మైత్రీ మకరందం  “స్నేహఫలము”

visanaa

— శివరామకృష్ణ

~

 

“మానవర్మ రాను క్రొత్తగా నిర్మించిన మహా సౌధమునకు నామకరణము చేసెను. ఆ పేరు కోట ముందు ప్రభాతోరణము మీద, మంచి రంగులతో అర్థ యోజనము దూరము కనిపించునట్లు పెద్ద యక్షరములతో చెక్కించెను.

ఆ మహా సౌధము పేరు “స్నేహ ఫలము”

 

***

 

వెయ్యి పేజీల వేయి పడగలు వచన మహాకావ్యాన్ని రచించిన విశ్వనాథ సత్యనారాయణ గారు కొన్ని చిన్న నవలలను కూడా రాసారు. నలభై పేజీల ‘వీరవల్లడు’, యాభై పేజీల ‘హాహా హూహూ’, తొంభై పుటల ‘స్నేహ ఫలము’ వాటిలో కొన్ని.

 

రాజవంశీయులైన ఇద్దరు పురుషుల మధ్య ఏర్పడిన మైత్రీ బంధం గురించి, దాని పరిణామంగురించీ విశ్వనాథ వారు చారిత్రక సత్యాలకు కొంత కల్పన జోడించి రాసిన రమ్యమైన చిన్న  నవల ‘స్నేహఫలము’. దీని చారిత్రక నేపధ్యాన్ని చూద్దాం. దక్షిణ భారత దేశాన్ని ఏలిన వారిలో ప్రముఖులు పల్లవులు. దాదాపు ఐదు వందల సంవత్సరాలపాటు పల్లవ సామ్రాజ్యం నిరాఘాటంగా వర్ధిల్లిందట. పల్లవ సామ్రాజ్యం తమిళ దేశంలో చాలా ప్రాంతాలను, కృష్ణా నదికి దిగువనున్న తెలుగు ప్రాంతాలనూ, కన్నడ ప్రాంతాల్లో కొంత భాగాన్నీ కలుపుకొని వర్ధిల్లింది. పల్లవ చక్రవర్తుల్లో మామల్ల నరసింహ వర్మ ఒకరు. ఈయన సుమారు  క్రీ. శ. 630-675 మధ్య కాంచీపురం రాజధానిగా పల్లవ రాజ్యాన్ని యేలిన మహా పరాక్రమవంతుడైన రాజు. ఈయన కాలంలో పల్లవులకూ, కాదంబ రాజు లకూ, పశ్చిమ చాళుక్యులకూ మధ్య అనేక యుధ్ధాలు జరిగాయి. పల్లవులకు ప్రధాన శత్రువు పశ్చిమ చాళుక్య రాజు రెండవ పులకేశి. అనేక మార్లు కాంచీపురంపై ఆతడు దండెత్తివచ్చినా, మామల్ల నరసింహ వర్మ పరాక్రమానికీ, ఆయన ప్రధాన సేనాని పరంజ్యోతి ధాటికీ ఆగలేక పలాయనం చిత్తగించాడు. పులకేశిని దక్షిణాపథం వైపు రాకుండా వీరు అడ్డగించారు. అంతే కాదు, చక్రవర్తి అంగరక్షకుడైన  మానవర్మ చక్రవర్తిని పలుమార్లు మృత్యుముఖం నుంచి తప్పించాడు, తనప్రాణాలను లెక్కచెయ్యకుండా. ఈ నేపధ్యంలో నడిచిన కథ ‘స్నేహఫలము’. చక్రవర్తి మామల్ల నరసింహ వర్మకు సింహళ దేశపు రాజపురుషుడు మానవర్మకు యేర్పడిన అపూర్వ స్నేహబంధమే ఈ నవలలో వస్తువు.

***

వసంత ఋతువులోని ఒక మధ్యాహ్నం పల్లవ చక్రవర్తి తన అలవాటు ప్రకారం వాహ్యాళికి బయలుదేరాడు, ఏనుగు మీద. వెంట అంగరక్షకుడు మానవర్మ ఉన్నాడు. దారిలో చక్రవర్తికి దాహం వేసింది. దగ్గరలో కనబడిన కొబ్బరితోట వద్ద ఏనుగుని నిలిపి కొబ్బరి బొండాలు కొట్టించాడు మావటి. రాజు తనకు సరిపడినత నీరు తాగి, తన వెనకనున్న మానవర్మకి బొండాన్ని ఇచ్చాడు, పారవేయమనే ఉద్దేశంతో. కాని, మానవర్మ మిగిలిన నీటిని తనను తాగమనే ఉద్దేశంతో రాజు తనకిచ్చాడని అనుకున్నాడు.

