నేనెప్పుడూ బాటసారినే: మన్నెం శారద

 

-ఆర్. దమయంతి 

~

 

మెదడు నెమరేసుకునే కథలు   రాయడంలో, మనసున నిలిచిపోయే పాత్రలను సృష్టించడంలో –  తనకు తానే సాటి అన్నట్టు పాఠకుల మన్నన పొందిన రచయిత్రి – శ్రీమతి మన్నెం శారద.

వీరి కథలు చదివించవు. అక్షరాల వెంట చూపుల్ని చకచకా పరుగులు  తీయిస్తాయి.  కథలో కొత్తదనం తప్పని సరి. భాషలో సంస్కారం ఒక సిరి. కథనం లో ఒక ఒత్తైన పట్టు వుంటుంది.  గమ్మత్తైన మలుపుంటుంది. ఒదిగినట్టుంటాయి కానీ, నిలదిసి ప్రశ్నిస్తుంటాయి – పాత్రాలు. రచనలో ఔన్నత్యం ప్రధానాంశం. ఉన్నత భావవ్యక్తీకరణం – వీరి సొంతం. వెరసి మంచి కథకు చిరునామాగా మారారు – మన్నెం శారద గారు.

దరిదాపు నాలుగు దశాబ్దాలుగా రచనా సాహిత్యాన్ని కొనసాగిస్తున్న సీనియర్ రైటర్. వెయ్యి కి పైగా కథలు రాసి ఒక రికార్డ్ సృష్టించిన సంచలన రచయిత్రి.       

వృత్తి రీత్యా ఇంజినీర్. ప్రవృత్తి రీత్యా – రైటర్.

ఉద్యోగమేమో – రహదారులు, భవన నిర్మాణ శాఖలో. కానీ, అక్షర నిర్మాణమేమో – గుండె గుండెనీ దగ్గర చేస్తూ –  కథావంతెనల కట్టడాలు! – రెండు విభిన్న వైనాల మధ్య ఎలా ఈ సమన్వయం ఎలా కుదురుతుంది ఎవరికైనా?  ఇటు ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూ, అటు గృహిణిగా ఇంటి బరువులు మోస్తూ, ఇంటా బయటా  వ్యతిరేకతలను ఎదుర్కొంటూ, మరో వెంపు – రచనా సాహిత్యాన్ని చేపట్టడం ఎంత కష్టం!?.. అయినా ఎంతో ఇష్టం గా చేపట్టి, గొప్ప విజయం సాధించడం ఎంతైనా ప్రశంసనీయం. మరెంతయినా అభినందనీయం. ‘అంతా దైవ కృప ‘ అంటూ నవ్వుతూ చెబుతారు కానీ,  తాను సలిపిన కృషి గురించి మాట మాత్రం గా అయినా పైకి చెప్పుకోరు.  తన రచనా ప్రతిభ కు ఎలాటి పబ్లిసిటీ ఇచ్చుకోని సింప్లిసిటీ – వీరి వ్యక్తి త్వం.

మృదు స్వభావి. చాలా సెన్సిటివ్.  మాట మెత్తన. మనసు చల్లన.

మనకున్న బ్రిలియంట్ రచయిత్రుల్లో ఒకరైన మన్నెం శారద గారితో – సారంగ తరఫున ఇటీవల ముచ్చటించడం, ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు తెలుసుకోవడం జరిగింది. ఆ సంగతులేవిటో  – ఈ ఇంటర్వ్యూ చదివి మీరూ తెలుసుకోవచ్చు.

*****

 

మీరు –  దరి దాపు 40  సంవత్సరాలు గా కథలు రాస్తున్నారు కదూ?

* అవును.

మీరు   రాసిన మొదటి కథే ప్రచురణకు నోచుకోవడం జరిగిందా?

* అవును. నా మొదటి కథ – ‘అడవి గులాబి’ ఆంధ్ర జ్యోతి లో పబ్లిష్ అయింది.

 కథ రాయడం వెనక ఒక ఫోర్స్ వుంటుంది.  అది ప్రేరణ కావొచ్చు, ఉప్పొంగిన భావం కావచ్చు.  కథ రాయడం ఎలా జరిగింది?

* మాబావగారు సీలేరులో ఇంజనీర్ గా వున్నప్పుడు నేను మా అక్కతో కలిసి సీలేరు వెళ్లాను.  అంతా ఏజెన్సీ. అడవులు,సెలయేళ్ళు, కొండలు, లోయలు. అద్భుతం ఆ సౌందర్యం. నేను చిన్నతనంనుండి చదివిన సాహిత్య ప్రభావమో లేక నాకు ట్రాజేడీలంటే వున్నఇష్టమో…తెలియదుకానీ కిటికీలోంచి  చూస్తుండగానే ఒక విషాదాంత ప్రేమకధ నామనసులోరూపుదిద్దుకుంది.అంతే రాసేశాను. మరో సంగతి. మాఇంటిదగ్గర ఒకవిషాద ప్రేమకధకి  ఒకఅమ్మాయి బలికావడం కూడా కొంతనాపై ప్రభావంచూపించిందని చెప్పాలి.

