సంభవామి యుగే యుగే!

 

Krishna-Arjuna

-కృష్ణ జ్యోతి

~

 

స్థలం:కురుక్షేత్రం,  కాలం: ద్వాపర యుగం పోయేకాలం,  సందర్భం:మహాభారత యుద్ధ ప్రారంభం

చాలా సేపటినుంచీ ఓర్పుతో చెబుతూనే వున్నాడు.  కానీ ఇంకా అర్జునుడు బిగుసుకునే వున్నాడు!  మరోకళ్ళకైతే చానా కోపం వచ్చుండేది.  కానీ, కృష్ణుడు కదా, మొదట్నించీ దేనికైనా ఓపిక పడతాడు.  లేకపోతే అంతమంది పెళ్ళాలతో రిమార్కు లేకుండా కాపరం చేయగలడా!

“ ఆ పక్క నిలబడింది నా అన్నదమ్ములూ, బంధువులూనూ”ఫల్గుణుడు  ఆక్రోశించాడు

“ఎవరూ? వాళ్ళా?!  బంధుత్వం గురించి కాదు, అందులో ఎవరు నీకు హితులో, సన్నిహితులో చెప్పు”పరమాత్మ చాలెంజ్

“అరిగో, ఆయన ద్రోణాచార్యుడు, నాగురువు”

“ఎవరూ, ఎరికల ఏకలవ్యుడి  వేలు అన్యాయంగా కత్తిరించాయన నీకు గురువా?

“బావా, అలా అనబాకు.  నాకిచ్చిన మాట కోసమే ఆయన అలా చేయాల్సోచ్చింది.  నాకు సమస్త యుద్ధ  విద్యలూ నేర్పించి, ధనుర్విద్యలో ఎదురు లేని నిపుణుడిగా తయారు చేశాడు”

“సరే, మరి ఆ విద్యలు అవసరము వచ్చినపుడు వాడాలని నేర్పలేదా?”

“వాడాలి, కానీ అస్మదీయుల మీద  కాదు.  అటుచూడు.  ఆ తెల్ల గడ్డపాయన.  భీష్మాచార్యులు.  నాకు తాతయ్య.  చిన్నపుడు చానామాట్లు వాళ్ళింటికి ఆడుకోను వెళ్ళేవాడిని.  తనంటే మా అన్నదమ్ములందరికీ ఎంతో గౌరవం, ప్రేమానూ”

“ప్రేమా, ఆపేక్షా మీకుంటే చాలదు.  ఆయనకీ వుండాలి.  ఉండుంటే యుద్ధంలో ఈ పక్కన నిలబడేవాడు”

“ఆయన ధర్మబద్ధుడై పోయాడు.  ధర్మానికి కట్టుబడి అటు నిలబడిపోయాడు.  మనసులో మాత్రం మా మీద ప్రేమే.  అరిగో వాళ్ళు, మా వందమంది ప్రియ సోదరులు. మా రక్త సంబందీకులు.  వాళ్ళ మీదికి బాణాలెట్లా వేసెను?”అర్జునుడు మీసాలు తిప్పుతూ తల బిరుసుగా నవ్వుతున్న సోదరుల్ని వెనకేసుకొచ్చినట్టు చెప్పాడు.

“ఈ సోదరుల్లో ఒకడే కదా, ద్రౌపదిని సభలోకి ఈడ్చుకు వచ్చి చీరపట్టి లాగిందీ?  మిగిలిన వాళ్ళంతా మెదలకుండా గుడ్లప్పగించి చూస్తుండిపోయారు. పైపెచ్చు అది తప్పని చెప్పిన ఒక్కడ్నీ సభలోంచి గెంటేసారు”

“అదేదోలే, పొరపాటుగా జరిగిపోయింది.  అసలు నిజానికి దుశ్శాసనుడు ద్రౌపదిని పరాభావించాలనుకోలేదు.  మరదలి సరసానికి ఉత్తినే అలా పైట పట్టుకు గుంజాడు అంతే.  అంతకు మించి ఏం లేదు”

“ఏం మాట్టాడుతున్నావ్ అర్జునా?! తమ్ముళ్ళ పెళ్ళాంతో మరదలి సరసం ఏమిటి?  ఆ రోజు ద్రౌపదికి నేను చీరలు ఇవ్వకుంటే ఏమయ్యేది?  అంతా మర్చిపోయావా?  పోనీ సభలో జరిగిన రభస గురించి మీ వ్యాస తాతయ్య తన డైరీ లో రాశారు, పైకి చదివేనా?”

