మతము-నాస్తికత్వము-నాస్తిక మతము                                                                                        

 

                                                                                                                       – రాణి శివ శంకర శర్మ

~

 

మనం ఆధునిక కాలంలో మతచాందసత్వాన్ని కాదు. ఎథీస్ట్ ఫండమెంటలిజాన్ని అంటే నాస్తిక చాందసత్వాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి. అలా అధ్యయనం చేయడం ద్వారా మనం సంఘర్షిస్తున్నాయి అని అనుకుంటూన్న శక్తులు ఒకే కుదురులోనివనీ, తోబుట్టువులనీ అర్థమవుతుంది. వైరుధ్యాలు అనుకున్నవి మిత్ర వైరుధ్యాలనీ వైరుధ్యం ముసుగులోని మైత్రీపూర్వక సంబంధాలనీ అవగతమవుతుంది. అప్పుడు కమ్యూనిజము, హిందూవాదము లాంటి అనేక పేర్లు ఒకే సత్యానికి సహస్ర నామాలని అవగతమవుతుంది.

నిజానికి కమ్యూనిజం వ్యాన్ గార్డులుగా వ్యవహరించిన కొన్ని అగ్ర కులాలని గ్రామీణ బంధనాల నుండి విముక్తం చేసి పెట్టుబడి దారీ వ్యవస్థలో తగిన భాగస్వామ్యం పొందడానికి అవకాశం కల్పించింది. ప్రభుత్వ పరిశ్రమలు ప్రైవేటు పరిశ్రమల ఆవిర్భావానికి చోదక శక్తిగా పని చేసినట్లేనన్న మాట. చైనాలో కూడా అంతే. కమ్యూనిజం చిన్న కమతాలని సమిష్టి వ్యవసాయంలోకి లయం చేసి ప్రాచీన గ్రామీణ వ్యవస్థని బలహీనపరిచింది. ఇప్పుడు అలా సమీకరించబడిన భూమి పెట్టుబడికి ప్రశ్నకవకాశం లేని వనరుగా మారింది. ప్రజా ప్రభుత్వం పేరుతో ఆవిర్భవించిన కమ్యునిష్టు వ్యవస్థ పెట్టుబడిదారీ వ్యవస్థకి దుర్భేధ్యమైన కవచంగా మారింది. తావోయిజం ప్రకారం ప్రతీదీ పూర్తి విరుద్ధంగా మారుతుంది. ఆ మాటని మావో తాత్వీకరించాడు. ఇప్పటి పరిణామాలు కూడా ఆ తాత్వీకరణలో భాగమేనా? తాత్విక సూత్రాలు స్వయం చలనంగా ఉండి తమ అర్థాలని తామే నిర్ణయించుకుంటాయా? మానవ ప్రగతి అనే భావనలో ఏ మానవుడి ప్రగతి, ఏ జాతి ప్రగతి అనే ప్రశ్నలకి సరైన సమాధానం లేదు. దురదృష్టవశాత్తూ కమ్యూనిజం ఈ భావన మీదే కాళ్ళూనుకొని ఉంది. నిజానికి ఆధునికత అంతా అంతే.

 

హిందూ వాదం కూడా పురోగతి అనే భావన మీదే ఆధారపడి ఉండి. చరిత్ర పురోగమనం అనే విశ్వాసం మీదే ఆధారపడి ఉంది. హిట్లర్ నేషనలిజం అన్నా, సావర్కర్ హిందూ నేషనలిజం అన్నా ఈ ఆధునిక అభివృద్ధి భావనల మీదే ఆధారపడ్డాయి. అందరూ ఏదో రూపంలో త్యాగశీలతనే కొనియాడారు. కానీ త్యాగం చేసేవారూ, నాయకత్వం వహించేవారి మధ్య అగాథం అలాగే నిలిచిపోయింది. మొత్తం మీద కమ్యూనిజం, హిందూయిజం- ఈ రెండూ,  కొందరు అగ్రవర్ణాల వారు పెట్టుబడిదారీ వ్యవస్థలో రాణించడానికి పునాదిగా పని చేసాయి. కమ్యూనిజం, కమ్యునిష్టు ఉద్యమాలు పునాది అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ, గ్లోబలైజేషన్ ఉపరితలం అనవచ్చు. అంటే కమ్యునిజం మానవుల్ని, అంటే అగ్ర కులాల్ని మాత్రమే సంప్రదాయ బంధనాల నుంచి విముక్తం చేసి, నగరీకరణలో, గ్లోబలైజేషన్లో భాగం చేసాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలు ఇందుకు మంచి ఉదాహరణలుగా నిలుస్తాయి.

