పువ్వులు జాగ్రత్త!

 

 

     -బమ్మిడి జగదీశ్వరరావు

 

అమ్మా..

ఎలా వున్నావమ్మా.. నువ్వూ అల్లుడుగారూ యిద్దరూ బాగున్నారు కదా? నానిగాడు కూడా పదిలమని భావిస్తాను! మీ యింటి నుండి వచ్చాక మనవడి ముచ్చట్లు చెప్పినవే పదే పదే అడిగి మరీ చెప్పించుకుని మీ అమ్మ మురిసిపోతోంది! రోజూ కొత్త కొత్త విషయాలు విన్నట్టుగా వింటోంది! నా మనవడు చాలా తెలివైన వాడు అంటోంది! ఏ మాటకామాట మీ అమ్మ నిన్ను గురించి తలచుకోవడం తగ్గింది! నీ కొడుకు గురించి తలచుకోవడం పెరిగింది! వాడు పుట్టిన ఈ ఆరేడేళ్ళుగా యిదే వరుస! అదే అలవరుస!

అడిగితే చెప్పడానికి నీకేమిటి నొప్పి? అని తిరిగి మీ అమ్మ అడుగుతుంది! గొడవపడుతుంది! పోట్లాడుతుంది! నువ్వేం మనిషివి అంటుంది! నువ్వేం తాతవి అంటుంది! నిజంగా నానిగాడి గురించి చెప్పాలంటే నాకు నొప్పే! మీ అమ్మతో కాదు, నీతో మీ ఆయనతో గొడవ పడాలనిపిస్తుంది! పోట్లాడాలనిపిస్తుంది! తాతనని మరిచిపోయి తాట తియ్యాలనిపిస్తుంది!

అయినా తప్పు వాడిది కాదులే! వాడొక్కడిదే కాదులే! పిల్లలందరూ యిలానే వున్నారేమో..? తలచుకుంటే భయమేస్తోంది! నేను మీ అమ్మలా సరదాగా తీసుకోలేకపోతున్నా! నానిగాడి ముచ్చట్లు చెప్పినపుడల్లా నాకు ముచ్చెమటలు పోస్తున్నాయి! మీయమ్మకు యివేవీ పట్టవు! నేను యెక్కువగా ఆలోచిస్తున్నానని అంటుంది! అనవసరంగా భయపడుతున్నానని అంటుంది!

నాది భయమో.. బాధ్యతో తెలీదు! నీ దృష్టికి తేవాలనిపించింది! యివన్నీ ఫోనులో మాట్లాడలేక వుత్తరం రాస్తున్నాను!

మీ యింటికి వొచ్చిన దగ్గరినుండి నానిగాడు నన్ను ప్రశ్నల వర్షంతో ముంచెత్తాడు! ప్రశ్నించడం జీవ లక్షణం! కాని నా మనవడి ప్రశ్నలకు నాకు రాత్రుళ్ళు నిద్దర పట్టేది కాదు! వేడి పాలు తాగినా వుపయోగం వుండేది కాదు! నువ్వేమో కొత్త ప్లేసు కదా అనేదానివి! ఏమి చెప్పాలో నాకూ తెలీలేదు!