“ఒద్దొద్దు.  ఆ డైరీలూ గట్రా ఇప్పుడెందుకులే.  మా వ్యాస తాతయ్య ఇంత సంగతి అంత చేస్తారు.  మనకి తెలీనిదేముంది”

“హతవిధీ!  కలిప్రవేశానికి కాలం దగ్గరలోనే ఉందనే సూచనలు ఎంత చక్కగా కనబడుతున్నాయి.  పాండవ పుత్రుడు పెద్దల గురించి ఎంత తేలిగ్గా మాట్టాడేశాడు.  అయినా ఆ సమయంలో నువ్వు కూడా సభలోనే వున్నవుగాదా.  ద్రౌపది గోడు గోడున ఏడవడం నువ్వు కూడా చూసావుగా?  మీ అన్నదమ్ములు బోలెడు ప్రతినలు పూనారు మరి?”

“ఏమో నేను తలకాయ దించుకున్నా.  సరిగా ఏం చూళ్ళేదు.  ఆవేశంలో నోటి తుత్తరకొద్దీ ఏవో ప్రతినలు పూని ఉండొచ్చు.  అవ్వన్నీ తూచ్.  అయినా మా కుటుంబ గొడవలు పక్కనబెట్టు.  నిజమే, మా తమ్ముడు పొరపాటున ఒక ఆడమనిషి పైట లాగాడు.  నువ్వేం తక్కువ తిన్నావా?  బోలెడు మంది గోపికల చీరెలు దొంగిలించి వాళ్ళని నీళ్ళ లోంచి దిసమొలతో బైటికి రమ్మని వేధించావా లేదా?”ఎట్టకేలకి కిరీటి  మంచి పాయింట్ పట్టేశాడు.

“అది వేరు, ఇది వేరు.  నేనంటే గోపికలకి చాలా ఇష్టం.  నేను చీరెలు దొంగిలించినా, ఎవర్నేనా ఆట పట్టించినా అందులో లోతున చాలా అర్ధం వుంటది.  మామూలు మనుషుల పనుల్నీ, నా లీలలనీ ఒక్కలాగూ చూడగూడదు.  తత్త్వం తెలుసుకోవాలి.  సామాన్య మానవులు  నేను చెప్పింది చెయ్యలిగానీ నేను చేసింది చెయ్యగూడదు”.

“చాల్చాల్లేవయ్య చెప్పొచ్చావ్.  మీ వూళ్ళో వాళ్ళ ఇళ్ళల్లో వెన్నంతా దోచేసి, కుండలు పగలగొట్టి, ఆడపిల్లలని నానా అల్లరీ పెట్టి ఆనక అదంతా సరదా అటని అందర్నీ మభ్య పెడతావు.  మీ అమాయకపు యదు జనులు, నువ్వు చిన్న పిల్లాడివనీ, ముద్దుగా వున్నావనీ, నీ అల్లరి చేష్టల్ని క్షమించి గారాబం చేస్తారు”.

“చెప్పాగా, అదంతా నా లీలలో భాగం.  నాతో పాటు రేపల్లెలో వున్న వాళ్ళంతా పూర్వజన్మలో మునులూ, బుషులూనూ.  నాతో ఆడి పాడే అదృష్టాన్ని నేను ఆ జన్మలో వాళ్లకి వరంగా ఇచ్చాను”.

“ఈ ఆర్గుమెంట్ అంతా ఎందుగ్గానీ, నాకు నీ మీద నమ్మకం వుంది.  నువ్వు తలుచుకుంటే యుద్ధం ఆపించి కాంప్రోమైజ్ చెయ్యగలవు.  నాకోసం అది చెయ్యి”

“ఆల్రెడీ నేను రాయభారానికి వెళ్ళడం, అది ఫెయిల్ అవడం నీకు తెలుసుగా?”