 

ఈ క్రమంలో పెట్టుబడి దారీ వ్యవస్థలో, గ్లోబలైజేషన్లో తగిన భాగం పొందలేక, గ్రామీణ వ్యవస్థ విచ్చిన్నమై నూతన అవకాశాలు కూడా పొందలేక బాధపడుతున్న దళిత, బహుజనులు, ముస్లీంలు తమ అస్తిత్వాలతో, మతాలతో, సంస్కృతులతో ముందుకు వచ్చి వాటినే అగ్ర కులాల ముందు ప్రశ్నలుగా ఎగరవేశారు. దాంతో అగ్ర కులాలు నాస్తికత్వం, ఆర్థిక సమానత్వం, హిందూ నేషనలిజం లాంటి సెక్యులర్ అబ్స్ట్రాక్ట్ పదాల్ని ఆశ్రయించారు. దళితులు, బహుజనులు తమ ప్రత్యేక అస్తిత్వాలని కరిగించుకొని అబ్స్ట్రాక్ట్ గా మారిపోవాలని ఆదేశిస్తున్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థ అబ్స్ట్రాక్ట్ స్వభావాన్ని ఇష్టపడుతుంది. ప్రత్యేక అస్తిత్వాలని కాక కొనుగోలుదార్లని వాంఛిస్తుంది. నగరీకరణలో ప్రత్యేకతలు, ప్రత్యేక సంస్కృతులు లయమైపోవాలని ఆదేశిస్తుంది. కమ్యునిష్టు, హిందూ ముసుగుల్లోని అగ్రవర్ణాలది మొదటి నుంచీ అబ్స్ట్రాక్ట్ పరిభాషే. భూస్వామి అన్నా, బూర్జువా అన్నా, పెటీ బూర్జువా అన్నా, హిందుత్వ అన్నా, నేషనలిజం అన్నా అంతా వలసవాదుల నుంచీ దిగుమతి చేసుకున్న అబ్స్ట్రాక్ట్ సరుకే. ఈ పదాలతోనే వీళ్ళు నగరీకరణలోకీ, గ్లోబలైజేషన్లోకీ సులభంగా ఎగబాకారు. అదే సమయంలో దళిత, బహుజన, ముస్లీంలు ఈ నిచ్చెన మెట్లు ఎక్కకుండా ఉండడం కోసం ప్రత్యేకతల్నీ, కులాల్నీ, మతాల్నీ, సంస్కృతుల్నీ ఉపరితలం అంటూ అగ్రకులాలు విసిరి కొట్టారు. హిందూవాదులైతే బహుళత్వాన్ని హిందూ జాతీయతకి ముప్పుగా పరిగణించారు.

 

అందుకే ఇప్పుడు కమ్యునిష్టులు, దళిత బహుజనుల్ని, వారి ప్రత్యేక మతాలనీ , సంస్కృతులనీ  గ్లోబలైజేషన్ దుష్పరిణామాలుగా వాదిస్తున్నారు. ఐక్యతకి ముప్పుగా భావిస్తున్నారు. నిజానికి గ్లోబలైజేషన్‍కీ వాటి ఫలితాలకీ కారణం ఆ కులాల వాళ్ళే. ఐక్యత అనే విశాలార్థం కల  పదం ఎప్పుడూ కొద్దిమంది అభివృద్ధికి అనేక మంది అణచివేతకి కారణమవుతూ వచ్చింది. మాదిగ దండోరా ఆవిర్భావానికి కారణమదే. మాదిగల ప్రత్యేక అస్తిత్వ ప్రకటన సాంస్కృతికంగా మరుగుపడిపోయిన అనేక అంశాల్ని బయటికి తెచ్చింది. సంస్కృతి గురించి అగ్రవర్ణాలు కమ్యునిష్టు హిందూవాదులు వ్యక్తం చేసిన ఆధిపత్య కోణాల్ని బట్టబయలు చేసింది.

