బ‌తుకుపాట‌ల జాడ‌..మ‌న గూడ‌

 

g1

                    -డా.ప‌సునూరి ర‌వీంద‌ర్‌

~

“నేను మీ చ‌ప్ప‌ట్ల కోసం పాడ‌టం లేదు

నేను మీ అభినంద‌న‌ల కోసమూ పాడ‌టం లేదు

నేను నా దేశ స్వాతంత్య్రం కోసం పాడుతున్నాను” అన్నాడు చీలీ దేశ ప్ర‌జాగాయ‌కుడు విక్ట‌ర్ జారా. స‌రిగ్గా అంత‌టి ప్ర‌జావాగ్గేయ‌కారుడు గూడా అంజ‌య్య‌. ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌లిగించే ఉద్య‌మాల‌కోసం పాట‌ల ప‌హారా కాసిన క‌న్ను గూడ అంజ‌య్య‌. తెలుగు స‌మాజానికి సుప‌రిచ‌త‌మైన ప్ర‌జార‌చ‌యిత‌ గూడ అంజ‌య్య‌. ఆయ‌న పాట‌ల‌న్ని గురిచూసి గుండెల్ని తాకే చూపున్న పాట‌లు. ఆయ‌న పాట పాడుతున్నా, వింటున్న ఈ దేశంలో తిండి, బ‌ట్ట‌, నీడ‌కు అల్లాడే పేద‌ల దుఃఖం ఒక దృశ్య‌కావ్య‌మై మ‌న‌ల్ని క‌దిలిస్తది. రోమాలు నిక్క‌బొడుచుకునేలా చేసే నెత్తుర‌సొంటి శ‌క్తి అంజ‌న్న పాట‌ల‌ది. అవి ఉద్య‌మాల్ని ర‌గిలించి మండించి, పేద ప్ర‌జ‌ల వేద‌న‌ల్ని, అంట‌రానివాళ్ల సంవేద‌న‌ల్ని అర్థం చేయిస్తాయి. దోపిడి కోట‌ల్ని కూల్చ‌డానికి, బ‌డుగుజీవుల‌కు స‌రికొత్త శ‌క్తిని నూరిపోస్తాయి.

 

పాట రాయాలంటే, మిగిలిన ర‌చ‌యిత‌ల లాగ ఆయ‌న పుస్త‌కాల్లోకి తొంగిచూడ‌డు. ప్ర‌జ‌ల మ‌ధ్య‌లోకి పోయి, వారితో మాట్లాడి, వారి బాధ‌ల‌ను ప‌ల్ల‌వులుగా, వారి క‌ష్టాల‌ను చ‌ర‌ణాలుగా మ‌లుస్తాడు. అందుకే గూడా అంజ‌య్య పాట‌లు మ‌న‌లో ఒక తాత్విక చ‌ర్చ‌ను రేపుతాయి. అల‌తి అల‌తి ప‌దాల‌తో బ‌తుకును స‌జీవంగా కండ్ల‌ముందుంచ‌డం, ఆ జీవితాలు అలా ఎందుకు అయ్యాయో విడ‌మ‌రిచి చెప్ప‌డం అత‌ని పాట‌ల ల‌క్ష‌ణం. అందుకే బ‌తుకును పాట‌ల‌కు ఒంపిన జాడ మ‌న గూడ‌.

 

