“ఇదీ ఓ కథే”

 

 

-భువనచంద్ర 

~

 

అదో పిచ్చిముండ. చెప్పినా విని చావదయ్యా.. ఏం చెయ్యనూ? “పటపటా తలబాదుకుంటూ అన్నది శేషారత్నం. శేషారత్నంది కృష్ణాజిల్లా. పుట్టింది పల్లెటూళ్ళో అయినా పెరిగింది మాత్రం విజయవాడలో. తల్లిదండ్రీ ఉన్నవాళ్లు గనక 10thవరకు చదివి, ఫస్టుక్లాసులో పాసై, డిగ్రీ 2nd  yearలో ప్రేమలో పడి, వాడికోసం నగానట్రాతో సహా మద్రాసు పారిపోయి వచ్చింది. తోడొచ్చినవాడు తెచ్చినవన్నీ ఊడ్చుకుపోతే, ఎలాగోలా మళ్లీ తల్లిదండ్రుల పంచన చేరి జీవితాన్ని మళ్ళీ సజావుగా మలుచుకునే  ప్రయత్నంలో సక్సెస్ అయింది.”అక్షమాల” శేషారత్నం కూతురు. మహా మొండి. అయితే ఆ పిల్ల అందం చెప్పనలవిగాదు.

ఆడపిల్ల అందగత్తె కావడం అదృష్టమే. కానీ, ఆడపిల్లకి తాను అందగత్తెనని తెలిస్తేనే తలనొప్పులు వచ్చేది. అక్షమాలకి నూటికి నూరుపాళ్ళు తాను అందగత్తెనని తెలుసు. అందుకే పట్టుపట్టింది. విషయం చాలా సింపుల్. హైద్రాబాదులో నూతన నటీనటులకోసం ‘సెలక్షన్’ నిర్వహిస్తున్నారు. అక్షమాల అందులో పాల్గొంటానంటుంది. శేషారత్నానికి ఏమాత్రం ఇష్టం లేదు.

“శేషమ్మా.. ఎట్లాగూ వినదని తెలుసుగదా.. పోనీ ఓసారి పంపిస్తే ఏంబోయిందీ? సెలక్టయితే వెరీగుడ్. కాలేదనుకో.. తిరిగొస్తుందీ! అంతేగా..!” నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు తిరగలినాయుడు. తిరగలినాయుడిది ఏలూరు. అసలు పేరు రాజశేఖరనాయుడు. అతనిది చిత్రమైన వ్యాపారం. రోళ్ళూ, రోకళ్ళూ, తిరగళ్ళూ ఉన్నాయి.. ఊరగాయలకి కావలసిన సమస్తం అంటే కారం, ఆవపిండి, మెంతిపిండీ, పసుపూ, అన్నీ మేన్యువల్‌గానే తయారుచేయిస్తాడు. పప్పునూనె, కొబ్బరినూనె, నువ్వుల నూనె, వేరుసెనగనూనె కూడా గానుగ ఆడే సిద్ధం చేస్తాడుగానీ,, మిల్లునూనెలతో వ్యాపారం చెయ్యడు. నిఖార్సయిన సరుకు సప్లై చెయ్యాలంటే నాయుడి తరవాతే ఎవరైనా. ఖరీదు కాస్త ఎక్కువయినా క్వాలిటీలో నంబర్ వన్ గనక వ్యాపారం మూడు పువ్వులూ ఆరు కాయల్లా వృద్ధి చెందుతోంది.

నాయుడికీ శేషారత్నానికి పరిచయమైంది మద్రాసులోనే. పారిపోయి వచ్చినప్పుడు టి.నగర్‌లో ఉన్నది శేషారత్నం(తోడు వచ్చినవాడితో).  ఆ పక్కనే మరో గదిలో అద్దెకుండేవాడు నాయుడు. తోడొచ్చినవాడు ఉడాయించినప్పుడు ఆదుకుని, ఆదరించి, మంచీ చెడూ వివరించి, దగ్గరుండి మరీ తల్లిదండ్రులకి అప్పగించిన నాయుడంటే శేషారత్నానికి దేవుడితో సమానం.

దేవతలూ దానవులూ కూడా ఉండేది మనుషుల్లోనే. నాయుడు నిజంగా గొప్పమనిషి. అంతేకాదు కాలంతోపాటు మార్పు సహజం అనుకునే మనస్తత్వం  వున్నవాడు. తప్పని పరిస్థితుల్లో ఏటికి ఎదురీదాలనీ అతనికి తెలుసు.

సినిమాల్లో ‘పాదరసం’లాంటివాళ్ళు చాలామందే వున్నారు. రాకేష్ అలాంటివాళ్లల్లో ఒకడు. పదిహేడో ఏట సినిమా మీది పిచ్చితో మద్రాసు వచ్చాడు. ‘రెండురోజులు మాత్రం వుంటానని రిక్వెస్టు చేసి, ఆ ఇంట్ళోనే నెలరోజులున్నాడు. ఆ నెల రోజుల్లోనే ‘వడపళని’లో ఓ తమిళియన్ ఇంట్లో రూం సంపాదించి, ఓనర్ మనవరాల్ని మెల్లగా ముగ్గులో దించాడు. ఇతనికి పదిహేడూ పద్ధెనిమిది మధ్య.  ఆ పిల్లది 28. పెళ్ళి కాలేదు. ఇతనేమో అందగాడే. ఆ పిల్ల అనాకారి కాదుగానీ అందగత్తె కూడా కాదు. ఇంటద్దె మొత్తం దొంగతనంగా ఆ అమ్మాయే రాకేష్ చేతికిచ్చి, ఆ డబ్బుని వాళ్ల తాతకి ఇప్పించేది. అంతే కాదు పాకెట్ మనీ కూడా ఇచ్చేది. ఆ పిల్లకి తల్లిదండ్రీ చిన్నప్పుడే పోయారు. తాత అమ్మమ్మలే పెంచారు. అమ్మమ్మ కూడా రెండేళ్ల క్రితం కాలం చేసింది. ఆ అమ్మాయి పేరు ‘అఖిల’.

