మిస్టర్ గోస్వామి! ద నేషన్ లాఫ్స్ ఎట్ యు!!

 

 

 

రమణ యడవల్లి 

———————-

“ప్రధాన మంత్రిని అర్నబ్ గోస్వామి చేసిన ఇంటర్‌వ్యూ చూశావా?” అడిగాడు నా స్నేహితుడు.

“చూళ్ళేదు.” అన్నాను.

“అదృష్టవంతుడివి. నాకా ఇంటర్‌వ్యూ ఉప్మా లేని పెసరట్టులా చప్పగా అనిపించింది. అర్నబ్ గోస్వామికి బుద్ధిమంతుడి వేషం నప్పలేదు. థాంక్స్ టు మోడీ, అర్నబ్ నోర్మూసుకుంటే యెలా వుంటాడో మొదటిసారి చూశాను.” అంటూ నవ్వాడు నా స్నేహితుడు.

గత కొన్నేళ్లుగా టీవీ మీడియంలో అర్నబ్ గోస్వామి పేరు మోగిపోతుంది. మోడెస్టీ కోసం తానో జర్నలిస్టునని చెప్పుకుంటాడు కానీ, అర్నబ్ జర్నలిస్టు స్థాయి ఎప్పుడో దాటిపొయ్యాడు! అతను ఒక షోమేన్, ఒక పెర్ఫామర్! సినిమా నటులు పాత్రోచితంగా అనేక రసాలు పండిస్తారు. అర్నబ్ ‘చర్చో’చితంగా కోపావేశాల్ని పండిస్తాడు. సినిమావాళ్ళది బాక్సాఫీస్ దృష్టైతే, అర్నబ్‌ది టీఆర్పీ దృష్టి!

అర్నబ్ గోస్వామి పాపులారిటీకి కారణం యేమిటి? యే దేశంలోనైనా సుఖమయ జీవనం సాగిస్తూ కులాసాగా ఆలోచించే వర్గం ఒకటి వుంటుంది. వీళ్లు రాజకీయంగా కలర్ బ్లైండెడ్‌. అంటే – ప్రతి సమస్యనీ బ్లాక్ వైట్‌లోనే ఆలోచిస్తారు, అధికారిక (ప్రభుత్వ) వెర్షన్‌ని సమర్ధించేందుకు రెడీగా వుంటారు, ప్రభుత్వ అభివృద్ధి నమూనాల పట్ల విశ్వాసం కలిగుంటారు (తమకీ ఓ రవ్వంత వాటా దొరక్కపోదా అన్న ఆశ కూడా వుంటుందనుకోండి). వీరిలో ఎక్కువమంది వేతనశర్మలు (చూడుము – రావిశాస్త్రి ‘వేతనశర్మ కథ’).

ఈ అర్నబ్ గోస్వామి వీక్షక వర్గం సోషల్ మీడియాని ప్రతిభావంతంగా వాడుతుంది. ఆపరేషన్ గ్రీన్ హంట్ గూర్చి కేంద్ర హోమ్ శాఖ చెప్పింది కరెక్ట్. వ్యతిరేకించావా? – నువ్వు ‘మావోయిస్టు టెర్రరిస్టువి’.  కల్బుర్గి హంతకుల కోసం ప్రభుత్వం ఇంకా వెదుకుతూనే వుంది. ప్రశ్నించావా? – నువ్వు ‘సూడో సెక్యులరిస్టువి’. రోహిత్ వేముల ఆత్మహత్య కేంద్రాన్ని కలచివేసింది! సందేహించావా? – నువ్వు ‘దేశద్రోహివి’.

ఈ వర్గంవారి అభిప్రాయాల పట్ల ఎవరూ ఆశ్చర్యపడనక్కర్లేదు. ఆసక్తికర అంశం యేమంటే – ‘రాజకీయాలు చెత్త, అవి మాట్లాడ్డం టైమ్ వేస్ట్’ అన్న లైన్ తీసుకున్న ‘న్యూట్రల్’ వ్యక్తులు కొన్నాళ్లుగా ఘాటైన రాజకీయ అభిప్రాయాలు వెలిబుచ్చడం! అవి అచ్చు అర్నబ్ గోస్వామి అభిప్రాయాలే! ప్రతి అంశాన్నీ సింప్లిఫై చేసి బ్లాక్ ఎండ్ వైట్‌లో ప్రెజెంట్ చేసే అర్నబ్ గోస్వామి స్టైల్ వీళ్ళకి బాగా నచ్చింది.

