అంగా దంగా త్సంభవసి

 

 

 

– కల్లూరి భాస్కరం

~

రాత్రి పదవుతోంది. అప్పుడే ఆఫీసు నుంచి వచ్చి, మొహం కాళ్ళు కడుక్కుని భోజనానికి కూర్చున్నాను. ఇంటికొచ్చేసరికి రోజూ ఆ వేళ అవుతుంది.

అంతలో వీధి తలుపు తోసుకుని ఏదో సినిమాపాట కూనిరాగం తీస్తూ మా రెండోవాడు హడావుడిగా లోపలికి రాబోయి నన్ను చూసి తగ్గాడు. నా మీద ఓ ముసినవ్వు పారేశాడు. నేను ఏమైనా అంటానేమోనని ముందుగానే నా మీద జల్లే మత్తుమందు ఆ ముసినవ్వు. తలుపు వెనకనుంచి మూడు తలకాయలు తొంగి చూసి, నేను కనబడగానే వాడితో ఏదో గుసగుసగా అనేసి మాయమయ్యాయి. వాడు తలుపు వేసేసి ఓసారి లోపలికి వెళ్ళి వచ్చి,

“నాన్నా! రేపు ఆఫీసునుంచి త్వరగా వచ్చెయ్యి. సెకండ్ షో సినిమా కెళ్దాం” అన్నాడు. ఆ మాటకు నా గుండెల్లో రాయి పడింది. నోట్లోకి ముద్ద దిగడం కష్టమైంది.

వాడు ముందురోజే ఓసారి అన్నాడు, “నాన్నా, రజనీకాంత్ సినిమా… చాలా బాగుంది. రేపు సెకండ్ షో కి వెళ్దాం” అని. వెళ్లినప్పుడు కదా, ఈలోపల వాడే మరచిపోతాడులే అనుకుని, “సరేరా” అన్నాను. కానీ వాడు మరచిపోలేదు. ఇప్పుడు మరింత కచ్చితంగా అన్నాడు. దాంతో నేనో బలిపశువులా సెకండ్ షో సినిమాకు వెడుతున్నట్టూ, థియేటర్ లో ఆ చీకటి నరకంలో కూర్చుని, బంగారం లాంటి నిద్రను బలిపెట్టి మూడు గంటల చిత్రహింసను భరిస్తున్నట్టూ ఊహించుకుంటూ ఉండిపోయాను. ఇప్పటినుంచే నా మొహంలో దైన్యం తాండవించింది.

“అమ్మా, నువ్వు కూడా రావాలి” అన్నాడు తల్లితో, శాసిస్తున్నట్టుగా.

నాకు మజ్జిగ వడ్డిస్తున్న మా ఆవిడ, “నాకు సినిమా వద్దూ, ఏమీ వద్దు. నేను రాను” అని అంతే కచ్చితంగా చెప్పేసింది. దాంతో వాడు మరింత ఫోర్సుతో, “నాన్నా, నువ్వు మాత్రం రావలసిందే” నని ఉత్తర్వు జారీ చేసేసి  లోపలికి వెళ్లి దుస్తులు మార్చుకుని వచ్చాడు.

నేనోసారి మా ఆవిణ్ణి చూశాను. అసూయ కలిగింది. ప్రశాంతంగా తన పని చేసుకుపోతోంది.  వాడు అడిగాడు,  రానని చెప్పేసింది…అంతే, ఆ విషయం ఇక తన బుర్రను తొలిచే అవకాశమే లేదు. బ్రహ్మరుద్రాదులు కూడా తనను సినిమాకు తీసుకెళ్లలేరని తనకు ఎంత తెలిసో మాకూ అంతే తెలుసని తనకు తెలుసు. కానీ నాకు ఆ లగ్జరీ లేదు. నా మీద మావాడిది ఉడుముపట్టు. కనీసం నిద్రనైనా కాపాడుకుందామనుకుని, “ఆదివారం ఫస్ట్ షో కు వెడదాం లేరా” అన్నాను.

“లేదు, టిక్కెట్లు దొరకవు” అన్నాడు.

ఆ తర్వాత కాస్త ఆగి, నామీద మరో ముసినవ్వు పారేస్తూ, “ మా ఫ్రెండ్ కార్లో తీసుకెడతాను. సెకండ్ షో అయితే రోడ్డు మీద ట్రాఫిక్ ఉండదు” అన్నాడు.

“కొంపదీసి నువ్వే డ్రైవ్ చేస్తావా?” అన్నాను సందేహంగా.

“అవును, ఈ మూడురోజుల్లో డ్రైవింగ్ నేర్చుకున్నాను. నువ్వు, అన్నయ్య, నేనూ, మా ఫ్రెండూ…రేపు ఎనిమిదికల్లా ఆఫీసునుంచి వచ్చేయి” అన్నాడు భోజనానికి కూర్చుంటూ. నా గుండెల్లో రెండో రాయి పడింది…సినిమాకు వెళ్ళడం, అందులోనూ వాడు డ్రైవ్ చేస్తుంటే కారులో వెళ్ళడం!!

మొత్తానికి పెద్ద ప్లాన్ లోనే ఉన్నాడు. తలవంచడం తప్ప నేను చేయగలిగింది కనిపించలేదు.