ఇంటి ఓనర్ పేరు తోతాద్రి. వాళ్లు తమిళ బ్రాహ్మళ్లు. తోతాద్రి తహసీల్‌దార్‌గా పనిచేసి రిటైర్ అయ్యాడు. బాగా సంపాయించాడు. టి.నగర్‌లో మూడు ఇళ్లున్నాయి. ఒక్కో ఇంట్లోనూ నాలుగు పోర్షన్లు. పెన్షన్ + ఇంటి అద్దెలు కలుపుకుంటే  బ్రహ్మాండమైన రాబడి. ఒక్కతే కూతురు. ఆ కూతురు, అల్లుడు చనిపోయారు. తోతాద్రికి మిగిలింది అఖిల ఒక్కతే.

“నేను పెళ్లి చేసుకుని వెళ్లిపోతే నిన్నెవరు చూస్తారూ?”అంటూ ఇంతకాలం పెళ్ళి చేసుకోకుండా వున్న అఖిల అంటే ఆయనకు ప్రాణం.

రాకేష్ అఖిలని ముగ్గులోకి దించడం గమనించినా, గమనించనట్టు వూరుకున్నాడు తోతాద్రి.’చిన్నవాడో, పెద్దవాడో ఎవడైతేనేం. అఖిల ‘సెటిల్’ కావడం ముఖ్యం’ అనుకున్నాడు.

రాకేష్‌కి హాయిగా గడిచిపోతోంది. మొదట్లో ‘మెస్’కి వెళ్ళేవాడు. అదీ అఖిల ఇచ్చే డబ్బులతోనే. ఆ తరవాత అఖిలే ‘పేయింగ్ గెస్ట్’పేరిట అతనికి కూడా వండేది.

అఖిలకి ఆ ‘యావ’ ఎక్కువ. ప్రతి శుక్రవారం మొహం, కాళ్లూ, చేతులకి చక్కగా పసుపు రాసుకుని, తలంటి పోసుకుని  మహాలక్ష్మిలా కనిపించేది. అందగత్తె కాకపోయినా ఆమెకి వున్న తెలివితేటలు అమోఘం.

కొత్త బిచ్చగాడు పొద్దెరగడన్నట్టుగా వెంటబడుతున్న రాకేష్‌ని జాణతనంతో దూరంగా పెడుతూ, మళ్లీ తనే  దగ్గరగా వచ్చినట్టు వస్తూ ఓ బ్రహ్మాండమైన కైపులో ముంచింది.  ఒకసారి ఆ ‘రుచి’ మరిగినవాడెవడూ వదిలి పోలేడని అఖిలకి తెలుసు.

తోతాద్రికి జరుగుతున్నదంతా తెలుసని అఖిలకి తెలుసు. ‘రాకేష్’ మాత్రం ఫ్రీ బోర్డింగ్ , లాడ్జింగ్‌ని సంపాయించుకున్నందుకు మహదానందంగా వున్నాడు.

పొద్దున్నే దిట్టంగా టిఫిన్ పట్టించి పాండీబజారుకి పోవడం. అక్కడ చెట్లకింద వాలే సినీపక్షులతో పరిచయాలు పెంచుకోవడం చేశాడు. రాకేష్ ‘పాదరసం’లాంటివాడని ముందే అనుకున్నాం కదా.. ఆమాటే నిజం చేశాడు. కరెక్టుగా అఖిలతో ‘పరిచయం’ పెరిగిన నెలరోజులకల్లా సూపర్ డైరెక్టర్ మోహన్ ప్రసాద్ దగ్గర అసిస్టెంట్‌గా చేరిపోయాడు. మోహన్  ప్రసాద్ పట్టిందంతా బంగారమే. ఆయన చేసిన సినిమాల్లో 90% నూర్రోజులకి పైగా ఆడినవే. మిగతావీ ఎబౌ ఏవరేజేగానీ, ఒక ఫ్లాప్ కూడా లేదు.

మోహన్ ప్రసాద్ కి ముగ్గురూ ఆడపిల్లలేగానీ మగపిల్లలు లేరు. రాకేష్‌ని చూడగానే ఆయనకి మనసులో మెదిలిన వ్యక్తి తన మూడో కూతురు. పెద్దపిల్లలిద్దరూ బుద్ధిమంతులు. చెప్పినట్టు వింటారు. మూడోపిల్ల మహా పెంకిది.తను పట్టుకున్న కుందేటికి రెండే కాళ్లు అనే రకం. అదీగాక కులం పెర్‌ఫెక్టుగా కలిసింది. మెల్లిగా కుర్రాడ్ని దారిలో పెడితే పైకి రావడమేగాక ‘ఇల్లరికం’ కూడా తెచ్చుకోవచ్చు.

వేలు చూపిస్తే చెయ్యి మింగేసే  రకం రాజేష్. డైరెక్టర్‌గారిదగ్గర సిన్సియర్‌గా పని నేర్చుకుంటూనే ఆయనకి చేతిలో పెన్నూ, తలలో నాలికలాగ మారాడు.