 కథని తొలిసారిగా అచ్చులో చూసుకున్నప్పుడు ఏమనిపించింది?

* అప్పుడు నా  వయసు16 .  చాలాత్రిల్  ఫీల్ అయ్యాను. ఎన్నిసార్లుచదువుకున్నానో నాకే తెలియదు. అప్పట్లో ఒక రచనవెలుగు చూడాలంటే చాలాకష్టం.

  ఆ కష్టమేమిటో కాస్త వివరిస్తారా  ఈనాటి  రైటర్స్ తెలుసుకునేందుకు వీలుగా! 

* అప్పటిలో నిష్ణాతులైన ఎడిటర్స్ రచయితలు ..చాలా జల్లెడ పట్టేవారు. రచయితలకి కేవలం పోస్ట్లో  పంపడం, ఎదురుచూడటం అంతే.  ఇంట్లోరచనలు చేయడానికి పెద్దలుఒప్పుకునేవారుకాదు. ఇప్పటిలా పరిచయాలు ఉండేవి కావు. ఇంత విస్తృత అవకాశాలు అప్పట్లో లేవు.  రచయితలంటే   ఇంచుమించు దేవతలే.

 

రచయితలంటే దేవతలని  చాలా చక్కటి నిజం చెప్పారు. అంటే రచయిత లో దైవత్వ  లక్షణాలు వుంటాయని  పాఠకాభిమానులు  భావించే వారేమో?

* అవును .పూర్వ జన్మసుకృతంకొద్దీ సరస్వతీపుత్రులవుతారని భావించే సంస్కృతి మనది.అందుకే ఎంతధనవంతులైనా పండితుల్ని గౌరవించేవారు. అందుకే రచయితలకి అంతటి  ఉన్నత స్థానం ఆరాధనదక్కింది.

 రచనలు చదువుతున్నప్పుడు   రైటర్ పట్ల మనకొక ఇమేజ్ కలుగుతుంది. ఆరాధన కలుగుతుంది.  అలా తెలుగులో మీకనిపించిన అత్యుత్తమ రచన కానీ,  అత్యున్నత రైటర్ కానీ వున్నారా?

* నాకదేమిటో, నేనుచిన్నతనంనుండీ వ్యక్తులని ఆరాధించేదాన్నికాదు. రచనని బట్టే రచయిత. అన్నీచదివేదాన్ని. ఏ అక్షరమూపోనిచ్చేదాన్నికాదు. రంగనాయకమ్మగారి -కృష్ణవేణి, సులోచనారాణిగారి సెక్రెటరీ…అన్నీఆవయసులోఅభిమానించి ఆరాధించిన రచనలే.

 

 ఊహా కల్పిత రచనలమీద కొంత విమర్శ వుంది. స్త్రీ రచనలు  స్వప్న జగత్తున తేలుతుంటాయని. లేదా స్త్రీ పక్షపాతులై వుంటారని!.. ఈ వాదాన్ని మరి మీ రెంతవరకు సమర్ధిస్తారు?

*   ఏదిరాసినా కొంత అవగాహనతో రాస్తే కనీసం చదువరులకి ఆనందాన్నికలిగిస్తుంది. పురుషులంతా గొప్పరచనలు చేసేయలేదు. అంతులేని సమస్యలవలయంలో స్త్రీవున్నప్పుడు   తనగురించి తానుచెప్పుకోక పోతే ఇంకెవరికి స్త్రీ బాధలు అక్కరకొస్తాయి. అయితే కొందరు రచయిత్రులు అసలు సమస్యకానిదాన్ని-  సమస్యగా చూపిస్తూ… ‘మేముకూడాస్త్రీవాదులమే’అని చాటిచెప్పుకోవడానికి కొన్నిఅనారోగ్యకరమైన రచనలు చేస్తున్నారు. వాటికంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరంలేదు.  స్త్రీ స్వాతంత్రమంటే లైంగికస్వేచ్చేనా? ( రచయిత్రి ప్రశ్నలో ఆవేదన తొంగిచూసింది.)

 

 స్వాతంత్రమంటే లైంగికస్వేచ్చేనా? సూటి అయిన ప్రశ్న! ..నేటి సమాజం లొ మనం చూస్తున్న ‘ లివిన్ రిలేషన్ షిప్’  బాంధవ్యాల పై  మీ అభిప్రాయం?   

