పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్!

 

 

-రమణ యడవల్లి
~
 
మన్ది పవిత్ర భారద్దేశం, ఈ దేశంలో పుట్టినందుకు మనం తీవ్రంగా గర్విద్దాం (ఇలా గర్వించడం ఇష్టం లేనివాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవచ్చు). మన్దేశంలో ప్రజలే పాలకులు. ప్రజాసేవ పట్ల ఆసక్తి కలిగినవారెవరైనా సరే – ఎన్నికల్లో పోటీ చెయ్యొచ్చు, గెలవచ్చు. ప్రజలకి పజ్జెనిమిదేళ్ళు నిండగాన్లే ఓటుహక్కు వస్తుంది, ఈ హక్కుతో వారు ప్రజాప్రతినిథుల్ని ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికైనవారు ప్రభుత్వాల్ని యేర్పాటు చేస్తారు. ఇంత పారదర్శకమైన ప్రజాస్వామ్యం ప్రపంచంలో ఇంకోటి వున్నట్లు నాకైతే తెలీదు.
 
మన్దేశంలో రాజ్యం అనుక్షణం ప్రజల సంక్షేమం గూర్చే తపన పడుతుంటుంది. అందువల్ల ప్రజలు తమగూర్చి తాము ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం యేది తినాలో, యేది తినకూడదో పాలకులే నిర్ణయిస్తారు. ఇది కేవలం ప్రజారోగ్య పరిరక్షణ కోసం మాత్రమేనని మీరు అర్ధం చేసుకోవాలి. ఓటేసే హక్కుంది కదాని యేదిబడితే అదితింటే ఆరోగ్యం పాడైపోతుంది. పాలకులకి ప్రజలు బిడ్డల్లాంటివారు. మనం మన పిల్లల మంచికోసం జాగ్రత్తలు తీసుకోమా? ఇదీ అంతే!
 
ఇక సినిమాల సంగతికొద్దాం. ఈ దేశంలో సామాన్యుల వినోద సాధనం సినిమా. తినేతిండి విషయంలోనే సరైన అవగాహన లేని ప్రజలకి యేం చూడాలో యేం చూడకూడదో మాత్రం యెలా తెలుస్తుంది? తెలీదు. అందుకే ప్రజలకి మంచి సినిమాలు మాత్రమే చూపించేందుకు పాలకులు ‘సెన్సార్ బోర్డ్’ అని ఒక సంస్థ నెలకొల్పారు. ఇందుగ్గాను మనం ప్రభుత్వాలకి థాంక్స్ చెప్పాలి.
 
‘సినిమా చూసే విషయంలో ఒకళ్ళు మనకి చెప్పేదేంటి?’ అని ఈమధ్య కొందరు ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు అనార్కిస్టులు. రోడ్డు మీద ట్రాఫిక్ రూల్స్ ఎందుకు పాటిస్తాం? మన మంచి కోసమేగా? ఇదీ అంతే! ఆ తెలుగు సినిమావాళ్ళని చూడండి.. బుద్ధిగా రూల్స్ పాటిస్తూ పాటలు, ఫైట్సు, పంచ్ డైలాగుల్తో మాత్రమే సినిమా తీసేస్తారు. ఒక్క తెలుగు సినిమానైనా సెన్సారువాళ్ళు అభ్యంతర పెట్టారా? లేదు కదా! అంటే ట్రాఫిక్ రూల్సు పాటించనివారి వాహనం సీజ్ చేసినట్లే.. సమాజం, సమస్యలు అంటూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే సినిమాల్ని మాత్రమే సెన్సారువాళ్ళు ఆపేస్తున్నారు.
 
అసలు సెన్సార్ బోర్డ్ అంటే యేంటి? అమాయకులైన ప్రజలు యేదిపడితే అది చూసి చెడిపోకుండా వుండేందుకు ప్రభుత్వంవారిచే నియమింపబడ్డ సంస్థ అని ఇందాకే చెప్పుకున్నాం. సెన్సారు బోర్డులో దేశం పట్ల, దాని బాగోగుల పట్లా అవగాహన కలిగినవారు మాత్రమే సభ్యులుగా వుంటారు. వారు మిక్కిలి నీతిపరులు, జ్ఞానులు, మేధావులు. కనుకనే రాముడి కోసం శబరి ఫలాల్ని ఎంగిలి చేసినట్లు, అన్ని సినిమాల్ని ముందుగా చూస్తారు. ఆపై మనం యేది చూడొచ్చో, యేది చూడకూడదో వడపోస్తారు (దుఃఖంతో గొంతు పూడుకుపోయింది, కొద్దిసేపు ఆగుతాను).
 
