చూపులందు ‘మగచూపు’ వేరయా…

 

 

-ల.లి.త.

~

 

 

“There is always shame in the creation of an object for the public gaze”  —  Rachel Cusk.

చూపులు వెంటాడతాయి. చూపులు తడుముతాయి. చూపులు గుచ్చుకుంటాయి.

మగచూపుల తాకిడి… వయసు వచ్చినప్పటినుంచి ఇంటి బైట అడుగుపెట్టిన ప్రతి ఆడపిల్లకీ తప్పదు. ఆ చూపులు ఆరాధిస్తున్నట్టు కనిపిస్తే గర్వంగా, వొట్టికామం కనిపిస్తే అసహ్యంగా అనిపించటం కూడా జెట్ స్పీడ్ లో జరిగిపోతూ ఉంటుంది. ఏరకం చూపులెలాంటి వొంకరలు పోతున్నాయో అప్రయత్నంగా తెలిసిపోతుంది ఆడవాళ్ళకి. చూపులు ముసుగులు వేసుకున్నా కొంచెంసేపట్లోనే ఆ ముసుగుల వెనుక ఏ భావముందో చెప్పగలరు. మగచూపుని గుర్తుపట్టే ప్రాథమికజ్ఞానం వయసుతో పాటే పెరిగి వృక్షం అవుతుంది.

సినిమాలు తీసేవాళ్ళూ రాసేవాళ్ళూ వాటిలో వేసేవాళ్లూ మూడొంతులమంది మగవాళ్ళే అయినప్పుడు వాళ్ళు ఆడవాళ్ళను చూడగానే కళ్ళతో చేసే స్కానింగ్ సినిమాల్లోకి రావటం కూడా అసంకల్పిత చర్యే. అది డబ్బులకోసం  సినిమావాళ్ళు చేసే సంకల్పిత చర్యకూడా. ఎలా చూస్తామో అలాగే రాస్తాం. తీస్తాం. అసలు సినిమా అనేదే ఒక voyeuristic tool. మనుషుల్ని ఎలా కావాలంటే అలా,  ఏ పరిస్థితిలో కావాలంటే ఆ పరిస్థితిలో చూపెడుతుంది. ఇతర్ల జీవితాల్లోకీ, ఇళ్ళలోకీ, పడగ్గదుల్లోకీ తిరిగి చూపించటానికి కావలసినంత స్వేచ్ఛ ఉంది మూవీ కామెరాకి.  సినిమా చూడటంలోని సామూహిక వాయరిజంలోని దృష్టికోణం కూడా మగవాళ్ళదే.  స్త్రీల శరీరాలను ఇష్టమొచ్చినంతమేరా చూపించే అవకాశం ఉండటంతో మేల్ డామినేటెడ్ సొసైటీలో సినిమా ‘మేల్ గేజ్’ నే ధరిస్తుంది.  ఈ విషయాన్ని గ్రహించని ఆడవాళ్ళు ఉండరు గానీ  దాన్నెలా ఎదుర్కోవాలో అర్థంకాదు.  ‘స్త్రీలను సినిమాల్లో అసభ్యంగా చూపిస్తున్నార’ని గోలపెట్టేది ఇందుకే.  కానీ ‘ఇది సభ్యత, ఇది అసభ్యత’ అని గిరులు గీయలేనిది కళాభివ్యక్తి.  ఇదే అదనుగా చాలామంది చేతుల్లో మూవీ కామెరా చెలరేగిపోతూ ఉంటుంది.

లారా ముల్వే స్త్రీవాది. ఫిలిం క్రిటిక్ కూడా. 1975లో  ఆమె ‘మేల్ గేజ్’ అనే మాటను మొదటిసారిగా వాడుతూ సినిమాల్లో ‘మేల్ గేజ్’ గురించి సిద్ధాంతీకరించింది. సినిమాల్లో, వ్యాపారప్రకటనల్లో, టీవీల్లో కనపడుతూ ఉండే మేల్ గేజ్ స్వరూపాన్ని వివరించింది.  మేల్ గేజ్ రెండురకాలు. ఒకటి సినిమాలోని పాత్రల చూపు.  రెండోది సినిమా చూస్తున్న ప్రేక్షకుల చూపు. ఎక్కడైనా చూసేది మగవాళ్ళు. చూడబడేది ఆడవాళ్ళు. సినిమాలోని పాత్రల చూపునీ బయటున్న ప్రేక్షకుల చూపునీ ఏకం చేసేది టెక్నాలజీ. అంటే సినిమాటోగ్రఫీ.  ఒక సీన్లో అమ్మాయి నడుస్తూ వెళ్తోంది. హీరో ఆమెని చూస్తుంటాడు. కామెరా హీరో చూపుని అనుసరిస్తూ వెళ్తుంది.  అమ్మాయిని హీరో ఎక్కడెలా చూస్తాడో ప్రేక్షకులను కూడా అక్కడలా చూసేలా చేస్తుంది.  సినిమా కథని నడిపేది హీరోనే.  అతనిలోనూ చూసేవాళ్లలోనూ శృంగారపరమైన ఉత్సుకత రేపే రూపంతో హీరోయిన్ కనిపించాలన్నది సినిమా ముఖ్యసూత్రం. సినిమాటోగ్రాఫర్ బలమైన విజువల్స్ తో ఈ రూల్ ని పాటిస్తాడు. మేకప్ ఆర్టిస్టులు, దుస్తులు కుట్టేవాళ్ళు హీరోయిన్లను అందంగా ప్యాక్ చేస్తారు. ఇదే అలవాటు  వ్యాపారప్రకటనల్లోనూ కనిపిస్తుంది.

 

లారా చెప్పిన ‘మేల్ గేజ్’ కి క్లాసిక్ ఉదాహరణగా చాలామందికి గుర్తొచ్చేవి జేమ్స్ బాండ్ సినిమాలు. 1962లో వచ్చిన  ‘డాక్టర్ నో’ సినిమాలో ఉర్సులా ఏండ్రెస్ సముద్రంలోంచి రావటాన్ని కామెరా, బాండ్ వేషం వేసిన సీన్ కానరీ, ప్రేక్షకులూ తదేకమైన మగచూపుతో చూస్తారు. అలాంటి దృశ్యాన్నే నలభై ఏళ్ల తర్వాత 2002 లో వచ్చిన ‘డై ఎనదర్ డే’ లో హేల్ బెరీతో మరోసారి తీసినపుడు మగచూపు ఆమెను మరీ ఎక్కువగా తడుముతుంది. ఆడవాళ్ళ ఇమేజ్ అంటే మగవాళ్ళని రెచ్చగొట్టేలా ఉండాలని చెప్తున్నట్టుగా ఉంటాయి జేమ్స్ బాండ్ సినిమాలు.

