చీకటీగలు-2

 

(గత వారం  తరువాయి)

నీలకంఠం ఆర్టీసీలో డ్రైవర్‌గా పన్జేస్తాడు. ఎక్కడో శ్రీకాకుళం వాడు. ఇక్కడ స్థిరపడిపోయిన కుటుంబం… తెలుగు సాహిత్యం పట్ల చాలా మక్కువ…. ముఖ్యం రంగరాజు పద్యాంటే… రాజా రాజా అని ప్రేమగా వుంటాడు తన్తో…. శ్రీమన్నారాయణంటే భక్తి

నేనో ఇంగ్లిష్‌ లెక్చరర్ని ప్రయివేట్‌ కాలేజీలో… ఒకవిధంగా అందరం ఓ మోస్తరు సుఖవంతమయిన జీవితాలు గడుపుతూన్న వాళ్ళమే…

ఒక్క శ్రీమన్నారాయణతప్ప… ట్రెషరీలో పన్జేస్తూ కొడుకుద్యోగం కోసం వలంటరీ తీసుకుని పెన్షన్మీద వున్నాడు. ఈ వయసులో కొడుకుతోటీ భార్యతోటీ దెబ్బలాడి విడిగా వుంటాడు…. ఏం చదివాడో గానీ ఏ విషయంమ్మీదైనా అనర్గళంగా మాటాడగల్డు… ఇంత వయసులోకూడా అందంగా హుందాగా వుంటాడు. బూతులు ధారాళంగా మాటాడ్తాడు.

మేమందరం ఎలా కలిసామో ఇదమిత్థం యిదీ అని చెప్పలేము… శ్రీమన్నారాయణ మాత్రం యీ రేకుల షెడ్డుకు పరిమితమయి, నెల చివర్న డబ్బుకిబ్బంది పడ్తూంటాడు, రంగరాజో నేనో మందుకు ఖర్చుపెడతాం… నీలకంఠం తనొంతు తనిచ్చేవెళ్తాడు.

రంగరాజు ఊరికి చివరగా వున్న తన స్వంతస్థలంలో రేకు షెడ్లేసుకుని రిజిష్టరు చేసుకున్న బడి నడుపుతాడు. మాట కరుకైనా మంచి మనసున్నవాడు. శ్రీమన్నారాయణంటే దేవుడే అతనికి. శ్రీమన్నారాయణ రంగరాజుని ప్రియంగా ‘ఏరా’ అని పిుస్తాడు.

*******

ఒకటో రౌండింకా పూర్తికాలేదు. ఒక్క శ్రీమన్నారాయణ మాత్రం ఎత్తిన గ్లాసు దించేసి మాసింతుండుతో మూత్తుడ్చుకుని రంగరాజు తెచ్చిన బర్కిలీ ప్యాకెటోపన్జేసి సిగరెట్వెలిగించుకుంటూండగా… చాలా వేగంగా హోరులాగా అతని కొడుకు గదిలోకి  దూసుకొచ్చాడు ఉపోద్ఘాతాల్లాంటివేవీ లేకుండా.

‘‘ఒక పార్టీని మాట్లాడాను రేపుదాయాన్నొస్తారు నలభై రెండుకు సెటిల్చేసుకున్నాం. అమ్మకూడా ఓకే అంది. తొమ్మిదిన్నర కొస్తా రడీగా వుండు. తీసుకెళ్తా…. మాట్లాడకుండా అగ్రిమెంటు మీద సంతకం పారెయ్యి…. యీ మాటు గొడవ చేశావంటే బావుండదు. ముందే చెబుతున్నా… యీ రేకు షెడ్లో అంగలారుస్తూ మమ్మల్ని బజారుకీడుస్తున్నావ్‌… కొంపలో పడేడు… ఈ పోరంబోకు వ్యవహారాలేం అక్కడ నడవ్వు… రేపు తొమ్మదిన్నర… రెడీగా వుండు… ముందే చెబుతున్నా దేనికైన ఓ లిమిటుంటుంది. ప్రతిసారీ నాకుద్యోగమిప్పిచ్చానని దొబ్బడం… తాగి తాగి నువ్వు చస్తే ఎట్లాగూ వస్తుందది. చెబ్తున్నా ముందే రేపుదయం…’’ చాలా గట్టిగా అరుస్తూ మమ్మల్నందర్నీ పురుగుల్లా చూసి వెళ్ళబోయాడు.