మొదటి రోజు రాత్రి నానిగాడ్ని పక్కన వేసుకొని పడుకున్నానా? వాడి తల నిమిరానా? అప్పుడు అడిగాడు.. ‘తాతయ్యా తలలో యేముంటాయ్?’, నాకు సమాధానం యేo చెప్పాలో తెలీక, తిరిగి ‘యేముంటాయ్?’ అన్నా! ‘అది కూడా తెలీదా?’ అని చాలా ఆశ్చర్యపోయాడు! వాడి ఆశ్చర్యం చూసి నేనూ అంతే ఆశ్చర్యపోయా! అయ్యో అదీ తెలీదా అని నోటికి చెయ్యి అడ్డం పెట్టుకొని కళ్ళతో దగ్గరికి రమ్మని సైగ చేసి నా చెవిలో చెప్పాడు! ‘తలలో యినుము వుంటాది, మెటల్.. మెటల్..’ అన్నాడు! విని, ‘మెంటల్..’ అన్నా! ‘మెంటల్ వాడి తలలో కూడా మెటలే వుంటుంది..’ అన్నాడు! ‘నీకెవడురా చెప్పాడు..?’ అన్నా, ‘అన్నీ అందరూ చెప్పరు, కొన్ని మనకి మనమే తెలుసుకోవాలి..!’ అని నాకు జ్ఞానోదయం చేశాడుతల్లీ నీకొడుకు.. అప్పటికీ ‘నీ తల యిందుకేనా యింత గట్టగా వుంది..’ అని నవ్వేశా! వాడు నవ్వకుండా ‘అమ్మని మట్టి బుర్ర అని నాన్న తిడతాడు, కాని అమ్మతలలోనే కాదు, యెవరి తలలో మట్టి వుండదు, మెటలే వుంటుంది.. వూ..!’ సత్యాన్ని కనుగున్నట్టు చెప్పాడు! అప్పటికీ ‘అలా అని మీ పాఠాల్లో వుందా..?’ అడిగాను. ‘పాఠాల్లో అన్నీ వుండవు తాతయ్యా..’ కాస్త విసుక్కున్నాడు కూడా!

ఒప్పుకున్నాను తల్లీ.. నీ కొడుకుతో చాలలేక వొప్పుకున్నాను!

ఆ రాత్రి నా మనవడు నాతల నిమిరాడు. ‘ఏమిటి తాతా..?’ అన్నాను, ‘నీ తలలో కూడా మెటలే వుంటుంది..’ చెప్పాడు. ‘నయం.. సమయానికి మీయమ్మమ్మ లేదు..’ అన్నా. ‘వుంటే..?’ అన్నాడు. ‘నన్ను యినుప సామానుల వాడికి కేజీల్లెక్క అమ్మేసేదిరా..’ నవ్వుతూ అన్నా. ‘నీకే అనుకున్నా, అమ్మమ్మకి కూడా తెలీదా..?’ అడిగాడు. ఏమిటి అన్నట్టు చూసాను. ‘తలలో మెటల్ వుంటుందని..’ అన్నాడు. ‘చాల్లే పడుకో..’ అన్నాను. నన్ను చూసి నా సమాధానం విని నేను వాడి మాటలు నమ్మడం లేదని అనుకున్నట్టున్నాడు. అందుకే ‘నీ తల మీద సుత్తితో.. వూ.. రాడ్ తో కొట్టి చూద్దామా..? టంగ్ టాంగ్..మని శబ్దం వస్తుంది..’ అన్నాడు. నానిగాడి మాటలకు భయంతో చూసాను. ‘తాతయ్యా.. నీకు భయమేస్తే పోనీ నా తలమీద కొట్టు తాతయ్యా..’ అని తల వంచాడు.

ఏమనాలో తెలీక ‘నాకు నిద్దరొస్తోంది..’ అన్నా. కళ్ళు మూసుకున్నా. ‘తాతయ్యా..’ పిలిచాడు. నే పలకలేదు. కొంపతీసి సుత్తో రాడ్దో తీసుకువొచ్చి మెటల్ సౌండ్ కోసం వొక్కటేస్తే..?’ వులిక్కిపడి కళ్ళు తెరిచాను. నన్నే చూస్తూ నవ్వాడు. ‘నీకు నిద్దర్రావడం లేదు కదా తాతయ్యా..’ అన్నాడు. అని లేవబోతే.. లేవనీయకుండా చెయ్యి అడ్డం పెట్టా. దాంతో వెనక్కి వొక్కసారిగా నేలమీద పడ్డాడు. తలకి తగిలిందేమోనని చేత్తో వాడి తలని తడమ బోయా.

