చీకటీగలు-1

 

ఎప్పుడో అరవై ఏళ్ళ క్రితం నన్ను చంకనెత్తుకుని

నేడు నిర్ధాక్షిణ్యంగా దించేసి,

వెనుతిరిగి చూడకుండా

వెళ్ళిపోయిన

అమ్మ జయక్క

స్మృతికి

                                                – వేణయ్య

*******

 

 

Autumn-Fall-Leaves-HD-Wallpaper

 

 

‘అనిబద్ధమైన జీవితంలోకి అడుగుపెట్టి ప్రయాణం సాగించడానికి ధైర్యమూ, బంధరాహిత్యమూ మాత్రమే చాలవు… యంచాతనంటే బాంధవ్య రాహిత్యమన్నది ఓ పేద్ద మిథ్య. నిన్ను తగులుకు వేల్లాడే ‘నిన్ను’ వదుల్చుకోవడం జరిగేపనేనా? ‘నువ్వు’ లేని నువ్వు ఎలా వుంటావో ఊహించు. మనమన దొంగ తృప్తికోసం… నేనన్నది లేనేలేదూ… ఆత్మ రాహిత్యంతో బతుకుతున్న నన్ను చూడండి అని ఓ తెగ గొప్ప లమ్డీ మాటలు మాట్లాడొద్దు… కంట్లో చివర్న కట్టిన పుసిని చిటికెనవేల్తో తీసేసినంత సుళువుగా… కానీ పుసులే కట్టని కళ్ళుంటాయని ధైర్యంగా చెప్పగలవా? నిజం చెప్పు. ‘‘నువ్వు’’ నువ్వు అన్నదుంది కాబట్టి ‘నీదీ… నీవీ’ అన్న పల్లేరు కాయలు నీవేసుకున్న దొంగ ముసుగు బట్టలకి తగులుకుని ఎన్ని వున్నాయో… చెప్పగలవా? ‘‘సగం ఖాళీ అయిన బీడి కట్టని సగం నలిపి… ఓ కొత్త బీడీ బైటకి తీసి చూపుడువేలూ బొటనవేలూ మజ్జెన్నలిపి… ‘నీయమ్మ యిదీ నాలాగే’ అని నాలుగువేళ్లూ బొటనవేలూ మధ్యకు ఆ లొత్త బీడీని జార్చి విరిచి విసిరేసి ‘‘యంతసేపైందీ యీ ముండ రంగరాజుల్గాడెళ్ళీ నా నాలుక నేనే మింగేట్టున్నా… యిచ్చావా వాడికి డబ్బూ?’’ పక్కనలేని భుజమ్మీదున్న మాసి దారాలు వేల్లాడ్తోన్న తువ్వాలనబడే తుండుకోసం తడుంకుంటూ… ఎడం చేతి మడమతో తడారిన పెదాల్ని రుద్దుకుంటూ నన్ను చూశాడు శ్రీమన్నారాయణ.  బైటి బహుళ పక్షపు మెత్తటి చీకటి… గదిలో నీరసంగా వెలుగుతోన్న నలభై క్యాండిళ్ళ బల్బు పచ్చటి నీరసకాంతిని నిర్లక్ష్యం చేసి లోపలికి తన్నుకొచ్చేస్తోంది….

‘‘ఇచ్చావ్కదా?’’ రెట్టించాడు శ్రీమన్నారాయణ…

‘‘ఇచ్చా… వెళ్ళాడు కదా నీ ముందే…. మిరబ్బజ్జీలు తెమ్మన్నావ్‌ వాణ్ణి. చెక్‌పోస్ట్‌ దగ్గరికెళ్ళాలి గదా వాడూ… వచ్చేస్తాడు… చెప్పు… ఈ రోజున మృచ్ఛకటికం గురించి చెప్తానన్నావ్‌ మొదలుపెట్టూ….’’ కూచున్న చాప పిర్ర కింద నించీ జారుతూ మడతలు పడ్తూంటే ముడ్డి గాల్లోకి లేపి చాపముడతల్ని సరిచేసుకొంటూ అన్నా….

