నవల నడచిన దారి

 

 

-దాసరి అమరేంద్ర

~

 

మొదటి తెలుగు నవల వీరేశలింగం గారి రాజశేఖర చరిత్రము – 1878లో వచ్చింది, దాదాపు నూట నలభై ఏళ్ళ క్రితం.

కథ జీవితపు తునక అయితే నవల ఏకంగా జీవితమే.

జీవితం గురించీ, సమాజం గురించీ తపనపడే నవలల గురించి ఈ మాటలు.

జీవితానికీ సాహిత్యానికీ గాఢమైన అనుబంధం ఉన్నది అన్న నమ్మకంతో ఈ మాటలు.

గత నూట నలభై ఏళ్ళలో నవల పోయిన పోకడలూ, ధోరణుల గురించీ, గత ఇరవై ఏళ్ళలో వచ్చిన ముఖ్యమైన నవలల గురించీ, ఈ మధ్య కాలంలో మంచి నవలలు రావడం లేదు అన్న విషయం గురించీ – అందుకు కారణాల గురించీ ఈ మాటలు.

స్థూలంగా చెప్పాలంటే నవల నడచిన దారిని రేఖామాత్రంగా పరిచయం చేసే ప్రయత్నమిది.

***

ఒకప్పుడు సాహిత్యమంటే పాండిత్య ప్రకర్ష.

రాజులూ, జమీందార్ల వ్యవస్థకు వందిమాగధ ప్రక్రియ. వారి వారి మనోరంజక వ్యాసంగం.

భూస్వామ్యం విచ్చిపోతూ, ప్రజాస్వామ్యానికి దారి ఇచ్చినప్పుడు సమాజంలో ‘మనిషి’ ముఖ్యమయ్యాడు. సాహిత్యానికీ, మనిషే కేంద్రమయ్యాడు. స్వంతంగా, స్వశక్తితో తన జీవితాన్ని నిర్ణయించుకొనే మనిషిని గురించి సాహిత్యం రాసాగింది. అందుకు అనుకూలంగా ఉందే సాహితీ ప్రక్రియలు రూపుదిద్దుకొన్నాయి. కావ్యాలూ, ప్రబంధాల స్థానంలో కథ, నవల వచ్చి చేరాయి. ఆంగ్ల సాహిత్యంలో పద్దెనిమిదో శతాబ్దంలో మొదలయితే, మరో వందేళ్ళకు భారతీయ భాషలలోకి ప్రవేశించి నిలదొక్కుకుంది నవల. ఈ ప్రక్రియకు జన జీవితమే వస్తువయింది. నవల అంటే జీవితానికి ప్రతిబింబం అయింది.

***

ముందుగా రెండు ప్రశ్నలు.

నవలలు ఎందుకు రాస్తారూ?

నవలలు ఎందుకు చదువుతారూ?

ఏ మనిషిలో అయినా ఒక నిరంతర అసంతృప్తి ఉంటుంది.

పరిసరాల మీదా, పరిస్థితుల మీదా, సమాజం మీద ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది.

పరిస్థితి మారాలనుకొంటాడు. మార్పు కోరతాడు. ఆ మార్పు ముందుకూ అవవచ్చూ, వెనకకూ అవవచ్చు. మార్పు కోరతాడు. అందుకోసం తపన పడతాడు.

చలనశీలత ఉన్న వ్యక్తి ఆ మార్పు కోసం నడుం కడతాడు. తనదైన పరిధిలో ఏదో ఒకటి చేస్తాడు – నిర్లిప్తంగా ఉండలేడు.

ఆ మనిషికి తన ఆలోచనల మీదా, అక్షరాల మీద ‘అధికారం’ ఉంటే రచయిత అవుతాడు.

పరిస్థితులను ప్రశ్నిస్తూ, ఘర్షణ పడుతూ, జీవితాలను మెరుగుపరచాలని తపిస్తూ, ఆయా సమస్యల పరిష్కారాల కోసం ప్రయత్నిస్తూ, రెబెల్‌గా మారి –

తన అనుభవాలకు తనదైన చైతన్యం జోడించినప్పుడు జీవితాన్ని నడిపించే సూత్రాల గురించి అవగాహన ఉన్నప్పుడు, గతం ఆసరాగా వర్తమనం భవిష్యత్తు వేపుకు వెళుతుంది అన్న అవగాహన కలిగినప్పుడు,

తనదంటూ ఒక దృక్కోణాన్నీ, దృక్పథాన్నీ ఏర్పర్చుకొన్నప్పుడూ – రచయిత అవుతాడు. నవలా రచయిత అవుతాడు.

మరి చదవడం?

novel6

నేను ఒక గాఢ అనుభూతి కోసం ‘హిమజ్వాల’ పదే పదే చదివాను. ఒకానొక జీవితానుభవం కోసం ‘చదువు’ నవల చదివాను. విభిన్నంగా ఆలోచించగల శక్తినిచ్చే చెలాన్ని చదివాను.

విజ్ఞానమూ, సంస్కారాల కోసం ఉప్పల లక్ష్మణరావు గారి ‘అతడు – ఆమె’ లోని శాంతం, శుభ, లక్ష్మిలను పలకరించాను.

ఒక్కమాటలో చెప్పాలంటే జీవితపు చిక్కుముళ్ళు విప్పే శక్తి సాహిత్యానికీ, నవలలకూ ఉంటుందని చదివాను.

జీవితాలను సమూలంగా మార్చి, జీవితాలకు దిశానిర్దేశం చేసే శక్తి ‘జానకి విముక్తి’లకు ఉంటుందని చదివాను.

నా వరకూ నాకు ‘ది మూన్ అండ్ సిక్స్త్ సెన్స్’ అనే ఆంగ్ల నవల దీపస్తంభంలా నిలబడి దారి చూపించడం – స్వానుభవం.

ఒకే ఒక్క జీవితకాలంలో అనేకానేక జీవితాల అనుభవాలను మనకు అందించే శక్తి నవలకు ఉందని చదివాను.

ఈ నేపథ్యంలోంచి చూస్తే తెలుగు నవల నడచిన దారిలో కూడా సమకాలీన జన జీవితంలోని అన్ని పార్శ్వాలు, కోణాలూ, సంఘర్షణలు, పరిణామాలు కనిపిస్తాయి.

నూటా ఏభై ఏళ్ళ తెలుగు సాంఘిక, ఆర్థిక, రాజకీయ, చరిత్రను మన నవలలు మన ముందు ఉంచుతాయి.

***

ప్రభువుల వ్యవస్థ మారి సామాన్యుడు సాహిత్యానికి కేంద్రబిందువవడం గురించి చెప్పుకొన్నాం. ఆంగ్ల సీమలో పద్దెనిమిదో శతాబ్దానికల్లా కథా నవలా వికసించడం గురించి చెప్పుకొన్నాం.

పంతొమ్మిదో శతాబ్దం ప్రథమ పాదానికల్లా ఆయా మార్పులు మన దేశాన్నీ తాకాయి. ఇంగ్లీషు చదువు మొదలైంది. రాజారామ్‌మోహన్ రాయ్, అతని సంస్కరణలు మనిషికీ, సమాజానికీ వెలుగుబాట పరిచాయి. అదే ఒరవడిలో అక్కడ ఈశ్వరచంద్ర విద్యాసాగార్, ఇక్కడ కందుకూరి వీరేశలింగం.

యాదృచ్ఛికమే అనిపించినా తెలుగునాట అదే సమయంలో అతి ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకొన్నాయి. రెండు ఆనకట్టల పుణ్యమా అని సామాన్యుని కడగండ్లకు తెరపడింది. కడుపు నిండింది. సంపద సృష్టి ఆరంభమైంది. పట్టణాలు మొలకెత్తాయి. ఇంగ్లీషు పాఠశాలలు మొదలయ్యాయి. కొత్త ఆలోచనలకు అంకురార్పణ. కొత్త చైతన్యాలు… పరిస్థితుల మీద అసహనం… మార్పు కోసం తపన… సంస్కరణల అభిలాష…

అదిగో – అలాంటి సమయంలో వచ్చాయి తొలి తెలుగు నవలలు.