నాలుగు ద‌శాబ్దాలుగా తెలుగు నేల మీద అంజ‌య్య పాట‌లు ఉద్య‌మాల‌కు  ఊపిరిపోశాయి. ఒక్క ఉద్య‌మంలో పాల్గొంటేనో, ప‌నిచేస్తేనో ఒక మ‌నిషి జీవితకాలం పూర్త‌వుతుంది. కొన్నిసార్లు ఆ ఉద్య‌మం గ‌మ్యానికి చేరుకోక ముందే ఉద్య‌మ‌కారుడు అల‌సిపోవ‌డమో, అందులోనుండి నిష్క్ర‌మించ‌డమో జ‌రుగుతుంది. అలాంటిది గూడా అంజ‌య్య మాత్రం త‌న ప‌ద‌హార‌వ‌యేట‌నే విప్ల‌వోద్య‌మంలో అడుగు పెట్టి, అందులో అనేక పాట‌లు రాసి పాడి, ప్ర‌జ‌ల మ‌ధ్య, జీవితాన్ని ఆరంభించాడు. అలా విప్ల‌వోద్య‌మమే కాదు తెలుగునేల మీద పుట్టిన ద‌ళితోద్య‌మంలో త‌న వంతు పాత్ర‌ను పోషించాడు. రెండు ఉద్య‌మాల్లో ప‌నిచేసినా స‌రే త‌ను అల‌సి పోలేదు. ప్ర‌పంచం త‌ల‌తిప్పి చూసిన మ‌హ‌త్త‌ర తెలంగాణ ఉద్య‌మంలో కూడా త‌న‌దైన పాత్ర‌ను విజ‌య‌వంతంగా పోషించాడు. తెలంగాణ ప్ర‌జ‌ల విముక్తి కోసం కూడా సిద్ధ‌మై ప‌దునైన పాట‌ల‌నందించాడు. ఇలా అనేక ఉద్య‌మాల్లో ముందుండి ప‌నిచేసిన ఘ‌న‌త గూడ అంజ‌య్య‌దే.

 

నిత్యం పోరాటాల‌తో అల‌రారే తెలంగాణ నేల మీద అనేక మంది వాగ్గేయ‌కారుల‌న్నారు. వారంద‌రిలో గూడా అంజ‌య్య పాట‌ది ప్ర‌త్యేక‌మైన శైలి. ప్ర‌జ‌ల ప‌దాల‌తో పాట‌గ‌ట్టి, చ‌దువురాని మ‌ట్టిబిడ్డ‌ల‌కు సైతం క‌మ్యూనిజాన్ని అలవోక అర్థం చేయించింది. అలా పుట్టుకొచ్చిందే ఊరు మ‌న‌దిరా…ఈ వాడ మ‌న‌దిరా పాట‌. నిజానికి ఈ పాట క‌మ్యూనిస్టు మ్యానిఫెస్టో ఏం చెబుతున్న‌దో, స్థానిక ప‌రిస్థితుల‌కు సుల‌భంగా అన్వ‌యం చేశాడు అంజ‌య్య‌. ఉద్య‌మాల‌కు పాట‌ల‌ను అందించింది ద‌ళితులే. అలా ద‌ళితునిగా పుట్టిన అంజ‌య్య భార‌త‌దేశ గ్రామీణ స్వ‌రూపాన్ని స‌రిగా ప‌ట్టుకున్నాడు. ఊరిలో చాలా కులాలు శ్రామిక కులాలే. అగ్ర‌వ‌ర్ణాలే భూస్వాములుగా పెత్త‌నం చేస్తుండ‌డం అంజ‌య్య‌ను క‌ల‌వ‌ర ప‌ర‌చింది. విప్ల‌వోద్య‌మం ప్ర‌జ‌ల‌కు అర్థం కావాలంటే ఈ దోపిడిని విడ‌మ‌రిచి చెప్పాల‌ని భావించాడు. అందుకే ఊరు మ‌న‌దే, వాడా మ‌న‌దే…న‌డుమ దొరా ఏందిరో, వాని పీకుడేందిరో అని ఘాటుగానే నిల‌దీశాడు అంజ‌య్య‌. అదే ప్ర‌జ‌ల‌కు న‌చ్చింది. అది తెలంగాణ ప్ర‌జ‌ల్లో ర‌గులుతున్న భావ‌న‌. ఆ భావ‌న‌కు పాట‌రూప‌మిచ్చాడు అంజ‌య్య‌.