‘‘సంతకం కాదు కదా నా… కూడా పెట్టను కాకితమ్మీద. నువ్వూ మీ అమ్మా సందు చివరి నీళ్ళ ట్యాంకెక్కి దూకి చావండి. గెట్లాస్ట్‌ నాన్సెన్సికల్‌ ఫకర్‌’’ బూతులు అరిచాడు శ్రీమన్నారాయణ…

‘‘ఛీఁ థ్పూ మనిషివా నువ్వూ చెత్తవెధవ… తాగుబోతు లమ్డీకొడకా… ఎట్లా పెట్టవో సంతకం చూస్తా… రేపిక్కడ యుద్ధమే సిద్ధంగా వుండు… ఏ నాకొడుకుల్ని పిలిపించుకుంటావో పిలిపించుకో’’ అని మా అందరివేపూ ఓ మిర్రి చూపు చూసి యింకా బూతు గొణుక్కుంటూ ఎలా వచ్చాడో అలా వెళ్ళిపోయాడు. శ్రీమన్నారాయణ కొడుకు ట్రెషరీలో ఎల్డీసీగా చేస్తున్నాడు.

‘‘అనిబ్ధమైన జీవితంలోకి అడుగెట్టి ప్రయాణం సాగించడానికి ధైర్యమూ, బంధరాహిత్యమూ మాత్రమే చాలవు… బాంధవ్య రాహిత్యమన్నది ఓ పెద్ద లమ్డీ మిధ్య అన్నానా… చూడండి తెంపుకున్నానని అనుకుంటున్నా… అన్నా… తెగేవిగా వున్నాయా? యీ బాఢఖావ్‌ బంధాలు, బంధాలు… బంధాలట దొంగనా…. బంధాలు’’ మళ్ళీ బూతు వాడుతూ ఎవళ్ళనీ ఉద్దేశించకుండా పలికాడు శ్రీమన్నారాయణ.

‘‘ఉన్నీన్నా యీ దినాము కొత్తనా ఏం… పదయింకో రౌండేయ్యి… నీలకంఠం గ్లాసులీండి…’’ అని మా గ్లాసు వంగి తీసుకుని మందొంచాడు రంగరాజు.

శ్రీమన్నారాయణకి అయిదున్నర సెంట్లలో కట్టిన మంచి ఇల్లుంది. దాంట్లోనే పెళ్ళాం కొడుకుల్తో కలిసుండేవాడు. ట్రెషరీలో పన్జేస్తున్నప్పుడు పైనా కిందా పడి ఓ అపార్ట్‌మెంట్‌ చవగ్గా వస్తోందని తన పేర్నే కొన్నాడు. కొడుకూ భార్యా యిప్పుడా అపార్ట్‌మెంట్‌ అమ్మేయాలని… అది పూర్తిగా శ్రీమన్నారాయణ స్వార్జితం… శ్రీమన్నారాయణ కూడా నా కర్థం కాడు… ఈ రేకుల షెడ్డులో ఎందుకుంటున్నాడో… ఆ చిన్న అపార్ట్‌మెంట్లో వుండొచ్చుగా… అది కాస్త వూరికి దూరమే అదీ నాలుగో అంతస్తులో వుంది… ఈ షెడ్డు నాకన్నిటికీ కన్వీనియంటంటాడు. ఏమో నీలకంఠం అన్నట్టు మైత్రి భర్త క్యాంటీను బాగా దగ్గర… ‘ఏమో వుందండీ’ అంటాడు నీలకంఠం.

‘‘అబ్బే ఆ అమ్మాయికీనవయసులో సగముంటుందండీ యీనకా ఉద్దేశం వుందేమో కానీ…’’ అన్నేను నసుగుతా.

