సయొనర ఇక.. చెరిగేనా?

 

 

-ఆర్.  దమయంతి 

~

 

‘మన భాషని మనం గౌరవించుకోకపోతే ఎంత తప్పో, మాతృ భాషలో కొన్ని అగౌరవ పదాలని సరిది ద్దుకోపోతేనూ  అంతే తప్పు ‘అని ఋజువు చేస్తున్నారు – కొన్ని దేశాల  ప్రజలు.

ఇక మన మాతృ భాష మాటకొస్తే – మనం మాట్లాడే తెలుగుభాషలో తెలుగుదనమెంత అనేది ఎప్పటికీ పెద్ద ప్రశ్నే. ఈ అంశం పై వాదించుకుంటూ పోతే ఒక యుగమైనా సరిపోదు.

చాలా తెలుగు పదాలు మరుగున పడిపోయిన మాట వాస్తవం. నేను చెప్పేది కేవలం మాట్లాడే మాటల్లో ధ్వనించే భాష గురించి. ఇక రాయడం లో ఐతే – భాష ఎంత సహజం గా వుంటే అంత హాయిగా, సౌకర్యం గా  వుంటుంది చదువరులకు అనే అభిప్రాయానికొచ్చేసాం.

తెలుగు డిక్షనరీ పక్కన పెట్టుకుని కథో, వ్యాసమో తయారు చేసినా..అది అతుకుల బొంత లానే వుంటుంది. అక్కర్లేని ఆర్భాటాలతో –  పెళ్ళి చూపులనాడే పెళ్ళి కూతురిలా తయారై వచ్చిన అమ్మాయి అసందర్భపు అలంకరణ లా ఎబ్బెట్టనిపిస్తుంది. అఖ్ఖర్లేని ఆ ఫోజు లో –  రచనలోని భావం అడుగంటిపోయి చికాకు పుట్టిస్తుంది. పర్యవ సానం గా – పుస్తకం మూత పడిపోతుంది.

ఇంగ్లీష్ పదాలు నాలుగు ఎక్కువేసినా ముందుగా మనకు ఎదుటివారి భావం  అర్ధం కావాలి..

ఉదాహరణకి : ” – ఆమె ఇన్వైట్ చేస్తే పార్టీ కెళ్ళాను. కలిసి డిన్నర్ చేసాం. ఓకే? చిట్ చాట్ చేసుకున్నాం. ఏవో జెన్రల్ టాపిక్స్. అంతా అయ్యాక,  కారులో ఆమెని ఇంటి దగ్గర దింపాను. ఓకే?  ఒకరి కొకరు బై బై , గుడ్ నైట్లు చెప్పుకుని విడిపోయాం. అంతే. దట్సాల్. ” అని అన్నాడురా. ఇదంతా నాకెలా తెలిసిందంటే..నిన్న ‘ఈవినింగ్’ శ్యాం కలిసి చెప్పాడు. అంతకు మించి – తమ ఇద్దరి మద్య ఏమీ జరగలేదు, ‘డొంట్ వర్రీ’ అని కూడా అభయమిచ్చాడు.” –

” ఒహ్హో!.. కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్పొద్దనూ! ‘ ఎగ్జాక్ట్లీ వాట్ హాపెండ్’ అన్నది నాకు తెలుసు. – ” సెటైరేశాడు సోమనాధం.

ఇక్కడ మనం గమనించాల్సింది, వీళ్ళు తెలుగు ని ఎంత గొప్పగా మాట్లాడుతున్నారన్న సంగతి గురించి. :-)

వినేటప్పుడు భలే ఆసక్తి కరం గా వుంటుంది. ఆ తర్వాత ఏమైందా అనేంత ఉత్సుకత రేగుతుంది.

కానీ ఇదే సన్నివేశం కథలో రాసేటప్పుడు కొంత ఆంగ్ల భాగం వెళ్ళి పోతుంది. మరి కొంత తప్పని సరి గా మిగులుతుంది. కారణం, ఆంగ్ల పదాలకు సరితూగు పదాలు మన భాషలో లేక కాదు. కాని అవి అతకవు.  కొన్ని సార్లు చాలా ఇబ్బంది పెడతాయి.  కారణమేమిటంటే –  ఆంగ్ల పదాలు  మన నోట్లో ఎక్కువగా నానడం వల్ల, సంభాషణల్లో ఎడా పెడా అతిగా ఆంగ్లం వాడటం వల్ల. వాగడం వల్ల కూడా! ఇంగ్లీష్  మీడియం లో చదువులు ఎక్కువైపోవడం వల్ల… – పాఠకులకు స్వచ్చమైన తెలుగు మింగుడు పడదు. కాబట్టి రచనల్లో ఆంగ్ల పదాలకు  చోటివ్వడం తప్పనిసరైపోతోంది.