 

ఈ పాట విన్న మ‌ట్టిబిడ్డ‌లు ఇది నా పాటే. ఇది మా ఊరి చ‌రిత్రే అని ఓనే చేసుకున్నారు. ప్ర‌జ‌ల నాలుక‌ల మీద ఈ పాట ద‌శాబ్దాల కాలం న‌డ‌యాడింది. ఈ పాట‌లో అంజ‌య్య‌లోని ద‌ళిత‌త‌త్వం కూడా పాట‌కు మ‌రింత అద‌న‌పు అందాన్ని తెచ్చింది. అన్ని ప‌నుల కాడ ముందుండే ద‌ళితుల జీవితం ఎందుకిట్ల కూన‌రిల్లుతున్న‌ది. ఏ ప‌నిచేయ‌ని ప‌టేల్‌, ప‌ట్వారి దొర‌లు ఎలా కూర్చుండి తింటున్నార‌నే చ‌ర్చ‌ను ముందుకు తెచ్చింది.

గూడ అంజ‌య్య తొలిపాట “ఊరిడిసి నేబోదునా…అయ్యో ఉరిపెట్టుకొని స‌ద్దునా”.  ఈ పాట‌కూడా గ్రామాల్లో దొర‌ల దాష్టికాన్ని బ‌ట్ట‌బ‌య‌లు చేసింది. రైతుల‌కు అప్పులిచ్చి పంట‌లు జ‌ప్తు చేసే దొర‌ల దుర్మార్గాల‌కు బ‌లై, ఊరిడిసి వ‌ల‌స‌పోయే ఓ పేద‌రైతు బాధ‌ను పాటీక‌రించాడు అంజ‌య్య‌.

 

ఈ పాట‌లో రైతు బాధ‌ను ఉన్న‌ది ఉన్న‌ట్టుగా, త‌న‌ను ప‌ల‌క‌రిస్తే వ‌ల‌పోసే తీరును స‌రిగా ప‌ట్టుకున్నాడు ర‌చ‌యిత‌. అందుకే అప్పుతెచ్చిన మాట‌నిజ‌మే. అది వ‌డ్డీకి తెచ్చింది నిజ‌మే అంటాడు. ఈ పాట‌తో మొద‌లైన అంజ‌య్య ప్ర‌స్థానం విప్ల‌వోద్య‌మం మీదుగా ద‌ళిత‌, తెలంగాణ ఉద్య‌మాల‌ను చేరి మ‌రింత ప‌దునెక్కింది. గూడా అంజ‌య్య పాట‌ల్లో బాణీలు కఠినంగా ఉండ‌వు. సామాన్యుడు సైతం, కోర‌స్‌గా గొంతుక‌లిపే విధంగా ఉంటాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్ర‌జ‌ల బాణీల‌ను తీసుకొని, ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను వ‌స్తువుగా జ‌త‌చేసిన  బండియాద‌గిరి, సుద్ధాల హ‌నుమంతుల‌కు వార‌సుడు గూడ అంజ‌య్య‌. అందుకే వారి బాట‌లోనే వారిలాగే ప్రాణ‌మున్న పాట‌ల‌ను ర‌చించాడు. పాట‌కు త‌గిన బాణి, భావానికి త‌గిన ప‌దాల పొందిక‌, అందులో అంజ‌య్య జాగ్ర‌త్త‌గా ఇమిడ్చే ప్ర‌జ‌ల నుడికారాలు, సామెత‌లు పాట‌ను శ‌క్తివంతంగా తీర్చిదిద్దుతాయి.

తొంభ‌య‌వ ద‌శ‌కంలో తెలుగునేల మీద ద‌ళితోద్య‌మం పుట్టింది. ఆ ఉద్య‌మంలో కూడా అంజ‌య్య ముందున‌డిచాడు.

