అసమ దాంపత్య బంధంలో ఎక్స్ ట్రా నాట్!

 

 

-ఎ . కె . ప్రభాకర్

~

 

స్త్రీవాద రచయితల్లో గీతాంజలి (డా. భారతి)ది విలక్షణమైన గొంతు. ప్రగతిశీలమహిళా వుద్యమాల్లో క్రియాశీలంగా పనిచేసిన కార్యకర్తగా స్వీయ జీవిత అనుభవ నేపథ్యం నుంచి ఆమె రచించిన ‘ఆమె అడవిని జయించింది’ నవల నూత్నవస్తు – శిల్పాల స్వీకృతి కారణంగా గొప్ప సంచలనం సృష్టించింది. కుటుంబంలో లోతుగా పాతుకుపోయిన పితృస్వామ్య భావజాల నిరసన   – స్త్రీల సమస్త శక్తి యుక్తుల్ని హరించి వాళ్ళను బోన్సాయ్ మొక్కలుగా మార్చే ఇంటి చాకిరీలోని అమానవీయ కోణాలు –  కనపడని గృహహింసకు బలయ్యే స్త్రీల ఆవేదన – పసిపిల్లలమీద జరిగే అత్యాచారాలు – ఆడదాని గర్భసంచి చుట్టూ అల్లుకొన్న రాజకీయాలు  గీతాంజలి తొలినాళ్ళలో రచించిన కథలకి (బచ్చేదానీ – 2004 ) ముఖ్య వస్తువు. ఓల్గా లాగానే స్త్రీ శరీరాన్ని కేంద్రం చేసుకొని అమలయ్యే పురుషాధిపత్య రాజకీయాలను బలంగా యెండగట్టడంతో గీతాంజలి ఆగిపోలేదు. ఒక డాక్టర్ గా , సెక్సాలజిస్టుగా ఫేమిలీ కౌన్సిలింగ్ కోసం తన దగ్గరకొచ్చే స్త్రీల హృదయవిదారకమైన జీవితాలను గొప్ప ఆర్తితో వర్ణించింది. ఆ కథల్లో ( పహెచాన్ – 2007) యెక్కువ భాగం ముస్లిం స్త్రీలకు చెందినవే కావడం విశేషం. దుర్భర దారిద్ర్యంలో నలిగిపోతూ కమ్యూనిటీ లోపలా బయటా పురుషాధిపత్య – మత భావజాలంతో పెనుగులాడే ముస్లిం మహిళల  దు:ఖ మూలాల్ని వెతికే క్రమంలో తనది కాని జీవితాలతో మమేకమౌతూ సాటిలేని సహానుభూతితో డా. గీతాంజలి కలం నుంచి వెలువడ్డ కథలు అనితర సాధ్యాలు. షాజహానా వంటి ఇన్ సైడ్ రచయితలు మాత్రమే రాయగలిగినవి.

ఇవన్నీ వొక యెత్తయితే  రైతుని నమ్ముకొన్న నేలకి దూరం చేసే సెజ్ లకు వ్యతిరేకంగా ఆమె కలం పదునెక్కింది. కరువు కోరల్లో చిక్కుకొని బతుకు తెరువు వెతుక్కుంటూ దేశాలు పట్టిపోయే పాలమూరు వలస కూలీల వెతల్ని జీవన్మరణ పోరాటాన్ని వాళ్ళ భాషలోనే (పాలమూరు వలస బతుకు చిత్రాలు – 2015) చిత్రించింది.

రచయితగా సామాజిక కార్యకర్తగా  సమాజంలో పాతుకుపోయిన సకల ఆధిపత్యాలకు వ్యతిరేకంగా క్షేత్ర స్థాయిలో పనిచేస్తూనే ‘మూసి ఉన్న తలుపులు వెనకాల పెళ్లి , దంపత్య జీవితం , రొమాన్స్ పేర్లతో … పెళ్లి , భర్త అనే చట్టబద్ధమైన లైసెన్సులతో  … స్త్రీల మనో దేహాల మీద జరిగే దాడి … సెక్సువల్ వయోలెన్స్’ ఎంత భయానకంగా ఉంటుందో తెలియ జేస్తూ ‘మగవాళ్ళను సెన్సిటైజ్ చేయాలనే’ వొక బలమైన ఆశతో స్త్రీల లైంగిక రాజకీయాల గురించి నిర్దిష్టమైన అవగాహనతో   గీతాంజలి రాస్తోన్న కథల పరంపరలో – శిలగాని శీల , ఫ్రిజిడ్ , నింఫోమేనియా మొదలైన  కథలు సాహిత్య ప్రపంచంలో తీవ్రప్రకంపనాలు సృష్టించాయి. ఆ క్రమంలో యింతకు మునుపు యే రచయితా స్పృశించని విలక్షణమైన వస్తువుతో వచ్చిన కథ ‘ హస్బెండ్ స్టిచ్’ ( విహంగ , మహిళా సాహిత్య మాస పత్రిక – జనవరి 2014) .

