క్విడ్ ప్రో కో.. యేలుకో!

 

 

 -బమ్మిడి జగదీశ్వరరావు

~

ప్రియమైన అల్లుడు గారికి!

యెంత రాజ్యసభ సీటు రాకపోతే మాత్రం.. ‘బాగున్నారా?’, అని అన్నా తప్పేనా? ‘యింకెక్కడ బాగుంటాను?’ అని ఫోను కట్ చేసారు! మా అమ్మాయిని అడిగితే ‘ఫోను కట్ అవడం కాదు, నా తల కట్టయినట్టు వుంద’ని మీరు అన్నారట! మీ బాధను నాబాధ చేసుకోగలను! మీ ఆవేశం, ఆందోళన అర్థం చేసుకోగలను! కాని మీరు అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్ని వున్నాయి! యిప్పుడు కాకపోయినా తరువాతయినా నిదానంగా చదువుతారని అవగాహన చేసుకుంటారని ఆశతో యీ వుత్తరాన్ని మెయిల్ చేస్తున్నాను!

రాజ్యసభ అంటే పెద్దల సభ అని మీరూ నేనూ చదువుకున్నాం. మనం చదువుకున్నట్టు యేదీ వుండదు. యెంపిక కూడా వుండదు. సంఘ సేవకులు, కళాకారులు, క్రీడాకారులు, లబ్దప్రతిష్టులైన వివిధ రంగాలకు చెందిన వాళ్ళ ప్రాతినిద్యాన్ని కోరి- యెన్నికలలో నిలబడకుండా పోటీలేకుండా గౌరవించి వారి భాగస్వామ్యం కోరి- వారి మేథని, తెలివితేటల్ని, నైపుణ్యాన్ని వుపయోగించగోరి అంటే అవసరమైన సలహాలూ సూచనలూ కోరి- బలపరిచేది నియమించేది గనుక అది పెద్దల సభ అయ్యింది! ఇదంతా రాజ్యాంగం! రాజ్యాంగము కన్నా రాజ్యము గొప్పది! రాజు గొప్పవాడు!

‘వడ్డించేవాడు మనవాడైతే కడబంతిలో కూర్చుంటే యేమి?’ అని సామెత.. అంచేత ‘రాజు’ అంటే ‘మంత్రి’ మనవాడు అయ్యుండాల.. రాజ్యం మనదయ్యుండాల.. అప్పుడు మనం పాడిందే పాట.. అంటే మనమే గాయకులం! మనం ఆడిందే ఆట.. అంటే మనమే క్రీడాకారులం! మనం వాయించిందే సంగీతం.. అంటే మనమే సంగీతకారులం! మనం రాసిందే రచన.. అంటే మనమే రచయితలం! మనం నటించేందే నటన.. అంటే మనమే కళాకారులం! మనం చేసిందే సేవ.. అంటే సంఘ సేవకులం! మనకున్న పెట్టుబడి పేరే ప్రతిష్ట.. అంటే లబ్దప్రతిష్టులం! యెప్పుడూ? పైవాడు మనవాడు అయినప్పుడు! అప్పుడు! అప్పుడు మనమే తోపులం! మనమే పుడింగిలం! మనమే లార్డ్ కర్జిన్లం! రాజ్యసభ అభ్యర్దులం! పెద్దలం! పెద్దల సభకు పొద్దులం! యెప్పుడూ? వాడు.. ఆపైవాడు కాదు, ఈ పైవాడు అనుకున్నప్పుడు! అప్పుడు!