***

Kadha-Saranga-2-300x268

చిన్నప్పటినుంచీ వాడు నన్ను ఆదేశించడమే. అప్పుడు మా తండ్రీ-కొడుకుల పాత్రలు తారుమారైపోతాయి.  వాడి నోట ఆదేశం వచ్చిందంటే నాకు పెద్ద టెన్షన్. కాళ్ళూ చేతులూ ఆడవు. భోజనం దగ్గర ముద్ద దిగదు. వాడి మాట నెగ్గేవరకూ నేను ఓ పెద్ద గాలివానలో చిక్కుకుపోయినట్టు అనిపిస్తుంది. సరే నన్నతర్వాత కూడా బయటికి వాన వెలిసినట్టుంటుంది కానీ,  నా లోపల మాత్రం అస్థిమితం రేగుతూనే ఉంటుంది.

చిన్నప్పుడు లూనా మీద ఎక్కించుకుని వాణ్ణి ఎక్కడికో తీసుకెళ్లాను. వెళ్ళేటప్పుడు బుద్ధిగానే ఉన్నాడు. వచ్చేటప్పుడు, మెయిను రోడ్డు మీంచి ఇంటికెళ్లే రోడ్డు ఎక్కిన తర్వాత, తను డ్రైవ్ చేస్తానన్నాడు. నేను వద్దన్నాను, బతిమాలాను, బెదిరించాను. వాడు ససేమిరా అన్నాడు. నేను ధైర్యం చేయలేక మొండికేశాను. “అయితే, నేను నీతో రాను” అని దిగిపోయాడు. రోడ్డు మీద పెద్ద సీను. నడుచుకుంటూ వాడు… వాడి వెనక లూనా నడిపించుకుంటూ నేను…

వాడు ఎనిమిదో తరగతిలోకి వచ్చాడు. ఓ ఆదివారం రోజున అందరం కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తున్నాం. ఉన్నట్టుండి వాడు, “నాన్నా, ట్యూషన్ కు వెళ్లడానికి నాకు సైకిలు కావాలి” అన్నాడు. అలా సన్నగా చినుకు మొదలైందనీ, కాసేపట్లో అది గాలివాన అవుతుందని నాకు తెలియదు. “సరేరా, కొంటానులే” అన్నాను యధాలాపంగా.  “ఎప్పుడు కొంటావు?” అన్నాడు. “ఓ వారం రోజులు ఆగు” అన్నాను. అంతలో పెద్దాడు అందుకుని “నాకు కూడా సైకిలు కొనిపెట్టలేదు” అంటూ సన్నగా అంటించాడు. “లేదు, ఇవాళే కొనాలి” అన్నాడు చిన్నాడు. అన్నం తినడం ఆపేశాడు. చినుకు జడివానగా మారుతున్న సూచన కనిపించింది. “ఇవాళ ఆదివారం రా. షాపులుండవు” అన్నాను. “మరెప్పుడు కొంటావు?” అన్నాడు. “రేపో, ఎల్లుండో చూద్దాంలే” అన్నాను. “లేదు. ఇవాళే కోనాలి. ఆబిడ్స్ లో ఆదివారం కూడా షాపులుంటాయి” అన్నాడు. “నీకేమైనా పిచ్చా, వెర్రా, ఆదివారం షాపులుండవురా” అన్నాను. “లేదు, ఉంటాయి” అన్నాడు. నేను కేకలేశాను, తిట్టాను, బతిమాలాను. వాడు వినలేదు. జడివాన గాలివానగా మారిపోయింది. భోజనాల దగ్గర కబుర్ల మూడు కాస్తా పోయి కర్ఫ్యూ వాతావరణం ఏర్పడిపోయింది. ఎవరి కంచంలోనూ పదార్థాలు కదలడం లేదు.

“సరే, సాయంత్రం ఆబిడ్స్ వెడదాంలే” అన్నాను. ఆ క్షణానికి వాన వెలిసింది.

సాయంత్రం నేనూ, పెద్దాడూ, వాడూ కలసి ఆబిడ్స్ వెళ్ళాం. ఒక్క షాపు కూడా లేదు. “చూశావా, చెబితే విన్నావా?” అన్నాను. “సరే, రేపు కొనాల్సిందే” అన్నాడు. ఆ రేపు తప్పించుకోలేనిదని నాకు తెలుసు.