  కథ  లింక్   :  http://vihanga.com/?p=10972#sthash.25kbCw4h.dpbs

 

 

పాపినేని శివశంకర్ ‘మనుషులు వదులవుతారు’ (కథ – 1999) కథలో వొక  భర్త వయసు పెరిగిన భార్య వొదులై పోయిందని వేరే స్త్రీతో సంబంధం కోసం ప్రయత్నిస్తుంటాడు . అతనలా వెంపర్లాడుతున్నాడని తెలుసుకొని ‘నేనంటే నా ఒళ్ళు మాత్రమేనా’ అని ప్రశ్నించుకొని ఆమె వాపోతుంది. ‘మాయదారి సంసారాల్లో ఎక్కడో పెద్ద మోసం దాగుంది’ అని గ్రహిస్తుంది.

శివశంకర్ కథలో ‘సతీ సావిత్రి’ కి తన శరీరమ్మీద కనీసం గౌరవమైనా మిగిలి వుంది. సంసార సంబంధంలో యేదో మోసం వుందన్న యెరుక వుంది.  గీతాంజలి కథలో పాపం సుశీలకి ఆ రెండూ లేవు. ఆమె తనను నిర్లక్ష్యం చేసిన భర్త శంకర్రావుని మళ్ళీ తన దగ్గరకు రప్పించుకోడానికి పడరాని పాట్లు పడింది.

‘సంవత్సరం నుంచి మా మధ్య శారీరక సంబంధం లేదు’ … ‘నాతో సెక్స్ బాగోలేదట – నీది ఒదులైపోయింది అందుకే రావాలన్పించడం లేదంటాడు … ‘ఆయన మళ్ళీ నా దగ్గర్కి రావాలి. రావాలంటే నేను ఆపరేషన్‌ చేయించుకుని పెళ్ళికి ముందులా తయారవ్వాలి’ అని సుశీల తన  స్నేహితురాలు మంజులకి సిగ్గు విడిచి చెప్పుకొంది.

మాయదారి సంసారాల్లో దాగున్న మోసాన్ని గ్రహించలేక తన అనారోగ్యాన్ని కూడా లక్ష్య పెట్టక ఎక్స్ ట్రా నాట్ కి సిద్ధపడింది. అందుకు తాహతుకి మించిన అప్పుచేయడానికి సైతం వెనకాడలేదు. డాక్టర్ హెచ్చరించినా వినక ప్రాణం మీదకి తెచ్చుకొంటుంది. ఇదీ ‘ హస్బెండ్ స్టిచ్’ లో స్థూలంగా కథ .

సుశీల అభద్రతకీ భయానికీ దు:ఖానికీ  కారణాలని రచయిత కథ నుంచీ పక్కకు వెళ్లి యెక్కడా ప్రత్యక్షంగా పేర్కొనక పోవడంలో గొప్ప సంయమనం ప్రదర్శించింది. దాంపత్య జీవితంలోని లైంగికత గురించి –  నియంత్రణల గురించి – పురుషానుకూలగా యేక పక్షంగా పాతుకుపోయిన  సామాజిక చట్రాల గురించి – భావజాలం గురించి పాఠకుల్లో సవాలక్ష ఆలోచనలు , ప్రశ్నలు పుట్టాడానికి అవకాశం యిచ్చే విధంగా కథాగమనంలో  అనేక పొరలు నిర్మించింది. గీతాంజలి రచించిన యితర కథలనుంచి ఈ కథ ప్రత్యేకంగా రూపొందడానికి అందులో వాడిన విశిష్టమైన శిల్పమే కారణమైంది ( గీతాంజలి కథల్లో కథ పొడవునా వొక వొడవని దు:ఖం చెవులు హోరెత్తేలా గుండెలు అవిసేలా వినిపిస్తూ వుంటుంది. కానీ ఈ కథలో మాత్రం దు:ఖ కారణాలే అక్షరాల మాటున దాగి రహస్యంగా ధ్వనిస్తాయి) .