అప్పుడు మనం గెలవక్కర్లేదు! గెలిస్తేనే అర్హత అనే రూలేం లేదు! ప్రజాభీష్టంతో సంబంధమూ లేదు! ప్రజలు నువ్వు వొద్దు అని వోడించినా.. నువ్వు వోడినా.. గెలిచినట్టే! డిపాజిట్లు కోల్పోయినా.. గెలిచినట్టే! ప్రజాభీష్టం లేకపోయినా.. వున్నట్టే! గెలిచి యెవడైనా వెళ్తాడు! ఓడి వెళ్ళడం.. అంత మామూలు విషయం కాదు! ప్రజలు కాదన్నాసరే ప్రజా ప్రతినిధిని చేసి అందనాలు యెక్కించడం యిందులో గొప్ప విషయం! అందుకే రాజ్యసభకి వెళ్ళడం అంత గౌరవం! అంత పోటీ! అంత విలువ! అంత అవకాశం! అందరికీ అంత ఆశ! అందరికీ అంత మోజు!

ఎమ్మెల్యే ఎంపీ సీట్లకన్నా రాజ్యసభ సీట్లకు డిమాండ్ యెక్కువ! మామూలుగా అంటే ‘మామూలు’గా.. ధర కూడా యెక్కువ! ఖర్చు తక్కువ! ఓడిపోతామన్న భయం తక్కువ! గెలుపుకు గ్యారంటీ! ఏకగ్రీవానికి వారంటీ!

మన రెండు తెలుగు రాష్ట్రాలే తీసుకో. ఆరుగురు యేకగ్రీవంగా యెన్నికయ్యారు. ఎమ్మెల్యే ఎంపీ సీట్లు ఎంసెట్ సీట్లు లాంటివి అయితే, రాజ్యసభ సీట్లు ఐఐటి ఎఐయంసి సీట్లు లాంటివి అన్నమాట! చాలా పోటీ వుంటుంది. రాకపోతే బాధే! ‘బ్యాడ్ లక్’ అని యిలా బాధపడితే యెలా చెప్పండి.. ‘నెక్స్ట్ టైం బెటర్ లక్’ అనుకోవాలి అల్లుడు గారూ..?!

ఇప్పుడు రాజ్యసభకు యెన్నికయిన ఆరుగురు కంటే నాకు యేమిటి తక్కువ అన్నారు. నిజమే! మీరు యెక్కువే! కాని మన యిద్దరు చంద్రులు వొకేలా ఆలోచిస్తున్నారు! ప్రతిపక్షాల్ని తమ పాలకపక్షంలో కలిపేసుకోవడంలో యిద్దరూ సిద్ధహస్తులే! వేరే పార్టీల నుండి వచ్చిన వారిని తక్కువ చేసి చూడడంలేదని చెప్పడానికి వొక సందేశం పంపడానికి అటు ఆంద్రాలో టీజీ వెంకటేష్ గారికి – యిటు తెలంగాణలో డి శ్రీనివాస్ గారికి రాజ్యసభ సీట్లు యిచ్చారు. సొంత పార్టీలో మీరు వుండొచ్చు. మీకివ్వొచ్చు. కాని అవతల పార్టీ నుండి వచ్చిన వాళ్లకి యివ్వడంలో ‘ఆపరేషన్ ఆకర్ష్’కు అత్యున్నత పురష్కారం యిచ్చినట్లు అవుతుంది! ఇదేమిటి.. అయినవాళ్ళకి ఆకుల్లో.. కాని వాళ్ళకు కంచాల్లోనా? అనో- యింట్లోవాళ్ళకి యీత చాప.. పై వాళ్ళకు పట్టెమంచం? అనో- అనుకోవచ్చు! కాని యిద్దరు చంద్రులకూ ముందు చూపు యెక్కువ! అవతలి పార్టీలో మిగిలిన వాళ్ళకి వెళ్ళ వలసిన సందేశం వెళ్ళిపోతుంది! పాత కండువా పడేసి కొత్త కండువా వేసుకుంటారు! వేసుకుంటూనే వుంటారు!

ఇదేమిటి అంటావా? ఇదే క్విడ్ ప్రో కో! నిన్ను గెలిపించిన ప్రజల్ని వారి అభిప్రాయాల్ని వెక్కిరించినట్టుగా అవతలకు నెట్టి, నువ్వు మా పార్టీలోకి వస్తే.. నీకు యివ్వాల్సింది యిస్తాం అన్నట్టే కదా? ‘నువ్వు వొస్తావు.. ప్రతిగా మేము యిస్తాము’.. యిది క్విడ్ ప్రో కో కాదా?