రాజశేఖర చరిత్రము – వీరేశలింగం – 1878

సహజంగానే ‘సంస్కరణ’ ఈ నవల ప్రధానాంశం. రాజశేఖరునునికి తన అజ్ఞానమంటే అసహనం కలుగుతుంది. తనలోని మూఢ విశ్వాసాలంటే ఏవగింపు కలుగుతుంది. తనలో తాను సంఘర్షించడం, పోరాడడం, జయించడం…

అదే కోవలో మరో నవల – రామచంద్ర విజయం – చిలకమర్తి.

రాజశేఖరుని సంఘర్షణ తనతోనే అయితే, రామచంద్రుని పోరాటం పక్కవాళ్ళతో, వాళ్ళ స్వార్థాలతో, పరిసరాలతో.

మనిషి తనను తాను సంస్కరించుకొంటే, పరిసరాలను మార్చే ప్రయత్నం చేస్తే పరిస్థితులు మారతాయి, ప్రపంచం మరింత బాగుపడుతుంది – అన్న నమ్మకంతో వచ్చినవీ – సంస్కరణ దశలోని నవలలు.

***

క్రమక్రమంగా – వ్యక్తి చైతన్యం, మనుషులు దగ్గరవడం, ఉమ్మడి ఎజెండాలు. 1885 నాటికి ఆ ఎజెండాలు కాంగ్రెసు సంస్థ ఆవిష్కరణకు దారితీయడం… జాతీయ భావాలు… శతాబ్దం మారేసరికి జాతిలో నవచైత్యన్యం.

ఈలోగా నవలకు తోడుగా కన్యాశుల్కాలు, ధనత్రయోదశిలు, దిద్దుబాటులు… వలపు నవలలు, చారిత్రక నవలలు, దుర్గేశ నందిని నకళ్ళు… ఏదైమైనా సాహిత్య ప్రక్రియగా నవల నిలబడటం…

సంస్కరణ బావాలకు ఉద్యమ స్ఫూర్తి తోడయితే నవలలకు కొదవ ఉండదు. అదే జరిగింది తెలుగు నవల విషయంలో.

1920ల నుంచి కనీసం 1960ల వరకూ జాతీయ ఉద్యమ నేపథ్యంగా ఎన్నో చెప్పుకోదగ్గ నవలలు వచ్చాయి.

అందులో బాలాంత్రపు వెంకటరావు రాసిన “మాతృమందిరం” – 1920 తొలి తెలుగు జాతీయోద్యమ నవల అంటారు చరిత్ర తెలిసినవారు. అందులోని ‘మాతృ’ శబ్దం మాతృ దేశానికి సంబంధించినది. గాంధీ ప్రతిపాదన కన్నా ముందుగానే మద్యపాన నిషేధం, హరిజన సమస్య, స్త్రీల సమస్యలు, వర్ణాంతర వివాహాలు, వితంతు వివాహాలు – ఇలా అనేకానేక విషయాలు చర్చించిదట ఈ నవల.

1922లో వచ్చిన మాలపల్లి ఈ ఒరవడిలోణి ఓ బృహన్నవల. జీవన విస్తృతి, వస్తు గాఢత ఉన్న నవల. భారతీయ సంప్రదాయం పట్ల ఎంతో అనురక్తి ప్రదర్శిస్తూ, ఆ సంప్రదాయం భౌతిక పరిస్థితులలో ఎన్ని మార్పులు వచ్చినా – ఆ మార్పులకు అనుగుణంగా తననూ ముందుకు నడిపించుకొంటోంది అన్న గొప్ప నమ్మకాన్ని వ్యక్తీకరించారీ నవలలో ఉన్నవ లక్ష్మీనారాయణ.

 

సరే రామదాసు, సంగదాసు, తక్కెళ్ళ జగ్గడు లాంటి సజీవ పాత్రలూ, గాంధీతత్వపు ప్రతిఫలన, జన జీవన సమగ్ర చిత్రణ – దాదాపు వందేళ్ళు గడిచినా ‘మాలపల్లి’ని తెలుగు నవలలకు తలమానికంగా నిలబెట్టడం అందరికీ తెలిసిన విషయమే.

మాలపల్లి నవలలో మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి.

సమాజంలోనూ, సామాజిక సంబంధాలలోనూ వస్తోన్న స్ఫుటమైన మార్పుల్ని ఆ నవల పట్టుకోగలిగింది. కొత్త చూపు, కొత్త దృక్కోణం, కొత్త దృక్పథం. సమాజాన్ని వ్యక్తిపరంగా గాకుండా సమిష్టి వ్యవస్థగా అర్థం చేసుకొని విశ్లేషించడం – దిగువ జాతులు చైతన్యం పొంది పోరాటం సాగిస్తేనే ప్రజా ప్రభుత్వం సాధ్యమవుతుంది. అలా కాని నాడు ధనస్వామ్యమే చెల్లుబాటు అవుతుందన్న అద్భుతమైన అవగాహన – వందేళ్ళ క్రితం!!

ఇదే ఒరవడిలో బాపిరాజు నారాయణరావులోనూ, విశ్వనాథ వేయిపడగలులోనూ జాతీయోద్యమం ఒక ప్రధాన పాత్ర పోషించింది. ‘అతడు-ఆమె’, ‘కొల్లాయిగట్టితేనేమి’, ‘రామరాజ్యానికి రహదారి’, ‘చదువు’ లాంటి నవలల్లోనూ జాతీయోద్యమ నేపథ్యం ప్రముఖంగా ఉంది.

అదే వలస పాలన, జాతీయ భావన, ఆధునిక జీవన విధానం – ఇవి ముప్పేటగా సాగుతోన్న సంధి దశలో – 1930లు నలభైలలో – ఈ విషయాలను చర్చిస్తూ, సంప్రదాయంలో వస్తున్న మార్పుల్ని గుర్తిస్తూ నవలా రచన సాగింది. ఉన్నవ లాంటి వాళ్ళు ‘సంప్రదాయం నిలిచి తీరుతుంది’ అంటే, విశ్వనాథ ‘ధ్వంసమయిపోయింది’ అని నిర్ధారించడం – వాస్తవ స్థితి చిత్రణ అనడం కంటే వారి వారి దృక్కోణ వైరుధ్యం అనడం సరైన పని.

ఈ మధ్యలో కొవ్వలి వెయ్యికి పైగా పాపులర్ నవలలు రాసి తెలుగు నవలలకు పాఠకులను ఏర్పరచడమన్నది నవల నడచిన దారిలో ఒక ముఖ్యమైన మైలురాయి.

***

స్వతంత్ర్యం వచ్చాకా సామాన్యుని జీవితం ఎలా పరిణమించింది? సాంఘిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆర్థిక, రాజకీయ, పరిణామాల దిశ ఎటువైపు మళ్ళుతోంది? – అన్న ఆలోచన సాహితీకారుల్లో సహజంగానే వచ్చింది. ఆయా విషయాలను నవలలో చిత్రించే ప్రయత్నమూ జరిగింది.

1953లో వచ్చిన జీవీ కృష్ణారావు గారి ‘కీలుబొమ్మలు’ ఆ కోవకు చెందిన నవలల్లో మొట్టమొదట చెప్పుకోదగ్గది.

ఇది ప్రధానంగా అస్తిత్వవాద పోకడలున్న నవల అని విమర్శకులు నిర్ధారించినా – సమకాలీన జీవిత చిత్రణా, రాజకీయాలన్నవి ఏదో అధికార పీఠాలకు చెందినవి కావు – అవి సామాన్యుని జీవితంలోని అన్ని పార్శ్వాలను తాకుతాయి అన్న బలమైన ప్రతిపాదానా ఉన్న నవల ఇది.

ఆ తాకటం మనిషిని ఎంతగా దిగజార్చుతుందో 1961లో వచ్చిన బలివాడ కాంతారావు ‘దగాపడిన తమ్ముడు’లో కనిపిస్తుంది. 1940 వ దశాబ్దపు చివరి పాదంలో నడిచిన ఈ కథలో సన్నకారు రైతులు పట్నపు కూలీలుగా మారడమూ, చివరికి బిచ్చగాళ్ళుగా దగాపడడమూ బలంగా చూపించిన నవల ఇది.

