మూడు పాయల తెలుగు డయాస్పోరా   

 

చిత్రం: సృజన్ రాజ్

చిత్రం: సృజన్ రాజ్

 

-సాయి బ్రహ్మానందం గొర్తి

~

 

అశ్వశాల నుండి గుర్రాన్ని తీసుకురమ్మనమని ఆజ్ఞాపించాను. ఏం చెప్పానో పనివాడికి అర్థం కాలేదు. నేనే లేచి వెళ్ళి, జీను వేసి గుర్రం ఎక్కాను. దూరంగా ఎక్కడో శంఖనాదం వినిపించి, అదేమిటని పనివాణ్ణి అడిగాను. అతనికేమీ అది పట్టలేదు;వినిపించలేదు. గేటు దగ్గర నన్ను ఆపి “ఎక్కడికి ప్రయాణం?” అని ప్రశ్నించాడు.

“తెలీదు. ఇక్కడనుండి బయటకి. ఇంకాస్త దూరానికి. బయటకి వెళ్ళాలి. అదొక్కటే నా గమ్యాన్ని చేరుస్తుంది,” బదులిచ్చాను. “నీ గమ్యం ఎరుకా?” మరోసారి అడిగాడు.

“తెలుసు. ఇప్పుడే చెప్పాను కదా? ఇక్కడనుండి బయటకి. అదే నా గమ్యం!”

“ద డిపార్చర్” అనే కథలో చివిరి వాక్యాలు ఇవి. ఆ కథ రాసింది కాఫ్కా.

వలసజీవుల యాతనా, తపనా సూక్ష్మంగా చిన్న కథలో చూపించాడు కాఫ్కా.    

*******

ఏ మనిషయినా తన స్వస్థలం వదిలి ఎందుకు వెళ్ళాలనుకుంటారు? అక్కడ భరించలేనంత ఇబ్బందయినా ఉండాలి. లేదా వేరే చోటకి వెళితే జీవితం మెరుగుపడచ్చన్న ఆశ అయినా వుండాలి. ఈ రెండే మనిషిని స్థాన భ్రంశం చేయిస్తాయి. కొత్త ప్రదేశం వేరే ప్రపంచాన్ని పరిచయం చేయిస్తుంది. కొత్త అనుభవాలని ఇస్తుంది. ఆలోచనలని రేకెత్తిస్తుంది. జ్ఞాపకాల కుదుపులున్నా, నిలదొక్కుకునే ధైర్యం ఇస్తుంది. ప్రవాస జీవితానికి ఒకటి కాదు. రెండు ప్రపంచాలు.  ఇంకా గట్టిగా చెప్పాలంటే మూడు ప్రపంచాలు.

000000000000  

ఊరు మారినా, ఉనికి మారునా?

దూరమయినప్పుడే కోల్పోవడం విలువ తెలుస్తుంది. అది – మనుషులు కావచ్చు; అలవాట్లు కావచ్చు; ప్రదేశాలు కావచ్చు; సంస్కృతి కావచ్చు – ఇంకా ముఖ్యంగా భాష కావచ్చు. ఈ కోల్పోవడం వెనుక నీడలా కనిపించని అదృశ్య పార్శ్వం  ఒకటి ఉంటుంది. ఆ పార్శ్వమే “ఉనికి” లేదా “గుర్తింపు”. ఈ ఉనికి అన్నది స్థానం బట్టి మారుతూ ఉంటుంది.

