Together

 

mamata

Art: Mamata Vegunta Singh

-లాలస

~
~

నగరం మీదకు యుద్ధమై వచ్చిన వానలన్నీ సముద్రంలా ఇంకిపోయాక

కొత్తగా వస్తాయి ఆకాశాలు

 

మనం జీవితాల్లో మునిగిపోయి వాటినే తాగుతాము

ఇంక చాలు మేం అలిసిపోయాం నేనూ, నా హృదయమూ

 

మేం పుస్తకాలు చదివాం, పాటలు విన్నాం, మనుషులతో మాటాడాం

కలమూ పట్టుకుని పట్టుబట్టాక రంగులేమో ఎగరవు

 

తడికి తడిసిన కాగితం మీద విడిపోయిన సిరా పదాలతో

ఇక్కడేం చేయాలి.. నేనూ-హృదయం కలసి ఏం చేయాలి

ఇక సూర్యాస్తమయం చూడాలని ఎవరు మారాం చేస్తారు నేనూ నా హృదయం కాక

ఒంటరి పక్షి ఒకటి మమ్మల్ని ఓరకంట చూడనే  చూసింది.

 

ఎవరూ లేని రాత్రి హృదయాన్ని  గాలికి  వదిలేసి నేను సంగీతంలో మునిగాను

హృదయం తన వేయి కళ్ళు మూసుకుని

హృదయం తన వందల నోళ్ళను కట్టేసుకుని

జిగేలుమనే హృదయం- భగ్గుమనే హృదయం- ముక్కల్లా అతికిన హృదయం

చేతుల నిండా పని బడిన ఉదయం

చరిత్రల చిట్టాలను మరిచే హృదయం

తన ఇల్లు లేని హృదయం

తన  వాకిలి తట్టేదెవరో ఎదురుచూసే హృదయం

విసుగేసి రంగుల సినిమాలు చూసే హృదయం  తన తలుపులేసుకుని ఒక దట్టమైన పొగలా మారింది

చిన్ని అబద్దపు సవ్వడి గుసగుసలా చిన్న పురుగులా ముడుచుకుంటుంది

తన సంగతే మరచిపోతుంది

 

నేనూ హృదయం మళ్ళీ గదిలో నిద్రలేచి చదువుతాం ఉత్తరాలను, సుదీర్ఘ ఉత్తరాలను, పుటలను, పాటలను…

అయినా ఆ గదికి నేనంటే ఆసక్తి లేదు ఎందుకంటే నేను తిలక్ ను కాను.

 

ఇది ఒక బతుకు కవిత. హృదయం రక్తికెక్కిన నాటకం

ఇంతకు ముందు నిన్నెక్కడ కలిశాను చూశాను అని నాతోనే హృదయం అంటుంది

వానలో తడిసిన నున్నటి రాయిలా నేనూ నీలానే తడీ పొడిగా ఉన్నాను అని కూడా చెబుతుంది.

 

అయినా

హృదయమెపుడు రాంగ్ టర్నే తీసుకుంటుంది

పక్క చూపులతోనైనా చూస్తానంటుంది

పూలను..  కలలను… పూల కలలను…కలల పూలను

*

 

 

మీ మాటలు

  1. సూపర్బ్!!

మీ మాటలు

*