ఇతివృత్తాలూ….లక్ష్మణ రేఖలూ…

 

-చందు తులసి

~

తెలుగు కథల్లో సామాజిక అంశాలు మరీ పెరిగిపోతున్నాయి! వస్తువుకు మితిమీరిన ప్రాధాన్యం ఇస్తున్నారు!!
కొన్ని రకాల ఇతివృత్తాలతో రాస్తేనే మంచి కథ అనుకుంటున్నారు!!! ఫలితంగా మూసలో తెలుగు కథ చిక్కుకుపోయింది!
ఫలితంగా కథకు నష్టం జరుగుతోంది.  కథకుండే కళాత్మకత దెబ్బతింటోంది! ప్రమాణాలు పడిపోతున్నాయి. పాఠకులు తగ్గిపోతున్నారు!
ఈ మధ్య తెలుగు కథ గురించి వినిపిస్తున్న వాదనలు, ఆరోపణలివి….

సామాజిక అంశాలు పెరగడం వల్ల కథకు నష్టం జరుగుతుందా…?
వొక అంశం వల్ల  పాఠకులు దూరమో, దగ్గర అవుతారా…?
ఈ విషయం గురించి ఎవరేమనుకుంటున్నారు.? ఈ అభిప్రాయాలు మీ చర్చ కోసం

peepal-leaves-2013

కథకు, రచయితకు తను ఉద్దేశించిన పాఠకుల వర్గం వుంటుంది.  ఎవరి కోసం రాస్తున్నామో అనేది కూడా ముఖ్యం కదా. అలాంటపుడు చెప్పే తీరులో తేడా రావచ్చు. అలాగే సామాజిక ఇతివృత్తాలతో కథలు రాసేవారు కూడా కేవలం సమస్యను చెప్పడం దగ్గరే ఆగిపోకుండా…సమస్య లోతుల్లోకి వెళ్లి చర్చించాలి.  అపుడు
ఇటువంటి విమర్శకు అవకాశం వుండదు.  ఐతే విమర్శకులు కూడా గమనించాల్సింది రాసేవాళ్లని రాయనీయండి. మీ విమర్శ కూడా కథకుల్లో అధ్యయనం పెంచేలాగా ఉండాలి. నిర్మాణాత్మక సూచనలు చేయాలి. రచయిత తన కథను మెరుగుపెట్టుకునేలా వుండాలి.

– ఓల్గా

_________________________________________________________________________________________________

రాజకీయం వద్దనడమే పెద్ద రాజకీయం. కేవలం కళాత్మకంగా లేదనే పేరుతో సామాజిక ఇతివృత్తాలపై వచ్చే కథలని తక్కువ చేయలేం. సామాజిక ఇతివృత్తాలు రాయకూడదనుకుంటే ఎవరి జీవిత చరిత్రలు వారే రాసుకోవాల్సి వస్తుంది.  కళ ప్రజల కోసం, సామాజిక ప్రయోజనం కోసమే సాహిత్యం అనే వాదనను…తక్కువ చేయడం కోసమే వస్తున్న వాదన ఇది. ఉద్యమ సాహిత్యం కొంత తగ్గుముఖం పట్టినపుడు ఇటువంటి వాదనలు తలెత్తుతాయి. గురజాడ,  వీరేశలింగం కాలం నుంచి ఇప్పటి దాకా ..అనేక సార్లు ఈ వాదన వచ్చినా… ఎన్నడూ ఈ వాదన నెగ్గింది లేదు.  సామాజిక సాహిత్యం కోసం ఆలోచిస్తున్నవారు …ఇటువంటి వాదనలు వచ్చినపుడు మరింత అప్రమత్తంగా వుండాలి.  సాహిత్య కృషి మరింత పెరగాలి. రచయితలు ఆ దిశగా మరింత కృషి చేయాలి.

-ఎన్. వేణుగోపాల్

_________________________________________________________________________________________________

అసలు సమస్య …..సామాజిక ఇతివృత్తాలు పెరగడం, తగ్గడం కాదు.  కేవలం సామాజిక ఇతివృత్తాలతో కథలు రాసినా అది వ్యక్తిగతంగా రచయితకే తప్ప కథా సాహిత్యానికి జరిగే నష్టం ఏమీ లేదు. పైగా ఓ రచయిత రాసిన వొకటి రెండు కథలతో …అతని దృక్పథం అంచనా వేయలేము.  వెబ్ మ్యాగజైన్లు వచ్చిన తర్వాత….కొత్త తరహా పాఠకులు వస్తున్నారు. రచయితకు, పాఠకులకు మధ్య చర్చకు అవకాశం పెరిగిపోతోంది.  కాబట్టి సంప్రదాయ రీతిలో ఆలోచించి ….కొత్త తరం సాహిత్యానికి విలువలు ఆలోచించలేము.  అసలు ఇపుడు చర్చించాల్సిన విషయాలు వేరే వున్నాయి. కొత్త తరం రచయితల్లో చాలామంది….విషయాన్ని, సమస్యను లోతుగా అధ్యయనం చేయకుండానే కథలు రాస్తున్నారు.  రచనను సీరియస్ గా తీసుకుంటున్న వారూ తగ్గిపోతున్నారు. ఇవాళ మనం దృష్టి సారించాల్సిన అంశం
ఇది తప్ప…సామాజిక సమస్యలు పెరగడమే, తగ్గడమో కాదు.

-జీఎస్ రామ్మోహన్

_________________________________________________________________________________________________

సామాజిక స్పృహ అనేది రచయితకు వుండడం, తన రచనల ద్వారా వ్యక్తి తనలోనికి తను చూసుకునే విధానాన్నో, వ్యక్తి సమాజాన్ని చూసే చూపునో మార్చాలనుకోవడం తప్పు కాదు. బాధ్యత ఉన్న ఏ రచయిత ఐనా అదే పని చేస్తాడు. రచనకు అవసరమైన విషయం, అసలైన ప్రయోజనం కూడా అదే. ఐతే రచయిత తన బాధ్యత ఎంత ప్రతిభావంతంగా నెరవేరుస్తున్నాడనేది కథ ప్రమాణాలను నిర్ణయిస్తుంది. విమర్శకులు చేయాల్సింది అలాంటి గుణాత్మకమైన విశ్లేషణ.

ఇక మంచీ చెడు అన్ని కాలాల్లోనూ వుంటాయి. ప్రమాణాలు లేని రచనలూ ఎల్లపుడూ వుంటాయి. ఆ మంచి చెడ్డల నిష్పత్తి కొంచెం అటు ఇటుగా మారుతుండవచ్చు అంతే. పాతకాలం నాటి సాహిత్యం ప్రమాణాలతో ఇప్పటి సాహిత్యం పోల్చి గతమే మంచి అనుకోవడం మాత్రం పొరపాటు. ఈ రోజుకీ సమాజం పట్ల తమ బాధ్యతను గుర్తించే రచయితలు వున్నారు. అందులో కొంతమందైనా మంచి కథలు రాస్తూనే ఉన్నారు.

-రమణమూర్తి

_________________________________________________________________________________________________

రచయితలతో పాటూ, పాఠకులు కూడా రకరకాల స్థాయిల్లో వుంటారు. ఆ క్రమంలో నువ్వెక్కడ వున్నావు అనే ప్రశ్న వుంటుంది. ఆ ప్రశ్నకు సమాధానం దొరికిన రచయితలు ప్రకటించుకుంటారు. దొరకని వారు వెతుక్కుంటారు. ఆ అవసరమే లేదనే వారికి కూడా నిర్వచించలేని పరిధి ఏదో వుండి వుంటుంది. సమాజంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక సాంస్కృతిక పరిణామాలు ఏదో మేరకు సాహిత్యాన్ని కూడా
ప్రభావితం చేస్తాయి కనుక…లాభం, నష్టం కేవలం కథవి మాత్రమే కాదు. ఇవాళ తెలుగు కథలో బహుళ తాత్వికతల సమన్వయం జరుగుతోంది. మార్క్సిజం-అంబేడ్కరిజం, మార్క్సిజం-స్త్రీవాదం…వంటి కాంబినేషన్స్ ను రచయితలు స్వీకరిస్తున్నారు. ఇవి తక్షణ ప్రయోజనాలా, దీర్ఘ కాలిక ప్రయోజనాలా అన్నది వేరే చర్చ. నలుగురి మేలు కోరే ..భావాల్ని పంచుకోవాలనుకోవడం ప్రధానం. అది ఎంత గాఢంగా, కళాత్మకంగా ఉంటే అంతగా సాహిత్యం ఉత్తమ స్థితిలోకి వెళ్తున్నట్లు.

-కె.ఎన్ మల్లీశ్వరి.

_________________________________________________________________________________________________

కథకులు ఎంచుకునే అంశాల వల్ల కథకు నష్టాలుండవు, లాభాలూ ఉండవు. మంచి కథని ఎంచేటప్పుడు అందులో అంశం సామాజికమా, సాంస్కృతికమా, శాస్త్రీయమా అన్నది లెక్కలోకి రాదు. అంశమేదైనా, దాన్ని కథగా ఎలా మలిచారనేది ముఖ్యం. ఆ పని సవ్యంగా చేసినప్పుడు – ఇతివృత్తం ఏమిటనేదానితో సంబంధం లేకుండా అది కథకి మంచే చేస్తుంది. అయితే మంచి కథ రాయటం చాలా కష్టమైన విషయం.

మరి అంత కష్టపడటం ఇష్టం లేనివాళ్లు కథలు రాయాలంటే ఎలా? దానికో దగ్గరి దారుంది. అదే సీజనల్ సాహిత్యం. ఏదేని విషయంపై దేశంలో సంచలనం చెలరేగుతున్న తరుణంలో ఆ ఇతివృత్తంతో వచ్చే కథలకి ఎంతో కొంత డిమాండ్ ఉంటుంది. చిక్కటి కథనం, బలమైన పాత్రలు, పదునైన సంభాషణలు, ఇలాంటివేమీ లేకపోయినా కేవలం ఆ ఇతివృత్తానికి ఆ సమయంలో ఉన్న ‘గ్రావిటీ’ ఇలాంటి కథలకి లేని బరువు సమకూరుస్తుంది. తెలుగులో ఈ తరహా కథలు రాన్రానూ పెరిగిపోతున్నాయి. దారుణ సంఘటనల దరిమిలా జనాల్లో నెలకొనే తాత్కాలిక ఉద్వేగాలు, ఉద్రేకాలే ఇంధనంగా బండి నడిపించే ప్రయత్నాలివి. ఈ కథల్లో ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. వీటిలో చాలావరకు ఉదాత్తమైన వస్తువే తప్ప మంచి కథకుండాల్సిన లక్షణాలేవీ ఉండటం లేదు. ఆ విషయం ఎత్తిచూపిన వాళ్లని – ఆ కథలోని ప్రధానాంశాన్ని బట్టి – దురహంకారులనో, ప్రగతి నిరోధకులనో, మైనారిటీ వ్యతిరేకులనో, ఇంకోటనో ముద్రలేసే పరిస్థితి! దాంతో నికార్సైన విమర్శకులు నోళ్లు మూసుక్కూర్చుంటున్నారు. కథ ఎలా ఉన్నా చప్పట్లే రాలుతుంటే, అది చూసి, కథంటే ఇలాగే ఉండాలి కాబోలనుకుని యువకథకులూ అదే దారి పడుతున్నారు. హారర్, సస్పెన్స్, డిటెక్టివ్, క్రైమ్, హాస్యం – మొదలైన విభాగాల్లో మంచి తెలుగు కథొకటి చదివి ఎన్నేళ్లయిందో గుర్తు తెచ్చుకోండి. వెల్లువలా వచ్చి పడుతున్న ‘సందేశాత్మక’ కథల దెబ్బకి ఇతర తరహా కథలిష్టపడే పాఠకులు పారిపోయారు. ఫలితం? ప్రస్తుతం తెలుగులో పాఠకులకన్నా కథకుల సంఖ్య అధికం!