మర్నాడు న్యూస్‌పేపర్లలో పదోపేజీలో కూడా రిపోర్ట్ కాని అంశాన్ని కొంపలు మునిగిపొయ్యే సమస్యలా చిత్రించ గలగడం అర్నబ్ గోస్వామి ప్రతిభ. అతని డిబేట్లు WWE కుస్తీ పోటీల్లా స్క్రిప్టెడ్ కేకలు, అరుపుల్తో గందరగోళంగా వుంటాయి. చూసేవాళ్ళకి ‘ఈ వీధిపోరాటంలో ఎవరు గెలుస్తారు’ లాంటి ఆసక్తి కలుగుతుంది. ఇట్లాంటి చౌకబారు ఆసక్తిని రేకెత్తించి వ్యూయర్‌షిప్ పెంచుకోవటమే టైమ్స్ నౌ చానెల్ వారి ఎజెండా. ప్రతిభావంతులైన నటుల్ని అభినందించినట్లుగానే అర్నబ్ గోస్వామిని కూడా అభినందిద్దాం.

టీవీల్లో వార్తల్ని విశ్లేషించే చర్చా కార్యక్రమాలకి కొంత ప్రాముఖ్యత వుంటుంది. వీక్షకులకి ఎదుటివారి వాదన యేమిటనేది తెలుసుకోడానికీ, తమకంటూ ఒక అభిప్రాయం ఏర్పరుచుకోడానికి ఈ చర్చలు ఉపయోగకరంగా వుంటాయి. కానీ – అర్నబ్ గోస్వామి స్టూడియోలో కూర్చుని ప్రతి సబ్జక్టు పైనా ముందుగానే ఒక ఖచ్చితమైన అభిప్రాయం యేర్పరచుకుని వుంటాడు. ఆ అభిప్రాయంలో తీవ్రమైన దేశభక్తీ, భీభత్సమైన ధర్మాగ్రహం వుంటాయి. ఈ కారణాన – తన అభిప్రాయాన్ని వొప్పుకోనివారికి తిట్లు తినే సదుపాయం తప్ప, మాట్లాడే హక్కుండదు. ఈ సంగతి తెలుసుకోకుండా అర్నబ్ షోలో పాల్గొన్న JNU విద్యార్ధులకి యేమైందో మనకి తెలుసు.

“టీఆర్పీ రేటింగ్ కోసం చర్చా కార్యక్రమాన్ని వినోద స్థాయికి దించడం దుర్మార్గం.” ఒక సందర్భంలో నా స్నేహితుడితో అన్నాను.

“నీకు మర్యాదస్తుల న్యూస్ డిబేట్ కావాలంటే బిబిసి చూసుకో! మజా కావాలంటే అర్నబ్‌ని చూడు. అది సరేగానీ, అర్నబ్ డిబేట్లలో స్క్రీన్ మీద మంటలు మండుతుంటాయి. ఎందుకో తెలుసా?” అడిగాడు నా స్నేహితుడు.

“తెలీదు.” ఒప్పేసుకున్నాను.

“అరుంధతి రాయ్, తీస్తా సెటిల్వాడ్ లాంటి దేశద్రోహుల్ని అందులో పడేసి రోస్ట్ చేసెయ్యడానికి.” కసిగా అన్నాడతను.

ఈ విధంగా ప్రజలు ప్రశాంతంగా టీవీ చూసేస్తూ చాలా విషయాల పట్ల చక్కటి అవగాహన యేర్పరచుకుంటున్నారు! ‘ముఖ్యమైన’ సమాచారం ప్రజలకి చేరే విషయంలో ప్రభుత్వాలు అప్రమత్తంగా వుంటాయి. తమకి ఇబ్బందిగా ఉండే విషయాల్లో (రాజకీయాలకి బయటనున్న ప్రజల) ఒపీనియన్ మేకింగ్ అన్నది అధికారంలో వున్నవాళ్ళకి చాలా అవసరం. ఈ వ్యవహారం సాఫీగా సాగడానికి అనేకమంది స్టేక్‌హోల్డర్స్‌ పాటుపడుతుంటారు (చూడుము – Noam Chomsky ‘Media Control’).