కానీ గాలీ వెల్తురూ లేని యీ సందులో… షెడ్డులో శ్రీమన్నారాయణ నివాసం… మ్యాసకిస్టిగ్గా అనిపిస్తుంది నాకు. కానీ ఎప్పుడూ ఆయన ఆంతరంగికత గురించి అతన్తో మాట్లాడలే… అతని గదినిండుగా పుస్తకాలూ… ఎప్పుడెళ్ళినా చదువుతూనో, రాస్తూనో కనబడతాడు.. పబ్లిష్‌ చేస్తాడా అంటే, నవ్వేసూరుకుంటాడు… ఎక్కడ కాస్త మంచి కవిత్వమో, కథో కనబడ్డా చెప్పేస్తాడు. చదవండి… చదవండి అంటాడు. అతను రాస్తూ నింపేసిన డయిరీలూ నోటుపుస్తకాలు ఓ షెల్ఫ్‌లో సగానికుంటాయి. ఈ మధ్య తాగడం ఎక్కువయింది. హైలో వున్నప్పుడు ముక్కలు ముక్కలుగా మాట్లాడ్తాడు. పొయెటిగ్గా, సరియలిస్టిగ్గా… రకరకాలుగా భాషలు వాడి మణిప్రవాళంలో మాట్లాడ్తాడు… హిందుస్తానీ సంగీతమంటే ప్రాణం పెడ్తాడు. మైత్రితో మాట్లాడేప్పుడు ఫలాని ఫలాని రాగం ఫలాని స్వరాలూ అంటూ చర్చిస్తుంటాడు. శారీరకంగా శిథిలమైనా… శిథిలమైన గొప్ప నాగరికతలా కనబడతాడు… మొత్తానికి మాకు ఎవరికి వారికి ఇంటిమేట్గా అనిపిస్తూనే ఓ మిస్టరీగా వుంటాడు శ్రీమన్నారాయణ.

‘‘కాదండీ మేషారూ, ఆ ఎపార్ట్‌మెంట్లోనే మీరుండొచ్చుగా… పోనీ యీ ఇరుగ్గదే మీ స్వర్గమనుకుంటే, దాన్ని మీరే అమ్మేసి, దీన్నే ఇంకొంచెం సౌకర్యం చేసుకోవచ్చుగా, ఆ కుర్రాడి చేత అన్ని మాట్లు పడ్డం బాధ అన్పించట్లేదు మేషారూ…’’ కంఠం నొచ్చుకున్నట్టు అన్నాడు.

‘‘ఈ రాతిరి గడిస్తే చాలు ఏ నేలైతేనేం… ఏ చూరైతేనేం. అంటుకున్న అడవిలా పెరుగుతుందే తప్ప తరగదేం రాతిరి! ఈ తడి కన్నుల ఊటలు కోట్లసార్లు ఆర్పప్రయత్నించినా రగులుతుందేగాని బూదిగా మిగలదేం రాతిరి… ఎవరండీ కవీ? దగ్గిర్దగ్గర బీతే నా బితాయె రైనా హిందీ పాటలా లేదూ… ఏమో గాల్లో భావాలు కలిసుండొచ్చు భూపేందర్‌… ఏం గొంతండీ బరువుగా సాగే కరుగుతున్న లావాలాంటి సెగ వుంటుందండీ… సర్లెండి… ఒరేయ్‌ రంగా వెయ్‌రా…. నీళ్ళతో నింపేయకు’’ శ్రీమన్నారాయణ ఎక్ట్సెండెడ్‌ మత్తుతో… ఇంకో రెంటికి సరి… పూర్తీ మత్తులోకి జారుకుంటాడు.

‘‘ప్చ్‌ మైత్రొచ్చుంటే బావుణ్ణు ఫరీదా పసందుండేది… వెయ్‌ వెయ్‌ ఈ రోజుకి నీ పజ్జాలే నంజుకు చప్పరిస్తాం’’ మళ్ళీ అన్నాడు.