 

“కపట నాటక సూత్రధారివి.  యుద్ధం జరిపించాలనే నీ సంకల్పం. అందుకే నీ ఫుల్ కౌన్సిలింగ్ టాలెంట్ వాడి కౌరవులని కన్విన్సు చెయ్యాలని చూడలేదు. నా మాట విని ఈ లాస్ట్ మినిట్లోనైనా యుద్ధాన్ని ఆపడానికి నూరు శాతం ఎఫ్ఫెర్ట్ పెట్టి యుద్ధం ఆపించు.”

“సమస్య యుద్ధం కాదు.  మారుతున్న యుగ ప్రభావం చేత విజ్రంభిస్తున్న మానవ అహంకారం.  మదాంధుడై విర్రవీగే దుష్టుల్ని సంహరించడం ఇప్పుడు నీ బాధ్యత.  ధర్మం నశించిపోయి, అధర్మం పెచ్చు పెరిగినపుడు, ధర్మ దేవతను కాపాడేందుకు నేను ప్రతియుగంలో పుడతాను.  ధర్మం కోసరం నిలబడే వారికి డ్రైవింగ్ ఫాక్టర్ గా పనిచేస్తాను”కృష్ణుడు సందర్భంలో గాఢతను అర్జునుడికి తెలపడానికి గ్రాంధిక పదాలు దంచాడు.

“బావా కృష్ణా!కౌరవులు తప్పు చేసివుంటే వాళ్ళ ఖర్మ.  వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు.  పైన దేవుడు వున్నాడు.  చచ్చాక యముడు వాళ్ళని నరకంలో నూనెమూకుడులో వేసి కాలుస్తాడు”.

“ఎహే, చచ్చాక సంగతి తరవాత.  ముందు భూమ్మీద వున్నా పాప భారాన్ని తగ్గించాలి.  నువ్వు నీ బాధ్యత నుండి ఎస్కేప్ కావాలని చూస్తున్నావు.  ఈ యుద్ధానికీ దాని పరిణామానికీ నిన్ను నువ్వు కారకుడిగా భావించడం మానెయ్.  ఈ సమస్త విశ్వంలో జరిగే ప్రతి చిన్న ఏక్షన్కీ రియాక్షన్ కీ నేనే కర్తని.  నువ్వు కాదు”

కృష్ణుడు చానా సేపు థియరీ మాట్టాడాడు.  తర్వాత ప్రాక్టికల్ డెమోలోకి దిగాడు.  తన విశ్వరూపాన్ని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో చూబెట్టాడు.  ధనుంజయుడు  మళ్ళీ బుర్ర గోక్కున్నాడు.

“యుద్ధం కాకండా వేరే దారి చూడగూడదా?”

కృష్ణుడికి అర్ధమైపోయింది.  అర్జునుడు చానా సెన్సిటివ్.  ఇంటి ఇల్లాలి చీర పట్టుకు లాగినోడిని చంపాలన్నా అతనికి మనసొప్పదు.  ఇప్పుడు ఎలాగైనా అతడికి కోపం తెప్పించాలి.  ఆవేశం పుట్టించాలి.  శత్రుసంహారానికి సిద్ధపడేలా ఉసిగొలపాలి.  ఏం చెయ్యాలి?

“హాం ఫట్!”కృష్ణుడు మంత్రం వేశాడు.  విజయుడు  తెలివి తప్పి పోయాడు.

……………….            ……………………..                 …………………

Kadha-Saranga-2-300x268

స్థలం:భారత దేశం. కాలం: కలియుగం ఇప్పటి కాలం, సందర్భం:ఆర్జునుడిని యుద్ధానికి పురిగొల్పడం.