తీరా సైకిల్ కొన్నాక నెలరోజులు కూడా తొక్కాడో లేదో, ఓ రోజు ట్యూషన్ కు వెళ్ళి సైకిల్ రోడ్డు మీద పెట్టి తాళం వేయడం మరచిపోయాడు. తిరిగి వచ్చేటప్పటికి సైకిల్ లేదు. రాత్రి నేను ఇంటికి వచ్చేటప్పటికి ఇదీ కబురు. నేను వాడివైపు చూశాను. వాడు మాట్లాడకుండా ఓ ముసినవ్వు పారేసి మొహం పక్కకు తిప్పేసుకున్నాడు.  సైకిల్ పోయిన రోజున వాడంతట వాడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చాడు. ఓ పది రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగాడు. అందులో ఓ చిన్న లాకప్ ఉంది. అందులో ఉన్న ఓ నేరస్తుడికి వీడి మీద జాలేసింది. “ఎందుకా పిలగాణ్ణి అన్నిసార్లు తిప్పుతారు? మీ దగ్గరున్న ఓ సైకిల్ ఇస్తే పోలా?”అన్నాడు పోలీస్ పెద్దతో. ఎంత నేరస్తుడి సలహా అయితేనేం, అవును కదా అని పోలీస్ పెద్దకు అనిపించినట్టుంది. ఓ కానిస్టేబుల్ ను కేకేసి, సైకిలేదైనా ఉందేమో చూడమన్నాడు. అతను చూసొచ్చి, ఓ పాతసైకిలుందని చెప్పాడు. “అబ్బాయి, ఆ సైకిలు తీసుకుపో, నీ సైకిలు దొరగ్గానే ఫోన్ చేస్తాను. నెంబర్ ఇవ్వు” అన్నాడు. మా వాడు సరే నని ఆ సైకిల్ తీసుకొని ఇంటికొచ్చాడు. కానీ దాని మీద ట్యూషన్ కు వెళ్ళడం వాడికి నామోషి అనిపించింది. దానినో మూల పారేసి నడిచే వెళ్ళొస్తున్నాడు. పాపం, ఎంతో పట్టుబట్టి కొనిపించుకున్నాడు, వాడి ఉబలాటం తీరకుండానే కొత్త సైకిల్ పోయిందనుకుని జాలిపడ్డాను. “ఇంకో సైకిల్ కొంటాలేరా” అన్నాను. వద్దన్నాడు.

వాడు ఏదైనా కొనమంటే కొనకపోవడం ఎంత కష్టమో, వద్దంటే కొనడం కూడా అంతే కష్టం.

ఫ్రిజ్, టీవీ, వాషింగ్ మిషిన్, కెమెరా, కంప్యూటర్, చివరికి వాక్యూమ్ క్లీనర్ తో సహా ప్రతిదీ వాడు ఇలాగే పట్టుబట్టి, పెద్ద టెన్షన్ సృష్టించి కొనిపించినవే. చిన్నాడితో కలసి వీటికి ప్లాను చేయడంలో, వాడికి పురెక్కించి నా మీద ప్రయోగించడంలో  పెద్దాడి తెరచాటు పాత్ర ఉంటుందని నాకు తెలుసు. ఇద్దరికీ నాలుగేళ్ల ఎడముంది. పెద్దాడికి నా దగ్గర కాస్త బెరుకు. బహుశా పెద్దాళ్ళు అందరూ అంతేనేమో!

ఖరీదైన వస్తువు కొనాల్సిన ప్రతిసారీ పర్సు బరువు తూచుకుని ముందు వెనకలవడం మామూలే. కానీ ఆ వస్తువు ఇంటికి వచ్చాక వాళ్ళ కళ్ళల్లోని ఉత్సుకత మెరుపులు చూస్తున్నప్పుడు, ఆ మెరుపుల అమూల్యత  ముందు ఆ వస్తువు వెల ఎంతో అల్పమనిపించేది.

***

రోజూ రాత్రి పదిలోపల ఇంటికొచ్చి, కాసేపు టీవీ చూసి, ఆ తర్వాత ఏదో పుస్తకం చదువుకుంటూ నిద్రకు ఉపక్రమించడం అప్పటికి కొన్నేళ్లుగా నాకైన అలవాటు. ఈరోజు ఆ అలవాటు తప్పుతున్నందుకు దిగులేసింది. చిన్నాడు ఆదేశించినట్టు ఉసూరుమంటూ ఎనిమిదికే ఇంటికొచ్చాను. పెద్దాడు ఇంట్లో ఉన్నాడు,   చిన్నాడు కనిపించలేదు.  ప్రోగ్రామ్ మారిందేమో నన్న చిన్నపాటి ఆశ తళుక్కుమంది. అంతలో ఎప్పటిలా హడావుడిగా చిన్నాడు తలుపు తోసుకొచ్చి, నన్ను చూసి తృప్తిగా ఓ ముసినవ్వు పారేసి, “మా ఫ్రెండ్ బయలుదేరాడు. ఈలోపల భోజనం చేసేసి రెడీ అవుదా” మని, వాళ్ళ అమ్మను తొందరపెట్టాడు.

యాంత్రికంగా భోజనం ముగించి, కాసేపట్లో ఎదుర్కొబోయే రెండు శిక్షల గురించి తలపోస్తూ కూర్చున్నాను. సెకండ్ షో సినిమాకు వెళ్ళి నిద్ర కాచుకోవడం ఒక శిక్ష. అసలు సినిమాకు వెళ్ళడం అంతకంటే పెద్ద శిక్ష. సినిమాకు వెళ్ళడాన్ని శిక్షగా నేను ఊహించుకోవడం నాకే ఆశ్చర్యంగానూ, వింతగానూ అనిపించింది. నేను అప్పటికి ఓ పదిహేనేళ్ళ క్రితంవరకూ విపరీతంగా సినిమాలు చూసేవాణ్ణి. అందులోనూ విజయవాడలో పెరిగానేమో, చిన్నప్పటినుంచీ సినిమా పిచ్చి ఎక్కువుండేది. విజయవాడ నా దృష్టిలో సినిమా పిచ్చోళ్ళ నగరం. ఆమాటకొస్తే, సినిమా వచ్చాక ప్రపంచమంతటా అనేక తరాలు సినిమాలు, సినిమాల ఊహల మధ్య పెరుగుతూ వచ్చారనీ; సినిమా నిత్యావసరాలలో ఒకటిగా, జీవితంలో ఒక భాగంగా మారిపోయిందనీ అనిపిస్తుంది. ప్రేయసీప్రియులు చాలా అరుదుగా దొరికే ఏకాంతపు చీకటిలో గుసగుసలు పంచుకునే తన్మయ క్షణాలు, కొత్త జంట తమ మధ్య సరికొత్త సాన్నిహిత్యాన్ని అల్లుకునే అపురూప ఘడియలు, పుట్టినరోజు పండుగ, పరీక్షఫలితాలు వచ్చిన ఆనందం, ఉద్యోగంలో తొలి జీతం అందుకున్న సందర్భం… ఇలా ఎన్నింటినో తెర మీది సినిమా మన జ్ఞాపకాల యవనిక మీద మధురంగా ముద్రిస్తుంది.

