పండు వెన్నెల…ప్రతి చోటా!

 

 

-చందు తులసి 

~

ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వ్యాప్తిలో వున్న ఓ పోస్టు….
ఓ పాప వాళ్లమ్మను అడిగిందట…..
”అమ్మా…మీరు మన బీరువా తాళాలు మన ఇంటి పనిమనిషికి ఎందుకివ్వరు…?” అని…తల్లి ఆశ్చర్యపోయింది. ఐనా అడిగింది తన చిన్నారి తల్లి కాబట్టి ఓపికగా….
” నువ్వు చిన్నపిల్లవు కదా…నీకు తెలీదమ్మా. అలా ఇవ్వకూడదు …”అని చెప్పింది.
 

మళ్లీ ఇంకో ప్రశ్న.
”పోనీ మీ ఏటీఎమ్ కార్డు…మన వంటమనిషికి ఎందుకివ్వవు…?”
తల్లి ఈ సారి…ఆశ్చర్యపోతూనే కోప్పడింది.
”నీకు ఇపుడు చెప్పినా అర్థం కాదమ్మా…చిన్న పిల్లవు కదా”  అంది.
” పోనీ మన దగ్గర ఎంత డబ్బు ఉందో మన ఇంట్లో పనిచేసే తోటమాలికి ఎపుడైనా చెప్పావా..?”
 

ఈ సారి తల్లికి విసుగు, అంతకన్నా కోపం వచ్చింది.
” వొక్క సారి చెబితే అర్ధం కాదా.. మన దగ్గరున్న విలువైన వస్తువుల గురించి పరాయివాళ్లకు చెబుతామా..? చెబితే వాళ్లు దోచుకోరూ…”అంది.
” డబ్బులు, ఏటీఎమ్ కార్డులు, మాత్రం జాగ్రత్తగా చూసుకుంటారు. మరి నన్ను మాత్రం ఎందుకు ఆయా దగ్గర వదిలేసి వెళతారు.  నేను మీకు విలువైన దాన్ని కానా..? ”  అని ఏడుస్తూ అడిగిందట చిన్నారి.

***
కొంత అతిశయోక్తిగా అనిపించినా……ఆ పాప అడిగిన ప్రశ్నలో మాత్రం నిజం వుంది.  ఆ ప్రశ్న కేవలం ఆ చిన్నారిదే కాదు. మన సమాజంలోని అందరి చిన్నారులది.  కారణాలేవైనా కావచ్చు కానీ ఇవాళ అన్నిటికన్నా ఎక్కువగా నిర్లక్ష్యం చేయబడుతోంది బాల్యం.
సరైన తిండి పెట్టక పోవడం, వయసుకు మించిన పని చేయించడం, చిత్రహింసలు పెట్టడం….ఎంత నేరమో వాళ్లకు అవసరమైన జ్ఞానాన్ని అందించకపోవడమూ అంతే నేరం. వాళ్ల ఆలోచనలను పట్టించుకోకపోవడం, వాళ్లను సక్రమ మార్గంలో తీర్చిదిద్దక పోవడమూ అంతే నేరం.
పిల్లలంటే కేవలం…ఇంటర్నేషనల్, టెక్నో, కాన్సెప్ట్….ఇలా రకరకాల ముసుగులు తగిలించుకొన్న కార్పోరేట్ కోళ్లఫారాల్ని నింపడానికే పుట్టే అభాగ్యులు కాదు కదా….??
తల్లిదండ్రుల సాధించలేని కోరికలు,  సాధించి పెట్టడానికి దొరికిన కోరికల కొనసాగింపులూ కాదు కదా……??
మరో ఇరవై ఏళ్ల తర్వాత…..మల్టీ నేషనల్ కంపెనీల అవసరాలు తీర్చడం కోసం….తయారవుతున్న రోబోలు కాదు కదా..! …??
 