 

ఉదాహరణకి ద్రోణుడు ఏకలవ్యుడికి విద్య చెప్పడానికి నిరాకరించాడనే కథని, కమ్యునిష్టులు కూడా యాధార్ధంగా స్వీకరించారు. ద్రోణుడిని వ్యాన్ గార్డ్ గా ఏకలవ్యుడిని కార్యకర్తగా చూసారు. అసలు ద్రోణుడు గిరిజనుడైన ఏకలవ్యుడికి విలువిద్య నేర్పడమేమిటని ఎవరూ ప్రశ్నించలేదు. ఎందుకంటే కమ్యునిష్ట్ హిందూ అగ్ర వర్ణాలవారు తాము ప్రజలనుంచీ నేర్చుకోవడం కంటే వారికి నేర్పే వారిగానే తమని తాము చిత్రీకరించుకున్నారు. తాము గురుత్వం వహించారు. అందుకే జాంబ పురాణం వంటి ప్రత్యామ్నాయ పురాణాలని అధ్యయనం చేయలేదు. దళితులు అవిద్యావంతులనీ, అగ్రకులాలు విద్యావంతులనే స్టీరియో టైపుని బద్దలు చేయలేక పోయారు. డక్కలి వారికి చదవడం, రాయడం వచ్చని, వేద పండితులకి రానే రాదనే విషయాన్ని వాళ్ళు పట్టించుకోనే లేదు. ఎందుకంటే అగ్రకులాలే ఙ్ఞానవంతులనేది వారి అభిప్రాయం. కానీ డక్కలి వారి దృష్టి వేరు. వాళ్ళు ఙ్ఞానాన్ని అగ్ర కులాలు తమ వద్దనుంచే దొంగిలించాయంటారు.

 

వలసవాద విద్య వల్ల అగ్రకులాలు తమరిదొక్కరిదే ఙ్ఞానమని, విద్య అనీ, మతమనీ ఇతరులందరినీ బ్రిటీషువారిలాగే సంస్కరించే వైట్ మ్యాన్స్ బర్డేన్ తమ మీద ఉందనీ భావించడం మొదలు పెట్టారు. ఇతర సంస్కృతుల్ని అంటరానివిగా చూడడం కాక, వాటిని మొత్తంగా నిర్మూలించి, వాటి స్థానంలో తాము సంస్కృతీ, మతం, నాగరికత అనుకున్నదాన్ని బలంగా ప్రతిష్టించాలని వారు భావించారు. ఈ భావనలకి    అత్యాధునిక ప్రతిధ్వనులే గోగినేని బాబు, హెచ్చార్కే, రంగనాయకమ్మ. వీరిది నాస్తిక మతం. ఎథీస్ట్ ఫండమేంటలిజం. గోగినేని బాబు గద్దరు అనే ప్రజా గాయకుడు శివుడ్నీ, బసవడ్నీ సమానత్వ భావాలకి నిలయంగా భావించి పాట రాసినందుకు తీవ్రంగా నిందిస్తాడు. అదే సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ జాతీయ గీతంలో అబ్స్ట్రాక్ట్ విశాల దృష్టినన్వేషిస్తాడు. హెచ్చార్కే కులమతాలు పోవాలనీ, తానే మైనారిటీననీ అంటాడు. రంగనాయకమ్మ బ్యాక్ టూ మార్క్స్ అంటుంది. అంటే తనలోనూ, మార్క్స్ లోనూ తప్ప అన్ని చోట్లా లోపాలే ఉన్నాయని అంటుంది.   ఇంతవరకూ లోపాలు లేని వ్యక్తులు, వ్యవస్థలు, సంఘాలు బయట ఎక్కడా ఉదాహరణగా నిలచి లేవు కనుక తన హృదయంలోని మార్క్స్ కలగన్న సమాజం కోసం జపం చేస్తూ ఉండాలని బోధిస్తుంది. మొత్తం మీద వీళ్ళందరూ వాళ్ళు నిర్మించుకున్న అబ్స్ట్రాక్ట్ ఏకాంత మందిరంలో లోపాలు, పక్షపాతాలూ ఏవీలేని స్వచ్చమైన నాస్తిక మతంలో నాస్తికతనే దేవుడిగా ఆరాధిస్తూ జీవిస్తారు. ఈ స్వచ్చతని పాటించడం కోసం అన్ని మతాలకీ, అన్ని కులాలకీ సమదూరం పాటిస్తున్నట్టూ నటిస్తారు.