ఇల్లు దాటగానే ఒక రూపం, వీధి దాటగానే మరో రూపమూ, వూరు దాటగానే వేరొక రూపమూ సంతరించుకుంటుంది.  పరాయి రాష్ట్రం వెళితే ఒకవిధంగానూ, దేశం విడిచి వెళితే ఇంకో కొత్త రూపంలోనూ దర్శనమిస్తుంది. ఈ ఉనికి అన్నది కేవలం వ్యక్తిగతమే కాదు, దానికి చాలా పార్శ్వాలుంటాయి. వాటిలో ముఖ్యమైనవీ, చాలా ప్రభావితమైనవీ – భాషా, సంస్కృతి (అంటే జీవన విధానమూ, అలవాట్లు. ముఖ్యంగా ఆహారం). సంస్కృతి బయట ప్రపంచానికి తెలియకపోవచ్చునేమో కానీ, మొట్టమొదట కనిపించేదీ, వినిపించేదీ భాష ఒక్కటే.  ప్రపంచంలో ఏ మనిషికైనా తమ జీవన స్రవంతిలో భాషే ప్రధాన అంగమూ, ఆయుధమూ కూడా. అందువలనే భాష ఉనికిని అంటిపెట్టుకునే ఉంటుంది. అలాగే అలవాట్లూ, సంస్కృతీ. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటాయి. పరాయిదేశంలో అడుగు పెట్టీ పెట్టగానే ఇవి వారి ఉనికిని గుర్తు చేస్తూనే ఉంటాయి.

“ఊరు మారినా, ఉనికి మారునా? – ఉనికి మారినా, మనిషి మారునా?” అని పాత తెలుగు సినిమా పాటొకటుంది(ఆరుద్ర రాసినది). ఊరు మారితే ఉనికి మారినా, మారకపోయినా దాని పేరు మాత్రం మారుతుంది. రాయలసీమ వాస్తవ్యులూ, తెలంగాణా వాస్తవ్యులూ, కోస్తావాసులూ అన్నది రాష్ట్రం దాటితే తెలుగువారి గానే పరిగణించబడతారు. అదే దేశం వదిలి వెళితే భారతీయులుగా గుర్తించబడతారు.

వలస వెళ్ళిన దేశం అయితే అది “diaspOra”గా అవతరిస్తుంది. ఈ Diaspora (dispersed or scattered అన్నది గ్రీకు పదం. క్రీస్తు పూర్వం 586 కాలంలో యూదు జాతీయులు దేశ బహిష్కృతులై, ఈజిప్ట్‌ నుండి చెల్లాచెదరైపోయి పాలస్తీనా దగ్గర వలస చేరిన సందర్భంలో దీన్ని వాడేవారు. దాన్ని మెల్లగా వేరే దేశాలలో వలస వెళ్ళిన సమూహాలకి అన్వయించడం మొదలుపెట్టారు. ఈ అన్వయంలో చిన్న “d” తో వీరిని గుర్తించడం మొదలయ్యింది.  డయాస్పోరా (diaspora)కి ప్రధాన లక్షణం – ఉనికి.      

ఈ ప్రపంచంలో చాలా డయాస్పోరాలున్నాయి. ముఖ్యంగా అమెరికాలో.  వలసదారులతో ఏర్పడ్డ అమెరికా దేశంలో అనేక డయాస్పోరా కమ్యూనిటీలున్నాయి. చైనీస్, ఆఫ్రికన్లు, స్పానిష్, ఐరిష్ వాళ్ళనీ వీరిలో ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఉన్న ఊరునీ, కన్నవాళ్ళనీ, దేశాన్ని వదిలి ఒక కొత్త ప్రపంచంలో అడుగు పెట్టడంటే అంత తేలికయిన విషయం కాదు. భాషా పరంగా, సాంస్కృతిక పరంగా అనేక ఒడిదుడుకులు ఉంటాయి. అవన్నీ నిలదొక్కుకొనీ తమకంటూ ఒక ప్రత్యేక ఉనికిని చాటుకోవడం ఈ డయాస్పోరా కమ్యూనిటీల ప్రత్యేక లక్షణం.

మాతృదేశం వదిలి వలస వచ్చిన కొత్తలో ప్రతీ ఒక్కరినీ cognitive dissonance(అభిజ్ఞా వైరుధ్యం లేదా వ్యతిరేకత) ఆవరించుకొని ఉంటుంది.