 

“ద‌ళిత ర‌చ‌యిత‌ల క‌ళాకారుల మేధావుల ఐక్య‌వేదిక” ఏర్పాటుకు 1992లోనే పునాది వేశాడు. కంచిక‌చ‌ర్ల‌ల‌లో ద‌ళితుడైన కోటేశును స‌జీవ‌ద‌హ‌నం చేసిన‌పుడు అంజ‌య్య ఆ దారుణం మీద పాట రాశాడు. అప్ప‌టిదాకా పాట‌లు మాత్ర‌మే రాసిన అంజ‌య్య‌, ద‌ళితోద్య‌మంలో ప‌నిచేసే క్ర‌మంలోనే సాహిత్యంలోనే మిగిలిన ప్ర‌క్రియ‌ల వైపు మ‌ర‌లాడు. అంబేద్క‌రిజం ప‌రిచ‌య‌మ‌య్యాక అంజ‌న్న‌కు సాహిత్య ప్ర‌క్రియ‌ల‌తో మ‌రింత ప‌రిచ‌యం ఏర్ప‌డ్డ‌ది. ద‌ళిత‌క‌థ‌లు రాసి పుస్త‌కం వెలువ‌రించాడు. అలాగే “పొలిమేర‌లు” అనే న‌వ‌ల రాసి, తెలుగు విశ్వ‌విద్యాల‌యం చేత‌, ఆ యేటి ఉత్త‌మ న‌వ‌లగా అవార్డు కూడా అందుకున్నాడు. ఇది అంజ‌య్య‌లో మాత్ర‌మే ఉన్న ప్ర‌త్యేక ల‌క్ష‌ణం. వాగ్గేయ‌కారులంతా పాట‌ల ర‌చ‌న‌వ‌ర‌కే ప‌రిమిత‌మ‌వుతారు. అంజ‌య్య మాత్రం ఉద్య‌మ అవ‌స‌రాల్లో భాగంగా, ద‌ర‌క‌మే సాన్నిహిత్యంతో క‌థ‌కునిగా, న‌వ‌లాకారునిగా మారాడు.

 

తెలంగాణ ఉద్య‌మానికి పాటే ప్రాణం పోసింది. క‌నిపించ‌ని శ‌త్రువును, కాటేసే కుట్ర‌ల‌ను కండ్ల‌ముందుంచింది పాటే. తెలంగాణ ఉద్య‌మం అర‌వైతొమ్మిదిలో పాల‌కుల చేతిలో ద‌గాకాబ‌డి మ‌ళ్లీ 90ల త‌ర్వాత పుంజుకోవ‌డానికి పాటే ఆయుధంగా నిలిచింది. అలాంటి స‌మ‌యంలో గూడా అంజ‌య్య ర‌చించిన అనేక పాట‌లు తెలంగాణ ఉద్య‌మాన్ని ప‌ల్లెప‌ల్లెకు చేర్చాయి. “నా తెలంగాణ…న‌నుగ‌న్న నా త‌ల్లి నా తెలంగాణ” అంటూ పాట‌రాశాడు.  అది మొద‌లుగా తెలంగాణ ఉద్య‌మం కోసం అంజ‌న్న రాసిన పాట‌ల్లో పుడితె ఒక‌టి స‌త్తెరెండు రాజ‌న్న ఒరె రాజ‌న్న అన్న పాట సుమారు ద‌శాబ్దంన్న‌ర కాలం పాటు తెలంగాణ ప‌దిజిల్లాలో మార్మొగింది. ప్ర‌జ‌ల‌ను ఉర్రూత‌లూగించే ఈ పాట బాణీ, ఉద్య‌మానికి జ‌వ‌జీవాల‌నిచ్చింది.