బొండమును పుచ్చుకొని మానవర్మ “ఈ రాజు నాకు మిత్రుడు. నాకాశ్రయమిచ్చినవాడు. మిగిలిన నీరు నేను త్రావవలయునని ఇచ్చెను కాబోలు. తన యెంగిలి నన్ను త్రావమనునా? రాజు ధూర్తుడు కాడు. దురహంకారి కాడు. సాధువైన సత్పురుషుడు. నాయందు మిక్కిలి ప్రేమకలవాడు. గతిలేక తన పంచన చేరిన నన్ను మిత్రునివలె, ఆంతరంగికునివలె పరిపాలించుచున్నాడు. నాయందెంత ప్రేమలేకున్నచో తా నెంగిలి చేసిన నీటిబొండమును నాకందించును? నేను దీనిని పారవేయుట దురహంకారమగును. న్యాయము కూడ కాదు. నేను యెంగిలి నీరమును త్రావినచో నాకు వ్యాధి పుట్టదు. నాకు మర్యాద భంగము లేదు” అనుకొని వెంటనే ఆ నీటిబొండాన్ని తాగుతుండగా రాజు చూశాడు.

“తాను అతణ్ణి తాగమని ఇచ్చాననుకున్నాడు కాబోలు. మానవర్మ గొప్ప వంశము నందు పుట్టినవాడు. అతడొక రాజ్యమునకర్హుడు. దినములు బాగుండక తన్నాశ్రయించినవాడు. అతనికి తనయందింత స్నేహభావమున్నదని ఇదివరకు తనకు తెలియలేదు.  తానిట్లీయగ మరొకడైనచో మనసస్సులో మిక్కిలి కోపము తెచ్చుకొనును. ఇది రాజయోగ్యమైన పనికాదు”  అనుకొని రాజు నరశింహ వర్మ వెంటనే మానవర్మ చేతిలోని బొండాన్ని తీసుకొని మిగిలిన నీటిని తాగేశాడు. మానవర్మ ఆశ్చర్యపోయాడు.

ఈ సంఘటన చూసిన మావటి ఆశ్చర్యపోయి, మానవర్మ మంచితనాన్ని, రాజు ఔదార్యాన్ని మనసులో మెచ్చుకున్నాడు. “మానవర్మ లేకుండా మహారాజు కాలు బయటపెట్టడు. మానవర్మదే అదృష్టము. ఇదివఱకు నేనెప్పుడూ చూడలేదు. మహరాజు కొంత త్రావి మానవర్మకిచ్చెను. అతడు కొంత త్రావి మరల మహారాజున కందిచ్చెను. ఇట్లు సురాపానము చేయువారు చేయుదురు. పరమ మిత్రులు చేయుదురు” అని తన పరిధిలో అనుకున్నాడు.

మానవర్మ కూడా మహారాజు యెంతటి సత్పురుషుడోనని అనుకున్నాడు. సేవకుడైన తన యెంగిలిని మళ్ళీ ఆయన త్రాగాడంటే తనని ప్రాణస్నేహితుడిగా తలచాడు కదా అనుకున్నాడు. “రెండు మూడు సార్లు నేను రాజును రక్షించిన మాట నిజమే. అది సేవకుని ధర్మము. రాజులు మెచ్చినచో ధనమిత్తురు. అధికారమిత్తురు. ప్రాణమీయరు. ఈ రాజు తన ప్రాణములు నాకిచ్చుచున్నాడు. నేనీ రాజును ఆశ్రయించి నా రాజ్యమును నేను సంపాదించుకొనవలయునని యనుకొనుచున్నాను.ఇట్టి ప్రాణస్నేహితుని వదిలిపెట్టి నేనెట్లు పోగలను?”