‘‘చెప్తా చెప్తా…. గొంతు తడి చేసుకోనీ… అదీకాక కంఠం రాలేదు ఆ పిల్ల మైత్రీ… దాని మొగుడు కూడా రానివ్వూ…. ఆ పిల్ల పాటినాలి ముందు… ఏం గొంతు ఏంగొంతూ… వోడ్కాలోకి తేనె చుక్కా నిమ్మచుక్కా అయిసుపిండి వేసుకు చప్పరించినట్టు. వస్తుందంటావా?’’ క్రష్డ్‌ ఐస్‌ను ‘అయిసుపిండి’ అంటాడతను.. సందులోకి చప్పడుగా అనిపించింది….  సైకిలు స్టాండ్‌ వేసిన్చప్పుడు రంగరాజులే…

బైటి చీకటి బూజున్దులుపుకుంటూ ‘‘నీయమ్మ లంజకొడుకు దొంగ లంజకొడుకు’’ అంటూ….

వాడికంటే ముందు తెగ కాల్చిన నూనెలో కాలిన శెనగపిండి మిరపకాయ పరిమళం.

నీలం రంగు అతి పల్చటి ప్లాస్టిక్సంచీని లోపలి గాజు శబ్దంతో నిశ్శబ్దంగా పెట్టే ప్రయత్నంతో కూచోబోతూ మళ్ళీ ‘‘లంజకొడుకులు… వీళ్ల…’’ అని మిగిలిన తిట్టు మింగేస్తూ అన్నాడు.

‘‘ఎవర్నిరా అంత పరిమళ భరితంగా తిడ్తూన్నావూ…’’?  శ్రీమన్నారాయణ ‘‘సుభాన్గాడి చీకుల బండినా…. పూర్తి రోడ్డునిండా బండ్లే… సందు తిరిగే దానికేల్యా… ఎవున్దో బండికి నా ఫెడల్తగిలి పడిపాయ…. వాడు రోడ్డుకడ్డం పెట్టింది గాక నా మిందికొచ్చి… వానెమ్మ యాడ మందు సీసాలు పగుల్తాయోనని గమ్మునొచ్చేస్తి’’ రంగరాజులు యింకా నాకపరిచితుడయిన వ్యక్తితో దెబ్బలాడ్తూనే వున్నాడు. శ్రీమన్నారాయణ రేకు గదిలో చాప మీద కూచుని… ఆ సంఘటన చెరిగిపోడానికి రంగరాజు మెదడు మీద యింకో యింతే బలమయిన సంఘటన బొమ్మ పరుచుకోవాలి…. రంగరాజుల్వేపు చూసా..

మిడిగుడ్లు… యింకా బైటి వాడెవడినో కసిగా చూస్తూ తెగిన తమ్మెతో కుడి చెవి పెద్దగా… మీద నూనె కార్తోన్న ఉంగరాల జుత్తు….

బండముక్కు కొసన నల్లటి శెనగబద్దంత పులిపిరి…

నున్నగా గొరిగేసిన మూతి…

వెడల్పాటి గెడ్డం మజ్జెన గుంట….

సగం నెరిసిన మూడ్రోజు గెడ్డమ్మీసాలు…

వ్యాకరణబద్ధ పజ్జ్యాల మీద మక్కువ చావని రంగరాజు. ‘‘దో మాండ్‌లో పాడ్తాన్నా… దీనికి మాండేన్నా… శ్రీలో పాడ్తారు గానీ మాండ్‌లో వుంటే జారుడు శ్రీకిరాదునా… మజాన్నా… రంగరాజ మకుటంతో రాశ్నా యినూ…’’