‘‘ఏందోతీనా అన్నీ సగం సగమే చెప్తావ్‌ నువ్‌… నువ్‌ చెప్పు సార్‌… ముందేమనె అన్న? మృచ్చెకటికం గురించి చెబ్తా అనె… యాటికోపాయ… ఇంగోటైతే అయిపాయ… దో పట్టూ’’ అంటూ రంగరాజు శ్రీమన్నారాయణకు గ్లాసందించాడు…. నేనూ… కంఠం ముందుకొంగి మామా ఉపద్రవ్నాందుకున్నాం…

‘‘ప్చ్‌… పాటయ్యా… పాట. గుల్జార్‌ గొప్ప కవండీ…. వాడి ధున్లేం ధున్లు బాబూ పంచమ్‌దా…. ఎప్పుడూ పరిచయ్‌ వచ్చిందీ నభై ఏళ్ళ క్రితం కాదూ జబర్దస్త్‌ వయసు…. వొరే నువ్వు చెడ్డీతో తిరుగుతూండుంటావ్‌ అప్పుడు…’’ పాట పాతజ్ఞాపకాల్లోకి జారుకున్నాడు శ్రీమన్నారాయణ.

ఇంతలో నాలుగు వీధి కుక్కులు అరుచుకుంటూ రోడ్డుమీంచి షెడ్డు సందులోకొచ్చి ఓ మొరగడం మొదలుపెట్టాయి… అందులో ఓ కుక్క దాదాపు గదిలోకొచ్చేసింది, ఇంకో రెండు, కోరలన్నీ బైటపెట్టి గుర్ర్‌ గుర్ర్‌మంటున్నాయ్‌…. గోడవారగా రంగరాజు ఆనించి వచ్చిన సైకిలు ధడేల్మని శబ్దం చేస్తూ సందుకడ్డం పడినట్టుంది. ఇంకో కుక్క కాళ్ళు సైకిలు ఏ భాగంలోనో యిరుక్కుని మొరగడం మానేసి కుయ్యికుయ్యిమంటోంది…

‘‘హేయ్‌ థూత్‌… నీయమ్మ ఛల్‌… ఛల్‌…’’ అని రంగరాజు వట్టి చేతుల్తో అదిలిస్తున్నాడు భయంభయంగా….

‘‘మనిషిని తిట్టాలంటే అదీ హీనంగా ఒరే కుక్క ఛావు ఛస్తావు అనంటారెందుకో’’ కంఠం ఎవర్నీ ఉద్దేశించలేదు… అందర్నీ కూడా ఉద్దేశించేలా గొణుక్కున్నట్టుగా అన్నాడు.

రోడ్లపక్కన పడున్న దుర్గంధం… నోర్తెర్చకు…. నీలి రంగు యీగలు జుమ్మంటూ… ముక్కు మూసుకు… అటు పక్కకు తల్తిప్పుకు నడిచే జనాలు… కుక్క చావు… నిజమే…. అందరూ అసహ్యించుకునేలా చావులోకూడా చిటికెడు ఆత్మీయత దొరకని బ్రతుకు… కుక్కచావు…

గొప్పకుక్కులుండవా? అబ్బో నూటేభైయ్యా, రెండొందలో రకాలు… జాతికుక్కలు… పిన్షర్లూ, హౌండ్లూ, టెరియర్లూ, షెపర్డ్లూ, బాక్సర్లూ, స్పానియళ్లూ, డాల్మేషన్లూ, డ్యాక్షండ్లూ…

‘‘ఒరేయ్‌… వెళ్తాయవే… రారా మీదబడి కరిస్తే కుక్క చావే మళ్ళీ యింతకు ముందోటి… యిప్పుడూ గుంపుగానూ… రారా…’’ శ్రీమన్నారాయణ… తన కొడుకును ఆ కుక్కల్తో కలిపేసి…. ‘‘గొప్ప పోలిక మేషారూ… యివి కరవ్వుగానీ, ముందుది దాదాపంత పన్జేసెళ్ళిపోయింది…. హ్హ…హ్హ…హ్హ…’’ అని కంఠం గట్టిగా నవ్వాడు.

‘‘ఒరేయ్‌ రారా… వెళ్తాయిగానీ వచ్చి ఓ పద్దెం పాడు హరిశ్చంద్రదో… తెనాలి రామకృష్ణుడి సినిమాలోదో… రారా’’ పిలిచాడు శ్రీమన్నారాయణ.