అప్పుడు మహారాజు కూడా ఇలా అనుకున్నాడు “ఈ నాటితో మానవర్మ నాకు పాణస్నేహితుడైనాడు. ఇతడు నా ప్రాణములను రెండుమూడు సార్లు రక్షించెను. అర్థరాత్రముల యందైన నీడ సూర్యునెడబాసి యుండును. కాని ఇతడు నన్నెడ బాయడు. రాజ్యభ్రష్టుడై నన్నాశ్రయించెను. నేను గొప్ప పదవినిచ్చితిని కాని, యతనిని రాజును చేయలేదు కదా! నేటి నుండి యతడును నేనును నా రాజ్యమున కిద్దరు రాజులము. నా మాట యెట్లు చెల్లునో నేటి నుండి యీతని మాట కూడ యట్లే చెల్లును. ఇతడు నా మీద చూపిన ప్రేమకు వేరొక విధముగా నేను కృతజ్ఞత చూపలేను. చూపకపోయిన నరకమునకు పోయెదను. ఒక ప్రాణదాతకు కృతజ్ఞత చూపుట వేరు, యెడములేకుండ ఇంతటి ప్రేమ చూపిన వానియందు కృతజ్ఞత నెఱపుట వేరు”

ఇలా అనుకొని రాజు మానవర్మని ఏనుగుమీద తన పక్కనే కూర్చోబెట్టుకొని, అతని భుజం మీద చెయ్యివేశాడు. “ప్రొద్దు వాటారిన తరువాత ఇంటికి తిరిగి వచ్చు రాజును, మానవర్మను ప్రజలిట్లు చూచిరి”

నవల మొదట్లోనే విశ్వనాథ వారు ఈ స్నేహబంధానికి బలమైన పునాది వేశారు ఈ సంఘటనతో.

 

***

 

మానవర్మ సింహళదేశ రాజకుమారుడు. యువరాజు. కొన్ని వ్యాపారసంబంధ విషయాలను పరిష్కరించడానికి మలయా దేశానికి వెళ్ళాడు.  అక్కడ ఉండగా మలయా రాజకుమారి సంఘను వివాహమాడాడు. మానవర్మ అక్కడ ఉండగానే సింహళరాజు చనిపోయాడు. మలయా రాకుమారిని పెళ్ళాడి అకార్యం చేశాడని మానవర్మపై దుష్ప్రచారం చేసి, అతని జ్ఞాతి దధోపతిస్సుడు అనే అతను సింహళ సింహాసనాన్ని ఆక్రమించాడు.  ఇది తెలుసుకున్న మానవర్మ ఖిన్నుడై, తన రాజ్యాన్ని తిరిగి సంపాదించుకోవాలంటే బలవంతుడైన పల్లవ చక్రవర్తి అండ అవసరమని భావించి, కాంచీపురం చేరాడు. భార్యను మలయాలో పుట్టింటనే ఉంచాడు. అంతకు కొన్నేళ్ళ క్రితం అతడు కాంచీపురం లో విద్యాభ్యాసం చేసిం ఉన్నందున పరిచయమైన వారున్నారు. వారి సహాయంతో మహాసేనాని పరంజ్యోతి అనుగ్రహం సంపాదించి మహారాజు కొలువులో చేరాడు.  కొద్దిరోజుల్లోనే పల్లవ రాజ్యం మీద రెండవ పులకేశి దండెత్తి వచ్చాడు. మహారాజు, సేనాపతి  వేరొకచోట యుధ్ధంలో ఉండగా, పెద్ద శత్రువుల దండు కంచి కోట ద్వారాన్ని స్వాధీనపరచుకోడానికి వచ్చింది. అప్పటికి పల్లవ యువరాజు మహేంద్రవర్మ చిన్నవాడు. ఆ సమయంలో కోటలోనున్న మానవర్మ తన పటాలంతో కోట తలుపులు తెరిచి, శత్రుసమూహం మీద విరుచుకుపడ్డాడు. శత్రువులను ఊచకోతకోశాడు. కోటను కాపాడాడు. పులకేశి సేనలను ఓడించి రాజు, సేనాని కంచికి తిరిగివచ్చి, మానవర్మ పరాక్రమమాన్ని మెచ్చుకున్నారు. నరసింహవర్మ మానవర్మను తనకి అంగరక్షకుడిగా నియమించుకున్నాడు.

ఆ తరువాతి కాలంలో రాజుకి మానవర్మ కేవలం మహావీరుడే కాదు, సాహిత్యం, శిల్పం, జ్యోతిషం, సంగీతం వంటి కళల్లో కూడా నిష్ణాతుడని తెలిసింది.