ఇంతటితో నేను చెబ్దామనుకున్న విషయం అయిపోయింది. అయితే – చెప్పుల షాపులో పన్జేసే వ్యక్తి దృష్టి తనకి తెలీకుండానే ఎదుటివారి చెప్పుల వైపు పోతుంది. దీన్ని occupational weakness అనుకోవచ్చు. వృత్తిరీత్యా నేను సైకియాట్రిస్టుని కాబట్టి చాలా అంశాల్లో సైకలాజికల్ యాస్పెక్ట్స్ కూడా ఆలోచిస్తాను. అంచేత కొద్దిసేపు – సైకాలజీ బిహైండ్ అర్నబ్ గోస్వామి సక్సెస్.

ఒక వ్యక్తి ‘చర్చా కార్యక్రమం’ అంటూ గెస్టుల్ని పిలిచి మరీ చెడామడా తిట్టేస్తుంటే, చూసేవారికి ఎందుకంత ఆనందం? సైకాలజీలో Frustration-Aggression అని ఒక థియరీ వుంది. సగటు మనిషికి దైనందిన జీవితంలో నిరాశ, నిస్పృహ, అసంతృప్తి, చిరాకు.. ఇవన్నీ frustration కలిగిస్తాయి. ఈ frustration ఒక స్టీమ్ ఇంజన్ లాంటిదని సిగ్మండ్ ఫ్రాయిడ్ అంటాడు. ఇంజన్ స్టీమ్ వదలాలి, లేకపోతే పేలిపోతుంది. అంచేత frustration అనేది తప్పనిసరిగా aggression కి దారితీస్తుంది. సగటు మనిషిలో వున్న ఈ aggression కి అర్నబ్ గోస్వామి కార్యక్రమం ఒక విండోగా ఉపయోగపడుతుంది. అందుకే చూసేవారిలో అంత ఆనందం!

అన్ని వృత్తుల్లాగే – జర్నలిస్టులకీ వృత్తి ధర్మం వుంటుంది. వాళ్ళు అధికారంలో వున్నవాళ్ళని ప్రజల తరఫున ప్రశ్నలడిగి, సమాధానాలు రాబట్టాలి. మరప్పుడు అర్నబ్ గోస్వామి – “మిస్టర్ ప్రైమ్ మినిస్టర్! విదేశాల నుండి నల్లడబ్బు తెచ్చే విషయం ఎందాకా వచ్చింది? NSG కి చైనా అడ్డుపడకుండా ఎందుకు ఆపలేకపొయ్యారు? అదానీ వ్యాపారానికి అన్నేసి రాయితీలు ఎందుకిస్తున్నారు?” అని అడగాలి. అతనికి ప్రధాన మంత్రి ఆఫీసు నుండి ఫలానా ప్రశ్నల్ని అడక్కూడదనే ఆదేశాలు వొచ్చి వుండొచ్చు. అయితే చండప్రచండులైన గోస్వాములువారు ప్రధాన మంత్రి ఆఫీసు ఆదేశబద్దులై వుంటారా? వుండకూడదు కదా! స్టూడియోలో కూర్చుని కేకలేస్తూ గెస్టుల్ని తిట్టేసే అర్నబ్ గోస్వామి, ప్రధానమంత్రి దగ్గర వినయపూర్వకంగా ఎందుకు వొదిగిపొయ్యాడు?

సోషల్ సైకాలజీలో Obedience to Authority అని ఒక థియరీ వుంది. ఇది ‘పైనుండి’ వచ్చే అదేశాల్ని తుచ తప్పకుండా పాటించేవారి మనస్తత్వాన్ని చర్చిస్తుంది. లక్షలమంది యూదుల్ని హిట్లర్ వొక్కడే చంపలేదు, చంపలేడు. అతనికి తన ఆదేశాల్ని గుడ్డిగా అమలు చేసిన నాజీ అధికారులు తోడయ్యారు. మన సివిల్ పోలీసులు పై ఆధికారుల ఆదేశాలని పాటిస్తూ నిరసన చేస్తున్న వికలాంగులు, వృద్ధులు, స్త్రీలని చావ చితక్కొడతారు. ఈ పోలీసులే పోలీసు అధికారుల ఇళ్లల్లో ఆర్దర్లీలుగా మగ్గిపోతుంటారు (చూడుము – పతంజలి ‘ఖాకీవనం’, స్పార్టకస్ ‘ఖాకీబ్రతుకులు’).