తెలంగాణ చంద్రుడు కేసీఆర్ కు కెప్టెన్ లక్ష్మీకాంతారావు మంచి స్నేహితుడు. స్నేహితుడయితే వాళ్ళింటికి నువ్వు వెళ్లి తిను. నీ యింటికి వాళ్ళనొచ్చి తినమను. మీరు మీరు యేదన్నా యిచ్చిపుచ్చుకోండి. కాని స్నేహం పంచాడు కాబట్టి రాజ్యసభ సీటు పంచుతాను అంటే అదెలా? అప్పుడది క్విడ్ ప్రో కో కాదా? క్విడ్ ప్రో కో కిందికి రాదా?

ఇక తెలుగు చంద్రుడు సుజనా చౌదరికి రాజ్యసభ సీటు మళ్ళీ యివ్వదలచుకున్నాడు. సుజనా చౌదరి విభజనకు వ్యతిరేకంగా పార్లమెంటులో పోరాడాడని అందుకే మళ్ళీ రాజ్యసభకు పంపుతున్నట్టు తెలుగు చంద్రుడు చెపుతున్నాడు. విభజనకు వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళను గౌరవించదలచుకుంటే వైయ్యెస్ జగన్ని కూడా గౌరవించాలి గదా? మరి గౌరవించగలడా..? పైగా విదేశీ బ్యాంకుల ఋణం యెగ్గొట్టినట్టు అనేక అవినీతి ఆరోపణలు యెదుర్కొంటున్న సుజనా చౌదరిని రాజ్యసభకు పంపుతూ వుల్టా ‘పదకుండు చార్జిషీట్లు పదమూడు కేసులూ వున్న ఏ-2 ముద్దాయిని రాజ్యసభకు యెలా పంపిస్తారు? ఏ-1 నిందితుడు సపోర్టు యెలా యిస్తాడు?’ అని చంద్ర బృందం అడుగుతూ వుంటే- యెల్లమ్మని యెంచక్కర్లేదు.. పోలమ్మని పొగడక్కర్లేదు అన్నట్టుగా వుంది.  అవినీతిపరులేనా అభ్యర్ధులు? మరెవరూ యిరు పార్టీలలో లేరా? అంటే అలా యివ్వడంలో క్విడ్ ప్రో కో లేదని చెప్పగలరా?

తెగమాట్లాడే తెలుగు వాడు.. ప్రధాని తరువాత రెండోస్థానంలో వున్నాడంటున్న వెంకయ్య నాయుడుకు కాకుండా మహారాష్ట్రకు చెందిన సురేష్ ప్రభుకు తెలుగుదేశం పార్టీ తరపున రాజ్యసభ సీటును వాళ్ళు కోరడంలో- వీళ్ళు యివ్వడంలో మతలబు యేమిటి? పోనీ మన నిర్మలా సీతారామన్ను కర్నాటక పంపడంలో మతలబు యేమిటి? తెలుగు తమ్ముళ్ళు కాదన్నారా? లేక రేపెప్పుడో కాదంటారనా? ‘మీకీ హోదా యిచ్చాం.. మాకు ప్రత్యేకహోదా యివ్వలేరా’ అని అంటారనా? సరే అందరికీ అర్థమయ్యే రాజకీయాలు మాట్లాడుకోవడంలో అర్థం లేదు!

సొంత రాష్ట్రం వాళ్ళే చెయ్యలేనిది.. వేరే రాష్ట్రం వాడయిన సురేష్ ప్రభు చేస్తాడనా? బీజేపీ యెందుకడిగింది? టీడీపీ యెందుకిచ్చింది? ఇది కూడా క్విడ్ ప్రో కో అంటే కాదనగలరా?