‘‘రాజా రాజా… గంజాయి తాగి పాడు… లంజకొడకా అని భలేగా అంటావ్‌ అచ్చు గంటసాల మేషార్లాగే’’ కంఠం అన్నాడు.

‘‘ఇప్పుడూ తురకలనకూడదోయ్‌… క్రైం… లంజకొడకా యిక సరేసరి…. అమ్మనా బూతు కదా… గురజాడలాంటి వాళ్ళనొచ్చంతే… అసలీ లంజన్న పదం బూతెందుకైందో… ఎప్పుడైందో గానీ’’ ఆగాడు శ్రీమన్నారాయణ.

‘‘చెప్పు చెప్పు సార్‌…’’ అంటూ వచ్చి కూలబడ్డాడు రంగరాజు…. ‘‘అసల్లంజంటే పద్మమనర్థం… దాని వ్యుత్పత్తీ…’’ ఇంకా ఏదో చెప్పబోతున్నాడు శ్రీమన్నారాయణ. యింతలో ‘‘సార్‌… టిఫిన్‌’’ అంటూ దాసు క్యాంటీను కుర్రాడు లోపలికి ఓ క్యారీ బ్యాగ్తోటి వచ్చాడు… వాడితో పాటు కమ్మటి పోపు పరిమళం… షెడ్డునిండా… కమ్ముకుంటూ..

రెండు రౌండ్ల సారాతో కడుపు కరకరలాడుతోంది…. ఆ వాసనకి నోట్లో నీళ్ళూరాయి…

‘‘టమేటా బాత్‌ చపాతీ సార్‌’’ అంటూ వచ్చిన కుర్రాడు క్యారీబ్యాగ్ని కిటికీలో పెట్టి ‘‘ఇంకేమన్నా కావాల్నా సార్‌?’’ వాకిట్లోకెళ్ళి అడిగాడు.

‘‘మందైపోయింది… నే వెళ్ళింకో హస్తం పట్టుకొచ్చేనా’’ అంటూ లేవబోయాడు నీలకంఠం. ‘‘వీడికిచ్చేనా?’’ అంటూ మళ్ళీ కూలబడ్డాడు… ఇంతకు ముందు తీసిన నూటేభై మళ్ళీ తీసి వేళ్ళ మధ్య పట్టుకొని… ఆ కుర్రాణ్ణి ‘రా’ అన్నట్టు తలూపి పిల్చాడు. ‘‘పీనా న మనాహై… నా పిలానాహి మనాహై… మగర్‌ పీనేకే బాద్‌ హోష్‌మే ఆనాహీ మనా హై… హస్తమేం చాల్తుంధీ… హాఫ్‌ చెప్పండి’’ అన్నాడు శ్రీమన్నారాయణ.

‘‘నువ్‌ పో… నా… మనం పోదాంలే’’ అన్నాడు రంగరాజు ఆ కుర్రాణ్ణి పంపిచేస్తూ…

వ్యసనపరుడు కొసరుకోరి తీరుతాడు… ఇదిప్పుడే ఆగదు… కడుపు నకనకలాడ్తోంది. గదిలో గుడ్డి వెలుగు చీకట్లోకి పసుపలికినట్లు… కళ్ళముందు చీకటీగలు మూగుతున్నాయి… చీదరగా వుంది. ఎంత చేత్తో విసిరినా వెళ్ళవు…

చీకటీగలు… నిజంగా మసక చీకట్లోనే మూగుతాయి ముఖమ్మీద… కళ్ళచుట్టూ… మేం నలుగురు కూచ్చున్న మేరా జబ్బుపడ్డ పసుపుకాంతి…. చిన్నగా అంతరించి మిగిలిన గది కనబడీ కనబడక… ముగ్గురు కూడా మొహాల మీద చేతులు విసురుకుంటున్నారు…

చీకటీగలు…

ఏమిటీ చీకటీగలు?

మొహమ్ముందు గట్టిగా చప్పట్లు చరిచినట్టుగా కొట్టి.

(మళ్ళీ వచ్చే  వారం)

కాశీభట్ల వేణుగోపాల్ @9550079473

మీ మాటలు

*