ఇలా ఉండగా మానవర్మ చక్రవర్తి జాతకాన్ని సంపాదించి, ఆయనకున్న అనేక యోగాలను పరిశీలించాడు. ఆయనకు ఆపదలు వచ్చే కాలాన్ని పసిగట్టి చక్రవర్తిని అనేక హత్యాప్రయత్నాలనించి రక్షించాడు. ఒకసారి కాపాలికులనించి, మరొకసారి పల్లవ రాజవంశీయుడైన గోవింద వర్మ రాజుపై చేసిన చేతబడి ప్రయోగం నించి రక్షించాడు. ఈ గోవిందవర్మే రహస్యంగా మరోసారి అంత:పుర ఉద్యానం లో రాజును హత్యచేయించ డానికి పన్నిన కుట్రను కూడా మానవర్మ విఫలం చేశాడు. కాని ఎప్పుడూ తన గొప్పని చక్రవర్తి వద్ద చెప్పుకోలేదు. ఈ కారణాల వల్ల రాజుకి అభిమానపాత్రుడయ్యాడు. మరొకసారి సేనాని పరంజ్యోతి తో కలిసి రాజు చాళుక్య రాజధాని బాదామిపైకి దండెత్తుతుంటే అది తగిన సమయంకాదని వారించి, వారిని ఆపదనించి కాపాడాడు.  మొదట పరంజ్యోతి, తనవల్ల రాజు వద్ద చేరిన మానవర్మ రాజునే శాసిస్తున్నాడని విసుగు చెందినా, మానవర్మ ప్రవర్తన చూసి ” అతనికి గర్వము లేదు. అహంకారము లేదు. అతనికవి యుండవలసిన యవసరమునూ లేదు. అతడొక రాజ్యమున కధిపతి. మఱియొక యల్పునకు వచ్చిన యధికారము వలె అతనికి ఈ యుద్యోగము గర్వహేతువు కాదు” అనుకొని మానవర్మ పట్ల స్నేహంతో ఉన్నాడు.   మరొక సందర్భంలో పరంజ్యోతి “ఆతని యందు రాజు యొక్క మైత్రి ఆతని నహంకార కలుషితుని చేయక, పరమ సుకుమారభావుని, ఆర్ద్ర మనస్కుని చేసెను. సత్పురుషులిట్లుందురు కాబోలు” అని అనుకున్నాడు.

యుధ్ధాలు సమసి, శాంతి నెలకొన్న కొన్నాళ్ళకి, చక్రవర్తి మానవర్మతో మలయా దేశంలో ఉన్న అతని భార్యని కాంచీపురానికి తీసుకురమ్మని చెప్పాడు. తాను చక్రవర్తి ఆజ్ఞను తిరస్కరించలేడు కనుక, మానవర్మ సంఘని కాంచీపురం రప్పించాడు. ఆమె వచ్చి, తన సత్ప్రవర్తన చేత చక్రవర్తికి, పట్టపురాణికీ అత్యంత ప్రీతిపాత్రురాలయింది. మహాసేనాని పరంజ్యోతి కూడా ఆమెని తన కుమార్తెగా ఆదరించాడు.  మానవర్మకి తన కోట అంతటి మరో మహాసౌధాన్ని నివాసంగా సమకూర్చాడు చక్రవర్తి.

 

మరికొన్నాళ్ళకి గత పరాజయానికి  ప్రతీకారం తీర్చుకోవాలని చాళుక్య రాజు పులకేశి తన రాజ్యం లోని ఒక మండలానికి అధిపతైన వల్లభుడు అనే మొరటువాడైన మహావీరుడిని కాంచీపురంపైకి పంపాడు. పల్లవరాజు నరసింహవర్మని కడతేర్చడమే వల్లభుడి పని. ఆ సమయంలో సేనాని రాజ్యం లో లేడు. యువరాజుని, మానవర్మని కోట రక్షణకి ఉంచి, చక్రవర్తే బయలుదేరాడు వల్లభుడితో యుధ్ధానికి. కాని రాజుకి రానున్న ఆపదని ఊహించిన మానవర్మ, ఆయనకి తెలియకుండా బయలుదేరి, యుధ్ధంలో రాజు అత్యంత ప్రమాద పరిస్థితిలో ఉన్న సమయంలో వల్లభుడి మీద విరుచుకుపడి అతన్ని పరాజితుడిని చేసి, బంధించి, తన రాజుని రక్షించుకున్నాడు. “మానవర్మ ఇప్పుడు గొప్ప స్థితిలో ఉన్నాడు. భార్యను కూడా తెచ్చుకున్నాడు. ఆమె గర్భవతి. ఐనా, తనయాజ్ఞను ఉల్లంఘించి కూడా కోటను విడిచివచ్చి తనను రక్షించిన విధానము ఆతని నిజమైన స్నేహశీలతకు గుర్తు”  అని చక్రవర్తి ఆనందించాడు.  “మానవర్మ లేకున్న తాను చక్రవర్తి కాడు”

