మన కవిత్వం ఇంకా సుఖ జీవన సౌ౦దర్యమేనా ?

 

-కొండేపూడి నిర్మల

~

 

నిర్మల

ఇటీవల ఉత్తర తెలుగు అమెరికా  అసోసియేషన్  తెలుగు కవిత నూతన దృక్కోణం అనే విషయం మీద సెమినార్ నిర్వహించింది. భిన్న అస్తిత్వాలు వస్తు రూపాలు అనే విషయం మీద నేను ప్రసంగించాల్సి వుంది. అఫ్సర్, నారాయణ స్వామి, విన్నకోట రవిశంకర్ , పాలపర్తి ఇంద్రాణి మిగిలిన వక్తలు. మొదటి ప్రసంగం చేసిన ఇంద్రాణి  “కవిత్వానికి ప్రేరణ” గురించి మాట్లాడింది. పనిలో పనిగా  అస్తిత్వవాదులకు కొన్ని చురకలు వెయ్యడానికి నిర్ణయించుకుంది. మెత్తని మృదువైన కవిత్వం రాస్తూ, అనుభూతి, ఆహ్లాదము  కవితా లక్ష్యం గా వున్న ఈ కవయిత్రి  శబ్దానుకరణ విద్యలో అల్లసాని పెద్దన వంటిదని ఆమె పుస్తకానికి ముందు మాటలో మరొక కవి కితాబు ఇచ్చారు.

అల్లసాని పెద్దన అనగానే మనకు గుర్తొచ్చే పద్యం “తూగుటుయాల, రమణి ప్రియ దూతిక తెచ్చి ఇచ్చు కప్పురపు విడేము, ఉహ తెలియంగల లేఖక పాటకోత్తములు -కవితా రచనకు కనీస అవసరాలు అని కదా. అంత కాకపోయినా ఈ ఆధునిక కవయిత్రికి కూడా  ప్రేరకాలుగా కొన్ని సదుపాయాలు౦డాలట,

“మ౦చి కవి మిత్రులు, సరళమైన జీవన విధానం, ప్రకృతితో మమేకం, ఈ అన్నిటితో కూడిన ఏకాంతం” ఇందులో ఎవరికీ అభ్యంతరం లేదు. ఆ మాటకొస్తే కవిత్వం రాయడానికే కాదు బిడ్డకు పాలిచ్చే కూలి తల్లికి , మగ్గంమీద బట్ట నేస్తున్న ముసలి తాతకి కూడా ఏకాంతం అవసరమే..

అది కాక కవిత్వాన్ని ఆటంకపరుస్తూ, చికాకు పెట్టే విషయాల చిట్టా కూడా మన ముందు వుంచింది. అదేమిటంటే,

“కవి నిరంతర అధ్యయనపరుడు కావాలి కాని సదరు  పుస్తకాలు  ప్రసంగాలో, సిద్ధాంతాల పట్ల ఆకర్షణ పెంచేవో కాకూడదు. నేను ఫలానా బాధిత వర్గానికి చెందిన స్త్రీని , ఫలానా మతానికి, కులానికి ప్రతినిధిని అని కూడా భావించరాదు. అప్పుడు అది మీ పరిమితిని సూచిస్తుంది.. మార్పులు, వయసు  పెరగడం , అనుభవాలను సృష్టించుకోవడం (?) కూడా కాని పనులే, ఉద్యమకారులు ఉద్యమాలు చేసుకోవాలి కాని కవులవడానికి వీల్లేదు.”

ఇవి   కేవలం వ్యక్తిగత అభిప్రాయాల్లాగా చెబితే ఈ చర్చ  అవసరం లేదు, కాని ఆర్కిమెడిస్ సిద్దాంతంలాగా ఖచ్చితమైన స్వరంతో చెప్పింది. కాబట్టి ఇటువంటి ప్రకటనల పట్లా, వాటి వెనక వున్న  భావజాలం పట్లా నాకున్న స౦దేహల్ని మీతో పంచుకొవాలను కుంటున్నాను.

ఇవికాక ప్రసంగం లో, తన వస్తు ప్రాధాన్యత  గురించి చెబుతూ,  గుడి దగ్గర పూలు అమ్ముకునే అమ్మాయి జ్వరంగా వుంటే తను జ్వరం గురించే రాస్తానని చెప్పింది, జ్వరం పక్కన పెట్టి పూలపుప్పొడి గురించి కూడా రాయచ్చు.

వస్తువు ఎంపికలో వ్యక్తీకరణలో కవికి స్వేచ్చవుంది. ఆ స్వేచ్చను ప్రశ్ని౦చే హక్కు ఎవరికి లేదు.

పూల మీద రాస్తావా? పూలపిల్ల జ్వరం మీదరాస్తావా ? జ్వరంలో వున్నా సరే  పూలు అమ్మక తప్పని గతి మిద రాస్తావా? పువ్వుల పంట చినుకు  లేక ఎండి పోవడాన్ని రాస్తావా? పంట భూములు పోగొట్టుకున్న నిర్వాసితులమీద రాస్తావా? దానికి కారణమవుతున్న సర్కారీ ధోరణి గురించి రాస్తావా? అది కవి తీసుకున్న కాన్వాసుని బట్టి వుంటుంది

ఏ వస్తువు ఎంతవరకు వ్యక్తి గత మవుతుంది, ఏ సరిహద్దు దగ్గర సామాజికమవుతుంది ? నిర్ణయించడం కష్టం.

వ్యక్తిగతమంతా రాజకీయమే అని రుజువైపోయిన చోట కవి కార్యకర్తగా ఎదగడం అనివార్యం కాదా. జీవితంలో అన్నివిధాలా స్థిరపడ్డ కవికి వున్న సుఖ జీవన సౌదర్యం కార్యకర్త కి వుండకపోవచ్చు.

కవులు సరస్వతీ పుత్రులు, సభలు  ఈశ్వర స్వరూపాలు అనుకున్నంత కాలమూ వారిని మోయడానికి నడుం కట్టిన బోయీలు కాని,  కట్టడాలకు రాళ్ళు మోసిన కూలీలు కాని  వస్తువులు కాలేవు.

ఒకవేళ పువ్వులు అమ్మే పిల్ల అక్షరాస్యురాలు అయితే ఆమె అనుభవమే ఒక రచన అవదా ?. అక్షరాస్యతతో సంబంధమే లేక౦డా  గుండె కరిగించే పాట అవదా ? దానికి కావ్య గౌరవం వుండదా?

రచనా ప్రేరకాలుగా ఆ పూలపిల్లకి “బయట వేడి గాలులు తరిమికొడుతూ వుంటే , ఇ౦ట్లో వేడి భోజనం “ అవసరం లేదు. ఆకలి చాలు, వేదన చాలు, వేదన ఒ౦టరిది కాదనే స్పృహ చాలు. అవే ఆమె వ్యక్తీకరణకు కారణాలు.

కవిత్వం బాధకు పర్యాయపదం అన్నాడు కదా శ్రీ శ్రీ .

శ్రీ శ్రీ కి ముందు వచ్చిన భావ కవిత్వాన్ని అంతకు ముందు వచ్చిన పద్య కవిత్వాన్ని కూడా హాయిగా చదువుకున్నాం.

“రాత్రి జిప్పును విప్పుతో కారు ప్రయాణం “అని రాసిన ఇస్మాయిల్ కవితలో సిమిలీలు  ఎవరం మర్చిపోలేం.

“పది రాత్రులు ప్రకృతితో గడిపినవాడేవ్వడు పరుల్ని ద్వేషించలేడు” చిన్నప్పుడెప్పుడో చదువుకున్న వాక్య౦ యిది.

కవి పేరు మర్చిపోవచ్చు కాని కవిత్వం మర్చిపోలేం. ఈ నేలమీద అన్ని ధోరణులు సమాంతరంగా ప్రవహిస్తూనే వుంటాయి. వాళ్ల మధ్య మీరు కుస్తీ పోటీలు కండక్ట్ చేయనక్కర్లేదు.

అస్తిత్వవాద కవులకి ఈస్తటిక్ సెన్స్ ఉండదనే ఒక తప్పుడు అభిప్రాయం ప్రచారంలో వుంది. ఏ కవి అయినా వాదాలకోసం పుట్టడు. వాద ప్రచారం కోసం రాయడు. జీవితాన్ని కవిత్వం చెయ్యడంలో విభిన్న వస్తువులు వచ్చి చేరాయి. అది చాలా అవసరం కూడా.

ఈ పుస్తకానికి రాసిన ముందు మాట చూడండి.

“స్త్రీలలో ఉద్వేగాలు జాస్తి. కవిత్వ మూలాలు అక్కడే వున్నా దానివల్ల కవితాభివ్యక్తికి కలిగే ప్రయోజనం నాస్తి, కారణం దానికి అవసరమయ్యేది రసదూరం పాటి౦చగల నిర్లిప్తదోరణి. స్త్రీలలో అది బహు సకృతు. కాబట్టే మాయో ఏ౦జిలో , ఎలిజిబెత్ బిషప్ లాంటి పేరొందిన కవయిత్రుల్లో కూడా శిల్ప దోషాలు కనిపిస్తాయి. ఇక తెలుగు లో రాస్తున్న కవయిత్రుల గురించి ఎంత తక్కువ  మాట్లాడుకుంటే అంత మ౦చిది. కవులు కూడా అదే బంతిలో కూచుని భోజనాలు కానిచ్చి చేతులు కడిగేసుకు౦టున్నవారే. నానా వాదాల చెత్తను మిగల్చకుండా ఊడ్చి, కొత్త కవిత్వానికి ఇంద్రాణి కనక నాంది పలికితే ఆంధ్ర సారస్వతానికి కావలాసి౦దేమీలేదు.” దీనిభావమేమి యదుకులేశా ?

ఉద్వేగాలు జాస్తి అనే మాట తప్ప ఇంకోటి అర్ధమయితే ఒట్టు. కవిత్వ మూలాలు అక్కడే వున్నా అంటే ఆమెలో, లేక ఆమె చుట్టూరా లేక ఆమెకు అoదే౦త దూరంలో అనేనా? మరి అంత సమీప వస్తువు గురించి ఆమె రాసినప్పుడు కవితాభివ్యక్తికి కలిగే ప్రయోజం నాస్తి ఎలా అవుతుంది? రసదూరం పాటించగల నిర్లిప్త ధోరణి ఆమెలో లేదా?

ఇది ఎవరికయినా అర్ధం అయితే నాకు చెప్పండి ప్లీజ్,

పదిమ౦దిని దూషిస్తే తప్ప పదకొండో వాడ్ని గౌరవించడం కష్టమనుకు౦టే అది వారి వ్యక్తిగత బాధ. సామాజికం కావాల్సిన కవిత్వాన్ని వ్యక్తిగతం అని నేర్పి, వ్యక్తిగత రాగద్వేషాలు సైద్ధాంతిక సత్యాల మాదిరి చెబుతుంటే అచ్చంగా చెవిలో పువ్వులు పెట్టినట్టే వుంది.