* ఎందుకో  స్త్రీ ఈ బంధం లో మరికాస్త కష్టాలనే కొనితెచ్చుకుంటుందని నా ఉద్దేశ్యం. సమాజపు కట్టుబాట్లకే వెరవని  మగాడు.. భర్తగా తన ధర్మాన్ని విస్మరించిన మగాడు.. సహాజీవనంలో స్త్రీని గౌరవించి ప్రేమించగలడా? ఏ సీసాలో పోసినా  అదే సారాయి అయినట్లు, మగవాడి ఆలోచనా విధానం మారుతుందా అనేది పెద్ద సంశయంతో కూడిన ప్రశ్నే!  ఏ బంధం నిలవాలన్నాఅంతర్లీనంగా ప్రేమ, భాద్యత, గుర్తింపు వుండాలి. తిరిగి స్త్రీ చిక్కుల్లో పడి మళ్ళీకష్టాలే కొనితెచ్చుకుంటుందని నా భావన.

ఈ ఇతివృత్తాన్ని ఆధారం గా చేసుకుని కథలేమైనా రాసారా?

* నిజం చెప్పాలంటే – నే రాసిన కథల్లో నా రెండవ కధ  –  ‘దూరపుకొండలు’ ఇలాంటి సబ్జెక్టే .  అప్పటికినాకింకాపెళ్లికాలేదు .   సహజీవనంగురించితెలియదు.  కానీ రాసేసాను. ఆంధ్రప్రభవీక్లీలోవచ్చింది. బాపూగారుబొమ్మవేసారు. మా బావగారు –  ‘నీకిప్పుడే ఇంతింత ఆలోచనలోస్తున్నాయా,’ –  అనిబుర్రమీద ఒకటి కొట్టి, వందరూపాయిలిచ్చారు.

మీరు బహుమతి పొందిన కథలు చాలా రాసినట్టు గుర్తు నాకు! 

* అవునండి. చాలానేరాశాను. తాన కదలపోటీలో బహుమతిపొందిన కధ – ఆ ఒక్కరోజు. బహుమతిపొందిన సీతమ్మతల్లి ,ఛీ మనిషీ….ఇలా చాలానే రాశాను.

ఇన్ని బహుమతి కథలెలా రాయగలిగారు?

* ఎక్కువగా నాకధలు జీవితాల నుండి తీసుకున్నవే. వేదనలేకుండా నాకు రచనలుచేయడంరాదు. బహుశా అదే కారణమై వుండొచ్చు, నా కథలకి అంత ఆదరణ, గుర్తింపు కలగడానికి.

ముఖ్యంగా మరో ప్రశ్న శారద గారు! అప్పట్లో  మీ కథలు ఎంత తరచుగా గా పబ్లిష్ అయ్యేవో అంత త్వరగానూ పాఠకుల మనసుల్లో తిష్ట వేసుకునుండిపోయేవి. ఆ తర్వాత కాలంలో  క్రమక్రమం గా మీరు  కనిపించడం మానేసారు.  దూరం జరిగింది. కాదు, పెరిగింది.  ఈ గాప్ కి కారణం? రాజకీయాలా? లేక మీ వ్యక్తిగతమా?

*( రెండు క్షణాల మౌనం తర్వాత )      – బయట రాజకీయాలని చాలావరకు బాధపడుతూనే ఎదు ర్కొ న్నాను.  వ్యక్తిగతమైన సమస్యలకి …క్రుంగిపోయాను. ఇది వాస్తవం.

…ఈ దూరం ఎం తైనా బాధకరం. కదూ? 

* …  చాలానలిగిపోయాను దమయంతీ! ఇంకా చెప్పాలీ అంటె నన్ను నేను మరచిపోయాను.

 ఇంత కాల వ్యవధి జరిగినా,   మీ రచనల్లో – అదే గ్రిప్ మెయింటైన్ చేయడం ఎంతైనా విశేషం. అందుకు మీరు చేస్తున్న  ప్రత్యేకమైన కృషి ఏమైనా వుందా? 

* కృషిఏమీలేదు, దేవుడు నా కలానికిచ్చిన శక్తీ అంతే. నేను ఏనాడూ రఫ్ రాసి  ఎరుగను, రాయాల్సిందంతా ఒక్కసారే అనుకుని రాసేస్తాను. లేకపోతే నాకసలు టైం అనేదే వుండదు.

*  మీ రచనలు ఏవైనా సినిమా తెరకెక్కాయా?

* ఎక్కేయి .నాపేరుతోకాదు.వాళ్ళతోపోరాడే శతి నాకులేక వదిలేశాను. ‘ మనసునమనసై’ అనే నాకధ తెలుగులోనూ, హిందీ లోనూ హిట్టయిఆడుతుంటే చూస్తూఊరుకున్నాను. అలాగే ఎంతోమంది రెమ్యూనరేషన్స్ ఎగ్గొట్టేరు.  వ్యాపారాల్లో కొచ్చేసరికి ఇదిమామూలే.