అదే అలవాటైపోయింది. రాన్రాను ఈ పోకడ ఇంకా ఎక్కువైపోతోంది కానీ తగ్గడం లేదు. ఒక తెలుగు పదానికి బదులు ఆంగ్ల పదం జేర్చడం వల్ల రచన వన్నె తేలే అవకాశమూ లేకపోవట్లేదు.

sayanora..

మన మైథిలి గారు – ‘అబ్సెషన్’ కి సమానార్ధం కల తెలుగు పదాన్ని సూచించవలసిందిగా కోరారు. అందరం తలో ఒక అర్ధం చెబుతున్నాం కానీ ఇంకా అసలు అర్ధం చేజిక్కలేదు.

కారణం? –

“అబ్సెషన్ అంటే..అబ్సెషనే ఇంకేముంటుంది?”-  అని విసుక్కుంటూ కనిపిస్తున్నారు మా ఇంగ్లీష్ లెక్చరర్. (ఆయన్ని కష్టమైన పదాలకు తెలుగు చెప్పమని అడిగినప్పుడల్లా ..నొసలు చిట్లించి ఇలా.. అంటుండే వారు. ఆయన డైలాగ్ గుర్తొచ్చి నవ్వొస్తోంది.)

అంటే రచనల్లో చాలా ఆంగ్ల పదాలొస్తున్నాయంటే మరి – ఆ యా స్థానాల్లోంచి – తెలుగు పదాలు       తప్పుకుంటున్నట్లే కదా.  వాడుకలో- విస్తృత  తగ్గినట్టే కదా! అందుకేనేమో ‘అలు, అలూ’ – అక్షరాలకి స్వస్తి పలకడం జరిగింది?

మాటల్లో నువ్వెన్ని సార్లు  రోడ్డు రైల్ అనే పదాలు వాడవన్నది నా వాదన కాదు. వాటిని  తెలుగు లో రాయడం లేదెందుకన్నది  అసలు పాయింట్.

రాస్తే చదవబుధ్ధి కాదు. (వ్యక్తిగతం గా చెప్పాలంటే నేనెప్పుడూ రోడ్  అనే రాస్తుంటాను) ఎందుకంటే – ఎక్కడో        అసహజత్వం  కొట్టొస్తూ కనిపిస్తుంది – తెలుగు లో.  పంటి కింద రాయి లా  కసుక్కు మంటుంది. ఇక పాఠకుని పరిస్థితి ఎలా వుంటుందంటే –  కాల్లో ముల్లు గుచ్చుకున్నాక చెప్పులేసుకుని నడవడం లా వుంటుంది. ‘ఇది ఇలానే వుంటుంది. నువ్వు భరించాలి. మన భాష కి వంకలు పెట్ట కూడదు. నొప్పున్నా భరించాల్సిందే ..’ అని చెప్పలేం కదా పాఠకులకి.

మన పెరటి చెట్టే కదా అని,  వేపాకు పచ్చడి చేసుకుని తినలేం. ఇది సత్యం. నేననుకుంటూ ఉంటాను. మనం మనం అని కులానికో మతానికో ప్రాంతానికో దేశానికో జాతి వివక్షత కో ఓటేసుకుని తృప్తి గా బ్రతికేస్తున్నామని. కానీ..అంతర్లీనంగా మనం జీవిస్తోంది వేరే ప్రపంచం లో.  మనం నిజంగా మెచ్చుకుని హృదయంతో స్వీకరించేది  సౌందర్యాన్ని. సౌందర్యారాధనలో విశ్వమంత హృదయాన్ని కలిగి వుంటాం. అందులోనే శాంతిని పొందుతాం. గీతాంజలి రాసింది బెంగాలీ అని ఊరుకుంటామా?  సోక్రటీస్ గ్రీక్ అని వొద్దనుకుంటామా? షేక్స్పియర్ ని కళ్ళకద్దుకున్నా, మిల్టన్ ని మనసులో కొలుచుకున్నా..మాతృ భాషకి సంబంధించిన వారనా? కాదు.

muslim women

సాహిత్యం లో మనకు భాషా భేదాలు లేవు. సుందరమైన ఏ సాహిత్యాన్నైనా అవలీలగా ప్రేమించేస్తుంటాం. ఆరాధిస్తాము అంటే అర్ధం – అందులోని భావ సౌందర్యానికి మనం  బానిసలం అన్నమాట.

