గురించి ప్రస్తావించారు. అక్కడ స్త్రీలు స్కానింగ్ తీయించుకోవటానికి గుంపులు గుంపులుగా పొద్దున తొమ్మిది నుండి మధ్యాహ్నం మూడు వరకు వేచి ఉండటం పెరుమాళ్ళు వర్ణించిన రధోత్సవం నాటి స్త్రీల గుంపులను గుర్తుకు తెస్తుందని అన్నారు. ఒక స్త్రీ స్కానింగ్ కోసం మంచం మీద బట్టలు తొలగించి పడుకొని ఉండగా, ఇంకొక స్త్రీకి అదే స్థితిలో స్కానింగ్ తీస్తూ ఉంటారని చెప్పారు. ఒక్కోసారి పురుషులు కూడా అక్కడికి డాక్టర్ తో మాట్లాడటానికి వస్తుంటారనీ, ఆ స్థితిలో ఉన్న స్త్రీలను వాళ్ళు కూడా చూస్తూ ఉంటారని చెప్పారు. ఆ అవమానాన్ని పిల్లల కోసం స్త్రీలు పడుతుంటారని అన్నారు. పురుషులలో వీర్యకణాలు తక్కువగా ఉంటే ఇతర పురుషుల వీర్య కణాలు కూడా స్వీకరించి స్త్రీలు గర్భవతులవుతున్నారనీ, అందుకు పురుషుల ఆమోదం కూడా ఉంటుందని అన్నారు. పెరుమాళ్ళు కధను తప్పు పడుతున్న నైతిక పోలీసులు ఈ విషయంలో ఏమి మాట్లాడతారని ప్రశ్నించారు. వంద సంవత్సరాల క్రితం అమలులో ఉందని చెబుతున్న ఒక ఆచారాన్నికధలో జొప్పిస్తే తప్పేమిటని ఆయన వాదిస్తూ ఈ నవల ఈ ఆచారాన్ని గ్లామరైజ్ చేసి వాడుకోలేదని చెప్పారు.

పెరుమాళ్ మీద పిటీషన్ వేసిన గోవిందరాసు(అరుల్మిగు అర్ధనారీశ్వర గిరివాల), కె. చిన్నుసామి (హిందూ మున్నని సంస్థ) మొదలైన వారు వాదిస్తున్నట్లుగా ఈ విషయం సెక్షన్ 292 కిందకు రాదని కోర్టు తేల్చి చెప్పింది. యాంత్రికంగా  సెక్షన్లు వల్లించటం, పదజాలాన్ని వాడటం మంచిది కాదనీ, సెక్షన్ 292 లో పేర్కొన్న అశ్లీలత ఈ కధలో లేదని చెప్పటం సరైన నిర్ధారణ. నవలలోని చిన్న చిన్న ముక్కలను తీసుకొని తప్పు పట్టటం కాకుండా, మొత్తంగా నవల ఏమి చెబుతుందో పరిశీలించాలని అన్నది. సమాజానికి ఎలాంటి చెడు చేసే ఉద్దేశం ఈ కధకు లేదనీ తీర్మానించింది. కామేచ్ఛ కలిగించేటట్లుగా ఈ కధలోని విషయాలు లేవనీ, కేవలం ఆలోచనలు రేకెత్తించే అంశాలే ఉన్నాయని స్పష్టం చేసింది.

 

సంజయ్ కిషన్ కౌల్ సాహిత్య కారుల పట్ల ప్రదర్శించిన ప్రేమ అభిమానం గొప్పవనటంలో ఏ మాత్రం సందేహం లేదు. అయితే నవలలోని కధను సమర్ధించటానికి ఆయన ప్రాచీన సాహిత్య ఔన్నత్యాన్ని అతిగా పొగిడినట్లు అనిపిస్తుంది. స్త్రీలకు సంబంధించి పురాతన సాహిత్యంలో అన్నీ మంచి విషయాలే ఉన్నాయన్నట్లు వ్యాఖ్యానించారు. అప్పుడు (పాత కాలంలో) శృంగారం గురించి యదేచ్ఛగా చర్చించేవారనీ, బ్రిటీష్ వాళ్ళు వచ్చి అంతా పాడు చేశారన్నట్లు మాట్లాడారు. ఒకానొక చోట దేవదాసీ పద్దతిని కూడా వెనకేసుకొచ్చినట్లు అనిపించింది. మహాభారతంలో అంబిక, అంబాలిక, కుంతి, మాద్రిలను  ప్రస్తావనలోనికి తీసుకొచ్చారు. భర్తలు లేకుండా వీళ్ళు పిల్లలను కనటం ఉదాహరణగా చూపించారు. ఈ రకమైన ఆచారాలు ప్రాచీన సమాజంలో ఉండేవి, వాటి అవశేషాలు వందేళ్ళ క్రితం సమాజంలో ఉండి ఉండవచ్చు అని చెప్పటంలో అర్ధం ఉంది కానీ, అవన్నీ మనం కోల్పోయామన్నట్లు వ్యాఖ్యానించటం ఆశ్చర్యంగా అనిపించింది. ప్రాచీన, మధ్య యుగాలలో ఉన్న  భూస్వామ్య సమాజంలో వ్యక్తిగత ఆస్తి విధానాన్ని కాపాడటానికి స్త్రీలను పరికరాలుగా వాడుకొన్నారనేది వాస్తవం. వాళ్ళ సెక్సువాలిటీ మీదా వారికే హక్కు లేని కాలంలో అది వారి శృంగార స్వేచ్ఛగా భావించటం సరైదేనా? దేవాలయాల మీద బూతు బొమ్మలను కూడా ప్రస్తావించారు. ఆ బొమ్మల్లో కూడా పితృస్వామ్య సమాజపు అసలు స్వరూపం నగ్నంగా కనిపిస్తుంది. మహాభారతాన్ని ఒక నాటి మన చరిత్రగా చెబుతూ దాన్ని కూడా నిషేదిద్దామా అని ప్రశ్నించారు.