హరివిల్లుపై జారాలనో, నెలవంకకు ఊయల కట్టి ఊగాలనో…వెన్నెల్లో గోరు ముద్దలు తినాలనో కాకున్నా…..
అమ్మా నాన్నతో కబుర్లు చెప్పాలనో, నాన్నమ్మ, తాత దగ్గర కథలు వినాలనో….లేదా తమకు నచ్చినట్లు తామే కథలు చెప్పుకోవాలనో ఉంటుంది కదా….!
పిల్లలకూ ఆలోచనలుంటాయని, వాళ్లకూ అంతులేని సృజన ఉంటుందనీ ఎవరు గుర్తించాలి…? అవకాశం ఇవ్వాలే కానీ వాళ్లూ సృజనాత్మకత విషయంలో పెద్దవాళ్లకూ తీసిపోరని ఎవరు నిరూపించాలి…? పంజరాల్లాంటి తరగతి గదుల్లోంచి బయటకు తీసుకొచ్చి…. పాఠాలు, పంతుళ్లు, పుస్తకాలకు అందనంత దూరంగా తీసుకెళ్లి, ఓ పెన్నూ పేపరూ ఇచ్చి…. ” పిల్లలూ మీకోసం మీరే ఏం రాసుకుంటారో రాసుకోండర్రా”  అని అంటే….పిల్లలు ఏం రాస్తారు…? ” పిల్లలూ మీకు రెక్కలొచ్చాయి అనుకోండి….అపుడేం చేస్తారు….” అని అడిగామే అనుకోండి. ఊహకైనా అందని ఆ ఆనందాన్ని పిల్లలు ఎలా పంచుకుంటారు.? అలాంటి అబ్బుర పరిచే ఆలోచనల సమాహారమే  సంస్కృతి పబ్లికేషన్ ప్రచురించిన పండు వెన్నెల పుస్తకం. తమ లాంటి చిన్నారుల కోసం…తామే కవులూ, రచయితలూ అయిపోయి కలాలు భుజాన వేసుకుని రచనల సంకలనం.  ఇంతకీ ఈ పండు వెన్నెల ఎలా మొదలైందో చెప్పాలంటే ఓ నెల వెనక్కు వెళ్లాలి.
 

చిన్నారుల్లో దాగి ఉన్న సాహిత్యాభిలాషను, అభిరుచులను, కళలను వెలికి తీసేందుకు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు సంస్కృతి గ్లోబల్ స్కూల్ యాజమాన్యం నవతరంతో యువతరం అని ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమాన్నంతా భుజాల మీద మోసింది  ప్రముఖ కథా రచయిత్రి  డా. కె.ఎన్. మల్లీశ్వరి ( ప్రజాస్వామిక రచయితల వేదిక),  కత్తి పద్మ ( మహిళా చేతన సంస్థ),  నిశాంత్ లు. చిన్నారి సాహిత్య కారులు….యువతరం రచయితలతో సమ్మేళనం చేసే ఈ కార్యక్రమంలో సీనియర్ రచయితలూ చాలామంది పాల్గొని తమ ఆలోచనలూ పంచుకున్నారు.
 

కేవలం కథలు చదవడం, రాయడం…వాటి గురించి చర్చించడమే కాదు. పక్కనే ఉన్న గిరిజన ప్రాంతాన్ని సందర్శించారు. దోపిడీని ప్రతిఘటిస్తున్నందుకు అణచివేతను ఎదుర్కొంటున్న అడవిబిడ్డలతో మీకు తోడుగా మేమున్నాం…అని ధైర్యం చెప్పారు.  ఇలా సాహిత్యం, సామాజిక స్పృహ కలగలిసిన ఈ కార్యక్రమం  కేవలం విశాఖ జనాన్నే కాకుండా….తెలుగు సాహిత్య కారులందరినీ ఆకట్టుకున్నది.
 