ఈ విధంగా దేశసేవలో పునీతమవుతూ ప్రశాంతంగా వున్న సెన్సార్ బోర్డుకి అనురాగ్ కాశ్యప్ అనే తుంటరివాడు తగిలాడు. ఆ అబ్బాయి వర్తమాన సాంఘిక సమస్యల ఆధారంగా వాస్తవిక సినిమాలు తీస్తాట్ట. దేశమన్నాక సమస్యలుండవా? వుంటాయి, వుంటే యేంటి? అవన్నీ చూపించేస్తావా? ఒకప్పుడు సత్యజిత్ రే అని ఓ దర్శకుడు వుండేవాడు, ఆయనా అంతే! భారద్దేశం పేదరికాన్ని ప్రపంచానికంతా టముకు వేసి మరీ చూపించాడు. ఆయనకి ఎవార్డులొచ్చాయి, మన్దేశానికి మాత్రం పరువు పోయింది! సమస్యలు ఎవరికి మాత్రం లేవు? మాంసం తింటామని బొమికలు మెళ్ళో వేసుకుని తిరుగుతామా!
 
ఆ అనురాగ్ కాశ్యపో, హిరణ్యకశ్యపో.. ఆ కుర్రాడి సినిమాకి సెన్సార్ బోర్డు బోల్డెన్ని కట్స్ చెప్పిందట, సినిమా పేరులో ‘పంజాబ్’ తీసెయ్యమందిట. ఇందులో అన్యాయం యేమిటో మనకి అర్ధం కాదు – సెన్సారు బోర్డు వుంది అందుకేగా! పైగా ఆ కుర్రాడు ఒక ఇంటర్వూలో – “పంజాబ్ రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం వల్ల యువత చాలా నష్టపోతుంది. ఒక సమస్యని గుర్తించడంలో సమస్యేంటి?” అని ప్రశ్నించాడు. అంటే ఒక సమస్య వుంటే, దానిమీద యెడాపెడా సినిమాలు తీసేస్తావా? దేశం పరువు బజార్న పడేస్తావా? ఇప్పుడు నీలాంటివాళ్ళ ఆటలు సాగవ్, ప్రజల కోసం నిరంతరం శ్రమించే ప్రభుత్వం వచ్చేసింది.
 
మా పక్కింటాయనకి ముంజేతి మీద యేదో మచ్చ వుంది, ఆయన దాన్ని ఫుల్ హాండ్స్ చొక్కా వేసుకుని కవర్ చేసుకుంటాడు. మా ఎదురింటాయన తెల్లజుట్టుకి రంగేసుకుంటాడు! వాళ్ళ అందానికొచ్చిన ఇబ్బందుల్లాంటివే దేశానికీ వుంటాయి. నీ సినిమాలు యే సౌదీ అరేబియాలోనో తీసిచూడు, దూల తీరిపోతుంది. ఎంతైనా – మన్దేశంలో ఫ్రీడమాఫ్ ఎక్స్‌ప్రెషన్ మరీ ఎక్కువైపోయింది, అందుకే దేశాన్ని విమర్శించడం ఈమధ్య ప్రతివాడికి ఓ ఫేషనైపోయింది.
 
సెన్సార్ బోర్డుని విమర్శించేవాళ్ళు విదేశీ ఏజంట్లు. పవిత్రమైన సెన్సారు వ్యవస్థని కాపాడుకోకపోతే మన దేశభవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. హీనమైన పాశ్చాచ్య సంస్కృతిని వొంటబట్టించుకున్న కుహనా మేధావులు మన్దేశంలో చాలా సమస్యలున్నట్లు చూపించేస్తారు, అతంతా నిజమని అమాయక ప్రజలు నమ్మేస్తారు. చివరాకరికి ప్రజల వల్ల ఎన్నుకోబడి, ప్రజల బాగుకోసం నిరంతరం శ్రమిస్తున్న పాలక వర్గాలపైన నమ్మకం కోల్పోతారు. ఇలా జరగకుండా దేశభక్తులమైన మనం ప్రతిఘటించాలి.
 