అంటే – మన మాతృ భాషని వదిలేయం. కానీ నచ్చిన పర భాషా పదాలెన్నైనా సరే..ఇష్టం గా అక్కున చేర్చుకుంటాం.అది నిన్నటి వరకు జరిగిన సంగతి.

నేడు జరుగుతున్న కొత్త సంచలన సత్యం ఏమిటంటే – మాతృ భాష ఎంత ప్రియమైనదే అయినా.. అందులోని కొన్ని పదాలు – ప్రమాదాలకు దారి తీస్తున్నప్పుడు వాడుకలోంచి బహిష్కరించడమే శ్రేయస్కరం అని పట్టు బడుతున్నారు ప్రజలు.  తీసేయకపోతే – బ్రతుకు లేదన్నంత గా వ్యధ చెందుతున్నారు.  కారణం – మాతృ భాషా పదాలు తమ జీవన విధానానికి ఆటంకం గా వుంటం వల్ల, అసలు జీవితమే లేకుండా చేసేస్తున్నందు వల్ల. – ఏమిటీ? భాష పుట్టినప్పట్నించీ వాడుకై, వేయి నోళ్ళ పాకిన పదాలు ఉచ్చరించినంత మాత్రానే పాపం కలుగుతుందా అని  విస్మయం కలగ వచ్చు. కాని, ఇది నిజం.

‘మాతృ భాషే అయినా ఇక నించి ఈ  పదం మేం వాడం. రేపట్నించీ-  మావూలు గా మేం మాట్లాడుకునే మాటల్లోకి సైతం రానీయం.’ అని ఒట్టేసుకుంటున్నారు ప్రజలు.  పై పెచ్చు ఏమంటున్నారంటే – ‘..’ ఈ ఫలాని మాట చేర్చి మాట్లాడటం మాకు సిగ్గు గా వుంది. తలొంపులుగా వుంటోంది.  పెద్దలు ఏమన్నా అననీ, అనుకోనీ, మేము వ్యతిరేకిస్తున్నాం. ఆ పలుకు ఎంత పవిత్రమైనదైనా సరే, అదెంత శిలా శాసనం లాంటిదైనా సరే మాకిక వద్దే వొద్దంటూ మొత్తుకుంటున్నారు. దయచేసి మతపెద్దల అంగీకారంతో  ఈ పదాన్ని రద్దు చేయండి.  తొలగించండి. వాడుక నించి బహిష్కరించండి. మాకు విముక్తిని ప్రసాదించండి.’ అంటూ వేడుకుంటున్నారు. పెద్ద పెద్ద నినాదాలు చేస్తున్నారు. అదొక చట్టం గా రూపుదిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. ‘ఇది అధిక శాతం స్త్రీల ఆకాంక్షకి నిదర్శనం’ అంటూ కొన్ని లక్షల సంతకాలను సేకరిస్తున్నారు – ముస్లిం వనితలు.

అంత గా వారి పాలిట శాపమైన పదం ఒక్కటే  – త లా క్.

ఆవేశం లో ఈ ఒక్క మాటని 3 సార్లు  పలకడం వల్ల కలిగే దుష్పరిణామం ఎంత విషాద కరం గా వుంటుందో వుంటుందో

– ఒక మరపు రాని సినిమాగా మలిచారు నిర్మాత.  అదే – నిఖా.

https://www.youtube.com/watch?v=00F9HJlCzs8

 

మనల్ని మనం విమర్శించుకోవడం వల్ల ఆత్మ పరిశుధ్ధి జరుగుతుంది.

దేవుడంతటి వాడు – తల్లి కోరితే జ్ఞాన బోధ చేసాడు.

‘తల్లి తర్వాత తల్లి వంటింది అయిన మన మాతృ భాషని కూడా సరిద్దుకోవడం లో తప్పు లేదు…’ అని నేననడం లేదు. జపాన్ ప్రజలు ఘోషిస్తున్నారు.