సినిమాల్లో స్త్రీలు రెండురకాలుగా ఉంటారని చెప్తుంది లారా. లైంగికంగా చురుగ్గా ఉండేవాళ్ళు ఒకరకం. బొత్తిగా బలహీనులు రెండోరకం. ఆమె హాలీవుడ్ గురించే చెప్పినా, మన సినిమాల్లో కూడా ఇవే మూసలు కనిపిస్తాయి. మొదటిరకం ఆడవాళ్ళను అప్పట్లో వాంప్ లనేవారు. ఇప్పుడు ఐటమ్ సాంగ్ గర్ల్స్ అంటున్నారు. వాళ్ళు శృంగారం కోసమే కనబడుతూ ఉంటారు.  రెండోరకం కథ నడకకి అడ్డం పడుతూ కన్నీరుకార్చే సచ్చీలురైన కలకంఠులు. అమ్మ, ఇంట్లోనే ఉండే భార్య, చెల్లెళ్ళ మూసలివి. వీళ్ళు కరుణరస ప్రదాయినులు. ఈ రెండు రకాలూ కాకుండా సగం శృంగారం, సగం పొగరూ లేదా మంచితనంతో హీరోయిన్ రూపాన్ని తయారు చేస్తారు. ఈ ఫార్ములాలు పెట్టుకుని వందల సినిమాలు వచ్చాయి.

మన సినిమాల్లోకి మొదట్లో  స్త్రీలు అడుగుపెట్టటమే అరుదు, అపురూపం. సినిమా వేషాలకోసం వచ్చినవారి కనుముక్కుతీరు, వాచకం బాగుంటే వేషాలిచ్చేవాళ్ళు. ఇప్పటి అందం కొలతల్లో ఇమడని భారీశరీరాలతో ఉన్న హీరోయిన్ల మీద కామెరా తన ప్రతాపం అంతగా చూపించలేదనే చెప్పాలి.  బిగుతైన బ్లౌజులు, పల్చటి పైటలు వేసుకునేవారుగానీ, వాళ్ళ అభినయంమీదా ముఖాలమీదే అందరి దృష్టీ ఉండేది.  తరువాత అరవైలనుండీ టైట్ పాంట్స్, బిగుతుషర్టుల్లో ఉన్న స్త్రీల శరీరాలమీద కామెరా క్లోజప్ షాట్స్ తో తన అజమాయిషీ మొదలెట్టింది. జయమాలిని, జ్యోతిలక్ష్మి, సిల్క్ స్మితల శరీరాలమీద మేల్ గేజ్ విశృంఖలంగా పాకింది. 70, 80, 90ల్లో వచ్చిన సినిమాల్లో ముఖ్యంగా మలయాళం సాఫ్ట్ పోర్న్ సినిమాల్లో శృంగారం పేరుతో ఆడవాళ్ళ శరీరాలను ప్రదర్శనకు పెట్టారు.

lalita2

సినిమా చూసేటప్పుడు స్త్రీలు కూడా ‘మేల్ గేజ్’ తోనే చూస్తారని చెప్తుంది లారా. హీరోయిన్ల వొంటితో తమ వొంటినీ  బట్టలనూ పోల్చుకుని ఆడపిల్లలు కూడా మగవాళ్ళ కళ్ళలోంచే తమను తాము చూసుకుంటారు. మహిళాదర్శకులు కూడా ఎంత చేటు మేల్ గేజ్ తో  సినిమాలు తీశారో భానుమతి, విజయనిర్మలల సినిమాలు చూస్తే తెలుస్తుంది. వాళ్ళ సినిమాల్లో రేప్ సీన్లు మగదర్శకులు తీసేవిధానానికి ఏమీ తీసిపోకుండా నిర్దాక్షిణ్యంగా ఉంటాయి.

కళాత్మక సినిమాలు తీస్తున్నానంటూ కామెరాలోంచి స్త్రీల శరీరాలను మర్యాదలన్నీ అతిక్రమించి తడిమేశాడు రాజ్ కపూర్. ఈయన సినిమాల్లో హీరో (అంటే తనే) హీరోయిన్ కళ్ళలోకే తప్ప ఇంకెక్కడా చూడడు. మూడు రకాల మేల్ గేజ్ లలో రెండో రకాన్ని వదిలిపెట్టి హీరోచేత అమాయకపు మొహం పెట్టించి, ఆ మేరకి కామెరాతో ఆడవాళ్ళమీద మరింత దౌర్జన్యం చేస్తాడు. చిన్న దుస్తుల్లో తిరుగుతూ మోడల్స్ లా నడిచే పల్లెటూరి అమ్మాయిల వేషాల్లో ఆడవాళ్ళను  చూసి లొట్టలు వేసుకున్న సెన్సార్ మెంబర్లు రాజ్ కపూర్ mammary obsession ని కళాత్మక అభివ్యక్తిగా కొలిచారేమో అనిపిస్తుంది.

‘జ్యోతి’ లాంటి మంచి సినిమాలు తీసిన రాఘవేంద్రరావు ఒక్కసారిగా తీసుకున్న చారిత్రాత్మక యూటర్న్ గురించి చెప్పుకోవాలి. ఆడవాళ్ళ శరీరభాగాలను ముక్కలుకోసి పళ్ళూ ఫలాల్లా మగవాళ్ళ కళ్ళముందర పళ్ళెంలో పెట్టి అందించాడు. రాఘవేంద్రరావు టెక్నిక్ ని చాలామంది అనుసరిస్తూ పోయారు. పోర్న్ స్టార్ సన్నీలియోన్ కి కూడా మన హీరోయిన్లలాగే బట్టలుకట్టి సినిమాల్లో చూపిస్తుంటే సంతోషంగా మగాళ్ళు చూస్తున్నారంటే ఇలాంటి titillation టెక్నిక్ కి దేశంలో ఉన్న ఆకర్షణ ఎంతటిదో తెలుస్తోంది. ‘వేదం’ లాంటి కొంచెం భిన్నంగా ఉండే సినిమాలో కూడా  ‘ఎగిరిపోతే ఎంతబాగుంటుందీ’ పాటలోనూ ఇంకా చాలా దృశ్యాల్లోనూ అనుష్క మీద వాడిన కామెరా ఏంగిల్స్,  సెక్స్ వర్కర్ పాత్రేకదా అన్న సాకుతో molest చేస్తాయి.  పాటల చిత్రీకరణలో హీరోయిన్ బొడ్డూ పిరుదులూ రొమ్ముల క్లోజప్ లూ, ఆమె నడుంపట్టుకు వేలాడే హీరోలూ తెలుగు సినిమాలో కొల్లలు.