వేరొక కొత్త సమాజపు అలవాట్లూ, సంస్కృతీ ఎదురుపడ్డప్పుడు – తమ నమ్మకాలకీ, ఆలోచనలకీ, నమ్మిన విలువలకీ మధ్య – వాటిద్వారా కలిగే ఒక మానసిక  ఒత్తిడి.  సూక్ష్మంగా చెప్పాలంటే – రెండు విభిన్న సంస్కృతులూ, నమ్మకాల మధ్య ఊగిసలాడే డోలాయమాన స్థితి.  ఈ సంఘర్షణకి అంతర్లీనగా సంస్కృతీ, అలవాట్లే హేతువులు అయ్యే అవకాశం చాలా వుంది.  వీటికంటే ప్రధానంగా మాట్లాడే “భాష” ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. అంతవరకూ మాతృభాషకి అలవాటు పడ్డ ఆలోచనలూ, భావాలూ ఒక్కసారి వేరే భాషలో రూపాంతరం చెందేటప్పుడు కొన్ని అర్థం మారిపోవచ్చు; కొన్ని జారిపోవచ్చు కూడా. ఇలాంటి సందర్భాలలో కొంత మానసిక సంఘర్షణ కలుగుతుంది.

ఈ సంఘర్షణలో – కొంత అస్పష్టతా, గందరగోళమూ, అపార్థమూ లేదా విబేధం ఏర్పడచ్చు. ఇవి కాకుండా కొంత ఉద్రిక్తతా, అఘాతం కూడా కలగవచ్చు. ఇవన్నీ వేరే జాతులు – అంటే అమెరికాలో ఉండే అమెరికన్లూ, ఆఫ్రికన్లూ, స్పానిష్ వాళ్ళూ, చైనీయులు, వంటి వారితో కలిసినప్పుడు కలగుతాయి. కేవలం మనుషుల మధ్యే కాకుండా వస్తుగతంగా కూడా ఉండచ్చు.

లండన్ యూనివర్శిటీలో సోషియాలజీ ప్రొఫెసర్ – Avtar Brah – “Cartographies of Diaspora” పుస్తకంలో ఇలా అంటారు – “డయాస్పోరా అన్నది కొత్త ప్రశ్నలు రేకెత్తిస్తుంది. విడిపోయేటప్పడు కలిగే అనుభవంలో అఘాతాన్నీ, స్థానభ్రంశాన్నీ ఎత్తి చూపిస్తుంది. అదొక్కటే కాదు – కొత్త ఆశలనీ, సరికొత్త అధ్యాయాలనీ సృష్టిస్తుంది కూడా. ఈ కొత్త సాంస్కృతిక జాగాలో వ్యక్తిగతమైన, సామూహికమైన జ్ఞాపకాలు ఢీకొంటాయి. కొన్ని పెనవేసుకుంటాయి. ఇంకొన్ని రూపాంతరం చెందుతాయి. ఇదే దీనికున్న బలమూ; బలహీనతా కూడా.”

గత వందేళ్ళుగా డయాస్పోరా మీద కొన్ని వందల వ్యాసాలూ, పుస్తకలూ వచ్చాయి. ఎన్నో సిద్ధాంతలూ, ప్రతిపాదనలూ, చర్చలూ జరిగాయి. వాటిలో ఈ మధ్య పుట్టుకొచ్చిందే – Third Space Theory. ఈ పదాన్ని సృజన లేదా కోయిన్ చేసింది – Oxford University లో హోమీ.కె.భాభా అనే ఒక ఇండియన్ ప్రొఫెసరు. ఈ డయాస్పోరా కమ్యూనిటీల గురించి చెబుతూ – The diasporic communities occupy a unique interstitial third space, which enables negotiation and reconfiguration of different cultures through hybrid interactions. Third Space Theory explains the uniqueness of each person, actor or context as a “hybrid”.