దుర్గాకళామందిరం, అలంకార్, వినోదా, లక్ష్మీ టాకీస్, విజయా టాకీస్, జైహింద్, ఈశ్వర్ మహల్…ఇలా విజయవాడలోని థియేటర్ల పేర్లతో పెనవేసుకుపోయిన నా సినీ బాల్యస్మృతులు ఇప్పటికీ నాలో ఏదో తెలియని తీపిని నింపుతాయి. సినిమా నాలో ఎంత మోహం పుట్టించేదంటే, ఇంట్లో తెలియకుండా ఒకే రోజు రెండు సినిమాలు చూసిన సందర్భాలూ, మరునాడు పరీక్ష ఉన్నాసరే, కోరికను చంపుకోలేక సినిమాకు వెళ్ళిన సందర్భాలూ ఉన్నాయి. నచ్చిన ఒకే సినిమాను పాతిక, ముప్పై సార్లు చూడడమూ ఉంది. అంతేకాదు, నచ్చిన సినిమాకు మిత్రులతో కలసివెళ్లి చూడడం, ఆ సినిమా గురించి చర్చించుకోవడం మరింత రంజుగా ఉండేది.

కానీ  నాకూ, సినిమాకూ ఉన్న ముడి ఎప్పుడో, ఎక్కడో తెగింది. క్రమంగా సినీ వైరాగ్యం ఏర్పడింది. బహుశా బాల్యకౌమారాలు గడిచి, యవ్వనయానంలో ముందుకు వెడుతున్నకొద్దీ నా సినిమా అభిరుచి మరింత నైశిత్యాన్ని తెచ్చుకుంటూ ఉండడం, దాంతో నన్ను తృప్తిపరిచే సినిమాల సంఖ్య నానాటికీ తగ్గిపోవడం, నేను మరీ ‘చూజీ’గా మారుతుండడం ఒక కారణం కావచ్చు. ఏమో, నాతోపాటు సినిమా ఎదగలేదేమో! సమయాభావం ఇంకో కారణం. ఎదిగిన సినిమాను గాలించి పట్టుకోడానికి కొంత అదనపు సమయం కేటాయించాలి. కానీ నా ఉద్యోగ స్వభావరీత్యా, థియేటర్ కి వెళ్ళి సినిమా చూసే సమయం కాదు సరికదా, మంచి సినిమాను వెతికి పట్టుకునే అదనపు సమయం కూడా దొరకదు. ఒక్క సెలవు రోజున తప్ప బయట సాయంత్రాలు గడిపే అవకాశం ఉండదు. చాలా అపురూపంగా దొరికే సెలవు రోజును ఇంటిదగ్గర విశ్రాంతిగా గడపాలనిపిస్తుంది. ఈ మధ్యలో మిత్రులతో సినిమాకు వెళ్ళి, సినిమా నచ్చక మధ్యలోనే వచ్చేసి వాళ్ళకు కోపం తెప్పించిన సంఘటనలూ ఉన్నాయి.

మా ఆవిడకు అసలు సినిమా ఆసక్తే లేకపోవడం నా సినిమావైరాగ్యానికి కలిసొచ్చిన ఒక సుగుణం.

సినిమాలు చూడడమే మానేశానని కాదు. టీవీ వచ్చాక మనం వద్దనుకున్నా సినిమాలు కంటబడుతూనే ఉంటాయి. నచ్చకపోతే రిమోట్ ప్రయోగించి పీక నోక్కే అదనపు సౌలభ్యం ఉంది. నచ్చితే చివరివరకూ చూడడమూ ఉంది. అయితే థియేటర్ కు వెళ్ళి సినిమా చూసే అలవాటు పూర్తిగా పోయింది. అందులోనూ ఒంటరిగా వెళ్ళి చూసే అలవాటు ఇంకా ముందే పోయింది. మొత్తానికి నాకూ,సినిమాకూ మధ్య దూరం చాలా పెరిగిపోయింది. అందుకు నేనే కారణం తప్ప సినిమా కాదు.

***

ఫ్రెండు కారు తెచ్చాడు. నేనూ, పెద్దాడూ వెనక సీట్లో, ఫ్రెండు ముందు సీట్లో కూర్చున్నాం. చిన్నాడు కారు స్టార్ట్ చేస్తూ ఒకసారి నావైపు చూసి ఓ ముసినవ్వు పారేసి, “నాన్నా, కంఫర్ట్ గా కూర్చో” అన్నాడు. లోపల బితుకు బితుకు మంటూనే ఉంది. అయినా వాడు ప్రమాదం చేయడన్న ధీమా కూడా ఏమూలో ఉంది.