‘తలలో మెటల్ వున్నట్టే.. నేలలో రబ్బరువుంటుంది..’ అన్నాడు. వాడివి వెర్రి మాటలన్నట్టు నేను చూస్తే.. వాడు నన్ను వో వెర్రిబాగులవాన్ని చూసినట్టు చూసాడు. ‘బంతి నేలకు కొడితే యేమవుతుంది?’ అడిగాడు నాని. ‘కొట్టినంత వేగంగా పైకి లేస్తుంది..’ అన్నా. ‘బంతే కాదు, బలంగా కొడితే మనిషులయినా యిలా కిందకి కొడితే అలా పైకి లేచి యెగురుతారు..’ అన్నాడు. అక్కడితో ఆగక ‘యేoటో తాతయ్యా.. ముసలయ్యే కొద్దీ అన్నీ మర్చిపోతారట.. నువ్వు కూడా అన్నీ మర్చిపోయినట్టున్నావ్..’ చెప్పక ముందే ‘వొక్కటిచ్చానంటే మీ అమ్మ దగ్గరకు వెళ్లి పడతావ్..’ అన్నా. ‘గుడ్.. నాకు పొద్దున్న వొక్కటివ్వు తాతయ్యా.. స్కూల్లో పడాలి దెబ్బకి.. స్కూల్ బస్సు మిస్సయినప్పుడు అమ్మ తిడుతుంది గాని గట్టిగా యివ్వదు.. షాట్’ అన్నాడు.

అప్పటికీ వాడిది పిచ్చి వాగుడు అనుకున్నా. కాని సరిపెట్టుకోలేకపోయా. ముందు రోజు జర్నీలో తలకింద చెయ్యి పెట్టుకు పడుకున్నానేమో.. మెడ దగ్గర నరం పట్టేసి జండూబామ్ రాసుకుంటుంటే ‘పైప్ కు ప్రాబ్లమా తాతయ్యా..?’ అని అడిగాడు. ఏమంటే ఏమంటాడో అని ‘ఆ’ అన్నా. ‘పైపుల్లో బ్లడ్డు రయ్ మని తిరుగుతుంది కదా..?’ అన్నాడు. ‘పైపులేమిట్రా.. అవి నరాలు..’ ఆగలేక చెప్పా. ‘పైపులు.. అదే నరాలు.. యెత్తుగా బాడీ మీద కనిపిస్తాయి కదా..’ అని అంటే ‘యెప్పుడు..?’ అని అర్థం కానట్టు చూస్తే, ‘కోపం వస్తే.. యెవడ్నన్నా కొట్టే ముందు.. పైపులు.. నరాలు.. బ్లడ్ అంతా పచ్చగా బాడీ అంతా యిలా యిలా..’ చెప్పేవాడే, ‘తాతయ్యని పడుకోనివ్వవా..?’ వాళ్ళ నాన్న కేకతో సైలెంట్ అయ్యాడు. అలాగే నిద్ర పోయాడు. అని అనుకున్నాను. కాని గొంతు తగ్గించి ‘యెవరైనా మనల్ని గన్ తో కాల్చితే చచ్చిపోతామా? చచ్చిపోమా?’ గుసగుసగా అడిగాడు. నిర్ఘాంత పోయా.