దీన్ని బట్టి చూస్తే డయాస్పోరా కమ్యూనిటీల ప్రత్యేకత – మిశ్రిత జీవనం; ఏకత్వంలో భిన్నత్వం. వీరికి రెండు కాదు – మూడు ప్రపంచాలు – మొదటి రెండూ, సొంత, వలస దేశాలయితే మూడోదే ఈ “కొత్త జాగా”. ఆ జాగాలో ఊపిరి పోసుకున్నదే డయాస్పోరా సాహిత్యం.

0000000000000

సాహిత్యం అనగానే మొట్ట మొదట గుర్తొచ్చేది భాష. భాష అంటే ఏది? మాతృభాషా? పరాయి భాషా? కొత్త దేశంలో మాతృభాష వెనక్కి వెళ్ళి పరాయి భాష ముందుకొస్తుంది. ఆ క్రమంలో వ్యక్తిగత భావ ప్రకటనే ప్రధానాంశం అవుతుంది. ఎవరికైనా భాష వచ్చూ అంటే – మాట్లాడడం, అర్థం చేసుకోవడం, చదవడం, రాయడం – వంటి వాటిలో నైపుణ్యం కావాలి.. ఈ నాలుగింటిలో నైపుణ్యత ఉన్నప్పుడే ఆ భాష వచ్చునని చెబుతాం.

ఎవరికైనా మాతృభాషలో ఉన్న ప్రావీణ్యత పరాయి భాషలో అంత తేలిగ్గా రాదు. కాబట్టి ప్రవాసీయులు తమ అనుభవాలానీ, జీవితాన్నీ చెప్పాలంటే మాతృభాషనే వాహకంగా ఎన్నుకుంటారు. తద్వారా తమ సొంత జాతీయులకి వారి జీవితం తెలిసే అవకాశం ఉంటుంది. ఇదొక పార్శ్వం. అమెరికాలో ఉన్న అనేకమంది తెలుగు రచయితలు అందిచ్చే సాహిత్యం, కథా, కవితా, నవలా, ఏ రూపమయినా ఈ కోవకి చెందుతాయి.

అలా కాకుండా పరాయి దేశపు భాషలో తమ అనుభవాలనీ, జీవితాన్నీ వ్యక్తీకరించినప్పుడు ఆయా దేశాలవారికీ తమ సంస్కృతీ, ఆలోచనలూ, సమస్యలూ, జీవితమూ తెలిసే అవకాశం ఉన్నాయి. అంటే ఇంగ్లీషులో సాహిత్య సృజన చెయ్యడం.

ఇంతకు ముందు ప్రస్తావించినట్లు యూదులు హీబ్రూ, అరామిక్ భాషల్లోనే అన్నీ వ్యవహారాలూ నడిపేవారు. మతంగురించి రాసినా, పండితులతో వ్యవహరించినా, మామూలు యూదు ప్రజలను ఉద్దేశించి చెప్పాలన్నా అవే భాషలు వాడేవారు. తమ దేశం వలస వచ్చిన వేరే జాతీయులకి చెప్పడానికీ ఇవే భాషలు వారికి బోధించి మరీ చేరవేసేవారు. తద్వారా వలస జాతీయుల ద్వారా కొంత సాహిత్యం పుట్టింది. వీరి అవస్థలూ, ఆలోచనలూ తెలిసాయి.

ప్రస్తుతం అమెరికా తెలుగు డయాస్పోరా సాహిత్యం తీసుకుంటే అది ఒంటికాలుతోనే ఉంది. ఎందుకిలా అనాల్సి వచ్చిందో చూద్దాం.

తెలుగు వారికంటే ముందు వచ్చిన చైనీస్ ఆరేడు తరాలు తమ జీవితాన్నీ, అనుభవాలనీ సాహిత్య పరంగా అందించాయి. మొదటి తరాలు తమ సొంత భాషల్లో చేస్తే, తరువాతి తరాలు ఇంగ్లీషులోనే రాయడం మొదలు పెట్టారు. తెలుగువారికంటే ముందు ఎక్కువగా వలస వచ్చిన భారతీయుల్లో గుజరాతీయులూ, పంజాబీలూ, బెంగాలీలు ఉంటారు (ఈ మాధ్యకాలంలో అంటే గత పదహారేళ్ళుగా మన తెలుగు వాళ్ళ సంఖ్య గణనీయంగా పెరిగింది. అది వేరే విషయం.). 1914 కాలంలోనే ఎంతోమంది పంజాబీలు కెనడా వలస వచ్చారు. వారిలో చాలమంది ఉపాధికోసం అమెరికాకి వచ్చారు. వీళ్ళతరువాత వచ్చిన వాళ్ళల్లో మరో ముఖ్యమైన గుంపు గుజరాతీయులు.