థియేటర్ కి చేరుకున్నాం. నన్నోచోట నిలబెట్టి ముగ్గురూ టిక్కెట్లు తేవడానికి వెళ్లారు.

ఎన్నేళ్లయిందో థియేటర్ కి వెళ్ళి! నేను దిక్కులు చూస్తూ నిలబడ్డాను. నేనేదో అపరిచితప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు అనిపిస్తోంది. వర్షించే దీపకాంతుల మధ్య ఆ పరిసరాలు కొత్తగానూ, అయినా అందంగానూ కనిపించాయి. ఉత్సాహపు తుళ్ళింతలతో చిరునవ్వులు పోటీ పడుతుంటే ఎవరెవరో జంటలు కళ్ల ముందు మెరుపుతీగల్లా కదలి వెడుతున్నారు.

పిల్లలు టిక్కెట్లు తెచ్చారు.

సినిమా  మొదలైపోయిందేమో, టిక్కెట్లు దొరకుతాయో, దొరకవో అన్న భయంతో పరుగుపరుగున థియేటర్ కు వెళ్ళడం, అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర వెలుగుతున్న దీపాన్ని, ఆ దీపం కింద మనిషిని చూసి పెద్ద రిలీఫ్ పొందడం, టిక్కెట్లు తీసుకోవడం, వాటిని గేటుకీపరుకు ఇచ్చి, అతను చింపి ఇచ్చిన టిక్కెట్ ముక్కలు తీసుకోవడం, లోపలికెళ్లి చీకట్లో సీటు కోసం తడుముకోవడం, సీట్లో కూర్చోడం…ఇవన్నీ సినీ సమ్మోహనం కలిగించే పారవశ్యాన్ని క్రమగతిలో అంచులు తాకించే ఘట్టాలుగానే నా స్మృతులలో ఉండిపోయాయి. పిల్లల వెనక థియేటర్ లోకి వెడుతుంటే ఆ స్మృతులు ఒక్కొక్కటే నా మనోఫలకంపై తళుక్కుమంటూ నన్ను వెనకటి రోజుల్లోకి తీసుకెళ్ళడం ప్రారంభించాయి. అలా చుక్క చుక్కలుగా మనసులోకి జారడం మొదలైన నా బాల్య కౌమారయవ్వనకాలపు సినీ దర్శనోల్లాసం, టార్చిలైటు వెలుగులో సీట్లు వెతుక్కుని వెళ్ళి కూర్చునే సమయానికి మడుగులు కట్టసాగింది. ఆ ఉల్లాసం ఉరవడిస్తున్నకొద్దీ నాలోని సినీవైరాగ్యం ఎటో కొట్టుకుపోసాగింది. నేను తిరిగి నా బాల్యకౌమారయవ్వన సినీఅనుభూతిని పునర్జీవించడం ప్రారంభించాను. నా కళ్ళనిండా అప్పటి ఉత్సుకత మెరుపులు కమ్ముకుంటున్నాయి.

నాకు అంతా ఆశ్చర్యంగానూ, వింతగానూ ఉంది.

నాకు ఒక పక్క చిన్నాడు, ఇంకో పక్క పెద్దాడు. నా కళ్ళల్లోని ఆ మెరుపులే వాళ్ళ కళ్ళల్లో కూడా కదలాడుతున్నట్టు ఆ చీకట్లో సైతం పోల్చుకున్నాను. నా మెరుపుల అసలు రహస్యం అర్థమైనట్టు తోచింది. వాళ్ళ కళ్ళలోంచే అవి నా కళ్ళల్లోకి ప్రవహిస్తున్నాయి. కాంతిహీనమవుతున్న నా కళ్ళకు ఆ కళ్ళు తమ మెరుపుల్ని ఎరువిస్తున్నాయి. ఇప్పుడు మూడు జతల కళ్ళతో సినిమా చూస్తున్నాను. నేనే ముగ్గురిగా విభజితమైపోయాను. వాళ్ళిద్దరూ తమ కళ్ల  మెరుపుల్నే కాదు, తమ యవ్వనోత్సాహాన్ని నాలోకి ప్రవహింపజేస్తున్నారు. తమ యవ్వనాన్నే నాకు ఎరువిస్తున్నారు. అటూ ఇటూ కూర్చున్న ఆ ఇద్దరూ నా శిథిలయవ్వనాన్ని లేవదీసి నిలబెట్టే ఊతకర్ర లనిపించారు.

ఆ వెంటనే ఈ ఊహ సరికాదేమో ననిపించింది. నిజానికి నాకు రెండువైపులా ఉన్న నా కంటి మెరుపుల్నే నా కళ్ళల్లోకి తోడుకుంటున్నాను. నాకు రెండువైపులా ఉన్న నా యవ్వనాన్నే నాలోకి ప్రవహింపచేసుకుంటున్నాను. నాలోంచి ఉద్భవిల్లిన నా యవ్వనమే నాకు అటూ ఇటూ రెండు ఊతకర్రలుగా మారి నా శిథిలయవ్వనాన్ని నిలబెడుతోంది.