కాబట్టి నష్టం కలిగేది కథాంశం వల్ల కాదు. వస్తువుకి మితి మీరిన ప్రాధాన్యత ఇవ్వటం వల్ల; కొన్ని రకాల అంశాలని కళ్లకద్దుకుని కొలిచే ధోరణి వల్ల.

– అనిల్ -ఎస్-రాయల్

_________________________________________________________________________________________________

తెలుగు సాహిత్యం వికాసం. అభివృద్ధి, మొదటి నుంచీ వివిధ సంఘటనలతోనే ముడిపడి వుంది. మొదటి సంస్కరణ వాద కథల నుంచీ, అటు తర్వాత వామపక్ష ఉద్యమ ప్రభావం నుంచీ…ఇవాళ్టిదాకా అది విడదీయలేనంతగా కొనసాగుతూనే వుంది.

భవిష్యత్ లోనూ కొనసాగుతుంది. ఐతే  వ్యక్తి ప్రయోజనాలకే పెద్ద పీట వేసే పశ్చిమ దేశాల సాహిత్యం ప్రభావంతో మన దగ్గర కొందరు ఇటువంటి వాదన చేస్తున్నారు.  వర్తమానంతో సంబంధం లేని సాహిత్యం వుండదు.  కథలో కానీ, సాహిత్య రూపాల్లో కానీ వ్యక్తికి, అతని భావాలకు తప్పక ప్రాధాన్యం వుంటుంది. వుండి తీరాలి.  కానీ సమాజంలో కొన్ని సంఘటనలు జరిగినపుడు వ్యక్తి తప్పక ప్రభావితం అవుతాడు. అది కథగా మలిచినపుడు చెప్పిన తీరులో కొంత హెచ్చు తగ్గులుండవచ్చు. ఆ చెప్పిన తీరుపైన చర్చ చేయవచ్చు కానీ అసలు సామాజిక అంశాలే కథల్లోకి రాకూడదు అనడం అవగాహనా రాహిత్యమే.

-కరుణాకర్ ఎనికపాటి

_________________________________________________________________________________________________

ఫలానా అంశాల వల్ల కథకు నష్టం జరుగుతోందనే వాదన నేను విశ్వసించను. వొక రచయిత కథ చెప్పిన తీరులో తేడాలుండవచ్చు. వొక సారి ఉత్తమ స్థాయిలో చెప్పవచ్చు. కొన్ని సార్లు యథాతథంగా రచయిత చూసింది… జరిగింది రాయొచ్చు. ప్రతీ అంశాన్ని కళాత్మకంగా చెప్పే వెసులుబాటు రచయితకు ఉండకపోవచ్చు. చెప్పిన తీరుపైన చర్చ చేయవచ్చునేమో కానీ….ఫలానా అంశం చెప్పకూడదని అనలేం
కదా.

-పింగళి చైతన్య

_________________________________________________________________________________________________

మొత్తంగా ఈ అంశం సున్నితమైనదే కాదు… విస్తృతమైనది కూడా. కనుక ఈ అంశంపైన సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరముంది.
కథను సీరియస్ తీసుకున్న కొత్త తరం రచయితలకు, కథకు ఎంతో కొంత మేలు జరుగుతుందనే ఉద్దేశమే ఈ చర్చలోని అసలు ఉద్దేశం. ఈ దిశగా మీ ఆలోచనలు, భావాలను పంచుకోవాలని కోరుతున్నాం.

మీ మాటలు

  1. ఎవరైనా రాయడం మొదలుపెట్టిన కొత్తల్లో చుట్టూ జరుగుతున్న విషయాలపై (విషయాలపై మాత్రమే) రాయడం సహజం. ఆ తర్వాత సీనియర్లెవరైనా డైరక్షన్ ఇవ్వవచ్చు. లేదా వాళ్లే కొన్ని కథలు రాసేక మెచూరిటీ సంపాదించి కొత్త అంశాల మీద రాయొచ్ఛు. మారలేదా, ఇక వాళ్ళ ఖర్మ. కొట్టుకు పోతారు ఎక్కడా కనిపించకుండా — గాలి వాటుకు ఎగిరిపొయ్యే పొల్లు వలె.
    ఇదంతా ఒక ప్రాసెస్. నా అనుభవం.
    రాస్తున్న వాళ్ళని బెదరగొట్టే రకంగా రాయడం అన్యాయం. అసలు రాయకుండానే పోతే సాహిత్యానికి నష్టం.
    కథా వస్తువును, ఎంచుకోడం, తోచిన (చేతనైన) శిల్పంతో రాయడం రచయితల ప్రాపంచిక దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది.
    అది సొంత పూనికతో, చదువుతో, సమాజంతో సంభాషణతో పదునుతేరుతుంది. రచయిత నిజాయితీతో కూడిన effort పెడితే అంశాలలోతుల్లోకి వెళ్లి చూడవచ్ఛు.
    మెహర్ ఉద్దేశం అది చెప్పడమే అయితే మంచిదే. కానీ, తిట్లూ చీత్కారాలూ, ఈసడింపులతో, శాపనార్ధాలతో ఆ ఉద్దేశం నెరవేరదు.

    • చందు తులసి says:

      నిజమే కూర్మనాథ్ గారూ. ఇవాళ తెలుగు రాస్తున్న వాళ్లు తక్కువయిపోతున్నారు. ఏదో ఆసక్తితో వస్తున్న వాళ్లను సీనియర్లు..ముందుకు నడిపించాలి.
      మీ స్పందనకు‌ థాంక్యూ

  2. Kakumani Srinivasa Rao says:

    అనిల్ రాయల్ గారూ అందరికీ నచ్చి ఎక్కువకాలం నిలిచే హారర్, సస్పెన్స్, డిటెక్టివ్, హాస్య కథలుండవు. (పతంజలి తరహా వ్యంగ్య కథలు ఇందుకు మినహాయింపు).

    ఇతివృత్తాలకు లక్ష్మణరేఖలుండాలని మెహర్ తన వ్యాసంలో ఎక్కడా చెప్పలేదు. స్వానుభవం, సహానుభవం గురించి చర్చిస్తూ ఎవరి కథలు వాళ్ళే రాస్తే మంచిదని అన్నాడు. పింగళి చైతన్య “కేవలం సింపతి” అనే సారంగలో వచ్చిన వ్యాసం కూడా ఇదే చెబుతుంది.

    కథకులు అర్జంటుగా పిడికిలి బిగించి అస్తిత్వ, ఉద్యమ, సందేశాత్మక గోదాల్లోకి కళ్ళు, చెవులు మూసుకుని దూకుతున్నారు. జీవితాన్ని జల్లెడపట్టే అభిరుచి, ఓపిక, దృష్టి వాళ్ళకు లేవు.

    • చందు తులసి says:

      శ్రీనివాసరావు గారూ….‌మొదట‌‌ మీకు ఓ క్లారిటీ ఇవ్వాలి. ఇది మెహర్ గారు రాసిన వ్యాసానికి స్పందన గానో , బదులుగానో పెట్టిన చర్చ మాత్రం కాదు సార్.
      ఈ వాదన మెహర్ గారితో మొదలైంది మాత్రమే కాదు కదా…ఎప్పటి నుంచో వున్నదే కదా..
      ఎవరి అభిప్రాయాలు వాళ్లవి. ఎదుటి వారి అభిప్రాయాలను గౌరవిస్తూ ముందుకు సాగిపోవడమే మన పని. మీ స్పందనకు ధన్యవాదములు.

  3. Sashanka says:

    ఒకప్పుడు అది రాయండి ఇది రాయొద్దన్నారని సాహిత్య సంఘాల మీద సంస్థల మీద నిరసన. ఆ తర్వాత దాడి.
    దాడి చేసే క్రమంలో వాళ్ళు వీళ్ళవుతారని …ఇప్పుడు అది రాయవద్దు ఇది రాయవద్దు అని శాసిస్తున్నమెహర్ లాంటి వాళ్ళను చూస్తే అర్ధమవుతుంది. ఇదో రకం ‘ఎమర్జెన్సీ’. రచయితల్ని హైనాలతో పోల్చటం నియంతలకు మాత్రమే తగిన భాష.
    ప్రపంచం లో చెత్త విషయం అంటూ ఉండదు. రాసే నైపుణ్యం లోపించటం తప్ప అన్నాడు విక్టర్ హ్యూగో. రచయితలు ఆ దిశగా కృషి చెయ్యాలి. ఇది అస్తిత్వ వేదన పేరుతో ఇంత చెత్తను నింపి వదులుతున్న వేదనా తత్వవేత్తలకు కూడా వర్తిస్తుంది.

    • చందు తులసి says:

      శశాంక గారూ…బాగా చెప్పారు. రాసే నేర్పు వుంటే ఏ అంశం పైనైనా రాయవచ్చు.
      కాదేదీ కవితకనర్హం అని మన మహాకవీ చెప్పారు కదా. అది కథలకూ వర్తిస్తుంది కదా
      థాంక్యూ సర్.

  4. D Subrahmanyam says:

    వివిధ రచయత(త్రి) ల అభిప్రాయాలు తీసుకున్నారు సరే. అసలు వ్యాసకర్త చందు తులసి గారు పెట్టిన ప్రాతిపదిక – తెలుగు కథల్లో సామాజిక అంశాలు మరీ పెరిగిపోతున్నాయి! వస్తువుకు మితిమీరిన ప్రాధాన్యం ఇస్తున్నారు!! కొన్ని రకాల ఇతివృత్తాలతో రాస్తేనే మంచి కథ అనుకుంటున్నారు!!! ఫలితంగా మూసలో తెలుగు కథ చిక్కుకుపోయింది! ఫలితంగా కథకు నష్టం జరుగుతోంది. కథకుండే కళాత్మకత దెబ్బతింటోంది! ప్రమాణాలు పడిపోతున్నాయి. పాఠకులు తగ్గిపోతున్నారు! ఈ మధ్య తెలుగు కథ గురించి వినిపిస్తున్న వాదనలు, ఆరోపణలివి… దృష్ట్యా జరిగిన చర్చ బావుంది. వేణుగోపాల రావు గారు చెప్పినట్టు ” రాజకీయం వద్దనడమే పెద్ద రాజకీయం. కేవలం కళాత్మకంగా లేదనే పేరుతో సామాజిక ఇతివృత్తాలపై వచ్చే కథలని తక్కువ చేయలేం. …….సామాజిక సాహిత్యం కోసం ఆలోచిస్తున్నవారు …ఇటువంటి వాదనలు వచ్చినపుడు మరింత అప్రమత్తంగా వుండాలి. సాహిత్య కృషి మరింత పెరగాలి. రచయితలు ఆ దిశగా మరింత కృషి చేయాలి.” రమణమూర్తి గారు కూడా “సామాజిక స్పృహ అనేది రచయితకు వుండడం, తన రచనల ద్వారా వ్యక్తి తనలోనికి తను చూసుకునే విధానాన్నో, వ్యక్తి సమాజాన్ని చూసే చూపునో మార్చాలనుకోవడం తప్పు కాదు. బాధ్యత ఉన్న ఏ రచయిత ఐనా అదే పని చేస్తాడు. రచనకు అవసరమైన విషయం, అసలైన ప్రయోజనం కూడా అదే. ” అనే చెప్పారు. చందు తులసి గారు మాట్లాడిన అందరూ ఇంచుమించు ఇలాగే చెప్పారు. మళ్లీ స్టాటిస్టక్స్ లోకే వెడితే చందు తులసి గారు ఇంకొంచెం శ్రమపడి తన sample ను ఇంకొంచెం పెంచి ఉంటే బావుందేమో . మొత్తానికి ఈ ప్రయత్నం బావుంది వారికి అభినందనలు .