ఇందులో అన్ని రంగాల వారూ, అంటే వ్యాపారస్తులు మొదలుకొని, విద్యార్థులూ, నర్సులూ, పనివాళ్ళూ అందరూ వచ్చారు. దాంతో వారికి ఇక్కడి జన జీవనంతో సంబంధ బాంధవ్యాలు త్వరిత రీతిన ఏర్పడ్డాయి. అమెరికాలో మోటెల్స్ (చిన్నసైజు లాడ్జీలు) వ్యాపారంలో అందరూ గుజరాతీయులే! అలాగే టాక్సీ, రెస్టారెంట్ లాంటి వివిధ రంగాల్లో పంజాబీలూ ఎక్కువగానే ఉన్నారు. వీరుకాకుండా బెంగాలీయులూ ఉన్నారు. వీరందరికీ కొన్ని దశాబ్దాలుగా అమెరికన్ సమాజంలో వివిధ వర్గాల వారితోనూ అనుభవాలు ఉన్నాయి. అవన్నీ తమ మాతృభాషల్లోనూ, ఇంకా ముఖ్యంగా ఇంగ్లీషులోనూ అక్షర రూపం ఇచ్చారు. అందువలన ఇండియన్ డయాస్పోరా చెప్పగానే వీళ్ళ పేర్లే అమెరికాలో అందరికీ తెలుసు. ఇండియన్ డయాస్పోరా పేరు చెప్పగానే ఝుంపా లహరి, చిత్రా దివాకరునీ(బెంగాలీ) – బల్వంత్ జాని,  పన్నా నాయిక్ (గుజరీతీ) – దర్షన్ సింగ్ తట్ల,  వంటి పేర్లు అమెరికాలో అందరికీ చిర పరిచయమే.

ఈ వలస అన్నది ఈనాటిది కాదు. ఎంతో మంది భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు సౌత్ఆఫ్రికా, మారిషస్, ఫిజీ, మయన్మార్(ఒకప్పటి బర్మా) వంటి దేశాలకు వ్యాపార రీత్యా, ఉపాధి కోసమూ అనేకమంది వెళ్ళారు. కాల క్రమేణా వారందరూ ఆయా దేశాల జన స్రవంతిలో కలిసేపోయారు. కొత్త తరం వారు పేరుకి తెలుగు వారయినా ఆయాదేశపు సంస్కృతీ, జీవిన విధానంలో భాగం కనుక, వారి ఉనికిని కోల్పోవడం సహజ పరిణాంగానే భావించాలి. ఎప్పుడైతే భాష అంతరించిందో అప్పుడే సాహిత్యమూ గతిస్తుంది. అందువల్ల ప్రపంచంలో పలు ప్రాంతాల్లో తెలుగు వారు ఉన్నా, అక్కడి నుండి గుర్తించగలిగిన సాహిత్యం రాలేదు. సౌత్ఆఫ్రికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, గల్ఫ్ దేశాల్లో అనేకమంది తెలుగు వారున్నారు. తెలుగులో రాయకపోయినా, కనీసం ఇంగ్లీషులో నయినా సాహిత్య సృజన చేపట్టినవారు కనిపించరు.