ఆ నవతరంతో యువతరం కార్యక్రమంలో పాల్గొన్న నేటి, రేపటి తరం సాహిత్య కారుల ఆలోచనలని పండు వెన్నెల పేరుతో ప్రచురించింది సంస్కృతీ పబ్లికేషన్ సంస్థ. ఈ పుస్తకంలో అనుభవాలే కాకుండా బాల రచయితల కథలు, కవితలు కూడా ఉన్నాయి. రాసింది చిన్నారులే ఐనా ….పెద్ద రచయితలకు తామే మాత్రమూ తీసిపోమని నిరూపించారు.
 

కంటనీరు కూడా కలుషితమవుతున్న కాలమిది…అంటూ తన కవితలో ఆవేదన వ్యక్తం చేస్తుంది సోనా-శాంతి. సాహిత్య కారులు ఎటువైపు నిలబడాలో సూచిస్తాడు పృధ్వీ.  పెన్నుతో కాదు భావోద్వేగంతో రాస్తున్నానంటాడు జస్వంత్.   ప్రకృతి విధ్వంసాన్ని ప్రశ్నిస్తుంది…. మన్విత.   అంతం కాదిది ఆరంభం అంటుంది మహాలక్ష్మి. శ్రీశ్రీని గాఢంగా అభిమానించడమే
కాదు…శ్రీశ్రీలా కవిని అవుతానంటాడు మరో చిన్నారి. ఇలా ఈ బుల్లి సాహిత్య కారులు తమ రచనల్లో వయసుకు మించిన పరిణతి ప్రదర్శించారు.  చిన్నారులతో పాటూ కార్యక్రమంలో పాల్గొన్న యువ రచయితలు, సీనియర్ రచయితలూ తమ అనుభవాలనూ, పరిశీలనలూ వివరించారు.
 
సంపాదకులు చెప్పినట్లు ఈ పుస్తకం బాల సాహిత్యం మాత్రమే కాదు…పెద్దల సాహిత్యమూ కాదు. ఈ పుస్తకం విడి విడిగా రాసిన రచనల సంకలనమూ కాదు. అందరి ఆలోచనల సమాహారం.  ప్రతీ పేజీని అందంగా,  చిత్రాలతో రూపొందించడం వల్ల
పిల్లలను ఆకట్టుకుంటుంది.

చివరగా ..ఇలా రేపటి తరం సాహిత్య కారులను గుర్తించి, వారికి సానబెట్టి సమాజానికి అందించే అరుదైన కార్యక్రమాలు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ముఖ్యంగా …ప్రభుత్వ పాఠశాలల్లో చేపడితే ఎంతో మేలు జరుగుతుంది. తెలుగు నాట అనేక సాహిత్య కార్యక్రమాలు జరుగుతుండడం అందరికీ తెలిసిందే. సన్మానాలు, అభినందన సభల కన్నా…ఇటువంటి కార్యక్రమాల వల్ల సాహిత్యానికి ఉపయోగం. సాహిత్య సంస్థలు, సాహిత్య కారులు  దృష్టి సారించాల్సిన విషయమిది.

(ఈ నెల 16వ తేదీన విశాఖలో పండు వెన్నెల పుస్తకం ఆవిష్కరణ సభ సందర్భంగా…..)

మీ మాటలు

 1. మల్లీశ్వరి says:

  పండువెన్నెలపై మొదటి సమీక్ష!
  చందుతులసి మీరు నవతరంతో యువతరం కార్యక్రమానికి రాలేకపోయారన్న వెలితి మాకందరికీ ఉండేది. వచ్చి చూసినంత బాగా పండువెన్నెలని ఇట్లా మనసులోకి తీసుకుని రాయడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. థాంక్ యూ వెరీమచ్. పండువెన్నెలకి ఇంత చోటు ఇచ్చినందుకు సారంగ టీం కి ధన్యవాదాలు

  • మల్లీశ్వరి గారూ మీకు తెలీదేమో –
   చందుకు ” ఇదిగో వెన్నెల రేఖ ” అని చూపించండి – ఆయన చంద్రున్ని మింగేయక పోతే అడగండి – అంత తెలివైన వాడు. మనం కళ్ళతో చూసిన్ది తను మనసుతో చూడగలడు కాబట్టి ఈ మాత్రం రాసినందుకు తమరు అంతగా ఇదయి పోనక్కర లేదు – చందు మనకు దొరికిన ఒక వరం – అంతే , మాటల్లేవ్!