బలమైన వ్యక్తిత్వం ఉన్న స్త్రీల కథలను తీర్చిదిద్దిన దర్శకులు కూడా ఉన్నారు కదా. వాళ్ళ సినిమాల్లోకూడా  మేల్ గేజ్ లేకుండా ఉండదు. వుమన్ ఓరియెంటెడ్  సినిమాల్లో కూడా ఎక్కడో ఓ చోట మూవీకామెరా చూపు దానిపని అది చేస్తూనే ఉంటుంది. స్త్రీల సమస్యలమీద మంచి సినిమాలు తీసిన బాలచందర్ కూడా చాలాచోట్ల చూపులు తప్పాడు. ‘అంతులేనికథ’లో కామెరా జయప్రదతో ప్రేమలో పడిపోయి వదల్లేకుండా అయిపోవటాన్ని గమనించటం కష్టమేమీ కాదు. అలాగే ‘మరోచరిత్ర’ కూడా. ‘చక్ర’ సినిమాలో స్మితాపాటిల్ స్నానాన్ని చూపిస్తూ అప్రయత్నంగా కామెరా కొంచెంగా మోహంలో పడిపోయిందనిపిస్తుంది. అందం, బలమైన వ్యక్తిత్వం ఉన్న హీరోయిన్ అంటే మోహం, ప్రేమ సినిమాటోగ్రాఫర్లలోనూ దర్శకుల్లోనూ కలగటం చాలా సహజం. దాన్ని అదుపుచేసి సినిమాని స్క్రిప్ట్ కి తగ్గట్టు తీసినప్పుడే గొప్ప సినిమాలు వస్తాయి. కానీ సినిమా ఆడాలంటే మేల్ గేజ్ ని పూర్తిగా వదిలేసే ప్రయోగాలు చెయ్యకూడదని పాపులర్ అయిన దర్శకులందరికీ తెలుసు. హీరోయిన్ అంటే ఖచ్చితంగా అందంగా ఉండాల్సిందే.

 

హాలీవుడ్ లో బలం, ధైర్యం ఉండి, యుద్ధాలు చేసే స్త్రీలుగా Uma Thurman (Kill Bill),  Angelina Jolie (Lara Croft etc.), Sigoumey Weaver (Alien) ల ఇమేజెస్ నిలుస్తాయి. అయినా వాళ్ళలోని ఆకర్షణని దర్శకుల మేల్ గేజ్ కొంతయినా ఎత్తి చూపిస్తూనే వచ్చింది. స్త్రీ శరీరాన్ని ఇష్టమొచ్చినట్టు చూపించే అవకాశం ఉన్నా ఆ పని చేయకుండా అణచివేతలోని బాధనీ అన్యాయాన్నీ తీవ్రంగా చూపించిన ‘బాండిట్ క్వీన్’ ని  మేల్ గేజ్ కి చాలావరకూ మినహాయింపనే చెప్పుకోవచ్చు. బాండిట్ క్వీన్ తీసిన శేఖర్ కపూరే ‘మిస్టర్ ఇండియా’లో శ్రీదేవి మీద పూర్తిగా మగచూపుని ఎక్కుపెడితే జనం డబ్బుల వర్షం కురిపించారు.

సినిమాకళతో చాలా ప్రయోగాలు చేసిన యూరోపియన్ సినిమాలో మేల్ గేజ్ అన్వయింపు సులభం కాదు. పాత్ర స్వభావం ఏమిటన్నదే వాళ్ళ దృష్టి. నగ్నత్వం ఎంతగా ఉన్నా దానిలో రెచ్చగొట్టే కోణం ఉండదు. నగ్నత్వం దానంతట అదే అసభ్యత అయిపోదు. చిత్రీకరించిన పద్ధతిని బట్టి అది ఆ సన్నివేశానికి అవసరమా లేక titillation కోసమేనా అన్నది ఎవరికైనా అర్థమౌతుంది. ఉదాహరణకి Jean Luc Godard సినిమాల్లో స్త్రీ అంటే ఒక వ్యక్తిత్వమే. దానికి తోడు ‘బ్రెక్టియన్ ఎలియనేషన్’ టెక్నిక్ కూడా వాడి, అరాచకాన్నీ అన్యాయాన్నీ బట్టలిప్పి చూపిస్తాడు. Godard సినిమాలో పాత్రలకంటే ఆ పరిస్థితులే మనకి భయానకంగా గుర్తుండిపోతాయి.  కొరియన్, చైనీస్ జాపనీస్ సినిమాల్లో ఎవరి కల్చర్ కి వాళ్ళు మేల్ గేజ్ ని కలిపి తీసినవీ, మేల్ గేజ్ ని వదిలి తీసినవీ కూడా గమనించొచ్చు. తరాల సంస్కృతికి  మేల్ డామినేషన్నీ ఆధునికత్వాన్నీ కలిపితే వచ్చే మగచూపులోంచి రకరకాల సినిమాలూ వ్యాపార ప్రకటనలూ తయారౌతున్నాయి.

lalita3

మేల్ గేజ్ ఉండకూడదని మడి కట్టుకుంటే శృంగారాన్నీ మోహాన్నీ సినిమాల్లో ఎలా చిత్రించాలన్నది ప్రశ్న. మంచి ఈస్తటిక్ సెన్స్ ఉన్న దర్శకులు, సినిమాటోగ్రాఫర్లు శృంగార దృశ్యాలు తీసేటపుడు ఆ పాత్రల మనస్తత్వాలను దృష్టిలో పెట్టుకుంటారు. వాళ్ళు కథలో ఏ సామాజిక వర్గానికి చెందినవారన్నది కూడా గుర్తిస్తూ శృంగారాన్ని చిత్రీకరిస్తారు. కథనిబట్టి అది మొరటుగా ఉండొచ్చు, సున్నితంగా ఉండొచ్చు, హింసాత్మకంగానైనా ఉండొచ్చుగానీ స్త్రీలని మాంసఖండాలుగా చూపించేటట్టు మాత్రం ఉండదు. మన సినిమాల్లో ఆడవాళ్ళని వస్తువులుగా చూపించవద్దని  అనుకునేవాళ్ళు శృంగార సన్నివేశాల జోలికే పెద్దగా పోకుండా సినిమా లాగించేస్తారు.  Titillation లేకుండా శృంగారాన్ని చక్కగా తీసేవాళ్ళు తక్కువ.  సెక్స్ ని సహజంగా చిత్రీకరించటంలో ఇప్పుడొస్తున్న మల్టీప్లెక్స్ హిందీ సినిమా, కామెరా తడుములాటకి దూరంగా కొంత ముందుకి వెళ్ళింది.  మిగతా పాపులర్ సినిమాల్లో మేల్ డామినేషన్ ఎలాగూ తప్పదుగానీ, మన వారసత్వసంపద, అదే.. మన తెలుగుహీరోలు.. వాళ్ళ సినిమాల్లోలా వ్యక్తిత్వంలేని ఆడవాళ్ళను  మేకప్ కిట్స్ తో సహా దొరికే బార్బీ డాల్స్ లా చూపించకుండా ఉండే మేల్ గేజ్ మేలనుకోవాలి ప్రస్తుతానికి.