ఇదే ఒరవడిలో 1969 నాటి బీనాదేవి ‘హేంగ్ మీ క్విక్’ లో రాజమ్మ ఉరిశిక్ష కోసం త్వరపడుతుంది. 1975 నాటి అర్నాద్ ‘చీకటోళ్ళు’ లో అదే పరిణామం మరింత బలంగా కొనసాగడం కనిపిస్తుంది. అరవైలలో వచ్చిన రావిశాస్త్రి నవలల్లో పట్టణాల పేద ప్రజల కన్నీళ్ళు, కడగండ్లూ – వ్యవస్థ ఆ కన్నీళ్ళతో ధనస్వామ్యపు పంటలు పండించడం – స్పష్టంగా తెలుస్తుంది.

పట్టణీకరణ తెచ్చిన మార్పుల గురించీ, అవి మానవ సంబంధాలలో తెస్తోన్న విపరీత పరిణామాల గురించీ, జీవితాలలో ధనమూ, స్వార్థాల ప్రమేయం గురించీ మాలతీ చందూర్ లాంటి వాళ్ళు 1950ల నుంచి రాయడం మొదలుపెడితే, అప్పుడే రూపుదిద్దుకొంటోన్న మధ్యతరగతి వారి జీవితాల గురించీ అందులోని స్వార్థాలూ, త్యాగాలూ, సంవేదనల గురించీ, అరవైల తొలి దినాలలో కొమ్మూరి వేణుగోపాలరావు ‘పెంకుటిల్లు’ వచ్చింది. మరో పదేళ్ళకు కొలిపాక రమామణి ‘ఏటి ఒడ్డున నీటి పూలు’…

novel4

***

అటు తెలంగాణా వేపు దృష్టి సారిస్తే బొల్లిముంత శివరామకృష్ణ ‘మృత్యుంజయుడు’ (1947) నవలలో అప్పటికీ తనదంటూ ఉనికే లేని తెలంగాణా సామాన్యుడు నవలా వస్తువుగా రూపొందడం కనిపిస్తుంది. మరో పదేళ్లకు వచ్చిన వట్టికోట ఆళ్వారుస్వామి ‘ప్రజల మనిషి’లో ఆ సామాన్యుడి ‘కంఠం’ ప్రస్ఫుటంగా ధ్వనిస్తుంది. మరో పదేళ్ళకు వచ్చిన దాశరథి రంగాచార్య ‘చిల్లర దేవుళ్ళు’ నవల – కథాకాలం 1930లకు చెందినదే అయినా – దొరలూ, గడీలూ, ఆడబాపల జీవితాలను కళ్ళకు కడుతుంది. మరో పదిహేనేళ్ళకు అల్లం రాజయ్య కొలిమి అంటించి జనజీవన కఠోరాలను ఆ మంటల వెలుగులో చూపించారు.

ఇటు ఉత్తరాంధ్రకు వస్తే అప్పటి రావిశాస్త్రీ, బలివాడ కాంతారావులకూ, ఇప్పటి అట్టాడ అప్పల్నాయుడికీ సామాన్యుని కతలూ, వెతలే నవలా వస్తువులు. సీమ వేపు వెడితే మధురాంతకం రాజారాం ఆనాడే సిరివాడ చిన్న ప్రపంచాన్ని సృష్టిస్తే, మొన్న కేశవరెడ్డీ, నిన్న నామినీ తమ తమ నవలలకు దిగువ తరగతి జీవితాలనే ముడిసరుకుగా తీసుకొన్నారు. ఈనాటి మధురాంతకం నరేంద్ర తిరుపతి పట్టణంలో గత వందేళ్ళుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏ విధంగా వేళ్ళూని విషవృక్షంగా పరిణమించిందో ‘భూచక్రం’ నవలలో ఎంతో ప్రతిభావంతంగా చిత్రించారు.

***

తెలుగు నవల అంటే అనువాద నవలలను గుర్తు చేసుకోకుండా ఉండలేం. శరత్ తెలుగు వాడా? అన్నది ఏ మాత్రమూ సందేహం లేని ప్రశ్న. బడీ దీదీ మాధవి, దేవదాసు పార్వతి, శ్రీకాంతూ మన మనుషులయ్యారు. గోర్కీ అమ్మ స్ఫూర్తితో నవలలే వచ్చాయి. రాహుల్ సాంస్కృత్యాయన్‌ని చదవని తెలుగు యాత్రాప్రేమి ఉండడు. గోపీనాథ్ మొహంతీ అమృత సంతానం – మన గిరిజనుల గురించేగదా? ‘మరల సేద్యానికి’లో శివరామ కారంత్ చెప్పుకొచ్చిన సరస్వతీ, పారోతీ తెలుగువాళ్ళు గాదూ? ప్రేమ్‌చంద్, యశ్‌పాల్, జయకాంతన్, తజకి, బిభూతిభూషణ్ బందోపాధ్యాయ, జమీల్యా, ఐతమతోవ్, నండూరి అనువదించిన ‘రెండు మహానగరాలు’; ఎన్నో ఎన్నెన్నో పరభాషా నవలలు తెలుగు నవలా సాహిత్యాన్ని సుసంపన్నం చేసాయి.

***

ప్రపంచమూ, సాహిత్యమూ, తెలుగు నవలలు మగవాడి చుట్టూ – అతని సమస్యలూ, పోరాటాల చుట్టూ తిరుగుతోన్న సమయంలో – స్త్రీలకు తమ తమ సమస్యలు లేవా? ఆకాంక్షలు లేవా? పోరాడాల్సిన విషయాలు లేవా? అన్న మౌలికమైన ప్రశ్నలను చలం 20లు, 30లలోనూ బలంగా బయటకు తెస్తే సమాజం ఉలిక్కిపడింది. తత్తరపడింది.

ఆ బాటలో మహిళా నవలాకారులు కొనసాగడం సహజ పరిణామం.

వట్టికొండ విశాలాక్షి 1956లో రాసిన ‘నిష్కామ యోగి’ నవలలో జాతీయోద్యమంలో పాల్గొనేంత చైతన్యమూర్తి అయిన ఓ మహిళ కూడా కుటుంబ వ్యవస్థ దగ్గరకు వచ్చేసరికి నిస్సహాయురాలవడం కనిపిస్తుంది.

మరో ఏడాదికే వచ్చిన డాక్టర్ శ్రీదేవి నవలలో ఇందిర, కళ్యాణిలతో పాటు వసుంధరా వైదేహిలు కూడా వ్యవస్థను ప్రశ్నించి, నిలదీసి, కాలాతీత వ్యక్తులుగా నిలబడడం కనిపిస్తుంది. ‘సహవాసి’ అన్నట్లు తర్వాత వచ్చిన స్త్రీవాదానికి ఆనాటి సజీవవాదం ఈ నవల.

తెన్నేటి హేమలత ఆలోచనలూ, వ్యక్తీకరణలూ ఒక విలక్షణ మార్గంలో సాగితే, రంగనాయకమ్మ కూలిన గోడలు దగ్గర్నించి జానకి విముక్తి దాకా తానే ఒక మార్గం ఏర్పరిచారు. ఎంతో మందికి మార్గదర్శి అయ్యారు. ఓల్గా ఎనభైలలో రాసిన ‘స్వేచ్ఛ’ స్త్రీవాద నవలలకు కొత్త దీపస్తంభం అయింది.

మరో వేపు మాలతీ చందూర్, మాదిరెడ్డి సులోచన, ద్వివేదులు విశాలాక్షి, కె. రామలక్ష్మి, వాసిరెడ్డి సీతాదేవి తమ తమ బాణీలలో మధ్యతరగతి స్త్రీల ఆలోచనలకూ, ఆకాంక్షలకూ, చైతన్యానికీ, వికాసానికీ కేంద్ర బిందువులయిన నవలలు రాసారు. ఇదే ఒరవడిలో సులోచనా రాణి ‘మీనా’ లాంటి బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలను సృష్టించారు.

 

అదే సమయంలో స్త్రీ చైతన్యాన్నీ, అస్తిత్వ స్పృహనూ సంతరించుకొన్న ‘గీతాదేవి’ని మనకు పరిచయం చేసారు వడ్డెర చండీదాస్.

