కృత్రిమ నక్షత్రం

mandira1

Art: Mandira Bhaduri

 

-అరుణ నారదభట్ల

~

మనసు ఓ అంతరిక్షకేంద్రం
స్పందనలన్నీ బంధనాలు
సృష్టితత్వం బోధపడ్డట్టు జీవనసరళి
అంతటా జ్ఞానోదయపు రావిచెట్లు
అవసరాల ప్రేమ భాషణాలు

కంప్యూటర్ చిప్ లా
ఎన్ని జ్ఞాపకాలనో పోగేస్తూ వస్తున్నాం
నచ్చనివి డిలిట్ చేయడానికి
తేలికపాటి కీబోర్డ్ కాదు నడక
ఎన్నిసార్లు రీఫ్రెష్ నొక్కినా
రీసైకిల్ బిన్ ఒకటుంటుంది
వైరస్ ని సృస్టించడానికి

ఆక్సీజన్ సరిపోదక్కడ
శూన్యం ఆవహిస్తుంది
ప్రాణాయామం చేయాలనుకుంటాం
కార్బన్ మొనాక్సైడ్ నరనరాల్లోని
రక్తంలో జీర్ణించుకుపోయి
ఊపిరాడదు

నైట్రస్ ఆక్సైడ్ విడుదల్లయ్యే సన్నివేశాలు
కేంద్రానికి అందనంత దూరంలో
కనిపెట్టలేని ఉల్కాపాతాలు
అదే సూర్యుడు అవే నక్షత్రాలు
అవే గ్రహాలు
మార్పులన్నీ దూరభారాలు

గ్రహశకలల్లాంటి కొన్ని
అనుకోని సంఘటనలు
కృత్రిమంగా మెరిసే
అంతరిక్ష నక్షత్రం
నిరంతరం స్కానింగ్

ఆకాశంలోకి విసిరేసిన బంతి మనసు
మళ్ళీ భూమినే చేరుతుంది
గురుత్వాకర్షణ సిద్ధాంతం నమ్ముకున్నాం గనక
భూమికీ మనకూ తేడా ఏం లేదు
అదే మట్టి దేహం
అవే నీళ్ళు
అదే అగ్ని
అదే మనసు గాలి

మొక్కలను నరికేస్తే పడే బాధే మనసుది
నచ్చదు కదా
ఊష్ణం…లోనంతా ఊష్ణం పైనంతా ఊష్ణం
పచ్చదనం కరువయ్యాక
భూమి అక్కడక్కడా బద్దలవుతూ
లావాను సునామీలనూ సృష్టిస్తునే ఉంటుంది
ఇలా ఎంతదాకా అంటావా
గురుత్వాకర్షణ ఉన్నంతవరకు

*

మీ మాటలు

 1. Vaadhoolasa says:

  అత్యంత ఆధునికంగా ఉంది.అభినందనలు.

 2. rani siva sankara sarma says:

  కవిత బాగుంది. సంక్లిష్ట అంశాలు సరళంగా వ్యక్తీకరించబడ్డాయి

 3. wilsonrao Kommavarapu says:

  పరిమళ భరిత కవిత్వం చదివిన అనుభూతి మిగిలింది అరుణ గారు

 4. Aruna Naradabatla says:

  thankyou verymuch Wilsonrao Kommavarapu gaaru

మీ మాటలు

*