క్యాంపస్

rafi1

Art: Rafi Haque

 

-ప్రసాద మూర్తి

~

 

మా పక్కనే క్యాంపస్ ప్రవహిస్తుంది

దాని పక్కనే మేం శిలల్లా నిద్రిస్తాము

అప్పుడప్పుడూ

కలలు మోయనంతగా రెప్పలు బరువెక్కినప్పుడు

రెక్కల గుర్రాలను చూడాలని

క్యాపంస్ కి వెళతాను

దేహమంతా రంగుల అద్దాలు అతికించుకుని

లోపల రక్తాన్నితిరగమోత పెట్టుకుంటాను

అప్పుడు క్యాంపస్ నా వీపు మీద

గాఢమైన ముద్దు పెడుతుంది

అది ఛాతీ మీద ముద్రగా బయటకొస్తుంది

 

యూనివర్సిటీనీ సముద్రాన్నీ

అటూ ఇటూ రెండు చేతులతో పట్టుకుని

విశాఖ వియత్తలం మీద

విహరించిన విరగబాటు

ఘాటుగా నరాల్లో కమ్ముకున్నాక

కూర్చుంటాను కుదుటపడతాను

క్రిక్కిరిసిన చుక్కలతో పగలూ రేయీ

పాటలు పాడే ఆకాశంలా క్యాంపస్ పక్కనే వుందని కాని

ఈ కాళ్ళకింద ఇన్ని నదులెలా కదులుతాయి మరి

 

ఇప్పుడు క్యాంపస్ లో పక్షులు

పాటలు మానేసి

దేశభక్తి పరీక్షలు రాస్తున్నాయి

చెట్లు కూడా చప్పుడు చేయకుండా

గాలి చెవిలో జాతీయ  గీతాలు పాడుతున్నాయి

జీవన్మరణ పాకుడురాళ్ళ మీద

ఒక చూపుడు వేలు ఆజాదీ గీత రచన చేస్తోంది

చుక్కల్ని వెదుక్కుంటూ ఎటో వెళ్ళిపోయిన యువకుడు

అప్పుడప్పుడూ గాల్లో వేల నీడలుగా పరుగులు పెడుతూ

ఫకాలుమని నవ్వుతున్నాడు

కలం కుత్తుకల మీద కత్తులు నాట్యాలు చేస్తున్నాయి

క్రొన్నెత్తుటి కోనేటిలో మొసళ్ళు మసలుతున్నాయి

 

అక్కడ  నీలి ఆకాశాలూ ఎర్రసముద్రాలూ

అలాయ్ బలాయ్ ఆడుకుంటున్నాయని ఆనందపడతాను

మరిప్పుడు  ఊరి నుండి క్యాంపస్ దాకా

వెలివాడ కారిడార్ పరచిన ఆధునిక మనుహాసం  భయపెడుతుంది

 

పుస్తకాలు పట్టుకోవాల్సిన క్యాంపస్

ఇప్పుడు ఆయుధాలు పట్టుకుంటే

జీవితాన్ని పట్టుకుని ఇలా ఎలా వేలాడగలం?

——————-  ——————

( హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే మేం వుండేది)

మీ మాటలు

 1. P.Srinivas Goud says:

  Good poem prasad Murthy garu

 2. ర‌వి బ‌డుగు says:

  క్రిక్కిరిసిన చుక్కలతో పగలూ రేయీ
  పాటలు పాడే ఆకాశంలా క్యాంపస్.. క‌విత చాలా బాగుంది.

 3. Aruna.Gogulamandaa says:

  వండర్ఫుల్ సర్, కేంపస్ గురించిన ఏ సంగతైనా మనసుని మెలిపెడుతుంది.హెచ్సీయూ లోని ఈ నాటి పరిస్థితి ని ఆలోచింపజేసేలా కవిత్వీకరించారు..ధన్యవాదాలు .

 4. Aruna.Gogulamandaa says:

  వండర్ఫుల్ సర్, కేంపస్ గురించిన ఏ సంగతైనా మనసుని మెలిపెడుతుంది.హెచ్సీయూ లోని ఈ నాటి పరిస్థితి ని ఆలోచింపజేసేలా కవిత్వీకరించారు..ధన్యవాదాలు .

 5. కె.కె. రామయ్య says:

  “జీవన్మరణ పాకుడురాళ్ళ మీద ఆజాదీ గీత రచన చేస్తోన్న” ఈ కన్హయ్య కుమార్ లు, “చుక్కల్ని వెదుక్కుంటూ ఎటో వెళ్ళిపోయిన” ఈ రోహిత్ వేములలు … దేశ అంతరాత్మకు మేలుకొలుపు పాడిన వారి స్ఫూర్తిని చక్కగా కవిత్వీకరించారు..ధన్యవాదాలు.

మీ మాటలు

*