కేంద్రంతో అవసరాలు వున్నాయి! కేంద్రం అవసరం మనం తీరిస్తే మన అవసరం కేంద్రం తీరుస్తుంది! కేంద్రానికి మనం సహకరిస్తే కేంద్రం మన రాష్ట్రానికి సహకరిస్తుంది! కేంద్రంతో స్నేహంగా వుండి నిధులు తెచ్చుకోవాలి! రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకొని వారికి అవకాశం యివ్వాలి! వారికి వొక అవకాశం యివ్వడం అంటే మనం వారి నుండి వొక అవకాశం తీసుకోవడం! కేంద్రంలో అధికారంలో వున్న వాళ్ళకి మనం మన మద్దతు యిచ్చాం.. వారు అందుకు ప్రతిగా మనవాళ్ళకి కేంద్రంలో మంత్రి పదవులు యిచ్చారు! విశాఖపట్నంకు రైల్వే జోన్ యివ్వమని దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నాం.. యిప్పుడు ఆ రైల్వే శాఖా మంత్రిని రాజ్యసభకు మన ఏపీ నుండి పంపిస్తున్నాం.. కాబట్టి రేపు రైల్వే జోన్ ఆశించొచ్చు.. అడగొచ్చు.. సాధించుకోవచ్చు.. మనం రాజ్యసభ సీటిచ్చాం.. వాళ్ళు మనకి రైల్వే జోన్ యిచ్చారు.. యిస్తారు.. ఏం లేదు.. యిచ్చి పుచ్చుకుంటున్నాం.. ‘నీకిది.. నాకది!’

ఇది కూడా క్విడ్ ప్రో కో కాదా? ఆర్ధిక అవినీతి మాత్రమే అవినీతా? రాజకీయ పార్టీలు జట్టులు కట్టి వుమ్మడిగా ‘నీకిది.. నాకది’ అని అంటే అనుకుంటే ముందుకుపోతుంటే అధికారం పంచుకుంటే అది మాత్రం అవినీతి కాదా? దీన్ని ‘క్విడ్ ప్రో కో’గా చూడకూడదా? అలా చూస్తే తప్పా?

కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి రాజ్యాంగములో యేమి రాసుకున్నా.. మద్దతు వున్న రాష్ట్రాల వాళ్ళతోనే ఆ సంబంధాలు సజావుగా కొనసాగుతాయా? లేదంటే శాంతి భద్రతల బూచి చూపించి రాష్ట్రపతి పాలన విదిస్తారా? రాష్ట్ర అవసరాలకు సహకరించకుండా మొండి చెయ్యి చూపిస్తారా? మద్దతు యిచ్చినప్పుడే వున్నప్పుడే రాజ్యాంగము అమలవుతుందా? లేదంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలని అది నిర్వచించిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతారా? మరి ‘మద్దతు’ అంటే యేమిటి? ‘నాకు నా పాలనకి- నా అధికారానికి- నేను అధికారంలోకి రావడానికి- అధికారంలో వుండడానికి- నువ్వు సహకరించు.. నీకు నీ పాలనకి- నీ అధికారానికి- నువ్వు అధికారంలోకి రావడానికి- అధికారంలో వుండడానికి- నేను సహకరిస్తా..’ అనే కదా? నాకిస్తే – నీకిస్తా! మళ్ళీ అది అవ్వదా ‘నీకిది.. నాకది?’

ఏది క్విడ్ ప్రో కో కాదు? సమస్తమూ క్విడ్ ప్రో కో నే! సమస్త సంబంధాలు క్విడ్ ప్రో కో నే! రాజకీయ సంబంధాలే కాదు, అధికార సంబంధాలే కాదు, సమస్త మానవ సంబంధాలూ క్విడ్ ప్రో కో నే! కుటుంబంలోనే తీసుకో.. నువ్వు ప్రేమిస్తేనే ప్రేమిస్తారు! ద్వేషించినా ప్రేమిస్తారా? లేదే? నువ్వు నీ కష్టాన్ని యిచ్చావనుకో.. ప్రతిగా నీకు సుఖాన్ని యిస్తారు! నువ్వు వాళ్ళ కోరిక తీర్చావనుకో.. ప్రతిగా వాళ్ళు నీ కోరిక తీరుస్తారు! ఇచ్చిపుచ్చుకోవడం అన్నింటా వున్నదే! యివ్వకుండా పుచ్చుకోలేవ్!