ఇలాటి బాధే జపాన్ ప్రజలకూ కలిగింది. వాళ్ళు వొద్దనుకుంటున్న ఆ పదం ఏమిటంటే – సయొనర.. ‘

భారతీయులకిది జపనీయుల భాష అనిపించదు. ఎందుకంటే మనకంత పరిచయమైనపదం. ఎలా అంటే – ‘సయొనర.. సయొనర ‘ అంటూ లతా మంగేష్కర్ స్వరం దేశం నలుమూలలా మార్మ్రోగి పోయింది కాబట్టి. సయొనర ఖ్యాతి అలాంటిది. ఐతే- అది నిన్నటి మాట. ఇప్పుడు తాజాగా – జపాన్ దేశ ప్రజలు – 70 శాతానికి పైగా  ఏమంటున్నారంటే – అసలీ సయొనర  ఊసే ఎత్తొద్దని వాపోతున్నారు.

ఈ పదం పట్ల అంత వ్యతిరేకత వెల్లువెత్తడానికి కారణం?  ఈ పదార్ధం – నెగిటివిటీని సంతరించుకుందని మూకుమ్మడిగా అభిప్రాయపడుతున్నారు.  వీరిలో యువత ప్రాముఖ్యత ఎంతైనా వుందని చెప్పాలి.

‘సయొనరా  – అంటే గుడ్ బై అని అర్ధం. ఇది తాత్కాలికమైన గుడ్ బై వంటిది కాదు,  ‘శాశ్వతంగా ఇక సెలవ్’ అనే అర్ధం తో కూడి వుందట.

గుడ్ బై టు సయొనర :

********************

* నాకీ పదం పలకడం ఇష్టం వుండదు. ఎందుకంటే మా కలయిక – ఈ మాటతో అంతమై పోతోందన్న బాధ కలుగుతుంది.

 

* సయొనారా చెప్పుకోవడం తో ఏమనిపిస్తోందంటే ఇక మేము మళ్ళీ కలవమేమో అనే కలవరాన్ని కలిగిస్తోంది. అందుకే, నేనిక ఆ మాటని నేనిక ఉపయోగించ దలచుకోవట్లేదు. సయొనర-  ఇదొక  కోల్డ్ వర్డ్ అనే భావన కలుగుతుంది.

* ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ, మిత్రుల దగ్గర కానీ సయొనర కి బదులు నేనెప్పుడూ ‘సీ యు లాటర్’ అనే అంటాను తప్పితే, సయొనర అని అననే అనను.

 

ఇలా – మొత్తం మీద జపాన్ ప్రజలు ఎంతో పూర్వమైన ఈ పదానికి ఉద్వాసన పలికే సమయం ఆసన్నమైందనే చెప్పాలి. ఎలా అంటే ఇంగ్లీష్ వాళ్ళు గుడ్ బై కి బదులు ఫేర్ వెల్ అని ఎలా అనరో – జపనీయులు కూడా ఇక మీదట  బైబైలే చెప్పుకుంటారట గానీ, తమ మాతృ భాషా పదమైన సయొనర ని నాలుక మీద రానీయమని నిర్ధారిస్తున్నారు.  అయినా, రేపు తిరిగి కలవబోతున్న ప్రియమైన వారితో సయొనర అని అంటమేమిటీ అర్ధం లేకుండా? అని ఆ పదం పట్ల తమ అయిష్టాన్ని మాటల్లో వెళ్ళగక్కుతున్నారు.

సయొనర అంటే వెంటనే గుర్తుకొచ్చేది జపాన్. భాషా చెక్కిలి మీద ఒక చక్కని సంతకమైన పదం భాషలోంచే తొలగిపోవడం ఎంతైనా విచారకరం. కానీ ప్రజలు వాదుకలో వ్యతిరేకిస్తున్నప్పుడు ఎవరైనా చేయగలిగేదేముంటుందనీ?

ప్రాచీన ఈ  జపనీ పదం ఇక గాల్లో కలిసిపోవాల్సిందేనా అనే బెంగా లేకపోలేదు మాతృ భాషా ప్రియులకి. నిజమే కావొచ్చు. ఎవరూ తిననప్పుడు ఆ పదార్ధం  ఎంత  తీయటి పాయసమైనా వండీ, వృధానే కదా!