సహజ ప్రేరణకి అడ్డుపడుతూ, కవిత్వాన్ని కృత్తిమoగా మార్చడం ఎలా జరుగుతుందో  ఇ౦ద్రాణి చెప్పి౦ది. నేను తనతో  తప్పక ఏకీభవిస్తాను. అదేమిటంటే ,

“మొదట్లో మనకోసం రాసుకున్న కవిత్వాన్ని ఎవరికయినా చూపగానే , ముఖ్యంగా ఎప్పటి ను౦చొ రాస్తున్నకవులకి చూపగానే వాళ్ళు అనే మాటలు, అభిప్రాయాలు, గుర్తింపు, అహం , బ్రాండ్ ఇమేజ్ ని ఇస్తాయి.”

ఇప్పుడు ఒక మ౦చి కవి/కవయిత్రి అలాంటి ప్రమాదాన్ని౦చి బైటికి రావాల్సి వుంది.

 

మీ మాటలు

  1. దేవరకొండ says:

    లోతైన మంచి విశ్లేషణ ను అందించిన నిర్మల గార్కి ధన్యవాదాలు. మీ ప్రసంగ పాఠం కూడా వీలు వెంబడి ప్రచురించగలరు. ఓ పిడకల వేట: ఈ చెవిలో పువ్వు అనే ‘జాతీయం'(!?) నాకు తెలిసిన వరకూ ఏదో సినిమా నుండి అంటుకున్న ఓ చౌకబారు (అలా అనకూడదేమో కూడాను!) వాడకం! దీన్ని సాహిత్య చర్చల్లోకి కూడా అనుమతించి దాని స్థాయిని పెంచారేమో!

    • శ్రీనివాసుడు says:

      ‘‘చెవిలో పూలు పెట్టుకొని వున్నానా‘‘.
      ఇది ఒక జాతీయము
      అర్థము : ’’నేనేమన్న అమాయకుడినా.. ఉదా: నేనేమైనా చెవిలో పూలు పెట్టుకొని వున్నానా… అమాయకత్వం, చాదస్తం ‘‘.
      అర్చకుడు పువ్వునిచ్చినప్పుడు స్త్రీలైతే జడలో ముడుచుకుంటుంటారు. పురుషులకు అలాంటి అవకాశం లేదు. కానీ ఆ పువ్వు పవిత్రమైంది. దాన్ని శిరస్సున ధరించే తీరాలి అని అనుకొని చెవిలో ఉంచుతుంటారు.

      • చెవిలో పూవు ఒక జాతీయం అయితే ఆ జాతీయం పురుష దురహాంకారాన్ని తెలియజేస్తుంది. మహిళలు పూవులు ఒక అలంకారంగా, పురుషులను ఉత్తేజ పరిచేదిగా తెలియాజేస్తుంది. దాని అర్ధం చవట అన్న భాగంగా చేసుకొని, మహిళ లు ఆలోచన పరులు కాదని, బుద్ధి మాంద్యము కలవారని హేళన చేయడం లాంటిది. ఈ జాతీయాన్ని నాగరికులు మరీ అత్యాధునికులు ఉపయెగించడం తగదు.

      • Srinivas Vuruputuri says:

        @ఫి: “చెవిలో పూవు ఒక జాతీయం అయితే ఆ జాతీయం పురుష దురహాంకారాన్ని తెలియజేస్తుంది. మహిళలు పూవులు ఒక అలంకారంగా, పురుషులను ఉత్తేజ పరిచేదిగా తెలియాజేస్తుంది. దాని అర్ధం చవట అన్న భాగంగా చేసుకొని, మహిళ లు ఆలోచన పరులు కాదని, బుద్ధి మాంద్యము కలవారని హేళన చేయడం లాంటిది.”

        అది జాతీయమో కాదో నాకు తెలియదు కానీ అందులో పురుషాహంకారం ఉన్నదనుకోను. చెవిలో పూవు పెట్టుకోవటం – గుడికి వెళ్ళే పురుషులు చేసే పని. పారలౌకికం బాగా తలకెక్కించుకొని (ఈ) లోకపు పోకడ తెలియకుండా ఉండే స్వభావాన్ని సూచించే మాట అది. కాదా?

      • ‘ గుడికి వెళ్ళే పురుషులు చేసే పని ‘ కాదు. పువ్వులు ముఖ్యంగా మహిళలు ఉపయోగిస్తారు. కాదు ఉపయోగింప చేయ బడతారు. ఆ తరువాత అమితమైన భిక్తి కలిగిన పురుషులు మహిళలను అనుకరించారు. ఆ అనుకరించిన పురుషుల్ని ‘ ఆడంగి వేదవ’ అన్నారు. ఈ ఆడంగి వేదవ అనే మాట మహిళలను ఉద్దేసించి వచ్చిందే ! చెవిలో పువ్వు పెట్టుకోవడం అంటే ఆడ వాళ్ళని అనుకరించడం అన్నమాట. – అంటే ఆడ వాళ్ళ లాగే అనుకరించే వారికి ఆలోచన లేదని. అమాయకులని అర్ధం

  2. శశి కళ says:

    బాగా వ్రాసారు మేడం

  3. అనూరాధ says:

    .నిర్మలగారు చాలా బాగా రాశారు. అభినందనలు.
    చెవిలో పువ్వులు పెట్టడం అనేది చాలా పాతకాలం నుండి ఉన్న expression. సినిమాల నుండి వచ్చిందేమి కాదు. అందులో ఉపయోగించుకొని ఉండొచ్చు. నిర్మల గారు వాడిన సందర్భంలో నైనా, ఆ వాడుకకి ఉన్న అసలు అర్థంలో నైనా అది “వెర్రివాళ్ళను చేస్తున్నారు” అనే. ఇందులో చౌకబారుతనం ఏమీలేదని నా అభిప్రాయం.

  4. paresh n doshi says:

    వ్యక్తిగతమంతా రాజకీయమే అని రుజువైపోయిన చోట కవి కార్యకర్తగా ఎదగడం అనివార్యం కాదా. జీవితంలో అన్నివిధాలా స్థిరపడ్డ కవికి వున్న సుఖ జీవన సౌదర్యం కార్యకర్త కి వుండకపోవచ్చు.
    త్వవాద కవులకి ఈస్తటిక్ సెన్స్ ఉండదనే ఒక తప్పుడు అభిప్రాయం ప్రచారంలో వుంది.
    సామాజికం కావాల్సిన కవిత్వాన్ని వ్యక్తిగతం అని నేర్పి, వ్యక్తిగత రాగద్వేషాలు సైద్ధాంతిక సత్యాల మాదిరి చెబుతుంటే అచ్చంగా చెవిలో పువ్వులు పెట్టినట్టే వుంది.

    విలువైన మాటలు.

  5. amarendra says:

    మంచి విషయాలు..మౌలికమైన విషయాలు…బాగా చెప్పారు నిర్మల గారు …అభినందనలు.

  6. Brahmanandam Gorti says:

    ఈ వ్యాసం పూర్తిగా చదివాను. ఆ సభలో నేనూ ఒక సాక్షిని.
    అందుకే ఈ వ్యాఖ్య.

    నాకనిపించిన కొన్ని అభ్యంతరాలు.

    1. ఈ వ్యాసానికి లంకెగా ఆ ప్రసంగాన్ని ఆడియో పెట్టుంటే ఏ సందర్భంలో ఎలా అన్నారో అందరికీ తెలిసేది.
    అలా కాకుండా కొన్ని మాత్రమే ప్రస్తావించడం వలన వ్యాసకర్త తమకి కావల్సిన వాక్యాలు ఏరుకున్నట్లుగా అనిపించింది.

    2. ఈ వ్యాసం కేవలం ఆ ప్రసంగం మీదనే ఆధారపడి రాసుంటే వేరేలా ఉండేది. అలా కాకుండా ఇంద్రాణి గారి కవిత్వ ప్రతిలో
    రాసిన ముందు మాటలో (అది రాసినది యదుకుల భూషణ్) వాక్యాలు కవికి ఆపాదిస్తూ చెప్పడం సరి కాదు. ముందు మాటలెప్పుడూ మెండు మాటలే!
    అవి కవి అభిప్రాయాలు కాదు. వేరెవరివో. ఆ అభిప్రాయలనీ, ప్రసంగాన్నీ జోడించి చెప్పడం సరికాదు.
    ఇంద్రాణి గారి అభిప్రాయాలతో ఏకీభవించకపోవడంలో తప్పేమీలేదు. అది చర్చించకోవద్దనీ కాదు. చర్చకీ, భూషణ్ ముందు మాటకీ సంబంధం లేదు.

    పైన చెప్పిన రెండు కారణాల వల్ల ఏదో రాయాలని రాసినట్లుగా అనిపించింది తప్ప కవిత్వ విమర్శలా (అదీ అనుకుంటే) లేదు.
    ఎవరి అభిప్రాయాలూ, భావజాలాలూ వారికుంటాయి. తప్పేమీలేదు. అవి గొరవిస్తూ ఎక్కడ విభేదిస్తున్నామో చర్చించి ఉంటే బావుండేది.
    ఆ సభలో వ్యాసకర్త కూడా భాగమే కాబట్టి అక్కడయినా కొన్ని అభ్యంతరాలు లేవనెత్తితే మరింత బావుండేది. అలాంటివేమీ జరగలేదు.

  7. Chandra Kanneganti says:

    బ్రహ్మానందం గారి వ్యాఖ్యతో ఏకీభవిస్తున్నాను.
    ఆ ప్రసంగం అందరికీ అందుబాటులోకి రాకముందే ఇక్కడికి ఈడ్చుకురావడానికి అంత తొందర ఎందుకో అర్థం కాలేదు. ఏ ప్రసంగం గురించయినా రాస్తున్నప్పుడు దాని పూర్తి పాఠం చదువరులకు కొంత ప్రయత్నం మీదనయినా అందుబాటులోకి వస్తుందో లేదో చూసుకోవడం ఏ వ్యాసకర్త అయినా చదువరుల పట్లా, ప్రసంగ కర్త పట్లా చూపవలసిన కనీస మర్యాద, నైతిక బాధ్యతా కూడా. ఇప్పుడు ఈ తీసుకున్న వాక్యాల context తెలియదు. వాక్యాలు కచ్చితంగా అవేనో కాదో తెలియదు.
    అందరి ప్రసంగాలూ అయ్యాక గంట పైగా జరిగిన చర్చలో వేదిక పైనే ఉన్న నిర్మల గారు ఇవే సందేహాలు వ్యక్తపరచి ఉండొచ్చు, ఇవే ప్రశ్నలు అడిగి ఉండొచ్చు. అప్పుడు ఇంద్రాణి గారికీ తన ఉద్దేశం స్పష్ట పరిచే అవకాశం ఇచ్చినట్టు ఉండేది. Probably this is more fun for the writer, editors and readers.
    పోనీ ఈ వ్యాసం ఆ ప్రసంగానికే పరిమితం చేసినా గుడ్డిలో మెల్ల. మధ్యలో ఎక్కడి పుస్తకంలోంచో ముందుమాటలో వాక్యాలు ఎందుకు చొప్పించారో అర్థం కాలేదు. మొత్తం ఈ వాదాన్నే ప్రశ్నించాలనుకుంటే ఇంకా చాలా మందిని లాక్కు రావలసి ఉంటుంది.
    మొత్తానికి చివరికి వచ్చేసరికి ఇది వ్యక్తిగత దాడి అని ఇంకెవరికీ అనిపించలేదా?
    ఇక అసలు విషయాన్ని గురించిన చర్చ ఎప్పుడయినా ఇంకాస్త మంచి సందర్భంలో.
    * దీన్ని వ్యాసం అని కేవలం సౌలభ్యం కోసమే వాడాను.