మేల్ గేజ్ ని ఎదుర్కోవాలంటే విజువల్ మీడియాలో ఫిమేల్ గేజ్ ని తీసుకురావాలని కొంతమంది చెప్తారు.  ఫిమేల్ గేజ్ చెయ్యాల్సిన పని,  మేల్ గేజ్ కున్న వాయరిస్టిక్ లక్షణాన్ని అందిపుచ్చుకుని దానిలాగే తెరను ఆక్రమించటం కాదనీ  మగచూపుకున్న అధికారాన్ని తగ్గించటానికి కృషి చెయ్యాలంటే వేరే రకాలుగా కూడా దృశ్యాలను చూపించటం నేర్చుకోవాలనీ అంటోంది Lorraine Gamman.  అంటే తెరమీది స్పేస్ ని స్త్రీపురుషులిద్దరూ పంచుకోవాలని చెప్తోంది.  సినిమాటోగ్రాఫర్లలో స్త్రీలు చాలా తక్కువ. సరైన దర్శకులతో పోటీ పడగల సమర్థత ఉండి, స్త్రీవాదికూడా అయిన సినిమాటోగ్రాఫర్ ఎవరైనా, అలవాటైన మేల్ గేజ్ ని వదిలించుకుని, ప్రయత్నపూర్వకంగా తనవైన కామెరా ఏంగిల్స్ చూపిస్తూ సినిమా తియ్యగలిగిననాడు ఆడచూపును కూడా నిర్వచించవచ్చేమో.                 

***

యాభై ఏళ్ల కిందటైతే వెకిలిచూపులు ఎదురైతే చీరకొంగు భుజాలచుట్టూ నిండా కప్పుకుని తప్పుచేసినట్టుగా తల వొంచుకునేవాళ్ళు భద్రమహిళలు. ఇప్పుడు బహిరంగస్థలాల్లో మగవాళ్ళతో ఇంచుమించు సమానసంఖ్యలో తిరగ్గలగటం వల్ల వొచ్చిన ధైర్యంతో తలెత్తి లెక్కలేనట్టు మామూలుగా హాయిగా తిరుగుతున్నారు. ఆడవాళ్ళ బాడీలాంగ్వేజ్ ఎక్కడున్నా ఏ ఇబ్బందీ లేనట్టుగా మారిపోయింది.  స్త్రీవాదం, ఉద్యోగాలు, ఆత్మవిశ్వాసం స్త్రీలను నిటారుగా నిలబెట్టేవరకూ తెచ్చాయి. ఇదెంతో బాగుంది. కానీ మధ్యలో అన్నిటికీ నేనున్నానంటూ సర్వవ్యాపి మార్కెట్ జొరబడిపోయి, ఉన్న స్వరూపాలని మార్చి గందరగోళం చేస్తుందే!  “నీ శరీరాన్ని అందంగా వీటితో అలంకరించు ఒంటిని తీర్చిదిద్దుకుని చక్కగా స్వేచ్ఛగా ప్రదర్శించు. నీ స్వేచ్ఛకి ఆకాశమే హద్దు” అని ఫెయిర్ అండ్ లవ్లీలాంటి వేలకొద్దీ వస్తువులతో చుట్టుముట్టి  అన్ ఫెయిర్ ఆటలు ఆడుతోందే!  అసలే అలంకార ప్రియులేమో, మార్కెట్ దెబ్బను సగటు అర్భకపు ఆడప్రాణాలు ఎలా తట్టుకోగలవు? వొంటిని కుదించీ పెంచీ, రంగులద్దీ,   ప్రకటనలు ఎలా ఆదేశిస్తున్నాయో అలాగే తయారవటానికి పరుగు పెడుతుంటాయి.

lalita1

నువ్వు నీలాగే ఉండమంటూ ఆ ‘నువ్వు’ ఎలా ఉండాలో చెప్తున్నారు.

 

సైజ్ జీరోలుగా చాలామంది అన్నపానీయాలు మానేసి రోగగ్రస్తులయాక అమెరికన్ fashion diva ‘కిమ్ కడాషన్’ ఈమధ్య కొత్త ట్రెండ్ ఒకటి తీసుకొచ్చింది. ఆమె తన పిరుదుల్ని సర్జరీతో పెద్దవిగా చేసుకుని అందమంటే ఇదేనంది. దానితో ‘బూటీ’ అని ఆడామగా అందరూ ముద్దుగా పిల్చుకునే పెద్దపిరుదుల మీదే ధ్యాసయిపోయింది కొంతమంది ఆడపిల్లలకి.  అవి పెద్దగా లేకపోతే బెంగ.  రేప్పొద్దున్న ఇంకే ఫాషన్ సీతాకోకచిలకో లేదా పిరుదుల్ని సాఫుచేసే మిషన్లని తయారుచేసేవాళ్ళో ముందుకొచ్చి,  ఫ్లాట్  హిప్స్ లేకపోతే బతుకు వ్యర్థమని  ప్రచారం చేస్తే ఆడపిల్లలకి కొత్తబెంగలు పుట్టుకొస్తాయి. మరోపక్క ‘నా వొళ్ళు నాయిష్టం’ అని సినిమాతారలు స్త్రీస్వేచ్ఛకి అర్థం చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందంకోసం ముక్కులూ మూతులతో సహా శరీరభాగాలని కోయించుకుని, క్రీములు పూసుకుని మార్కెట్ గేజ్ కి తగ్గట్టు తయారై  ‘నాశరీరం నాయిష్టం’ అని చెప్పటం ఎంత తెలివితక్కువతనమో గమనించలేనంత మత్తులో మునిగున్నారు.  మన శరీరాలను తీర్చిదిద్దుకోవటంలో ఇప్పుడు మన ఇష్టం ఏమీ లేదనీ, కాస్మెటిక్ సర్జన్లూ బిలియన్లడాలర్ల కాస్మెటిక్ వ్యాపారం చేసేవాళ్ళూ బట్టలమ్ముకునేవాళ్ళూ కలిసి పిల్లలతో సహా అందరిమీదా మత్తుమందు జల్లుతున్నారనీ ఎవరికెవరు చెప్పగలరు?