 2. Anil battula says:

  ఈ ఉదయాన , మీ సమీక్ష ద్వార పండు వెన్నెల కురిపించావు చందు తులసి…పుస్తకావిష్కరణకు శుభాకాంక్షలు…

 3. m.viswanadhareddy says:

  ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వ్యాప్తిలో వున్న ఓ పోస్టు….
  ఓ పాప వాళ్లమ్మను అడిగిందట…..
  ”అమ్మా…మీరు మన బీరువా తాళాలు మన ఇంటి పనిమనిషికి ఎందుకివ్వరు…?” అని…తల్లి ఆశ్చర్యపోయింది. ఐనా అడిగింది తన చిన్నారి తల్లి కాబట్టి ఓపికగా….
  ” నువ్వు చిన్నపిల్లవు కదా…నీకు తెలీదమ్మా. అలా ఇవ్వకూడదు …”అని చెప్పింది.

  మళ్లీ ఇంకో ప్రశ్న.
  ”పోనీ మీ ఏటీఎమ్ కార్డు…మన వంటమనిషికి ఎందుకివ్వవు…?”
  తల్లి ఈ సారి…ఆశ్చర్యపోతూనే కోప్పడింది.
  ”నీకు ఇపుడు చెప్పినా అర్థం కాదమ్మా…చిన్న పిల్లవు కదా” అంది.
  ” పోనీ మన దగ్గర ఎంత డబ్బు ఉందో మన ఇంట్లో పనిచేసే తోటమాలికి ఎపుడైనా చెప్పావా..?”

  ఈ సారి తల్లికి విసుగు, అంతకన్నా కోపం వచ్చింది.
  ” వొక్క సారి చెబితే అర్ధం కాదా.. మన దగ్గరున్న విలువైన వస్తువుల గురించి పరాయివాళ్లకు చెబుతామా..? చెబితే వాళ్లు దోచుకోరూ…”అంది.
  ” డబ్బులు, ఏటీఎమ్ కార్డులు, మాత్రం జాగ్రత్తగా చూసుకుంటారు. మరి నన్ను మాత్రం ఎందుకు ఆయా దగ్గర వదిలేసి వెళతారు. నేను మీకు విలువైన దాన్ని కానా..? ” అని ఏడుస్తూ అడిగిందట చిన్నారి. wonder full visuval about child

 4. కొట్టంరామకృష్ణారెడ్డి says:

  చందూ…..
  కళ్లకు, మనసుకూ కట్టినట్టు, ఆకుట్టుకునే సమీక్ష . చాలా రోజుల తరువాత హాయి నిచ్చిన రచనా సమీక్ష . చాలా బావుంది.

 5. అనిల్ డ్యాని says:

  నిజంగా నవతరం తో యువతరం ఒక మంచి కార్యక్రమం , ఒక సజీవ సమస్య దగ్గరకి పిల్లలని తీసుకు వెళితే అక్కడ ఆ వాస్తవికతని పిల్లలు అర్ధం చేసుకోవడానికి వీలుంటుందని చేసిన ప్రయత్నం ఇది . ఇది కొంత సత్ఫలితాన్ని ఇచ్చింది ..ఐతే ఆ క్రమం మొత్తాన్నీ అక్షరీకరించి పుస్తకం రూపంలో తేవడం వెనుక ప్రరవే , మల్లీ మేడం , కత్తి పద్మ గారు , యంగ్ అండ్ డైనమిక్ నిషాంత్ ల కృషి అభినందనీయం …..మీ సమీక్ష బావుంది చందూ జీ మీరు అప్పుడు లేకపోతెనేం మళ్ళీ త్వరలోనే మరో కార్యక్రమంలో కలుద్దాం …ఈ కార్యక్రమం లో ఈ పుస్తకం లో నాకూ ఒక పేజీ కేటాయించినందుకు ధన్యవాదాలు …ఇలాంటి మంచి సమీక్షని అంగీకరించినందుకు సారంగకి కృతజ్ఞతలు