  5. చందు తులసి says:

    సుబ్రహ్మణ్యం గారూ నమస్కారం సార్.

    ఇక్కడ చర్చకు పెట్టిన వాదన ఇటీవలి కాలంలో పెరిగిన నేపథ్యంలో…. కొందరు ప్రముఖుల అభిప్రాయాలు సేకరించాము.

    మాకు అందుబాటులో వున్న వారివీ… మేం అడిగినపుడు స్పందించిన వారివి ఈ అభిప్రాయాలు.

    ఇక్కడ చర్చ పెట్టింది ఎవరైనా తమ అభిప్రాయం ప్రకటించడానికే… కనుక చెప్పాలనుకున్నది చెప్పవచ్చు.
    మీ స్పందనకు థాంక్యూ

  6. టి. చంద్రశేఖర రెడ్డి says:

    వృత్తి రీత్యానో, ప్రవృత్తి రీత్యానో; నాకెదురయిన కొన్ని అంశాలు లేదా సంఘటనలు నన్ను కదిలించాయి. వాటిని నలుగురితో పంచుకోవటం వలన ఒక సామాజిక ప్రయోజనం చేకూరుతుందని నాకనిపించింది. పంచుకోవటానికి ఒక మార్గం కథ రాయటమని నా వివేచనకి తెలుసు. కాని ఆ దిశలో నేనెప్పుడూ కృషి చెయ్యలేదు. కష్టపడి ఎలాగోలా ఓ కథ రాశాను. అలవాటుగా, అలవోకగా రాసేవాళ్లు చేస్తారో లేదో తెలియని పని పొరపాటున ఒకటి చేశాను. రాసింతర్వాత నేను రాసిన కథని నేనే చదువుదామని ప్రయత్నించాను. దురదృష్టవశాత్తూ నేను రాసిన కథ నన్ను దారుణంగా మోసగించింది. నా పట్ల ఏ మాత్రం గౌరవం లేకుండా, నన్నే చదివించలేకపోయింది. అది చాలదన్నట్లు ఈ కథ ఎవరైనా చివరిదాకా చదవగలరా?చదువుతారా? అన్న అనుమానాన్ని నాలో రేపెట్టింది. ఎన్నిసార్లు, ఎన్నిరకాలుగా తిరగరాసినా తృప్తి కలగలేదు. ఇప్పుడు నాముందు ఉన్నవి రెండు దారులు.
    అ) ఇతివృత్తంలో సామాజిక ప్రయోజనాంశం ఉన్నా, చదివించలేకపోవటంవలన అది సిద్ధించదు. అది తెల్సిన నేను కథలు రాయటం మానెయ్యాలి. లేదూ కథారచనలో నిష్ణాతుడ్ని(?) అయింతర్వాతనే కథలు రాయాలి. అప్పటిదాకా నేనింకేమీ చెయ్యగూడదు. నా సంస్పందనలని నాలోనే సమాధి కానివ్వాలి. కానిస్తాను. దాంతో నన్ను రగిలించిన సామాజిక స్పృహ నిరుపయోగంగా నాలోనే మిగిలిపోతుంది. ఆ విశేషాలని అవశేషాలుగా మిగిలిపోనీ!
    ఆ) చదివించలేకపోతేనేం? సామాజిక ప్రయోజనం ఉంది అని నాకు నమ్మకం కలిగింది కదా! దీన్ని ఏదో ఒక రకంగా(?) వెలుగులోకి తెస్తాను. నిబద్ధతకి ప్రమాణం పఠనీయత కాదంటున్నారుగా? చదవగలిగినవాళ్లే చదువుతారు. కుదరకపోతే వదిలేస్తారు. సుమించిన ప్రతి కుసుమానికీ సువాసన ఉంటున్నదా? లేకపోతే లేకపోనీ గుడిలోకో, జడలోకో చేరుతున్నదా? చేరకపోతే చేరకపోనీ!
    2. నేనో చెయ్యి తిరిగిన రచయితని. పాఠకుడితో ఒక్క బిగువున చదివించగలిగేలా కథ రాయగల సామర్థ్యం ఉంది. నిరంతర అధ్యయనశీలిని. కాని, నా నిత్యజీవితం నన్ను కదిలిస్తున్న అనుభవాల్లో సామాజిక ప్రయోజనం ఉన్న కథాంశం ఏమీ కనపడటం లేదు. సకృత్తుగా అలాంటిది గోచరించినా నా సామాజికనేపథ్యం దానికో కథ రూపం ఇవ్వడానికి అనుకూలం కాదు. మూలాల్లోకి వెళ్లి కథకి అవసరమైన మరింత ‘ముడిసరుకు’ని సేకరించడానికి నేనున్న పరిస్థితి నన్ను అనుమతించదు. ఏం చెయ్యాలి? ఆ అనుభవాలకి కథారూపం ఇవ్వకుండా వదిలెయ్యాలి. ఓ కథగా మలచటానికి అనువైన ఇతర ఇతివృత్తాలు నా దగ్గర కొన్ని ఉన్నాయి. అదృష్టవశాత్తూ, అవేవీ వారం వారం పాఠకుల రక్తనాళాల్ని వేడెక్కించేవి కావు. కాని, కథ-దాని ప్రయోజనం అన్న మీమాంస వాటిని కథగా మలచకుండా నన్ను వెనక్కి లాగుతోంది. నేను వీటితో కథ రాయాలా, వద్దా? రాయొచ్చా, రాయగూడదా? నాలో ఒక ద్వైధీభావం, కథ రాయాలని కూర్చున్నపుడల్లా నాతోనే నాకు ఒక సంఘర్షణ. ఫలితంగా చదివించగలిగేలా కథ రాయగల నా ప్రతిభావ్యుత్పత్తులు నాలోనే అణగారిపోతున్నాయి. నాలో ఒక నిస్పృహ. దాంతో నా చుట్టూ అనేక ప్రశ్నలు. దీని మీదనే కథ రాయి. దాని మీద రాయకు. దీని మీద రాస్తేనే కథ. దాని మీద రాస్తే కథ కాదు. దీని వల్లనే ప్రయోజనం ఉంది. దాని వల్ల లేదు. ఇలా అనేది, ఆ ప్రయోజనాన్ని నిర్దేశించేది ఎవరు? పాఠకులా? సమీక్షకులా? విమర్శకులా? మాధ్యమాలా? ఈ ప్రశ్నలు ఎదురుకాకుండా నా మానాన నేను, నాకు బాగా చేతనయిన పని చేసుకోకూడదా? నా హక్కు కాలరాయటానికి వీళ్లెవ్వరు? ఉపయోగం ఉందనుకుంటే చదువుతారు. లేకపోతే చదివి పక్కన పెట్టేస్తారు. ఇలాంటి నాకు ఇప్పుడు మిగిలినవి రెండు దారులు.
    1. సామాజిక ప్రయోజనం ఉన్న కథలే రాయాలంటున్నారు, అవి నేను రాయలేకపోతున్నాను కనక కథలు రాయటం మానెయ్యాలి. దాంతో చదివించగలిగే కథలు తగ్గిపోతాయి. తగ్గిపోనీ!
    2. సామాజిక ప్రయోజనాన్ని ప్రక్కన పెట్టి; చదివించగలిగే కథలు రాయటం. సామాజిక ప్రయోజనం ఆశించేవాళ్లు చదవరు. చదవకపోనీ! కనీసం మిగిలినవాళ్లయినా ఆదరిస్తారుగా!
    మొదటి వ్యక్తి సామాజిక ప్రయోజనం ఉన్న కథ రాయాలని ఉన్నా, చదివించేలా రాయలేకపోయాడు. లేదూ చదివించలేని కథలు రాశాడు. రెండో వ్యక్తి చదివించే కథ రాయగలిగినా, సామాజికప్రయోజనం అనేటప్పటికి వెనక్కి తగ్గాడు. లేదంటే ఆ ప్రయోజనం లేని కథలు రాస్తున్నాడు. జనాకర్షకకథలు రాయగలిగినా కొందరి విమర్శలకు గురవుతున్నాడు.
    ఒకదాని ఫలితం-ఒక ప్రయోజనం ఆశించి కథ చదివేవాళ్లు, అది కనపడక చదివించగలిగిన కథలకి దూరంగా జరగటం. రెండోదాని ఫలితం-ఆ ప్రయోజనం ఉన్నా, చదివించలేకపోవటంతో ఆ కథలని దూరంగా పెట్టటం.
    చదివించగలిగే కథల సంఖ్యా, అలాంటి కథలు రాసేవారి సంఖ్య క్రమంగా తగ్గిపోవటానికీ; చదివించలేని కథల సంఖ్యా, అవి రాసేవారి సంఖ్యా పెరగటానికి ఉన్న కారణాల్లో ఇదొకటి. రెండిటి తుది పరిణామం ఒకటే. సాహిత్యం ప్రాథమిక బాధ్యత సామాజిక ప్రయోజనం. నిజమే! సాహిత్యంలో ఓ ప్రక్రియ అయిన కథ ఆ బాధ్యత పట్ల నిబద్ధత కలిగి ఉండాలి. అలాగే అనుకుందాం. కాని-ఆ కథ ఎంతమందిని చేరుతోంది? వారిలో ఎంతమంది ఆ కథ ద్వారా కలిగే ప్రయోజనాన్ని గుర్తిస్తున్నారు? ఎంతమందికి అది రుచిస్తోంది? ఎంతమంది దాన్ని స్వీకరించి తదనుగుణంగా మారడానికి సిద్ధపడుతున్నారు?
    కథకులు కావడం కోసం పాఠకులుగా మారినవారి సంఖ్యనీ, కథకులుగా మారిన పాఠకుల సంఖ్యనీ; సమీక్షకులుగా, విమర్శకులుగా, సంకలనకర్తలుగా రకరకాల పాత్రలని నిర్వహిస్తున్నవారినీ; మొత్తం పాఠకుల్లోంచి తీసేస్తే, చదవటం మినహాయించి కథకు సంబంధించిన ఏ ఇతర పాత్రనీ నిర్వహించని మిగిలిన పాఠకులు ఎంతమంది? ఇది నాణేనికి ఒక వైపు.
    రెండో వైపు. ఏదో ఒక వాదానికి కట్టుబడి కొందరు కథలు రాస్తున్నారా? దాంతో కథకుల్లో ఏవన్నా వర్గభేదాలేర్పడుతున్నాయా? అది నిజమయితే, ఒక వర్గం తమ లక్ష్యసాధనకు కథను ఒక పరికరంగా వాడుకోవటంతో, మిగిలిన వర్గాలకు చెందిన పాఠకులు అలాంటి కథలపట్ల నిరాసక్తత చూపెడుతున్నారా? దాంతో అన్నిరకాల కథలు రావటమూ, పాఠకులూ రకరకాల కథలు చదవటం ఆగిపోయి; కొన్ని కథలు, కొందరు పఠితలు మాత్రమే ఇష్టపడే పరిస్థితి ఏర్పడిందా? మిగిలిన కథల లక్ష్యాలూ, గమ్యాలూ, అవి సాధించే ప్రయోజనాలు మాకు సంబంధం లేనివని కొందరు పాఠకులు విశ్వసించే స్థితి కలిగిందా?
    వైవిధ్యం లేని ఇతివృత్తాలూ, కథాంశానికి సరిపడని కథనరీతులూ, ఉన్న సమయం చదవటానికి సరిపోతుందో లేదో అన్న అనుమానం కలిగించే కథాపరిమాణాలూ, పాఠకుడ్ని తనలోకి లాక్కోలేని కథాప్రారంభాలూ, విధి నిర్వహణ మరిచి పేరాలకు పేరాలు ఉపన్యాసాలు గుప్పించే పాత్రలూ, పాత్రోచితం అనిపించని సంభాషణలూ, ఒక ప్రాంతంవారు మాత్రమే సౌకర్యంగా చదవగలిగిన భాషవాడకం, లోపభూయిష్టమైన వాక్యనిర్మాణం, మితిమీరిన పరభాషాపదప్రయోగం, ప్రారంభంతో పొసగని పొంతన లేని ముగింపులు; చాలదన్నట్లు అడపాదడపా కథ ముసుగు తొడుక్కుని దడిపించే వ్యాసాలు.
    కొంత, క్షమించండి; కొంతంటే కొంతే మినహాయింపుతో స్థూలంగా తెలుగు కథ ప్రస్తుత పరిస్థితి ఇది. ఇది నిజమని నమ్మగలిగితే, (అ) చదివించలేక పాఠకుడికి దూరంగా జరుగుతోన్న కథని పాఠకుడి దగ్గరకు చేర్చటం ఎలా? (ఆ) చదవగలిగిన కథ సమీపానికి చేరటానికి ఇష్టపడని పాఠకుడ్ని కథలోకి ప్రవేశించేలా చెయ్యటం ఎలా? అనే దాని గురించి ఒక ప్రయోజనకరమైన చర్చ జరగనివ్వండి.
    చదివించగలగటం కథ ప్రాథమిక లక్షణం. అది మర్చిపోయి కథ-సామాజిక ప్రయోజనం గురించి మాత్రమే మాట్లాడటం ముంతకున్న చిల్లులు మర్చిపోయి, మబ్బుల్లో నీళ్ల గురించి ఆలోచించటం.