? – ‘వాళ్ళతోపోరాడే శక్తీ నాకులేక వదిలేశాను ..’ –  ఇలాటి పరిస్థితి ఎదురైనప్పుడు, ఎదుర్కోలేని అసహాయతలో   అనిపిస్తుంది కదండీ? కలం బలం కన్నా, అహం బలం బలమైనదనీ, గుండె బలం కన్నా ‘గూండా బలం’  గెలుస్తుందని.. ఎంత ఆవేదన కదూ?   ఇతరులకెవరికీ అర్ధం కాని ఈ బాధ కేవలం రైటర్స్ కి మాత్రమే అనుభవైద్యకం. ఎలా తట్టుకుని నిలబడగలిగారు?

* ఒక్కపోరాటంకాదు. అడుగడుగునా ఎన్నోసమస్యలు ఎదుర్కొన్నాను . అటు వుద్యోగం, ఇటు ఇల్లు.  రచనారంగంలోసమస్యలు.  అప్పటికీఇప్పటికీ ఎన్నో…దైవమే తోడయి నన్నుముందుకు నడిపించింది.

ఒకసారి ఒకసినిమాకి మాటలు రాసేను. దర్శకుడు తనపేరు వేసేసున్నాడు. పోరాడేను. గెలిచే సమయానికి మాలాయర్ అటు జంప్. చాలారోజులు నిర్ఘాంతపోయి వుండిపోయాను.  ఎంతోకాలం ఇది నారచనల మీద ప్రభావంచూపింది. అందుకే తర్వాతఎన్నిసార్లుమోసపోయినా…మౌనంపాటించాను. రచయితని మోసం చేయడం తేలిక. డిస్కషన్స్ అంటూ రైంటర్ని పిలిపిస్తారు. కధవింటారు. మళ్ళీపిలుస్తాం అంటారు. ఇక అంతే. అలా నా కధ వాళ్ళచేతిలోకి వెళ్ళిపోయింది. చేసేదేమీలేదు.  కొన్నికోట్లుపెట్టి సినిమా తీస్తారు. కానీ సినిమాకి మూలమైన కథా రచయితని మాత్రం మోసం చేస్తారు. ( ఎంతో బాధ ధ్వనించింది ఆ మాటల్లో.)

  కొత్తగా పెయింటింగ్స్ కూడా చేస్తున్నారు.  :-)  నిజంగా అభినందించదగిన కళ. ఎలా అలవడింది?

* అవునుచిన్ననాటి నుండీ నాకు పెయింటింగ్ అంటేచాలాఇష్టం. నన్ను నేను రవీంద్రనాథ్ ఠాగూర్  ,అడవి బాపిరాజుగారి తో పోల్చుకుని మానాన్న గారికిచెప్పేదాన్ని.కానీనేర్చుకునేఅవకాశంరాలేదు.ఇప్పుడు ఫేస్బుక్ లో ఆ సరదా తీర్చుకుంటున్నాను.అందరూ అక్కా అని పిలుస్తుంటే సంతోషంగావుంది.

ఈ ఫేస్ బుక్ మీకు పునర్జన్మ వంటిదంటూ ప్రశంసించారు?    

* అవునండి. నిజంగానే.

. మీ రచనల్ని ఇంకా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నాలేమైనా చేస్తున్నారా?

* త్వరలో కథల సంపుటి వెయ్యాలనుకుంటూన్నాను.  కౌముది వెబ్ మాగజైన్లో నిదురించేతోటలోకి అనే సీరియల్ రాస్తున్నాను.

అనుభవజ్ఞురాలైన రచయిత్రి గా  చెప్పండి. కథ  అంటే ఎలా వుండాలి? ఎలా వుంటే పాఠకులని ఆకట్టుకుంటుంది? ఔత్స్చాహిక రచయితలకి   మీ సూచనలు సలహాలేవైనా  ఇవ్వగలరా?

* నేను ఇతరులకి చెప్పగలిగినదాన్నోఅవునోకాదో కానీ ఒక్కటిమాత్రం నాపరంగాచెప్పగలను.  శైలి అంటే చదివింపచేయగల శక్తి.  భావానికి తగుమాత్రం భాష ,చిన్నకొసమెరుపు. –  పాత సబ్జెక్ట్అయినా ఒక ఇనోవేటివ్ ఆలోచనా విధానం వుంటే చివరి వరకూ చదివేయొచ్చు.కధకి వ్యాసానికి తేడాతేలియాలి – ముందు.

 సమాజం పట్ల రైటర్ కి బాధ్యత వుంటుందా? వుంటే, ఎలాటి జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తారు.

*  వుండాలి. బాధ్యత వుండాలి. కొన్నిరచనలు సరదాగా రాసినా, మధ్యమధ్యలో రచయిత తొంగిచూస్తూనేఉంటాడు.

sarada painting

మీ పరిశీలనలో మీరు చదువుతున్న మనుషుల మనస్తత్వాలలో కానీండి..జీవన విధానంలో కానీండి…ఆ కాలానికీ ఈ కాలానికీ తేడా  వుందనుకుంటున్నారా?