పిట్టలపోరు పిల్లి తీర్చినట్టు ఈ మేల్ గేజ్  ఫిమేల్ గేజ్ ల గొడవని ‘మార్కెట్ గేజ్’ పరిష్కరించింది. ఇప్పుడు అన్నిటికంటే అదే బలమైనదని ఒప్పుకోవాలి. ఆడా మగా అందర్లోనూ నిద్దరోతున్న ‘Exhibitionism’ ని తట్టిలేపి దువ్వి ముద్దుచేస్తూ వేల వెరైటీల వస్తువులు అమ్ముకుంటోంది. అదీ మార్కెట్ చూపు.  సిక్స్ పాక్ ఛాతీలు ప్రదర్శించే ఫాషన్ వచ్చాక మగశరీరాన్ని కూడా ఖండాలుగా ప్రదర్శించేశారు.  అందరూ ఇప్పుడు ఉదారంగా, హక్కుగా, ఇష్టంగా తమ అందచందాలను ప్రదర్శిస్తున్నామని అనుకుంటున్నారు.

ముందు మనని మనం ప్రేమించుకున్నాక ఆ ప్రేమను అందరికీ చూపించుకోవాలి.  ఒకరు చేతిలో మొబైల్ ఫోన్ ని ఎత్తిపట్టుకుంటే ఐదారుగురు దానివైపే చూసే చూపు ట్రెండీ సెల్ఫీ గేజ్. ఎవరిని వాళ్ళు ఎప్పుడూ చూసుకుంటూ (narcissistic) అందరికీ తమని చూపెట్టుకుంటూ (exhibitionistic) ఉండేలా మార్కెట్ తన కనుసన్నల్లో జనాన్ని ఉంచుకుంటోంది.  మార్కెట్ గేజ్ ని ఎప్పటికైనా దాటగలిగితేనే కదా మన చూపుల్లో వేరే పోకడలు కూడా ఉండొచ్చని మనకు తెలియవచ్చేది!

*

 

 

 

 

 

మీ మాటలు

 1. D Subrahmanyam says:

  మంచి వ్యాసం. మగచూపు మిద విశ్లేషనాత్మక వ్యాసం.

  • N.Navneethkumar says:

   ఇక్కడ ఇంకొకటి కుడా మాట్లాడాలి మలేగేజ్ కోసం ఉర్రుతలాడే ఫిమేల్ సైకాలజీ గురించి వాళ్ళ హొయలు ,కావాలని చేసుకొనే వస్త్రధారణ ,కళ్ళలో చూడనే కృతిమ జిలుగు
   ఇందంతా చూస్తె , మగాధిత్యం తో బాటు ,బేల అమాయకత్వంతోనో ,అతి ఆడతనంతోనో జరిగే అతిసయాన్ని .అలోచనల్లొ మగ ఆడ ఒక లాగానే ఉంటారనుకొంటా. ఈ కాలం లో ఎవరూ తక్కువ తినలేదు ఎవరికి తగ్గ భేషజాలు పోకడలు వాళ్ళు పోతున్నారు.

 2. Bhavani Phani says:

  చాలా చక్కని విశ్లేషణ. నిజాలు ఉన్నవున్నట్టు చెప్పారు . ధన్యవాదాలు

 3. rani siva sankara sarma says:

  చాలా మంచి వ్యాసం. మొగచూపూ, మార్కెట్ చూపూ…..

 4. Gangadhar Veerla says:

  బావుందండి. అక్కడక్కడ ఏకపక్షంగా సాగినాగానీ.. వాస్తవాలు మాత్రం అనేకం
  మీకు అభినందనలు !!

 5. విమల says:

  మీ విశ్లేషణ బాగుందండి.

 6. THIRUPALU says:

  చాలా బాగుంది. అయితే ఇండెరక్టు గా మీరు కూడా మేల్ గృహ్య నే ఐలెట్సు చేసారు.

 7. Buchireddy gangula says:

  చూపించుకోవాలి–నన్ను. చూడాలి –అనే తత్వం—స్త్రీ ల. లో. కూడా లేకపోలేదు
  పెళ్లి లకు –ఎలాంటి ఫంక్షన్ లకు—గంగిరెద్దులా —అంత అలంకరణ లు అవసరమా ???
  పెళ్ళికి —దేవుని కల్యాణానికి వేలుతే -పట్టు చీరే కట్టాలన్న రూల్. ఎక్కడ ఉంది ??
  బాయ్ ప్లస్ –గర్ల్ మైనస్ –ఎక్కువ–తక్కువ –అనే వ్యవస్థ లో –పురుషులలో–చూపుల తిరులలో
  వేరే తీరుగా. _-తినేలా –మ్రింగేలా –బాణాలు విసిరినట్టుగా చూడటం –ఆది వాస్తవం లలిత గారు
  నో –నో అనే పదానికి విలువను –అర్థాన్ని గుర్తించక –జైలు — హత్యలు –శిక్షలు —
  చూస్తున్నాం గా–
  భాగ రాశారు madam
  ==============
  Buchi రెడ్డి గంగుల

 8. Sai Padma says:

  i like your presentation and the way you chiseled and sharpened the gaze.
  yes, right gaze is necessary even in literature too ..to rightly gauze the dynamic market and its nastier trends..!!

  wonderful article lalitha garu

 9. rachakonda. srinivasu says:

  వివరణాత్మకంగా విస్లేష్ణత్మకంగా విమర్సనత్మకమ్గ ా చాలా బాగా చూపుల్ని చిత్రీకరించారు.