కాసేపటికి కృష్ణుడు అర్జునుడి మొహం మీద నీళ్ళు కొట్టాడు.  అర్జునుడు కళ్ళు తెరిచాడు.  కళ్ళు తెరవగానే కృష్ణుడు కేలండర్ చూబెట్టాడు.  అర్జునుడికి అర్ధం అయ్యింది.  కృష్ణుడు తనని సాధారణ శకం ఇరవై ఒకటవ శతాబ్దం లోకి తీసుకు వచ్చాడని.  వున్న పళంగా యుద్ధక్షేత్రం నుండి ఇక్కడికి ఎందుకు తీస్కొచ్చినట్టూ అని అర్జునుడు తనలో తనే తర్జన భర్జన పడ్డాడు.  కృష్ణుడి వంక చూశాడు.  కృష్ణుడు తలెత్తి చుట్టూ చూడమని సైగ చేశాడు.  చూస్తే ఏముంది, ఎన్నో నేరాలూ ఘోరాలూ.

ఒక చోట మీటింగ్ జరుగుతుంది.   ఓ పెద్ద మనిషి మాట్టాడుతున్నాడు, అత్యాచారానికి గురైన ఆడాళ్ళంతా గోడుగోడున ఏడుస్తూ వింటున్నారు.  రిస్కు సమయాల్లో రిస్కు పనుల్లోకి వెళ్ళకుండా మీ జాగర్తలో మీరుండాలి.  ప్రభుత్వాలకి  వెయ్యి చేతులుండవు ఏపొద్దూ మీ వెంట వుండి మిమ్మల్ని కాపాడేదానికి అంటున్నాడు.

ఇంకో దగ్గర ఓ గ్రూప్ కి  చెందిన నాయకుడు ఎగస్పార్టీ లేడీ లీడర్లని లాక్కొచ్చి రేప్ చేస్తామని బహిరంగంగా స్పీచ్ ఇస్తున్నాడు.  ఇంకో నాయకుడు మొగోళ్ళన్నాకా మొగోళ్లే, ఏవో చిన్న చిన్న పొరపాట్లు చేస్తారు.  దానికి అదే పనిగా గొడవ చెయ్యడం బాలేదని అక్రోశిస్తన్నాడు.    ఇంకో దగ్గర ఒక్క ఆడ పిల్ల మీద ఒకేసారి నలుగురు అత్యాచారం ఎలా చేస్తారు?  అని ఓ మేధావి ప్రశ్నిస్తున్నాడు.  పక్కనే ఒకడు ఆడ ఆపీసరమ్మని ఒకడు చితకా మతకా బాది పారేస్తన్నాడు.  ఈ ఇన్సిడెంట్లు జరగతా వుంటే జనాలు పక్కనే మామూలుగా ఏం పట్టనట్టు వాళ్ళలో వాళ్ళు మాట్టాడుకుంటా నడిచి పోతన్నారు.  అర్జునిడి రక్తం మరిగి పోయేలా ఎన్నెన్ని సంఘటనలో…అతనికి ఆవేశం పొంగి పొర్లింది

“హార్నీ, ఇంతలేసి ఘోరాలు జరుగుతుంటే ఎవరూ రియాక్ట్ కారేం?”కోపంగా గాండ్హీవం పైకి లేపబోయాడు.  కృష్ణుడు వారించాడు.

“బావా అర్జునా, నీ గాండ్హీవం ప్రభావం ఈ యుగంలో పనిచెయ్యదు.  నీ యుద్ధ ప్రతిభను నే చెప్పిన చోట చూపించు.  నీ బాధ్యత నిర్వర్తించు.  కలియుగం సమస్యల్ని నేను వేరే అవతారం ఎత్తి సాల్వ్ చేస్తాను”అని మళ్ళీ ‘హాంఫట్’ మంత్రం వేశాడు.  తర్వాత పార్ధుడు కళ్ళు తెరిచి చూస్తే ఇద్దరూ కురుక్షేత్రంలో వున్నారు.  ఇంకేం మాట్టాడకుండా అర్జునుడు కౌరవులవైపు గాణ్డీవం సెట్ చేశాడు.