 

అంజ‌న్న ఈ పాట‌లో ఉద‌హ‌రించిన ఊర్ల‌పేర్లు, వ్య‌క్తుల పేర్లు తెలంగాణ‌లో బాగా పాపుల‌ర్‌వే కావ‌డం మ‌రింత ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించింది. ఈ పాట‌లో తెలంగాణ ఉద్య‌మానికి ఒక దిశానిర్ధేశం చేశాడు. తెలంగాణ రాదేమో అని నిరాశ చెందేవారికి గొప్ప ధైర్యాన్నిచ్చిండు. బ‌రిగీసి బ‌డితందుకోర రాజ‌న్న ఒరె రాజ‌న్న‌, తెలంగాణ రాకుంటె ఒట్టు రాజ‌న్న మా రాజ‌న్న అంటూ ఈ పోరాటం వృధాపోదు, తెలంగాణ వ‌చ్చి తీరుతుంద‌ని ధీమాను వ్య‌క్తం చేశాడు. ధూంధాం వేదిక‌ల మీద ఈ పాటొక ఫిరంగిలా పేలింది.

ఆక‌లిపోరాటం మాత్ర‌మే కాదు, తెలంగాణ ఉద్య‌మంలో ఆత్మ‌గౌర‌వ స‌మ‌స్య కూడా ఇమిడి ఉంది. అందుకే గూడ అంజ‌య్య పాట‌లో ఆ ఆరాటం ప్ర‌తిధ్వ‌నించింది. తెలంగాణ ప్ర‌జ‌ల యాస‌ను బాస‌ను కించేప‌రిచిన వారిని నిల‌బెట్టి క‌డిగిపాడేసాడు. “అయ్యోనివా నువ్ అవ్వోనివా…” అనే పాట‌లో ఆంధ్రాపెట్టుబ‌డిదారులను నిల‌దీశాడు. అంతేకాదు వారిని తెలంగాణ కోసం ఏం చేశార‌ని ప్ర‌శ్నించాడు. “చార్మినారుకు సున్న‌మేసిన‌వా…గోలుకొండ‌కు రాళ్లు మోసిన‌వా” అంటూ అంజ‌న్న తెలంగాణ ప్ర‌జ‌ల ఆవేద‌నకు పాట రూప‌మిచ్చాడు.

 

తెలంగాణ ఉద్య‌మంలో ప్ర‌తీ వేదిక మీద ఈ పాట మార్మోగింది. అయిదున్న‌ర ద‌శాబ్దాల న‌లిగిపోయిన త‌నం నుండి వ‌చ్చిన ఈ ప్ర‌శ్న‌లు అంజ‌య్యవి మాత్ర‌మే కాదు, ఇక్క‌డి ప్ర‌జ‌ల‌వి కూడా అందుకే జ‌నం గుండెను సూటిగా తాకి ఆక‌ట్టుకున్నాయి. అలాగే ఆధిప‌త్యాన్ని పెంచి పోషించేవారికి ముచ్చెమ‌ట‌లు పోయించాయి.

 

అంజ‌య్య పాట‌లే కాదు, చాలా వ‌ర‌కు సామాజిక ఉద్య‌మాల్లో వ‌చ్చిన పాట‌లు కూడా రెండు ర‌కాల బాణీల్లోనే ఎక్కువ‌గా వెలువ‌డ్డాయి. ఒక‌టి ప్ర‌జ‌ల జీవితాన్ని పాట‌లుగా మ‌లిచేట‌పుడు వారు ప‌డుతున్న బాధ‌ల తీవ్ర‌త‌ను అర్థం చేయించ‌డానికి క‌రుణ‌రాస‌త్మ‌క బాణీలు, రెండవ‌ది ఉద్య‌మానికి సిద్ధం చేసే వీరర‌సబాణీలు. అందుకే అంజ‌న్న పాట‌ల్లో ఈ రెండు ర‌కాలైన బాణీల‌తో కూడిన పాట‌లే క‌నిపిస్తాయి. అవి కూడా సాదాసీదాగా రాయ‌డం అంజ‌న్న‌కు తెలియ‌దు. ఉద్య‌మ‌ల‌క్ష్యం నెర‌వేరేందుకు అందులో సంపూర్ణస్థాయికి చేరేలా పాట‌ను మ‌లుస్తాడు.  అందుకే ఉద్య‌మాల‌తో స‌మానంగా అంజ‌న్న పాట‌లు సినిమారంగంలో కూడా చెర‌గ‌ని స్థానాని ఏర్ప‌ర్చుకున్నాయి. “భ‌ద్రం కొడుకో నా కొడుకో కొముర‌న్న జ‌ర” అంటూ ముప్ఫై ఏళ్ల  క్రితం తాను రాసిన సినిమా పాట అత్యంత ప్ర‌జాద‌ర‌ణ‌ను పొందింది.