* వుంది. ఇప్పుడు అప్పుడు కూడా సమస్యలు వున్నా ఆలోచించేవిధానంలో  చాలామార్పువచ్చింది,పెద్దల అనవసర పెత్తనాలుఇప్పుడులేవు జీవనవిధానాలు చాలా ఇంప్రూవ్ అయ్యేయి.

స్త్రీలు శాంతి గా బ్రతుకుతున్నారంటారా?

* అని చెప్పను. అన్నివైపులా, మరింత బయటకి రావడమంటే మరింత  యుద్ధానికి తలపడటమే. ఒకటి గుర్తు పెట్టుకోవాలి. – పోటీయుగం ఇది.

 అవును శారద గారు. స్త్రీలు శాంతి పొందడం కోసం యుధ్ధన్ని చేయాల్సొస్తున్న మాట వాస్తవం. ఆ మాటకొస్తే యుగాల తరబడి నించి  కదూ?

* నిజమేనండి. అందరకీ హాయిగా కడుపులో చల్లకదలకుండా సుఖంగా బ్రతకాలనేవుంటుంది. కానీ,  కొందరికి బ్రతుకంతాపోరాటమే.. పురుషులుస్వార్ధంతో , స్త్రీలు అజ్ఞానంతో స్త్రీ జాతికి అన్యాయం చేస్తూనే వున్నారు. యుద్ధభూమిలో నిలబడి యుద్ధంచేస్తున్నవారి  పరిస్థితి – అంతఃపురంలోకూర్చుని వినోదించే వారికి అర్ధంకాదు.

 

సమస్యల్లో వున్న  స్త్రీని చూసి సాటి ఆడవాళు చులకన చేస్తారు. ఇలా గేలి చేసే  వారిలో పురుషుల కన్నా,  స్త్రీల  శాతమే ఎక్కువేమో కదూ?

* అవును. ఇప్పటకీ ఎప్పటకీ నన్నుతొలిచేసే ప్రశ్న ఒక్కటే. పవిత్రత గురించి ఉపన్యాసాలిచ్చే వారందరూ  స్త్రీని ఇన్నివిధాల అణచివేతకు గురిచేశారెందుకు? ఈ సమాజం లో స్త్రీ ఎక్కడో,  ఏదో ఒక విధంగా స్త్రీమోసపోతూనే వస్తోంది. గాయపడుతూనే వుంది. కన్నీరుపెడుతూనేవుంది.  ఒకచట్రంలో భద్రతగాకూర్చున్నస్త్రీలకి ఇవి అర్ధంకావు.

 

రచయిత్రి గా –   అమితమైన మానసిక  సంఘర్షణకు గురి అయిన  సందర్భం ఏమైనా వుందా? 

* నేను చాలాచిన్నతనంనుండీ ఎదోఒకటిరాస్తూనే వుండేదాన్ని. అప్పటకీఇప్పటకీ ఈమామూలు దైనందిక జీవితచట్రంలో ఇమిడి మనలోని సున్నితత్వాన్ని అలౌకిక భావనా సౌందర్యాన్ని పోగొట్టుకుని బ్రతకాల్సిరావడాన్ని జీర్ణించుకోలేకపోతుంటాను. ఈవిషయంలో నేను  చాలాపరితాపానికి గురయ్యానుకూడా!

 

పాఠకుని కి రైటర్ కి మధ్య గల దూరం పెరిగిందని ఒక అంచనా.  మీరేమనుకుంటున్నారు?

*దూరం అని కాదుగానీ, తెలుగు చదివేవారు తగ్గిపోతున్నారు. పిల్లలు వాళ్ళ పోటీ చదువులలో కాలాన్నంతా చదువుకోడానికే  వెచ్చిస్తున్నారు. ఇక టీవీ  సీరియల్స్ ఉండనేవున్నాయి.  సాహిత్యం పై ఆసక్తి వున్నవారు మాత్రమే పుస్తక సాహిత్యాన్ని చదువుతున్నారు.

  భవిష్యత్తులో  ఇక తెలుగు రచనలుండవన్న వారి జోస్యం పట్ల మీ అభిప్రాయం ?     

* ఉండకపోవడం జరగదుకానీ, ప్రభుత్వం కొంతచొరవ తీసుకుని మన సాహిత్యాన్ని రక్షించాల్సిన అవసరమైతే వుందని నమ్ముతాను.

 

టీవీ  మీడియా ప్రభావం పఠనాసక్తి మీద నీలి మబ్బు పరుచుకుందనే అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా?  

* అవును.హాయిగా ఏమాత్రం శ్రమలేకుండా నోరావలించి చూడొచ్చు.  కధ వున్నాలేకపోయినా తలపట్టేసినా పడీపడీచూస్తునారు, ఊళ్లలో అయితే మరీ!.. పరగడుపునే  టీవీలు మోగిపోతుంటాయి.

 

మరో చిన్న ప్రశ్న. తెలుగు రైటర్స్ మధ్య ఐక్యత వుందనుకుంటున్నారా?