 

ముక్తాయింపు:  భగవానుడు కలియుగం సమస్యల్ని సాల్వ్ చేస్తాననడం ఒక భక్తుడు విన్నాడు.  అందరికీ చెప్పాడు.  అప్పట్నించీ అందరూ పగలంతా భజనలు చేస్తూ, రాత్రిపూట నిద్రపోతూ కాలం గడిపేస్తున్నారు.  పరమాత్మ,  జనాలు నాన్ స్టిక్ పాన్లో నూనె లేకండా చేసిన ప్రసాదాలు తినీ తినీ, వైకుంఠ నివాసంలో ఏ పొద్దూ శేషుడి నీడ పట్టున పడుకుని తీవ్రమైన ఆర్ధరైటిస్ తోనూ, డి విటమిన్ లోపంతోనూ బాధపడుతూ లక్ష్మీ దేవితో రాత్రీ పగలూ అనిలేక కాళ్ళు నొక్కించుకుంటూ తన కష్టాల్లో తను పడి ‘కలియుగ అవతారం’ ప్రామిస్ సంగతి మర్చేపోయాడు!

 

*

మీ మాటలు

 1. Devarakonda Subrahmanyam says:

  పురాణం కధలో అంశాన్ని తీసుకొని ప్రస్తుత దోర్భాగ్యపు పరిస్తి రాయడం చాల చక్కటి ప్రయత్నం. అభినందనలు క్రిష్ణజ్యోతి గారూ

 2. sasikala says:

  చాల బాగా వ్రాసారు

 3. ఇతిహాసాలని నవ్వులాటగా మార్చడం మంచి సంస్కారం కాదు. మనల్ని మనమే అపహాస్యం చేసుకో కూడదు. పైగా హిందూ పురాణాల మీదా, ఇతిహాసాల మీదా రాయడానికి ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది.

 4. సారంగ నుంచి వైదొలగే సమయము ఆసన్న మైంది !

 5. రచయిత్రి పేరే కృష్ణ జ్యోతి. నేను చదివి అర్ధం చేసుకున్నంత మేరా నాకు కథలో హాస్యం వుంది గానీ అపహాస్యం లేదు.

 6. పరమాత్మ, జనాలు నాన్ స్టిక్ పాన్లో నూనె లేకండా చేసిన ప్రసాదాలు తినీ తినీ, వైకుంఠ నివాసంలో ఏ పొద్దూ శేషుడి నీడ పట్టున పడుకుని తీవ్రమైన ఆర్ధరైటిస్ తోనూ, డి విటమిన్ లోపంతోనూ బాధపడుతూ లక్ష్మీ దేవితో రాత్రీ పగలూ అనిలేక కాళ్ళు నొక్కించుకుంటూ తన కష్టాల్లో తను పడి ‘కలియుగ అవతారం’ ప్రామిస్ సంగతి మర్చేపోయాడు! హ హ హ. hilariours

 7. lakshmi narayana b v says:

  బాగా వ్రాసారు కృష్ణమ్మా….. కానీ ఆస్తికుల మనస్సు చివుక్కు మంటుంది చివరలో ముక్తాయింపు

 8. మీది నాస్తికుల సంచిక అని ఓపెన్గా చెప్పండి.

 9. చాల గోపగా vrasaru

 10. అసురుడు says:

  చాలా బాగా రాశారు.సమస్యలను ప్రస్తావించారు.

 11. మొదటి అంశం, కథలో నాస్తికత లేదు. కృష్ణ పరమాత్మ తత్వం పరిపూర్ణంగా అర్ధం చేసుకుని ఆయనను హై లైట్ చేసిందే కనబడుతోంది. నాన్ స్టిక్ పాన్ లో నూనె లేని ప్రసాదం అంటే, నాకు అర్ధం అయ్యింది కూడా, భక్తి లేని, దొంగ పటాటోపాలతో బతికే ఆస్తిక బతుకుల గురించేనని చెప్పనక్కరలేదు. రెండవది నాస్తికత నేరం కాదు. నాస్తిక వాదానికి చెందిన రాతలు రాయడం కాన్స్టిట్యూషన్ కి విరుద్ధం కాదు, అది ఏ ప్రభుత్వమైనా కూడా. ఇక ముందు ముందు నాస్తికతనీ హేతువాదాన్నీ రాజ్యాంగ విరుద్ధమని మన స్వతంత్ర భారత దేశంలో కొత్త చట్టం తెస్తే, అప్పుడు కూడా ఈ కథని నిషేధించక్కర్లేదు. కథలో పెద్ద పెద్ద ట్విస్ట్ లు లేవు. మామూలుగా చదివిన ఎవరికైనా ఇది పక్కా ఆస్తికుల కథ అని అర్ధం అవుతుంది. i find no offensive point in this story . మే లార్డ్ కృష్ణ గివ్ some common sense to ….