యయాతి కథ గుర్తొచ్చింది. యయాతి తన వార్ధక్యాన్ని మీలో ఎవరైనా తీసుకుని మీ యవ్వనాన్ని నాకు ఎరువివ్వండని కొడుకుల్ని అడుగుతాడు. చిన్నకొడుకు పూరుడు ముందుకొచ్చి తన యవ్వనాన్ని తండ్రికిచ్చి అతని వార్ధక్యాన్ని తను తీసుకుంటాడు. వార్ధక్యాన్ని తీసుకోవడం అలా ఉంచితే, పూరుడు తన యవ్వనాన్ని తండ్రికి ఎరువివ్వడంలోని అసలు రహస్యం ఇప్పుడు బోధపడినట్టు అనిపిస్తోంది. తండ్రి కొడుకు రూపంలో తన బాల్య, కౌమార, యవ్వనాలను పునర్జీవిస్తాడు. తండ్రే కొడుకవుతాడు. శకుంతల దుష్యంతునితో అంటుంది…”అంగా దంగాత్సంభవసి” అని వేదవచనం. భార్య గర్భంలో ప్రవేశించి భర్తే కొడుకుగా పుడతాడు. తండ్రికీ కొడుకికీ తేడా లేదు.

సినిమా అయిపోయింది. నా కొడుకుల రూపంలోని యవ్వనంతో కలసి బయటికి ఉత్సాహంగా అడుగులు వేశాను.  నాలో వెనకటి నిర్వేదం, నిరాసక్తి లేవు. కారు స్టార్ట్ చేస్తూ చిన్నాడు వెనక్కి తిరిగి యధాప్రకారం నామీద ఓ ముసినవ్వు పారేసి, “ఎలా ఉంది నాన్నా?” అని అడిగాడు. “చాలా బాగుందిరా” అన్నాను మనసునిండా, తృప్తిగా.

మళ్ళీ సినిమా కెళ్లాలన్న వాంఛ నాలో రహస్యంగా రగిలింది!

***

ఇప్పుడు మంచి సినిమాల సమాచారం కోసం నా చూపులు ఆబగా గాలించడం ప్రారంభించాయి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు బాగున్నాయని టాక్ వచ్చిన తెలుగు, హిందీ, ఇంగ్లీష్ సినిమాల వాల్ పోస్టర్లు ఊరిస్తున్నాయి. థియేటర్లు తమవైపు గుంజుతున్నాయి. కానీ ప్రతిసారీ సినిమా కెళ్లాలన్న రుచికరమైన ఊహ ఊహగానే అణిగిపోతోంది. కారణం…పిల్లలు దగ్గర లేరు. నాలోంచే ఉద్భవించి, నాకు అటూ ఇటూ ఉండి సినిమాకు నడిపించిన ఆ రెండు ఆ కౌమార,యవ్వనోత్సాహపు శక్తి కేంద్రాలు ఇప్పుడు నా పక్కన లేవు. ఒకప్పటి నా కళ్లలోని ఔత్సుక్యపు మెరుపుల్ని తమ కళ్ళల్లోకి ఒడిసిపట్టి వాటితో నా కళ్ళను రీచార్జి చేసిన ఆ రెండు జతల కళ్ళు ఇప్పుడు  చదువులు, ఉద్యోగాలు, కెరీర్ వేటలో దూర తీరాలకు సాగాయి. మోహకత్వం, అద్భుతత్వం, ఉత్సుకత నిండిన అందమైన ప్రపంచంలోంచి;  భయభీతులు, బేలతనం నింపే కఠోర వాస్తవాల జీవన పోరాటక్షేత్రంలోకి అడుగుపెట్టి నలుగుళ్లు పడుతున్నాయి.

ఎప్పుడైనా  ఇంటికొచ్చి నాలుగురోజులు గడిపినా ఏదో చికాకు, ఏదో టెన్షన్, ఏదో తొందర…ప్రపంచాన్ని ఒక ఆశ్చర్యంగా, నిత్యనూతనంగా దర్శించే ఆ చూపుల్లోని కుతూహలపు తళకులు మసగబారుతున్నాయి. వాళ్ళ జీవనప్రాధాన్యాలలో సినిమా క్రమంగా అట్టడుగుకు జారిపోతున్నట్టుంది. ఆ నోట సినీ కూనిరాగాలు అంతగా వినిపించడం లేదు. వాళ్ళు క్రమంగా నాలానే సినిమాకు దూరమవుతున్నారు.

నేనే అవుతున్నారు!

నాలో కొత్తగా జ్వలించిన సినీ సందర్శనేచ్ఛ నిశ్శబ్దంగా నాలోనే అణగారిపోసాగింది.

జీవన పోరాటపు అలసట ఒక అలవాటుగా మారి అందులోనే స్థిమితాన్ని వెతుక్కునే యాంత్రికతకు మళ్లిన తర్వాత, ఎప్పుడో ఏ దశలోనో నాలానే వాళ్ళు కూడా తమ పిల్లల బుజాల మీద చేతులు వేసి సినిమాకు వెడతారు. వాళ్ళల్లోంచి తమ బాల్యకౌమారయవ్వనోత్సాహాన్నీ, ఔత్సుక్యపు మెరుపుల్నీ తోడుకుంటూ సినిమా చూస్తారు. అంతసేపూ వాళ్ళు తమ బాల్యకౌమార యవ్వనాలను పునర్జీవిస్తారు.

ఆ తర్వాత వాళ్లలానే వాళ్ళ పిల్లలు, ఆ పిల్లల పిల్లలు, ఆ పిల్లల పిల్లల పిల్లలూ…

సృష్టి తెర మీద జీవిత చలనచిత్రం నిర్విరామంగా ఆడుతూనే ఉంటుంది.

