బొంబాయి ఐ.ఐ.టి –తెలుగులో తొలి అడుగులు   

 

-వంగూరి చిట్టెన్ రాజు

~

 

తారీకు గుర్తు లేదు కానీ అది 1966 జూన్, జూలై లలో ఒక రోజు. బొంబాయిలో అరవ్వాళ్ళు ఎక్కువగా ఉండే మద్రాసు మాంబళం లాంటి మాటుంగా అనే చోట మడత మంచాల హోటల్ లో పొద్దున్నే లేచి నేనూ, గోవింద రాజులూ లోకల్ రైలూ, BEST వాళ్ళ బస్సూ ఎక్కి అంతకు ముందు రోజే రిహార్సల్స్ వేసుకున్నాం కాబట్టి ఎక్కువ ఇబ్బంది లేకుండానే పవయ్ అనే ప్రాంతంలో ఉన్న ఐఐటి కి మా ఇంటర్వ్యూ కోసం చేరుకున్నాం. మెకానికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ లో అడుగుపెట్టగానే పట్ట పగలే అన్ని ట్యూబులైట్లూ దేదీప్యమానంగా వెలుగుతూ ఉండడం  నాకు మొట్టమొదట ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే అంత వరకూ కాకినాడలో నేను ఎప్పుడూ మా ఇంట్లో కానీ, కాలేజ్ లో కానీ పగలు లైట్లు వేసుకోడం చూడ లేదు. పైగా పొరపాటున వేస్తే “వెధవ కరెంట్ ఖర్చు అయిపోతుంది” అనే మాటలు వినపడేవి. ఆ రోజు మాస్టర్స్ డిగ్రీ కి ఇంటర్వ్యూకి దేశంలో అన్నిచోట్ల నుంచీ సుమారు 300మంది పైగా వచ్చారు… అందరితో బాటూ భయం, భయంగా కూచున్నాం. మా లాగే ఇంటర్వ్యూ కి వచ్చిన వాళ్ళలో కొందరు బొంబాయి లోనే చదువుకున్న వాళ్ళు, కొందరు కేరళ, గుజరాత్, బెంగాల్..ఇలా అన్ని రాష్ట్రాల నుంచీ వచ్చిన వాళ్ళు ఉన్నా బొంబాయి వాళ్ళకి మాత్రం మేము కాస్త బైతుల్లాగా కనపడ్డాం అని నాకు అనుమానం వేసింది. ఎందుకంటే వాళ్ళ వేషభాషలు, ధైర్యం, కలుపుగోలుదనం ఇతర రాష్ట్రాల వాళ్ళ కంటే కొంచెం దర్జాగా ఉంది. పైగా ఇంగ్లీషు మాట్లాడడం బావుంది. ఆప్పుడే నాకు తెలిసిపోయింది మనకి ఆ భాష గొప్పగా మాట్లాడడం రాదు సుమా అని. ఇప్పటికీ అది నిజమే కదా!