 10. శ్రీనివాసుడు says:

  మేల్ గేజ్ కోెసం దుస్తుల విషయంలో ఇలా వుండాలీ అని దర్జీలకు చెప్పి కుట్టిస్తున్నది మా మగవాళ్ళేనా? లేక, వాటి రూపు కల్పన చేసేది కూడా మగ దర్జీలే కాబట్టి వాళ్ళలో ఉన్న పురుషాహంకారమూ, మగ రసజ్ఞతే ఇంత వస్త్ర దృశ్య పురోగతికి కారణమా?
  లేదా, ఇలా దుస్తులు కుట్టాలీ అని గత 40 ఏళ్ళుగా ఆడవాళ్ళే మగ దర్జీలకు చెప్పి, స్వేచ్ఛగా తమ దుస్తులను డిజైనింగ్ చేయిస్తున్నారా?
  సమాజంలోని అన్ని వర్గాల స్త్రీల వస్త్రధారణ గత 40 ఏళ్ళుగా ఎంత పురోగతి సాధించిందీ అనే దాని గురించి. ఇప్పటి నవ యువతుల, మహిళల వస్త్రధారణలో ఆక్షేపించవలసినది ఏమీ లేదా? ( మీకు కొంచెం కష్టమయినా, లేదా అసాధ్యమయినా పర స్త్రీని సగటు మగవాడు ఎలా చూస్తాడో ఆ దృష్టికోణంలోనుండి ఆలోచించడానికి ప్రయత్నించండి.) అలా ఆక్షేపించడానికి, లేదా అది సహజమే అని అంగీకరించడానికి సంపూర్ణ కారణం మా ఎం.సి.పి. బుద్ధేనా?
  హార్మోన్ల మాయను మేల్ గేజ్ కే పరిమితం చేయకూడదేమో? ఈస్ట్రోజెన్ ఇద్దరిలోనూ వుంటుంది.
  ఫిమేల్ గేజ్ కోసం మేల్ గేజ్, మేల్ గేజ్ కోసం ఫిమేల్ గేజ్ వుంటేనే కదా ప్రకృతి సమతౌల్యం?
  *************************************************************
  సుహాసిని మొదటి చిత్రం Nenjathai Killathe లో నటించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది బాబాయ్ కమల్. తనని ఛాయాగ్రాహకురాలిగా చూడాలని ఆయన కల. నటీమణులు చాలామంది వున్నారు, మహిళా ఛాయాగ్రాకురాళ్ళు అస్సలు లేరు. కాబట్టి నువ్వు చదివిన కోర్జులోనే ముందుకెళ్ళమని చాలా గట్టిగానే చెప్పేడు కమల్. విచిత్రమేమంటే పరమ ఛాందసుడైన తండ్రి చారుహాసన్ తాను సినిమాల్లో చేరడానికి ఒప్పుకోవడం. మన అదృష్టం కొద్దీ కమల్ మాట వినలేదు సుహాసిని. గొప్ప నటనని ఆస్వాదించగలిగేం.
  లేకపోతే, ఫిమేల్ గేజ్ కూడా మనం ఆవిడ ద్వారా చూడగలిగేవారమేమో!

 11. Subhashini.N says:

  suuperb analytical essay.u stole d words of my heart n put on paper.really ,literally i felt it.tq for d grt expression LALITHAA. . . . .

 12. కందికొండ says:

  లలిత గారు మీవ్యాసoలో నిజాఇతి ఉంది కాని ఈ మేల్ గేజ్ ఫిమేల్ గేజ్ problem కు సొల్యూషన్ నాకు కనుచూపు మేరలో కనిపించడం లేదు వ్యాసం గొప్పగా ఉంది

 13. Baagundhi

 14. Sudhakar Unudurti says:

  మనదేశపు సినిమా రంగానికి ఎంతో చరిత్ర ఉన్నప్పటికీ, సినిమాలు వస్తూన్నంత ధారాళంగా సద్విమర్శలు రావడంలేదు. తెలుగు సినిమా రంగంలో ఈలోపం మరీ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. నిలదీసే వాళ్లులేకపోయేసరికి ‘చూస్తున్నారుగనకే తీస్తున్నాం’ అనే దబాయింపు నేటికీ కొనసాగుతున్నది. సినిమాల నాణ్యతకు బాక్సాఫీసు విజయం ఏకైక కొలబద్ద అయికూర్చుంది.

  మనుషుల్లోని మంచిని కాదని చెడ్డని మాత్రం డబ్బుగా మార్చుకొనే వ్యాపారం ప్రజాద్రోహమే తప్ప మరోటి కాదు. మరొక్క అడుగు వెనక్కి వెళితే అశ్లీల చిత్రాల దగ్గరకు చేరుతాం.

  ఇటువంటి పరిస్థితుల్లో మిత్రులు లలితగారి వంటి వారు – బహుకొద్దిమంది – చేసే విమర్శనాత్మక విశ్లేషణలు స్పష్టతను ప్రసాదిస్తున్నవి; ఆలోచింపజేస్తున్నవి. ముఖ్యంగా ఈ వ్యాసంలో లలితగారు కొకు విశ్లేషణాత్మకతకు రావిశాస్త్రి చురకల్ని జోడించినట్టుగా తోస్తున్నది. సినిమాలనీ, సమాజాన్నీ, మనుషుల్నీ ఎలా చూడాలో, ఎలా చూడకూడదో – అనే చర్చ ముందుకిసాగే విధంగా మరిన్ని వ్యాసాలూ రచనలూ వారినుండి ఆశిస్తూ, ధన్యవాదాలు.

 15. నిహరిక says:

  సాధారణ గృహిణులు కూడా డిజైనర్ బ్లౌజ్ లతో ఎక్స్పోసింగ్ చేస్తుంటే చూపుతిప్పుకోవడం నావల్లే కావడం లేదు. పాపం మగవాళ్ళు మాత్రం ఒక్కో బ్లౌజ్ కి 10 వేలఖర్చు తలుచుకుని తలదించుకునే నడుస్తున్నారండీ ! పూవులను ఎలా చూపించినా అందంగానే కనపడతాయి. అవార్డ్స్ ఫంక్షన్ లో భారీ శరీరాలతో డాన్స్ చేసే ఆడవాళ్ళనూ చూసాక ఎవరైనా ఈ విషయం మీద వ్రాస్తే బాగుండును అని అనుకున్నాను మీరు వ్రాసిన ఈ వ్యాసం కనిపించింది.
  ఈ దేశంలో ఆడవాళ్ళు ఎక్స్పోజింగ్ చేసే హీరోయిన్స్ ని అనుకరించినట్లుగా ఇంద్రా నూయీ,చందా కొచ్చర్ లాంటి స్త్రీలను ఆదర్శంగా తీసుకోగలిగి వారి స్థాయికి ఎదగగలిగితే మేల్‌గేజ్ తప్పకుండా మారుతుంది. నిండుగా చీర కట్టుకుని లేడీ విలన్స్ (ఇంట్లో టీవీలో చూపించే ఆడవాళ్ళ)కన్నా తీరైన శరీరాకృతితో అలరించే ఆడవాళ్ళు నయం కాదూ ? జీవితం మొత్తం మీద ప్రోస్టిస్ట్యూషన్ చేసి సంపాదించే దానికన్నా తెలివితేటలతో సంపాదించే దానివిలువ ఎక్కువని ఆడవాళ్ళు తెలుసుకోగలిగితే మేల్‌గేజ్ లో మార్పు రాక (మారాలంటే మారక) తప్పదు.