వస్తు స్వీకరణ దగ్గర్నుంచీ యెత్తుగడ , యితివృత్త నిర్వహణ,  పాత్రల యెంపిక , ముగింపు అన్నీ చక్కగా అమరిన కథ యిది. దాంపత్య సంబంధంలో లైంగిక ప్రక్రియలో మాధుర్యం గురించి పురుష దృష్టికోణం నుంచే నిర్వచించే భావజాలాన్ని నిరసిస్తూ పడక గదుల్లో అమలయ్యే పురుషాధిపత్య లైంగిక రాజకీయాల మూలాల్ని  స్త్రీవాద సాహిత్యం చాల చోట్ల చర్చకి పెట్టినప్పటికీ ‘‘ హస్బెండ్ స్టిచ్’’ లాంటి వస్తువుని యెవరూ యెక్కడా స్వీకరించిన దాఖలాల్లేవు. అందువల్ల గీతాంజలి కథల్లోనే కాదు ; స్త్రీ వాద సాహిత్యంలో సైతం యీ కథ ప్రత్యేకంగా నిలుస్తుంది.

బిడ్డ సైజ్ పెద్దగా వున్న కారణంగానో , సరైన వైద్య సదుపాయం అందుబాటులో లేని కారణంగానో , బిడ్డకో తల్లికో ప్రాణాపాయం యెదురైన హడావిడిలో కాన్పు చేసే  కారణంగానో … ప్రసవ సమయంలో స్త్రీ జననాంగం చిరగడం వల్ల కావొచ్చు లేదా ప్రసవం తేలికగా కావడానికి కట్ (episiotomy ) చేయడం వల్ల కావొచ్చు ;  ప్రసవానంతరం మళ్ళీ పూర్వ స్థితి కోసం కుట్లు వేయాల్సిన అవసరం యేర్పడుతుంది.  అలా కుడుతూ – దాంపత్యంలో భర్తకి తృప్తి కలగడానికి వొకటి రెండు కుట్లు అదనంగా వేస్తారు. చాలా సందర్భాల్లో ఈ ప్రక్రియలో ఆ స్త్రీ ప్రమేయం వుండదు. కోసినట్టుగానీ అదనపు కుట్లు వేసినట్టుగానీ ఆమెకు తెలియజేయడం జరగదు. ఒక్కోసారి యిది భర్త కోరిక మేరకు చేస్తారు. లేదా డాక్టరే స్వయంగా నిర్ణయం తీసుకొని చేస్తారు. భర్త కోసం వేసే అదనపు కుట్టు కాబట్టి దీన్ని హస్బెండ్ స్టిచ్ అనీ ఎక్స్ ట్రా నాట్ అనీ అంటారు. భర్తల్ని సుఖపెట్టడానికి ,మగవాళ్ళు పక్కదారులు పట్టకుండా దాంపత్య బంధాన్ని నిలుపుకోడానికి ఎక్స్ ట్రా నాట్ బలమైన సాధనం అని నమ్మే స్త్రీలు కూడా ఉంటారు. అయితే దీని వల్ల ప్రయోజనం వుండదనీ తర్వాతి కలయికల్లో స్త్రీలు నరకాన్ని అనుభవిస్తారనీ , భర్తలు కూడా సుఖపడరనీ సర్వేల ద్వారా పరిశోధనలద్వారా తెలుస్తోంది (వివ . Mama Birth – July 28 , 2013). వ్యాపార దృష్టి లేని మంచి  డాక్టర్లు ఈ ప్రొసీజర్ ని ప్రోత్సహించరు.