“పూర్ణానందంగారూ, యీ కుర్రోడు చాకూ, కత్తీ లాంటోడు గాదు, పుటుక్కున పొట్టలో దిగే కైజార్‌లాంటోడు. మోహన్‌గారు అమాయకంగా నమ్ముతున్నాడీయన్ని. ఏదో ఓ రోజు యీడు ఆయనకే వెన్నుపోటు పొడవకపోతే నన్ను చెప్పెట్టి కొట్టండి.” అన్నాడు కో డైరెక్టర్,   సీనియర్‌మోస్ట్ రైటర్ పూర్ణాంద్‌తో. చిన్నగా నవ్వాడు పూర్ణానంద్. ఆయన పక్కా మితభాషి మాత్రమే కాదు. ఎక్కడ, ఎవరితో, ఎంతసేపు మాట్లాడాలో ఖచ్చితంగా తెలిసిన మేధావి. “ఇదిగో సురేషూ, విత్తనం ఎక్కడిదీ, ఎవరిచ్చారూ అనేది ముఖ్యం కాదయ్యా. మొక్క ఎలా పెరుగుతోందనేది ముఖ్యం.

వీడు ఎవర్ని ముంచుతాడో, ఎవర్ని వెన్నుపోటు పొడుస్తాడో తరవాత సంగతి. ఒకటి మాత్రం నిజం. వీడు గనక వీడికున్న తెలివితేటల్ని సక్రమంగా ఉపయోగించుకుంటే మరో దిగ్దర్శకుడవుతాడయ్యా…!” అన్నాడు పూర్ణానంద్ 555 సిగరెట్ పీలుస్తూ. ఏడాది గడిచింది.

కొందరి మాటలు ఫలిస్తాయి. కారణం చెప్పలేం. పూర్ణానంద్ మాట ఫలించింది. ఓ పేద్ద హీరో రాకేష్‌కి డైరెక్షన్ ఆఫర్ ఇచ్చాడు. అంతేకాదు, “నేనితని వయసు చూడలా. పరిణితిని మాత్రమే చూశా.!” అని ఓ గొప్ప స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. ఇక్కడి పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే, నీ పక్కన వుంటూ,  నీ మీల్స్ టికెట్ మీద భోంచేస్తున్నవాడే, వాడికి లాభం వుందనుకుంటే నీ మీదే విషం చిమ్మగలడు.

తెలివైనవాడు సినిమా సినిమాకీ, పదింతలు ఇరవయ్యింతలు రెమ్యూనరేషన్ పెంచుకుంటూ పోతే, ‘లౌక్యం’ తెలీనివాడు ఎన్ని హిట్లిచ్చినా పేరు తప్ప ‘డబ్బు’ కూడబెట్టుకోలేడు. అందుకే రచయితలు చాలామంది బీదగా మిగిలేది. ఎందరో క్రియేటివ్ డైరెక్టర్స్ పరిస్థితీ అదే.

సినిమా స్క్రిప్ట్ తయారవుతోంది. కథ, మాటలూ పూర్ణానంద్‌గారివే. చిత్రంగా కోడైరెక్టర్ మళ్ళీ  సురేషే. ఈ పరిశ్రమలో ఇదో విచిత్రం. ఇక్కడ సీనియరా, జూనియరా అనేది ఎప్పుడూ నిజంగా కౌంట్ కాదు. సక్సెస్సా కాదా అనేదే ముఖ్యం. ఓ  పెద్ద హీరో కాల్‌షీట్ ఇచ్చాడంటే , పిక్చర్ సంగతెలా వున్నా నూటికి 50 శాతం సక్సెస్ సాధించినట్టే.

అన్నిటికంటే చిత్రం ఏమిటంటే, మూడో కూతురి కోసం రాకేష్‌ని ట్రెయిన్ చేసిన మోహన్‌ప్రసాద్‌గారే, రాకేష్‌కి ఆఫరొచ్చాక ఆశీర్వదించి పంపడమేకాక తన కోడైరెక్టర్‌ని కూడా రాకేష్ దగ్గర పెట్టాడు. రాకేష్‌కి 10% పని తెలిస్తే, సురేష్‌కి 95% తెలుసు. అలాంటివాడ్ని కోడైరెక్టరుగా పెట్టుకుంటే సినిమా తియ్యడం నల్లేరు మీది నడకే.

మనిషికి ఏది ముఖ్యం? నిజంగా మనుషులు దేన్ని కోరుకుంటారు? కొందరు ధనం అంటే, కొందరు ప్రేమ అంటారు. కొందరు పదవీ పేరూ అంటే, కొందరు మనశ్శాంతి అంటారు. అయితే ఇవన్నీ మామూలుగా చెప్పేవి. పనిలో పడితే తప్ప అసలు సిసలు వ్యవహారం తేలదు.

పని లేనంతకాలం ‘ప్రేమ’ అద్భుతం అనిపిస్తుంది. ఎంతగా మురిపిస్తుందంటే, చిన్న చిన్న అలకలూ, కోపాలూ, బుడిబుడి దీర్ఘాలు, ముక్కు చీదటాలూ కూడా అద్భుతంగా, అత్యంత సుందరంగా కనిపిస్తాయి. యుగమో క్షణంలా గడుస్తుంది.

సరేనయ్యా.. అదృష్టం తలుపుతట్టి బ్రహ్మాండమైన పని చేతిలో పడ్డాక? ??