  7. satyanarayana says:

    “కొత్త తరం రచయితల్లో చాలామంది….విషయాన్ని, సమస్యను లోతుగా అధ్యయనం చేయకుండానే కథలు రాస్తున్నారు. రచనను సీరియస్ గా తీసుకుంటున్న వారూ తగ్గిపోతున్నారు. ”

    జి ఎస్ రామ్మోహన్ గారు చక్కగా చెప్పారు .
    ఇప్పుడు ఆలోచించాల్సిన విషయాలు వేరే ఉన్నాయన్నారు ,మీరే విపులీకరిస్తే బాగుంటుంది .
    మంచి సాహిత్యం ,అన్ని కోణాల్లోనూ ఉత్తమంగా ఉండాలి . ప్రయోజనం అతి ముఖ్యం .
    సామాజిక స్పృహ లేని సాహిత్యానికి విలువ ఉండదు .
    పాపులారిటీ విషయానికి వస్తే ,జనబాహుళ్యం maturity మీద ఆధారపడి ఉంటుంది .

  8. g b sastry says:

    రచించిడమనేది ఒక కళా రూపమని ఒప్పుకున్నాక ,రచయిత తన స్పందనని,తన తీరులో,తనకి స్పందన కల్గించిన కోణాన్ని ఆవిష్కరిస్తారు అది ఇలా ఉండాలి అలా ఉండాలి అనడం రచయిత హక్కులని హరించడంగా చూడాలి
    నచ్చితే చదివి మెచ్చుకో దాలిస్తే మెచ్చుకోవాలి నచ్చకుంటే చెప్పాలనుకుంటే చెప్పాలి అంటే కానీ ఇలాగే ఈవస్తువుమీదే రాయాలనడం భావ్యం కాదు

  9. కె.కె. రామయ్య says:

    ” నేటి తరం కథల్లో సామాజిక అంశాలుకు మితిమీరిన ప్రాధాన్యం ఇస్తూ తెలుగు కధ మూసలో చిక్కుకు పోయిందా ”
    … మంచి చర్చను ప్రారంభించిన చందుతులసి గారికి, తమ అమూల్యమైన అభిప్రాయాలను వెలిబుచ్చింది క్రింది వారికి ధన్యవాదాలు. గత రెండేళ్లలో సారంగ, కినిగె, వాకిలి, ఈమాట వంటి అంతర్జాల పత్రికల్లో చాలా మంచి కధలు వచ్చాయి ( అనుభవజ్ఞులు, కొత్తవాళ్ల మేలుకలయికతో ).

    ఎన్. వేణుగోపాల్ (సామాజిక స్పృహతో కూడిన సాహిత్యం కోసం మరింత అప్రమత్తంగా వుండాలి); కె.ఎన్ మల్లీశ్వరి ( సమాజంలోని సామాజిక, రాజకీయ, ఆర్థిక సాంస్కృతిక పరిణామాలు ఏదో మేరకు సాహిత్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి ); ఓల్గా ( సామాజిక ఇతివృత్తాలతో కథలు రాసేవారు కూడా కేవలం సమస్యను చెప్పడం దగ్గరే ఆగిపోకుండా…సమస్య లోతుల్లోకి వెళ్లి చర్చించాలి); జీఎస్ రామ్మోహన్ (కొత్త తరం రచయితల్లో చాలామంది….విషయాన్ని, సమస్యను లోతుగా అధ్యయనం చేయకుండానే కథలు రాస్తున్నారు); కూర్మనాథ్ (కథా వస్తువును ఎంచుకోడం, తోచిన (చేతనైన) శిల్పంతో రాయడం రచయితల ప్రాపంచిక దృక్పథం మీద ఆధారపడి ఉంటుంది. అది సొంత పూనికతో, చదువుతో, సమాజంతో సంభాషణతో పదునుతేరుతుంది).

  10. Ramana Yadavalli says:

    పై వ్యాసంతో సంబంధం లేని వ్యాఖ్య –

    నా హాస్పిటల్ వెయిటింగ్ హాల్లో రావిశాస్త్రి పటం వుంటుంది. మెడికల్ కంపెనీల కుర్రాళ్ళు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, డాక్టర్లు, ప్లీడర్లు, ఇంజనీర్లు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.. ఇప్పటివరకూ ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా రావిశాస్త్రిని గుర్తు పట్టలేదు!

    మొన్న ఒక సీనియర్ డాక్టరుగారు రావిశాస్త్రి ‘వేయిపడగలు’ రాశాడని సెలవిచ్చారు. ప్రస్తుతం తెలుగు సాహిత్యం పరిస్థితి.. ఇలా వుంది!

    మనం యేం రాసినా, యెలా రాసినా ఇబ్బంది లేదు. ఎందుకంటే తెలుగులో కొన్నాళ్ళకి రచయితలు తప్ప పాఠకులు మిగలరని నా అభిప్రాయం. Thanks to corporatization of education.

  11. కొట్టం రామకృష్ణారెడ్డి says:

    చర్చ బాగుంది . అనిల్ రాయల్ గారితో ఏకీభవిస్తున్నా ను .

  12. Amarendra Dasari says:

    పరిసరాల స్పృహ లేకుండా, ఆ యా ఘటనలకు స్పందించకుండా ఎవరైనా ఒక్క పదమైనా ఎలా రాయగలరూ ?

  13. నీహారిక says:

    రావిశాస్త్రి గారెవరో రమణగారు వ్రాసేవరకూ నాకే తెలియలేదు. నా తరువాత తరానికి ఎలా తెలిసేది ? ఒక రచయత సామాన్యుడి గుండెల్లోకి చేరాలంటే చాలా పెట్టిపుట్టి ఉండాలి. ప్రతిదాన్నీ ఎర్రబడ్డ కళ్ళతోనే చూడడం సరికాదు. రచయిత్రి ఓల్గా గారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నాను. రచన సామాజికమైనా,రాజకీయమైనా,ఆర్ధికమైనా సమస్య మరియు పరిష్కారం తప్పక ఉండాలి అని ఒక పాఠకురాలిగా గట్టిగా కోరుకుంటాను.ఎవరైనా పరిష్కారం చెప్పకుండా సమస్యను లేవనెత్తి వదిలేస్తే వాళ్ళను నేను వదలనే వదలను. పరిష్కారం లేని సమస్యలే ఉండవు. సమస్య పరిష్కరించబడిందా లేదా అనేది వేరే విషయం.
    ఒక సమస్యనుండి మరొక సమస్యకు సాగే ప్రయాణమే జీవితం !

    • Ramana Yadavalli says:

      నీహారిక గారూ,

      “రావిశాస్త్రి గారెవరో రమణగారు వ్రాసేవరకూ నాకే తెలియలేదు.”

      – నా బాధల్లా ఇదే!

      “ప్రతిదాన్నీ ఎర్రబడ్డ కళ్ళతోనే చూడడం సరికాదు.”

      – తహీరో గారు మీ కామెంట్‌ని సరీగ్గా అర్ధం చేసుకోలేదని నా అనుమానం. మీరీ వాక్యం రావిశాస్త్రిని కాకుండా – నన్ను ఉద్దేశించి రాశారని అనుకుంటున్నాను.