 6. మానస says:

  చాలా బాగా రాసారు చందు. ఇది చదివినా పెద్దల మనసులు మారితే బాగుణ్ను. నవతరంతో యువతరంలో భాగమైన్దందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకు కారణమైన వారందరికీ ఎన్నో కృతజ్ఞతలు.

 7. అరణ్యకృష్ణ says:

  మీరు రాసిన విెధానాన్ని బట్టి నాకు అర్ధమైందేంటంటే మేం మిమ్మల్ని ఆ ప్రోగ్రాంలో మిస్ అయ్యాం.

 8. కె.కె. రామయ్య says:

  చిన్నారుల్లో దాగి ఉన్న సాహిత్యాభిలాషను, అభిరుచులను, కళలను వెలికి తీసేందుకు … సాహిత్యం, సామాజిక స్పృహ కలగలిసిన “నవతరంతో యువతరం” కార్యక్రమాన్ని విశాఖలో నిర్వహించిన ప్రముఖ కథా రచయిత్రి డా. కె.ఎన్. మల్లీశ్వరి ( ప్రజాస్వామిక రచయితల వేదిక), కత్తి పద్మ (మహిళా చేతన సంస్థ) గార్లకు హార్దికాభినందనలు.

  అస్మిత సంస్థ తరపున త్రిపుర గారమ్మాయి ప్రొ. వింధ్య గారూ వాళ్లు కొత్తగూడెం వగైరా ప్రాంతాలలో నిర్వహించే “బాలోత్సవమ్ ” లాంటిదేనా ఈ కార్యక్రమం?

  విశాఖలో జరిగిన ” నవతరంతో యువతరం ” కార్యక్రమ వివరాలన్నీ కళ్లకు కట్టినట్టు, వెన్నెల్లో గోరు ముద్దలు తినిపించినట్లు రాసి గజ సీనియర్ దీవెనలు అందుకున్న చందుకీ శుభాభినందనలు. ( వినయం, వొందనం, గజపెద్దల పట్ల గౌరవమ్, వాళెప్పుడైనా రాగింగ్ చేసినా వోర్చుకోగల నిదానం … జీవితంలో పై కోస్తావప్పా చందూ ).

  • మీకు అభినందన కీ , రాగింగ్ కీ తేడా తెలీదా రామయ్య గారూ ? పాపం, చందు పసిపిల్లాడు! అతని మనసు నవనీతం – అనవసరంగా ఎందుకు “కొర్రు ” ఎక్కిస్తారు?

 9. కె.కె. రామయ్య says:

  చంద్ర’ చాపానికి కొర్రు వేసింది అనే అర్ధంలో “కొర్రు” అనే పదాన్ని జ్ఞప్తికి తెచ్చిన గొరుసన్నకు మంగిడీలు.