యాస ఒకటీ సాహిత్య భాషొకటీ… రంగరాజు

ఇంకా రోడ్డుమీద జరిగిన సంగటన్ని తల్చుకుంటూ బూతు గొణుక్కుంటూ…

‘‘ఈ రోజు ఫుల్‌ బెంచి వుండేట్టు లేదుగానీ మొదలు పెట్టుమరీ’’ శ్రీ మన్నారాయణ వేపు చూస్తూ అన్నా… మందూ… ప్రసంగం రెండూ అన్నట్టు…

చిన్నగా నవ్వి ‘‘మందుతో ఫరీదా ఖానుమ్‌ని నంచుకున్న మజా యీ మిరబ్బజ్జీల్తో రాదుగాక రాదు… ఆపిల్ల మైత్రొస్తుందేమోనన్చూస్తున్నా యింకా యేడూ యాభైయ్యేకదా… ఆగుదాం ఓ పదినిమిషాలు,… రంగరాజా! యింతలో ఓ పజ్జెమెత్తుకోగూడదా’’ శ్రీమన్నారాయణ…

ప్లాస్టిక్సంచీలోంచీ గాజుకుప్పెల్లో బందీ అయిన మత్తును జాగ్రత్తగా బైటికి తీసి చాపమీద పడిపోకుండా బ్యాలెన్స్‌ చేస్తూ రంగరాజు ‘‘నీయమ్మ యిప్పుడివి నిలబడవు తాగినెంక మనల్ని నిలబన్నీవు ఏం బోసింటారో ఆనాకొడ్కులు దీన్ల.. అవునా చెప్పు’’ అన్నవ్వుతూ మిరబ్బజ్జీ పొట్లం విప్పి వాటి పరిమళానికి మరింత విడుదల ప్రకటించాడు…. దానిక్కట్టిన దారాన్ని మూడు ఎడం చేతి వేళ్ళకి చుట్టుకుంటూ… పొట్లం పేజీని ముడతలు సాపుచేస్తూ చదవడానికి ప్రయత్నం చేస్తూండగా ‘‘సారీ సార్‌ లేటయింది పాపను ట్యూషన్నించీ తీసుకొచ్చేసరికి అదీగాక మళ్ళీ ఇంటి దగ్గర మోపెడ్‌ స్టార్ట్‌ కాలే… పెళ్ళాం దొబ్బులు వదిలించేసీ. హిహ్హిహ్హీ నేనేసేది కాకీ అంగీ నన్నేసేది కనకాంగి నా పెళ్ళాం. ఆటో… వాడు కూడా చౌరస్తాలో దింపేసి వెళ్ళాడు షేరాటో’’ ముక్కలు ముక్కలుగా క్షమాపణలనేవి విసిరేసి నీలకంఠమూర్తి… బజ్జీలు సర్దుతోన్న రంగరాజు భుజమ్మీద చెయ్యేసి ‘‘వచ్చేసిందా సింగారి ముండా’’ అంటూ రెండు సీసాల్లో పెద్ద సీసా హాఫ్‌ని నిమిరి వేళ్ళు పెదాలకానించుకుని ముద్దాడాడు… గోడకానుకుని కూచుని ‘‘ఎవర్దీ యీ రోజు బిల్లూ మీదేనా?’’ అని నా వేపు చూసి నవ్వి… చొక్కా జేబులో చెయ్యిపెట్టి వేళ్ళతో తడుంతూ ఓ వందా ఆనొక యాభై బైటికి లాగి రంగరాజుల్కేస్చూసి ‘‘రాజా యింకో హస్తముంటేగానీ సభ సాగదుగానీ నువ్వెళ్తావా, నన్నే వెళ్ళమంటావా?’’ అడిగాడు.

రంగరాజులేమో అనేంతలో శ్రీమన్నారాయణ ‘‘ముందిది కానిద్దాం, ఓ పన్జేయండి’’ అంటూ మూసిన దిండుకి జారగిలి పక్కన తడుంకున్నాడు మాసిన తుండుకోసం… యీ మాటది భుజానున్నట్టు గ్రహించి… దాంతో ఎండిన పెదాలు తుడుచుకున్నాడు.