      ప్రస్తుతం తెలుగు సమాజం ఎంత “వేగం”గా వుందో తెలియజెప్పడానికి మాత్రమే రావిశాస్త్రి బొమ్మ ఉదాహరణ రాశాను. అంతేతప్ప – ఎటువంటి “ఎర్రకళ్ళ” దురుద్దేశాలు లేవని గ్రహింప ప్రార్ధన! :)

  14. దేవరకొండ says:

    మంచి చర్చ ‘మన’ కథలపై జరగడానికి కారకులైన వారికి ముందుగా ధన్యవాదాలు. ఒక కథ అచ్చులోగానీ అంతర్జాలంలో గాని వెలుగు చూసిందంటే అది కొన్ని అగ్నికుడ్యాలని (firewalls ) ని దాటుకుని వస్తుందని అందరికీ తెలుసు. ఇతివృత్తాలు, లక్ష్మణ రేఖలూ నిర్దేశించే నిజమైన అధికారం ఈ firewalls దగ్గరే కేంద్రీకృతమవుతుంది. వారు పత్రికాధిపతులు కావచ్చు, చీఫ్ ఎడిటర్లు కావచ్చు. లేదా ఇతర సంపాదక వర్గం కావచ్చు. సాధారణంగా కథల పోటీ నిబంధనలు చాలా వరకు కొంత ఈ పరిమితుల్ని సూచిస్తాయి. నిజానికి ఇతివృత్తాన్ని నిర్ణయించుకునే హక్కు రచయితదే. రచయిత కొంత సంయమనం కోల్పోయినప్పుడు, వివాదాస్పద విషయాలమీద రాసినప్పుడూ ఆ రచన మరింత గందరగోళాన్ని పెంచే అవకాశం ఉన్నప్పుడూ ఈ firewalls అప్రమత్తంగా పనిచేయాల్సి ఉంటుంది. ఒక రచయితకు తన రచన వెలుగు చూస్తుందనో చూడదనో తెలుస్తుంది తప్ప ఈ తతంగమంతా వివరంగా తెలిసే అవకాశం తక్కువ. కనుక ఒక రచన ప్రచురణకు నోచుకోలేదంటే అందుకు కారణాలను నిపుణులైన సంపాదక వర్గం సూచిస్తే అటు రచయితను ప్రోత్సహించినట్లు అవుతుంది, ఇటు రచన పట్ల తమ పారదర్సకతను నిలబెట్టుకున్నట్లు అవుతుంది.

  15. THIRUPALU says:

    పాపం ! రావి శాస్త్రి గారు పెట్టి పుట్ట లేదు. సామాన్యనుని గురించి ఆలోచించడమే ఆయన చేసిన తప్పు !
    దోపిడీ సమాజం ఉన్నంత వరకు రావి శాస్త్రి గారు బ్రతికే ఉంటారు.

  16. కె.కె. రామయ్య says:

    ” రావిశాస్త్రి గారెవరో రమణగారు వ్రాసేవరకూ నాకే తెలియలేదు”. కొంచం పరుషమైన వ్యాఖ్య కాదా. రేపు మరెవ్వరైనా శ్రీశ్రీ గారెవరో నాకే తెలియదు అంటే ఆ వ్యాఖ్యను ఏవిధంగా స్వీకరించాలి?

    అల్పజీవి, రత్తాలు రాంబాబు, గోవులొస్తున్నాయి జాగ్రత్త, రాజు మహిషి, మూడు కథల బంగారం, ‘సొమ్మలు పోనాయండి’ వంటి నవలలు, సారా కధలు, పిపీలికం వంటి కధల ద్వారా ప్రాచుర్యం పొందిన రావిశాస్త్రి గారు (1922 -1993) , సుప్రసిద్ధ విప్లవ రచయిత రావిశాస్త్రి గారు ( రాచకొండ విశ్వనాథ శాస్త్రి – కథలలో కవిత్వమే రాస్త్రి !! ) … శ్రీశ్రీ, పురిపండా లాంటి సాహితీ దిగ్గజాలను, తన కాలం ప్రముఖ రచయితలను మెప్పించిన రావిశాస్త్రి …. తెలుగు సాహిత్యం పట్ల అభిరుచి ఉన్న ఎవరికైనా తెలియకుంటే అది వారి లోపం, వారికే నష్టం.

    ” ఆధునిక వచన సాహిత్యాన్ని సామాన్యుడి వెతలు అనే మానవీయ కోణం నుండి ఆవిష్కరించిన రతనాల కొండ … రాచకొండ. కేవలం బడుగు వర్గాల కష్టాలను తన రచనల్లో చిత్రించటమే కాక ఒక న్యాయవాదిగా వారి బాసట నిలిచారు. అధికార మదానికి, ధన మదానికి వ్యతిరేకంగా రచనలు చేశారు “.

    భావి రచయితలకు ఆయన ఇఛ్చిన సందేశం : ” సమాజాన్ని రచయిత ప్రభావితం చెయ్యక తప్పదు. రచయిత ఒక ద్రష్టగా సమకాలీన సమాజంలోని దౌర్బల్యాల్ని ఎట్టి చూపించడం ద్వారా, ఉత్తేజాన్ని కలిగించి, స్పూర్తితో సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి. అది రచయిత సామాన్య ధర్మం ”

    తెలుగులో వచనమెంత గొప్పగా రాస్తారో ఇంగిలీషు లోనూ అంత గొప్ప వచనం రాసిన నాటి తరం మేటి రావిశాస్త్రి గారు. ( ఆ బాబుకి మరో గొప్ప తెలుగు కదా రచయిత త్రిపుర గారంటేనూ ఎంతో అభిమానమని ఈ సందర్భంగా సవినయంగా తెలియ జేసుకుంటున్నాను. )

    డా. యడవల్లి రమణ గారూ, తెలుగు సాహిత్యం ఉన్నంతవరకూ రావిశాస్త్రి తన రచనలలో, పాఠకుల హ్రదయాల్లో జీవించి ఉంటారు; ఎవరు గుర్తుపట్టినా పట్టకున్నా ( విశాఖ సంద్రం, యారాడ కొండల్లా ). కార్పొరేట్ ఇస్కూల్ బడుల పొట్టిగాళ్ళ ను మించిన విశాలమైనది ప్రపంచం అని నిరూపించాల్సిన బాధ్యత నేటితరం తెలుగు రచయితల పై ఉంది.

    • తహిరో says:

      అయ్యా! రామయ్య గారూ ,
      అంతపూర్తి అర్థం చేసుకొపొతె ఎలా ? నీహారిక గారు నాకు తెలియదంటూనే “ఎర్ర బడ్డ” కళ్ళతో చూస్తే ఎలా అన్నారు . దీన్ని బట్టి రావిశాస్త్రి గారు “నీహారిక ” గారికి తెలియదనడానికి వీల్లేదు – ఆ మాటల్లో వెటకారం కనిపించలేదా ? తమరేమో దొరికిందే ఛాన్స్ అన్నట్టు రావిశాస్త్రి పుట్టు పూర్వోత్తరాలు ఏకరు పెట్టారు – బాగుందండీ మీ వరస. మీ అమాయకత్వం కూలా ! నీహారిక గారు మరోసారి “నాకు సూర్యుడు , చందమామ కూడా తెలీదు ” అన్నారనుకోండి – ఆహా ఒకవేళ అన్నారనుకోండి తమరు నవ గ్రహాలు తొమ్మిది – అందులో సూర్యుడు ఒకడు వాడు వెచ్చగా ఉండును . మరో గ్రహం భూమి – దాని ఉపగ్రహం చందమామ . వీడు వెన్నెల కురిపించును – చల్లగా ఉండును అని మొదలెడతారేమో !
      రావిశాస్త్రి గారు ఆ “ఎర్ర బడ్డ ” కళ్ళతోనే జాతకాలు చూపించుకునేవారట మరి – ఔరా ! “ఎర్ర బడ్డ” కళ్ళ వారు “భీ” జాతకాలు నమ్ముతారన్న మాట – ఏమి చిత్రం !

      • prj.పంతులు. says:

        ఎర్రబడ్డ కళ్ళ వారు జాతకాలు నమ్మకూడదా ?ఇంకా ఏమేం చెయ్యాలో చెప్పరూ దయచేసి .నేనూ కళ్ళు ఎర్రబెట్టుకుందాం అనుకుంటున్నాను .ముందు ఆ లక్షణాలన్నీ ఒంటబట్టించుకుని అప్పుడు కళ్ళు ఎర్రబెట్టుకునే ప్రయత్నం చేస్తాను .

  17. chandolu chandrasekhar says:

    సామాజిక వాసన లేకుండా మనిషే ఉండటం కష్టం .ఇక రచయిత మనుగడ మరి క్లిష్టం .కాకపోతే వస్తువు -శిల్పం మధ్య సమన్వయం అవసరం .సాహిత్య చర్చ లో పాల్గొంటూ , రావిశాస్త్రి తెలీదు అంటే మరి బాధ్యత రాహిత్యం .వేదసాహిత్యం నుండి ఇప్పటిసాహిత్యం వరకు సామాజిక అనువాదాలు అయినప్పుడు రాజకీయం లేకుండా ఎలా ఉంటాయి .

  18. కె.కె. రామయ్య says:

    తెలుగు సాహితీ వటవృక్షం రావిశాస్త్రి ( రాచకొండబాబు ) గారి గురించి వెటకారం చేసే హక్కు నీహారిక గార్లకి గజరచయితలకి ఉంటే ఉండొచ్చు. వాటిని నోరుమూసుకుని దిగమింగాల్సిన అగత్యం కూడా తెగులు పాఠకులుగా మాకు పట్టిఉండవచ్చు. బడుగు వర్గాల దయనీయ స్థితి, ఆ స్థితికి వారిని నెట్టేస్తున్న పరిస్థితులను తేటతెల్లం చేస్తూ పూర్తి వామపక్ష భావజాలంతో రచనలన్నీ చేసినందుకే ఈ వెటకారం అనుకుంటా ( గాంధీ తాత మేకపాలు తాగేవాడు తెలుసా, నెహ్రూ చాచా సిగిరెట్లు ఊదేవాడు తెలుసా, రావిశాస్త్రి జాతకాలు చూపించుకునేవారట తెలుసా, శ్రీశ్రీ గారింట్లో సత్యనారాయణ వ్రతం చేశారు తెలుసా అంటూ ట్రివియల్ విషయాల మీదకి వెళ్లే ఉత్సాహంతో ).

    జీవిత అవసాన దశలో, పక్షవాతంతో ఒకచెయ్యి పనిచెయ్యనప్పుడు కూడా తన ఆఖరి రచన “ఇల్లు” నవల ఇఛ్చి 1993 నవంబరు10న యీ లోకాన్ని విడిచి వెళ్లిన రావిశాస్త్రిగారు అజరామమైన రచనలతో తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. వామపక్ష ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచి అనేక కష్టనష్టాలకు ఓర్చుకున్నారు.

    తమజాతి కోసం జీవితాంతం అలుపెరుగని పోరుచేసిన కలంయోధులు ఓ రాచకొండబాబు, ఓ కొ.కు. నాయన, ఓ శ్రీశ్రీ లాంటి వాళ్లు తెలుగులో కాకుండా మరే భాషలోనో ఉండి ఉంటే వాళ్లకు బ్రహ్మరధం పట్టిఉండే వాళ్లు. మనం మేధోసంపత్తి, ఇండివిడ్యువాలిటీ ఎక్కువ ఉన్న టెల్గూస్ వి కదా అందుకే అలా చెయొద్దు. ఈ అనవసర వెటకారానికి మన్నింపు కోరుతూ …

    • తహీరో says:

      తవరితో ఎట్టుకుని బతికి బట్ట కట్టినోడు ఈ పెపంచంలో లేడనుకుంటా – మీ తర్కానికి ఏసుకోండి ఏడు వీరతాళ్ళు. నా మాటలు కూడా తవరికి ఎటకారంగా వినిపించాయా సామీ ! ఎంత గొప్పోడికైనా బలహీనతలు ఉంటాయి – వొప్పుకుంటా, ఎర్రబడ్డ కళ్ళకీ , జ్యోతిష్యానికీ సఖ్యత కుదరదు కదా అని ఆ మాటన్నాను. ఈ రెండూ ఉప్పూ నిప్పుని మీకు తెలీదా ! ఓహో ….మీకు మాత్రమే వారిపట్ల అభిమానం ఉన్నట్టు, మిగతా వారికి ఎటకారం ఉన్నట్టు రాస్తారెందుకు? దీనికి జవాబివ్వకపోతె అదే పదివేలు – ఇక నా ఊసెత్తకండి.