అవకాశం కోసం ఎదురు చూస్తూ కాలం గడిపేవాడు మూర్ఖుడు. అవకాశాన్ని సృష్టించుకునేవాడు బుద్ధిమంతుడు. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగ పరుచుకునేవాడు మహాజ్ఞాని. ఎవరికీ  దొరకని అదృష్టం రాకేష్‌కి దొరికింది. “నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి గురూజీ. మీరు ఎంతో అనుభవం కలవారు. దయచేసి నన్ను ‘గైడ్’ చేయ్యండి. ఒకవేళ నేను తప్పు చేస్తున్నాననిపిస్తే వెంటనే హెచ్చరించండి. అస్సలు సందేహించకండి..” ఈ ఒక్క డైలాగ్‌తొ రాకేష్ సురేష్‌ని పూర్తిగా గెల్చుకున్నాడు. అదీ. పూర్ణానంద్ ముందర.

“ఏదో అనుకున్నాగానీ పూర్ణానందంగారూ,యీ కుర్రోడు పెద్దలతో ఎలా మెలగాలో తెలిసినవాడండీ!” ఉబ్బిపోయి మహాసంతోషంగా అన్నాడు సురేషు.

“అందుకే ఇన్నేళ్ళయినా నువ్వు కోడైరెక్టరుగా వున్నావు. ఉత్తి వెర్రిమాలోకానివి.” లోపల్లోపలే సురేష్ గురించి అనుకున్నాడు పూర్ణానంద్. ఒకటి మాత్రం నిజం. రాకేష్ పగలూ రాత్రీ స్క్రిప్టు మీదే కూర్చొంటున్నాడు. ఎవ్వరూ ‘పిండనంతగా’ పూర్ణానంద్‌ని బెటర్‌మెంట్ కోసం పిండేస్తున్నాడు. సిట్టింగ్స్ సవేరా హోటల్లో జరుగుతున్నాయి. అఖిలని కూడా పక్కకు నెట్టి ‘మేక్జిమం’ టైం అక్కడే గడుపుతున్నాడు రాకేష్.

అఖిల అంతా చూస్తూనే వుందిగానీ ఏ మాత్రం బయటపడలేదు. అల్లరి చేసి లాభం ఏమిటీ? అదీగాక పెళ్లి కూడా కాలేదాయె. అప్పటికే చుట్టుపక్కలవాళ్లు కొంచెం చెవులు కొరుక్కుంటున్నారని  అఖిలకి తెలుసు. కారణం వయసుల్లో వున్న తేడా.

తుఫాను గాలికి చెట్లు పడిపోయినా , గడ్డిపోచలు అలానే ఉంటాయి. ఓ సమస్య వచ్చినప్పుడు గడ్డిపోచలా నిబ్బరంగా ఉండగలిగేవారిదే గెలుపు. తొడలు కొట్టి జబ్బలు చరుచుకుని చాలెంజ్ చేసేవాళ్లది కాదు.

అఖిల అవసరమైతే వృక్షమూ కాగలదు, సమస్య వస్తే గడ్డిపోచలాగానూ మారగలదు. ఇప్పుడామె గడ్డిపోచగా మారి పరిస్థితిని నిబ్బరంగా ఎదుర్కొంటోంది.

సినిమాఫీల్డుకి ‘దేవుడు’ అంటే చచ్చేంత సెంటిమెంటు. పూజ అంటే చాలు బోలెడు ఖర్చు చేస్తారు. ముహూర్తం షాట్లు చూడండి. ఎంత వినయంగా, ఎంత భక్తితో వొంగి వొంగి దండాలు పెడుతూ వుంటారో

దర్శకులూ ,నటీనటులూ  నిర్మాతలూ .

రోజూ ,అంటే , రాకేష్ ఇంటికి  రాని రోజుల్లో ఠంచనుగా తొమ్మిదింటికల్లా మహాలక్ష్మిలా, ‘ముప్పత్తమ్మ’ గుడినించి ప్రసాదం తీసుకుని, సవేరాకి వెళ్ళేది అఖిల. అప్పటికే పూర్ణానంద్, సురేషూ, మిగతావాళ్లూ అక్కడ వుంటారని ఆమెకి తెలుసు. భక్తిగా అందరికీ ప్రసాదం పంచి, “మీరందరూ వెయ్యేళ్ళు చల్లగా, సుఖంగా ఉండాలి. ఎప్పుడూ విజయం మీ వెంట నీడలా వుండాలి.. ఇదే నేను రోజూ మొక్కుకునేది. అందరికంటె ‘ఆయన’ చిన్న. అయినా మీరంతా వున్నారుగా..!” అని వినయంగా నమస్కరించి బయటికొచ్చి ఇంటికెళ్ళే బస్సెక్కేది. అఖిలగురించి మొదట్లో కొంత ‘వింత’గా వాళ్ళనుకున్నా, తరవాత్తరవాత ఆమె ‘చూపించే’ వినయానికి ఫిదా అయిపోయారు.

“ఏజ్ ది ఏవుందోయ్! కృష్ణుడికన్నా రాధ పెద్దదికాదూ, ఉండాల్సింది స్వచ్చమైన ప్రేమ!” అంతటి పూర్ణానందే అఖిలని చూసి ముచ్చటపడి అనేవాడు.

సినిమా మొదలైంది. ఓ రోజున మోహన్‌ప్రసాద్‌గారు రాకేష్ వర్క్ ప్రోగ్రెస్ చూద్దామని సవేరాకి వచ్చారు.. అదే సమయానికి అఖిల ప్రసాదం తీసుకొచ్చింది. మామూలుగానే వినయంగా ప్రసాదం పంచి, నాలుగు మంచి శుభాకాంక్షల్ని అందించింది.