నాకు మాత్రం వచ్చిన నిద్ర వదిలి పారిపోయింది. ‘చెప్పు తాతయ్యా..’ గుగుసగా అడిగాడు. గట్టిగా కూడా అడిగాడు. ‘బుల్లెట్ తగిలితే యెవరైనా చచ్చిపోతారు..’ అన్నా. ‘యెవరి గురించి కాదు.. మన గురిచి చెప్పు.. చచ్చిపోతామా లేదా?’ ఖచ్చితంగా అడిగాడు. ‘మనల్ని యెవరు యెందుకు కాలుస్తారు చెప్పు..’ అన్నా. ‘యెందుకో కందుకు..’ అన్నాడు. ‘నన్ను కాలుస్తున్నావు కదరా..’ అన్నా. ‘సరే కాల్చాను.. చచ్చి పోతావా లేదా?’ అడిగాడు. చేసేదిలేక ‘చచ్చి పోతా..’ అన్నా. ‘నువ్వు బ్యాడ్ పర్సన్ వి.. విలన్ వి.. అందుకే చచ్చిపోతావ్..’ అన్నాడు. ‘మరి నువ్వో..?’అన్నా. ‘ ఐయామే గుడ్ పర్సన్.. హీరో.. యెన్ని బుల్లెట్స్ కాల్చినా..’ యింకా చెప్పేవాడే ‘నానీ..’ వాళ్ళ నాన్న పిలిస్తే వెళ్ళాడు. వెళ్లి నిద్రపోయాడు.

నాకింక రాత్రి తెల్లవార్లూ నిద్ర పట్టలేదు! నువ్వు అడిగినా చెప్పలేదు! ఎందుకంటే నాకే యేమీ బోధ పడలేదు! ‘నాన్నా నువ్వెందుకలా వున్నావ్.. నేనేమి అన్నానా? మా ఆయనేమి అన్నారా?’ అని నువ్వు అడిగావు. చెప్పేంత పెద్ద విషయమూ కాదు, వదిలేసేంత చిన్న విషయమూ కాదు. కూరగాయలు తరిగినట్టు మనుషుల్ని తరిగే సినిమాలకు దూరంగా వుంచు, వుంచగలిగితే! సుత్తితో నెత్తి బద్దలుగొట్టినా రక్తం దారాలు కడుతుంటే దులిపేసుకొని ఫైట్ చేసే తెలుగు హీరోల సినిమాలకు దూరంగా వుంచు, వీలయితే! ఆటవిక రాజ్యం నడుస్తున్నట్టు యెవరు యెవర్నైనా చంపేసుకోవచ్చనే ముఖ్యంగా పోలీసులకు ఆ హక్కువుందనే తొక్కు తెలుగు సినిమాలకు దూరంగా వుంచు, క్రూర జంతువులకంటే దుర్మార్గంగా చంపుకొనే చెత్త సినిమాలకు దూరంగా వుంచు, వాడికో వ్యక్తిత్వం రూపు కట్టేదాకయినా దూరంగా వుంచు, వాడిలో సున్నితత్వం బండబారిపోకుండా దూరంగా వుంచు, వుంచగలిగితే!

టుపుక్కుమంటే పుటుక్కున పోయే ప్రాణాలు కదా మనవి.. మనుషులవి! ప్రాణం విలువ తెలియకుండా వొక్కోడు వొక్కో సినిమాలో పదిమందివో వందమందివో ప్రాణాలు తీయడం.. మన పిల్లల ప్రాణాలు తీయడమే! ఒక్కటంటే వొక్కటి.. వొక్క ప్రాణం పోసే సినిమా.. వొక్క సినిమా వొచ్చినా బాగున్ను! ప్రాణం పోసినట్టుగా వున్ను! ప్రాణం విలువ తెలిసున్ను!

ఎవరికీ వారే- తమ పిల్లలు పువ్వుల్లా కళకళలాడుతున్నారా? యినుప చువ్వల్లా ఫెళ ఫెళలాడుతున్నారా? తెలుసుకోవాలి తల్లీ.. తల్లివి కదా అదేదో నీనుండి ప్రారంభం అవ్వాలని మనసాగక నీకు యీ వుత్తరం రాస్తున్నా..

నానిగాడికి నాముద్దులు..

వుంటానమ్మా..

మీ

నాన్న

 

 

మీ మాటలు

  1. JAYAREDDY BODA says:

    అవును సార్ బాగా చెప్పారు .. పువ్వులాంటి పిల్లల మనసులపై ఈ చెత్త సినిమాల ప్రభావం చాలా పడుతుంది ఈ రోజుల్లో..

మీ మాటలు

*