  19. ari sitaramayya says:

    మంచి చర్చ జరుపుతున్న చందు తులసి గారికి కృతజ్ఞతలు.
    నీహారిక గారు “రచన సామాజికమైనా,రాజకీయమైనా,ఆర్ధికమైనా సమస్య మరియు పరిష్కారం తప్పక ఉండాలి అని ఒక పాఠకురాలిగా గట్టిగా కోరుకుంటాను.ఎవరైనా పరిష్కారం చెప్పకుండా సమస్యను లేవనెత్తి వదిలేస్తే వాళ్ళను నేను వదలనే వదలను. పరిష్కారం లేని సమస్యలే ఉండవు. సమస్య పరిష్కరించబడిందా లేదా అనేది వేరే విషయం. ఒక సమస్యనుండి మరొక సమస్యకు సాగే ప్రయాణమే జీవితం!” అన్నారు.
    సమస్యలన్నిటికీ తగిన పరిష్కారాలుంటే ఎంత మంచిదో! చాలా సమస్యలకు ఇది సరైన పరిష్కారం అని నేను గట్టిగా చెప్పలేను. సమస్యను పూర్తిగా అర్థంచేసుకున్నాను అని అనుకోవడం కూడా చాలా సందర్భాల్లో దుస్సాహసమే. ఒక సందర్భంలో సమాజంలో మంచిది అనిపించిన పరిష్కారం మరో సందర్భంలో సమాజంలో కాకపోవచ్చు. పైగా ఒక సమస్యకు రకరకాల పరిష్కారాలు ఉండవచ్చు.
    నా అభిప్రాయంలో ఒక పాత్ర అనుభవించిన సంతోషాన్నో, కష్టాన్నో, బాధనో, కోపాన్నో పాఠకులకు చేర్చ గలిగితే, పరిష్కారాలు వారికే వదిలెయ్యగలిగితే రచయిత తన “బాధ్యత”ను సక్రమంగా నిర్వహించాడు అనిపిస్తుంది. అలా రాస్తున్న రచయితలు, రాసిన కథలు తెలుగులో చాలా ఉన్నాయి. ఉదాహరణకు నాకు బాగా ఇష్టమైన కథ ఓల్గా గారి “తోడు”.

  20. చంద్రశేఖర్ కర్నూలు says:

    తెలుగు కథల్లో చాలాకాలంగా వస్తునిస్సారం రాజ్యమేలుతూ ఉండేది. అందువల్ల ప్రామాణిక స్థాయిలో కథలు రాలేదు. సమాజంలోని వివిధ శ్రేణుల్లో వస్తున్న మార్పుల్ని గుర్తించడంలో తెలుగు కథకులు పరిమితులకు లోనయ్యారేమో అనిపిస్తుంది. బహుశా ఈ కారణంచేతనే తెలుగు కథల్లో పూర్ణ పాత్రల ఆవిష్కరణగానీ గుర్తుంచుకోతగిన పాత్రల చిత్రణ గానీ చాలా తక్కువ అయ్యింది.
    తెలుగు కథకులు ఉద్యమాల ప్రభావాలలోంచిగానీ, బయటినుంచి వస్తున్న సాంస్కృతిక, సామాజిక, ఆర్ధిక ప్రభావాలలోంచిగానీ బయట పడి భారతీయ సామాజిక చిత్రణకు పూనుకుంటే తప్ప మనం జీవితాలను ఆవిష్కరించగల గొప్ప కథల్ని చూడలేం.
    వొక విషాదం ఏమిటంటే ఉద్యమాలనుంచిగానీ, పాశ్చ్యాత్య ప్రభావలనుంచిగానీ మన కథకులు సామాజిక విస్తృతినిగానీ, క్రొత్త వొరవడులనుగానీ నేర్చుకోలేక పోయారు. కొందరు గ్రాహకులు కొంత జ్ఞానాన్ని పొందినప్పటికీ వ్యక్తీకరణలో పరిమితులనుంచి బయటపడలేక పోతున్నారు. పాశ్చ్యాత్య ధోరణులనుంచి పొందిన శిల్ప చాతుర్యాన్ని వస్తు వ్యక్తీకరణలో పూర్తిగా ఉపయోగించుకోలేక పోతున్నారు. కొందరు పరిశీలకులు దీనిని శిల్పలౌల్యం అంటున్నారు.
    విషయ విస్త్రుతిలోనూ వ్యక్తీకరణలోనూ పరిమితిని శిల్పలౌల్యం చాటున దాచి చదువరులను భ్రమింపజేస్తూ దబాయిస్తూ వారి స్థాయిని కూడా కథకులే నిర్ణయిస్తున్నారు.
    క్రొత్త సామాజిక మాధ్యమాలతో పాఠకుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సామాజిక అంశాల విస్త్రుతి కథ మరింత పరిణతి సాధించడానికి తోడ్పడుతుంది.

  21. D Subrahmanyam says:

    నిహారిక గారు బహుశా బెట్రోల్ట్ బ్రెట్ పేరు విని ఉండరు. వారు బహుశా రావి శాస్త్రి గారి ఆరు సారా కధలు కూడా చదివి ఉండకపోవచ్చు.

    1. బ్రెట్ తన alienation సిద్ధాంతం లో నటులు పాత్రలో లీనమయి నటించకుండా తాము ఏమి చెపుతున్నామో అవి ప్రేక్షకులు ఆలోచించే విధంగా ఉండాలని చెప్పారు. అప్పుడు ఆ సన్నివేశాల్లో చూపించ బడిన అనేక విషయాలు ఎలా పరిష్కరించ బడాలో వాళ్లే ఆలోచించుకోవాలి.

    2. శాస్త్రి గారి ఆరు సారా కధల్లో ఇంచుమించు అదే మార్గం లో వెళ్ళేరు. అప్పటి సారా వ్యాపారం prohibation ను దృష్టి లో పెట్టుకొని ప్రజలకు జరుగుతున్న, ముఖ్యంగా బడుగు మనుషలకు జరిగే అన్యాయం గురించి రాసారు. ఆయన రాజ్య దుర్మార్గం గురించి కూడా రాసారు. అయితే ఎలా ఎదురుకోవాలో మన ఆలోచనకి (ఉంటే!) వదిలారు.

    అయ్యా ఇదీ సంగతి

  22. Raghavendra says:

    సమాజపరిణామగతిలో నేటివేగజీవితంలో, “ఈగవాలనీయని వీరపూజ” అనేది ఫ్యూడల్ సంస్కృతి అవశేషం గానేకనపడుతుంది.బ్రహ్మరధాలూ,వీరగంధాలూ ఈ “గోడమీది రాత” నుచూడలేని భట్రాజులకూ, రాజకీయరంగాలకే పరిమితం.పరిష్కరింపదగిన సమస్యపై పాఠకులను ఆలోచింపజేస్తేచాలు.రచయిత సఫలీకృతుడయినట్లే.అలాకాక నిష్కృతిని కూడా రచయితే సూచించపూనుకోవడమంటే రచనస్థాయిని దిగజార్చడమే.

  23. ఎ కె ప్రభాకర్ says:

    చర్చలో పాల్గొనే వారు కొందరు కావాలనే పక్కదారి పట్టిస్తారేమో! (రాణి శివశంకర్ అసలు కోణం కథలోలా)దాంతో చూపే వస్తువు మీదకు కాకుండా వేలి మీదకు దృష్టి పోతుంది . సమకాలీనమైన సామాజికాంశాలను కథలోకి తీసుకురావడమే తప్పు అని శాసించే హక్కు ఎవరికీ లేదు .వాటిని కళాత్మకంగా చెప్పలేనప్పుడు ఆ కథలు ఆత్మహత్య చేసుకుంటాయి . కథ కాలక్షేపం కోసం అన్న వాదన ఇటీవల ఎక్కువయింది. సమాజానికి దూరమైన రాతబల్ల రచయితల నుంచి ఈ వాదనలు వస్తున్నాయి . రచయితలు ప్రజా సంబంధాలలో వున్నప్పుడు ప్రజా సమస్యల గురించి బలంగా రాయగలుగుతారు. కథలోని పాత్రలు సంభాషణలు సంఘటనలు కథ చెప్పే టెక్నిక్ , భాష తో సహా తన చుట్టూ ఉన్న సమాజం నుంచే రూపొందించుకుంటారు. లేదా సహజంగానే రూపొందుతాయి. ఒక సామాజిక / ప్రాపంచిక దృక్పథంతో రచన చేసేవాళ్లు కథా నిర్మాణ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి . వాళ్లని ఆ దిశగా ఆలోచింపజేయడనికి యీ చర్చ దోహదం చేస్తుందని ఆశిస్తాను .

    • ari sitaramayya says:

      ఏ కె ప్రభాకర్ గారు “కథ కాలక్షేపం కోసం అన్న వాదన ఇటీవల ఎక్కువయింది. సమాజానికి దూరమైన రాతబల్ల రచయితల నుంచి ఈ వాదనలు వస్తున్నాయి . రచయితలు ప్రజా సంబంధాలలో వున్నప్పుడు ప్రజా సమస్యల గురించి బలంగా రాయగలుగుతారు,” అన్నారు.
      ప్రభాకర్ గారు మంచి విమర్శకులు అని విన్నాను. వారి నుంచి ఇంత సంకుచితమైన వ్యాఖ్యను నేను ఊహించలేదు.
      రచయితలను “ప్రజా సంబంధాలలో” ఉన్న వారు, “సమాజానికి దూరమైన రాతబల్ల రచయిత”లు గా విడదీశారు.
      మొదటిరకం బలమైన కథలు రాయగలరు, రెండోరకం కాలక్షేపం కోసం రాస్తారు. ఇదీ వీరి ఉవాచ.
      వీరి నిర్వచనం ప్రకారం చెఖోవ్, మొపాసా రాతబల్ల రచయితలు! కాలక్షేపం కోసం రాసిన వారు.
      ప్రస్తుత రాజకీయాలలో మీరు ఎటువైపు ఉన్నారో చెప్పుకోవటాని కథలు రాసేవారే బలమైన రచయితలు.
      అలా చెయ్యకపోతే రచయిత సమాజానికి దూరంగా ఉన్నట్లా?
      సమాజానికి దూరంగా అసలు ఏ మనిషి అయినా ఎలా ఉంటాడు?
      లేక ప్రస్తుత రాజకీయాల గురించి రాయని వారు సమాజానికి దూరంగా ఉన్నట్లా?
      సాహిత్యానికీ రాజకీయానికీ ఎంతోకొంత సంబంధం ఎప్పుడూ ఉంటుంది.
      కాని రాజకీయమే సాహిత్యం అనే వాదన …..విచారకరం, to say the least.