  8. విన్నకోట రవిశంకర్ says:

    చంద్ర, బ్రహ్మానందం గార్ల వ్యాఖ్యలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఏదో సభలో చేసిన ప్రసంగం మీద, ఆ ప్రసంగ పాఠం పూర్తిగా ఇవ్వకుండా వ్యాసం రాయటం మంచి పధ్ధతి కాదు. వ్యాసకర్త అలా పంపినప్పుడు, సంపాదకులైనా అటువంటి మర్యాద పాటించవలసింది. ఆ సభలలో ఇతర ప్రసంగ కర్తల లాగానే , ఇంద్రాణిగారు కూడా తన అభిప్రాయం ఖచ్చితంగా చెప్పారు. దాని మీద మీ అభిప్రాయ భేదాల్ని సభలోనో, బయటో చర్చిస్తే ఆమె సమాధానం చెప్పేవారే. కవిత్వంలో రాజకీయాల గురించి ఈ చర్చ ఎప్పట్నించో నడుస్తున్నదే కదా! అందువల్ల, ఆమె వ్యాఖ్యలకి ఎవరైనా అంత అర్జంటుగా బాధ పడవలసిన అవసరం ఏముందో నా కర్థం కావట్లేదు. ఎన్నేళ్ళు గడిచినా, తెలుగులో వాదాల మీద, లేదా వార్తాపత్రికల్లో హెడ్ లైన్ల మీద రాసేదే ప్రధాన స్రవంతి కవిత్వమని, వారే సీరియస్ కవులని భావించే ధోరణి మారలేదు. ఇప్పట్లో మారే అవకాశమూ కనిపించటం లేదు. ఇటువంటి పరిస్థితిలో ఇంద్రాణి గారి వంటి ఈ తరం కవులు కొందరైనా దానికి భిన్నంగా ఆలోచించటం అభినందించవలసిన విషయం. గతంలో కొన్ని మంచి పద్యాలు రాసిన నిర్మలగారి లాంటి సీనియర్ కవులు వారిని ప్రోత్సహించాలని కోరుకుంటాను. అంతేగాని, ఒకరిని టార్గెట్ చేస్తున్నట్టుగా రాసిన ఇటువంటి వ్యాసం ఆమెనుండి ఆశించలేదు.

    • శివశంకర్ says:

      “ఎన్నేళ్ళు గడిచినా, తెలుగులో వాదాల మీద, లేదా వార్తాపత్రికల్లో హెడ్ లైన్ల మీద రాసేదే ప్రధాన స్రవంతి కవిత్వమని, వారే సీరియస్ కవులని భావించే ధోరణి మారలేదు.”

      మీ బాధ ఏమిటి కవిగారూ? పూలూ, వానల మీద ఎన్నేళ్ళు గడిచినా రాస్తూనే వున్నారు కదా?! వేదికల మీద కూడా మీలాంటి కవులే కదా!? మీరే సీరియస్ కవులా ఎన్నేళ్ళు గడిచినా? దళితులు, ముస్లింలు, మీరు ఎంపిక చేసిన స్త్రీలు తప్ప మిగిలిన స్త్రీలూ కవిత్వం రాస్తే కనీసం చదివే సహనం కూడా మీకు లేదాయే!

  9. ఆర్.దమయంతి. says:

    నిర్మల గారు!
    నాకూ సబబు గా అనిపించలేదండి. – మీ విమర్శ.
    మీలానే ఆమె కూడా కవిత్వం మీద తనదైన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. అంతే కదా ఇంతకీ జరిగింది ?
    నాకు తెలిసినంత వరకు – అసలు ఇంద్రాణి గారు కవిత్వం గురించి మాట్లాడటమే గొప్ప విష్యం.
    :-)
    ఇక్కడ ఆ వీడియో వుంచితే బావుణ్ణు ఎవరైనా!

  10. శివకుమార్ చౌదరి says:

    అస్తిత్వ వాద కవులు ముందుగా నేర్చుకోవలసింది ఐక్యత అని ఈ వ్యాసానికి వచ్చిన వ్యాఖ్యలు రుజువు చేస్తున్నాయి.
    ఇంద్రాణి గారి కవిత్వం మీద ఒక విభిన్నాభిప్రాయం రాగానే ఎన్నడూ వ్యాఖ్యలు రాయని వారు కూడా పరిగెత్తుకొచ్చి క్యూలో నిల్చుకుని మరీ రాశారు. భావ వాద కవులంతా ఒకరికి ఒకరు ఎంత సపోర్టు గా ఉన్నారో!

    పైగా ఓవరాల్ గా ఇంద్రాణి కవిత్వం మీద వ్యాస రచయిత్రి అభిప్రాయాన్ని లెక్క లోకి తీసుకోక పోగా ప్రసంగంలో లేని అంశాలన్నీ రచయిత్రి ప్రచారం చేస్తున్నట్లు గా అభిప్రాయాన్ని రీడర్స్ లో కల్పించేలా తప్పు దోవ పట్టించిమరీ రాస్తున్నారు. పూర్తి ప్రసంగ పాఠం కవయిత్రిని అడిగి తీసుకుని సారంగ ప్రచురిస్తే బాగుండు

    ప్రముఖ రచయిత ఏకంగా “ఇది వ్యక్తిగత దాడిగా ఎవరికీ కనిపించలేదా” అంటూ తలో రాయీ పుచ్చుకు రమ్మని అందరినీ కేకేసి, పిలుస్తున్నారు. వ్యక్తిగత దాడి అంటే ఏమిటో తెలిసే వాడతున్నారా ఆ మాటని? ఇందులో కవయిత్రి పర్సనల్ గా తీసుకోవలసిన తీవ్ర వ్యాఖ్యలేమున్నాయి?

    అస్తిత్వ వాద కవిత్వం మీద ఇంద్రాణి గారు తన అభిప్రాయాలని వ్యక్తం చేసిన విధానం వ్యాసం లో చదువుతుంటేనే ఆశ్చర్యంగా ఉంది. ఆడియోనో వీడియో నో వస్తే అవన్నీ ఎలాగూ అందరూ వింటారు, లేదా చూస్తారు. అది వచ్చేదాకా ఆగి “చూసారా మీరు అబద్ధాలు రాశారు” అంటూ అప్పుడే ప్రశ్నించవచ్చు వ్యాస రచయిత్రిని.

    • రత్నాకర్ says:

      “ఇంద్రాణి గారి కవిత్వం మీద ఒక విభిన్నాభిప్రాయం రాగానే ఎన్నడూ వ్యాఖ్యలు రాయని వారు కూడా పరిగెత్తుకొచ్చి క్యూలో నిల్చుకుని మరీ రాశారు. భావ వాద కవులంతా ఒకరికి ఒకరు ఎంత సపోర్టు గా ఉన్నారో! ”

      చాలా మంచి మాట. రైటిష్టుల మధ్య వున్న ఐక్యత లేఫ్టిష్టుల మధ్య లేదని కూడా చాలా సార్లు అనుకున్నాం కదా! మోడీ పాలనలో డయాస్పోరా కవుల మధ్య వర్ధిల్లుతున్న అగ్రవర్ణ ఐక్యత ఇప్పుడు ఈ చర్చలో కనిపిస్తున్నది.

  11. సుబ్బు says:

    నిర్మల గారు, సూటిగా రాశారు. మొహమాటం లేకుండా చెప్పారు. ఒకటీ రెండు కవితలు రాయగానే అహంకారంతో మాట్లాడడం ఈ కాలంలో కవులకు వున్న బోలెడు జబ్బులలో ఒకటి. “కేవలం వ్యక్తిగత అభిప్రాయాల్లాగా చెబితే ఈ చర్చ అవసరం లేదు, కాని ఆర్కిమెడిస్ సిద్దాంతంలాగా ఖచ్చితమైన స్వరంతో చెప్పింది” అని మీరన్న వాక్యం చదివితే అర్థమవుతున్నది.

  12. narayana swamy says:

    నాటా సభల్లో జరిగిన సాహిత్య సదస్సులో నేనూ పాల్గొన్నాను కాబట్టి , అట్లా ఈ చర్చ కు ప్రత్యక్ష సాక్షి ని కాబట్టి దీని గురించి మాట్లాడడం అవసరమనిపిస్తుంది.

    నిర్మల గారు రాసినదానిలో అసత్యాలు నాకేవీ కనిపించలేదు. నిజానికి ఇంద్రాణి గారి ప్రసంగం నన్ను, ఇంకా చాల మంది ని హతాశుల్ని చేసింది. మరి కొంత మందిని ఆనంద పరిచినట్టు ఉంది కూడా. ఆ ప్రసంగానికి నిజానికి ఇస్మాయిల్ పెనుకొండ గారో మరొకరో వీడియో లంకె నో ఇస్తే బాగుండేది. నిర్మల గారు రాసినదానికి మరింత బలం చేకూరేది. కానీ స్థూలంగా నిర్మల గారు రాసినదే ఇంద్రాణి గారు మాట్లాడారు. అనేక స్యయం వైరుధ్యాలున్న ప్రకటనలను ఆమె ప్రసంగం లో చేసారు. కవిత్వానికి రాయడానికి అవసరమైన సూక్ష్మ దృష్టి గురించి సున్నిత మనస్తత్వం గురించి ఆమె మాట్లాడిన దానితో నిర్మల గారన్నట్టు నాకూ ఏమీ పేచీ లేదు. అయితే ఆమె కవిత్వానికి అవసరమైన వాటి గురించి తక్కువ మాట్లాడి, ఏది ఆమె వద్దనుకుంటుందో వాటి జాబితా ఒకటి (పెద్దదే ) ఒకటి ఇచ్చింది. ఆ జాబితా పూర్తి వైరుధ్యాలతో నిండి ఉంది. ఉదాహరణకు కవి తనకోసం తనే కవిత్వం రాసుకోవాలి ఇతరుల కోసం రాయద్దు – రాసింది అందరికీ చూపించవద్దు చూపించినా మంచి వారికే చూపించాలి. మరి అట్లాంటప్పుడు కవిత్వం అచ్చు వేసుకోవడం దేనికి? దానికి ముందు మాటలు రాయించడం దేనికి? ఎవరు కవిత్వాన్ని చూపించాల్సిన మంచి వాళ్ళు (ఆమె పుస్తకానికి ముందు మాట రాసిన వాళ్ళా ) ? కవి చాల సరళమైన, రుషి లాంటి, ముని లాంటి జీవితం గడపాలి అన్నది మరొక ప్రకటన – నిజంగా అట్లా జరుగుతున్నద – జరిగే వీలవుతున్నదా – బ్రహ్మానందం ఆ ప్రశ్న అడిగారు కూడా – దానికి ఆమె నుండి సంతృప్తికరమైన సమాధానం వచ్చి నట్టు నాకు గుర్తు లేదు