* లేదు ,వుండదు.  ఎవరూ పక్కవారి ప్రతిభ ఒప్పుకోలేరు. దానికి చాలా విశాలహృదయం వుండాలి.

అలసిపోయిన వేళ..విశ్రాంతి అవసరం కదూ? రిటైర్మెంట్ తర్వాత కాలాన్ని ఎలా గడపాలనుకుంటున్నారు? 

* మాఅబ్బాయికిచెప్పాను – మొన్నటిసారి అమెరికావెళ్ళినప్పుడు!  ‘నేను మీకు అమ్మనే. ఒక కూతురిగా, భార్యగా,  తల్లిగా నా పాత్రలకి  నేను ఎక్కువగానే న్యాయంచేశాను.  ఇక ఇప్పుడు నేనునేనుగా బ్రతకాలనుకుంటున్నాను. నామీద ఎలాంటి ఆంక్షలున్నా నేనురానని చెప్పాను.  నవ్వి,  ‘ సరే అమ్మ ‘ అన్నాడు. నన్నెంతో ప్రేమగా చూసుకుంటాడు.   ఎదుటి వారి  వ్యక్తిత్వాన్ని  గౌరవించి నప్పుడే వ్యక్తుల మధ్య  ఆప్యాయతానుబంధాలు పెరుగుతాయి.

జీవితం అంటే?..

*జీవితం గురించి చెప్ప్పుకోవడానికి ఏమీలేదు. ఇది ఒకబిందువు నుండి మరోబిందువుకి నడిచేఒకచిన్నప్రయాణం. కొందరికి కాలం సాఫీగాజరిగితే,  మరికొందరికి అన్నీ ఒడిదుడుకులే. అన్నీ సుడిగుండాలే. ఎవరైనా చేరేది ఒక్కచోటికే. ‘బ్రతికినన్నాళ్ళూ మనంన్యాయంగానే బ్రతికాం’ అన్నదొకటే గొప్పతృప్తినిస్తుంది మనిషికి. అంతే.  అనుకున్నవి ఏమీజరగ లేదు. జరిగేవి ఆపలేను. కాలాన్ని అనుసరించి సాగుతున్నఒక బాటసారిని నేను. నాదురదృష్టంకొద్దీ నామంచితనమే నాకు అనేక చిక్కులుతెచ్చిపెట్టింది. మనుషుల్ని మనుషులనుకుని నమ్ముతాను. నేను ఆదరించి సహాయపడినవారే నాకు ఎక్కువ హాని చేసారు. ఇదిజీవితం.  అంతే అనుకుంటాను.

చివరిగా ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? – సందేశం గా?   

* ‘హాయిగా బ్రతకండి.  పక్కవారిని బ్రతకనివ్వండి.’ –  ఇదే నేను చెప్పదలచుకున్నది దమయంతి!

ఇవీ – మన్నెం శారద గారి మదిలోని మాటలు. మనసు దాచుకోకుండా చెప్పిన సంగతులన్నీ సారంగ పాఠకులతో పంచుకోవాలనే నా  తహ తహ ఇలా నెరవేరింది.

ధన్యవాదాలు శారద గారు!

* మీకూ నా ధన్యవాదాలండి. ఈ అవకాశాన్ని కలగచేసిన  సారంగ పత్రికకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను.

( పాఠకాభిమానులు శారద గారిని సెల్ ద్వారా కానీ, ఫేస్ బుక్ ద్వారా కానీ కలిసి మీ అభిప్రాయాలను తెలియచేయవచ్చు)

సెల్ :  96189 51250

https://www.facebook.com/profile.php?id=100009804672869

 

***

sarada painting 2

 

రచయిత్రి గురించి :

అసలు పేరు :  పుట్టింటి పేరు మన్నెం. ( పెళ్ళికి ముందునుండే రాస్తున్నాను కాబట్టి, ఇంటిపేరు మార్చలేదు.)

జన్మ స్థలం :   కాకినాడ.

విద్యాభ్యాసం :  engineering graduation.  మానాన్నగారి ఉద్యోగరీత్యా అనేక ఊళ్లలో  చదువుసాగింది.

ఉద్యోగం : రహదారులు  భవనాల శాఖలో ఇంజనీరుగా పనిచేసి స్వచ్చందంగా రిటైర్మెంటు తీసుకున్నాను.

హాబీలు : నాట్యం,చిత్రకళ, రచనావ్యాసంగం – నాకు ఇష్టమయిన హాబీలు. ఇంటీరియర్ డెకొరేషన్ కూడా!

రచయిత్రి గా మీ వయసు :  35 సంవత్సరాలు.  అయితే మధ్యమధ్యలో చాలా బ్రేక్స్ వున్నాయి.

మీరు చదివిన నవలలు :  రంగాయకమ్మగారిబలిపీఠం, రావిశాస్త్రిగారిరచనలు, కొడవటిగంటివారికధలు, శరత్సాహిత్యం, పతంజలిగారి రచనలు..అన్నీఇష్టమే.  మంచి భావుకత వున్న కవిత్వాన్ని కూడా బాగాఇష్టపడి చదువుతాను.