భారత సెన్సార్ బోర్డుకి ప్రస్తుత హెడ్ శ్రీమాన్ పెహ్లాజ్ నిహలానిగారు. ఆయన భారతీయ సంస్కృతి పరిరక్షణకి కంకణం కట్టుకున్న వ్యక్తి, గొప్ప దేశభక్తుడు. సినిమా సెన్సార్ విషయాల్లో చంఢశాసనముండావాడు. అందుకే కాశ్యప్‌గాడికి జెల్ల కొట్టాడు. ఆ మేరకు ఒక సందేశం ఆల్రెడీ ఈ సోకాల్డ్ రియలిస్టిక్ సినిమాగాళ్ళకి చేరిపోయింది, ఇక ఇట్లాంటి జాతివ్యతిరేక సినిమాలు తియ్యాలంటే వాళ్ళు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అసలు వీళ్ళెందుకు పాజిటివ్ సినిమాలు తియ్యరు? చాయ్ అమ్మిన ఒక మహానుభావుడు ప్రధాని అయ్యాడు. ఈ ఆలోచనే గొప్ప ఉత్తేజాన్నిస్తుంది! ఇట్లాంటి గొప్ప కథాంశంతో యే వెధవా సినిమా తియ్యడు, ఇది మన దురదృష్టం. 
 
సెన్సార్ బోర్డుని విమర్శించేవాళ్ళు దేశద్రోహులని కూడా నా అనుమానం. సెన్సారే లేకపోతే విపరీతంగా బూతు సినిమాలు వచ్చేస్తాయి, యువకులంతా రేపిస్టులుగా మారిపోతారు. ఆడవాళ్ళల్లో పతిభక్తి తగిపోతుంది, బరితెగించిపోతారు. సీతామహాసాధ్వి జన్మించిన ఈ పుణ్యభూమి విచ్చలవిడి భూమిగా మారిపోతుంది.
 
ఇంకో ముఖ్య విషయం – సెన్సార్ బోర్డు వల్లనే సాంఘిక సమతుల్యత రక్షించబడుతూ వస్తుంది. అదే లేకపోతే – దళితుల సమస్యని హైలైట్ చేస్తూ కారంచేడు, చుండూరు మారణకాండల మీద సినిమాలొస్తాయి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న సహజ సంపదల లూటీకి అడ్డుగా వున్న ఆదివాసీల దారుణ అణచివేతపై సినిమాలొస్తయ్. ఇవన్నీ ప్రజలకి తెలిసిపోతే దేశానికి ఎంత ప్రమాదమో మీరే ఆలోచించండి.
 
సినిమాల్ని నలిపేసే భారత సినిమాటోగ్రాఫ్ చట్టం (1952) యెంతో పవిత్రమైనది. సెడిషన్ యాక్ట్ (1870) లాగే సినిమాటోగ్రాఫ్ చట్టం కూడా నిత్యనూతనమైనది! ఈ పురాతన చట్టాల్ని మార్చాలని కొందరు డిమాండ్ చేస్తున్నారు, వీరిని పట్టించుకోరాదని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నాను. మన కంట్లో మనమే ఎలా పొడుచుకుంటాం!
 
పోలీసులంటే దొంగలకి పడదు. కానీ – పోలీసులు చెడ్డవాళ్ళు కాదు, సమాజ రక్షకులు. సెన్సార్ బోర్డూ అంతే! అంచేత – తనకి అప్పజెప్పిన బాధ్యతల్ని అత్యంత సమర్ధవంతంగా నిర్వహిస్తున్న పూజ్య పెహ్లాజ్ నిహలానిగారిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. పెహ్లాజ్ నిహలాని సాబ్! యువార్ గ్రేట్! గో ఎహెడ్, వుయార్ విత్ యు సర్! 
 
చివరి మాట –
 
ఈ రచనకి స్పూర్తి – “పేదలెవ్వరూ ఇది చదువరాదు. చదివినచో వారు శిక్షలకు పాత్రులగుదురు” అని డిక్లేర్ చేసి ‘గోవులొస్తున్నాయి జాగ్రత్త!’ కథ చెప్పిన కిరీటిరావు.  

మీ మాటలు

  1. సాయి పద్మ says:

    సూపర్ అంటే సూపర్ .. నేను దేనికీ చెందని దాన్ని..
    ఇది ఎంత నచ్చిందంటే చెప్పటానికి అక్షరాలూ చాలని దాన్ని
    పెహలాజ్ నిహ్లానీ లా మీరు గ్రేట్ కాదంటే కాదు
    రావి శాస్త్రి లా .. మీరు హుట్ అంటే హుట్ .. ఇలా రాస్తారా హన్నా

  2. శ్రీనివాసుడు says:

    రమణ యడవల్లి గారూ!
    మీకు కొంత సమాచారం ఇవ్వదలచుకున్నాను.
    **సినిమాల్ని నలిపేసే భారత సినిమాటోగ్రాఫ్ చట్టం (1952) యెంతో పవిత్రమైనది. **
    మీరేం భయపడకండి. ఈ యాక్ట్ లో చెప్పినదాని ప్రకారం సెన్సార్ చేస్తే ఏ ఒక్క సినిమా కూడా బయటకి వచ్చేది కాదు. అలా చేయకపోబట్టే ఇన్ని సినిమాలు వస్తున్నారు.
    సెన్సార్ బోర్టే లేకపోతే ఏం జరుగుతుందో టివి 5 లో సినిమా పరిశ్రమకు చెందినవాళ్ళే ఉడ్తా పంజాబ్ గురించి చర్చించారు. దాని మొదటి భాగం లంకెనిస్తున్నాను. అది చూసి మీకు ఆసక్తిగా వుంటే రెండో భాగం కూడా ప్రక్కనే వుంటుంది.
    https://www.youtube.com/watch?v=0eTx3j0foSU&index=10&list=PL25CA6D9F04411D40
    ఒక Extreme End కి వెళ్ళిపోయిన వాళ్ళని గురించి వ్రాసే వ్యంగ్యంలో మనం కూడా Extreme End కి వెళ్ళనక్కరలేదు.
    కొంత సంయమనంతో కూడా వ్యంగ్యం వ్రాయవచ్చు.
    ప్రజలందరూ మన స్థాయిలోనే మానసిక పరిణతి కలిగివుంటారనుకోవడం పొరబాటేమో ఆలోచించండి.

  3. THIRUPALU says:

    చాల బాగా చెప్పారు. అసలు వాస్తవికత అంటే ఏమిటి ? మనం చూసేది. మనం ఎలా నైనా చూడొచ్చు. మనకు ఇష్ట మొచ్చి నట్లుగా. భిక్ష గాన్ని చూసి మహా రాజుగా ఊహిమ్చుకో వచ్చు, మహా రాజును భిక్ష గాడిగా ఉహించుకోవచ్చు.
    ‘ ఇండియా షైనింగ్ ‘ అన్న ఒక్క మాట చాలదా మనమంతా బతికేయడానికి. అదేదో సినిమాలో కోడిని చూసుకుమ్టు కోడి కూరతో భోజనం చేసినట్లు మనమంతా ఏ స్టార్ హోటల్ లోనో కూర్చుని పంక్ష భక్ష భోజనం చేస్తున్నట్లు ఉహించు కోలేమా ? ఇంతోటి దానికి ఇంత రాద్దాంతం ఎందుకు. అందు అబ్దుల్ కలాం సారు కళలు కనమన్నాడు.- అంటే ఏమిటి కలలో బోమ్చేయమని అర్ధం. కలలో స్తేటుస్ చూసుకోమని, ప్రతి ఒక్కడు తానూ ఇతరులకంటే గొప్ప అని ఉహించు కోవటం లేదా! ఎదుటి వాడిని ఎలా చూస్తాము. చీమలాగా చూస్తాం! తాము మాత్రమే లోకంలో గొప్ప అని.ఇది అంతే! ఎప్పుడు వాస్తవం వాస్తవం అని కొట్టుకుంటారు. సకల జాడ్యాలకు కారణం ఈ వాస్తవం. ఈ వాస్తవాన్ని నిషేదించాలి. ఇది పెహ్లాజ్ నిహలాని సాబ్ చేస్తే తప్పా!

  4. డా. కోదాటి సాంబయ్య says:

    ప్రభుత్వం (కొందరు కిట్టని మేధావులు దీన్నే రాజ్యం అంటారు ) యొక్క ముఖ్య కర్తవ్యం ప్రజలకు శాస్త్రీయ విషయాలు తెలియనీయకుండా చేయడం, దోపిడీ, మిగులు సంపద వంటి బూతు పదాలు నేర్చుకోకుండా చేయడం, సంస్కృతీ సాంప్రదాయాల పేరుతొ ప్రజల్ని శ్రీ రామరాజ్యం కాలం లోకి తీసుక పోవడం.
    వీటికి అడ్డు వచ్చిన వాళ్ళను దేశ ద్రోహులని ముద్ర వేసి బొక్కలో వేయడం .
    ఇల్లాంటి కర్తవ్యం లో రామునికి హనుమాన్ లాగా పహ్లాజ్ నిహలాని గారు చాలా బాగా పని చేస్తున్నారు. వారికి నా ఇక్ష్వాకు కాల అభినందనలు.