 12. దేవరకొండ says:

  వెంకట్ గారికి (భక్తి, భక్తులు, భగవంతుడు మీద) సెటైర్ కీ నిజాయితీ గల భక్తి రచనకి తేడా తెలియకపోవచ్చు. మీరు ఇచ్చిన వివరణలు అవసరమయే కామెంట్స్ నా పోస్ట్ లో ఉన్నాయేమో తెలియదు. (నా పోస్టు తొలగించబడింది కనుక) నాస్తికత నేరం కాదని అందరికీ తెలుసు. ఇది పక్కా ఆస్తికుల కథ అని ఎందరికి అనిపించిందో కూడా సందేహాస్పదం! మీరే కాదు, నా లాంటి వాళ్లంతా ప్రార్ధించేది ‘ మాకు’ ఇంకా కామన్ సెన్స్ ఇవ్వమనే! ఇలాంటి వాటిని ఇగ్నోర్ చేయగల స్థైర్యాన్ని ఇవ్వమని కూడా మా ప్రార్ధన. And thanks for praying for us!

 13. మీరు ఇచ్చిన వివరణలు అవసరమయే కామెంట్స్ నా పోస్ట్ లో ఉన్నాయేమో తెలియదు. (నా పోస్టు తొలగించబడింది కనుక)! అంటే మీ పోస్ట్ లో ఏమి వ్రాసారో మీకే జ్ఞాపకం లేదు. ఇంకా నేను ఎం చెప్పగలను. భగవంతుడి మీద సెటైర్లు రాయగూడదని మీ అభిప్రాయం. నేను వ్యతిరేకిస్తాను. నిజాయితీ భక్తులు భక్తి రచనలు రాసుకోవచ్చు! భక్తి వున్నా లేకపోయినా దేవుడి మీద సెటైర్లు కూడా రాసుకోవచ్చు. ఎవరిష్టం వాళ్ళది. అంతమాత్రానికి nasty , సంస్కారం వగైరా పదాల వాడకం సరి కాదనిపిస్తోంది.

 14. ఈ కథని ఒకటికి రెండు సార్లు చదివాను. ఇందులో సెంటర్ పాయింట్ స్త్రీలూ, వారి మీద జరుగుతున్న అకృత్యాలు. కథ చివర్లో, అనేక విధాలుగా అత్యాచారాలకి గురి అవుతున్న ఆడవాళ్ళని ఆదుకోవడానికి ఏ దేవుడూ దిగిరావడం లేదని రచయిత్రి ఆవేదనతో పెదవి విరిచారు. చర్చించాల్సిన అంశం స్త్రీ పరిరక్షణకు సమాజంలో ఏ విధమైన మార్పులూ, చర్యలూ రావాలి అని. అది వదిలేసి ఏమిటేమిటో మాట్లాడుతున్నారు. అసలు ఆస్తికుల, నాస్థికుల గోడవెక్కడుంది?! విషయాన్ని పక్క దోవ పట్టించే విధంగా జరిగే చర్చని చూస్తే నవ్వాలో, ఏడవాలో లేక నా అవగాహనని అనుమానించాలో అర్ధం కావడం లేదు.

 15. krishnajyothi says:

  Humble thanks for reading and expressing varied views

 16. Aranya Krishna says:

  ఆసక్తిగా చదివింప చేసిన సెటైర్!

మీ మాటలు

*