 

*

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

 1. దేవరకొండ says:

  హాయి గొలుపుతూనే ఆ అనుభూతితో మమేకమయేట్లు కథను అందంగా మలచారు. నాది విజయవాడ కాకపోయినా మిగతా కథంతా నాదే, నా కథ భాస్కరం గారికి ఎలా తెలిసిందబ్బా అనుకుంటూ చదివాను. విశ్వజనీనత అంటే అలా ఉంటుంది. ఇలా ఇది ఎందరి కథో! అద్భుతమైన కథను అందించిన రచయితకు అనేక ధన్యవాదాలు!

  • భాస్కరం కల్లూరి says:

   ధన్యవాదాలు, దేవరకొండగారూ…మీరు అన్నట్టు ఇది ఎందరి కథో! ఎందరో తమ కథగా భావించే రచన చేయడాన్ని మించిన సంతృప్తి రచయితకు ఉండదు. మీ స్పందన చూశాక అలాంటి సంతృప్తికి లోనయ్యాను. మీరు విశ్వజనీనతగా దీనిని పేర్కొనడం కూడా ఒక రచనకు ఖరీదు కట్టే మీలోని షరాబును పట్టి చూపుతోంది.

   • దేవరకొండ says:

    అది ఎంత ‘దారుణమైన’ సామ్యమంటే నా ‘కథ’ లో కూడా రజనీకాంత్ సినిమానే. (చంద్రముఖి). నాకూ ఇద్దరూ అబ్బాయిలే. ఇదంతా చేసిన వాడు నా కథలో కూడా ‘చిన్నాడే ‘. ముసినవ్వుతో సహితంగా అంతా వాడే! ఆ సినిమా తర్వాత (దాదాపు 10 ఏళ్ళు) నేను మళ్లీ థియేటర్ లో ఇంతవరకూ సినీమా చూడలేదు. ఇంకా ఎన్నో ఇలాంటి కథలను మీరు అందించాలని మనసారా కోరుకొంటూ…

 2. Y RAJYALAKSHMI says:

  చాలా బావుంది

  • భాస్కరం కల్లూరి says:

   ధన్యవాదాలు రాజ్యలక్ష్మిగారూ…

 3. చందు తులసి says:

  అవును సర్. జీవిత చలనచిత్రం నిర్విరామంగా ఆడాల్సిందే….
  కథ బావుంది సర్..

  • భాస్కరం కల్లూరి says:

   ధన్యవాదాలు చందు తులసిగారూ…

 4. rani siva sankara sarma says:

  సంసారాన్ని చదరంగంగమనో , క్రీడ అనో, సముద్రమనో , మాయ అనో అనడంలో దాని అర్థం లోతు ఇదమిత్థంగా అందకుండా మురిపిస్తుండడమే కారణం కావచ్చు.
  యిలాంటివే ఏవో అస్పష్ట భావాలు తొణికిసలాడాయి మీకత చదువుతుంటే.

 5. సాయి.గోరంట్ల says:

  చాలా బాగుంది సర్..ప్రతి తండ్రి తన పిల్లల ముఖాల్లో ఆనందం తిరిగి పోందినట్లు,తన గత జీవితం(బాల్యం)అనుభవాలను తిరిగి పునరుజ్జీవింపచేసుకోవటం సహజాతిసహజం.అలానే వారి తరువాతి దశలో పిల్లలు తండ్రులై తమ పిల్లలలో తమ అస్థిత్వాన్ని వెదుక్కునే క్రమం “యయాతి”కథ ద్వారా పాఠకులను ఆ క్రమంలోకి తీసుకెల్లటం చాలా బాగుంది

 6. భాస్కరం కల్లూరి says:

  ధన్యవాదాలు సాయి గోరంట్లగారూ…

 7. కె.కె. రామయ్య says:

  కౌమారయవ్వనకాలపు సినీ దర్శనోల్లాసం, సినీ సమ్మోహనం కలిగించే పారవశ్యాన్నిమా అందరిలో అద్భుతంగా పునర్జీవింపజేశారు భాస్కరం గారూ. ధన్యవాదాలు. పిల్లలు దగ్గరలేక నాటి మోహకత్వం, అద్భుతత్వం, ఉత్సుకత నిండిన అందమైన ప్రపంచంలోంచి; భయభీతులు, బేలతనం నింపే కఠోర వాస్తవాల జీవన పోరాటక్షేత్రంలోకి అడుగులు పడుతున్నాయి అంటూ ఓ విషాద జీరను పలికించారు. ( ఎనభైల్లో విజయవాడ లీలామహల్లో వాల్ట్ డిస్నీ జంగిల్ బుక్ సినిమా చూసారా మీరు ? ).

  • భాస్కరం కల్లూరి says:

   నా కథపై మీ స్పందనకు ధన్యవాదాలు రామయ్యగారూ……ఎనభైల నాటికి నేను విజయవాడలో లేను.

 8. చాలా బావుంది భాస్కరం గారూ! నన్ను నేనే చదువుకున్నట్టు అనిపించింది. కధ చదివి చాలావ్రాయాలని కామెంట్ కాలమ్ కి వెళితే ఏవుంది.. అక్కడ నా జాగా అంతా దేవరకొండ గారు పరిచేశారు. చేసేదిలేక ఇలా సరిపెడుతున్నాను. ఈ రోజు ఆంధ్రజ్యోతి లో ఆకాశదేవర పై మీ వ్యాసం చదివి మిమ్మల్ని వెతుకుతూ ఇక్కడకు వచ్చా. మీ ఇమెయిలు ఐడి ఇవ్వగలరా!
  రాజా.