  “ఆంధ్ర శబ్ద చింతామణి కర్రుకు ఇచ్చిన అర్థం నాగలి మేకు. శబ్ద రత్నాకరం కొర్రు (కొఱ్ఱు)కు ఇచ్చిన అర్థం మేకు, శూలము. ఒకడు ఒక పనిని జరగకుండా అడ్డుపుల్ల వేసిన సందర్భంలో వాడు కొర్రేసినాడు అని వ్యక్తీకరిస్తారు. ఆకాశంలో హరివిల్లు కన్పిస్తే అది వాన రావడానికి అడ్డంకిగా చెప్పుకుంటారు ప్రజలు. ఈ అడ్డుపడే అర్థంలోనే ఇంద్రచాపాన్ని కొర్రు ఒడ్డింది, కొర్రు వేసింది, కొర్రేసింది అని మాట్లాడుకుంటారు ” ~ బండి నారాయణ స్వామి, త్రిపుర గారి అభిమాని ( రాయలసీమ అట్టడుగువర్గాల జన జీవితాన్ని ప్రజా సంస్కృతిని కరువు ఫ్యాక్షనిజంలాంటి అనేకానేక సమస్యల్ని కథలుగా నవలలుగా అక్షరీకరించిన కథన శిల్పి)

 10. Amarendra Dasari says:

  ఇది ‘పండు వెన్నెల ‘ గురించి కాదు..
  ఈ వ్యాసం మొదట్లో ఉటంకించిన anecdote గురించి..
  “డబ్బులూ, ఎటిఎం కార్డుల కన్నా నేను విలువైన దానిని కానా ” అన్నది ఆ పాప ప్రశ్న…”ఆ ప్రశ్నలో నిజం ఉంది ” అన్నది వ్యాసకర్త వ్యాఖ్య..
  ఈ మొత్తం పిట్టకతలో ” పిల్లల్ని సహాయకుల దగ్గర వదిలి వెళ్ళడం డబ్బు కోసమే ” అన్న నింద ఉంది …”పిల్లల కోసం తల్లులు- (ఈ ప్రశ్న ఆ పాప తల్లినే అడిగింది, నాన్న ను కాదు ) తమతమ వ్రుత్తి వ్యాపకాలను ‘త్యాగం’ చెయ్యాలనే డిమాండ్ ఉంది ..
  మొదటిది prejudice తో నిండిన లోతు లేని అవగాహన
  రెండోది మనకు తెలియకుండానే వ్యవస్థ మనలో ప్రవేశ పెట్టిన దుర్మార్గపు ఆలోచన.!
  నిజానికి వెయ్యవలసిన ప్రశ్న అదికాదు..”నన్ను అంత నమ్మకం గా వదిలి వెళ్ళిన మీరు డబ్బులూ, ఎటిఎం కార్డూ ఎందుకు వదిలి వెల్లరూ?” అని అడగాలి. మనిషిని ఎందుకు నమ్మరూ అని అడగాలి…మనల్ని మనం నిలదీసుకోవాలి
  PS : చిన్నప్పుడు అమ్మ ఉద్యోగానికి వెళితే ‘సహాయకుల ‘ దగ్గర పెరిగిన అనుభవం నాకు ఉంది..అదో పెద్ద కథ…

 11. చందు చాల బంగుంది.. మీ సమీక్ష …

 12. RAJESH YALLA says:

  చందు గారూ చాలా బాగా సమీక్షించారు. ఒక సమీక్షలా కాకుండా ఓ అందమైన కథలా సాగింది మీ సమీక్ష! అభినందనలు.

 13. rajyalakshmi says:

  వెరీ నైస్ చాలా బాగుంది మీ సమీక్ష.

 14. రచయిత గారు మీరు పిల్లల మనస్తత్వాన్ని ఎంత బాగా విశ్లేషించారు…… మారుతున్న మనిషి జీవిత ప్రమాణాల్లో మనషుల మధ్య బంధాలు… కేవలం అవసరాల కోసమే అన్నట్లు గా.. మీరు సృజించిన కోణం చాల అభినందనీయం… రాబిన్ద్రనాథ్ ఠాగూర్ మాటల్లో చిన్నారుల మనసు కోమలమైంది వారిని ఎండా నీడ కలిసే చోట హాయిగా ఆడుకోనివ్వండి అని చెప్పిన మాటలు గురుతుకొచ్చాయి అద్భుతంగా సృజించారు మీకు అభినందనలు

మీ మాటలు

*