 

 

నట సామ్రాట్

నీ ఇంట్లో అరలెన్నో మరలెన్నో

నాకు తెలుసు నాకు తెలుసు

నీ పాత్ర చిలుం పట్టింది తోముకో

-మహాస్వప్న

 

 

*

మీ మాటలు

 1. భాస్కరం కల్లూరి says:

  శర్మగారూ…మీ వ్యాసంలో చర్చనీయ అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వాటిలోకి వెళ్లను కానీ, “ద్రోణుడు గిరిజనుడైన ఏకలవ్యుడికి విలువిద్య నేర్పడమేమిటని ఎవరూ ప్రశ్నించలేదు.” అన్న వాక్యం నన్ను ప్రత్యేకించి ఆకర్షించింది. అక్షరాలా ఇదే ప్రశ్నను “ఏకలవ్యుడి బొటనవేలు” అనే నా వ్యాసం ఒక దానిలో ప్రస్తావింఛను. దాని లింకు ఇదీ: http://saarangabooks.com/retired/tag/%E0%B0%95%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B1%82%E0%B0%B0%E0%B0%BF-%E0%B0%AD%E0%B0%BE%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%B0%E0%B0%82/page/3/

 2. rani siva sankara sarma says:

  భాస్కరం గారూ
  మీవ్యాసాన్ని మిస్ అవ్వడం దురదృష్టం. యిప్పడికైనా చదవడం మంచిదైంది.
  నాగోల ఏమిటంటే – డక్కలి మరియు చిందు భాగవతులు లాంటి దళిత కులాల్లో చదవడం; రాయడం రచించడం వున్నాయి. కానీ దళితులు నిరక్షరాస్యులు . వారు బ్రాహ్మణులు తమకి అక్షరాభ్యాసం చెయ్యాలని కోరుకున్నారు. . కానీ బ్రాహ్మణులు దాన్ని తిరస్కరించారు . దీన్ని ఏ కలవ్యుడికథ సింబాలిక్ గా చెపుతోమ్ది అని కొందరి వాదన. ఒకసారి హెచ్చార్కె అనే కమ్యూ నిష్టు అలాగే అన్నారు.
  ఈవలసవాద భావప్రభావితులైన విద్యావంతులు స్థలకాలాలని ప్రత్యేకంగా అధ్యయనం చెయ్యరు.సిద్దాంతాలప్రకారం, తాము ఆరాధించే పుస్తకాల్లో ఉన్నదాని ప్రకారం మాట్లాడతారు.
  అసలు విషయం ఆధిపత్యం గా మారలేని జ్ఞానం, అక్షరాస్యత , కళ అసలు ఉనికిలోవున్నట్లుగా గుర్తింపు పొందవు.జానపద కళలు సినిమాలో కరివేపాకులా వాడబడతాయి కానీ వారికి ప్రత్యేక గుర్తింపు ఆధునికతలో లభించవు. సినిమా అన్ని కళలనీ మింగేయ్యలేదూ? కొన్ని అగ్రవర్ణ సూద్ర కులాల ఆధిపత్యంలో కళ బందీ ఐయిందన్న విషయాన్ని యీమేధావులు గుర్తించరు.అందుకే పల్లెకన్నీరుపెట్టిందో అనేపాట వచ్చ్చింది. [గోర టి వెంకన్న] ఈపాటని కూడా రివైవలిజం అని కొట్టి వెయ్యడం ద్వారా సోకాల్డ్ కమ్యునిష్టు మేధావులు ఆధునిక ఆధిపత్యాలని పరోక్షంగా సమర్థిస్తున్నారు.అవి కొనసాగాలని కోరుతున్నారు.

 3. హారతి వాగీశన్ says:

  స్వేఛ్చ అన్న మాట లోతైనది (ఐక్యత వంటి మాట లాగే).లోతైన మాటల మీద పూర్తీ ఏకాభిప్రాయం సాధించడం సాధ్యం కాదు. వాటి మీద భిన్న అభిప్రాయాలు అవగాహనలు ఉంటాయనీ గుర్తించాలి. అటువంటి అభిప్రాయాలకు అవగాహనలకు గల స్థల కాల సందర్భాలను , అటువంటి అభిప్రాయాలలో ఒకానొక సందర్భంలో ఒక రకమైన అభిప్రాయానికీ లేక అవగాహనకు ఎక్కువ చలామణీ లో ఉండే వెసులుబాటు ఎందుకు ఉన్నది? అని చూడవలిసన అవుసరమూ ఉంటుంది . సామాజిక జీవితంలో ఉన్న నిరంతర చలన శీలత(డైనమిసం) ,వైవిధ్యమూ(డైవర్సిటి) మూ అనే లక్షణాల వల్ల లోతైన మాటల నిర్వచనాలు అవగాహనలూ ఒకే కాలంలో వివధ శ్రేణుల ప్రజలు భిన్నంగా ఇచ్చుకునే స్థితి ఉంటుంది ,అట్లనే కాలపు గతిలో కూడా అర్థం మారి పోతూ ఉంటుంది .లోతైన మాటలకు మనకు అర్థమైన పద్దతి మాత్రమె నిజమైన పధ్ధతి అనీ, మిగితా వారికి అర్థమైన పద్దతి శుద్ధ తప్పు అని భావించడంలో సమస్య ఉంటుంది . అవగాహనల్లో తేడాలు ఉండటానికి కారణాలను చూసి మన అవగాహనను నిరంతరం శోధనకు పెట్టడం మంచిదనిపిస్తుంది ( అది కష్టమైనప్పటికీ ). ఈ రకమైన ప్రయత్నం వల్ల ఆధిపత్య భావమూ,ఆధిపత్య ఆచరణ లు చేసే దుర్మార్గం తగ్గించే అవకాశమూ ఉంటుంది . ఆధిపత్య దౌష్ట్యం (అప్రెసివ్ హేజిమోనీ) లేని వ్యవస్థ ఉండాలని కోరుకోవడం అంటే తొలుత మన నిత్య జీవిత వ్యవహారంవలన ,మనకు ప్రియం అనిపించే చింతానా ధోరణుల వలన ఆధిపత్య భావం మనలో ఇంకి పోకుండా చూసుకోవాల్సిఉంటుంది. బహుళత్వం ఉంటుంది బహుళత్వాల సహజీవనం ,వాటిమధ్య సంవాదమూ ఉంటాయి, సంవాదం వల్ల సంఘర్షణా,శతృ పూరిత వైఖరిని తగ్గించ వచ్చు అన్న అవగాహన వల్ల మనం ఆధిపత్య కి దూరంగా జరిగే అవకాశం ఉంటుంది . అటువంటి ఆధిపత్య విముఖ (ఆంటీ హేజిమోనిక్) సందర్భం లో భిన్న న్న అభిప్రాయాలు అవగాహనలు ఉనికి లో ఉండటం స్వేచ్చ అనీ ,వాటి సహజీవనమే ఐక్యత అనీ భావించ వీలుంటుంది .
  విమోచనకు అంటే స్వేచ్ఛకు పనికి వచ్చే ఆచరణాత్మక చింతనలు ,ఐక్యత అనే విలువ కోసం సాగే ఆచరణాత్మక చింతనలు ,వాస్తవవ జీవితంలో ఆధిపత్య భావాలుగా మారిపోవడం కండ్లముందు ఉన్నదే . పై ఆచరణాత్మక చింతనలు బహులత్వ వ్యతిరేకమైన , బహులత్వాన్ని నీచమైన స్థితిగా భావించే ఆధిపత్య భావ వ్యవస్థలు గా మారడాన్ని శర్మ గారు విమర్శిస్తున్నారు అనిప్పిస్తున్నది మీది వ్యాసం లో .వర్గ రహితమైన దోపిడీ లేని సమాజాన్ని గురించి చెప్పే కమ్యూనిస్టులూ, ఏకరూప ఐక్యతని ప్రతి పాదించే జాతీయ వాదులూ ఆధిపత్య ధోరణులను పెంచి పోషించి,కొనసాగించే స్థితి మన దేశంలో ఉన్నది . మన ఉపఖండం లో ఈ చింతనా ధోరణులకు గల ఆరు ఏడూ దశాబ్దాల ప్రాబల్యం వల్ల, అందునా అవి మౌలికంగానే వలసవాదాపు ఆధిపత్య భావం తో ప్రభావితం అవడం వల్ల అవి మంచిని పెంచే అంశాలుగా కాక వికటించిన అంశాలుగా కనిపిస్తున్నాయి .
  పశ్చిమ యూరోప్ లో పుట్టిన ఈ కమ్యూనిజమూ, జాతీయ వాదమూ అనేవి చింతనా ధోరణులు అని గుర్తించడం అవుసరం. అవి మాత్రమె మొత్తం లోకంలోని ప్రజల సమస్యలను సర్వ కాల సర్వ అవస్థల్లో సమూలంగా తీరుస్తాయి అని భావించడం అనవసరం . అంటే ఆ చింతనా ధోరణుల పట్ల మొక్కవోని విధేయత చూపడం కాకుండా విమర్శనాత్మక దృష్టి కలిగి ఉండాలె.