    నిర్మల గారు ఉటంకించిన ముందు మాట నిజానికి ఇక్కడ అనవసమనిపిస్తుంది, కానీ తరచి చూస్తె అది చాల రెలెవంట్ – ఎందుకంటే ఆ ప్రశంస వాక్యాలలో చాల స్పష్టంగా స్త్రీలను చులకనే చేసే భయంకరమైన అభిప్రాయాలున్నాయి ఉదాహరణకు ““స్త్రీలలో ఉద్వేగాలు జాస్తి. కవిత్వ మూలాలు అక్కడే వున్నా దానివల్ల కవితాభివ్యక్తికి కలిగే ప్రయోజనం నాస్తి, కారణం దానికి అవసరమయ్యేది రసదూరం పాటి౦చగల నిర్లిప్తదోరణి. స్త్రీలలో అది బహు సకృతు. కాబట్టే మాయో ఏ౦జిలో , ఎలిజిబెత్ బిషప్ లాంటి పేరొందిన కవయిత్రుల్లో కూడా శిల్ప దోషాలు కనిపిస్తాయి.” అంటే స్త్రీలు ఎంత చేసిన మంచి కవిత్వం రాయలేరు ఎందుకంటే సహజంగానే వారికి ఉద్వేగం జాస్తి (ఉద్వేగం కవిత్వానికి మూల ధాతువు కాదా? ) కాబట్టి వారు రసదూరం పాటించగలిగే నిర్లిప్తత ను పాటించలేరు (రస దూరమేమిటో ముందు మాట రాసిన ఆయనకు రాయించుకున్న వారికే తెలియాలి – కవిత్వానికి , మంచి కవిత్వానికి కావాల్సింది తాత్వికత అని ఇస్మాయిల్ గారు ఎంత చెప్పిన వీరికి అర్థం కాలేదు – ఈ రస దూరమేమిటో ఇస్మాయిల్ గారు చెప్పినర ఎక్కడైనా? ) కాబట్టి – ఎలిజబెత్ బిషప్ లాంటి గొప్ప కవయిత్రి కూడా ఆయనకు ఆనలేదు – ఇది చాల స్పష్టంగా పురుషాహంకార ధోరణి (దీన్ని వ్యతిరేకించక పోగా కొంత మంది వెనకేసుకు రావడం, స్త్రీ ఐ ఉండి ఇంద్రాణి గారి లాంటి కవి దీన్ని ముందు మాటగా స్వీకరించడం చాల అన్యాయం). అందుకే చైతన్యం గల స్త్రీగా నిర్మల గారు దాన్ని ఉటంకించి సరైన పనే చేసారు ఎందుకంటె ఆ రోజు చర్చలో ఇంద్రాణి గారు (ఆమెకు రాసిన ముందు మాటలో కూడా ) అస్తిత్వ వేదనలు ఆత్మ గౌరవ ప్రకటనలు, ఉద్యమాలు ప్రతిఫలించే కవిత్వాలు లేదా వాటి గురించి రాసిన కవిత్వాలు అసలు కవిత్వమే కాదు వాటిని కవిత్వమని భ్రమింప జేస్తున్నారు వాళ్ళంతా ఉద్యమకారులు పార్టీ నాయకులూ తప్ప కవులు కారని చాల నిష్కర్షగా అసెర్టివ్ గా ఒక రాజకీయ ప్రకటన చేసింది – అందుకని నిర్మల గారు, ఇట్లాంటి అపరిపక్వ అసమగ్ర అవగాహనా ప్రకటనల వెనుక భూమికగా ఏది పని చేస్తుందో చెప్పడానికే ఆ ముందు మాటను ఉటంకించడం సరైన పనే చేసింది – అట్లాంటి అర్థం పర్థం లేని వ్యాఖ్యల వెనుక ఏ అవగాహనా (లేదా అవగాహనా లోపం) పని చేస్తుందో తెలియాలి కదా –

    నిజానికి కవిత్వానికి అవసరమైన దాని గురించి మాట్లాడాల్సిన ఇంద్రాణి గారు ఏది అనవసరమో అనే దాని గుర్నిచి ఎక్కువ కేంద్రీకరించి తను తనకు తెలియకుండానే అనేక రాజకీయ ప్రకటనలు చేసారు – కవిత్వంలో రాజకీయాలొద్దు సమాజమొద్దు అస్తిత్వ వేదనలు వద్దు అనడం కూడా ఒక రాజకీయమనే విషయం ఇంకా అపరిపక్వ అసమగ్ర అవగాహనతో ఉన్న ఆమెకు తెలియక పోవచ్చు కానీ ఆ వాదనలో తలపండి పోయిన ఇతర తోటి కవి విమర్శక మేధావులకు తెలియదని నేను అనుకోను. తెలిసీ చెప్పక పోవడం వారి రాజకీయం మరి –
    నిజానికి తెలుగులో వాదాల మీద పత్రిక ప్రకటనల మీద కవిత్వం రావడం లేదు (అట్లా వచ్చినా అది కవిత్వం గా నిలబడడం లేదు ) – ప్రతి కవికీ ఒక ప్రాపంచిక దృక్పథం ఉంటుంది. ( కవికి, సాహిత్యకారునికి ప్రాపంచిక దృక్పథం ఉండదు అనడం ఆత్మ వంచన ) అది ఆ కవి కవిత్వం లో ప్రతిఫలిస్తుంది – తెచ్చి పెట్టుకున్నట్టు కృతకంగా కవిత్వం లో ఆ ప్రాపంచిక దృక్పథం రాస్తే దాన్ని కవిత్వమనీ సాహిత్యమనీ ఎవరో అనరు అన్న అది నిలవదు – అంటే ఒక అస్తిత్వ వాదాన్ని సమర్థించే ప్రాపంచిక దృక్పథం తో రాయడం తప్పు కాదు – ఆ దృష్టి తో చూడడం సమాజాన్ని అర్థం చేసుకోవడమూ తప్పు కాదు – ఎటొచ్చీ దాన్ని యథాతథంగా దించి అదే కవిత్వమనుకొమ్మంటే అది కవిత్వం కాదు – ఆ పని ఇవాళ మంచి కవులు ఎవరూ చెయ్యడం లేదు – నిజానికి ప్రపంచ వ్యాప్తంగా నిలిచిన గొప్ప కవిత్వమంతా ఆయా కవుల ప్రాపంచిక దృక్పథాలను ప్రతిఫలిస్తుంది

    సాహిత్యం సమాజాన్ని పట్టించుకోవద్దు అనే అతి పురాతన అరిగిపోయిన వాదాన్ని (చూడండి మరి అదీ వాదమే) ప్రతి సారీ బయటకు తీసి మేము రాసిందే కవిత్వమనీ ఇతరులు రాసింది అసలు కవిత్వమే కాదని (పైగా అది అంతా చెత్త అని ) తిరస్కరించడం సమంజసం కాదు – ఒక సంఘటనకు స్పందించి కవిత్వం రాయడం తప్పు కాదని (మరి క్రౌంచ పక్షి మరణం చూసి స్పందిచిన ఆది కవి వాల్మీకి అదే చేసాడు కాదా ) అందులో కవిత్వముంటె అది నిలుస్తుందని అనేక సార్లు నిరూపణ ఐంది కూడా (పైగా అత్యున్నత స్థాయి కవితా వాక్యమే నినాదం కాగలదని చేరా గారు అన్నారు కూడా ) – అనుభవాన్ని రాసిన జ్ఞాపకాన్ని రాసినా కవి తన స్వంత అనుభవాన్ని సామూహికం చెయ్యగలిగితే దాన్ని నిర్దిష్టత నుండి విశ్వజనీనం చేయగలిగితే దానిలో తాత్వికత సాధించగలిగితే అది గొప్ప కవిత్వమై నిలుస్తుంది – అంతే కానీ కవిత్వమంటే ఇట్లాగే ఉండాలి – మేము రాసేదే కవిత్వం మిగత అంతా చెత్త అనడం ఆబ్జెక్టివ్ దృక్పథం కాదు అహంకార అసమగ్ర అపరిపక్వ దృక్పథం – స్త్రీలు మంచి కవిత్వం ఎన్నడూ రాయలేరు (స్త్రీలు కారు డ్రైవింగ్ సరిగా చెయ్య లేరు ఎందుకంటే వారికీ ఉద్వేగం ఎక్కువ కాబట్టి అని కూడా అనగలరీ మహానుభావులు ) అనడంకూడా అంటే అహంకారపూరితమైనదని వేరే చెప్పాలా?
    కవిత్వం సాహిత్యం సమాజానికి దూరంగా ఉండాలి అనడం చాల స్పష్టంగా ఒక రాజకీయ దృక్పథం ఇది ఇవాళ కొత్తది కాదు. ఈ విషయం ఇంద్రాణి గారికి తెలియక పోవడం లో ఆశ్చర్యం లేదు – ఈ విషయం ఆమెను సమర్థిస్తున్న వారు ఆమెకు అవగాహనా అండదండలను ఇస్తున్న వారు తెలిసీ ఆమెకు చెప్పక పోవడమే గొప్ప ఆశ్చర్యం
    అందు చేత నిర్మల గారు ఇంద్రాణి గారి రాజకీయ ప్రసంగాన్ని దాని వెనుక ఉన్న అవగాహనా అండ దండలను బాగానే పట్టుకున్నారు – పోతె, నిజమే ఆ ప్రసంగ పాఠానికి లంకె ఇస్తే బాగుండు – ఐతే ఇదే ప్రసంగ పాఠాన్ని పుస్తకం డాట్ నెట్ లోనో ఎక్కడొ ఒక వ్యాసం లో ఇంద్రాణి గారు రాసినట్టు నాకు గుర్తు – పోనీ దాన్నైనా ఇవ్వవచ్చు ఎవరైనా –

    • శ్రీనివాసుడు says:

      కవిత్వం:కొన్ని ఆలోచనలు : పాలపర్తి ఇంద్రాణి
      http://pustakam.net/?p=11653

    • Srinivas Vuruputuri says:

      “రస దూరమేమిటో ముందు మాట రాసిన ఆయనకు రాయించుకున్న వారికే తెలియాలి”

      I don’t think it is such a big mystery. Aesthetic distance అన్న మాటకు తెలుగు అనువాదం అనుకుంటాను. వికీ లింకు.

    • Aranya Krishna says:

      సెబ్బాష్ స్వామీ! నిర్మలకి అవసరమైన మద్దతు ఇఛ్చినందుకు అభినందనలు. ఇంకా ప్రత్యేకంగా రాయటానికేమీ లేదు.