 

చక్రవర్తి నరసింహవర్మ విజయోత్సవ సభ చేసి, వీరసైనికులను సత్కరించాడు. తరువాత ఆయన మానవర్మ పరాక్రమాన్ని కొనియాడి, ప్రజలతో  “నేను జీవితములో అతనికి ఋణపడి యున్నాను. లోకములో కృతజ్ఞత యన్న గుణము సులభ్యము కాదు. రాజులయందది మృగ్యము. రాజు తన సేవకుడు తన కుపకారము చేసినచో అది వాని ధర్మమనుకొనును. అట్లు చేయుట వాని విధి యనుకొనును.  ఇట్టి  దుష్టలక్షణము రాజులయందుండును. కృతఘ్నుడు నరకమునకు పోవును. మీరు నా ప్రజలు….నా కృతజ్ఞత మానవర్మకు చూపించవలెనన్న నేనేమి సేయవలయునో మీరే చెప్పుడు” అన్నాడు. అప్పుడు సేనాని పరంజ్యోతి “మానవర్మ రాజ్యము మానవర్మకిప్పించుట యొక్కటియే మహారాజు కృతఘ్నలోకములకు పోకుండ చేసెడిది. ఆ సైన్యములను నేను నడిపించుకొని పోయెదను” అన్నాడు.

మానవర్మ మహారాజుకి నమస్కరించి, ” పరంజ్యోతి దయామయులు. ఆయన నా భార్యకు పెంపుడు తండ్రి వంటివారు. అందుచేత నా మీద అంత దయ చూపించుచున్నారు. మహారాజు యొక్క అనుజ్ఞ యైనచో నేను నా దండు నడుపుకొనగలను. నేనే దండయాత్ర పోవలయును. నేనే నా రాజ్యమును సంపాదించుకొనవలయును.” అన్నాడు.

 

అనంతరం మానవర్మ సింహళం పైకి దండెత్తి వెళ్ళాడు. మొదటి సారి ఆ దేశాన్ని వశపచుకోవడంలో ఇబ్బందులు ఎదురైనా, మరొకసారి ప్రయత్నించి, దధోపతిస్సుని ఓడించి, తన రాజ్యాన్ని తాను సాధించుకున్నాడు. మానవర్మ తన దేశం లో వ్యవసాయాన్ని వృధ్ధి చేశాడు. భారత దేశంతోనూ, మలయా తదితర ద్వీపాలతోనూ సత్సంబంధాలు ఏర్పరచుకున్నాడు. సర్వమతాలనూ అభిమానిం చాడు. ప్రజలు అధికులు బౌధ్ధులు కనుక ఆ మతాన్ని ప్రోత్సహించాడు.

సింహళ రాజభవనం అంతకుముందు సామాన్యంగా ఉండేది. దాని బదులు కంచిలోని  వైకుంఠపెరుమాళ్ళు కోవెల వంటి రాజభవనాన్ని నిర్మించాడు. దాని పేరే “స్నేహఫలము.”

 

***

 

ఈ నవలలో కథాసంధర్భంలో విశ్వనాథవారు పలుచోట్ల హృదయానికి హత్తుకునే మాటలు రాశారు.

“మధురమైన సంగీతము వినుచు, శాస్త్రములు, కవిత్వములు నిత్యాభ్యాసము చేయుచు, హృదయమునందు పరమ సుకుమారుడైన మనుష్యునకు ఇట్టి ధ్వనులు (మనకు తెలియకుండా చెవుల్లో పడే పక్షి కూజితాలు మొదలైనవి) వినిపించును. ఆలోచన లేని వాని కేవియు వినిపించవు.”

“అందరును మనుజులే కాని వారిలో కొందరు రాక్షసులు. కొందరు దేవతలు.  రాక్షసాంశ కలవారును మానవులవలెనే కనిపింతురు.”