డయాస్పోరా అనగానే మాతృభాషలో వచ్చే సాహిత్యమే అన్న ధోరణి కనిపిస్తూ ఉంటుంది. కేవలం మాతృభాషలోనే కాకుండా పరాయి భాషలో (ప్రస్తుతం ఇంగ్లీషు అనుకుందాం) కూడా సాహిత్య సృజన ద్వారా వారి జీవన విధానమూ, అనుభవాలూ అందజేయాలి. అప్పుడే అది పరిపూర్ణ డయాస్పోరా సాహిత్యం అవుతుంది. ఇంగ్లీషులో రాసింది ఒక కోణమయితే,  మాతృభాషలో రాసింది మరొక కోణం అవుతుంది. ప్రస్తుతం అమెరికాలో తెలుగువారినీ, భాషనీ తీసుకుంటే, కేవలం తెలుగులో రాసే తెలుగు రచయితలు మాత్రమే ఉన్నారు.

ఇరవయ్యో శతాబ్దం మొదట్లో ఎంతో మంది పంజాబీలు అమెరికా, కెనడా వచ్చారు. కొంతమంది అక్కడున్న స్థానికులతో పెళ్ళి వంటి సంబంధ బాంధవ్యాలు కొనసాగించారు. ఇంకొతమంది మెక్సికనలని కూడా పెళ్ళి చేసుకున్నారు. ఆ తరువాత తరం వాళ్ళు విద్యలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో స్థిరపడి నిలదొక్కుకున్నారు. అమెరికాలో టాక్సీ వ్యాపారంలోనూ, డంకిన్ డోనట్స్ ఫ్రాంచైజ్ బిజినెస్సుల్లోనూ చాలామంది పంజాబీలు ఉన్నారు. అలాగే మోటెల్స్ నడపడంలోనూ, సబ్‌వే వంటి రెస్టారెంట్ బిజినెస్సుల్లో గుజరాతీయులు ఎక్కువగా కనిపిస్తారు.  గుజరాతీయులు మొదట వలస వెల్లింది సౌతాఫ్రికాకే. అక్కడినుండే అమెరికాకి వచ్చారు.   అమెరికాలో తెలుగువారి రాక 1950, 50లలో ఉన్నత విద్యకోసం ప్రారంభమయినా, డేబ్బైల్లో అనేకమంది డాక్టర్లు, నర్సుల రాకతో ఎక్కువయ్యింది. వీళ్ళందరూ సరాసరి ఉద్యోగలకే వచ్చారు. అందులోనూ వచ్చింది వైద్య వృత్తి రీత్యా కావడంతో వీరికి ఆర్థిక సమస్యలు అంతగా ఉండకపోవడం సహజం. ఆ తరువాత తొంభైల్లో సాఫ్ట్ వేర్ రంగంలో ఉద్యోగాలకోసం వచ్చిన వారిలో తెలుగువారి సంఖ్య గణనీయంగా పెరిగింది. అమెరికా పౌర జీవన ప్రమాణాలతో చూస్తే వీరందరూ ఆర్థికపరంగా మధ్యతరగతి కంటే ఎక్కువే.