తెలుగు నవలా సాహిత్యంలో 1950లు, అరవైల నాటి తాత్త్విక, అస్తిత్వ, మనోవిశ్లేషణాత్మక నవలలు ఒక ముఖ్యమైన పాయ.

“మనిషిని అర్థం చేసుకోవాలంటే ఏ మనిషిని ఆ మనిషిగా చూడాలి. ఉమ్మడి బతుకుల సిద్ధాంతాలు మనిషి ప్రత్యేకతని దెబ్బతీస్తాయి. మనిషిని యంత్రంగా చేస్తాయి. మనిషే ముఖ్యం.” అంటుంది అస్తిత్వవాదం.

“మనిషి అన్నివేళలా ‘సహజంగా’ ప్రవర్తించడు. అతనిలో అసహజ ప్రవర్తనా ఉండవచ్చు. దానికి కారణాలు ఉంటాయి. ఆ కారణాలు వెతకాలి. ఆ ప్రవర్తనను అర్థం చేసుకోవాలి. అతనికి అప్పుడు సాయం చెయ్యగలుగుతాం” అంటుంది మనోవిశ్లేషణా మార్గం.

మనిషిలోని ఉపచేతన – సబ్ కాన్షియెస్- ను దాటి వెళ్ళి, సుప్త చేతన – అన్ కాన్షియెస్ – లోని భావధారను పట్టుకొనే ప్రయత్నం చేస్తుంది చైతన్య స్రవంతి ప్రక్రియ.

ఈ నవలా కుటుంబానికి తలమానికం 1946లో బుచ్చిబాబు రాసిన ‘చివరకు మిగిలేది’. తన జీవితానికీ, తన ప్రవర్తనకూ తాను జవాబుదారీ కాదు అని భావించే దయానిధి అంతరంగపు పొరలలోకి వెళ్ళి ఆ ధోరణికిని ఆవిష్కరించే ప్రయత్నం ఎంతో సమర్థవంతంగా జరిగింది ఈ నవలలో. తర్వాత వచ్చిన శీలా వీర్రాజు ‘మైనా’ నవలకూ, చండీదాస్ ‘హిమజ్వాల’కూ ప్రేరణ అయింది ఈ చివరకు మిగిలేది నవల.

ఈ బాణీలో రావిశాస్త్రి అల్పజీవి రాసారు. గోపీచంద్ అసమర్థుని జీవయాత్ర రాసారు. హిమజ్వాలా, మైనాల గురించి చెప్పుకున్నాం. ఈ నవలలోని అస్తిత్వవాదం, మనో విశ్లేషణా, చైతన్యస్రవంతి ప్రక్రియలను ముప్పేటలుగా సాగితే, ‘అంపశయ్య’ నవలలో నవీన్ చైతన్య స్రవంతి ప్రక్రియను పరిపూర్ణ రూపంలో దాదాపు ఏభై ఏళ్ళ క్రితమే మనముందుంచారు.

***

ప్రతీకాత్మక నవలల గురించీ మనం చెప్పుకోవాలి.

రాజకీయాల ఊబిలో చిక్కుకుపోయిన ప్రజాస్వామ్యం దున్న గురించి రాసారు వినుకొండ నాగరాజు. కిక్కిరిసిన బస్సును దేశానికి ప్రతీకగా మార్చి స్వర్ణసీమకు స్వాగతం అన్నారు మధురాంతకం మహేంద్ర. దళిత రాజకీయాలలోని విపరీత లక్షణాలను తనదైన బాణీలో ‘నల్ల మిరియం చెట్టు’లో ఆవిష్కరించారు చంద్రశేఖరరావు. అటు చాళుక్యుల కాలాన్నీ ఇటు రాజశేఖరుల ఆవిర్భావాన్నీ ఒకే నవలలో – వీరనాయకుడు-లో చూపించారు పతంజలి శాస్త్రి. సినిమా రంగపు జీవితాలను బట్టబయలు చేసి మనముందు నిలిపారు ‘పాకుడురాళ్ళు’లో రావూరి భరద్వాజ.

***

ఇక్కడ పాపులర్ నవలల గురించి ఒక్కమాట.

అరవైల ఆరంభంలో కౌసల్యాదేవి ఆరంభించిన చక్రభ్రమణం ఈ ఏభై అరవై ఏళ్ళతో నిరంతరాయంగా యండమూరి సులోచనల సాక్షిగా సాగిపోతూనే ఉంది. ఆ నవలలన్నీ తెలిసోతెలియకో వ్యవస్థకు వంతపాడే బాణీవన్న మాట నిజమే అయినా – ఆయా నవలలూ, రచనలూ పాఠకుల సంఖ్యను గణనీయంగా పెంచాయి. కొత్త కొత్త పాఠకులనూ, యువతరాన్నీ అక్షరాల వేపు ఆకర్షించాయి. ఇది అన్ని భాషలలోనూ జరిగింది, జరుగుతోంది.

 

***

తెలుగు నవలల్లో భాష నడిచిన దారిని ఓ మారు చూద్దాం.

తొలి నవలలు – సహజంగానే – శుద్ధ గ్రాంథికంలో నడిచాయి.

ఇరవయ్యో శతాబ్దపు తొలి దినాలు వచ్చేసరికి నవలల్లో సరళ గ్రాంథికం సామాన్యమయిపోయింది.

నలభైలకల్లా శిష్ట వ్యవహారికం, ఏభైల నుంచీ ప్రజలు మాట్లాడే వ్యవహార భాష నవలలకు ఆధారపీఠమయిపోయింది.

ఎనభైలు వచ్చేసరికి నామిని లాంటి వాళ్ళ పూనిక వల్ల మాండలికం సాహితీభాష అయింది. ఒప్పుదల పొందింది.

అయినా నాలుగేళ్ళ క్రితం వచ్చిన ‘బోయకొట్టములు పండ్రెండు’ అన్న నవలను కరణం బాల సుబ్రహ్మణ్యం పిళ్ళె సరళ గ్రాంథికంలో రాయడం, పదిమందినీ ఒప్పించడం – భాష విషయంలో పాఠకులకూ, రచయితలకూ, తెలుగు నవలా సాహిత్యానికీ ఉన్న పట్టు విడుపులకు ప్రబల నిదర్శనం అని చెప్పుకోవాలి.

***

చారిత్రక నవలలంటే ఏమిటీ?

జీవితమే నవలకు ముడి వస్తువు అయినప్పుడు ఒక రకంగా చూస్తే ప్రతి నవలా చారిత్రక నవలే. తన కాలపు సమాజానికి అద్దం పట్టే నవలే.

అయినా మనకు మొట్టమొదట్లో వచ్చిన చారిత్రక నవలలు సహజంగానే – రాజ ప్రశంస, రాజ్య ప్రశంస, జాతీయ దురభిమానాలు ప్రాతిపదికగా, అభూతకల్పనలతో – వచ్చాయి.

కానీ మానవ పరిణామ క్రమంలో కొన్ని కొన్ని సంఘటనలూ, పరిస్థితులూ నిర్వహించిన పాత్రల గురించీ అవి చరిత్ర గతిని మార్చిన విషయం గురించీ కూడా తెలుగులో నవలలు వచ్చాయి. నిన్న మొన్నటి ‘అతడు – ఆమె’, ‘కొల్లాయిగట్టితేనేమి’ లాంటి నిన్నటి నవలల గురించి చెప్పుకొన్నాం.

novel3

మధ్య యుగాల నాటి సమాజం గురించి తెలుగులో వచ్చిన రెండు నవలల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

పదమూడో శతాబ్దపు గోబీ ఎడారులలోణి ఓ తండాకు చెందిన పనినాయకుడు ప్రతికూల పరిస్థితులలో ఏభై ఏళ్ళ పాటు అలుపు లేకుండా పోరాటం చేసి మానవ చరిత్రలోనే అతి పెద్దదయిన సామ్రాజ్యాన్ని నిర్మించిన వైనాన్ని ‘చెంఘిజ్‌ఖాన్’ నవలలో చెపుతారు తెన్నేటి సూరి. ‘రక్తపు ధారల్లో మునిగి తేలిన మనిషి కథ గదా ఈ నవల’ అన్న విమర్శకులకు – “పీడన ఉంటే అగ్ని పుడుతుంది నిజమే – చెంఘిజ్‌ఖాన్ ఓ అగ్నికణం. విధ్వంసకరమైన జ్వాల పుట్టగూడదు అనేవాళ్ళు ఆ పుట్టడానికి హేతువయిన పీడన ఎందుకు ఉందో చెప్పాలి.” అని సమాధానమిచారు తెన్నేటి సూరి.