‘కాన్పులనీ , కుట్లనీ , సిజేరియన్లు , హిస్టెరెక్టమీలు – ట్యూబెక్టమీలు రీకేనలైజేషన్లనీ అన్ని గాట్లు, కాట్లు ఆడవాళ్ళకు అవుతూనే ఉంటాయనీ’ అలా స్త్రీ శరీరమ్మీద పెద్ద వైద్య వ్యాపారం జరుగుతోందని చెప్తూ  , అందాల అంగడిలోనూ –   ఆరోగ్య విపణిలోనూ స్త్రీ శరీరం సరుకైన వైనం చుట్టూ అల్లిన సాహిత్యం చదువుకొన్నాం. ఆ క్రమంలో వచ్చిన డా. గీతాంజలి ‘హస్బెండ్ స్టిచ్’  బలమైన కథగా రూపొందడానికి కారణం – వస్తు శిల్పాల చక్కటి సమన్వయమే. కథలో కథని మాత్రమే చెప్పాలన్న సూత్రాన్ని రచయిత నిక్కచ్చిగా పాటించింది.

కథకి అవసరమైన సాంకేతికమైన  వైద్య పరమైన విషయాల్ని  కథలో రచయిత్రి  నేరుగా ప్రస్తావించకుండా డాక్టర్ ముఖత: చెప్పించడంతో ప్రతిపాదితాంశాలకి   ప్రామాణికత విశ్వసనీయత లభించాయి. సుశీల దాంపత్య జీవితంలో యెదుర్కొనే సమస్యనీ , అందుకు ఆమె యెంచుకొన్న పరిష్కారాన్నీ , అందులోని సాధక బాధకాల్ని విప్పి చెప్పడానికి  గీతాంజలి కథని నెరేటివ్ స్టైల్లోగాక సంభాషణ శైలిలో నడిపింది. అందువల్ల కథలో రచయిత ప్రమేయం దాదాపు శూన్యమే. సుశీల తన బాల్య స్నేహితురాలు మంజులతో , పక్కింటి సుమతితో , డాక్టరమ్మతో చేసిన మూడు సంభాషణల్లో రచయిత్రి కంఠస్వరం డాక్టర్ పాత్రలో స్పష్టంగా వినిపిస్తుంది. రచయిత్రి నిజ జీవితంలో  తన దగ్గరకి కౌన్సిలింగ్ కోసం వచ్చే సుశీల లాంటి పేషంట్ల పట్ల చూపే సహానుభూతే డాక్టర్ మాటల్లో ప్రతిధ్వనించింది.

‘కాన్పు తర్వాత యోని కండరాలు మళ్ళీ సంకోచించి పోతాయి. వాటికి సాగే గుణంతో పాటు ముడుచుకునే గుణం కూడా ఉంటుంది. చాలా తక్కువ కేసుల్లో 10,12 మంది పిల్లల్ని కన్న వాళ్ళల్లో, నీలా పల్లెల్లో మంత్రసానులతో కాన్పులయిన వాళ్ళలో ఈ సమస్య వస్తుంది

‘నీ భర్తను ఒకసారి కౌన్సిలింగ్‌కి నా దగ్గర్కి తీసుకురా అతనికి అంతా వివరంగా చెప్పి నిన్నిలా వేధించద్దని చెప్తాను. నీకు కొన్ని ఎక్సర్‌ సైజులు చెప్తాను , అవి చేస్తే ఇంకా బిగుతయ్యే అవకాశం ఉంటుంది.

‘ఈ ఆపరేషన్‌ అయ్యాక అంతా బాగవుతుందనుకోవద్దు. నీ భర్తకు బాగుండచ్చు కానీ కుట్లు మరీ బిగుతై పోయి కలయిక భరించలేనంత నొప్పిగా ఉండి దాంపత్య జీవితం పట్ల భయం కలుగవచ్చు. మధ్య మధ్యలో యోని నించి రక్తప్రావం అవుతూ ఇన్ఫెక్షన్స్‌ వస్తాయి.’

డాక్టర్ చెప్పే మాటల్లోని సారాంశం భరోసా హెచ్చరిక  సుశీలకి యెక్కలేదు. జీవితంలోని అభద్రతే ఆమెని భయపెట్టింది. అందుకున్న యితరేతర కారణాలని కూడా రచయిత సుశీల అంతర్మథనం ద్వారా స్పష్టం చేస్తుంది. నిజానికి సుశీల ‘పెళ్ళైన వాడని తెల్సీ’ ఎందుకో శంకర్రావంటే  ‘పిచ్చి ఆకర్షణ కలిగి అతనితో పారిపోయి గుళ్ళో పెళ్ళి చేసేస్కుంది. అమ్మ, నాన్న వెళ్ళగొట్టారు. అతని మొదటి భార్య విజయ ఆత్మహత్య ప్రయత్నం చేసి బతికింది . ఆమెకిద్దరు మగ పిల్లలు. తనకు కవల ఆడపిల్లలు పుట్టారు.’