డెబ్బైల తరువాత వచ్చిన వారికి అమెరికాలో అనేక అనుభవాలూ, సంఘర్షణలూ, సర్దుబాట్లూ ఉండి ఉంటాయి. ఇప్పటిలా సౌకర్యాలూ, వార్తా ప్రవహామూ అంతగా లేదు. అందువల్ల నాస్టాల్జియా వెంటాడుతూనే ఉండేది. భాషా, సంస్కృతీ ఇవన్నీ ఉనికిలో భాగం కాబట్టి అవి నిలబెట్టుకోవడం కోసం ఆ తరంలో తపనా, యావా ఉండేవి. అందులో సాహిత్యం కూడా కొద్దిగా ఉంది. ఆ విధంగానే తానా, ఆటా వంటి సంస్థలు వుద్భవించాయి. ఎంత దూరంలో ఉన్నా తెలుగువారు కలవడం అన్నది ఒక ప్రధాన అంశంగా మారింది. ఆ కోవలోనే అనేకమంది తెలుగు ప్రముఖుల రాకపోకలు అమెరికాలో ఎక్కువయ్యాయి. సాహిత్య పిపాస ఉన్న కొంతమంది ప్రేరణతో సావనీర్లు పుట్టుకొచ్చాయి.  తెలుగులో రాయడం అన్నది ఒక రివాజుగా వుండేది. అడపాదడపా కొన్ని కథలూ, వ్యాసాలూ వచ్చినా సాహిత్య పరిధి పెరిగినది మాత్రం 1996 కాలంలో ఇంటర్నెట్ వచ్చిన తరువాతే. ఆ విధంగా సాహిత్య సృజనకి కంప్యూటర్ సాంకేతిక రంగం(ఇంటర్నెట్) ఎంతో దోహదం చేసింది. చాలామంది ఔత్సాహిక రచయితలు అమెరికా నుండి రచనలు చేయడం మొదలుపెట్టారు. అక్కడి అనుభవాలూ, నాస్టాల్జిక్ జ్ఞాపకాలూ కలగలిపి అనేక కథలూ, వ్యాసాలూ వచ్చాయి. ఆ విధంగా తెలుగు డయాస్పోరా అన్నది తెలుగు సాహిత్యంలో ఒక పాయగా మారింది.

ఇంతమంది తెలుగు వారు అమెరికా, కెనడా వంటి దేశాల్లో ఎంతో కాలం నుండీ ఉంటున్నా ఏ ఒక్క తెలుగువాడూ ఇంగ్లీషులో రచనలు చేయడం కనిపించదు. వెల్చేరు నారాయణ రావు వంటి వారు అనువాదాలు చేసినా, అవి అందరి పాఠకులనీ చేరుతాయన్నది అనుమానమే. అమెరికాలో నవలలూ, కథల పుస్తకాలూ విరివిగా ప్రాచుర్యంలో ఉంటాయి. (వేరేవి కూడా ఉంటాయి. ప్రస్తుతం కథ/నవల గురించే చెప్పుకుందాం) కొన్ని తరాల తెలుగు వారు ఇంత కాలం నుండి ఉన్నా ఏ ఒక్కరూ ఇంగ్లీషులో తెలుగువారి జీవితం గురించి రాయలేదు. అదే బెంగాలీ, గుజరాతీ, పంజాబీ భాషల్లో అయితే రెండు వైపులా సాహిత్యం వచ్చింది. అనేకమంది పేరున్న రచయితలు అమెరికాలో భారతీయ జీవన విధానాన్నీ, సాంస్కృతిక సంఘర్షణనీ సాహిత్య రూపంలో అందించారు. వెతికి చూస్తే, అమూల్య మల్లాది అన్న ఒక్క రచయిత్రి మాత్రమే కనిపిస్తారు. అటు కన్నడంలోనూ, తమిళంలోనూ నలుగురైదుగురైనా ఉన్నారు.

తెలుగు వారి జీవితం గురించి ఎవరైనా ఇంగ్లీషులో నవలా, కథా రాసినా అమెరికన్ల వరకూ అది ఇండియన్ల జీవితమే. మనకి భాషాపరంగా అనేకమంది ఉన్నా, అమెరికన్లకి మాత్రం గుజరాతీయులూ, బెంగాలీలూ, పంజాబీలూ, తెలుగువారూ అందరూ భారతీయులక్రిందే లెక్క. కానీ ఇక్కడ ప్రస్తుతం ఉన్న తెలుగు వారినుండి విరివిగా ఇంగ్లీషులో సాహిత్య సృజన జరిగితే తప్ప తెలుగువారి ఉనికీ, జీవితమూ, దాని వెండి వచ్చే కష్ట సుఖాలూ అమెరికన్లకి అర్థం కావు. ఈ విషయంలో ఝుంపా లహరి, బెంగాలీ రచయితని మెచ్చుకు తీరాలి. బెంగాలీ జీవితాన్ని అమెరికన్లకి బాగానే పరిచయం చేసింది. ఈమె రాసిన “నేమ్ నేక్” ఎంతో ప్రాచుర్యం పొందిన నవల.