ఇంకా ప్రాస్తావికంగా బౌధ్ధ మతం గురించి, కాపాలిక మతం గురించీ కూడా వివరించారు. పల్లవుల నాటి దాక్షిణాట్య సంగీతానికీ, మలయా దేశపు సంగీతానికీ భేదాలను వివరించారు తన సంగీత శాస్త్ర పరిజ్ఞానంతో. ఈ వ్యాసంలో ఎక్కువగా తెలపని గోవిందవర్మ రాజవంశంవాడైనా, సకల భ్రష్టుడై దొమ్మరి వాళ్ళతోనూ, కాపాలికులతోనూ తిరిగి, ఆ రోజుల్లో ప్రాచుర్యంలో ఉన్న ప్రయోగ విద్య (చేతబడి) నేర్చుకున్న వైనం, గొడగూచి అనే ఒక నాట్యకత్తె రాజు ముందు నాట్యం చేసే సమయం లో ఆయనపై ప్రయోగం చెయ్యడానికి కుట్రపన్నడం, దాన్ని మానవర్మ భగ్నం చెయ్యడం చాలా ఆసక్తికరంగా చెప్పారు విశ్వనాథ.   ఆ సమయంలో రాజు “నాకు  రాబోవు సకలాపదలను నీవు ముందు చూతువు. వానికి ప్రతిక్రియలాలోచింతువు. నీవు దీనినెట్లు పసిగట్టితివి?” అని అడుగుతాడు ఆశ్చర్యపడుతూ.

 

ఒకరు ఒక మహా సమ్రాజ్యానికి చక్రవర్తి. మరొకరు ఒక రాజ్యానికి వారసుడైనా విధి వశాన ఆ చక్రవర్తి కొలువున చేరిన వ్యక్తి. వీరిద్దరి మధ్య నెలకొన్న మైత్రి ఎంతో గొప్పగా వర్ణించారు విశ్వనాథ. చక్రవర్తి దయకు మానవర్మ ప్రతివచనం చాలు వీరిద్దరి ఆత్మీయతను, హృదయాలనూ ఆవిష్కరించడానికి:

 

“మహామల్లుడా, నేనిది వరకు తమ సద్గుణములకు, తమరికి నా యందుగల కృపకు మనస్సులో బానిసనై యున్నాను. మరియు అధికమైన దయ చూపించినచో మనుష్యుడైనవాడు బానిస యగుటకంటె తక్కువ స్థితి యేమి పొందగలడు? నా యందు తమరికి ఎంత ప్రేమయున్నను నన్ను తమ యంగరక్షకునిగా నుంచుకొనుటయే నాకు చేసెడి మహోపకారము. తమ యేనుగు మీద నన్ను తమ ప్రక్కన గూర్చుండ బెట్టుకొనుటకంటె అధికమైన గౌరవ మేమి చేయవలయును?”

 

ఏకబిగిని చదివించే మంచి నవల ‘స్నేహఫలము’

 

*

 

మీ మాటలు

 1. Mythili Abbaraju says:

  అమితమైన మార్దవం ఈ నవలలో. అంత మృదువుగానూ ఉంది మీ దర్పణం. ధన్యవాదాలు, అభినందనలు.
  వాస్తవ జీవితం లో విశ్వనాథ కు మిత్రుల పైన గుండె కోసి ఇచ్చేంత ప్రేమ… అదే వచ్చింది కథ లోకి.

 2. డా.సుమన్ లత రుద్రావఝల says:

  విశ్వనాథవారి స్నేహఫలం నవలను ఎంతో చక్కగా పరిచయం చేశారు .అందరికీ అంత మంచి మిత్రులు దొరకితే ఎంతో అదృష్టం .నవలలో భావాన్ని పూర్తిగా మీరు మాకు ఇవ్వటంలో సఫలమయ్యారు పుస్తకాన్ని .తెచ్చుకు చదవాలి అన్న తొందర కలుగుతోంది.మీరు ఇలా మరెన్నో మంచి పుస్తక పరిచయాలు ఇవ్వాలని నా కోరిక . ————డా.సుమన్ లత .

 3. ధన్యవాదాలు డా. సుమన్ లత గారు, డా. మైథిలి గారు.

 4. Venkat Suresh says:

  చాలా బాగుందండి పరిచయం. వెంటనే చదువుతాను. __/\__

మీ మాటలు

*