సుశీలకి పెళ్లై నాలుగేళ్లే. కానీ దాంపత్య జీవితంలో ఎన్ని రకాల దు:ఖాల్ని మోసుకు తిరుగుతుంది? అందుకు కారణం తాను వొదులై పోవడమా? ఆడపిల్లల్ని కనడమా? రెండో భార్య కావడమా ?ఆమెకు అర్థం కాదు. అసలు కారణం శంకర్రావులోని చావనిస్ట్ మగాడు. కన్న బిడ్డలు తండ్రి ప్రేమకి దూరం కాకుండా వుండడానికి ఆమె తోటి స్త్రీతో పోటీకి దిగింది. భర్త తన కొంగు వదలకుండా వుండేలా చేసుకోడానికి దేనికైనా సిద్ధపడింది. తన శరీరాన్ని పణ్య వస్తువు చేసుకొని మొగుడిని ఆకర్షించే ఆలోచనలు చేసింది. ఆకట్టుకొనే దారులు వెతికింది. అటువంటి పరిస్థితుల్లో పక్కింటి సుమతి   [పేర్ల ఎంపికలో కూడా రచయిత్రి  దృక్పథం వ్యక్తమౌతుంది ; స్త్రీని కేవలం శరీరంగా , సెక్స్ అవసరాలు తీర్చే యంత్రంగా భావించే శంకర్రవులాంటి శృంగార పురుషుల్ని అన్నివిధాలా సుఖపెట్టడానికే అంకితమైన – పాతివ్రత్య ధర్మాలు జీర్ణించుకొన్న పురాణ పాత్రలు ]  మాటలు సుశీలకి అమృతోపమమయ్యాయి.

కాన్పు అయ్యాక మానం వెడల్పుగా సాగుతుంది కదా భర్తకు తర్వాత కలయిక బాగుండాలని, అక్కడ బిగుతుగా ఉండాలని ఒక కుట్టు ఎక్స్‌ట్రా వేస్తార్లే. నేను నా రెండు కాన్పులకీ వేస్కున్నానాకు ముందే తెల్సు. డాక్టరమ్మని ముందే అడిగా. ఎక్స్‌ట్రా మనీ అడిగిందనుకో, కాపురం కంటే ఎక్కువా చెప్పు? మా ఆయనా పోరు బెట్టాడనుకో డాక్టరమ్మ ఎంత డబ్బడిగితే అంతిచ్చాడు తెల్సా ? నువ్వూ అట్లా చేయించుకోవాల్సింది’

సుమతి సుశీలతో అన్న మాటల్లో కాపురాలు కాపాడుకోటానికి దాంపత్య సంబంధాల్ని సడలకుండా చూసుకోడానికి స్త్రీలు పడుతున్న అవస్తలే కాదు ; ఎక్స్ ట్రా నాట్ లు డాక్టర్లకి ఎక్స్ ట్రా మనీ మూటలు కట్టడానికి యెంతగా తోడ్పడుతున్నాయో తెలుస్తుంది. అందుకు భర్తలు యెంత వుదారంగా వుంటారో దూరదృష్టితో ప్రవర్తిస్తారో అర్థమౌతుంది.

నా దగ్గర్కి ఆయన రావాలి మేడమ్‌. పిచ్చెక్కుతోంది ఆయన రాకపోతే. సెక్స్‌ కోసం కాదు మేడమ్‌ నాకు ఆయనంటే ప్రేమ. పిల్లలు నాన్న కావాలంటారు. నా దగ్గర ఆకర్షణ లేకపోతే ఎందుకొస్తారు మేడమ్‌? నాకు ఎక్స్ ట్రా నాట్‌ కావాలి . పల్లెటూల్లో కాన్పు కావడం వల్ల అక్కడ మీ లాంటి డాక్టరమ్మ కాకుండా మంత్రసాని తో కాన్పు చేయించుకున్నా . అందుకే వదులై పోయింది మేడమ్‌. నేను టైట్‌ చేయించుకోవాలనుకుంటున్నా.

అని సుశీల డాక్టరమ్మని ప్రాధేయపడింది. సుశీల యెదుర్కొన్న హైన్యం మనస్సుని కలచివేస్తుంది. స్త్రీని యింతగా బలహీనురాల్ని చేసున్న సామాజిక – సాంస్కృతిక నిర్మాణాల పట్ల క్రోధం కల్గుతుంది.