అయితే స్వభాషలో సయొనర కి ప్రతి గా ఏమిటా అనే  ప్రశ్న తలెత్తక మానుతుందా?

ప్రజలకిష్టమై ఆమోదించిన పదమే ప్రజా పదం. అదే భాషా పథం. ఏ దేశ భాషా సంస్కృతి కైనా ఇదే సిధ్ధాంతం వర్తిస్తుంది.

ఆ మాట కొస్తే మన తెలుగు లో ఎన్ని సాంప్రదాయపు మాటల్ని మనం మానేశామని? మాటల్లోను, రాతల్లో నూ? (ఒకప్పుడు చాలా వాడుకలో వున్నవి, ఇప్పుడు మాయమైనవి ఒక  లిస్ట్ చేసుకుని చూసుకుంటె – ‘ ఔరా! ఎంత మార్పు’ అని అనిపించక మానదు. )

మనం మోసుకెళ్తున్న మాతృ భాష అనే బంగారపు మూటలోంచి  ఒక్క పదం జారి పడినా ఊరుకోవద్దు, సరే. కానీ, ఎన్ని పర భాషా పదాలొచ్చి చేరనీ, – మానుకోవద్దు. అంగీకరిద్దాం.

ఏమంటారు?

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. ari sitaramayya says:

    “ఆఫీసులో కానీ, ఇంట్లో కానీ, మిత్రుల దగ్గర కానీ సయొనర కి బదులు నేనెప్పుడూ ‘సీ యు లాటర్’ అనే అంటాను తప్పితే, సయొనర అని అననే అనను.
    ఇలా – మొత్తం మీద జపాన్ ప్రజలు ఎంతో పూర్వమైన ఈ పదానికి ఉద్వాసన పలికే సమయం ఆసన్నమైందనే చెప్పాలి. ఎలా అంటే ఇంగ్లీష్ వాళ్ళు గుడ్ బై కి బదులు ఫేర్ వెల్ అని ఎలా అనరో – జపనీయులు కూడా ఇక మీదట బైబైలే చెప్పుకుంటారట గానీ, తమ మాతృ భాషా పదమైన సయొనర ని నాలుక మీద రానీయమని నిర్ధారిస్తున్నారు.

    జపాన్ భాషలో సెలవు తీసుకునేటప్పుడు వాడే మాటల్లో రెండు రకాలున్నాయి. ఆపీసుల్లో కలిసి పని చేసేవారు, మళ్ళా తొందరలోనే కలిసేవారూ వాడే మాటలు – “మతా, జా మతా, మతా నే” – అంటారు. మళ్ళా పలానా అప్పుడు కలుస్తామని చెప్పలేని వారు, మళ్ళా తొందరలో కలిసే అవకాశం లేని వారు “సయొనర” అని సెలవు తీసుకుంటారు. “సయొనర” నేను రైల్ స్టేషన్లలో తరచుగా వింటూనే ఉన్నాను.

    “అయినా, రేపు తిరిగి కలవబోతున్న ప్రియమైన వారితో సయొనర అని అంటమేమిటీ అర్ధం లేకుండా? అని ఆ పదం పట్ల తమ అయిష్టాన్ని మాటల్లో వెళ్ళగక్కుతున్నారు.” క్షమించగలరు. మళ్ళా రేపు కలిసేవారితో జపాన్ వారు సయొనర అని ఎప్పుడూ అనలేదు – ప్రియమైన వారైనా, కాకపోయినా.

    • ఆర్.దమయంతి. says:

      మీరేమంటున్నారో నాకర్ధం కాలేదండి సత్యనారాయణ గారు!
      :-)

      • ari sitaramayya says:

        సారీ, శకుంతల గారు,
        ఇంగిలీషు మాటలు లేకపోవడం వల్ల bland గా ఉండి అర్థం కాలేదేమో.
        మళ్ళా try చేస్తాను.
        *
        జపాన్ భాషలో, సెలవు తీసుకునేటప్పుడు వాడే మాటల్లో రెండు రకాలున్నాయి.
        వాటి వాడుక సందర్భాన్ని బట్టి ఉంటుంది.
        తొందరలోనే మళ్ళా కలిసే వారితో అయితే మతా అనో, జా మతా అనో, మతా నే అనో అంటారు.
        అంటే see you soon అని.
        అలా కాకుండా, మళ్ళా తొందరలో కలిసే అవకాశం లేని సందర్భాల్లో సయోనర అంటారు.
        (స యొ ఉ న ర – వాడుకలో సయోనర అని పలుకుతారు.)
        అంటే మళ్ళా ఎప్పుడో కదా కలిసేది అనే అర్థంలో.
        ఈ మాట ఇప్పటికీ వాడుకలోనే ఉండి. మరుగున పడిపోతుందనే భయం నాకు లేదు.
        *
        “అయినా, రేపు తిరిగి కలవబోతున్న ప్రియమైన వారితో సయొనర అని అంటమేమిటీ అర్ధం లేకుండా? అని ఆ పదం పట్ల తమ అయిష్టాన్ని మాటల్లో వెళ్ళగక్కుతున్నారు.”
        పైన చెప్పినట్లు, రేపు తిరిగి కలవబోతున్న వారితో, ప్రియమైన వారు అయినా కాకపోయినా, జపాన్ వారు సయోనర పదాన్ని వాడరు. వాడని మాట గురించి అయిష్టాన్ని వెళ్ళ గక్కడానికి నిజంగానే అర్థం లేదు.
        *
        మనకు లేని మాటలను ఇతర భాషలనుంచి దిగుమతి చేసుకోవచ్చు.
        వాడుకలోలేని అక్షరాలను వదిలెయ్యవచ్చు.
        కానీ వాడుకలో ఉన్న మాటలను వదిలేసి ఇతర భాషల మాటలను వాడటానికి కారణం ఏంటో నాకు తెలియదు.
        పాట కష్టమైన మాట కాదు.
        దాన్ని వదిలేసి song అని ఎందుకంటాడు ఎవడైనా?
        ఇలాంటి ఉదాహరణలు (అదే examples ) ఎన్నో!
        దీనికి కారణం ఏంటీ? ఏమో, నాకు తెలియదు.
        కానీ, lay person గా కొన్ని కారణాలు ఊహించగలను.
        ఈ జాతికి ఆత్మ గౌరవం అనేది ఏ కోశానా లేదు.
        Slave mentality .
        Cultural bankruptcy
        Mental illness
        Genetic disease
        ఏమో. అసలు కారణం ఏంటో మరి.

        ఒక విషయం మాత్రం గట్టిగా చెప్పగలను.
        జపాన్ ప్రజలకు ఈ జాడ్యాలు లేవు.

        సయోనర
        భవదీయుడు,
        సత్యనారాయణ

  2. అసురుడు says:

    చాలా బాగా రాశారు వ్యాసం. హాయిగా ఉంది. మరీ ముఖ్యంగా మీరు పోస్టు చేసిన పాట సయోనరా చాలా బావుంది. మన భాషలోనూ తీయాల్సినవి. కలపాల్సిన పదాలున్నాయి. మంచి వ్యాసం.

    • ఆర్.దమయంతి. says:

      ధన్యవాదాలు అసురుడు గారు, వ్యాసం నచ్చినందుకు.
      మీ పెన్ నేమ్ – నాకు బాగా గుర్తుఉండిపోతుంది.
      :-)

  3. Krishna Veni Chari says:

    తెలుగు డిక్షనరీ పక్కన పెట్టుకుని కథో, వ్యాసమో తయారు చేసినా…
    ….కథలకి ఎప్పుడూ అవసరం పడలేదు కానీ వ్యాసాలలో టెక్నికల్ మాటల అవసరం పడినప్పుడు నేను ‘ఆంధ్రభారతి’ ని ఆశ్రయిస్తాను మరి! మరవి అలాగే అనిపిస్తున్నాయో ఏమిటో అన్న సందేహం పట్టుకుందిప్పుడు. j/k
    మన పెరటి చెట్టే కదా అని, వేపాకు పచ్చడి చేసుకుని తినలేం. ———-ఇది మాత్రం పూర్తిగా నిజం.
    సయొనర…………ఇప్పుడు ఈ మాటని వాడటం లేదని తెలియదు.
    ఎన్ని పర భాషా పదాలొచ్చి చేరనీ, – మానుకోవద్దు.——–మానుకోవలిసిన అవసరమూ లేదు.
    త లా క్———–
    ————–సందర్భం వచ్చింది కదా అని దీని మీద రెండు నెలల కిందట విహంగలో రాసిన కాలమ్ లింకిక్కడ పేస్ట్ చేస్తున్నాను- వీలయినవారు చదువుతారేమోనన్న ఆశతో.
    http://vihanga.com/?p=17125#sthash.wH13qe8H.dpbs