ఆంగ్ల నవలలు? : ఇంగ్లీష్ సాహిత్యాన్ని కొద్దిగాచదివినా, అందులో అంత పెద్ద పట్టులేదు.ఇష్తమైన సినిమా : కన్యాశుల్కం, విజయావారి అన్నిసినిమాలూఇష్టమే. తమిళం.మళయాళసినిమాలుకూడాచూస్తాను. చెమ్మీన్ నవలచాలాసార్లు చదివాను. సినిమా చాలాసార్లుచూశాను.

పబ్లిష్ అయిన  రచనలు : నానవలలు అన్నీమహాలక్ష్మిపబ్లికేషన్స్, కొన్నిఎమెస్కోవారు, మరికొన్నినవభారత్ వారుప్రచురిచారు .

మీకు నచ్చిన మీ రచనలు :  వానకారుకోయిల నవల, ట్వింకిల్   ట్వింకిల్ లిటిల్ స్టార్,  సిస్టర్ సిస్టర్ – నవలలు నాకుబాగానచ్చిన రచనలు.

మొదటినవల : గౌతమి. మొదటిబహుమతి ఆంద్రజ్యోతి డైలీ పేపర్ లో. రెండవ నవల చంద్రోదయం. రెండవబహుమతి  ఆంద్రజ్యోతివీక్లీలో  1984 లో  కధలుచాలావున్నాయి. – ఉరిశిక్ష వుండాలని నేను రాసిన –  ‘ఆగండి ఆలోచించండి’ అన్నకదకి ఆంద్రభూమి వీక్లీ వారు ‘ బెస్ట్ స్టోరీ ఆఫ్ ద  ఇయర్ ‘ గా ప్రకటించి గౌరవించారు.  నానవలలన్నీ కన్నడంలోకి   అనువదింపబడ్డాయి.

మరపురాని సంఘటన : అనంతనాగ్ నారచనలుచదివి అభిమానంతో నన్ను చూడడానికి వచ్చారు.

ఇష్టమైన టూరింగ్ స్పాట్ : సహజసిద్ధమైన అడవులునాకు ఇష్టం. రైల్లో అరకుప్రయాణం  మరచిపోలేనిది

కథల సంఖ్య :  కధలు చిన్నవి, పెద్దవి అన్నీకలిపి 1000 దాకా రాశాను. నవలలు –  43

అవార్డులు : నాపదమూడు కధలు మంజులానాయుడు గారు సీరియల్ గా తీశారు. నేనేమాటలురాశాను. అందుకుగాను  ఉత్తమ రచయిత్రి అవార్డ్ ను రాష్ట్ర ప్రభుత్వంనుండి అందుకున్నాను. రెండు నందిఅవార్డులు,  పొట్టిశ్రీరాములు యూనివర్సిటీనుండి  – ఉత్తమరచయిత్రిగా శ్రీ సి.నారాయణరెడ్డి గారిచేతులమీదుగా అందుకున్నాను.

నేనుకధమాటలురాసిన టివి సీరియల్ ప్రేమిస్తే పెళ్లవుతుందా  కి ఆ ఏడు11 నంది అవార్డులువచ్చాయి.

– ‘ఒకే బహుమతి ’ పోటీ   ప్రకటించారు ఆంద్రజ్యోతివీక్లీవారు.  ‘అది నాకే వచ్చింది – ‘పిలుపునీకోసమే ‘అన్న నారచనకి!

కలిసిన రైటర్స్ : సభలకివెళ్ళేఅలవాటుతక్కువ. వాసిరెడ్డిసీతాదేవిగారు ఎక్కువగా పిలిచేవారు.వారిదగ్గరే ఇతర రచయితలని చూశాను. ఒక నవల వారికి అంకితమిచ్చినప్పుడు శ్రీదాశరధిరంగాచార్యగారు నవలగురించిప్రసంగించారు.

ప్రత్యేక కళ : పెయింటింగ్స్. అంతాస్వయంకృషే . జే.పి సింఘాల్ బొమ్మలకి ఏక లవ్య  శిష్యు రాలీని నేను.

ఖాళీ సమయాలలో : ఖాళీఅంటూవుండదు. గార్డెనింగ్ అంటే చాలాఇష్టం. ఎర్ర మంజిలి కాలనీలో  మా ఇంటి  తోట చూసిజనం ఆగిపోయేవారు.

ఆశయం: నవ్వుతూనవ్విస్తూ నిగర్వంగా జీవించడమే నా ఆశ, ఆశయం.