సో.. ఆ ‘క్విడ్ ప్రో కో’లోకి రాకుండా ‘క్విడ్ ప్రో కో’లో లేకుండా రాజ్యమే నిలబడదు! రాజ్యసభ సీటు నిలబడుతుందా? ‘క్విడ్ ప్రో కో’ పాటించకుండా రాజ్యసభ సీటు ఆశించడం నేతి బీరలో నెయ్యిని ఆశించడం లాంటిది! ముందు ‘క్విడ్ ప్రో కో’ని గౌరవించు! ‘క్విడ్ ప్రో కో’ని ఆచరించు! ‘క్విడ్ ప్రో కో’ని అనుభవించు! ‘క్విడ్ ప్రో కో’ నిత్యము! ‘క్విడ్ ప్రో కో’ సత్యము! ‘క్విడ్ ప్రో కో’ శాశ్వతము!

అల్లుడూ.. ‘క్విడ్ ప్రో కో’ యే రూపంలో వున్నా అది అపురూపమైనది! అందులో నువ్వు భాగస్వామి కావలసియున్నది! అది మాత్రమే నీకు భవిష్యత్తులో రాజ్యసభ సీటుని తెచ్చును! యిచ్చును!

వొచ్చే పెద్దల సభ యెన్నికల్లో మీ కోరిక తప్పక నెరవేరుతుంది!

అభిమాన పూర్వక ఆశీస్సులతో..

మీ

మామ

మీ మాటలు

  1. Delhi Subrahmanyam says:

    మాయాబజార్ సినిమాలో ని “బలేమంచి భోజనం” లా ఇప్పటి రాజకీయ పరిస్థితిని వివరిస్తూ బలేమంచి వ్యంగ్య వ్యాసం రాసినందుకు బజరా గారికి అభినందనలు.

  2. THIRUPALU says:

    మానవ సంబందాలన్ని క్విడ్ ప్రో సంబందాలని ఓకే కొత్త నిర్వచనం ఇచ్చినందుకు ధన్య వాదాలు.

  3. Buchireddy gangula says:

    వాస్తవాలు — చక్కగా చెప్పారు సర్
    అంతా. రాజకీయం –వారసత్వ పాలన కోసం
    తెలుగు రాష్ట్రాల లో రాజుల పాలన ???
    డబ్బు –డబ్బు
    విరాళాలు పోగు చేసి యిస్తే–సో సో రచయిత ల జీవిత. చరిత్ర లు –కూడా ప్రచురిస్తారు
    క్విడ్ ప్రో —వ్యవస్థ తీరే అంత–సర్
    ===================================
    Buchi రెడ్డి. గంగుల

  4. BUCHI REDDY GANGULA says:

    జీవిత చరిత్ర లు –(ఆత్మ కథలు ) ప్రచురిస్తారు –సారంగ లో
    నిజాలు — అమెరికా అయినా అమలాపురం లో నయినా చేదు గా నే ఉంటాయి

    ========================================= కామెంట్ డిలీట్ చేసినా ???
    బుచ్చి రెడ్డి గంగుల

  5. kothapalli ravibabu says:

    వాస్తవాలను నగ్నంగా చాలా చక్కగా చెప్పారు.ఇదంతా తెలిసినా ఎవరూ ఏమి చేయలేకపోతున్నామని బాధ. ఇంకా ఇలానే రాస్తూ ఉండండి.

Leave a Reply to THIRUPALU Cancel reply

*