“ఎవరీవిడా?” కుతూహలం బయటికి కనపడకుండా మామూలుగా అడిగినట్టు అడిగాడు మోహన్‌ప్రసాద్.

“వాళ్లింట్లోనేనండి రాకేష్ వుండేది!” ఉత్సాహంగా చెప్పాడు కో.డై.సురేష్.

“మరి యీ ప్రసాదాలేంటి?” నవ్వి అన్నాడు కానీ లోపలలోపల ఓ అనుమానం సుడి తిరుగుతోంది.

“సినిమా సూపర్  హిట్టు కావాలనిట. అబ్బ… ఆ అమ్మాయికి ఎంత వినయమో!” అద్దంలాగా మనసుని బయటపెట్టాడు సురేష్. “అలాగా!” అని బయలుదేరాడాయన. ఆయనతోబాటు పూర్ణానంద్ బయటికొచ్చాడు.

“ఏమిటి పూర్ణా యీ పిల్ల వ్యవహారం…!” నెమ్మదిగా అన్నాడు మోహన్‌ప్రసాద్.

“వాళ్లిద్దరి మధ్యా ఎఫైర్ ఉందనుకుంటాను. ఆ పిల్ల సిన్సియరే. రాకేష్ మహాతెలివైనవాడు.”క్లుప్తంగా చెప్పాడు పూర్ణానంద్.

ఆ మాత్రం హింట్ చాలు. ఆ అమ్మాయి సిన్సియర్. రాకేష్ తెలివైనవాడంటే, ఏ ఎండకి ఆ గొడుగు పట్టగలిగే నేర్పు వుందనేగా… ,  నిశ్చింతగా ఇంటికెళ్లాడాయన. ఎఫైర్స్ ఎన్నున్నా ఫరవాలేదు. పెళ్ళి మాత్రం ఒకటే వుండాలి. భార్యా ఒక్కతే వుండాలి. చిన్న యిళ్ళు  ఎన్నున్నా , పెద్దిల్లు పెద్దిల్లేగా! మోహన్‌ప్రసాదూ ఒకప్పుడు గ్రంధసాంగుడే. ఏ హీరోయిన్నీ వదల్లేదని పెద్దపేరుఆయనకి .

స్క్రిప్టు రెడీ. ఇంకో మూడు రోజుల్లో షూటింగ్ మొదలు కాబోతుంది..’విజయా డీల క్స్   లో సాంగ్ రికార్డింగ్.  ‘విజయ’లో రికార్డింగ్ అంటే’విజయం తథ్యం’ అని అందరికీ నమ్మకం.

(నా పాట  మాత్రం ప్రసాద్ old, థియేటర్లో రికార్డయింది. సినిమా పేరు: నాకూ పెళ్లాం కావాలి‘. నటీనటులు, చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్, కల్పన, నిరోషా). దర్శకత్వం శ్రీ విజయాబాపినీడు. నిర్మాతలు: ఆలపాటి రంగారావు, శ్రీ శివలింగేశ్వరరావు. సంగీతం వాసూరావుగారు. గానం: SPB, పల్లవి ” వినోదాల విందురా, బాధలన్నీ బంద్‌రా.. సినిమా సాటి లేదురా.. డాన్సూ ఫైటూ మిక్స్రా.. మళ్లీ మళ్లీ మళ్లీ చూడరా” Date of Recording 1-1-1987)

 

అతిరధమహారధులందరూ విజయా గార్డెన్స్   కి వచ్చారు. ఓ కుర్రాడ్ని డైరెక్టర్‌గా చూడ్డం అందరికీ ఆశ్చర్యమే.

******                                     *******                           **********

సినిమా సూపర్‌హిట్. అఖిల ఆ రోజున ముప్పత్తమ్మ గుళ్ళో 101 కొబ్బరికాయలు కొట్టింది.. రాకేష్‌తో కలిసి వచ్చి.

వారం రోజుల్లో రెండో సినిమా మొదలు. ఈసారి ‘స్క్రి ప్ట్  వర్క్’ పెద్దగా జరగలేదు. కారణం ఆ సినిమా ‘తమిళం’నించి తెలుగులోకి రీమేక్. స్క్రిప్టుని పూర్ణానంద్‌గారే సవరించి తెలుగు నేటివిటీకి తీసుకొచ్చారు.

సురేష్ కో డైరెక్టర్. మిగతా అందరు  టెక్నీషియన్స్ మొదటి సినిమాకి పని చేసినవాళ్ళే కావడంతో చకచక షూటింగ్ నడిచి మూడు నెలల్లో పూర్తయింది.

అదీ సూపర్ హిట్టే.

మూడో సినిమా.. మళ్లీ తమిళ్ టు తెలుగు రీమేక్.

నాల్గో సినిమా హిందీ టు తెలుగు రీమేక్.

నాలుగో సినిమా రిలీజ్ నాటికి అఖిలకి వాంతులయ్యాయి.

సరిగ్గా ఆ రిలీజ్ డేట్ ముందు రోజునే మోహన్‌ప్రసాద్‌గారు తన మూడో కూతుర్ని రాకేష్‌కివ్వడానికి రాకేష్‌తో సంప్రదించాడు.