‘‘సార్‌ మన కాలే గార్కి పెరాల్సిస్సట సార్‌. మజ్జానం మా దయానంద్‌ చెప్పాడు.. ఏంధన్చేస్తాడు సార్‌ పాటల్ని…! ఎయిర్‌లో గ్రేడ్‌ వన్‌ ఆర్టిస్ట్‌గా మిగిలాడు గానీ,

‘రమ్మంటె చాలుగానీ…రాజ్యాలు గడిచిరానా’ ఏం ట్యూనండీ మేష్టారూ.. బ్‌బ్బా… హార్మోనియం మెట్ల మీద ఏమి కదుల్తాయీ ఆయన వేళ్ళు… అద్దమ్మీద పాదరసం పారినట్లే కదండీ… మాటకూడా ముద్దముద్దగా వస్తోందట సార్‌… ప్చ్’’ కంఠం పెద్ద నిట్టూర్పుతో అన్నాడు….

శ్రీమన్నారాయణ సగం బీడీ కట్ట నలుపుతూ యింకో బీడీ తీసి దాని తలన్నలిపి ‘ఫూ’ అనూపి కొరికినట్టు నోట్లో పెట్టుకుని దవడలు లొట్టలు పడేట్టు పీలుస్తూ అంటించుకుని దాని పొగకు ఎడం కన్ను చిన్నగ చేసి కుడి కన్ను కంఠం వేపు తిప్పి. ‘‘ఏం సాధించాడు లే… కనీసం ఆత్మతృప్తైనా మిగుల్చుకున్నాడా? ఏం జీవితాలు మనవి…. మన కోసం మనం కాక అంటించుకున్న అందరికోసం బతుకుతూ లమ్డీ అని దొంగలమ్డీ బతుకు ఛీఁ’’ అన్నాడు.

‘‘అవన్నా సూరజేర్‌ చందాలోది రఫీసాబ్‌ భలే పాన్నాడు. నందకౌస్‌ రాగమన్నా కాలేసార్‌ కూడా చెప్నాడు. ఆ పాట ఆ రాగంలోనే చేస్నా అనీ తెరేనామ్‌కా దివానా తెరె ఘర్‌కు ఢూండ్‌తాహూ’’ నాలుగు పదాలు పాడాడు రంగరాజు.

‘‘నీ మాటకీ పజ్జానికీ పాటకీ యోజనా దూరం రాజా’’ రంగరాజు భుజం తడుతూ అన్నాడు నీలకంఠం….

ల్యా ఎత్తుకునేది ఎత్తుకునేది సమ్మసరిగా అట్టనే చూడు…

రమ్మంటే చాలుగాని…రాజ్యాలు గడచి కాదనా… విడిచి… విడిచిరానా… దాశరది సార్‌ పజ్యమన్నా… అదే పాట, పాటనాలేమోగదా… రఫీసాబ్‌ పాటింటిరా..

తేరే నామ్‌కా దివానా తేరే ఘర్‌కొ ఢూంఢ్‌ తాహై… జబ్బర్దస్త్‌ పాటనా’’

‘‘ఊఁ’’ అంటూ హమ్‌ చేస్తూ పెద్ద సీసా మూత తీడానికి ప్రయత్నిస్తూ రంగరాజు… ఆ మూత రాక తిరుగుతునేవుంది… ‘‘థూత్‌ దీనెమ్మ’’ మళ్ళీ రంగరాజు బూతు.

‘‘ఇట్లాతే రాజా’’ అంటూ ఆ సీసాను దాదాపు లాక్కుని, మూతని పళ్ళ మధ్య కరిచిపట్టుకుని పటపట శబ్దం చేస్తూండగా మూతను లాగేశాడు నీలకంఠం. నాలుగైదు చుక్కలు ఒలికి కారింది విస్కీ…. రూమంతా ఒక్కసారి వాసన కమ్మింది.