  • భాస్కరం కల్లూరి says:

   ఈ కథాదర్పణంలో మీ లాంటి ఎందరో తమ అనుభవాల ప్రతిబింబాన్ని చూసుకున్నామనడం నా కెంతో సంతృప్తినీ, సంతోషాన్ని కలిగించింది. ధన్యవాదాలు రాజా గారూ…
   నా ఈ -మెయిల్: bhaskaram_kalluri@yahoo.com

 9. భాస్కరం కల్లూరి says:

  రజనీకాంత్……చంద్రముఖి…ఇద్దరు కొడుకులు…చిన్నాడు…ముసినవ్వు…
  మీరన్నట్టు ఇది ‘దారుణ’మైన యాదృచ్చికతే దేవరకొండగారూ…నాకూ ఆశ్చర్యం కలిగింది.
  మరి కూతుళ్ల సంగతేమిటని అనుమానం రావచ్చు. బహుశా తండ్రి లేదా తల్లి కూతుళ్లలో కూడా తమ బాల్యకౌమార యవ్వనాల ప్రతిబింబం చూసుకోవచ్చు. నేనైతే ఈ విషయంలో కొడుకు-కూతురు మధ్య తేడా చూడను. శకుంతల కొడుకు గురించి మాత్రమే చెప్పిందంటే పురుషప్రాధాన్య దృష్టినుంచి కావచ్చు.

 10. khaisar mohamed says:

  చాలా బాగుంది సార్ ..మీరు ఇలాంటి మరిన్ని కథలు రాయాలని మనసారా కోరుకుంటున్నా. స్లీమన్ కథ లాంటి చారిత్రాత్మక నేపథ్యమున్న కథలు కూడా రాస్తారాని ఆశీస్తుూ.. మీ అభిమాని

  • భాస్కరం కల్లూరి says:

   .ధన్యవాదాలు ఖైసర్ మహమ్మద్ గారూ… కథ మీకు నచ్చినందుకు సంతోషం..

 11. Bhanani Phani says:

  పెద్దలంతా చెప్పినట్టు సామాన్యంగా కళ్ల ముందు జరిగినట్టున్న విషయాన్ని చక్కని కథ చేశారు..మీరు వాక్యాన్ని నిర్మించే విధానం చాలా బావుంటుంది. ధన్యవాదాలు

  • భాస్కరం కల్లూరి says:

   థాంక్స్ భవానీ ఫణిగారూ…మీరు వాక్యనిర్మాణాన్ని గమనిస్తున్నారంటే మీలో ఉత్తమశ్రేణి రచయిత్రి రూపొందుతున్నారు. అభినందనలు.

 12. Bhasker says:

  Chalaa manchi katha.
  Abhinandanalu.
  Meeru paina ichhina id ki mail pedithe failed ani vachhindi
  Correct id ivvaroo…please
  Bhasker koorapati.

  • భాస్కరం కల్లూరి says:

   ధన్యవాదాలు భాస్కర్ గారూ…కథ మీకు నచ్చినందుకు సంతోషం. నేను పైన ఇచ్చిన ఐడీ కరెక్టే. ఇంకోసారి ట్రై చేయండి. లేదా ఇంకో ఐడీ ఇది. kalluribhaskaram9@gmail.com

 13. మంచి అన్నది ప్రతీ కాలంలోనూ వుంటూనే వుంటుందనేది నా నమ్మకం – అది సినిమా విషయం లో కూడా . కొంచెం ఓపెన్ మైండ్ తో చూస్తే ఇప్పటికీ మంచి సినిమాలు వస్తున్నాయండీ. అందుకే మేము మా పిల్లలతో సమానంగా వారు చూసే కార్టూనులూ చూస్తాము – సమకాలీన సినిమానూ చూస్తాము – just to feel young at heart, when we can’t stop ourselves from getting old with each passing moment :)

  ~ లలిత

 14. భాస్కరం కల్లూరి says:

  మంచి అనేది ప్రతికాలంలోనూ ఉంటూనే ఉంటుందన్నది నా నమ్మకం కూడా నండీ…నేనూ పిల్లలతో కలసి సినిమాలు చూస్తాను, సమకాలీన సినిమాలతో సహా. కథలోని ‘నేను’ ఒక దశలో సినిమాలకు ఎందుకు దూరమయ్యాడో, ఆ తర్వాత అతనిలో సినిమా (సమకాలీన) ఆసక్తి ఎలా కలిగిందో కూడా రాశాను. విచిత్రమేమిటంటే, కథలో ‘సినిమా’ ఒక వస్తువుగా మొదటి నుంచి చివరివరకూ విస్తరించినా నిజానికిది సినిమాల గురించి కాదు. కథలోని ‘నేను’ ఒత్తి చెబుతున్నది తండ్రి తన సంతానం రూపంలో తన బాల్య కౌమార యవ్వనాలను పునర్జీవించడం. మహాభారతంలోని యయాతి యవ్వనేచ్చను ఈ కోణంలోంచి చూడడం.

మీ మాటలు

*