ఎనిమిది తరాల ఓ బడుగు బోయ వంశం అటు చాళుక్యులు, ఇటు చోళుళ ఒడిదొడుకుల మధ్య చిక్కడిపోయి, తట్టుకొంటూ మనుగడ సాగించినా పాండురంగడు అన్న సేనాని క్రోధానికి మసి అయిపోయిన విధానాన్ని అతి చక్కని రీతిలో చిత్రించారు ‘బోయకొట్టములు పండ్రెండు’ అన్న నవలలో బాల సుబ్రహ్మణ్యం పిళ్ళె.

ప్రభువుల పల్లకీల గురించి కాకుండా, రాళ్ళెత్తిన కూలీల గురించి వచ్చిన అరుదైన నవలలు ఇవి.

***

నిన్న మొన్నటిదాకా వ్యవసాయ ప్రధానంగా ఉన్న తెలుగు జీవితంలో, వ్యవసాయమే జీవవ విధానంగా బతికిన సాంబయ్యల గురించీ, బక్కిరెడ్ల గురించీ నవలలు వచ్చాయి. మట్టిని తల్లిగా భావించే రోజులు మారి క్రమక్రమంగా వరూధినిలూ, వెంకటపతిలూ భూమిని వ్యాపార వస్తువుగా పరిగణించడాన్ని ‘మట్టి మనిషి’ బలంగా చిత్రించింది. అదే ఒరవడిలో కేశవరెడ్డి ‘మూగవాని పిల్లనగ్రోవి’ వచ్చింది. ఇరవై ఏళ్ళ క్రితం చంద్రలత ‘రేగడి విత్తులు’… నిన్నటికి నిన్న నల్లూరి రుక్మిణి ‘ఒండ్రుమట్టి’.

novel4

***

జీవితాలను అతి సజీవంగా, అతి సహజంగా చిత్రించిన రెండు పుస్తకాల గురించి – నవలలు కాని నవలల గురించి – చెప్పుకోవాలి.

పంతొమ్మిదో శతాబ్దపు ప్రథమ పాథంలో అర్థ అక్షరాస్యుడిగా భారతదేశంలో అడుగుపెట్టిన మెడోస్ టైలర్ అన్న బ్రిటీషు యువకుని ఆత్మకథ ‘సురపురం’. ఆ యువకుడు సమర్థవంతుడైన అధికారిగా, పరిణతి చెందిన రాజనీతిజ్ఞుడిగా, పరిపూర్ణ మానవుడిగా భారతదేశమే తన దేశమని భావించే మట్టిమనిషిగా 1825 – 65 ల మధ్య పరిణామం చెందిన వైనమూ, ఆ కథ చెపుతోన్న క్రమంలో ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, చారిత్రక పరిస్థితుల చిత్రీకరణా – అరుదైన ‘నవల’ ఇది.

1930ల నాటి పట్టణాల్లోని ఓ పెద్ద దళిత కుటుంబంలో ‘చదువు’ మీద ఉన్న పట్టుదల ఎంత గణనీయమైన మార్పులు తెచ్చిందో, ఆ అతి సామాన్యమైన కుటుంబం చదుపు పునాది మీద ఎలా ఎదిగి నిలబడగలిగిందో రాగద్వేషాలకు అతీతంగా నిమిత్తమాత్రంగా చెప్పుకొచ్చిన బయోగ్రఫీ ‘మా నాయన బాలయ్య’. రాసిన మనిషి ఆ బాలయ్య గారి అబ్బాయి సత్యనారాయణ.

ఈ రెండు పుస్తకాలూ ఇంగ్లీషు మూలభాషగా కలవే అయినా వాటి అనువాదాలూ, అందులోని తెలుగు జీవితం – అపురూపం.

***

తెలుగు నవలల గురించి మాట్లాడేడప్పుడు నవలాభిమానులు, ‘విమర్శకులూ’ అడిగేది ఒకటే మాట – ఈ మధ్య కాలంలో మంచి నవలలు అంటూ వచ్చాయా?!

‘వచ్చాయి – లేదు’ అన్నది నా సమాధానం.

ఒక్కసారి గత ఇరవై పాతికేళ్ళను గమనిస్తే మరో ఐరవై పాతికేళ్ళు నిలబడగలిగే నవలలు చాలా కనిపిస్తాయి.

కేశవరెడ్డి నవలలు వచ్చాయి. ‘అంటరాని వసంతం’ వచ్చింది. ‘నల్ల మిరియం చెట్టు’ వచ్చింది. మునెమ్మ, దృశ్యాదృశ్యం, వీరనాయకుడు, బోయకొట్టములు, ఒండ్రుమట్టి, భూచక్రం, నిప్పుల వాగు, వేముల ఎల్లయ్య కక్క…

“వ్యాపార (పాపులర్) నవలల వెల్లువలో కొట్టుకుపోతోన్న తెలుగు నవలకు చేయూత ఇవ్వాలనే” మంచి ఉద్దేశంతో అమెరికాలోని ‘తానా’, ‘ఆటా’ సంస్థలు – ఇరవై ఏళ్ళ క్రితమే – ప్రయత్నం చేసాయి. రేగడి విత్తులు, వలస దేవర, అయిదు హంసలు లాంటి చెప్పుకోదగ్గ నవలలు వచ్చాయి. అమెరికా నేల మీద నుంచి కూడా గొర్తి బ్రహ్మానందం రాసిన ‘అంతర్జ్వలనం’, రెంటాల కల్పన ‘తన్హాయి’ వచ్చాయి. ‘కథతో పాటు నవల కూడా అమెరికా నేల మీద వికాసం చెందుతోంది’ అన్న నమ్మకం కలిగించాయి.

kalpana

అప్పటి మాలతీ చందూర్లకు చక్కని కొనసాగింపుగా మంథా భానుమతి, గంటి సుజలలు చక్కని నవలలు రాస్తున్నారు.

గమనమే గమ్యంగా తెలుగు నవల సాగిపోతోంది.

అయినా –

ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది.

నూతన జీవన విధానాలనూ, ఆర్థిక రాజకీయ పరిణామాలనూ, సాంకేతిక సంక్లిష్టతలనూ ఈనాటి నవల పట్టుకోగలుగుతోందా?!!

లేదనే అనాలి!

ఎందుకనీ?!

నవల అంటే విస్తృత అధ్యయనం. నిరంతర పరిశీలన, విశ్లేషణ. మారుతోన్న జీవితాన్ని ‘పట్టుకోవడం’, కూలంకుషంగా అర్థం చేసుకోవడం… కార్యకారణ సంబంధం మీద మౌలికమైన అవగాహన కలిగి ఉండటం…

ఇది అనుకొన్నంత సులభంగాదు.

మన తెలుగు రాష్ట్రాలలో గత ఇరవై పాతికేళ్ళుగా కంప్యూటర్ వేగంతో మార్పులొచ్చాయి, వస్తున్నాయి. ఈ మార్పుల్ని ‘అందుకోడం’ సామాన్యులకు సాధ్యం కాదు. ఉదాహరణకు కారా గారు ఇరవై ఏళ్ళ క్రితమే తాను కథలు రాయకపోవడానికి మార్పుల్ని పట్టుకోలేకపోవడం ముఖ్య కారణమని అన్నారు. ఇదే మాట ఇంకో సందర్భంలో ఏభై ఏళ్ళ క్రితం కొడవటిగంటి అన్నారు.