  13. Narayanaswamy says:

    శ్రీనివాసుడు గారూ శ్రీనివాస్ గారూ నెనర్లు – నేనూ అట్లనే అనుకున్నా కానీ Aesthetic డిస్టెన్స్ కు ఈయన అనువాదం బాగా లేదు – పైగా అదే అర్థం లో వాడాడని అనిపించలేదు – పైగా నిర్లిప్త ధోరణి అని కూడా అంటున్నాడాయే

    • Srinivas Vuruputuri says:

      “నిర్లిప్త ధోరణి” – కూడా కరెక్టేనని అనుకుంటున్నాను. (Aesthetic) Detachment. కవిత్వ మూలాలు ఉద్వేగంలో ఉంటాయని, అయితే ఉద్వేగమే కవిత్వం కాదని, ఉద్వేగం కవిత్వంగా పరిణమించే లోపు కవి చాలా ఓపిక పట్టాలని, ఆ ఓపిక లేకపోవటం శిల్ప దోషాలకు దారి తీస్తుందని భూషణ్ గారు చెబుతున్నారని నేను అర్థం చేసుకున్నాను.

  14. Delhi Subrahmanyam says:

    నా వ్యాఖ్య కు ముందు మాట గా, ఈ రోజు మనలో అత్యధికులు ఇప్పటి తెలుగు ఆధునిక సాహిత్యం, కవిత్వం తో సహా అన్ని ప్రక్రియలో, గురించి ఎక్కువ ఆలోచించిడం (కనీసం నా వరకూ) మొదలుపెట్టింది గురజాడ వారి కన్యాశుల్కం నాటకం నుంచీ , అయన రాసిన దేశమంటే పాట/కవిత నుంచీ, అయన రాసిన పుతడి బొమ్మా పూర్ణమ్మ బాధ/వ్యధ నుంచీ ఆ తర్వాత చలం గారి రచనలనుంచి , తర్వాత , మా వోఇజాగ్ ఇచ్చిన శ్రీశ్రీ గారి మహాప్రస్థానం నుంచీ, కొడవటిగంటి వారి సాహిత్యం నుంచి, 1960 లో వచ్చిన మల్లె మా వోఇజాగోడే అయిన రవి శాస్త్రి గారి ఆరు సారా కధలు కానీ , ఇలా చెప్పుకుంటే పోతే ఎన్నని ఉ8న్నాయో ఏకరువు పెట్టడం కష్టం. అలాగే తర్వాత వచ్చిన చెరబండ రాజు గారి “కొండలు పగలేసినం: లాంటి పాటలు , ఇవన్నీ అప్పటి ఆర్ధిక – సామజిక- రాజకీయ వ్యవస్థ నుంచి వచ్చినవే. అందుకే అప్పుడు వచ్చిన ఇంకెన్నో , ఇంద్రాణి గారు చెప్పిన , తెలుగు రచనల కన్నా కూడా , ఇవన్ని ఇప్పటికీ తెలుగు ప్రజలలో మేఫులుయ్హూనే ఉంటాయి.

    నిర్మల గారు చెప్పిన ఈ కింది మాటలు ఇదే భావాన్ని వ్యక్తపరుస్తుంది.

    1. “కవి నిరంతర అధ్యయనపరుడు కావాలి కాని సదరు పుస్తకాలు ప్రసంగాలో, సిద్ధాంతాల పట్ల ఆకర్షణ పెంచేవో కాకూడదు. నేను ఫలానా బాధిత వర్గానికి చెందిన స్త్రీని , ఫలానా మతానికి, కులానికి ప్రతినిధిని అని కూడా భావించరాదు. అప్పుడు అది మీ పరిమితిని సూచిస్తుంది.. మార్పులు, వయసు పెరగడం , అనుభవాలను సృష్టించుకోవడం (?) కూడా కాని పనులే, ఉద్యమకారులు ఉద్యమాలు చేసుకోవాలి కాని కవులవడానికి వీల్లేదు.”
    2. పూల మీద రాస్తావా? పూలపిల్ల జ్వరం మీదరాస్తావా ? జ్వరంలో వున్నా సరే పూలు అమ్మక తప్పని గతి మిద రాస్తావా? పువ్వుల పంట చినుకు లేక ఎండి పోవడాన్ని రాస్తావా? పంట భూములు పోగొట్టుకున్న నిర్వాసితులమీద రాస్తావా? దానికి కారణమవుతున్న సర్కారీ ధోరణి గురించి రాస్తావా? అది కవి తీసుకున్న కాన్వాసుని బట్టి వుంటుంది
    3. ఏ వస్తువు ఎంతవరకు వ్యక్తి గత మవుతుంది, ఏ సరిహద్దు దగ్గర సామాజికమవుతుంది ? నిర్ణయించడం కష్టం. వ్యక్తిగతమంతా రాజకీయమే అని రుజువైపోయిన చోట కవి కార్యకర్తగా ఎదగడం అనివార్యం కాదా. జీవితంలో అన్నివిధాలా స్థిరపడ్డ కవికి వున్న సుఖ జీవన సౌదర్యం కార్యకర్త కి వుండకపోవచ్చు.
    4. ఒకవేళ పువ్వులు అమ్మే పిల్ల అక్షరాస్యురాలు అయితే ఆమె అనుభవమే ఒక రచన అవదా ?. అక్షరాస్యతతో సంబంధమే లేక౦డా గుండె కరిగించే పాట అవదా ? దానికి కావ్య గౌరవం వుండదా?

    అలాగే మిత్రులు నారాయణస్వామి వెంకటయోగి గారు చెప్పిన ఈ కింద మాటలు కూడా ఈ భావననే ఉద్ఘాటిస్తుంది.

    5. నిర్మల గారు ఉటంకించిన ముందు మాట నిజానికి ఇక్కడ అనవసమనిపిస్తుంది, కానీ తరచి చూస్తె అది చాల రెలెవంట్ – ఎందుకంటే ఆ ప్రశంస వాక్యాలలో చాల స్పష్టంగా స్త్రీలను చులకనే చేసే భయంకరమైన అభిప్రాయాలున్నాయి ఉదాహరణకు ““స్త్రీలలో ఉద్వేగాలు జాస్తి. కవిత్వ మూలాలు అక్కడే వున్నా దానివల్ల కవితాభివ్యక్తికి కలిగే ప్రయోజనం నాస్తి, కారణం దానికి అవసరమయ్యేది రసదూరం పాటి౦చగల నిర్లిప్తదోరణి. స్త్రీలలో అది బహు సకృతు. కాబట్టే మాయో ఏ౦జిలో , ఎలిజిబెత్ బిషప్ లాంటి పేరొందిన కవయిత్రుల్లో కూడా శిల్ప దోషాలు కనిపిస్తాయి.” అంటే స్త్రీలు ఎంత చేసిన మంచి కవిత్వం రాయలేరు ఎందుకంటే సహజంగానే వారికి ఉద్వేగం జాస్తి (ఉద్వేగం కవిత్వానికి మూల ధాతువు కాదా? ) కాబట్టి వారు రసదూరం పాటించగలిగే నిర్లిప్తత ను పాటించలేరు (రస దూరమేమిటో ముందు మాట రాసిన ఆయనకు రాయించుకున్న వారికే తెలియాలి – కవిత్వానికి , మంచి కవిత్వానికి కావాల్సింది తాత్వికత అని ఇస్మాయిల్ గారు ఎంత చెప్పిన వీరికి అర్థం కాలేదు – ఈ రస దూరమేమిటో ఇస్మాయిల్ గారు చెప్పినర ఎక్కడైనా? ) కాబట్టి – ఎలిజబెత్ బిషప్ లాంటి గొప్ప కవయిత్రి కూడా ఆయనకు ఆనలేదు – ఇది చాల స్పష్టంగా పురుషాహంకార ధోరణి (దీన్ని వ్యతిరేకించక పోగా కొంత మంది వెనకేసుకు రావడం, స్త్రీ ఐ ఉండి ఇంద్రాణి గారి లాంటి కవి దీన్ని ముందు మాటగా స్వీకరించడం చాల అన్యాయం). అందుకే చైతన్యం గల స్త్రీగా నిర్మల గారు దాన్ని ఉటంకించి సరైన పనే చేసారు
    6. నిజానికి కవిత్వానికి అవసరమైన దాని గురించి మాట్లాడాల్సిన ఇంద్రాణి గారు ఏది అనవసరమో అనే దాని గుర్నిచి ఎక్కువ కేంద్రీకరించి తను తనకు తెలియకుండానే అనేక రాజకీయ ప్రకటనలు చేసారు – కవిత్వంలో రాజకీయాలొద్దు సమాజమొద్దు అస్తిత్వ వేదనలు వద్దు అనడం కూడా ఒక రాజకీయమనే విషయం ఇంకా అపరిపక్వ అసమగ్ర అవగాహనతో ఉన్న ఆమెకు తెలియక పోవచ్చు కానీ ఆ వాదనలో తలపండి పోయిన ఇతర తోటి కవి విమర్శక మేధావులకు తెలియదని నేను అనుకోను. తెలిసీ చెప్పక పోవడం వారి రాజకీయం మరి –
    7. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా నిలిచిన గొప్ప కవిత్వమంతా ఆయా కవుల ప్రాపంచిక దృక్పథాలను ప్రతిఫలిస్తుంది

    ఇప్పటి సామాజిక-రాజకీయ పరిస్తుతలగురించి సరి అయిన అవగాహన లేకపోవడం వల్లే , ఇప్పుడు దేశం లో జరుగుతున్న గొప్ప మత పరమయిన , ప్రాపంచీకరణం లో జరుగుతున్న దోపిడీ రాజకీయం లో , ఇంకా మనలో ఎక్కువ మంది ప్రియురాలి కౌగిలి లోనే ఉండిపోవాలని (ఆ స్త్రీ ని మనం అన్ని రకాలు గా వ్యదిస్తున్నా) రావ్హయత(త్రి) లు సాహిత్యం పేరుతో కోరుకోడం అమానుషం కదూ!!!!

    ( మళ్ళీ ఓపిగ్గా చదివి తప్పులు దిద్దే ఓపిక ఈ ముసిలడికి లేదు)

  15. Delhi Subrahmanyam says:

    ఇంద్రాణి గారూ ఆవిడ మిత్రులు ఇది కూడా చదవండి. సామాజికం అందులో వచ్చే రాజకీయం గురించి : https://www.facebook.com/photo.php?fbid=1780461618856054&set=a.1415853195316900.1073741826.100006766981893&type=3&ధియేటర్

  16. వాదాలు వాటికవి కవిత్వాలు కావు. వాదాలు వద్దనే వాదం కూడా దానికదే కవిత్వం కాదు. కవిత్వ మీద చర్చను అటు వైపు తీసుకెళ్తున్నారంటేనే మాట్లాడే/రాసే వాళ్ళ వద్ద మాట్లాడడానికి/రాయడానికి తగిన సరుకు లేదని అర్థం. కొండేపూడి నిర్మల ఈ అవసర విషయం చెప్పడానికి/రాయడానికి ఈ అవకాశాన్ని వుపయోగించుకున్నందుకు మనసారా అభినందనలు. చెప్పదలిచింది సరిగ్గా చెప్పారు. పనికి మాలిన పర్సనల్ దాడులు/ప్రమోషన్లు తప్ప ఇలా వస్తుగత చర్చ ఇటీవల తక్కువయ్యింది. అందుకు కూడా నిర్మలకు అబినందనలు.