రాకేష్ వినయంగా అఖిల గురించి చెప్పాడు. “ఆ అఫైర్ నాకు తెలుసు. ఒకవేళ అది బయటపడ్డా అందరూ ఆవిడే నిన్ను చిన్నవాడ్ని చేసి ముగ్గులొకి దించిందని బ్లేమ్ చేస్తారు గానీ, నిన్నెవరూ ఏమీ అనరు బాబూ, నువ్వు నిచ్చెనమెట్లు ఎక్కుతున్నావు. కానీ ఇదో వైకుంఠపాళీ అని నీకు తెలీదు. నిచ్చెనల పక్కనే పాములూ వుంటై. కాటు వెయ్యడానికి సిద్ధంగా…! అన్ని అనుభవాలు కలిగినవాడ్ని.. నువ్వు నా అల్లుడివైతే సంతోషిస్తా. లేదంటే నీ యిష్టం. ఇందులో బలవంతం ఏమీ లేదు”   అని  తన బ్రాండ్ నవ్వుతో నవ్వుతూ చెప్పాడు మోహన్‌ప్రసాద్. ఆ మాటల వెనక హెచ్చరిక రాకేష్‌కి స్పష్టంగా అర్ధమయింది.

********                          ************                             ********

తోతాద్రి చనిపోయి దశాబ్దంన్నర దాటింది. అఖిల ఇప్పుడు ప్రతిరోజూ ముప్పత్తమ్మ గుడికి వస్తూనే వుంటుంది. ఆవిడ కొడుక్కి ఇప్పుడు ఇరవై రెండేళ్ళు. చదువులో ఏవరేజ్ అయినా సినిమా  నాలెడ్జి మాత్రం అద్భుతం. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంతా హైద్రాబాదుకి తరలి వెళ్లిపోవడంతో ఆ పిల్లాడు తమిళ సినిమా ఇండస్ట్రీలో తన వంతు ప్రయత్నాలు ప్రారంభించాడని అఖిల నాతో అన్నది. అన్నట్టు ఆ పిల్లాడికి తెలుగు రాదు. నేర్పేవాళ్లెవరూ? తల్లికీ, తాతకీ వచ్చిన తమిళాన్నే అతనూ నేర్చుకున్నాడు.

మీకు అనుమానం రావొచ్చు. పిల్లాడి తండ్రి ఎవరా అని.. ఆ విషయంలో ఎవరైనా  ఖచ్చితంగా చెప్పగలరు  తండ్రి రాకేషేనని. కానీ అఖిల మాత్రం కొడుక్కి అబద్ధం చెప్పింది, తండ్రి మిలటరీలో పని చేస్తూ చనిపోయాడని.

ఇహ రాకేష్ సంగతా      ?   మోహన్‌ప్రసాద్‌తో జరిగిన సంభాషణని యథాతథంగా పూర్ణానంద్‌కి  చెప్పి అతని సలహా అడిగాడు….. పూర్ణానంద్ అఖిలకీ,  మోహన్‌ప్రసాద్ కూతురికీ  వున్న ప్లస్‌లూ, మైనస్‌లూ వివరించి, నిర్ణయాన్ని రాకేష్‌కే వదిలేశాడు.

తిరుపతిలో జరిగిన రాకేష్, వింధ్యల పెళ్లికి అతిరథమహారథులందరూ ఎటెండై, మోహన్‌ప్రసాద్‌గారిని అభినందనలతో ముంచెత్తారు. అదో ‘టాక్ ఆఫ్ ద  టౌన్..’! దేవుడు గొప్పవాడు. అందుకే చిట్టచివరిదాకా తోతాద్రిని సంరక్షించడమే గాక, అతను సంతోషంగా ఆడుకోవడానికి ఓ మనవడ్ని కూడా ఇచ్చాడు.

మొగుడు లేకుండా బిడ్డని కన్నదని అయినవాళ్లూ, కానివాళ్లూ ఆడిపొసుకున్నా, అఖిల మాత్రం చలించకుండా నిలబడటం నిజంగా గొప్పవిషయమే. ఆ మాటే నేనంటే..,

“అన్నా… ప్రపంచం ఎప్పటికప్పుడు కోరేది కొత్త వింతల్నేగానీ, పాతవికాదు. అయినా పాట విషయాలు  ఎంతకాలం గుర్తుంచుకుంటుందీ?సంవత్సరమో, రెండేళ్ళో మాట్లాడతారు.. ఆ తరవాత?” అని పకపకా నవ్వింది.

లోకంలో ఏదీ శాశ్వతం కాదు. ఒక ‘కాలపు అల’  రాకేష్‌ని అంతెత్తున నిలబెడితే, మరో ‘అల’ అతన్ని నేలమీదకి విసిరింది.

రోజూ అతను ‘అఖిల’ గురించి కనీసం పదిసార్లయినా ఆలోచిస్తాడు. ‘వింధ్య’ పెంకితనం నానాటికీ పెరుగుతూనే వుందిగానీ తరగలేదు. మోహన్‌ప్రసాద్‌గారు అనారోగ్యంతో బయటికి రావడం లేదు. ఆయనకి ఎనభై రెండేళ్ళు. రాత్రిళ్లు నిద్దర పట్టదు. కానీ,

రాకేష్ వొంటరిగా ‘మందు కొట్టడం’ మాత్రం అతను రోజూ చూస్తూనే వుంటాడు. కూతురు క్లబ్ నించి వొచ్చేసరికి రాత్రి రెండు దాటుతుంది. అప్పుడు కూడా వాళ్లిద్దరూ భార్యాభర్తల్లా వుండరు. ఎవరి పక్క వారిదే, ఎవరి భోజనాలు వాళ్లవే. వాళ్లకి పుట్టిన పిల్లలిద్దరూ కూడా ‘పోష్’ టైపు.