  అన్ని సమస్యలకూ ఒకే తారక మంత్రం ఉంటుంది అనేది సత్యం కాదు. ఎందుకంటే చాలాకాలంగా నొక్కి చెప్పబడుతున్న తారక మంత్రాలు కమ్యూనిజమూ,జాతీయత లు దురశాపూరిత మార్కెట్ నిర్మాణానికి అనువైన ,పెట్టుబడి అన్ని జీవన రంగాలను ఆక్రమించేన్దుకు వీలైన వాతావరణాన్ని కల్పిస్తూ ఉన్నాయి .మన దేశం లో అగ్ర వర్ణాలని చెప్పుకునే వారికి మాత్రమే ఈ రెండు ధోరణలు మేలు కలిగిస్తున్నాయి .రాజ్య యంత్రంలో ,సామజికంగా ,ఆర్ధిక రంగం లో అగ్రకులస్తులకు మాత్రమె అవకాశాలు మిక్కుటంగా ఉండే రీతి లో రెండు తారక మంత్రాలు పనిచేస్తున్నాయి అనిపిస్తుంది వస్తుగత పరిశీలన (ఏమ్పిరికల్ అనాలసిస్ ) చేస్తే. దేశం లో మెజారిటీ అయిన అంటరాని ,అంటబడ గల వృత్తి ఉత్పత్తి కులాల వారి స్థితి నానాటికీ దిగజారుతున్నది .వారి జ్ఞానం, జ్ఞానం గా గుర్తింప బడదు ,వారి జ్ఞాన సూత్రాలు వారి నుండి దూరం చేయబడి ఆధునిక అగ్రకుల పెట్టుబడి చేతిలోకి వెళ్లి పోతుంది . ఉదాహరణకు ‘మంగలి పని ‘వెకిలి గా మాట్లాడబడిన పని మెన్ అండ్ విమెన్ బ్యూటీ పార్లర్ గా అగ్ర వర్ణ పెట్టుబడి చేతిలోకి పోతుంది . హైదరాబాద్ లో పేరు మోసిన మెన్ అండ్ విమెన్ పార్లర్ లను చూస్తె విషయం సులభంగా అర్థం అవుతుంది. ఉత్పత్తి, సేవ,సమాచార వినిమయం , చేసే చాలా కులాల వారిని బుద్ధి హీనులుగా చూసే ధోరణి నిరంత రాయంగా కొన సాగుతున్నది . ఆ పనులుచేసే సముదాయలనుండి విలువైన పని వారు ,లోతైన పరిజ్ఞానం గల మనుషులు రూపొందనివ్వని స్థితి ఉన్నది. ప్రభుత్వ ,సామాజిక విధానంగా (పబ్లిక్ అండ్ సోసియల్ పాలిసీ ) ఈ ధోరణే తేట తెల్లంగా కనిపిస్తూ, రహస్యంగా వర్తిస్తూ , రాజ్యం చేస్తున్నది . కొంచం జాగ్రత్తగా ఈదేశంలో విద్యనదించే పద్ధతిని గమనిస్తే ఈ విషయం అర్థమౌతుంది .
  ఆధిపత్య జాడ్యం లేని ఆధునికతను ( ఆధునికత అంటేనే జాడ్యం అనే భావన తో నాకు ఏకీ భావం లేదు) విమర్శనాత్మక దృష్టి తో మన వంటి వలస పాలిత దేశాల లోకి రప్పించే పనిని ఎట్లా చెయ్యాలే? అ అనే ప్రశ్నను బౌద్ధిక ఆధిపత్యం వహించిన కమ్యూనిస్టులు ,మత ప్రేరిత జాతీయ వాదులు వేసుకోలేదు .పైపెచ్చు అటువంటి వీలు ఉన్నదన్న తీరు లో కూడా ప్రవర్తించలేదు .తమ కార్యా చరణాల ద్వారా కొంత తమందికే అన్ని ప్రయోజనాలు సమకూర్చే పనిలో ఉన్నారు అని పిస్తుంది.
  బహులత్వమూ బహులత్వాల సహజీవనం ,ప్రజాస్వామిక వికేంద్రికరణఅనీ , స్థానికత మాట్లాడితే ,అస్తిత్వమనీ మాట్లాడితేనే చీదరించుకునే స్థితి ఉన్నది .వలస ఆధునికత కంటే ముందు ఉన్న మొత్తం దెశీయ జీవన పద్దతి అంతా చీకటేననీ కమ్యునిస్టులు .కృతకమైన ఆధిపత్య వర్ణ -కుల అనుకూల చరిత్రను “భవ్య మైన గతం” గా సృష్టించడం ద్వారా మతతత్వ జాతీయవాదులు వర్తమానంలో కొన్ని ఆదిపత్య కులాల ఆధిపత్యానికి నిరంతరం ఇంధనాన్ని అందిస్తున్న స్థితి ఉన్నది . ఈ సందర్భం లో బహులత్వాలు ,బహుళ సముదాయాల జ్ఞానమూ దాని వికాసము అనే వాటి మీద వివేక వంతమూ,ఉత్పాదకమూ అయిన చర్చ అవుసరం.విమోచనా చింతనలుగా, మొదలైన చింతనల సమకాలిక ఆధిపత్యాన్ని ప్రశించాల్సిందే . శర్మగారు పై వ్యాసం ఈ చర్చకు పనికి వస్తుందనే నేను అనుకుంటున్నాను .