అర్నబ్ గోస్వామి టీఆర్పీ కోసం aggression చూపిస్తాడు, తన కెరీర్ కోసం Obedience to Authority కూడా చూపిస్తాడు. స్టూడియోలో కూర్చుని చిన్నాచితకా నాయకుల్ని మందలిస్తూ, దేశభక్తిపై లెక్చర్లిచ్చే అర్నబ్ గోస్వామి బ్రతక నేర్చినవాడు. అందుకే ఎక్కడ ఎలా వుండాలో అర్ధం చేసుకుని సెలబ్రిటీ జర్నలిస్టయ్యాడు. ఇతగాడి విజయ యాత్ర యెందాకా సాగుతుందో తెలీదు గానీ, అది ఎంత తొందరగా ముగిసిపోతే దేశానికీ, ప్రజలకీ అంత మంచిదని నమ్ముతూ –

“మిస్టర్ గోస్వామి! ఐ హేవ్ ద ఇన్‌ఫర్మేషన్ విత్ మి! ద నేషన్ లాఫ్స్ ఎట్ యు!!”

*

మీ మాటలు

 1. అర్నబ్ గోస్వామికి గొప్ప నీరాజనం :)

 2. వృద్ధుల కళ్యాణరామారావు says:

  అద్భుతం, అత్యద్భుతం–నాక ఇంతకన్న భాష రాదు.

 3. దేవరకొండ says:

  ఇలాంటి వ్యాసాల అవసరం దేశ క్షేమం దృష్ట్యా దేశ ప్రజలకు ఎంతో అవసరం. ఇల్లాంటివి అన్ని భాషల్లోనూ రావాలని మనసారా కోరుకునే అనేకమందిలో నేనొకణ్ణి. ఆ మధ్య ఒక జోకు వాట్సాప్లో బాగా తిరిగింది. అది ఇంగ్లీష్ లో ఉండటం వల్ల తెలుగు మాత్రమే చదివే పాఠకులకు దాన్ని తెనిగించి వాట్సాప్లో పంపించా. అది ఇది: (ఇది కేవలం నవ్వుకోవడానికి అనుకోవద్దు సుమా..ఇప్పుడు రమణ గారు అన్నట్లు జాతి ఇలాంటి వాళ్ళను చూసి ఎలా విసిగిపోయి నవ్వులో తన కోపాన్ని దాచుకుంటోందో ఊహించుకోవాలి)
  టీవీ ఛాన(నాయా)ళ్లు
  అర్నాబ్ గోస్వామి ఒక రైతును ఇంటర్వ్యూ చేస్తున్నాడు.
  అ.గో: మీ మేకలకు ఏం తినిపిస్తారు?
  రైతు: తెల్లమేకా? నల్లమేకా?
  అ.గో: తెల్లమేక.
  రైతు: గడ్డి.
  అ.గో: మరి నల్లమేకకు?
  రైతు: దానికీ గడ్డే!
  అ.గో: మీ మేకల్ని ఎక్కడ కట్టేస్తారు?
  రైతు: తెల్లమేకా? నల్లమేకా?
  అ.గో: తెల్లమేక.
  రైతు: షెడ్లో.
  అ.గో: మరి నల్లమేకని?
  రైతు: దాన్నీ షెడ్లోనే!
  అ.గో: మీ మేకల్ని ఎలా కడుగుతారు?
  రైతు: తెల్లమేకా? నల్లమేకా?
  అ.గో: తెల్లమేక.
  రైతు: నీళ్లతో!
  అ.గో: మరి నల్లమేకని?
  రైతు: దాన్నీ నీళ్లతోనే!
  అర్నాబ్ గోస్వామికి ఒళ్లు మండిపోయింది. అరిచాడు: “పిచ్చ నాయాల! రెండు మేకలకీ ఒకటే చేసేటప్పుడు మళ్లీ తెల్లదా నల్లదా అని మాటిమాటికీ అడుగుతావేంట్రా?”
  రైతు: అంటే…తెల్లమేక నాది కాబట్టి!
  అ.గో: మరి నల్లమేక?
  రైతు: అదీ నాదే!
  గోస్వామి మూర్ఛ పోయాడు!
  కాస్సేపటికి అతనికి తెలివొచ్చాకా రైతు వివరించాడు:
  “కొడకల్లారా, ఇప్పుడు తెలిసిందా? టీవీ చానళ్ళలో అదే వార్తను తిప్పి తిప్పి అడిగిందే అడిగి చెప్పిందే చెప్పి చూపిందే చూపి రోజంతా మీరు ప్రజల్ని ఇలా ఏడిపిస్తుంటే మాకెలా వుంటుందో?”