 

అలాగే స‌ర్కార్ ద‌వ‌ఖాన‌ల దీనావ‌స్థ‌ను తెలుపుతూ రాసిన నేను రాను బిడ్డో స‌ర్కారు ద‌వాఖాన‌కు పాట, కొడుకు కొముర‌న్నా…నువ్ కొల‌క‌టేరువ‌నూకుంటునిరో అంటూ రాసిన పాట వెండితెర మీద అంజ‌న్న మార్కు సంత‌కాన్ని చేశాయి.

 

ప్ర‌జ‌ల‌కోస‌మే క‌లం ప‌ట్టి, కడ‌దాకా ఉద్య‌మాల‌కోస‌మే బ‌తికిన ప్ర‌జావాగ్గేయ‌కారుడు గుడా అంజయ్య‌. అడ‌విబిడ్డెల అమ్మవొడి ఆదిలాబాద్‌లో ఒక మారుమూల గ్రామం లింగాపురంలో 1955లో పుట్టిన అంజ‌న్న 61 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే జీవించాడు.  అందులో నాలుగున్న‌ర ద‌శాబ్దాలుగా ఉద్య‌మాలకే కేటాయించాడు. ఫార్మ‌సిస్టుగా కొలువు చేసిన‌ప్ప‌టికీ, పోరాటాల్లోనే అత‌ని జీవిత‌మంతా గ‌డిచింది. అలా ప్ర‌జ‌ల‌కోసం బ‌తికి, ప్ర‌జ‌ల‌కోసం క‌లంప‌ట్టి జీవ‌మున్న పాట‌ల్ని రాసిన అంజన్న‌ను కోల్పోవ‌డం, తెలంగాణ‌కే కాదు యావ‌త్ తెలుగు స‌మాజానికి ఒక తీర‌నిలోటు. ఆయ‌న క‌ల‌గ‌న్న పీడ‌న లేని లోకాన్ని సాధించ‌డ‌మే ఆ మ‌హావాగ్గేయ‌కారునికి నిజమైన నివాళి.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. ch v prabhakar rao says:

    ఇది ఒక చారిత్రయాత్రకమైన రచన గూడ అంజయ్య చదివిన సాహిత్యం కంటే ఆయన పాటలలో నింపిన తాత్విక సామాజిక సాహిత్య విలువలే ఎక్కువ నిజానికి ఆయన దాదాపు 190 ల వరకు ఎవరికి తెలియదు కానీ ఆయన పాటలు మాత్రం అందరూ పాడుకొనేవారు అందుకే ఆయన మొదటి ఇంటర్వ్యూ శీర్షిక నా మంటలు వార పత్రికలో ~ కనిపించకనే వినిపించే సూరీడు ” అని పెట్టాం
    నిజానికి ఆయనకు రాజావాల్సినంత గౌరవం రాలేదంటే అతిశయోక్తి కాదు
    వ్యక్తిగత సమస్యలు ఉద్యోగ భాద్యతలు ఆరోగ్య సమస్యలతో ఆయన కొంతవరకు హైదరాబాద్ కె పరిమితం అయినా 1985-99 మధ్య కాలం లో ఆయన వీలైనన్ని సభలకు సమావేశాలకు వెళ్ళేవాడు
    తెలంగాణ ఉద్యమ కాలం లో కూడా ఆయనకు తగిన ప్రాధాన్యత ఇవ్వకిపైవడం లోని అంతర్గత విషయాలు విశ్లేషించడం కడుపుచించుకుంటే కాళ్ళమీద పడిందన్నట్లు ఉండ్తుంది
    ఏమైనా నిరాడంబర జీవి తెలంగాణ లో ఆయన పోయిన తరువాతైనా అతనికి సరియైన గౌరవం దక్కాలని ఆశిస్తున్నాను