శ్రీమన్నారాయణ బీడీపొగ

మిరబ్బజ్జీ ఘాటూ…

విస్కీవాసనా…

గది ముక్కవాసనా కలసి కాక్‌టెయిలయి…

శ్రీమన్నారాయణ ఫోను ‘కుయ్‌’ మంది. మెసేజ్‌ అయివుంటుంది… డిస్ల్పేనిండా సర్రియలిస్టిక్‌ ఆర్ట్‌లాగా గీతలు…

కీ ప్యాడ్‌ మీది కీస్‌ తీవ్ర వాడకంతో అరిగిపోయి సగం సగం అక్షరాలూ అంకెలూ కనబడ్తూ ఏదో పురా నాగరిక లిపిలాగా… కీస్‌ మధ్య పేరుకున్న మట్టితో… అది పన్జేస్తూన్న ఫోనంటే ఆశ్చర్యం కలిగేలా… మేసేజ్‌ని కళ్ళు చిన్నవి చేసి చదూకొంటున్న శ్రీమన్నారాయణ… అతన్దగ్గరున్న పెద్ద ఫోను దాచుకోడం చూసాన్నేను…

‘‘ఫ్చ్‌ మైత్రి రాటంలేదుట…. ఈ రోజు ఫరీదా ఘజల్‌ ‘ఆజ్‌ జానేకి జిద్‌ నాకరో’ లేనట్టనమాట… మిరబ్బజ్జీలే నంజుడుకు కానిద్దాం’’

చాలా గొప్ప నిరాశ అతని గొంతుకలో…

ఆ అమ్మాయి మైత్రికీ ఈనకీ పాతికేళ్ళ వ్యత్యాసం… వాళ్ళ మధ్య వున్న సంబంధమెలాంటిదో ఊహించడం కష్టం…

ఆ అమ్మాయి వచ్చీరాంగానే యీన మెడచుట్టూ చేతులేసి గట్టిగా కౌగిలించుకుంటుంది…. అందరి ముందూ భర్తముందు కూడా…

అప్పుడు శ్రీమన్నారాయణ కళ్ళలో మెగు చూడాలి. అచ్చు ఓ కుర్రాళ్ళా అనిపిస్తాడు..

మైత్రి భర్త దాసు ఓ సెల్ఫ్‌సర్వీసు క్యాంటీను నడుపుతూ ఓ మూడు ఆటోలూ ఓ కారూ అద్దెకు తిప్పుతుంటాడు… ఆ అమ్మాయి ఓపెన్లో తెలుగెమ్యే చేస్తోంది.

నల్లగా వున్నా పెద్దపెద్ద కళ్ళతో… నున్నటి శరీరంతో తలనిండా వెంట్రుకల్తో అన్నింటికన్నా అతి ముఖ్యమైన కమ్మని కంఠంతో… అందగత్తెల్లోకే లెక్క…

ఈ భార్యాభర్తలకి శ్రీమన్నారాయణ పరిచయమెట్లా అయ్యిందో నాకు చూచాయిగా తెలుసంతే… మైత్రి మరాఠీ అమ్మాయి. ఇక్కడే చదివింది. శ్రీమన్నారాయణ తనకు తెలుగు చెబుతాడు. దాసుకు గూడా శ్రీమన్నారాయణ మాటలంటే యిష్టంలాగే కనబడుతుంది.

 

(మళ్ళీ  వచ్చే  వారం)

కాశీభట్ల వేణుగోపాల్ @9550079473

మీ మాటలు

  1. కె.కె. రామయ్య says:

    అమ్మ జయక్క గారి వేణయ్యా! మీ భావనా భావానలలో పడి దగ్ధ పునీతం కావడానికి మీ దీప శలభాలు ఎల్లప్పుడూ సిద్దమే. ‘ఆజ్‌ జానే కి జిద్‌ నాకరో’.

మీ మాటలు

*