 4. mohan.ravipati says:

  పెర్ఫెక్ట్ డిస్క్రిప్షన్ అబోట్ ఆర్ణాబ్

 5. THIRUPALU says:

  దబాయింపు సెక్షెన్ లో అర్ణబ్ గోస్వామి నెంబర్ ఒన్ అని విడమరిచి చెప్పటం చాలా బాగుంది.

 6. Naveenkumar says:

  హోప్ హి గేట్స్ టు రీడ్ దిస్ ..

 7. రాజమోహన్ says:

  చాలా బాగా రాశారు. జ్యూస్ just wonderful .

 8. డా.సుమన్ లత రుద్రావఝల says:

  రమణ గారూ మీ మనో విశ్లేషణ ఆధారం గా సాగిన వ్యాసం అద్భుతం .ఇంగ్లీష్ లో కి వెళ్తే తప్ప సదరు ఆ( గో )సామీ కి చేరదే !చామస్కీ ,రావిశాస్త్రి .ఖాకీ వనం వంటి సందర్భ సహిత వ్యాఖ్యలతో గొప్ప ప్రెసెంటేషన్. simply wonderful .farmer జోక్ నేను చదివేను .ఇది స్టేజ్ మీద చెప్తే కరతాళధ్వనులకు లోటు ఉండదు. —————-డా.సుమన్ లత రుద్రా వ ఝల .

  • Ramana Yadavalli says:

   తనగూర్చి తెలుగులో కూడా వ్యాసాలు రాస్తున్నారని తెలిస్తే గోస్వామి చాలా సంతోషిస్తాడు. Any publicity is good publicity. :)

 9. B.Narsan says:

  Mr.Goswamy..we are laughing at you..thanks ramana garu for making us to laugh at him agressively.

 10. A.Syamasundar Rao says:

  అర్నబ్ గోస్వామి T.V చర్చల్లో అరుపులు కేకలతో కొత్త ఒరవడి (కొద్దిమందికి ఇష్టము లేకపోయినా)సృష్టించాడు అదే చాలా బాగుంది అనుకుంటూ ఆ షో టైముకు జనాలు ఎగబడిచూసి “అబ్బా ఏమి బ్రహ్మాండముగా అర్గ్యూ చేశాడు” అని ఆనందపడిపోతున్నారు షోలకు పాపులారిటి వస్తే అంతకన్నా కావలసినది ఏముంది ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు పాయింట్ బేస్డ్ గా ఉండాలి గాని షో ఆర్గనైజ్ చేసేవాడు అరుపులు కేకలతో కాదు మీ ఆర్టీకల్ బాగుంది బాగా విశ్లేషించారు

 11. D.Saraswathi. says:

  In my opinion Arnav Goswami seems like an immature spoilt. brat while conducting his fish market like debates.

 12. కె.కె. రామయ్య says:

  టీఆర్పీ (Television Rating Points) కోసం టీవీ ‘చర్చా కార్యక్రమం’ లో గెస్టులపై aggression చూపిస్తూ, కెరీర్ కోసం Obedience to Authority కూడా చూపిస్తున్న మిస్టర్ గోస్వామి! ద నేషన్ లాఫ్స్ ఎట్ యు!!

  “మర్యాదస్తుల న్యూస్ డిబేట్ కావాలంటే బిబిసి చూసుకో! మజా కావాలంటే అర్నబ్‌ని చూడు”

  అద్భుతమైన విశ్లేషణ చేసిన రమణ యడవల్లి గారికి, “అర్నాబ్ గోస్వామి ఒక రైతుతో ఇంటర్వ్యూ” ను తెనిగించి ఇఛ్చిన దేవరకొండ గారికి నెనర్లు.

 13. Ramana Yadavalli says:

  వ్యాఖ్యలు చదివాక ఇంకొన్ని పాయింట్లు –

  1.అర్నబ్ గోస్వామి తెలివైనవాడు. తన ప్రోగ్రాం గూర్చి మనందరికన్నా అతనికే బాగా తెలుసు.

  2.Arnab Goswami’s topics /guests /aggression.. everything is carefully strategized and designed. His antics appear spontaneous but they are carefully planned.

  3.మీడియా వ్యాపారంలో లాభనష్టాల లెక్కలు ‘వేరే’ వుంటాయి. అందుకే Noam Chomsky ప్రస్తావన చేశాను.