  17. నిర్మల garu
    చాలా చక్కగా రాశారు — చెప్పారు
    USA రచయితలు లేని పోనీ వాదన ల తో గళం ఎత్తారు–కూటమి //రాజకీయం??
    ========================================================
    Buchi రెడ్డి గంగుల

  18. Sivalakshmi says:

    “అన్ని బాహ్య ప్రభావాలనూ, ఆలోచనలనూ వదిలి పెట్టాలి కవి. అన్ని సామాజిక విలువల వలువలను మురికి గుడ్డలను వదిలినట్టు వదిలేయాలి కవి. ఏకాంతంలో తన్ను తాను దర్శించుకోవాలి. ఈ విశాల ప్రకృతిలో, అప్పుడే పుట్టిన పాపాయిలా స్వచ్చంగా స్పందిస్తూ ఆ అనందంలో మమేకమవ్వాలి. అప్పుడు అల్లాంటి మానసిక స్థితిలోంచి పుట్టేది గొప్ప కవిత” అని అంటారు ఇంద్రాణి గారు “కవిత్వం:కొన్ని ఆలోచనలు”లో.
    వ్యక్తిగతమంటూ ఏమీ లేదు,తెల్లారిలేస్తే జరిగే ప్రతి విషయం వెనక రాజకీయముంటుంది.మరి అన్ని బాహ్య ప్రభావాలనూ, ఆలోచనలనూ కవి అయినవాడు ఎలా వదిలి పెడతాడు?సామాజిక విలువల వలువలను మురికి గుడ్డలను వదిలినట్టు వదిలేసి ఫలాలు,పుష్పాల గురించి,సౌందర్యం గురించి రాయాలా? పక్కిల్లు తగలబడుతుంటే ఆ మంటలు కవుల్ని, మనిషైన వాళ్ళని తాకవా?
    మనుషుల జీవితాల వెనక ,ముఖ్యంగా స్త్రీల జీవితాల వెనక ఉన్న రాజకీయాలు తెలిసిన కవి గనుక నిర్మల యదార్ధమే రాసింది.కవి కైనా ,అసలు ఏ మనిషి కైనా ఈ రోజుల్లో తెలుసుకోవలసినవే మన చుట్టూ జరుగుతున్న రాజకీయాలు ! వాటిని వదిలి ఏ ప్రాపంచిక దృక్పధమూ లేకుండా రాయమనడం న్యాయం కాదు.
    అభినందనలు నిర్మలా !

  19. ఈ చర్చ మొత్తం చూస్తే కొందరు తెలుగు సాహిత్యాన్ని బొత్తిగా పాలో అవుతున్నట్లు లేదు. కవిత్వం మీద ఇంతకంటె మంచి వాదాలు ఏ ఎనభై లలో వచ్చిన వి. వాటకంటె ఈచర్చ ఏ విదంగా ను ప్రామాణికంగా తెలుగు కసాహిత్యాన్ని ముందకు తీసుక పోతున్నట్లా లేక వెనక్కు నెడుతున్నట్లా! నా వ్యాఖ్య వ్యాసాన్ని ఉద్దేశించి కాదు. చివరికి ఇది ధనిక వాదానికి అనుకూలంగా ఎక్కు పెట్టిన వాదం. ఇలాంటి వాదాలకు సాహిత్య గౌరవం దక్కదు. సమాజ ప్రగతి ని కాంక్షించేదే సాహిత్యం.

  20. Amarendra Dasari says:

    ఇంద్రాణి గారి ప్రసంగమపుడు నే ఉన్నాను …విన్నాను..హతాసుడను అయ్యాను..నిర్మల గారు ఆ విషయం రాయడం చూసి సంతోష పడ్డాను

    నిర్మల గారిది వ్యక్తిగత దాడి అనడం సబబు కాదు..ఇంద్రాణి గారి ప్రసంగం అందరిమున్దుకూ వచ్చాక నిర్మల గారు రాసి ఉండవలసింది అనే మాట పైకి సబబే అనిపిస్తున్నా ఆ కార్యక్రమం చూసినవాడిగా అది అంత తిరుగులేని అవసరం అనుకోను …ఎవరో అంటున్నారు…’ఈ చర్చ 80లలొనె జరిగింద’ ని..ippatikii అది చర్చ అంశంగా ఉన్నపుడు చర్చ జరగడమూ అవసరమే కదా …

  21. భాస్కరం కల్లూరి says:

    నిర్మలగారు లేవనెత్తింది సాహిత్యానికి చెందిన మౌలిక చర్చ. అయితే కొత్తది కాదు. ‘ఫి’గారు అన్నట్టు ఎనభైలు, ఇంకా చాలాముందే ఉధృతంగా జరిగిన చర్చ. కానీ కొత్త సందర్భంలో ఈ చర్చ మళ్ళీ ముందుకొస్తోంది. కొత్త తరంలో కూడా! ప్రతి తరం, ప్రతి సందర్భం పాతదనుకున్న ప్రతి అంశాన్నికొత్తగా దర్శించడానికి కొత్తగా అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తుంది. ఆవిధంగా ఈ చర్చకు ప్రాసంగికత ఉంది. సాహిత్య చరిత్రలోకి వెళ్ళి, అసలు ఈ భావజాలం అనే మాట తిట్టుపదంగా ఎప్పుడు మారిందని పరిశీలిస్తే, ‘విదేశీయమైన’ వామపక్షభావజాల పరిచయంతో నన్న సంగతి అర్థమవుతుంది, ‘విదేశీయ’తో కలగలసిన వామపక్షభావజాల వ్యతిరేకతే ఈ చర్చకు ప్రధాన చోదక శక్తిగా మారినప్పుడు చర్చ లోతుకు వెళ్లకుండా ఉపరితలంలోనే పరిభ్రమిస్తుంది. భావజాలం అనే మాటను విదేశీయం, వామపక్షం అనే మాటలనుంచి తప్పించి చూస్తేనే ఆ మాటకు న్యాయం జరుగుతుంది. భావజాలం, లేదా ఐడియాలజీ, లేదా సిద్ధాంతం, లేదా ప్రాపంచికదృక్పథం అంటూ లేని సామాజిక జీవి ఉండడు. సాహిత్యవేత్త అసలే ఉండదు. రామాయణ, మహాభారతాలలోనూ సమాజం ఉంది, ఒక భాజాలం ఉంది. వాటితోపాటు కవిత్వమూ ఉంది. భావజాలాన్ని, కవిత్వాన్ని ఉన్నతమైన పాళ్లతో మేళవించగలగడమే కవి రచయితల స్థాయిని నిర్ణయిస్తుంది.
    చర్చ ద్విపక్షంగా మొదలై, అంతలోనే ఏకపక్షంగా మారిపోయింది. చర్చ కొనసాగి ఆరోగ్యవంతమైన మార్గంలో సాగడం అవసరం. కనుక రెండు పక్షాలూ మాట్లాడాలి.

  22. Amarendra Dasari says:

    ఏ చర్చ అయినా తలదన్నేలా ఉండాలనో పేలవంగా ఉండాలనో మొదలవదు..జరిగిన తరవాత మన మన అంచనాలు మనం వేయవచ్చు…పోనీ పేలవంగానే ఉందనుకొన్నా అసలు మరో సారి చర్చ జరగడమే సంతోష పడాల్సిన మాట కాదా…

    ” ప్రసంగాల తర్వాత గంట చర్చ జరిగింది..నిర్మల గారు ఇవే సందేహాలను (అప్పుడే )వ్యక్తపరచి ఉండవొచ్చు ” అన్నారు చంద్ర గారు..ఆమె ఆ సంగతి అడగటం ఎలా ఉన్నా నేను అడిగాను , మోడరేట్ చేసిన అఫ్సర్ గారిని ” కవిత్వ లక్షణాల గురించిన అవగాహనలో ఇంద్రాణి గారి భావ ధోరణి నారాయణ స్వామి గారు చెప్పినదీ వర్ణ పటానికి రెండు చివరల ఉన్నాయి..మరి మీ అవగాహన yemitii “అని …విషయాన్ని అక్కడే చర్చించడానికి చేసిన ప్రయత్నమిది ..అఫ్సరే కాకుండా వేదికమీద ఉన్న మిగిలిన నలుగురూ – స్వామి, ఇంద్రాణి, నిర్మల, రవిశంకర్- స్పందించారు..కానీ ఇది అలా క్షణాల్లో తేలే విషయం కాదు కదా…

    • సారీ, తలదన్నడం అంటే నా ఉద్దేశం … వెనకటి తరం కంటే ఈ తరం ప్రగతి శీలంగా ఉండటం అని. అందకే ఆమాట వాటాను.

  23. chandolu chandrasekhar says:

    ఏవిటో ఈ గోల రసవాదం వేరు aesthetic వేరు . రసవాదం అంతిమంగా మతవాదం .aesthetic ద్రుష్టి కొచెం విశాల దృక్పధం ,అబ్యుదయ ,మానవీయత వుంటుంది .కనీసం అభినవ గుప్తుడు రససిద్దాంతం మిద ,19 శతాబ్దం నుండి మొదలైన aesthetic sence మిద చర్చ చేయండి .జనానికి విషయం తెలుస్తుంది .

  24. చండోలు చంద్రశేఖర్ గారు, ఇక్కడ రసవాదం గురించిన చర్చకాదు, రసదూరం గురించిన చర్చ.

  25. రాసేది పదుగురు
    చదివేది నలుగురు
    చూసేది ముగ్గరు
    గుద్దులాడేది ఎందరు

    తెలుగు కవితా
    నీ గోరి ముందరే అందరూ

  26. మద్దుకూరి చంద్రహాస్ says:

    సదరు సభలో ఉన్న వాడిగా రెండు మాటలు.
    ఇంద్రాణిగారు చెప్పదలచుకున్నది సరళంగానేగాక, సూటిగా చెప్పినమాట నిజం. సభలోఉన్న శ్రోతలకు అది అభిలషణీయం కూడా. నిర్మలగారి విమర్శ ఇంద్రాణిగారి అభిప్రాయాలతోనే కాక మొత్తం ఒక shool of thought గురించి. అందుకోసం ఇంద్రాణిగారి పుస్తకం గురించి దాని ముందుమాటగురించీ ప్రస్తావించారు అనుకుంటున్నాను. అంతవరకూ బానే ఉంది. అయితే వ్యాసంలో ఇబ్బందికలిగించిన విషయాలు కొన్నున్నాయి.
    ‘ఆర్కిమెడిస్ సిద్దాంతంలాగా ఖచ్చితమైన స్వరంతో చెప్పింది. కాబట్టి ఇటువంటి ప్రకటనల .. ’. ఇటువంటి వ్యక్తిగత స్థాయి విమర్శల వల్ల ప్రమాదం పైన ‘సుబ్బు’ అనే ఆయన కామెంట్లలో కనబడుతుంది. ఈమాటలను పట్టుకుని ఆయన ఇంద్రాణిగారికి అహంకారం, కిక్ తలకెక్కిందని వ్రాశారు. ఇది అనవసరం, బాధాకరం. ఖచ్చితమైన స్వరంతో చెప్పిటం తప్పైతే, అది ప్రకటన అయితే , నిర్మలగారి ఉపన్యాసం మొత్తం అదే ఖచ్చితమైన స్వరంతో సాగటం ఆవిడ నమ్మిన సిధ్ధాంతానికి ప్రకటనప్రాయంగా ఉండటం అవిడ మర్చిపోయినట్టున్నారు.
    ‘పదిమ౦దిని దూషిస్తే తప్ప పదకొండో వాడ్ని గౌరవించడం కష్టమనుకు౦టే అది వారి వ్యక్తిగత బాధ.’ ఇంద్రాణిగారు ప్రసంగంలో తన అభిప్రాయాలు చెప్పారుగానీ ఎవరినీ దూషించినట్టు నాకు గుర్తులేదు. ఆవిడ అభిప్రాయాల పట్ల ఒక అసహిష్ణుత ఈ వ్యాసంలోనూ, ఎవరైనా ఆమె పక్షం మాట్లాడితే వారి మీద మిధ్యారోపణలు ఇక్కడ కొంతమంది కామెంట్లలోను ఎక్కువ కనబడుతున్నాయి. ఇది సారంగ సంపాదకులకు ఒక పరీక్ష.
    వాదాలను ప్రక్కన పెడితే ఇక్కడ మౌలికమైన ప్రశ్న ‘ఏది కవిత్వం’ అని. ఇది చర్చదానికి పరిమితమై ఉంటే బాగుండేది.