అంత మందిలో నేనూ, గోవిందరాజులూ భయం భయంగా కూచుని ఉండగా అప్పుడు మా గదిలోకి కొంత మంది ప్రొఫెసర్లు వచ్చి ఇంటర్వ్యూ పద్ధతులు వివరించారు. అందులో మా కొంప ముంచే రెండు “బాంబ్ షెల్స్” ఉన్నాయి.  అందులో మొదటిది మెకానికల్ ఇంజనీరింగ్ లో మెషీన్ టూల్స్, మెషీన్ డిజైన్, ఇంటర్నల్ కంబశ్చన్ ఇంజన్స్, రిఫ్రిజిరేషన్ లాంటి ఐదారు బ్రాంచ్ లు అన్నింటికీ కలిపి ఉండే సీట్లు మొత్తం ముఫై లోపేట.   అంటే ఒక్కొక్క విభాగం లోనూ మాస్టర్స్ డిగ్రీ కి ఐదారు సీట్లు మాత్రమే ఉంటాయి. ఈ విషయం తెలిసి మూడు వందల మందిలో ముఫై సీట్లయితే “ఎక్కడో ఆంధ్రా బాపతు గాళ్ళం, మన పని ఉట్టిదే గురూ. అనవసరంగా వచ్చి చచ్చాం” అని నేనూ, గోవిందరాజులూ అనుకుంటుంటే, రెండో బాంబ్ షెల్ ఏమిటంటే కేండిడేట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మొదటి ఎలిమినేషన్ రౌండ్ గా ఎంట్రెన్స్ పరీక్ష పెట్టడానికి వారు నిర్ణయించుకున్నారుట. అది వినగానే కాస్త దడ పట్టుకుంది. ఎందుకంటే, ఇంజనీరింగ్ పరీక్షలు అంటే లెక్కలు కట్టడానికి కనీసం స్లైడ్ రూల్ అయినా ఉండాలి. అది లేక పొతే చేతి వేళ్ళతో ఇంజనీరింగ్ లెక్కలు చెయ్యలేం. కేలుక్యులేటర్ లాంటి మాటలు అప్పటికి పుట్ట లేదు. పైగా ఆ పరీక్షలో ఏమైనా డ్రాయింగులు గియ్యమని అని అడిగితే టీ-స్క్వేరు, పెన్సిళ్లు, డ్రాయింగ్ పరికరాలు ఉండాలి. మన దగ్గర అవేమీ లేవు. అంచేత పరీక్ష రాయడానికి ముందే ఫెయిల్ అయిపోయాం అనుకున్నాం. కానీ ఆ ఇంటర్వ్యూకి వచ్చిన ఎవరి దగ్గరా కూడా అవి లేక పోయే సరికి నాకు కాస్త ధైర్యం, ఇంకాస్త అనుమానం వచ్చి అక్కడ టై కట్టుకుని హడావుడి గా తిరుగుతున్న ఒక ప్రొఫెసర్ గారితో “మాకు ముందు ఈ పరీక్ష గురించి తెలిస్తే అన్నీ తెచ్చుకునే వాళ్ళం” అని నా గోడు వెళ్ళబుచ్సుకున్నాను. ఆయన ఓ నవ్వు నవ్వి  “అవేం అక్కర లేదు. ఈ పరీక్షలో ఇది మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి.  కరెక్ట్ ఆన్సర్ టిక్కు పెట్టడమే” అన్నాడు. ఈ రోజుల్లో ఎవరూ నమ్మరు కానీ, ఆ రోజుల్లో మా కాకినాడ కాలేజ్ లో కానీ ఆంధ్రా ప్రాంతాలలో మరెక్కడా కానీ ఈ మల్టిపుల్ చాయిస్ ప్రశ్నా పత్రాల పద్ధతి లేదు. ఒక్క ప్రాక్టికల్స్ తప్ప పరీక్ష ఏ సబ్జెక్ట్ లో అయినా ప్రతీ ప్రశ్నకీ పోలోమని దస్తాల కొద్దీ ఆన్సర్లు రాసెయ్యడమే. పైగా ఎన్ని పేజీలు  రాస్తే అన్ని ఎక్కువ మార్కులు వస్తాయి అనుకుని పెద్ద పెద్ద అక్షరాలతో పేజీలు  నింపేసే వాళ్ళం. అప్పటి