  2. D Subrahmanyam says:

    ఉద్య‌మాల‌కోస‌మే బ‌తికిన ప్ర‌జావాగ్గేయ‌కారుడు గుడా అంజయ్య‌ గురించి నా లాంటి కొత్త పాఠకుడికి ఎన్నో విషయాలు తెలిపింది ఈ అద్భుతమయిన వ్యాసం. మొన్నటి దాకా “ఊరు మనదిరా పాట”గద్దరిది అనుకొనే వాడిని.

    ఇంతవివరాత్మకంగా వారిని పరిచయం స్తూ నివాళి అర్పించిన డా.ప‌సునూరి ర‌వీంద‌ర్‌ గారు అభినందనీయులు .

  3. చందు తులసి says:

    ఈ వూరు మనదిరా….ఈ వాడ‌మనదిరా
    అనే ఒక్క పాట చాలు.. అంజయ్య తెలుగు పాట వున్నంత కాలం చిరంజీవిగా బతకడానికి..

    పెద్ద పెద్ద గ్రంథాలు, గంటల ఉపన్యాసం కన్నా..
    దొర ఏందిరో….దొర పీకుడేందిరో..
    అన్న మాటలు…..జనాన్ని పోరాటమార్గంలోకి నడిపించాయన్నది వాస్తవం.

    అంజయ్య గారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వంపైన వుంది.

    పాటే ప్రపంచంగా బతికిన అంజయ్య గారికి పసునూరి లాంటి పాటగాడు రాయడం నిజమైన నివాళి.

  4. D Subrahmanyam says:

    ఉద్య‌మాల‌కోస‌మే బ‌తికిన ప్ర‌జావాగ్గేయ‌కారుడు గుడా అంజయ్య‌ గురించి నా లాంటి కొత్త పాఠకుడికి ఎన్నో విషయాలు తెలిపింది ఈ అద్భుతమయిన వ్యాసం. మొన్నటి దాకా “ఊరు మనదిరా పాట”గద్దరిది అనుకొనే వాడిని.
    ఇంతవివరాత్మకంగా వారిని పరిచయం స్తూ నివాళి అర్పించిన డా.ప‌సునూరి ర‌వీంద‌ర్‌ గారు అభినందనీయులు .

  5. JAYAREDDY BODA says:

    మరచి పోలేని మహా వ్యక్తి మహా శక్తి గూడ అంజయ్య గారి గురించి వివరమైన వ్యాసం ధన్యవాదాలు .. అంజయ్య గారికి నివాళులు

  6. కె.కె. రామయ్య says:

    ప్ర‌జ‌ల‌కు విముక్తి క‌లిగించే ఉద్య‌మాల‌ కోసం పాట‌ల ప‌హారా కాసిన ప్ర‌జావాగ్గేయ‌కారుడు గూడ అంజయ్య‌ గారికి భావపూరిత నివాళులు. ( మొన్నటి దాకా “ఊరు మనదిరా ” పాట గద్దర్ ది అనుకొనే వాడిని )

  7. Buchireddy gangula says:

    అంజన్న పాటలు ఆయుధాలు
    ఆ పాటల్లో పదాలు–దూసుక పోయే తూటాలు
    దొర ల గుండెల్లో నిద్ర పోయిన వాగ్గేయ కారుడు
    దళిత కళారత్న — ప్రజాకవి –విప్లవకవి –అంజన్న
    C .M గారు వారి కోరికను పూర్తి. చేయాలిసి ఉండే ???
    =================-Anna bhagha రాసావు=========
    Buchi రెడ్డి గంగుల

  8. సాయి.గోరంట్ల says:

    ఊరు మనదిరో…
    ఈ పాట చాలు గూడ అంజయ్య గారి గురించి తెలుసుకోవడానికి..
    ఆ పాట ప్రజల నాలుకల మీద నర్తించడం తన సరళమైన బాషలో అద్భుతమైన భావావేశ ప్రధానమైన వ్యక్తీకర్ంచటమే.
    అంతేనా తన జీవితమంతా ప్రజల కోసమే పాటు పడిన వారు అంజయ్య గారు
    మీ వ్యాసంలో తన గురించి మరిన్ని విశేషాలు తెలియజేశారు.త్యాంక్యూ సర్

  9. మోహన్ కృష్ణ అనంతోజు. says:

    చక్కని విశ్లేషణలతో ఆయన జీవితాన్ని చూపించారు….గూడ అంజయ్య గారికి అక్షర నివాళి …
    అభినంధనలు అన్న…

  10. b.narsan says:

    అంజన్న పాటల్లో ఉన్న నిజాయితీని నిక్కచ్చితనాన్ని నిర్భీకతని చక్కగా వివరించావు రవీ ..
    నాతో ఈ ఫిబ్రవరి లో ఓ పాట పల్లవి గురించి వాళ్ళ అమ్మాయి పెళ్లి గురించి ఫోన్లో బాగానే మాట్లాడిండు.
    ఇంతలో జరగరానిది జరిగింది. నిమ్స్ లో నీతో అంజన్న అన్న మాటలు అందరికి స్ఫూర్తిదాయకాలు ..
    జోహార్ గూడ వీర పుత్రుడికి…

  11. రజని says:

    రవీందర్ గూడ అంజయ్య గారికి నివాళి బాగుంది, కొత్త పాటకులకు గూడ అంజయ్య గురించి తెలిపావు.

  12. కందికొండ says:

    పసునూరికి ధన్యవాదాలు గూడ అంజయ్య వ్యాసం చాలా బావుంది

  13. venu udugula says:

    గూడ అంజన్న మీద పసునూరి విలువైన tribute ఇది. ఎప్పటిలాగా అతని రైటప్ అద్భుతం.

  14. భాస్కరం కల్లూరి says:

    కరుణవీరాలు చిప్పిల్లే గొప్ప పాటలు రాసిన ప్రజాకవి గూడ అంజయ్యకు నా నివాళి. ఆయన రచించిన “ఊరు మనది రా”, “బద్రం కొడుకో” లాంటి ఎన్నో పాటలు ఆటన పేరు కన్నా ఎక్కువ ప్రాచుర్యం పొందాయి. ప్రజాకవిత్వం అలాంటిది. పసునూరి రవీందర్ వ్యాసం ఆయనకు దీటైన స్మృత్యంజలి.

  15. అనిసెట్టి సాయి కుమార్ says:

    మానవ సంభందాల్ని ఉన్నతీకరిస్తూ విప్లవ భావాలకు ఊపిరులూదిన మహా వాగ్గేయకారుడు సైతం అస్తిత్వవాదాన్ని ఒక సాధనంగా కాకుండా చాలామంది విప్లవ మేధావుల మాదిరిగానేఅస్తిత్వవాదంలో కూరుకు పోవడం చాలా బాధ కలిగించింది.

  16. krishnarao says:

    రాజన్న గురించి ఎంత రాసినా తక్కువే. ఒక్క మాటలో ఆయనను ప్రజా వాగ్గేయకారుడు అని అభివర్ణించిన పసునూరి రవీందర్ కు అభినందనలు. రాజన్న పాటలను తమ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకున్న వారు ఆయన ఆశయాలకు దోహదం చేసినప్పుడే ఆయన కలలు నెరవేర్చినట్లవుతుంది – కృష్ణుడు

    • పసునూరి రవీందర్ says:

      థాంక్ యూ సార్ మీ స్పందనకు..

  17. Kalyan mankali says:

    సూపర్ గా వ్రాశారు.
    గూడ అంజన్న జోహర్
    జోహర్లు జోహార్లు

Leave a Reply to D Subrahmanyam Cancel reply

*