వలస వచ్చిన తెలుగు వారు సాహిత్య సృజన చెయ్యకపోవడానికి నాకు కనిపించిన కారణాలు:

1) వస్తూనే మంచి ఉద్యోగాలతో రావడం వలన (90ల తరువాత వచ్చిన వారు) అమెరికన్ జీవన విధానంలో మమేకం అవ్వాల్సిన అవసరం లేకపోవడం.

2) వచ్చిన వారిలో చాలామందికి సాహిత్యం పట్ల ఆసక్తిలేకపోవడం.

3) సాంకేతిక ప్రగతీ, సౌకర్యాల వలన వేరే దేశం వచ్చామన్నా భావన అంతగా పట్టకపోవడం.

4) తెలుగువారి సంఖ్య గణనీయంగా పెరగడం వలన ఇక్కడున్న వారితోనే సంబంధ బాంధవ్యాలు పెట్టుకోవడం. అవసరమయినంత మేరకే అమెరికన్ జీవన స్రవంతిలో కలవడం.

పై కారణాల వలన ఇంతవరకూ వచ్చిన సాహిత్యం, అమెరికన్ జీవిన విధానంలో ఉపరితలంలో కనిపించిన వస్తువుల చుట్టూ తిరిగింది. లోతైన అవగాహన, అధ్యయనం లేకపోవడం వలన ఊహించిన రీతిలో తెలుగు సాహిత్యం పుట్టకపోవడం; అమెరికన్ జీవన స్రవంతిలో కలవకపోయినా గడిచిపోయే వాతావరణమూ, ఇలా పలు కారణాలు కనిపిస్తాయి.  ఇంత వరకూ వచ్చిన సాహిత్యం కూడా ఈ క్రింది అంశాల పరిధి దాటి లోతుగా అధ్యయనం కాలేదు.

1) స్త్రీల సమస్యలు, గృహ హింస

2) నాస్టాల్జియా, నాస్టాల్జియా, నాస్టాల్జియా

3) పిల్లల పెంపకం, పెళ్ళిళ్ళు, వృద్ధాప్యంలో సమస్యలు, ఇండియా నుండి వచ్చే వారి తీరుతెన్నులూ

4) అమెరికా జీవితం పై వ్యంగ్య, హాస్య రచనలు

అడపాదడపా వేరే అంశాలపై కథలు వచ్చినా, సింహభాగం రచనలు పైన చెప్పిన వాటిని మించి పోలేదు. అమెరికన్ సంస్కృతీ, జీవన విధానంతో లోతుగా ముడిపడిన వారి జీవితం గురించీ, వాళ్ళకి మన సంస్కృతీ, జీవితం పట్ల ఉన్న అవగాహనా వంటివి ప్రతిబింబింస్తూ వచ్చిన కథా వస్తువులు కనిపించవు.

రాసేవాళ్ళకీ ఉపరితల పరిశీలనే తప్ప లోతైన అధ్యయనలోపం ప్రధాన సమస్య. ఎంతో కొంత కథలు వచ్చాయి కానీ, అమెరికా జీవితన్ని ప్రతిబింబిస్తూ తెలుగులోనే మనకి నవలలు అంతగా రాలేదు. కనీసం రాబోయే కొత్త తరం అంటే అమెరికాలో ఇప్పుడున్న వారి సంతతి అయినా ఇంగ్లీషులో తెలుగువారి జీవితం గురించి రాసి తెలుగు డయాస్పోరాకి పూర్తి న్యాయం చేకూరుస్తారన్న చిన్న ఆశ. అది ఎంత సఫలం అవుతుందో కాలామే నిర్ణయించాలి.

*

మీ మాటలు

  1. Y RAJYALAKSHMI says:

    బావుంది. మీరు చెప్పిన అంశాలపైన తప్పించి ఇక్కడ కూడా వేరే కథలేమి పెద్దగా రావటం లేదు

మీ మాటలు

*