డాక్టరమ్మ వద్దని యెంత కౌన్సిలింగ్ చేసినా వినకుండా  సుశీల చేయించుకొన్న ఆపరేషన్ సఫలం కాలేదు. సంసారాన్ని నిలబెట్టుకోడానికి వేయించుకొన్న ఎక్స్ ట్రా నాట్ తో ఆమె భర్తని కట్టివేయలేకపోయింది. భర్త మీద అలవికాని ప్రేమను చూపుతున్నాను  అనుకొని అసమ దాంపత్యంలో హింసని అనుభవించింది.

‘కలయికలో నొప్పి భరించలేక గావు కేకలు పెట్టలేక పళ్ళు బిగువన కన్నీళ్ళు కారుతుంటే భరించింది సుశీల. తర్వాత కలయిక అంటే చచ్చేంత భయం ఏర్పడినా భర్త కోసం ఆ భయంకరమైన నొప్పిని భరించసాగింది. భర్త కళ్ళ ముందుంటే చాలు అనుకుంది.’

పంచ కన్యల పురాణ గాథలు – వాత్స్యాయన కామసూత్రాలు మొదలుకొని ఇవ్వాళ్టి వయాగ్రా మాత్రలు , సిలికాన్ యింప్లాంటేషన్ లు వెజైనోప్లాస్టీ – ఎక్స్ ట్రా నాట్ ల వరకూ   అన్నీ లైంగిక తృప్తిని  పురుష కేంద్రంగానే నిర్వచించి డిజైన్ చేయడంలో భాగంగానే పడగ్గదుల్లోకి ప్రవేశిస్తున్నాయనే స్పృహ కథ చదువుతున్నంతసేపూ మనకు కలుగుతూనే వుంటుంది. దాంపత్యంలో సమ భావన , సమ భాగస్వామ్యం లేకుండా చేసిన పురుషస్వామ్య భావజాలంలోని హింస యెరుకవుతూనే వుంటుంది. ఒకరికి యిద్దరిని కట్టుకొని విలాసంగా రొమ్ము విరుచుకొని తిరిగే శంకర్రావుల కాళ్ళ దగ్గరే పడివుండాల్సిన అగత్యాన్ని , దుస్థితిని  స్త్రీలకు  కల్పిస్తున్న సమస్త  కారణాల పట్ల – భావజాలం పట్ల అసహనం కలుగుతుంది. కథ పొడవునా రచయిత వుద్దేశ్యం స్పష్టమౌతూనే వున్నప్పటికీ ముగింపు దగ్గరకొచ్చేసరికి  కొత్త ప్రశ్నలు తలెత్తుతాయి.

నొప్పి భరించైనా భర్తతో బంధాన్ని కాపాడుకోవాలని సుశీల అనుకొన్నప్పటికీ ‘ఎక్స్ ట్రా నాట్ మహిమ’ తో లభించిన భోగం మూడు నెలల ముచ్చటే అయ్యింది. సమస్య మళ్ళీ మొదటికి రావడంతో భర్త తిరస్కారంతో సుశీల బీపీ పెరిగి పక్షవాతానికి గురై ఆసుపత్రి పాలయ్యింది.

కథని నిర్మాణ పరంగా కొంత ఎడిట్ చేసుకొంటే బాగుండేది అనిపించినా రచయిత తాను చర్చించదలచుకొన్న సమస్యకి (కథా వస్తువుకి) – సుశీలనీ , పాఠకులకి – సుశీల పట్ల సానుభూతి చూపే మంజులనీ , సమస్య చుట్టూ నిర్మితమైన సామాజిక విలువలకీ భావజాలానికీ – సుమతినీ , రచయిత్రి గొంతుకి – డాక్టరమ్మనీ ప్రతినిధులుగా యెంచుకొని కథ నడిపినట్టు తోస్తుంది. ఇది కథలో దాగి వున్న అంతర్గత నిర్మాణం.

సుశీల వైవాహిక జీవితాన్ని మొదట్నుంచీ యెరిగిన ఆమె స్నేహితురాలు మంజుల దయనీయమైన ఆ పరిస్థితిని చూసి చలించిపోయింది. పాఠకులకి కలిగే ప్రశ్నలే కథ ప్రారంభం నుంచీ మంజులకి కూడా కలుగుతాయి. టీచర్ గా పనిచేస్తున్న మంజులకి జీవితంలో కొత్త పజిల్  యెదురైంది.