‘మళ్ళీ లేచి నిల్చొంటానని’ పెరుమాళ్ళు మురుగన్ అనటం ఆనందకరం. కల్బుర్గీని, పన్సారేని కోల్పోయిన సాహిత్య లోకం గట్టిగా ఊపిరి పీల్చుకోంటోంది. వేల గొంతులతో, సంతోషం నిండిన హృదయాలతో ఈ తీర్పును ఆహ్వానిస్తోంది. అయితే సెక్షన్ 292 పాము పడగ కిందే యింకా సృజనకారులు ఉన్నారు. రచయిత హృదయం ఎరిగిన సంజయ్ కిషన్ లాంటి న్యాయాధీశులు మనకు ఎంత మంది ఉన్నారు? ఎమ్మెఫ్ హుస్సేన్ నుండి పెరుమాళ్ మురుగన్ వరకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను రక్షించడానికి అవిరామంగా కష్టపడిన  జడ్జీలు ఎందరు? తొంభై ఏళ్ల చిత్రకారుడు తన కాన్వాస్ దగ్గర బొమ్మలు వేసుకొంటూ తన యింట్లోనే ఉండాలని వాంఛించిన అత్యున్నత న్యాయ స్థానాలు మనకు ఎన్ని? చట్టాలను దాటి  రచయితల కోసం సౌందర్యాత్మకమైన ప్రతిపాదనలతో ముందుకొస్తున్న వారు ఎవరు? ‘కళ రెచ్చగొట్టేటట్లే ఉంటుంది. అది అందరి కోసం కాదు. అందరూ తనను వీక్షించాలని కూడా కోరుకోదు. చూసేవాళ్ళ అభిరుచి  మీద అది ఆధారపడి ఉంటుంది.’ అనగల దమ్మున్న జడ్జీలు సంజయ్ కాకుండా మనకెవరు ఉన్నారు?

*

 

 

 

మీ మాటలు

 1. THIRUPALU says:

  విశ్లేషణ బాగుంది.

 2. Mandapaka Kameswar raju says:

  Superb Ramadevi Garu….keep it up….

 3. ప్రసాదమూర్తి says:

  మంచి విశ్లేషణ రమాసుందరి గారు. సంజయ్ కౌల్ గారు నిజంగా రచయితలకు కవులకు కొత్త ఊపిరి పోశారు. పోతే మహాభారతం పురాణాల కథల ప్రస్తావన మురుగన్ తరపు న్యాయవాదులే తమ వాదనలకు బలంకోసం వాడారు. వాటినే న్యాయమూర్తి కూడా తమ తీర్పుకి ఊతంగా తీసుకున్నారు. మహాభారతాన్ని నెత్తిన పెట్టుకున్న వారికి మురుగన్ నవలలోని కథాంశం తప్పెలా అవుతుందని ఖండించడానికి చక్కగా కుదిరింది దానితో ప్రతివాదుల తిక్క కూడా కుదురుతుంది. తప్పేం లేదు. మొత్తానికి మీ వ్యాసం టైమ్లీగా బావుంది. థ్యాంక్యూ

 4. “మాట్లాడిన తరువాత స్వేచ్ఛ కాపాడక పోవటం అంటే ‘మాట్లాడటానికి స్వేచ్ఛ’ అనే మాటకు అర్ధం ఉండదని” అనడం చాలా సరిగ్గా ఉంది. సృజనకూ, న్యాయానికీ ఉన్న సంబంధం ఏమిటో స్పష్టం చేసింది.
  వ్యాసం బాగుందండీ.

 5. Veloori Krisihna Moorthy says:

  రమా సుందరి గారూ, పెరుమాళ్ మురుగన్ నవలపై మీ విశ్లేశషణ చాలా బాగుందండి. అభినందనలు.

  వేలూరి కృష్ణమూర్తి , మైసూర్

 6. అక్క, చాలా బాగా విశ్లేషించారు..

 7. veerabhadrappa.choppa says:

  chaalaa vishayaalu తెలిసాయి వివరణ baagundi

మీ మాటలు

*