 16. కె.కె. రామయ్య says:

  “ఈ దేశంలో ఆడవాళ్ళు ఇంద్రా నూయీ (పెప్సీ కంపెనీ సీఈఓ), చందా కొచ్చర్ ( ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈఓ ) లాంటి స్త్రీలను ఆదర్శంగా తీసుకోగలిగే స్థాయికి ఎదగగలిగితే మేల్‌గేజ్ లో మార్పు వస్తుంది” అన్న నిహారిక గారికి ధన్యవాదాలు.

 17. మేల్ డోమినేటెడ్ సొసైటి ఉన్నంత వరకు మేల్ గేజ్ మారదు. నిండుగా బట్టలు ధరించిన మహిళలను చూసి మగ వారు మనసు పారేసు కోరా? ఇది కేవలం బ్రమ మాత్రమే ! అన్నీ కాలాలలో అన్నీ రకాల డ్రెస్సెలకు ఆకర్షింపబడిన వారే స్త్రీలు. అంతెందుకు బట్టలు ధరించని కాలం కూడా ఒకటి చరిత్రలో ఉన్నదని మరవ వద్దు. ఆ నాడు ఆకర్షణ లేకుండానే స్త్రీ పురుష సంబందాలు ఉన్నాయా ! సకల కాల సకల అవస్తల్లో ఉన్నదే. కాక పోతే పెట్టుబడి దారి విధానానికి స్త్రీ పురుష ఆకర్షణ తో వ్యాపారం చేసుకోవాలి కాబట్టి రెచ్చ గొట్టుడు ఎక్కువైంది. దాని సహజ మార్గాన దాన్ని పోనివ్వటం లేదు. అందుకే మేల్ గేజ్ ఎక్కువ అవుతుంది.
  నిండుగా చీర కట్టుకున్న మహిళలను చూస్తే గౌరవం ఏర్పడుతుంది అనేది ఒత్తి ఊక!

 18. శ్రీనివాసుడు says:

  ఫి/ రాణిశివశంకర శర్మ????
  ’’మేల్ గేజ్‘‘ అంటే ఇక్కడ చెప్పింది. విపరీతకామదృష్టి అని. అంతేగానీ సహజమైన ఆకర్షణ గురించి కాదు.
  ’’నిండుగా బట్టలు ధరించినంత మాత్రాన మనసు పారేసుకోరా?‘‘
  *********మనస్సు పారేసుకోవడం వేరు, కామాతరుత వేరు.
  ఇక్కడ వ్యాఖ్యాత చెప్పింది అంగాగ ప్రదర్శన వల్ల ఉద్దీపింపబడిన హార్మోన్ల అతిస్పందన గురించి.
  ’’బట్టలు ధరించని కాలం కూడా ఒకటి చరిత్రలో వుందని మరవవద్దు‘‘
  ‘‘‘‘‘‘‘‘‘‘‘ చిత్తకార్తె కుక్కల్లాంటి అనాగరిక నాగరక ప్రవర్తననుండి మనం చాలా పురోగమించాం. మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది ప్రస్తావించినవారి మానసిక స్థితిని బట్టి వుంటుంది.
  ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
  అది సహజమార్గం దారి తప్పడానికి సవాలక్ష కారణాలున్నాయి, పెట్టబడిదారీవిధానం ఒక్కటే కాదు.
  ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
  ’’నిండుగా చీర కట్టుకున్న మహిళలను చూస్తే గౌరవం ఏర్పడుతుందనేది ఒత్తి ఊక’’
  అయితే, స్త్రీ అంగాంగ ప్రదర్శనవల్ల ‘‘చొంగానందల‘‘ మేల్ గేజ్ సంతృప్తి చెందుతుందనేది కూడా ఒత్తి ఊకే.

 19. rani siva sankara sarma says:

  మనం పురోగమించడం కంటె అవగాహనలో వెనకబడిపోతున్నాము. బట్టలు ధరించని ఆదిమ జాతులు అండమాన్ నికోబార్ దీవుల్లోనివసిస్తున్నారని వారిపై పరిశోధనాత్మక గ్రంధం రాసిన కన్నడరచయిత డాక్టర్ అనుపమ గారు నాతో వివరించారు[మే నెలలో ధార్వాడ లో జరిగిన సాహిత్యమేలాకి నేను హాజరు అయినపుడు యీసంభాషణ జరిగింది] ఐతే ఆవిడ ఆ ఆదిమ వాసులలో మనలో వున్న స్వార్థం లేదని చెప్పారు. స్త్రీని ఆస్తిగా భావించే కుసంస్కారం[ మన నాగరికులలోలా ] వారిలో లేదని చెప్పారు.ఆదిమ జాతుల్ని చిత్త కార్తె కుక్కలని అవమానించడం తగదు. అది నాగరిక కుసంస్కారం దురహంకారం మాత్రమే.మార్కెట్టు సంస్కృతే చిత్త కార్తి కుక్క . లలితా గారి అభిప్రాయం అదేననుకొంటా.
  17వ శతాబ్దిలో కృష్ణాధ్వరి అనేపండితుడు విశ్వగుణాదర్శ చంపూ అనే సంస్కృత గ్రంధం రాశాడు. భారత ఖండంలోని వివిధప్రాంతాల ఆచార వ్యవరాల గురించి చర్చించాడు. దానిలో ఆదిమ జాతుల వేషధారణ గురించి ప్రస్తావిస్తూ వారు జాకెట్టు ధరించకపోవడం శ్రుంగార వుద్దీపకం అని కొందరు అన్న మాటని ఖండించాడు. పెదవులు మాత్రం శృంగార వుద్దీపకాలు కావా అని ప్రశ్నించాడు .లలిత గార కూడా నగ్నత్వాన్ని సినిమాల్లో చూపడం కూడా దాన్ని చూపెసందర్భం, తీరులని బట్టి మేల్ గేజ్ గా మారుతుంది అసభ్యంగా ధ్వనిస్తుంది అని విశాల దృష్టితో విశ్లేషించారు