ముఫ్పై నిండిన మంజుల మొన్నొచ్చిన సంబంధానికి అవునని చెప్పాలో, కాదని చెప్పాలో తేల్చుకోలేకుండా ఉంది.

 

ఇదీ రచయిత్రి కథకిచ్చిన ముగింపు. పాఠక దృష్టికోణం నుంచి యిచ్చిన యీ  యేక వాక్యపు ముగింపు   కథలో రచయిత్రి చెప్పిన విషయాల గురించే గాక చెప్పని విషయాల గురించి , మంజుల అంతరంగంలో మెదిలిన అనేక ప్రకల్పనల గురించి యెంతగానో ఆలోచించేలా చేస్తుంది. రేపు తన భర్త కూడా శంకరరావు లాంటి వాడే అయితే అన్న సందేహం ఆమెకు కల్గిందని వొక్క మాటలో తెల్చివేయలేం. అటువంటి  సందేహ ప్రస్తావన కథ మధ్యలో కూడా వచ్చింది. మంజుల మనస్సులో కల్గిన వూగిసలాటకి కారణాలు కేవలం వైయక్తికమైనవి కావు. సుశీల – సుమతి – తనూ వ్యవస్థీకృత విలువలకి బానిసలవుతున్న పరిస్థితులన్నిటి గురించీ  విమర్శనాత్మక దృష్టితో విశ్లేషిస్తూ క్రాస్ రోడ్ల కూడలిలో ఆమె నిలబడింది.

 

స్త్రీ వైవాహిక జీవితంలో ఎదురయ్యే హింస పట్ల భయం ,  పెళ్లి అనే వ్యవస్థ పట్ల అనుమానమూ  , స్త్రీపురుష సంబంధంలో  అసమానతలని వైరుధ్యాలని  సృష్టించిన పితృస్వామ్య ఆధిపత్య భావజాలం వల్ల కాపురాల్లో సంభవించే  కల్లోలాల గురించిన  లోచూపూ ,  ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఆలోచన అన్నీ వొక్కసారిగా ఆమెను చుట్టుముట్టి   వుంటాయి. పెళ్లి పేరున మొత్తం స్త్రీ జాతి అనుభవిస్తున్న బంధనాలు ఆమెను పెళ్లి గురించి పునరాలోచించేలా  చేశాయి.

 

సాధారణంగా ముగింపు వాక్యం రచయిత దృక్పథాన్ని బలంగా చెప్పడానికి ఉపయోగ పడుతుంది. గీతాంజలి యీ కథని కేవలం ఎక్స్ ట్రా నాట్ గురించి మాత్రమే వుద్దేశించి రాయలేదనీ ముడివడని అసమ దాంపత్య సంబంధాలన్నిటినీ చర్చకు పెట్టడమే ఆమె లక్ష్యమనీ , పురుష ఆధిపత్య వ్యవస్థీ కృత విలువల్ని ప్రశ్నించడానికి ప్రేరేపించడమే ప్రధానమైన ఆశయమనీ  ముగింపు ద్వారా నిరూపించింది. ఆ ప్రయత్నంలో ఆమె అన్ని విధాల సఫలమయ్యింది.

మగవాళ్ళనందరినీ శంకరర్రావు పక్కన నిలబెట్టి ప్రకృతి సహజమైన స్త్రీ పురుష సంబంధాన్నే తిరస్కరించే దిశగా గాక మనస్సుతో నిమిత్తం లేకుండా దేహభాషకే పరిమితమైన  శృంగారంలో  తృప్తి – భావప్రాప్తి వంటి పదాల చుట్టూ అల్లుకొని వున్న పురుష  లైంగిక రాజకీయాల గురించి పాఠకులు ఆలోచించడానికి ఆస్కారం కల్గించడానికే రచయిత యిటువంటి open ముగింపుని యిచ్చినట్లు  తోస్తుంది.