మోహన్‌ప్రసాద్ అప్పుడప్పుడు బాధపడుతూ వుంటాడు. ‘’లెక్కలేనంత ‘ఆస్తి’ సంపాయించి తప్పు చేశానా? ‘’ అని.

ఒకమాట చెప్పకపోతే అఖిలకి నిజంగా అన్యాయం చేసినట్టు అవుతుంది.

రాకేశ్ పెళ్లి అయ్యాక అఖిల ఎవ్వరినీ దగ్గరకి చేరనివ్వలా , ఆఖరికి రాకేష్ ని  కూడా !  సిన్సియర్ గా చిబితే  ఆమె లాంటి ఆడది మాత్రం సినీ ఫీల్డ్  లో  ఈనాటివరకూ నా కంటబడలా   !

మళ్లీ కలుద్దాం

మరో కథతో

మీ

భువనచంద్ర.

 

మీ మాటలు

  1. Buchireddy gangula says:

    కథ బాగుంది. సర్.
    =================
    Buchi reddy gangula

    • BHUVANACHANDRA says:

      ధన్యవాదాలు Buchi reddy గంగుల గారూ……మీ స్పందన ఎప్పుడూ నాకు స్ఫూర్తి నిస్తుంది. మరోసారి ధన్యవాదాలు

  2. SatyaGopi says:

    కథ బాగుంది సర్, పాత్రలు గుర్తుండిపోయేలా వుంటాయి మీ కథల్లో

    • BHUVANACHANDRA says:

      ధన్యవాదాలు SATYAGOPI గారూ .మీ చల్లని మాట నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది థాంక్స్ అండీ

  3. కె.కె. రామయ్య says:

    ఏదీ శాశ్వతం కాని వైకుంఠపాళీ సినీలోకంలో సర్పగ్రస్తులైనా శాస్వతమైన మానవతా విలువలని, స్వాభిమాన్నాన్ని ప్రదర్శించిన వ్యక్తులు అఖిల, తంగచ్చి నల్లమణి లాంటి వాళ్లను పరిచయం చేస్తున్న భువనచంద్ర గారికి నమస్సులు. ‘దేవుడు’ అంటే చచ్చేంత సెంటిమెంటు ఉన్న సినీఫీల్డులో కీర్తి, కాంత, కనకాల కోసం ఎంతటి దిగజారుడు ప్రవర్తనలు?

    • BHUVANACHANDRA says:

      ధన్యచాదాలు కె.కె. రామయ్య గారూ .ఈ ఫీల్డు శాశ్వతమైన కీర్తిని ఇస్తుందండి. మనిషి చనిపోయినా .వారి పేరే కాదు రూపాన్నికూడా వెండితెరమీద చూడగలం. అందుకే ,పోటీ ఎక్కువ. ఒక విధంగా చూస్తే ,ఇక్కడకనిపించేది ఒక రకమైన అమాయకత్వమే. ఒక చిత్తూర్ వ నాగయ్య ,కాంతారావు ,రాజనాల..పద్మనాభం.కస్తూరి శివరావు వీరి జీవితాలన్నీ మనకి సుద్దులు నేర్పేవే . అయ్యా . ప్రతిసారీ మీ కామెంట్ చదివి ఆనందిస్తాను. ఇప్పుడు కూడా ….మరోసారి ధన్యవాదాలతో.

  4. ఓహ్ … షరా మామూలే, రెండు అరచేతులు పక్క పక్కన ఉంచి మధ్య ఖాళీ లో ఒక జీవితాన్ని ఆవిష్కరిస్తారు మీరు . ఎలా సేకరిస్తారండి వీటిని !? ” వేలు చూపిస్తే చెయ్యి మింగేసే రకం ” వంటి ఉపమానాలు కొట్టిన పిండి మీకు. అన్నట్టు అక్షమాల కూ రాకేశ్ కు లింకు అర్థం కాలేదండి- ఇందులో రెండు కథలు ఉన్నాయా సార్?

  5. BHUVANACHANDRA says:

    గొరుసు గారూ , నమస్తే. ముందుగా ధన్యవాదాలు .మీరన్నది నిజమే. అక్షమాల కధ మొదట్లోనే ఒక పక్కన పెట్టాను . అదికూడా రాస్తే కధ చాలా పెద్దది అవుతుంది. ,కనుక ఆ కధ ”’ఇదీ ఓ కధే”’పార్ట్ -2 గా వొస్తుంది….అదో చిత్రమైన కధ..ఆ కధలో రాకేశ్ కి లింక్ వుంది . నిశితంగా చదివి స్పందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలతో ……..bhuvan

  6. BHUVANACHANDRA says:

    ఈ కధకి అద్భుతమైన బొమ్మ వేసిన మందిర భాధురి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ….అలాగే ఇప్పటివరకూ నా కధలకు బొమ్మలు వేసిన చిత్రకారులకు నా నమస్సులు. నిజంగా ఈ మాటని నా మొదటి కదన నించే చెప్పాలి. అలా చెయ్యనందుకు మనః స్ఫూర్తి గా మిమ్మల్ని క్షమార్పణలు వేడుకుంటున్నాను.
    శ్రీ అఫ్సర్ సాబ్ కీ ,కల్పనా గారికీ ,పత్రిక ని తీర్చిదిద్దే సా౦కేతికవర్గానికీ ,సంపాదక వర్గానికీ నమస్సులతో ,కృతజ్ఞతలతో
    …………………………….మీ …భువనచంద్ర…(.మరోకధతో మళ్ళీ కలుద్దాం )

  7. కె.కె. రామయ్య says:

    మహోన్నతమైన తారలుగా సినీ వినీలాకాశంలో ఓ వెలుగువెలిగినా, అవసాన కాలంలొ అష్టకష్టాలు పడ్డ చిత్తూరు నాగయ్య, కస్తూరి శివరావు, కాంతారావు, రాజనాల, పద్మనాభం వంటివాళ్లలో కనిపించేది ఒక రకమైన అమాయకత్వమే … అంటూ ఎంత చక్కగా చెప్పారు సార్.