  27. నిర్మల గారి వ్యాసమూ, దానిపై వచ్చిన కామెంట్లనీ చదివాను, ఒక సందేహం కలిగింది, నివృత్తి చేసుకునేందుకు మరోసారి అన్నీ చదివాను. ఇక నిర్ధారణ చేసుకుని ఇలా రాస్తున్నాను.
    ఒక వాదాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మేవారు కవిత్వం రాయడం ప్రశంసనీయం కాదా? అసలు కవిత్వం అంటే అన్ని వాదాలకూ, నిబద్ధతలకూ అతీతమైన ఆదర్శమా? ఇటువంటి (అంటే ‘ఇవే’ అని కాదు, నా అవగాహన మేరకు) ప్రశ్నలను సంధిస్తూ, నిర్ద్వంద్వంగా ‘కాదూ’ అని ఇంద్రాణి గారు అభిప్రాయ పడ్డారని నిర్మల గారు రాసారు (అని నేననుకుంటున్నాను).
    ఐతే ఆమె (ఇంద్రాణి) అలా అని ఉండక పోతే ఆమే ఆ విషయాలను ఖండిస్తారు. అంతవరకూ ఆమె అభిప్రాయాలని చర్చనీయాంశాలు గా భావిస్తే ఏమీ నష్టం ఉండదు పైగా అది ఎంతో అభిలషణీయం.
    అలాటి వాదోపవాదాల్లో ఔననే వారూ, కాదనే వారూ ఉండడం సహజం. ఇక్కడే నేను మొదట్లో వ్యక్తం చేసిన సందేహం కలిగింది.
    నిర్మల గారు సరైన పని చేశారనీ, వారి అభిప్రాయం తో ఏ కీభవిన్చేవారు స్పష్టంగా చెప్తున్నారు.
    కానీ ఆమెను విమర్శిస్తున్న వారు ఒక్కరూ (ఒక్కరంటే ఒక్కరూ కూడా) ఆ చర్చ జోలికే పోవడం లేదు. ఆమె రాసి ఉండకూడదనీ, ఆగి ఉండవలసిందనీ, అక్కడే అడిగి ఉండవలసిందనీ, రాసినా వ్యక్తిగతంగా రాసి ఉండకూడదనే వారే – అయితే, ఎంతో ముఖ్యమైనదని తోచి నిర్మల గారు చర్చలోకి తెచ్చిన ఆ అంశం పట్ల ‘వారి’ నిర్ణయం ఏమిటో తెలియజేయ వలసిన అవసరం ఉందనుకుంటున్నాను.
    నా వరకూ నాకు ఈ చర్చ ఒక మంచి పరిణామమని భావిస్తున్నాను, నిర్మల గారి భావాలతో పూర్తి సమ్మతి ఉంది. అలాగే మిగిలిన సాహిత్యాభిమానులందరికీ ఒక విజ్ఞప్తి. ఈ సమయం లో మీరేవైపు నిల్చున్నారో ప్రకటించి, ఒక వేళ వ్యతిరేకిస్తే -ఎందుకో కూడా రాస్తే సాహిత్యవిమర్షకు మేలు చేసిన వారౌతారు.

    • *
      (ఒక వాదాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మేవారు కవిత్వం రాయడం ప్రశంసనీయం కాదా? అసలు కవిత్వం అంటే అన్ని వాదాలకూ, నిబద్ధతలకూ అతీతమైన ఆదర్శమా? ఇటువంటి (అంటే ‘ఇవే’ అని కాదు, నా అవగాహన మేరకు) ప్రశ్నలను సంధిస్తూ, నిర్ద్వంద్వంగా ‘కాదూ’ ) అంటూ రాసాను పైన. మన్నించాలి. ‘కాదు’ ఆ మొదటి ప్రశ్నకి మాత్రమే.
      రెండో ప్రశ్న విషయానికొస్తే – కవిత్వం అన్నిటికీ అతీతమైన ఒక బ్రహ్మపదార్ధం లాగానే రసవాదు లందరూ భావిస్తారు నేనేరిగినంత వరకూ. నిర్మల గారన్నట్టూ అలా వారు భావించినంత వరకూ నాకూ ఏ అభ్యంతరమూ లేదు, కానీ అలా కాక వ్యక్తిగత భావావేశం, సామాజిక నిబద్ధతా – దూరంగా ఉంచాల్సిన విషయాలని ప్రకటిస్తేనే – వ్యతిరేకించ వలసి ఉంటుంది.

      • మంజరి లక్ష్మి says:

        నిర్మల గారు చెప్పినదాన్ని రొండు మాటల్లో విడగొట్టి బాగా చెప్పారు కల్యాణి గారు బాగుంది

  28. శ్రీనివాసుడు says:

    నేటి ఆంధ్రజ్యోతిలో మెహెర్ గారి వ్యాసం ‘‘ బర్నింగ్ ఇష్యూ బారిన తెలుగు కథ’’ లంకె.
    http://epaper.andhrajyothy.com/c/11117361

  29. Ramana Juvvadi says:

    మనం ఏం అన్నాం అన్నది కాదు ప్రశ్న. అవతలి వాడు ఏం విన్నాడు అన్నది సమస్య. ఆ సభలో ఇంద్రాణి మాట్లాడినప్పుడు నేను కూడా ఉన్నాను. దానికి ఈ రకమైన భాష్యం చెప్పొచ్చని నిర్మల గారి వ్యాసం తరవాతే అర్థం అయింది. ఆవిడ మాట్లాడింది కవిత్వం రాసేటప్పుడు కవులు కవయిత్రులు పడే వేదన గురించి. అది తను స్వంతగా అనుభవించిన సమస్య. కొత్తగా రాయాలనుకున్న వారు తమకి అవసరం అయినంత తీసుకోవచ్చు. లేకపోతె వదిలెయ్యొచ్చు.

    అసలు ఆ ప్రసంగం మీద ఇంత వివాదం సృష్టించ గలిగిన మీ శక్తికి, నిర్మల గారూ, నా జోహార్లు.

  30. rani siva sankara sarma says:

    మెహెర్ గారి వ్యాసం గురించి ఈ సందర్భంలో చర్చ జరగాలని నేను ఆశిస్తున్నాను .

  31. Chandra Kanneganti says:

    చర్చ జరగడం పట్లా, ముందు నేను లేవనెత్తిన అభ్యంతరాలు తప్ప నిర్మల గారు రాసిన దాని పట్లా నాకు పెద్ద పేచీ ఏమీ లేదు. It may be surprising and seems contradicting but I can understand and empathize with both sides. ఒక స్నేహపూరిత వాతావరణంలో ఎవరి అభిప్రాయాలు వాళ్లు చెప్పుకుని, గౌరవంగా వీడ్కోలు తీసుకుని ఎవరి దారిన వాళ్లు పోగలిగిన అవకాశాన్ని వదిలి, చర్చలు అర్థవంతంగా జరగగల ఆరోగ్యకరమైన వాతావరణం ఇక్కడ లేదని తెలిసీ అదీ personal notes తో కొనసాగించడాన్ని ఇప్పటికీ ఒప్పుకోలేను. బహుశా నాకు ఈ వాదాలకంటే మనుషులే ముఖ్యమనుకుంటాను. ఈ వాదాలు ఇప్పటివి కాదు, ఇప్పుడు ముగిసిపోవు. ఇంద్రాణి గారు చెప్తేనో, నిర్మల గారు రాస్తేనో కవిత్వం తీరుతెన్నులు మారవు. ఏ స్వరంతో చెప్పినా అవి వారి అభిప్రాయాలు మాత్రమే. ఎవరినీ బోనెక్కించనక్కర్లేదు.
    కవిత్వమంటే ఇదే, ఇలాగే ఉండాలి అని ఎవరో అన్నంత మాత్రాన ఆవేశపడిపోనక్కర్లేదు. క్రీస్తు/అల్లా తప్ప దేవుడు లేడనీ, నమ్మని వారు పాపాత్ములనీ అనే మతాలే ఉన్నాయి. అయినా మనం వాళ్లను అర్థం చేసుకుంటాం. వాళ్ల పట్ల సహనం పాటిస్తాం. కవిత్వమేపాటిది!
    ఏ వైపున ఉన్నామో తేల్చమంటారు కానీ ఎటు ఉన్నా మనమంతా ఒడ్డున తచ్చాడే వాళ్లమే కాదా! దిగినవాళ్లకూ, నిండా మునిగిన వాళ్లకూ కవిత్వాలు పడతాయా, కవిత్వపు గొప్పలు పడతాయా?
    సామాజిక, రాజకీయ ప్రయోజనం కోసమే రాస్తున్నప్పుడు ఇక అది గొప్ప కవిత అయితేనేమి, కాకపోతేనేమి? అసలు దాన్ని కవిత అనకపోతేనేమి? దాని కొలమానం వేరు కాదా? ఆ ప్రయోజనం నెరవేర్చడంలో దాని సామర్థ్యాన్ని కదా అంచనా వేయవలసింది?
    ఉద్యమ కవిత్వాలు (పాటల్ని వదిలేస్తే) ఉద్యమాలకు ఎంతవరకూ దోహదపడుతున్నాయి? (కొలవడం కష్టం కానీ ప్రభావం లేకుండా ఎలా ఉంటుంది అనొద్దు. అంత కష్టమేమీ కాదు. ఇంకా అవసరం కూడా. ఉద్యమాలపై ఎక్కువ ప్రభావం చూపే మాధ్యమాన్ని ఎంచుకోవాలి కదా!) మీరొక కవిత చదివేరనుకుందాం, హృదయాన్ని కదిలించేదో, మరిగించేదో. అది చదివాక అదెంత గొప్ప కవితో, ఎంత పదునైన భావమో, మెచ్చుకుంటూంటారా, రాస్తే అలాంటిది రాయాలనుకుంటారా లేక ఆ బాధ కలిగిన వాడికి ఏ కొద్దిగానయినా సాయం చేయాలని ప్రయత్నిస్తారా? దొంగేడుపులూ, నక్క నాటకాలూ వదిలేసినా నిజంగానే దుఃఖపడేవాళ్ళూ ఉన్నారు కదా!వాళ్లూ ఉద్యమానికి నావంతు సాయం ఇంకో నాలుగు పద్యాలు అంటే కుదరదు కదా!
    నాకు ఇబ్బందిగా అనిపించేవి రెండు – ఒకటి ఎక్కువ శాతం పై పై రాతలకే పరిమితం కావడం. (చేస్తూ రాసే వాళ్ళూ, రాస్తూ చేసే వాళ్లూ కూడా ఉన్నారని తెలుసు నాకు. వాళ్ల అనుభవాలేమిటి? వాళ్ల రాతల వల్ల ఎక్కువ ప్రయోజనం సిద్దించిందా లేక చేతల వల్లనా?) రెండోది దీన్నుంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలనుకోవడం. ఇది రాసింది నేను అని చెప్పుకోకూడని సందర్భాలు కావా అవి? గాయానికి కట్టు కట్టి దానిపై పేరెవడూ రాసుకోడు. Everybody loves a good drought..including the poet అనిపించుకోకూడదు కదా!