  3.గోస్వామిని educate చెయ్యడం కోసం ఎవరూ ఏవీఁ రాయనక్కర్లేదు. అయితే – అతని అభిమానులు ఈ వ్యాసాన్ని చదివి కొద్దిగా ఆలోచిస్తే సంతోషిస్తాను.

  4.వ్యాసం బాగుందని మెచ్చుకున్నవారికి హృదయపూర్వక ధన్యవాదాలు.

 14. భాస్కరం కల్లూరి says:

  చాలా బాగుంది. అయితే ఒక సందేహం. అర్నబ్ గోస్వామిని చూసి దేశం నవ్వుతోందా, లేక అభినందిస్తోందా? దేశంలో సగమైనా తనను అభినందిస్తుందన్న భరోసాతోనే ఆయన ఈ అవతారం ఏత్తాడేమొ! నేనైతే గోస్వామిని చూసి జాలిపడతాను. ఆయనకు రేపు మహా అయితే పద్మశ్రీయో, పద్మభూషణో (బర్ఖా దత్ కు పద్మశ్రీ వచ్చినట్టు ఉంది); వెనక కులదీప్ నయ్యర్ వగైరాలకు లభించినట్టు రాజ్యసభ పదవో, తాజాగా ఎం.జె. అక్బర్ కు దొరికినట్టు రాజ్యసభ+సహాయమంత్రి పదవో దొరకచ్చు. కానీ ఒక జర్నలిస్టుగా ఆయన కీర్తిశేషుడవుతాడు. నా దృష్టిలో అది చిన్న ప్రతిఫలానికి పెద్ద వేల చెల్లించుకోవడం!

  • Ramana Yadavalli says:

   థాంక్యూ, మీకీ వ్యాసం నచ్చినందుకు సంతోషంగా వుంది.

   broadcasting business లో వున్నవాళ్ళని జర్నలిస్టులుగా భావించరాదని నా అనుమానం.

 15. భాస్కరం కల్లూరి says:

  పై వ్యాఖ్యలో చిన్న పొరపాటు: జర్నలిస్టుగా ఎప్పుడో కీర్తిశేషుడు అవడం కాదు, ఇప్పటికే అయ్యాడు.

 16. మా కేబుల్ ఆపరేటర్ ఎందుకో నిన్నటినించి టైమ్స్ నౌ ఛానెల్ తీసేసాడు. బహుశా సారంగలోని ఈ వ్యాసాన్ని చదివి ఉంటాడు. అమ్మయ్య, Go స్వామీ Go అనుకొని ఆనందించాను.
  అయితే, అర్ణబ్ గోస్వామి అరుంధతి రాయి, తీస్తా సెతల్వాద్, జె ఎన్ యూ విద్యార్థుల ముఠా,సెన్సార్ చైర్మన్ ఫహలాజ్ నిహ్లానీ వంటివారిని, ఉగ్రవాదులను వెనకేసుకొచ్చే ఒవైసీనీ, పప్పుసుద్ద రాహుల్ గాంధీజీని చీల్చి చెండాడిన విధానం మట్టుకు బలే కిక్కు ఇచ్చింది.
  అసలు వార్తలే కానీ విషయాలమీద ఊదరగొట్టే విధానాన్ని అతను మానుకొని, చర్చలో పాల్గొనే వారిమీద అధికారం చెలాయించడం మానుకోవాలి. Otherwise, the nation continues to laugh at him.

 17. ప్రభాకర్ రావు says:

  రమణ గారికి ప్రత్యేక దన్యవాదాలు అర్నాబ లాంటి వారు ఒక్క times now లోనే కాదు తెలుగులో ఉన్నారు తెలుగు చానల్లలో యాన్కర్ల అదే డిబేట్ నిర్వాహకులదే లొల్లి చర్చ లో ఏదో చెప్పాలని వచ్చిన వారిని అదీ ఆ ఛానల్ పాలసీ కి అనుకూలం గా చేప్పిన్చే ప్రయత్నం లో అరిచారు సాయి,శ్రీనివాస్ లాంటి మహానుభావులేన్దరో అందరికీ ఈ అర్ద్నాద్ ఆదర్శ పురుషుడే అయినా ప్రభుత్వ ప్రాపకానికై వేమ్పర్లాదే దౌర్భాగ్యం ఉన్నవారు అంతటా ఉంటారు
  ఇలాంటి వార్నీ తప్పకుండా ఇలాగే ఉతికి ఎండ బెట్టి మళ్ళీ మళ్ళీ ఉతకాలే