ఒప్పుకున్నా లేకపోయినా మనవి ఉద్రేక స్వభావాలు. వెంటవెంటనే స్పందించే తత్వాలు. అవి కవిత్వానికీ, కథలకూ సరిపోతాయేమోగానీ నవల విషయంలో గ్రక్కున విడవాల్సిన విషయాలు. నవలకు సంయమనం, సమగ్రదృష్టి, ఆధార పీఠాలు. కొకు, ఉప్పల, మహీధర లాంటి వాళ్ళు ఆవేశకావేశాలను పక్కనబెట్టి రాసారు. తమ తమ నవలల్లో సిద్ధాంతాల ప్రకారం నడిచే జీవితాలను చిత్రించకుండా, జీవితాలు నడిచే విధానాలను సిద్ధాంతాల నేపథ్యంలోంచి చూపించారు. ఆ సంయమనం ఇప్పుడు – ఈ నూతన జీవన విధానాలలో – కొరవడుతోంది.

నవల రాయడం అంటే ఆరు నెలల తపన, ప్రేమ. కనీసం మూడు నెలల కష్టం. శ్రద్ధగా, ఓపికగా, నిబద్ధతతో, అంతంత కాలం నవల మీద ఖర్చు పెట్టడం – ఊహాతీతమయిపోతోంది!

అయినా

నవల నడిచిన దారిని మరోసారి చూసుకొంటే, గత పాతికేళ్ళ మందగమనాన్ని విస్మరించకుండానే, మనం సంతోషించవలసిన విషయాలు చాలా ఉన్నాయి.

దాదాపు నూట ఏభై ఏళ్ళ తెలుగువారి జీవితాలకు సాక్షీభూతంగా నిలిచింది తెలుగు నవల. అనేకానేక పరిణామాలను ఒడిసి పట్టుకొని నమోదు చెయ్యగలిగింది. గొప్ప సాంస్కృతిక సంపదగా మిగిలింది. అనుమానం లేదు.

ఈనాడూ, రేపూ సంగతి అంటే –

ఆశావాదంలో తప్పు లేదు గదా!

***

ఈ మాటలన్నీ నా పరిజ్ఞాన ఫలితంగా వచ్చినవి గావు.

సాహిత్యాన్ని అర్థం చేసుకోడానికీ, జీవితానికి అన్వయించుకోడానికీ నేను చేస్తున్న నిరంతర ప్రయత్నంలో ఒక భాగం ఈ  ‘నవల నడిచిన దారి’ కూర్పు.

కొండను అద్దంలో చూపించే ప్రయత్నమిది.

మరి అద్దంలో కొండే కనిపిస్తోందో – ఎత్తిపోతల బండరాళ్ళు కనిపిస్తున్నాయో – తెలియదు.

ఇది సమగ్రమనీ, దోష రహితమనీ, చర్చకు అతీతమనీ – ఆ భ్రమ నాకు లేదు. చర్చ అంటూ జరిగితే అందులోంచి నేను మరికాస్త నేర్చుకోగలనన్న ఆశ ఉంది.

ఈ మాటలు రాయడానికి మిత్రులు వివినమూర్తి, వాసిరెడ్డి నవీన్‌లతో జరిపిన సంభాషణలు బాగా సాయపడ్డాయి. సహవాసి వ్యాస సంకలనం – నూరేళ్ళ కథ, బాగా ఉపయోగపడింది. ఆ పుస్తకానికి కాత్యాయనీ విద్మహే రాసిన సుదీర్ఘమైన ముందుమాట ఒక సాహితీ గనిలా నా ముందు నిలబడింది. ఏ మాత్రమూ సిగ్గూ, మొహమాటాలు లేకుండా ఆ గని లోంచి మాణిక్యాలను ఏరుకొన్నాను. నా దగ్గర ఉన్న రాళ్ళను వాటితో కలిపాను.

వెరసి – ఈ ప్రసంగ వ్యాసం.

 

 

(27 మే 2016 నుంచి 29 మే 2016 వరకు మూడు రోజుల పాటు డాలస్ నగరంలో జరిగిన నాటా మహా సభలలో రెండో రోజు కార్యక్రమాలలో తెలుగు నవలా సాహిత్యం తీరుతెన్నులపై  దాసరి అమరేంద్ర చేసిన ఉపన్యాసపు పాఠం ఇది).

 

మీ మాటలు

 1. Devarakonda Subrahmanyam says:

  తెలుగు నవలా పరిణామాన్ని వివరంగా, విశ్లేషాత్మకంగా రాసిన అమరేంద్ర గారు అభినందనీయులు

 2. Devarakonda Subrahmanyam says:

  ఈ మధ్య చాలామంది రచయత(త్రి)లు తమ వ్యాసానికి నాంది పలికిన సమావేశం గురించి వారు ఆ వ్యాసాన్ని ప్రచురించినప్పుడు ఆ సంగతి రాయటం లేదు. అల కాకుండా ఈ వ్యాసానికి నాంది అయిన నాట సభలను ప్రస్తావించినందుకు కూడా అమరేంద్ర గారిని అభినందిస్తున్నాను.

 3. Amarendra Dasari says:

  కృతఙ్ఞతలు సుబ్రహ్మణ్యం గారూ

 4. b.narsan says:

  అప్పుడప్పుడు ఎలా ప్రస్తావించుకోవడం వల్ల సంగతులు చర్చకు వచ్చి వాటి జీవిత కాలం పెరుగుతుంది. ఎవరికి ఎంత తెలిసినా, తెలియకున్నా క్రోఢీకరించిన సమాచారం ఎప్పుడూ ఉపయుక్తమే.. మీ ప్రయత్నం నవలపై మీ అనురక్తిని తెలుపుతోంది. మంచి క్రమ, విశ్లేషణ.

 5. Amarendra Dasari says:

  థాంక్స్ నర్సన్ గారూ…

 6. సుజల says:

  వ్యాసకర్త దాసరి అమరేంద్రగారికి ధన్యవాదాలు. నవల నడిచిన దారి గురించి చాలా సమగ్ర వ్యాసాన్ని వివరాలతో అందించడమే కాక నేటి నవలా రచయిత్రిగా నిన్న కాక మొన్న రచన మొదలుపెట్టినా మీరు నాపేరును చెప్పడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.ఎంతో మధన కలిగితే కానీ ఒక మంచి నవలను రాయడం కష్టం అది మాత్రం నిజం.కానీ మేము రాసేవి అన్నీ ఇప్పటి సమాజానికి అద్దంపట్టి ఇదివరకటి రచయితుల పోకడ తో రాస్తున్నామా లేదా అన్నది నాకు తెలియదు.ఒక తపన ను నాకైన రీతిలో ప్రదర్శించడానికి చెసే ప్రయత్నమే.కధల కన్నా నవల రాయడమే నాకు ఇష్టం
  సుజల గంటి

 7. Amarendra Dasari says:

  థాంక్స్ సుజల గారూ

 8. డిటెక్టివ్ (పత్తేదారి) నవలలు సాహిత్యం లో ఒక భాగం కాదా? అంటరానివా?

 9. Amarendra Dasari says:

  నవలల విషయం లో నా ఆలోచనలకు ఒక దిశనూ పరిధినీ ముందే సూచించాను కదా…ఆ పరిధిలోకి రానివాన్ని ‘అంటరానివి’ అనడం అతిశయోక్తి అవుతుంది..

 10. Buchireddy gangula says:

  అద్దం లో –బండ రాళ్ళే కనిపించాయి ????
  Incomplete సమీక్ష
  Gollapudi –కొమ్మూరి –kashibatla వేణుగోపాల్.–కాలువ మల్లయ్య –అల్లం రాజయ్య –గారలను
  మరిచిపోయినట్టు ఉన్నారు –Katha తో పాటు నవల కూడా USA. నేలమీద వికాసం
  చెందుతున్నాయి -అన్నారు ??usa నుండి వచ్చిన నవల లు –అంత. గొప్ప వేమి-కాదు –జస్ట్.
  Buttering తప్ప
  ———————–
  Buchi రెడ్డి గంగుల.

 11. Narayanaswamy says:

  మీ ప్రసంగం బాగా నచ్చింది నాకు – తెలుగు నవల గురించి ఒక గొప్ప విహంగ వీక్షణం – మీరు మాట్లాడిన పద్దతీ బాగుంది నాకు – అభినందనలు అమరేంద్ర గారూ!