 20. rani siva sankara sarma says:

  కుక్క ఉపమానంకూడా సరికాదు. మేల్ గేజ్ అనేది నాగరికత సృష్టించిన కృత్రిమప్రక్రియ. అది సహజ ఆకర్షణకి సంబంధి ం చిన పదం కాదు

 21. శ్రీనివాసుడు says:

  నేనన్న వ్యాఖ్యని ఇలా కూడా వక్రీకరించవచ్చన్నమాట.
  నేనన్నది ఇది.
  ‘‘చిత్తకార్తె కుక్కల్లాంటి అనాగరిక నాగరక ప్రవర్తననుండి మనం చాలా పురోగమించాం. మళ్ళీ వెనక్కి వెళ్ళడం అనేది ప్రస్తావించినవారి మానసిక స్థితిని బట్టి వుంటుంది.‘‘
  ఇదీ నేన్ననది. మానవ ప్రస్థానంలో జంతువుల్లాగానే బ్రతికిన దశలు లేవా? నేనన్న ఈ వ్యాఖ్యలో బట్టలు ధరించని ఆదిమజాతుల ప్రస్తావన వున్నదా? వారిని చిత్తకార్తె కుక్కలు అని నేనన్నానా? ఇంతకంటే మోసం, కుసంస్కారం ఏమైనావుందా? నేనన్నది అనాగరిక నాగరక ప్రవర్తన గురించి, బట్టలు ధరించడం, ధరించకపోవడం గురించి కాదు. ఇలా బురదజల్లడాన్నే ’’అనాగరిక కుసంస్కారం‘‘ అంటారు.
  ************************
  ’’మార్కెట్ సంస్కృతే చిత్తకార్తె కుక్క.‘‘
  కరెక్టే, కానీ, ఆ మార్కెట్ సంస్కృతిలో నిలువెల్లా మునిగి, బ్రతుకుతున్నవారిని మరి ఎలా పిలవాలి?
  ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
  సినిమాలోని నగ్నత్వం చూసి కలిగే స్పందన ఆ సన్నివేశ సందర్భం, తీరుతోబాటుగా చూసేవాడి వయస్సు, చదువు, పరిణతి, ప్రాంతం, సంస్కృతి వంటి అనేక అనేక అంశాలుంటాయి. అలా తీసిన సినిమాని భారతదేశంలోని చూసిన మగవారిని అది
  ఒకేరకంగా ఉద్దీపింపజేయదు. ప్రాంతాన్ని బట్టి మేల్ గేజ్ మారుతుంది.

 22. rani siva sankara sarma says:

  జంతువులని కించపరిచి, తర్వాత మన ఆదిమ పూర్వీకులని వారిని పోలిన నేటి ఆదిమ జాతులనీ అవమానించవద్దని మనవి. మేల్ గేజ్కి వాళ్లకీ సంబంధం లేదు. పూర్వం మాతృస్వామ్య సంస్కృతులు కూడా పరిఢవిల్లాయి.

 23. rani siva sankara sarma says:

  మన పూర్వీకులు మేల్ గేజ్ తో కాక మాతృస్వామ్యంలో జీవించారు అనే ప్రస్తావన ద్వారా,కుహనా నాగరీకులు వారికి అంట గట్టిన నీచత్వాన్ని తొలగించాను అంతే.[ నాకు వేరే పేరు అంట గడుతున్నట్లే ]

 24. మనవి:

  1. ఎంత ప్రచురణ యోగ్యత వున్నా, మారుపేర్ల వ్యాఖ్యల్ని ఇక ముందు తొలగిస్తున్నాం.
  2. వ్యక్తిగత వ్యాఖ్యలూ, అలాగే, రచనతో సంబంధం లేని వ్యాఖ్యల్ని కూడా తొలగిస్తున్నాం.
  3. వ్యాఖ్యల తొలగింపు మీద ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకూ తావు లేదు. వ్యాఖ్య తొలగించామూ అంటే, నిర్మొహమాటంగా ఆ వ్యాఖ్య మాకు అక్కర్లేదనే!

  • శ్రీనివాసుడు says:

   ధన్యవాదాలు ఎడిటర్ గారూ!
   మారుపేర్లతో వ్రాసేవాళ్ళను తొలగించడానికి మీరు నిర్ణయం తీసుకోవడం ముదావహం. ఒక నిజాయితీగల వాతావరణంలో వ్యాఖ్యలు చేయడానికి తగిన వాతావరణాన్ని కల్పించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను.

 25. Dr. Rajendra Prasad Chimata says:

  మీరు చివరికి సత్యాన్ని గ్రహించారు. అంతా మార్కెట్ నిర్ణయిస్తోంది. ఇంకొక శాస్త్రీయమైన విషయం: మేల్ గేజ్ కి కారణం బయోలాజికల్ మేకప్. ఇన్స్టింక్ట్. నాగరికత, పెంపకం ప్రవర్తనను కంట్రోల్ చేస్తుంది.

 26. paresh n doshi says:

  వ్యాసం బాగుంది.
  కొంత జోడించాలనిపించింది.
  1. మేల్ గేజ్ మొదటినుంచే వుంది. ఈ మధ్య సినిమాలలో మగవాళ్ళను కూడా ఫీ/మేల్ గేజ్ కు గురి చెస్తున్నారు. They are catering to basic instincts, to make money.
  2. రాజ్ కపూర్ సినిమాలలో bosom-baring scenes తీసేసినా soul intact గా వుంటుంది. మనం కూడా
  western films accept చేసి రాజ్ కపూర్ని మాత్రము విమర్శించాం.
  3.ఆడవాళ్ళు కూడా మగవాళ్ళలా ఆలోచించే వాళ్ళున్నారు. వరసకు అక్క వొకసారి “మాధురి దీక్షిత్ ఇక లాభం లేదు. ముసలిదై పొయింది” అంది.

 27. రచయిత సునిశిత పరిశీలనకు,అద్భుతమైన విశ్లేషణకు జోహార్లు.
  మేల్గేజ్,ఫిమేల్ గేజ్ లను మార్కెట్ గేజ్ ఉపయోగించుకుంటుందనేది
  నూటికి నూరు పాళ్ళూ సత్యం.excellent రైతుప్(Y )

 28. ఈ వ్యాసాన్ని భూమికలో ప్రచురించడానికి అనుమతి ఇస్తారా?

మీ మాటలు

*