మగవాళ్ళని సెన్సిటైజ్ చేయడం కూడా తన యీ కథల రచనోద్దేశాల్లో వుందని రచయిత్రి చెప్పినప్పటికీ  స్త్రీలను అనేక రూపాల్లో కట్టిపడేస్తున్న “బంధాల” గురించి సరైన అవగాహన కల్గించడానికి యీ కథ బలంగా దోహదం చేస్తుంది. ప్రధాన స్రవంతిలో యిటువంటి కథలు మరెన్నో  రావాల్సి వుంది. ఆ దిశలో డా. గీతాంజలి చేస్తున్న కథా వ్యాసంగాన్ని మనసారా స్వాగతిస్తున్నాను.

 

మీ మాటలు

  1. కధ చదవాలి.

  2. DrPBDVPrasad says:

    ఏ కే ప్రస్తుతించిన తీరుని స్వాగతిస్తూ..స్త్రీ, స్త్రీ వాదీ,వైద్య వృత్తి, రచయిత్రి కావడంవల్లనే ఇటువంటి అవసరమైన రచనలు వచ్చాయి. ఇక ముందు కూడా రావాలి

  3. K.P. Ashok kumar says:

    ఇలాంటి కథలను మైనార్టీ రచయితలు కూడా రాయలేరు . వాళ్ళ లోకం వేరు . సాటి మనుషులపట్ల ప్రేమ,ఆర్తి వుండాలి . వాళ్ళ కష్టాలపట్ల స్పందించే హృదయం వుండాలి .అలాంటివారే ఇలాంటి కథలను రాయగలరు .

    గీతాంజలి కథకంటే పాపినేని కథే నాకు చాలా నచ్చింది . ఇలాంటి సమస్యలు కోడా వుంటాయని పాపినేని కథ చదివేవరకు నాకు తెలియదు . గీతాంజలి కథను మాత్రం నేను చదవలేకపోయాను . హృదయవిదారకంగా వుంది . మొత్తానికి గీ తాంజలి కథను విశ్లేషించడంలో వైద్య పరమైన సమాచారాన్ని ఉపయోగించుకోవడం బాగుంది . దంపతుల మధ్య సెక్స్ తప్ప ఇంకేమి లేదనుకునే మూర్ఖులు ఉన్నంత కాలం ఈ సమస్య ఇలాగే వుంటుంది .

  4. THIRUPALU says:

    అద్బుతమైన విశ్లేషణ! నేను ఈ కధను విహంగా లో చదివినపుడు ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్లు ఫీల్ అయ్యాను. ఇలాంటివి కూడా జీవితాల్లో ఉంటాయా అన్న హాచర్యం నన్ను చకితుణ్ణి చేసింది. దీని మీద స్త్రీల స్పందన సానుకుఉలంగా లేక పోవడం దురదృశ్ట కరం.

  5. satyanarayana says:

    అసమ దాంపత్యం ..
    A K ప్రభాకర్ గారు చాలా విపులంగా వివరించారు EXTRA -KNOT ,అన్న తలుచుకోవడానికే సిగ్గు పడే సందర్భాన్ని వివరించిన ,గీతాంజలి గారి పుస్తకం గురించి .
    ఇలాటి విషయాలు బయటికి రావాలి ,సమాజం లో కనపడకుండా మరుగున దాచిపెడుతున్న అతి హీనమయిన పద్ధతులు ,నాగరికసమాజానికి అవమానకరం .
    ఒక డాక్టర్ గా గీతాంజలి గారిని అభినందించాలి ,ఆడవాళ్ళు దాంపత్య సహజీవనంలో అప్రమత్తంగా ఉండవలసిన మరొక సందర్భాన్ని వెలుగులోకి తెస్తున్నందుకు .
    ” సీత కళ్ళు తెరవాల్సిన విషయాలెన్ని ఉన్నాయో!”

  6. ఎ కె ప్రభాకర్ says:

    ప్రసాద్ అశోక్ తిరుపాలు సత్యనారాయణ గార్లకు మీ స్పందనకు ధన్యవాదాలు

  7. Subhashini.N says:

    పహచాన్. . . . .నన్ను కట్టి తీసుకుపోయి గీతాంజలి ముంగిట పడేసింది.బలమైన కథనం ఆమె బలం.
    అసమ సంబంధాల చర్చ అత్యావశ్యకమైన తరుణాన ఆమె గొంతు ఎంత బలంగా విన్పించిందో,ప్రభాకర్ అంతే అద్భుతంగా విశ్లేషించారు.
    అభినందనలు.

మీ మాటలు

*