 12. కె.కె. రామయ్య says:

  తెలుగు నవల నడచిన దారిని కొండను అద్దంలో చూపించే ప్రయత్నంగా చేసిన ప్రియమైన శ్రీ దాసరి అమరేంద్ర గారు! అబినందనలు.

  అన్నట్లు నామిని అన్న “మూలింటామె” ను గురించి విస్తారంగా ప్రస్తావించినట్లు లేదు.

  జీవితాలను సమూలంగా మార్చి, జీవితాలకు దిశానిర్దేశం చేసే శక్తి గల ‘జానకి విముక్తి’ నవలని ప్రస్తావించినప్పుడు రంగనాయకమ్మ గారి పేరు జతచేరి ఉచ్చరించాలేమో కదా ( పునరుక్తి దోషం అంటుకున్నా).

  స్వాతంత్య్రానికి ముందు భారత దేశ స్థితిగతులు, యుద్ధ సమయంలో, జాతీయోద్యమ సమయంలో, భారత దేశం స్వాతంత్య్రం పొందిన తరువాత ఉన్న పరిస్థితులన్నిటినీ ఒక్క క్రమ పద్దతిలో వర్ణించిన కొడవటిగంటి కుటుంబరావు గారి ‘చదువు’ నవల ఒకానొక జీవితానుభవం కోసం చదివాను అన్నారు. ( అది కొ.కు. నాయన మాగ్నమ్ ఓపస్ నవల అని కూడా అనొచ్చా).

  మన బందరు వారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి “కృష్ణాతీరం” కి పెద్ద పీట వేయ్యలేదేందుకు ( ”మాది కృష్ణా జిల్లా పెద్దపీట వెయ్యండి” ).

  నండూరి రామమోహన రావు గారు అనువదించిన నవలలో మార్క్ ట్వైన్ టాంసాయర్, కాంచన ద్వీపం గురించి చెప్పలేదు. అయ్యబాబోయ్ ముళ్ళపూడి వెంకటరమణ గారినెట్లా మరిచారండి. ( స్థలాభావం, కాలాతీతం కాదుకదా ).

  త్రిపుర గారి ప్రియశిష్యుడు, సరిపల్లి కనకప్రసాద్ కి అమిరికా లో ఉండటం వల్ల టైమ్ దొరకదనుకుంటానండి లేకుంటే కుర్రాడు చాకులాంటోడు, నవల రాయగల సత్తా ఉన్నోడు. ( కథలు, కవితలు, సానాబారుగా ఉండే సాహితీ వ్యాసాలూ ఖతర్నాగ్ గా రాస్తాడు. కన్యాశుల్కానికి సీక్వెల్ రాసి ప్రైజు కూడా కొట్టేసాడు ).

  ఈ సందర్భంలో త్రిపుర మరో అభిమాని, ప్రతిభాశాలి నరేశ్ నున్నా గారిని మరువలేవండి. త్రిపుర గారి మూలా సుబ్రహ్మణ్యం నవల ఆంధ్రజ్యోతి నవ్య వారపత్రికలో ప్రైజు గెలుచుకున్నదండి.

  ఈ తరం ప్రతిభావంత రచయితలు కదీర్ బాబు, పూడూరి రాజిరెడ్డి, మహిత కధ డా. సామాన్య లు ఇంకా అనేకానేకులు తలుచుకుంటే తెలుగు నవలకు చేయూత నివ్వగలరనుకున్టానండి.

  తెలుగు నేలమీది సాహిత్యానికి చేయూత నిస్తున్న ప్రవాసాంధ్రులు, అమెరికా వాళ్లు, తానా వాళ్లు, డా జంపాల చౌదరి గారూ, అంతర్జాల పత్రికలూ కూడా ఆధునిక తెలుగు నవల బతికి బట్టకట్టడానికి సాయం చెయ్యాలనుకుంటానండి. .

 13. కె.కె. రామయ్య says:

  అమరేంద్ర సార్, వోల్టైర్ కాండిడ్ ని అద్భుతంగా అనువదించి ఇచ్చిన మన కడపాయన పి. మోహన్ గారుని ( ఆయప్పకి ఆంద్ర వోల్టైర్ అని బిరుదివ్వోచ్చు), ప్రముఖ డచ్ చిత్రకారుడు విన్సెంట్ వ్యాన్గో జీవిత నవల ‘లస్ట్ ఫర్ లైఫ్’ ని ‘జీవన లాలస’ గా అనువదిస్తున్న మోహన్ గారి వెలకట్టలేని కృషిని మనం మరువ రాదు సార్.

  అట్టాగే మన రామిండ్రి సిన్నయ్యగోరు ( దాట్ల లలిత గారు ) మళ్లీ కనికరించి కలం పడితే తెలుగు సాహిత్యంలో అద్భుతాలు జరగొచ్చండి. ఇది అబ్బులు గాడు లాంటి నా మాటే కాదండి, త్రిపుర గారి ఆప్త మిత్ర, పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాథ రావు గారి ఆశ కూడా అనుకుంటానండి.

 14. భాస్కరం కల్లూరి says:

  బాగుంది అమరేంద్ర గారూ…మీరు ఎంచుకున్నది సువిశాలమైన సబ్జెక్టు. ఒక చిన్న వ్యాసంలో సంపూర్ణ న్యాయం చేయడం కష్టం.అలాంటి పరిమితులపట్ల స్పృహతోనే మీరు రాశారు. నిజానికి విశ్వవిద్యాలయ స్థాయిలో చేపట్టవలసిన అంశం ఇది. మీ వ్యాసంలో అక్కడక్కడ మంచి అబ్జర్వేషన్లు ఉన్నాయి. “ఒప్పుకున్నా లేకపోయినా మనవి ఉద్రేక స్వభావాలు. వెంటవెంటనే స్పందించే తత్వాలు. అవి కవిత్వానికీ, కథలకూ సరిపోతాయేమోగానీ నవల విషయంలో గ్రక్కున విడవాల్సిన విషయాలు. నవలకు సంయమనం, సమగ్రదృష్టి, ఆధార పీఠాలు” అన్నది వాటిలో ఒకటి. .

 15. Amarendra Dasari says:

  ప్రసంగాన్ని 20 నిమషాలలో ముగించాలి అన్ననాటా వారి పరిమితి ని గౌరవించి చాలా క్లుప్తం గా రాసాను…మాట్లాడాను..vivaramgaa raayaalante mari rendu retlanna నిడివి పెంచాలి…
  గంగుల వారు జాగ్రత్తగా చూస్తె పెంకుటిళ్ళూ, కొలిమీ కనిపిస్తాయి..మిత్రులు పేర్కొన్న ‘గొప్ప’ రచయితలను ప్రస్తావించక పోవడానికి కాల పరిమితి ఒక కారణం అయితే, నవలకు నేను ఇచ్చిన నిర్వచన ‘పరిమితి’ ముఖ్య కారణం

  వ్యాసం గురించి స్పందించిన మీ అన్దరికీ ధన్యవాదాలు

 16. కె.కె. రామయ్య says:

  అమరేంద్ర సార్! తెలుగు నవల నిర్వచనా పరిధిని ఇంకొద్దిగా పెంచి, నాటా మహా సభల కార్యక్రమాలలో మీరు చేసిన ఉపన్యాసపు పాఠంకి కొనసాగింపుగా … కల్లూరి భాస్కరం గారు సూచించిన విశ్వవిద్యాలయ స్థాయిలో చేపట్టవలసిన అంశంగా … తెలుగు నవలా సాహిత్యం తీరుతెన్నుల గురించి రాయవలసినదిగా విజ్ఞప్తి. ఏ దిల్ మాంగే మోర్

 17. ఆర్.దమయంతి. says:

  ఇదొక సముద్రమంత సబ్జెక్ట్. సమయానుకూలం గా కుదించి రాసినా చాలా గొప్ప సమాచారాన్ని అందచేసారు అమరేంద్ర గారు.
  అప్పట్లో నేను చదివిన అనువాద నవల్లు కూడా కొన్ని గుర్తున్నాయి. మా వూరి గంగ (సినిమా టైటిల్ ఇది) ఒకటి డ్రగ్స్ ని ఆధారంగా చేసుకున్న ఇతివృత్తమ్, త్రివేణి ..చాలా పేరు తెచ్చుకున్న నవలలు.
  కోడూరి కౌసల్య, మాదిరెడ్డి సులోచన, పరిమళా సోమేశ్వర్ మంచి నవలలు రాసారు. డి. కామేశ్వరి గారు తన (న్యాయం కావాలి సినిమా) నవలా ఒక సంచలనాన్ని తీసుకొచ్చిందని చెప్పాలి. అలానే, హా స్యం రాసే రచయిత్రులు చాలా తక్కువ. వారిలో ప్రధమం గా చెప్పుకోవాలంటే శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి.
  కకుభ అనే రైటర్ రాసిన ఒక సీరియల్ అప్పట్లో ఒక ఆసక్తి కరమైన రచన గా పేరు తెచ్చుకుంది. (అది మరి నవలా పుస్తకంగా వచ్చిందో లేదో తెలీదు.)
  చిన్న చిన్న నవలలు రాసి పేరుతెచ్చుకున్న వారూ వున్నారు, ఒకటి అరా రాసినా గుర్తుం డి పోయే నవలలు రాసిన వారూ వున్నారు. అలా మనసులో నాటుకుపోయిన నవలలో శ్రీమతి వెంకట రమణ కుమారి టైటిల్ గుర్తుకు రావడం లేదు. (తోక చుక్క అనుకుంటా.) (మరొకటి తోడు . రచయిత పేరు గుర్తులేదు.
  ఈ రెండూ కూడా చతుర మాస పత్రిక లో వచ్చినవే. ఇతివృత్తం – నేడు నడుస్తున్న మనిషి, మనసు. పరిస్తితుల్ని ఆలోచనల్ని పరిశీలించి, సమస్యల్ని మనముందు ఉంచడమే కాకుండా, రచయితగా ఒక మార్గాన్ని చూపడం జరుగుతుంది.
  ఒక లేడీ హాస్టల్ లో జరిగే వింత పోకడల్ని వివరిస్తూ పావని సుధాకర్ the
  హాస్టల్ అనే నవల రాసారు. అప్పట్లో అదొక సంచలనం. ఇందులో- వార్డెన్ ఒక లెస్బియన్.
  ఇంకా గొప్ప వీ వుండే వుంటాయి. అన్నీ చదివలేను. ఇవి మాత్రం నే చదివిన వాటిల్లో నాకు నచ్చాయని చెబుతున్నానం తే.
  ఇలా చెప్పుకుని పోతుంటే..టైమ్ సరిపోదు. అంత లోతైన సబ్జెక్ట్.
  మీరు ఎంచుకున్న అంశం చాలా ఆసక్తి కరమైనది అమరేంద్ర గారు.
  అభినందనలు.

 18. Amarendra Dasari says:

  థాంక్స్ దమయంతి గారూ

 19. దేవరకొండ says:

  ఇంత ఆసక్తి కరమైన విషయానికి కేవలం 20 నిముషాలు కేటాయించడం ఆసక్తి గల వారి దురదృష్టం. ఆ కాస్త సమయంలోనే ఇంత గొప్ప ప్రసంగాన్ని ఇవ్వడం ఓ అద్భుతం. అమరేంద్ర గార్కి ధన్యవాదాలు.
  మూన్ అండ్ సిక్స్త్ సెన్స్ అని ఉంది. వీలైతే సరిచేయగలరు. అలాగే మరో చోట విశ్వనాధ, ఉన్నవ ల దృక్పధాల్ని అటూ ఇటూ గా చదువుకోవాలేమో గమనించండి. (ఉన్నవ లాంటి వాళ్ళు ‘సంప్రదాయం నిలిచి తీరుతుంది’ అంటే, విశ్వనాథ ‘ధ్వంసమయిపోయింది’ అని నిర్ధారించడం – వాస్తవ స్థితి చిత్రణ అనడం కంటే వారి వారి దృక్కోణ వైరుధ్యం అనడం సరైన పని.). లేదా కొద్ది వివరణను జోడించగలరు.

 20. కె.కె. రామయ్య says:

  వీక్షణం వేణుగోపాల్ గారు, అమరేంద్ర గారి వ్యాసానికి కొనసాగింపుగా, ఉద్యమాలకు ఉపిరిలూదిన తెలుగు నవలా సాహిత్యం గురించిన వ్యాసాలేవైనా ఉంటే దయచేసి ప్రస్తావించరూ. లేదూ మీ వ్యాఖ్య అన్నా వినిపించరూ.

  మిత్రుడు బందరు ఆర్.వి. రమణ ఇఛ్చిన సమాచారం ఇక్కడ పొందుపరుస్తున్నా.

  తెలంగాణ నుంచి వచ్చిన విప్లవోద్యమ నవలల జాబితా

  సం. నవల పేరు రచయిత వెలువడిన సంవత్సరం
  1. మాపల్లె చెరబండరాజు 1978 ( రచన 1974)
  2. వేలాడిన మందారం జ్వాలాముఖి 1979
  3. కొలిమంటుకున్నది అల్లం రాజయ్య 1979
  4. ప్రస్థానం చెరబండరాజు 1981
  5. ఊరు అల్లం రాజయ్య 1982
  6. అగ్నికణం అల్లం రాజయ్య 1983
  7. కొమురం భీం అల్లం రాజయ్య, సాహు 1983
  8. నిప్పురాళ్లు చెరబండరాజు 1983
  9. దారిపొడుగునా… చెరబండరాజు 1985
  10. నల్లవజ్రం పవన్ కుమార్ 1989
  11 వసంతగీతం పులి ఆనందమోహన్ 1990
  12 రాగో సాధన 1993
  13 సరిహద్దు సాధన 1993
  14 అడవి వసంతరావు దేశపాండే 1996
  15. తెలంగాణ పల్లె కౌముది 1996
  16. అన్నలు పులుగు శ్రీనివాస్ 1999
  17. అడవితల్లి పులుగు శ్రీనివాస్ 1999
  18. శేషగిరి పి. చంద్ 2001
  19. నెత్తుటిధార కె. రమాదేవి 2005
  20. విప్లవాగ్ని ఉదయగిరి 2009

  ( కాకతీయ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల, వరంగల్ లో ‘తెలంగాణ తెలుగు నవల’ అంశంపై నిర్వహించిన యుజిసి జాతీయ సదస్సులో 2011 ఫిబ్రవరి 19న సమర్పించిన పత్రం )

 21. Buchireddy gangula says:

  రమణగారు –రామయ్య గారు
  8 నుండి 19 వరకు ఉన్న బుక్స్. ఎక్కడ. లభిస్తాయో ఈ Mail చేస్తారా–plz
  ==========
  Hanamkonda @ Aol.com

  Buchi రెడ్డి గంగుల

 22. Amarendra Dasari says:

  “ఇలాంటి విషయానికి 20 నిముషాలే కేటాయించడం …” అన్నారు సుబ్రమణ్యం గారు ..వారి మాట వెనుక ఉన్న భావానికి కృతజ్ఞతలు…కాని ఇక్కడ ఒక వివరణ ఇవ్వాలి…నాటా నిర్వాహకులు ఇచ్చిన సమయం లో ఈ విషయం మాట్లాడాలి అని ఎంచుకున్నది నేనే…అంచేత ఇక్కడ పొరపాటు అంటూ ఉంటే అది నాడే తప్ప నిర్వాహకులది కానే కాదు

 23. దేవరకొండ says:

  అమరేంద్ర గారు అనుకున్నట్లు అది సుబ్రహ్మణ్యం గారు కాదు. మా ఇద్దరి ఇంటి పేర్లూ ఒక్కటే కావడం వల్ల అలా అనుకొని వుంటారు. ఇంతకీ అది అంత తక్కువ సమయంలో ఇంత విషయాన్ని ప్రసంగించడం పట్ల ఆశ్చర్యానందాలే తప్ప మరోటి కాదు. మరో సారి అభినందనలు.

 24. D Subrahmanyam says:

  వివరణ ఇచ్చినందుకు దేవరకొండ గారికి థాంక్స్

 25. Amarendra Dasari says:

  సంతోషం దేవరకొండ gaarooo

మీ మాటలు

*