  4. Krishna Veni Chari says:

    తెలుగు డిక్షనరీ పక్కన పెట్టుకుని కథో, వ్యాసమో తయారు చేసినా…
    ….కథలకి ఎప్పుడూ అవసరం పడలేదు కానీ వ్యాసాలలో టెక్నికల్ మాటల అవసరం పడినప్పుడు నేను ‘ఆంధ్రభారతి’ ని ఆశ్రయిస్తాను మరి! మరవి అలాగే అనిపిస్తున్నాయో ఏమిటో అన్న సందేహం పట్టుకుందిప్పుడు. j/k
    మన పెరటి చెట్టే కదా అని, వేపాకు పచ్చడి చేసుకుని తినలేం.———-ఇది మాత్రం పూర్తిగా నిజం.
    సయొనర…………ఇప్పుడు ఈ మాటని వాడటం లేదని తెలియదు.
    ఎన్ని పర భాషా పదాలొచ్చి చేరనీ, – మానుకోవద్దు.——–మానుకోవలిసిన అవసరమూ లేదు.
    త లా క్———–
    ————–సందర్భం వచ్చింది కదా అని దీని మీద రెండు నెలల కిందట విహంగలో రాసిన కాలమ్ లింకిక్కడ పేస్ట్ చేస్తున్నాను- వీలయినవారు చదువుతారేమోనని.
    http://vihanga.com/?p=17125#sthash.wH13qe8H.dpbs

  5. ఆర్.దమయంతి. says:

    అధిక శాతం ప్రజలు సయొనరా పదాన్ని వాడటానికి ఇష్టపడటం లేదు..అనే సమాచారం నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగించింది.
    ఆ మాట కొస్తే తెలుగులో కూడా సారికి అనే అంటాం తప్ప, మన్నించండి, మీ పెన్ తిరిగి ఇవ్వడం మర్చిపోయాను. అని ఆనం.
    సారికి, లేట్ అయింది అని అంటామే కాని,’ క్షమించండి ఆలస్యమైనందుకు’ అని అనం. ఇలా ఎన్నో తెలుగు పదాలు మాటల నుంచి తప్పుకుంటున్నట్టే కదా!
    అవసరానికి డిక్షనరికి వాడటం నేరం కాదు కాని, డిక్షనరికి పదాలను ఉపయోగించడం కోసమే, రచనలు చేయడం ఘోరం.
    నేను చెప్పాలనుకున్నది అదన్నమాట.
    ఇక – మీరు రెఫర్ చేస్తున్నట్టే నేనూ చూస్తుంటాను అన్ని రకాల నిఘంటువులను.
    మీ వ్యాసం నిన్ననే చదివానండి. చాలా బావుంది. మస్తు సమాచారాన్ని అందచేశారు. ( ఈ మస్తు అనే పదం మనది కాదు. ఏ తెలుగు ప్రాంతానికి చెందినది కాదు. కాని నాకిష్టం. ఈ మాటంటే. నా ఫ్రెండ్స్ మస్తు సార్లు మాటల్లో దొర్లిస్తుంటారు. :-) ) తెలుగులో పర భాషా పదాలు ఎలా మిళితమై మనసుని దోచుకుంటాయో ఒక చిన్న ఉదాహరణ ఇది.
    ధన్యవాదాలు.

    l

  6. అసురుడు says:

    దమయంతి గారికి ధన్యవాదాలు నా పెన్ నేమ్ నచ్చినందుకు. మారుతున్న భాషవాడకం తీరు గురించి రాశారు. వాస్తవానికి ఈ వ్యాసంపై పెద్ద ఎత్తున డిబేట్ జరగాలి. ప్రధానంగా ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. తెలుగు భాష గురించి దాని వాడకం గురించి చాలా మంచి విషయాలు చెప్పారు. అంతే కాదు సందర్భాను సారంగా మారాల్సిందే తప్పదు. ఎట్లా చూసినా మీ వ్యాసం చదివాక ఇంకో విషయం అర్థం అయింది. మనమే కాదు… మన కంటే కూడా భాషా విషయంలో ఇతర దేశాల వారు చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లుంది. అయినా ఒకే ఒక పదాన్ని తీసుకుని దానికో అద్భుతమైన పాటను జోడించి. దానిపై మంచి వివరణాత్మకంగా వ్యాసం రాశారు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీడియాలో ఇదే స్టోరి యాంగిల్ అంటాం కదా. అట్లా ఒక్క పదాన్ని తీసుకుని దాని చుట్టూ భాషను చెప్పిన తీరు బాగుంది. ఇంకా చెప్పాలంటే మస్తు రాసిండ్రు మేడమ్. కొన్ని అనువాదాలు చదివినప్పుడు… లేదా కొన్ని తెలుగు పదాలే చదివినప్పుడు ఇదేందో దాని అర్థం ఏమిటో అర్థం కాదు. పైగా పాఠకుడు దాన్ని వదిలేయడమే మంచిదని అనుకుంటాడు. అందరికీ అర్థమయ్యే పదాలు రాయాలి. అన్యభాష ఉపయోగించాల్సి వచ్చినా జనాలకు అర్థం అయితే చాలు. ఇట్లా ఆలోచించి… రాస్తున్న వారి సంఖ్య కూడా బాగా పెరుగుతున్నది కదా.
    మీ వ్యాసం చాలా చాలా బాగా ఉంది. ఒకే పదాన్ని కేంద్రంగా చేసుకుని మస్తుగ రాసిండ్రు.

  7. ఆర్.దమయంతి. says:

    మస్తు గా రాసిండ్రు.. :-) ఇలా మాట్లాడితే అది ప్రాంతీయ భాష అవుతుంది.

  8. ఇలా అంటున్నందుకు మన్నించాలి. కానీ ఇది ఆవు వ్యాసంలా ఉంది.

    ‘సయొనర, ఇక చెరిగేనా’ అని శీర్షిక పెట్టారు. వ్యాసంలో చూస్తే మొదటి మూడొంతులు వేరేదో రాసుకొచ్చారు. చివర్లో ‘టైటిల్ జస్టిఫికేషన్’ కోసం సయొనార గురించి కాస్త రాశారు!

    >> “ఇలా – మొత్తం మీద జపాన్ ప్రజలు ఎంతో పూర్వమైన ఈ పదానికి ఉద్వాసన పలికే సమయం ఆసన్నమైందనే చెప్పాలి”

    మీకు ఈ సమాచారం ఎక్కడ లభించింది?

    ఏ భాషలోనైనా కొన్ని సందర్భాల్లో మాత్రమే వాడే పదాలు చాలా ఉంటాయి. సయొనారా కూడా అలాంటిదే. తెలుగులో కూడా ‘వెళ్లొస్తా’, ‘మళ్లీ కలుద్దాం’, ‘ఇక ఉంటాను’ వంటి మాటలు వాడినంత విరివిగా ‘ఇక సెలవ్’ వంటివి వాడరెవరూ. అంటే ఆ చివరి వాడుక ఎవరికీ ఇష్టం లేదని, దానికి ఉద్వాసన పలికే సమయం ఆసన్నమైందని కాదు.

    అయినా సయొనారా క్షేమం గురించి ఆదుర్దా పడే ఆంధ్రులున్నన్నాళ్లూ ఆ పదానికేం ఫర్వేలేదు :-)

  9. ఆర్.దమయంతి. says:

    నేనే ఆవు వ్యాసం రాశానని బాధ పడుతుంటే మీరు ఆంధ్రా లో సయొనరా క్షేమం గురించి ఢోకా లేదని చెబుతున్నారు అనిల్ గారు.
    :-)
    మీ విలువైన అభిప్రాయాన్ని తెలియచేసినందుకు ధన్యవాదాలు.

  10. Venkat Suresh says:

    కధలే కాదు, వ్యాసాలు కూడా చక్కగా, ఆసక్తికరంగా రాస్తారు మీరు. చాలా బాగుంది. ఒక పదంని ఉదాహరణకి తీసుకొని, ఒక మంచి పాటని గుర్తు చేశారు . సాయనోర పదంతో ఇంకో తెలుగు పాట ఉంది. అందమైన అనుభవం అనే సినిమాలో, విశ్వనాథన్ గారు కంపోజ్ చేసిన పాట.

Leave a Reply to ari sitaramayya Cancel reply

*