***

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. G.S.Lakshmi says:

    రచయిత్రి మన్నెం శారదగారి తేట మనసును ఆవిష్కరించిన ఇంటర్వ్యూ బాగుంది. ఇప్పటి పాఠకులు, రచయితలు తెలుసుకోవలసిన విషయాలు చాలా తెలిసాయి. చక్కటి విషయాలు ప్రస్తావించిన దమయంతికి, ఏమాత్రం భేషజంలేకుండా మనమసు విప్పిన మన్నెం శారదగారికి అభినందనలు..

  2. BHUVANACHANDRA says:

    శారద గారూ , మీ మనసుని అతి సున్నితం గా చాలా సంస్కారవంతంగా అద్భుతంగా మీ మాటలతో ఆవిష్కరించారు..దమయంతి గారి ప్రశ్నలు ,మీ జవాబులూ మీ జీవితాన్ని కళ్ళకు కట్టించాయి . మీ ఇద్దరికీ శుభాకాంక్షలతో , నమస్సులతో ,,,
    భువనచంద్ర

    • ఆర్.దమయంతి. says:

      భువన చంద్ర గారు! – ఇంటర్వ్యూ నచ్చినం దుకు చాలా సంతోషం గా వుంది. రచయిత్రి వెలిబుచ్చిన అభిప్రాయాల పై మీ కితాబు నాకెంతో ఆనందాన్ని కలి గించింది.
      శుభాభివందనాలతో..

  3. ధన్య వాదాలు రాజు గారూ

  4. Usha Rani .N says:

    శారదక్క అంతరంగాన్నిచక్కగా ఆవిష్క రించారు దమయంతి గారు . ప్రశ్నలు సున్నితంగా అడుగుతూ చక్కని సమాధానాలు రాబట్టారు . శారద గారి మనసు ఎంత సున్నితమనస్కులో తెలిసింది . వారు మరిన్ని మంచి రచనలు చెయ్యాలని మా కోరిక..

  5. Mythili Abbaraju says:

    శారద గారు ఇంజనీర్ అనే తెలీదు నాకు- వారి కాలం లో అది అరుదైన చదువూ ఉద్యోగమూనూ…చాలా సంతోషం. వారు మంచి చిత్రకారిణి అని ఈ మధ్యనే ఫేస్ బుక్ లో తెలియటం. కాని వారి రచన లు నాకు చాలా పరిచితం. ‘ ఆ నాటి చెలిమి ఒక కల ‘ అనే కథ చాలా ఇష్టం నాకు. నాయిక పేరు ప్రజ్ఞ అయితే ‘ ఆజ్ఞ ‘ అని చెప్పుకుని నాయకుడిని బెదరగొడుతుంది. సమగ్రమైన మీ పరిచయానికి ధన్యవాదాలు దమయంతి గారూ.

  6. చందు తులసి says:

    సీనియర్ రచయిత్రి….శారద గారి గురించి చాలా సంగతులు తెలిసాయి. దమయంతి గారూ….
    మీ ఇంటర్వ్యూ చేసిన విధానం బావుంది. శారద గారి కథల మీద మీకు మంచి అవగాహన వున్న సంగతి తెలుస్తూనే వుంది…..

    ఇలాంటి సీనియర్ రచయితల సలహాలూ, సూచనలు కొత్తతరానికి ఉపయోగకరం..
    శారద గారికీ, దమయంతి గారికీ…ఇద్దరికీ అభినందనలు

  7. Jayashree Naidu says:

    సున్నితమైన శైలి తో సాగే శారద గారి కథలంటే మొదటి నుంచీ ఒక ప్రత్యేకమైన స్థానమే. పత్రికలు రాజ్యమేలిన రోజులవీ. ఇప్పటికైనా వెబ్ జైన్స్ లో మీరు కొనసాగుతున్నందుకు, ఫేస్ బుక్ లో కనిపించినందుకు చాల సంతోషం శారద గారు. నమ్మి మోసపోతున్నా మానవత్వం మీద నమ్మకం నిలుపుకోక తప్పదన్న మీ స్వభావం వ్యక్తి గా మిమ్మల్ని నిలబెడుతుంది. మరిన్ని రచనల కోసం ఎదురు చూస్తుంటాం.

  8. attada appalnaidu says:

    శారద గారి తో ఇంటర్ వ్యూ చాలా బాగుంది. సీనియర్ రచయిత ఆమె .నేను తొలినాళ్ళలో చదివే వాళ్ళలో శారద గారొకరు.అప్పటికి నేను పాఠకున్నే …నాకు ఇష్టమయిన రచయిత. వారి హృదయం ఆవిష్కరించారు ఇంటర్ వ్యూలో …అభినందనలు..

  9. Venkat Suresh says:

    చాలా చక్కగా సాగిందండి ఇంటర్వ్యూ. ఒక్కటీ అనవసరమైన ప్రశ్నలా అనిపించలేదు.

  10. Anappindi Surya Lakshmi Kameswara Rao says:

    చక్కటి ఇంటర్వ్యూ..మరిన్ని రచనలు చిత్రలేఖనాలకోసం ఎదురు చూస్తూ..

మీ మాటలు

*