 18. ప్రభాకర్ రావు says:

  చైతన్యం లేని చదువులు మనకు తాత్కాలిక ఆనందాన్ని ఇవ్వడానికి ఇలాంటి వారిని ప్రోత్సహించే వారు ఉంటారు
  ఈనాటి యువతకు noam chomsky మన తెలుగు వాడైన నిన్నటి రచయిత జర్నలిస్ట్ పతంజలి గురించి ఎంతమందికి తెలుసు.

 19. prj pantulu says:

  అద్భుతమైన వ్యాసం .అతని చేత అలా అనిపించుకోడానికీ అప్పుడప్పుడు తిట్టించు కోడానికీ పెద్దలు ఆ షో కి వెళ్ళడం గురించి గూడ కాస్త చెప్పండి .అతని షో ని ఎందుకు బాయ్ కాట్ చెయ్యరు.?

  • Ramana Yadavalli says:

   పెద్దలు ఆ షోకి వెళ్ళడం, చూడ్డం ఎప్పుడో మానేశారండి.

 20. pspanuganti says:

  I feel happy for Arnab because he is increasing your knowledge to write more critical about his new hour reports.I have been watching his news hour since one year wherein he covered multi dimensional topics.I feel personally it’s the channel which has attained the uniqueness in projecting all political and societal weaknesses prevailing now.It’s not that his discussion has not taken a priority even in the tenth page.Well I read them most of the time.You increase your consultation times for patients as if others won’t do.You may critic the other practitioners.Their approach is different so as yours.That’s why it’s always better to be silent than stupid critic on subjects which are not in our hand to change.Show mercy Sir!

  • Ramana Yadavalli says:

   I know many people who just love Arnab’s style of presentation. In fact, this is the reason why i chose to write about Arnab. One may like him or hate him, it is purely an individual’s choice. I have no problems at all.:)

   Sorry, i don’t understand the analogy of medical practice with the current topic.

 21. katyayani kethavarapu says:

  చాలా మంచి వ్యాసం . ఏకబిగిన చదివి ఆనందించాను. ఎంత విమర్శనాత్మకం గా ఉంది . !?కృతఙఞతలు.

 22. కె.కె. రామయ్య says:

  ఒకప్పుడు భారతీయ పత్రికా రంగంలో పరిశోధనాత్మక జర్నలిజానికి దారులు తీసిన తరంలో ముఖ్యునిగా గౌరవం అందుకున్న ఎం.జె. అక్బర్, బి.జె.పి. పార్టీలో చేరి మోడీ ప్రభుత్వంలో మంత్రి పదవి చేపట్టడం కూడా చిన్న ప్రతిఫలానికి పెద్ద వెల చెల్లించుకోవడం లాంటిదేనేమో కదండి ప్రియమైన కల్లూరి భాస్కరం గారు.

  ( సన్డే, డి టెలిగ్రాఫ్, ఇండియా టుడే, సండే గార్డియన్ వంటి పత్రికలకు సంపాదకత్వం వహించటమే కాక India: The Siege Within, Nehru: The Making of India, Kashmir: Behind the Vale వంటి అనేక ప్రాచుర్యం పొందిన పుస్తకాలు రచించిన ఎం.జె. అక్బర్ మీడియాలో బి.జె.పి. పార్టీ అధికార ప్రతినిధిగా దానికి వత్తాసు పలకటం ఓ విషాదం )

  • మీరు ఎం.జె. అక్బర్ రాసిన Tinderbox పుస్తకం గురించి ప్రస్థావించలేదు. ఆయన బిజెపి లో కి చేరటం వలన ఆపార్టికి వచ్చిన లాభమేమి లేదు.

 23. c sainath says:

  ఇంకా మంట ఎక్కువపెడితే అర్ణబ్ కి సెగ ట్యాగ్లుదేమో
  బాగుంది మీ వ్యాసం

 24. Mahammad Hussain says:

  రమణ యడవల్లి గారికి కృతజ్ఞతలు . అర్ణబ్ గోస్వామి గురించి మీరు వ్రాసిన వ్యాసం అతన్ని సమర్థించే వారికి అర్థం కావాలని కోరుకుంటున్నాను .

మీ మాటలు

*