    • kurmanath says:

      “కథ కాలక్షేపం కోసం అన్న వాదన ఇటీవల ఎక్కువయింది. సమాజానికి దూరమైన రాతబల్ల రచయితల నుంచి ఈ వాదనలు వస్తున్నాయి .”
      సరిగ్గా చెప్పేరు ప్రభాకర్ గారూ. పైగా దానికదే ఒక వర్ట్యూ లాగా, విలువలాగా, ఆదర్శనీయంగా ప్రచారం చేస్తున్నారు.

  24. THIRUPALU says:

    జీవితాన్ని మెరుగు పరుచుకోవడాని మనిషి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఆ క్రమం లో
    జీవితం సకల రంగాలు మార్పు కు లోనయ్యే కొద్దీ దాన్ని కొత్త కోణాల్లో దర్శించాల్సి వస్తుంది. కొత్త పరిష్కారాలు కనుగొన కలగాలి ! అది సాహిత్యం లో ప్రతిఫలించాలి. అలాంటి వారే సాహిత్య కారులు. అదే సాహిత్య లక్ష్యం. ఎంత ఉబుసు పోక సాహిత్యం ఉన్నా దాన్ని చదివి పారెయ్యాలిసిందే ! జీవితాన్ని ఒక మెట్టు ఎక్క డానికి చేయూత నిచ్చేదే సాహిత్యం. అది మానవ సంస్కృతి లో ఒక భాగం! ఇదే నేను సాహిత్య కారులనుండి నేర్చు కున్నది. ఇది రచయితలే చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. మాలాంటి పాఠకులు కూడా చెప్పొచ్చేమో!

  25. ఎడిటర్ గారికి , నమస్తే. గత కొంత కాలంగా మా “ భట్రాజు ” కులాన్ని కించపరుస్తూ మీ పత్రికలో రచనలు , కామెంట్లు వస్తున్నాయి . వాటిని కట్టడి చేయవలసినదిగా కోరుతున్నాము . లేనిచో చట్టపరంగా చర్యలు తీసుకోవలసి వుంటుందని తెలియచేస్తున్నాము .
    — కూరపాటి కోటం రాజు , అధ్యక్షులు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భట్టరాజ సంఘం , విజయవాడ .

  26. భాస్కరం కల్లూరి says:

    “రావిశాస్త్రిగారు ఎవరో నాకు తెలియదు” అన్న నీహారికగారి వ్యాఖ్య చూశాక సారంగ లాంటి సాహిత్యవారపత్రికకు కామెంట్ రాస్తూ ఆ మాట అనడం నాకు చాలా విపరీతంగానూ, దుస్సాహసంగానూ అనిపించింది. ఇలా అంటున్నందుకు నీహారికగారు మన్నించాలి. నీహారికగారికి రావిశాస్త్రి ఎవరో తెలియకపోవడాన్ని నేను పెద్దమనసుతో అర్థం చేసుకుంటాను. రావిశాస్త్రే కాదు, శ్రీశ్రీ, విశ్వనాథ, దేవులపల్లి, దాశరథి, ఆరుద్ర లాంటి ఎందరో కవీరచయితల పేర్లు వినని వాళ్ళు కోట్లాదిమంది తెలుగువాళ్లలో కనీసం సగం మందైనా ఉంటారు. వాళ్ళ పేర్లు తెలియవలసిన అవసరం లేదు. తెలియడానికి వాళ్ళు మహాత్మాగాంధీయో, జవార్లాల్ నెహ్రూయో, ఇందిరాగాంధియో, నరేంద్ర మోడీయో, కనీసం రాహుల్ గాంధీయో కాదు.సినీ నటులూ కాదు. వాళ్ళ మానాన వాళ్ళు ఏవో వృత్తి ఉద్యోగాలు చేసుకుంటూ తమకోసమూ, తమ లాంటి అభిరుచి ఉన్న పాఠకుల కోసమూ రచనలు చేసినవాళ్లు. వీళ్ళదో చిన్న ప్రపంచం. అందులో వాళ్ళు తృప్తిగా జీవించినవాళ్లు. మనకు తెలిసిన పేర్లు అన్నీ అందరికీ తెలియాల్సిన అవసరం లేదని గుర్తించిన ప్రముఖ పాత్రల్లో గిరీశం ఒకడు. (గిరీశం పేరు తెలియని వారు కూడా ఉంటారనుకోండి). కన్యాశుల్కం(ఈ పేరు కూడా తెలుసో తెలియదో?)లో సురేంద్రనాథ్ బెనర్జీ వగైరా పేర్లు వల్లిస్తూ గిరీశం పెద్ద లెక్చర్ ఇచ్చిన తర్వాత, ఇంతకీ మా వూరు కానిస్టీబుకు బదిలీ అవుతుందా అని బండివాడు (వాస్తవంగా ఏమడిగాడో గుర్తులేదు. పుస్తకం ఎదురుగా లేదు)అడుగుతాడు.
    నేను ముందే చెప్పినట్టు రావిశాస్త్రి ఎవరో తెలియని నీహారికగారి తెలియనినాన్ని నేను తప్పు పట్టాను. కాకపోతే, సారంగ లాంటి సాహిత్యపత్రికకు కామెంట్ రాస్తూ అలా అనడాన్ని మాత్రం తప్పు పడతాను. మనం ఏ కోర్సులో ప్రవేశించాలన్నా అర్హత పరీక్ష ఉంటుంది. అలాగే ఒక సాహిత్యపత్రికలోకి ప్రవేశించాలన్నా ఒక అర్హత పరీక్షను తమకు తామే విధించుకోవాలి. ప్రసిద్ధ కవి రచయితల పేర్లు తెలిసి ఉండడం అందుకు కనీస అర్హత. మనం ఎడం చేత్తో కామెంట్ విసిరి పారేయడానికి సాహిత్యం అంత లోకువగా తీసుకునే రంగం కాదు.

  27. భాస్కరం కల్లూరి says:

    చిన్న సవరణ. “నేను ముందే చెప్పినట్టు రావిశాస్త్రి ఎవరో తెలియని నీహారికగారి తెలియనినాన్ని నేను తప్పు పట్టాను’ అనే వాక్యంలో “తప్పు పట్టాను” అనే మాటను “తప్పు పట్టను”గా చదువుకోగలరు.
    ఇంకో విషయం కూడా. కామెంట్లలో తరచు ఇంకోటి కూడా జరుగుతోంది. ..అలవోకగా ఒక మాట అనడం…దాని మీద వ్యక్తమైన అభిప్రాయాలపై ఆ తర్వాత స్పందించకపోవడం…hit and run అనే పద్ధతిలో అన్నమాట. రావిశాస్త్రి ఎవరో తెలియదన్న నీహారికగారి తెలియనితనం వెనుక నిజాయితీ ఉందని భావిస్తూ, అంతే నిజాయితీతో తన వ్యాఖ్యపై వచ్చిన విమర్శలకు సమాధానం ఇస్తారని ఆశిస్తున్నాను. అలాగే hit and run తరహా వ్యాఖ్యలను ప్రోత్సహించవద్దని సారంగ సంపాదకులకు మనవి చేసుకుంటున్నాను.

    • ari sitaramayya says:

      భాస్కరం గారూ,
      నాకు మీ వ్యాసాలన్నా, వ్యాఖ్యలన్నా చాలా ఇష్టం. మీరు వివరంగా రాస్తారు. అపార్థాలకు తావివ్వరు.
      నేను కూడా అలా రాయగలిగితే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది.
      కానీ, ఈ సారి మీ అభిప్రాయంతో ఏకీభవించ లేకపోతున్నందుకు చింతిస్తున్నాను.
      వ్యాస రచయితలకైనా వ్యాఖ్య రచయితలకైనా ఇతరుల అభిప్రాయాల మీద స్పందిచడమా లేదా అనేది వ్యక్తిగత నిర్ణయం.
      దానిమీద సారంగ సంపాదకులకు ఎలాంటి అధికారం ఉండకూడదు.

      నేను ఎవరినీ ఉద్దేశించి ఈ మాటలు రాయడం లేదు.
      ఒక్కోసారి వాదప్రతివాదాల వల్ల ఒరిగేది ఏమీలేదు.
      కొందరికి విమర్శను స్వీకరించడం అలవాటులేదు. వారితో వాదించి ప్రయోజనం లేదు.
      కొందరి విషయంలో మౌనాన్ని అంగీకారంగా తీసుకోవచ్చేమో.
      సమాధానం తప్పకుండా రాయాలి అని చెప్పడం అంత ఆరోగ్యకరమైనది కాదని నా అభిప్రాయం.

      • భాస్కరం కల్లూరి says:

        సీతారామయ్యగారూ….
        నా వ్యాసాలను, వ్యాఖ్యలను మీరు ఇష్టపడుతున్నందుకు ముందుగా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.
        ప్రస్తుతాంశానికి వస్తే…
        “వ్యాస రచయితలకైనా వ్యాఖ్య రచయితలకైనా ఇతరుల అభిప్రాయాల మీద స్పందిచడమా లేదా అనేది వ్యక్తిగత నిర్ణయం.”
        “ఒక్కోసారి వాదప్రతివాదాల వల్ల ఒరిగేది ఏమీలేదు.”
        “సమాధానం తప్పకుండా రాయాలి అని చెప్పడం అంత ఆరోగ్యకరమైనది కాదని నా అభిప్రాయం.”
        అన్న మీ మూడు వ్యాఖ్యలూ నన్ను ఆలోచింపజేశాయి. వీటిని తరచి చూసిన కొద్దీ, ఒక ఒక రచన చేసి అసంఖ్యాక పాఠకుల ముందు ఉంచడం గురించి, పాఠకుల పట్ల రచయిత బాధ్యత గురించి, వాదప్రతివాదాల గురించి నాలో అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఒక పెద్ద వ్యాసానికి తగిన అంశంగా ఇది అనిపించింది. అందుకే మీ వ్యాఖ్యపై ప్రతిస్పందన ఆలస్యమైంది. ఇప్పుడు పెద్ద వ్యాసం రాసే అవకాశం లేదు కనుక వీలైనంత క్లుప్తంగా నా అభిప్రాయాలు రాయడానికి ప్రయత్నిస్తాను. ఇది సంపూర్ణమూ, సమగ్రమూ అని మాత్రం అనను.
        మీరు అన్నట్టు, ఇతరుల (స్పష్టత కోసం నేను పాఠకులు అంటాను) అభిప్రాయాలపై స్పందించాలా మానాలా అనేది రచయిత వ్యక్తిగత నిర్ణయానుసారమే. అందులో ఎవరి నిర్బంధమూ ఉండనవసరం లేదు. రచయిత స్పందించాల్సిన అవసరం లేని స్పందనలూ ఎదురవుతూనే ఉంటాయి. నేను కూడా అలాంటి స్పందనలను ఎదుర్కొన్నాను. ఉదాహరణకు, నేను ‘పురా’గమన వ్యాసాలు రాస్తున్నప్పుడు రామాయణం, భారతం, పురాణాల కథలు ఇప్పుడు ఎందుకు అని ఈసడించిన ఒకరిద్దరు పాఠకులు ఉన్నారు. నా వ్యాసాలలోనే అలాంటి ప్రశ్నలను నేనే వేసుకుని జవాబు ఇచ్చుకున్నాను కనుక ఈ స్పందనలకు నేను ప్రత్యేకంగా ఇవ్వగలిగిన సమాధానం ఏమీ లేదు. ఒక ముక్కలో సమాధానం ఇవ్వడమూ సాధ్యం కాదు. పైగా అది పునరుక్తి కూడా అవుతుంది. అలాగే మీ రచన పరమ చెత్త అన్నా రచయిత ఇవ్వగలిగిన సమాధానం ఉండదు.
        కానీ మరో రకం స్పందనలు ఉంటాయి. ఉదాహరణకు, ఒక రచనలోని అస్పష్టతనో, అసమగ్రతనో ఎత్తి చూపేవి, లేదా అదనపు వివరాలను కోరేవి, సందేహనివృత్తిని కోరేవీ. “వ్యక్తిగతనిర్ణయా”ధికారాన్ని పురస్కరించుకుని ఇలాంటి స్పందనలకు సమాధానం ఇవ్వకపోవడాన్ని నేను అర్థం చేసుకోలేను. ఇక్కడ వ్యక్తిగతనిర్ణయాధికారం స్థానంలో బాధ్యత అనే మాటను తీసుకొస్తాను. అలాగే ఇక్కడ ఒక రచన యొక్క స్వభావాన్ని తరచి చూడాల్సిన అవసరమూ కలుగుతుంది.
        ఒక వ్యాసం, ఆ మాటకొస్తే ఒక కథ, కవిత ఒన్ వే కమ్యూనికేషన్ కావు; టూ వే కమ్యూనికేషన్లు. రచయిత ఒక రచన చేసి పాఠకుల ముందు ఉంచుతున్నాడంటే, అప్పటికే పాఠకులలో లేదా సమాజంలో ఉన్న వాదానికి ప్రతివాదాన్నో; ప్రతివాదానికి వాదాన్నో ముందుకుతెస్తున్నాడు. తన వాదానికి లేదా ప్రతివాదానికి పాఠకుల ప్రతిస్పందన ఎలా ఉంటుందన్న ఆసక్తి, అందుగురించిన ఆకాంక్ష ప్రతి రచనలోనూ అంతర్లీనంగా ఉండే మౌలికాంశాలు. అసలు ప్రతి రచనా వాదప్రతివాదాల నేపథ్యంతోనే పుడుతుంది. వ్యాసంలో ఇది స్పష్టంగా కనిపించవచ్చు కానీ, కథ, కవిత కూడా ఇందుకు అతీతం కావని నేను భావిస్తాను. ప్రతిరచనా సంవాదాత్మకం, సంభాషణాత్మకమే. కానప్పుడు ఒక రచనను పాఠకుల ముందు ఉంచడంలోనే అర్థం లేదు.
        రచన యొక్క ఈ స్వభావాన్ని అర్థం చేసుకున్నప్పుడు తన రచన ద్వారా ఒక వాదాన్నో, ప్రతివాదాన్నో పాఠకుల ముందు ఉంచిన రచయిత దానిపై పాఠకుల వాదప్రతివాదాత్మక స్పందనలకు వ్యక్తిగత నిర్ణయాధికారాన్ని పురస్కరించుకుని సమాధానం చెప్పకపోవడమంటే, తన రచనయొక్క ప్రయోజనాన్ని, రచనకు గల స్వభావాన్ని తనే భంగపరచుకోవడమే. సంవాదాత్మకంగా ఉండాల్సిన రచనను ఏకపక్షంగా మార్చడమే. కనుక నేను ఈ అంశాన్ని రెండు కోణాల నుంచి చూస్తాను. మొదటిది, తన రచన యొక్క సంవాదాత్మక స్వభావాన్ని కాపాడవలసిన రచయిత బాధ్యత. రెండవది, ఒక రచన యొక్క స్వాభావిక లక్షణం.
        ఇలా చూసినప్పుడు, మీ పై వ్యాఖ్యలు కొంత అపార్థానికీ, అసమగ్రతకూ తావిస్తున్నాయేమో దయచేసి పరిశీలించండి.

    • THIRUPALU says:

      నిజానికి నీహారిక గారు రావి శాస్త్రి గారు ఎవారైంది తెలియక మాత్రం మాట్లాడలేదు. ఆమె వ్యాఖ్య లో ఆయన రచనా వ్యాసంగాన్ని ఎద్దేవ చేయడం కనపడుతుంది. కార్ప్ రేట్ చదువులవల్ల ఆయన రచనలకు ఇప్పటికే పాఠకులు తగ్గి పోయారని మరో తరానికి అవి మరుగై పోతాయని ఆమె ఉద్దేశం. అది ఆమె దృక్పథం.

  28. ఆర్.దమయంతి. says:

    చందు గారు,
    నిజానికి దీని మీదొక పెద్ద గ్రంధం రాయొచ్చు.
    అంత విస్తృతమైన పరిధి గల చర్చనీయాంశం – ఈ ఇతివృత్తం…
    అసలు ఈ ఫలాన రచన గొప్పది, లేదా చెత్తది అని ఎవరు చెప్పాలి?
    ఎవరు చెప్పడం వల్ల లేదా పొగడటం వల్ల అది ఉత్తమ రచన గా రూపు దిద్దుకుంటోంది?
    ఎవరు నిర్దేశిస్తే ఆ రచన మీద ‘మెదణ్ణి తినేసే రచన’ గా ముద్ర పడుతుందని అనుకుంటున్నారు?
    ముందు ఇది తేలితే..ఆ తర్వాత ఉత్తమ సాహిత్యం గురించి మాట్లాడుకోవచ్చు.

  29. చర్చ బాగుంది.

    ఇంతకీ కథలకు కన్సూమర్లైన పాఠకులు ఇప్పుడొస్తున్న కథల గురించి ఏమనుకుంటున్నారు? కథాపఠనం నుంచీ వారు ఆశిస్తున్న ప్రయోజనాలేమిటి? ఎలాంటి కథలను చదవడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు? వారి దృష్టిలో ఏవి మంచి కథలు?

    ఇక్కడి చర్చలో ఎక్కువ రచయితలే పాల్గొన్నట్లు కనిపిస్తోంది. రచయితలు పాఠకులైనా, రచయితలు కాని పాఠకుల కోణం కూడా తెలిస్తే, ఇలాంటి చర్చలకు మరింత ప్రయోజనం ఉంటుంది కదా!

    – గిరి

  30. కె.కె. రామయ్య says:

    “వాస్తవ జీవితాన్ని ప్రతిబింబించడమూ, ఉన్నత జీవనవిధానానికి మార్గం చూపించడమూ, ఉత్తమ హృదయ సంస్కారానికి ప్రేరణ యివ్వడమూ ఉత్తమ సాహిత్య లక్ష్యాలు అని అన్నారు ప్రముఖ సాహితీ విమర్శకులు
    శ్రీ రాచమల్లు రామచంద్రారెడ్డి (రారా) గారు. మానవతావాదమొక్కటే నిజమైన సాహిత్యవాదం అనీ నమ్మారు ఓ మార్క్కిస్ట్ నిబద్ధతతో. సమాజంలోంచి పుట్టే సాహిత్యానికి గమ్యస్థానం కూడా సమాజమే కావాలని తపించిన వ్యక్తి రాజీలేని ‘రారా’ గారు.

    ( దమయంతి మేడం గారు మీకు చెప్పగలిగేటంతటివాడిని కాను. ఉత్తమ సాహిత్యం కాల పరీక్షకు నిలుస్తుంది కదండీ; అది షేక్స్పియర్ రచనలైనా, రావిశాస్త్రి గారివైనా, మా పిసినిగొట్టు గొరుసన్న రాసిన నాలుగు ఆణిముత్యం కథలైనా )

  31. ఆర్.దమయంతి. says:

    ‘సమాజంలోంచి పుట్టే సాహిత్యానికి గమ్యస్థానం కూడా సమాజమే కావాలని..’ తపించిన వ్యక్తి – రాజీలేని ‘రారా’ గారు.
    చెరిగిపోని నిర్వచనం – మంచి కథకి.
    నిజమే, సామాజిక స్పృహ గల రచనలకి పాఠకుల ఆదరణ ఎంత వరకుం టుందని మీ అభిప్రాయం రామయ్య గారు?

  32. ari sitaramayya says:

    భాస్కరం గారూ,
    మీరు “ప్రతిరచనా సంవాదాత్మకం, సంభాషణాత్మకమే. కానప్పుడు ఒక రచనను పాఠకుల ముందు ఉంచడంలోనే అర్థం లేదు.”
    “సమాధానం చెప్పకపోవడమంటే, తన రచనయొక్క ప్రయోజనాన్ని, రచనకు గల స్వభావాన్ని తనే భంగపరచుకోవడమే. సంవాదాత్మకంగా ఉండాల్సిన రచనను ఏకపక్షంగా మార్చడమే,” అన్నారు.

    నాకు మీ అభిప్రాయాలతో ఎలాంటి విభేదం లేదు.
    ఎవ్వరూ సమాధానాలు రాయవద్దనో, రాయకూడదనో నేను అనలేదు, అనుకోవడంలేదు.
    రాయమనో రాయకూడదనో చేప్పే అధికారం సంపాదకులకు ఉండకూడదని మాత్రమే నా అభిప్రాయం.

    ఇక సమాధానం రాయడమా లేదా అనేది, నేను ఇదివరకు అన్నట్లే, వ్యక్తిగత నిర్ణయంగానే ఉండాలి అని నా అభిప్రాయం.
    కారణం సంవాదానీకీ సంభాషణకూ విముఖత వల్ల కాదు.
    నా అనుభవంలో వెబ్ పత్రికల్లో వాదప్రతివాదాల వల్ల వెలుతురు తక్కువ, వేడి ఎక్కువ జనిస్తుంది.
    ఒకరి గురించి ఒకరు వ్యాఖ్యానించడం ఎక్కువ. విషయానికి మాత్రమే పరిమితంగా వ్యాఖ్యానించడం తక్కువ.
    తమ రచనల (వ్యాఖ్యానాల) మీద ఉన్న ప్రేమతో, విమర్శను వ్యక్తిగత దూషణగా భావించడం ఎక్కువ.
    విమర్శను స్వీకరించే సంస్కారం మన రచయితలకూ పాఠకులకూ ఇంకా అలవాటుకాలేదు
    అందువల్ల సమాధానం రాయడమా వద్దా అనేది ఎవరికి వారు, సందర్భాన్ని బట్టి, నిర్ణయించుకోవడమే ఉచితమని నా అభిప్రాయం.
    అందరూ మీలాగే రాస్తే , ఏకీభావం ఉన్నా లేకపోయినా, సమాధానం రాయడానికి అభ్యంతరం ఏముంటుంది?

Leave a Reply to THIRUPALU Cancel reply

*