 4. rani siva sankara sarma says:

  వాగీశన్ గారూ
  కొకు నమ్మిన భూతాల గురించికాదు కమ్యునిజం, నాస్తికత , జాతీయత లాంటి విశాల అబ్స్ట్రాక్టు పదాల పరదాలు వెనుకదాగిన భూతాల నిజస్వరూపాన్ని బట్టబయలు చెయ్యాలి.

 5. ఎ కె ప్రభాకర్ says:

  రాణి శివ శంకర్ శర్మ హిందూయిజాన్ని ప్ర చ్ఛన్న క్రైస్తవమని రెండిటినీ ఒకే మూసలో పోసి చూపేవారు. ఇప్పుడు వాటి జతనే కమ్యూనిజాన్ని జోడించి అదే గాట కడుతున్నారు. మతాన్ని కాదన్న కమ్యూనిజాన్ని మరొక మతంగా ఆవిష్కరించడమే విడ్డూరం. కమ్యూనిజం విశ్వాసాన్ని తిరస్కరించే గతి తార్కికతని పునాదిగా కల్గివున్న విషయాన్ని మరువకూడదు.
  జాంబ పురాణం వామ పక్ష వాదులకే కాదు దండోరా అస్తిత్వ వుద్యమ కారులకు కూడా పనికి రానిదే అయ్యింది. జాంబ పురాణంలో ప్రస్తావితమైన అనేక సాంస్కృతిక అంశాలు నిరాదరణకి గురయ్యాయి. భిన్న ఉపకులాల్లో వున్న జాంబ పురాణాలు ఏం చెప్పాయో తెలుసుకోడానికి ఈ లింక్ చూడండి:
  http://pustakam.net/?p=19183

 6. Sashanka says:

  మొత్తం మీద కమ్యూనిజం, హిందూయిజం- ఈ రెండూ, కొందరు అగ్రవర్ణాల వారు పెట్టుబడిదారీ వ్యవస్థలో రాణించడానికి పునాదిగా పని చేసాయి. కమ్యూనిజం, కమ్యునిష్టు ఉద్యమాలు పునాది అయితే పెట్టుబడిదారీ వ్యవస్థ, గ్లోబలైజేషన్ ఉపరితలం అనవచ్చు.
  —–
  బాగుంది. గొప్ప విశ్లేషణ. కొందరు వ్యక్తులు తాము అందాకా చెప్పన సిద్ధాంతానికి వ్యతిరేకమయిన ఆచరణ లోకి దిగితే అది ఆ సిద్ధాంతం తప్పన్న మాట. ఇది పూర్వ ఆధునికతా వాదులకూ వారి వాదానికి కూడా వర్తిస్తుందా? ఉదాహరణకు ఒక సనాతన వాది కార్పొరేట్ సంస్థలకు లాయర్ గా ఉండటం, ఇంకో సనాతన వాది ఆధునిక ప్రతీక అయిన ఆధునిక విద్యాలయంలో మరింత మంది ఆధునికుల్ని తయారు చెయ్యటం ?