    ” ఒకనాడు వేలాదిమంది అభిమానుల్ని వెంట పరుగెత్తించుకున్న శివరావు – నిర్మాతలను ఇంటి గుమ్మం ముందు గంటలు గంటలపాటు నిరీక్షీంప చేసుకున్న శివరావు – చివరి పయనంలో ఎవరి తోడూ లేకుండా దాదాపు ఒంటరిగానే వెళ్ళవలసి వచ్చింది.”

    ” చిత్తూరు నాగయ్య గారు దానాలు చేసి చేసి ఆస్తులన్నీ హరింప జేశారు. కొందర్ని నమ్మి కొంత డబ్బు మోసపోయారు. వారి రేణుకా ఆఫీసు ధర్మసత్రంలా వుండేదని చెప్పుకుంటారు. తెలుగు సినీరంగములో ఒకదశలో అత్యధిక పారితోషికం తీసుకున్న నాగయ్య, ఆ తరువాత దశలో ఉదరపోషణకు చిన్న వేషాలు వేస్తూ అల్ప పారితోషికాలూ అందుకున్నారు ”

    “ఎన్‌టిఆర్, ఏఎన్నార్‌ల తరువాత అంత గొప్ప ఖ్యాతిని పొంది జానపద హీరోగా ఒక వెలుగు వెలిగి తరువాత జీవితంలో చితికిపోయిన కాంతారావు”.

    మద్రాసు లోని రాయపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఇలాంటి చోటా మహా కవి శ్రీశ్రీ తుది శ్వాస విడిచిందీ అని ఓ గాడమైన నిట్టూర్పు విడుస్తాను.

    స్పూర్తి దాయకమైన వ్యక్తుల పరిచయాలని కొనసాగించండి భువనచంద్ర గారు.

    • BHUVANACHANDRA says:

      తప్పకుండా రామయ్య గారూ నిజంగా ఈ ఈమెయిల్ ఎంతో స్పూర్తిని ఇచ్చింది …మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు సర్

  8. కందికొండ says:

    ఈ కథ చదువుతుంటే నాకు నా ప్రియ మిత్రుడు చక్రి(మ్యూజిక్ డైరెక్టర్) జ్ఞాపకాలు నన్నువెంటాడాయి చక్రి కోటిరూపాయల ఆడి కార్ల తిరిగెటోడు ఖరీదైన బంగ్లాల ఉండేటోడు పాట రికార్డింగ్ పూర్తిఅయినా రాత్రి నన్ను ఇంటికీ వెల్లనిచ్చేటోడు కాదు రాత్రిఅంతా డ్రింక్ చేస్తుండే వాడు ఇంటికి వెళ్ళ వచ్చు కదా అంటే బ్లాంక్ గా నవ్వే టోడు అన్ని తెలిసి ఎo దుకు అడుగుతవ్ అన్నట్టుగా జీవితo చిత్రమయింది చూసేటోళ్లకు సెలబ్రిటీల జీవితంలోఅన్నీ ఉన్నట్టుగానే అనిపిస్తాయ్ అo తా ఖాళీ ఖాళి గా ఉంటది దూరపు కొండలు నునుపు అన్నట్టు గా గురూజీ భువనచంద్ర గారూ మీ కథ లో చాలా జీవితాలు మమేకమై ఉన్నాయి ధన్యవాదా లు

  9. BHUVANACHANDRA says:

    కందికొండగారూ ..ముందుగా మీకు నా ధన్యవాదాలు, కధ చదివి మీ స్పందన తెలియజేసినందుకు . మీరు చెప్పిన ప్రతి మాటా వాస్తవమే .చక్రి గారిని నేను కలిసింది చెన్నై ఎయిర్ పోర్ట్ లో. మొదటిసారే ఎంతో ఆత్మీయంగా ఎంతో చల్లగా మాట్లాడారు. ఎంత ఎదిగినా వినయం తో మసులుకునే గొప్ప మనిషి . వారిని అందిరికీ గుర్తుకు తెచ్చినందుకు మీకు మరోసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు . రాబోయే కధలకు కూడా మీ స్పందనను ఆశిస్తూ ……..ఆశీస్సులతో భువనచంద్ర

  10. కందికొండ says:

    తప్పకుండా గురూజీ

  11. కథ ఎక్కడో మొదలయ్యి వేరే చోట తేలింది అని నా ఫీలింగ్ గురువు గారు …

    • BHUVANACHANDRA says:

      అవును శ్రీ గారూ …మరో సగం మిగిలే వుంది ….అది ”అక్ష మాలది”’.తరువాతది అదే ,,,,,,,,,శేషారత్నం ,తిరగలి నాయుడు ., రాకేశ్ వీరందరూ అక్షమాల జీవితానికి మెట్లే …..సీరియస్ గా చదివినందుకు ధన్యవాదాలతో

మీ మాటలు

*