  5. నేను దేవుణ్ని నమ్మను, రావిశాస్త్రిని నమ్ముతాను.
    సమస్యలేదు.
    రావిశాస్త్రి దేవుడ్ని నమ్మడు. చి న

  6. Mandapaka kameswar Rao raju says:

    , ఈ చెప్పే విధాన్నాన్ని రావిశాస్త్రి గారు చాలామ్రుదువుగా రాసేవారు. staccotto style అధుభుతంగా “earnest hememgwayబాణిలో రావిశాస్త్రి గారి ప్రయోగం అనితరసాధ్యం…,రమణగారూ అభినందనలు..

  7. Ramana Yadavalli says:

    కథ, నవల అని కాకుండా.. రావిశాస్త్రి సృష్టించిన పాత్రలు నాకు చాలా ఇష్టమైన చుట్టాలు. మందుల భీముడు, పీనుగ్గుమాస్తా (రాజు – మహిషి), ముత్యాలమ్మ (మాయ), సూర్రావెడ్డు (మూడుకథల బంగారం).. వీళ్ళంతా రక్తమాంసాలతో మనముందు నించునే సజీవమైన రూపాలు. రావిశాస్త్రి పాత్రలతో contemporary issues మాట్లాడించొచ్చు (అందుకు అనువుగా కూడా వుంటాయి). ఆ దిశగా ఇదో చిన్న ప్రయత్నం.

    చదివినవారికీ, తీరిక చేసుకుని కామెంట్ రాసినవారికీ ధన్యవాదాలు.

  8. Sathish Kumar says:

    రమణ గారు చాలా బాగా చెప్పారు. కాని మీరు చాలా విషయాలు మర్చిపోయి, ఒకరి వైపే వకాల్తా పుచ్చుకొని మాట్లాడినట్టు అనిపించింది. క్షమించాలి.
    సినిమా వాళ్ళు దేని పైన ఐన సినిమా తీయొచ్చు, ప్రభుత్వం అలాంటి వెసులుబాటు కల్పించింది. చట్టాల్లో కూడా అది ఉంది. కాబట్టే కోర్ట్ లో నెగ్గి , సెన్సార్ వాళ్ళ ని తప్పు బట్టారు.
    కొన్ని అంశాల పైన సినిమా లు తీయొద్దు అని రూల్స్ పాస్ చేయండి – సినిమా లు తీయరు. అంతే ….
    మీ ఉద్దేశం లో దేశం లో ఉన్న చెడు చూపించకూడదు – ఫాల్స్ ప్రెస్టేజ్ కి పోదాం అంటారు , అంతేనా ..??

  9. Buchireddy gangula says:

    సెన్సార్ బోర్డు నియామకం లో –కూడా రాజకీయం –రాజకీయాలే —
    మన ప్రజాస్వామిక నేత. శ్రీ. లే కదా. నియమించేది -???
    భువనచంద్ర గారి. కథల్లో –సినిరంగం లోని. నిజాలు కనిపిస్తాయి
    సిని పరిశ్రమ లో–రాజకీయాలకు –వారసత్వానికి కొదువ లేదు -నాడు– నేడు —
    మారింది అంటూ ఏముందని???
    చాల చాల భాగా రాశారు. సర్
    =============================
    Buchi రెడ్డి గంగుల

  10. raghava says:

    అద్భుతం

  11. D Subrahmanyam says:

    చాలా బాగా మీదయిన వ్యంగ్య శైలిలో రాసారు రమణ గారూ. అభినందనలు

  12. sabeer mohammad says:

    ఈ వ్యాసం ఎత్తుగడ వ్యాసానికి ఏ రకంగా ఉపయోగాడిందో నాకు బోధ పడలేదు. ఎప్పుడో రాసుకున్న పదాల మీద మమకారాన్ని వదులుకోలేక, ఎక్కడో ఒక చోట దానిని వాడాలనే తపనతో ఇక్కడ ఇరికించినట్లుఉంది కాని సందభోచితం కానే కాదు. శైలి సహజాతం.అనుకరణ తో రాదు. ఒకరి శైలిని అనుకరించాలనే ప్రయత్నం లో యెప్పుదూ విషయం పై చర్చకు న్యాయం జరగదు. పైగా అనవసర పద ప్రయోగంతో ప్రక్క దారి పడుతుంది…వ్యంగ్యం హాయినీస్థూనె ఆలోచింప చేయాలి..మళ్ళీ మళ్ళీ చదివింప చేయాలి.సెన్సార్ పై సరైన ఆలోచన చేద్దాం…. సకుటుంబం గా సినిమా సరే… టీవీనీ చూడలేని దౌర్భాగ్యానికి గుండెలు బాదుకుందాం…

మీ మాటలు

*