 7. వృద్ధుల కల్యాణ రామారావు says:

  శర్మ గారు చాలా విషయాలు ఒక్కసారే రాసీసీ , కామెంట్ కూడా అతని వ్యాసం కంటే పెద్ద వ్యాసం రాస్తేగాని అర్ధం కాని పరిస్థితుల్లోకి చదువరు లను నెట్టేశారు. అంచేత పెద్ద కామెంట్ రాయడం లేదు. అయితే చెప్పినవన్నీ నిజాలే. అయితే కొందరి పేర్లు: ఉదా. Heccer ke తదితరుల గురించి శర్మ గారు చెప్పినవి , నాకు వారి గురించి తగు పరిజ్ఞానం లేకపోవడం వల్ల, నేను శర్మ గారితో ఏకీభవించడం లేదు.

 8. rani siva sankara sarma says:

  ఏకే ప్రభాకర్ గారూ
  మీరన్నట్లు ఆధునిక ఉద్యమాలు ఏవీ పురాగాధల్నీ కులపురాణాలనీ పట్టించుకోవలసినంతగా పట్టించుకోలేదు. కారణమేమిమిటంటే -ఉద్యమాలకి తమ గోల్స్ మాత్రమేముఖ్యం. అందుకోసం తక్షణం అక్కరకు వచ్చే అంశాలని మాత్రమే స్వీకరిస్తాయి . మిగిలిన గాఢమైన సాంస్కృతికాంశాల పట్ల ఉపేక్ష వహిస్తాయి. రోహిత్ మెచ్చిన కార్ల్ సాగన్ అనే సైన్సు రచయిత భారతీయ పురాణాల్లోని విశాల స్థలకాల దృష్టిని మెచ్చుకున్నాడు. కానీ ఉద్యమ కారులకి కాస్మిక్ దృష్టి గురించి ఎందుకు? ఉద్యమకారుల ప్రాగ్మాటిక్ దృష్టి సాంస్కృతిక అంశాలని మరుగుపరచింది. అయితే అస్తిత్వ ఉద్యమాలు బహుళ అస్తిత్వాల గురించి ఉద్యమావసరాల పాక్షికదృష్టితోనైనా ఎలుగెత్తి చాటాయి. అది కులపురాణాల పరిశోధనకు , సాంస్కృతిక అంశాల శోధనకు దారి ఏర్పరచింది. మీ వ్యాసం కానీ , జయధీర్ తిరుమలరావు గారు, గుర్రం సీతారాములు లాంటి వారి పరిశోధనకు యిదే నేపథ్యంగా పనికి వచ్చ్చింది.
  యింక ఆధునిక రాజకీయాలు మతం యొక్క వ్యక్తీకరణలు మాత్రమే. స్టాలిన్ వ్యక్తిపూజ మత అభివ్యక్తికాక మరేమిటి చెప్పండి.దేవుడు లేడనడం, భౌతిక వాదం మతాన్ని మతభావనని రద్దు చెయ్యవు. దీనికి అత్యాధునిక వ్యక్తీకరణే స్టాలిన్, హిట్లరుల రాజకీయాలు. యిద్దరూ సైన్సు నే ప్రమాణంగా భావించారు యిద్దరూ దేవుణ్ణి రద్దు చేసి ఆస్థానాన్ని ఆక్రమించారు. బహుశా మతంరూపంలోనైన ,రాజకీయంపేరుతోనైనా జనసమీకరణ అనేది మతస్వరూపాన్ని ధరించకతప్పదు.
  రంగనాయకమ్మ- దెయ్యాల్ని నమ్మారని కొకు కుటుంబంపై విరుచుకు పడతారుకాని అతిమ్ద్రియ శక్తులపై పేరా సైకాలజీ పేరుతో కమ్యూనిష్టు రష్యాయే పరిశోధనలు జరిపిన వాస్తవాన్ని మరుగు పరుస్తారు. ప్రాచీన ఈ జి ప్తులోలా మమ్మీలని భద్రపరచి, విగ్రహాలు స్థాపించి మరణానంతరం కూడా తమ నాయక దేవుడి పునరుత్తానం కోసం వేచి ఉండే మతపర మనస్తత్వానికి భౌతిక వాదం అడ్డు నిలవలేదు. హిందుత్వ వాది సావర్కర్ తనభార్య కర్మకాండనే కాక, మరణానంతరం తనకు కూడా కర్మకాండ జరపవద్దని వీలునామారాశారు. గుళ్ళు గోపురాలు గోపూజలు వద్దని , హిందూ జాతి నిర్మాణమే ధ్యేయమని చాటాడు. దీనిలో మతతత్వం లేదనలేము. ఆధునిక రూపం ధరించింది అంటాము అంతే.

మీ మాటలు

*