ఆడంబరం లేని అబ్బాస్!

 

ఇంద్రగంటి మోహన కృష్ణ

~

 

mohanakrishnaఆంద్రెయ్ తార్కోవిస్కీ  (Andrei Tarkovsky) అనే ఒక గొప్ప రష్యన్ ఫిల్మ్ మేకర్ ఒక మాటన్నారు. కళలో అబ్సల్యూట్ సింప్లిసిటీ అంటే పరిపూర్ణమైన నిరాడంబరత అనేది చాలా కష్టమని అన్నారు. .అబ్సల్యూట్ సింప్లిసిటీ అంటే ఎటువంటి హంగులూ ఆర్భాటాలూ లేకుండా ఎంత క్లిష్టమైన విషయాన్నైనా సరళంగా  చెప్పగలగడం .

సరళంగా చెప్పగలగడం అంటే తెలివితక్కువగా సింప్లిస్టిక్ గా చెప్పడం అని కాదు. ‘సరళంగా చెప్పగలగడం అనేది ఒక అద్భుతమైన కళ’ అని తార్కోవిస్కీ అన్నారు. అలా అంటూ ఆయన, సంగీతంలో యొహాన్ సెబాస్టియన్ బెక్ (Johann Sebastian Bach)సంగీతమూ, సినిమాల్లో రాబర్ట్ బ్రెస్సోన్(Robert Bresson) సినిమాలూ ఇందుకు తార్కాణాలుగా పేర్కొన్నారు . నా దృష్టిలో వాళ్ల తర్వాత అబ్బాస్ కిరొస్తామీ(Abbas Kiarostami)సినిమాలు ఈ అబ్సల్యూట్ సింప్లిసిటీకి గొప్ప ఉదాహరణలు. దీనినే పరిపూర్ణమైన నిరాడంబరత అని కూడా అనవచ్చు.

అంటే ఎంచుకున్న విషయం చిన్నదైనా కూడా ఒక గొప్ప లోతునీ, ఒక అద్భుతమైన జీవిత సత్యాన్నీ అత్యంత సరళంగా ఆవిష్కరించగలిగిన  చాలా కొద్ది మంది దర్శకుల్లో నా దృష్టిలో కిరొస్తామీ ఒకరు.  ‘వైట్ బెలూన్’ గానీ, ‘ద విండ్ విల్ క్యారీ అజ్’ గానీ, ‘టేస్ట్ ఆఫ్ చెర్రీస్’ గానీ, ‘వేర్ ఈజ్ ద ఫ్రెండ్స్ హోం’ గానీ ఇలా ప్రతి సినిమాలోనూ ఒక దర్శకుడి యొక్క అహం గానీ, అహంకారం గానీ  కనబడకుండా అద్భుతమైన పారదర్శకతతో, సింప్లిసిటీతో ఎటువంటి ఆడంబరాలకీ, స్టైలిస్టిక్ టచెస్ కీ, అనవసరపు హంగామాలకీ పోకుండా జీవితాన్ని ఉన్నదున్నట్టుగా చూడటం, ఆ చూడటం ద్వారా అతి చిన్న విషయాలని కూడా  పరిశీలించడమెలాగో నేర్పించిన దర్శకుడు అబ్బాస్ కిరస్తామీ.  అది చాలా చాలా కష్టమైన కళ.

అబ్బాస్ కిరస్తామీ నా దృష్టిలో చనిపోలేదు. ఆయన అవసరం ఉంది కనుక కొంతకాలం మన భూమ్మీద నివసించడానికి వచ్చారు. ఇక వేరే గ్రహాల్లో, వేరే అంతరిక్షాల్లో, వేరే లోకాల్లో కూడా ఆయన అవసరం పడి ఉండటం వల్ల ఇలా వెళ్లిపోయారని అనుకుంటున్నాను. కాబట్టి థాంక్ యూ అబ్బాస్ కిరస్తామీ.

(సాంకేతిక సహకారం: భవాని ఫణి)

 

మీ మాటలు

  1. Lalitha P says:

    యస్. ‘అబ్సొల్యూట్ సింప్లిసిటీ’ అతని స్టయిల్. ‘ద విండ్ విల్ కేరీ అస్’.. అలాగే మనల్ని లాక్కుపోతాడు తేలికైన మారుతంలా, తను చూపించదల్చుకున్న ప్రపంచంలోకి… కియరోస్తమీకి అతని స్టైల్ లోనే నివాళి ఇచ్చారు మోహనకృష్ణ.

  2. కె.కె. రామయ్య says:

    ఇరానియన్ సినిమాకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిపెట్టిన, సెన్సిటివిటి & ఇంటెలెక్టుల్ రిగర్ కలిగిన, ప్రపంచంలోని ఆరవ అత్యుత్తమ సినీ దర్శకుడిగా 2003 లో గార్డియన్ పత్రికచే ప్రస్తుతించబడిన అబ్బాస్ కిరొస్తామీని (1940 – 4 జులై, 2016) పరిచయం చేసిన ఇంద్రగంటి మోహన కృష్ణ గారికి ధన్యవాదాలు. తన సినిమాలలో జీవనోత్సాహాన్ని, సెలెబ్రేటింగ్ లైఫ్ ని, సున్నితమైన మానవ సంబంధాలని చూపిన కిరొస్తామీని లాంటి వాళ్ళకి మరణం ఉండదు.

    తొలిచిత్రం (గ్రహణం) తోనే జాతీయ పురస్కారాన్ని అందుకున్న; సంసారపక్షంగా, సెన్సార్‌ పక్షంగా తెలుగు సినిమాలు తీసున్న; బుచ్చిబాబు గారి “చివరకు మిగిలేది” నవలను తెరకెక్కించాలని భావిస్తున్న; షేక్స్‌పియర్‌ నవల్స్‌ అంటే ఇష్టపడే ఇంద్రగంటి మోహన కృష్ణ గారూ! నేటి తెలుగు సినిమాకి మళ్లీ గతకాలపు గౌరవనీయమైన స్థానం లభించాలంటే మీలాంటి ప్రతిభావంతుల కృషి చాలా అవసరం.

    అసమాన్యమైన, అద్భుతమైన త్రిపుర కధలు మీరు చదివే ఉండిఉంటారు కదండీ.

  3. Bhavani Phani says:

    గొప్ప దర్శకుడిని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సర్

  4. కందికొండ says:

    అబ్బాస్ కియారొస్తాఅమీ is great ఇంద్రగంటి గారికి ధన్యవాదాలు

  5. Narayanaswamy says:

    సినిమా కళ లో మినిమలిజం ను అద్భుతంగా ఉపయోగించిన గొప్ప దర్శకులు కియరోస్తామి. ఆయన ఇంత త్వరగా వెళ్లిపోవడం ప్రపంచ సినిమా కు చాలా నష్టం – మోహనకృష్ణ గారూ మీ నివాళి చాలా బాగుంది – మీరన్నట్టు కియరోస్తామి మనకు సింపిల్ గా అనిపించే విషయాలను చాలా నిరాడంబరంగానే చెప్తూ లోలోపల అద్భుత తాత్వికతను ఆవిష్కరిస్తారు – వీ విల్ మిస్ హిమ్

Leave a Reply to కె.కె. రామయ్య Cancel reply

*