    • శివ కుమార్ చౌదరి says:

      వాదాలెప్పుడూ మనుషుల పక్షమే! వాదాలకు దూరంగా, మనుషులకి దగ్గర గా ఉండటం అసాధ్యం. మీకు మనుషులు కాదు, వ్యక్తులు ముఖ్యమని స్పష్టంగా తెలుస్తోంది.

      వాదాల మీద కవిత్వం రాసే వాళ్లెవరూ నిజంగా సమస్యల మీద పోరాడరనీ కవిత్వం రాసి వూరుకుంటారనీ మీ ఆరోపణ. ఆ కవిత్వం ఎన్నో మెదళ్లలో తెచ్తిన కదలికల మాటేమిటి? అది ఫలవంతం కాదా?

      ఎవరో అన్నంతో మాత్రాన ఆవేశ పడిపోనక్కర్లేదని సలహా ఇచ్చిన మీరు చేసిన పని సరిగ్గా అదే! ఇంద్రాణి జవాబు చెప్పే అవసరం కూడా లేకుండా వకాల్తా పుచ్చుకుని వ్యాస రచయిత్రి మీద ఆవేశ పడి పోవటం.

  32. Raghavendra says:

    ఇంతకీ ఉత్తరతెలుగు అమెరికా అంటే అది ఎక్కడ ఉందండీ?

  33. ‘ఉత్తర అమెరికా తెలుగు సమితి’ నిర్వహించిన “నాటా సాహిత్య వేదిక”లో ‘కవిత్వానికి ప్రేరణ’ పై “పాలపర్తి ఇంద్రాణి” గారి ప్రసంగం: https://youtu.be/C4y7u6oTcMo వీడియో ఆలస్యమైనందుకు క్షమాపణలతో…

  34. sundaram turlapati says:

    కొండేపూడి నిర్మల రాసిన వ్యాసంపై జరిగిన చర్చలో కొన్ని ముఖ్య విషయాలు మరుగున పడి, ఆ చర్చ వ్యక్తిగత రూపాంతరం చెంది, భావోద్వేగాలకు దారి తీసింది. ఈ మరుగున పడ్డ విషయాలు మరొక మారు పునశ్చరణ చేసుకుని, చర్చ ఎక్కడ పక్క దోవ పట్టిందో గుర్తిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.
    ఇంద్రాణి గారి ప్రసంగంలో అందరూ అంగీకరించ గల్గిన ( ముఖ్యంగా చర్చ లేవనెత్తిన నిర్మల అంగీకరించిన) విషయాలు ఇవి:
    1. కవి నిరంతర అధ్యయనపరుడు కావాలి.
    2. కవి తన కవిత్వానికి పరిమితులు విధించుకోకూడదు,లేదా, వస్తు వైవిధ్యం లేకపోతే కవిత్వం మొనోటనస్గా వుండే ప్రమాదం ఉంది. (ఇంద్రాణి గారి ఉద్దేశం ఇదే అయివుంటే బాగుండు.)
    3. వస్తు ఎంపికలో కవికి స్వేచ్చ ఉంది.
    4. ఇంద్రాణి గారి కవిత్వం మెత్తని మృదువైన కవిత్వం. అనుభూతి, ఆహ్లాదం ఆమె కవితాలక్ష్యం.
    5. కవితా రచనకు ప్రేరణ- మంచి కవి మిత్రులు, సరళ జీవన విధానం, ప్రకృతితో మమేకం, వీటన్నిటితో గూడిన ఏకాంతం.
    ఆమె ప్రసంగంలో నిర్మల అభ్యంతరం లేవనెత్తిన విషయాలు ఇవి:
    1. కవి అధ్యయనపరుడైనా, తను చదివిన పుస్తకాలు, లేదా విన్న ప్రసంగాల వల్ల ఆకర్షితుడు కాకూడదు.
    2. తను ఫలానా బాధిత వర్గానికి, లేదా కులానికి, మతానికి చెందినా వ్యక్తిగా భావించ రాదు. మార్పులు, వయసు పెరగడం, అనుభవాలు సృష్టించుకోవడం కూడా సరైనది కాదు.
    3. ఉద్యమకారులు ఉద్యమాలు చేసుకోవాలి. వాళ్ళు రాసేది కవిత్వం కాదు.
    ఇంద్రాణి గారు ఇవన్నీ తన అభిప్రాయాలుగా చెప్పడమే కాదు, కవిత్వానికి అవి ప్రామాణికాలన్నట్లు నిర్ద్వందంగా ప్రకటించారు. ఆ విధంగా చర్చకు తెర తీసినది ఇంద్రాణి గారే. అలాగే ఇంద్రాణి గారి పుస్తకానికి ముందు మాటలో వర్ణించిన స్త్రీల ఉద్వేగాలు, వాటి స్వభావ రీతుల గురించిన విశ్లేషణ అంగీకారయోగ్యంగా కనిపించ లేదు. వీటి గురించి చర్చించాలనే నిర్మల రాసింది. కనుక నిర్మల రాసింది దాడిగా పేర్కొవడం సరి కాదనిపిస్తుంది.
    ఒక మంచి కవిత్వం రాయడానికి ప్రేరణ, తదనుగతమైన భావన, రాసేదాన్ని గురించి భావ స్పష్టత మౌలికంగా అవసరమని నా అభిప్రాయం. ఈ మూడు కాక, నిబద్ధత మరొక మూలకం. అయితే ఇది వ్యక్తిగతం అని నా అభిప్రాయం. కొందరు అనుభూతి వాద కవులైతే, మరొకొందరు అస్థిత్వవాదులు కావచ్చు. కృష్ణ శాస్త్రి భావ కవిత్వాన్ని ఆస్వాదించిన మనసుతోనే, శ్రీశ్రీ కవిత్వాన్ని మనం ఆస్వాదిస్తున్నాం. దిగంబర కవుల రచనలనూ చదివి ఆనందించాం. వీరందరూ తమ కవిత్వాన్ని ఒక తపస్సుగానే భావించారు. ప్రభంద కవుల కల్పనా చాతుర్యం నుంచి, నేటి వరకు కవిత్వం కాలానుగుణంగా మార్పు చెందుతూనే ఉంది. ఎవరు ఎందుకలా రాస్తున్నారని ప్రశ్నించడం, ఉద్యమకారులు రాసేది కవిత్వమే కాదనడం సరి కాదు.
    ఉద్యమాల్ని నడిపించే వ్యక్తికీ ఎంత నిబద్ధత, మనశ్సుద్ది కావాలో, ఉద్యమ స్ఫూర్తి కవిత్వానికి అంతే మనశ్సుద్ది, నిబద్ధత అవసరం. అప్పుడే, ఆ ఉద్యమానికైనా, కవిత్వాని కైనా సాఫల్యత. నిబద్ధత, మనశ్సుద్ది లేని ఏ కళా ఎక్కువ కాలం నిలబడదు.
    ఏ దేశ చరిత్ర చూసినా, కవులు పాల్గొనని ఉద్యమం లేదు. దేశ స్వాతంత్ర సమరంలో మన తెలుగు కవులూ పాల్గొన్నారు. తమ కవిత్వంతో ప్రజలను ఉత్సాహ పరిచారు. చిలకమర్తి వారు రాసిన “భరతఖండంబు చక్కని పాడి యావు” అన్న పద్యం స్వాతంత్ర సమర స్పూర్తితో రాసిందే. అప్పట్లో ఆ పద్యం అందరి నోళ్ళలో నానుతుండేది. ఆ పద్యం పాడకూడదని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధం విధించినట్లు గుర్తు. స్వర్గీయ ఘంటసాల పాడిన “స్వాతంత్రమే నా జన్మ హక్కని చాటండి” అనే పాట, “భారతీయుల కళా ప్రాభవమ్ము లిఖించి” లాంటి పాటలు ఆ సమయంలో వచ్చినవే. అవి ఇప్పటికీ ఆణిముత్యాలే. తెలంగాణా ఉద్యమంలో సిద్దారెడ్డి రాసిన కవిత్వం పాత్ర లేదనలేము.
    అస్తిత్వ వాద కవులు అనుభవాలు సృష్టించుకోరు. ఒక రకంగా అనుభూతి వాదంలోనే కల్పనలు ఎక్కువ వుంటాయి. అసలు అనుభవం అనేది సృష్టించుకునేదా? ఎవరేం రాసినా, కవుల కన్నా, కవిత్వమే గొప్పది. కవులూ,రచయితలూ మామూలు మనుషులే. వారి ఉద్వేగాలు, ఆవేశాలు కవిత్వంలోనూ, రచనల్లోనూ ప్రతిఫలిస్తాయి. దానికి ఇప్పటి వరకూ జరిగిన ఉద్వేగ పూరిత చర్చే ఉదాహరణ. ఉత్తమ కవిత్వం చిరస్మరణీయంగా నిలుస్తుంది. ఒక విధంగా కవిత్వం ఉత్తమం అనడానికి అదే కొలబద్ద. ఆ కవిత్వం అస్తిత్వ వాదం, అనుభూతి వాదం, మైనారిటీ వాదం లేక, స్త్రీ వాదం- ఏదైనా కావచ్చు. ఇందుకు ఉదాహరణ శ్రీ శ్రీ “మహా ప్రస్తానం”, నగ్నముని “కొయ్య గుర్రం”, పైడి తెరిష్ బాబు “హిందూ మహా సముద్రం”, ఖాదర్ రాసిన “పుట్టు మచ్చ” ఇవన్ని వ్యక్తిగత అనుభవాలలోని సామాజిక కోణాలు కాదా? వీటిలో సాంద్రతను కాదనగలమా?
    పాటకుడు ఆ మాట కొస్తే, మరింత ఎక్కువగా కవి అన్న వాడూ, సహృదయంతో మంచి కవిత్వాన్ని ఆస్వాదించ గలిగితే చాలు, మన కవిత్వానికి మంచి రోజులు వచ్చినట్లే!
    —–సుందరం తుర్లపాటి

  35. సుందరం తుర్లపాటి… వెల్ సెడ్ సర్.

Leave a Reply to Sivalakshmi Cancel reply

*