వరకూ మల్టిపుల్ చాయిస్ గురించి వినడమే కానీ అలాంటి పరీక్షలు రాయ లేదు. మొత్తానికి వాళ్ళు సైక్లో స్టైల్ కాపీలు అందరికీ ఇచ్చి పరీక్ష పెట్టారు. అప్పటికి ఈ క్సీరాక్స్ అనే పేరే ఎవరూ వినలేదు. దేనికైనా కాపీలు కావాలంటే ఒక స్పెషల్ పేపరు మీద టైపు కొట్టి, ప్రింటింగ్ యంత్రం లాంటి దాంట్లో పెట్టి అలాంటి స్పెషల్ పేపర్ల కాపీలు తీసే వారు. ఆ పరీక్షకి సరిగ్గా గంట టైమ్ ఇచ్చారు. మెకానికల్ ఇంజనీరింగ్ కి సంబంధించిన అన్ని సబ్జెక్ట్స్ లోనూ సుమారు వంద ప్రశ్నలు….ప్రశ్నకి ఒక మార్కు వేసినా  తప్పు ఆన్సర్ రాస్తే అర మార్కు తీసేస్తారు. అంచేత ఖచ్చితంగా సరి అయిన సమాధానం తెలిస్తేనే టిక్కు పెట్టాలి. లేక పొతే నెగెటివ్ మార్కులు వస్తాయి. మొత్తం ఉన్న సీట్లు 30 కాబట్టి వచ్చిన మూడు వందల మందిలోనూ వంద మందిని మాత్రమే పెర్సనల్ ఇంటర్వ్యూ కి ఎంపిక చేసి మిగిలిన వాళ్ళని పంపించేశారు. ఈ పరీక్షలో పాస్ అయి నేనూ, గోవిందరాజులూ ఇంటర్వ్యూ కి ఎంపిక అయ్యాం. అప్పుడు ఎంపిక అయిన ఆ వంద మందిలో ఉన్న ఎనిమిది బ్రాంచ్ లకీ సీట్లు ఐదేసి ఉంటే ఇంటర్వ్యూ కి పదేసి మంది చొప్పున మళ్ళీ ఎవరికీ ఏ బ్రాంచ్ కావాలో చెప్పమని మరో పత్రం ఇచ్చారు. అప్పటికే ఉన్న అన్నింటిలోనూ ఎక్కువ డిమాండ్ ఉన్న బ్రాంచ్ లు – అంటే మెషీన్ టూల్స్,  మెషీన్ డిజైన్ లాంటి నాలుగు బ్రాంచ్ లలో మనకి ఎలాగా సీటు రాదు అని తెలిసిపోయింది కాబట్టి మరో రెండు బ్రాంచ్ లకి మేం ఇద్దరం మా పేర్లు ఇచ్చి పిలుపు కోసం కూచున్నాం. సాయంత్రం నాలుగు గంటలకి ఆ ఇంటర్వ్యూలు అయ్యాయి. వాటిల్లో నాకు సీటు రాదు అని అనుమానం వచ్చి విచారంగా కూచున్నప్పుడు ఒక ప్రొఫెసర్ గారు వచ్చి ఫ్ల్యూయిడ్ మెకానిక్స్ & ఫ్లూయిడ్ పవర్ బ్రాంచ్ లో ఆసక్తి ఉన్న వారు ఇంటర్వ్యూకి రావచ్చును అని ప్రకటించారు. చెప్పొద్దూ..అప్పటి దాకా అలాంటి బ్రాంచ్ ఉంది అనే మా ఇద్దరికీ తెలియదు. మరో అవకాశం ఉంది అని వినగానే ఇద్దరం పేర్లు ఇచ్చేశాం. ఆ గదిలోకి వెళ్ళగానే అక్కడ ఇంటర్వ్యూ చేస్తున్న ముగ్గురు ముందుగా నా ఇంజనీరింగ్ ఫైనల్ పరీక్ష మార్క్ షీట్ అడిగి, “నీకు  హైడ్రాలిక్స్ లో మంచి మార్కులు వచ్చాయే” అని మెచ్చుకుని ఆ సబ్జెక్ట్ లో తప్ప ఇంజనీరింగ్ తప్ప ఇతర రకాల మామూలు ప్రశ్నలు అడిగారు. గోవింద రాజులు కూడా తన ఇంటర్ వ్యూ బాగానే అయింది అని చెప్పాడు. మొత్తానికి రాత్రి ఎనిమిది గంటలకి అన్ని బ్రాంచ్ ల ఇంటర్ వ్యూలూ అయ్యాక, ఎంపిక అయిన అభ్యర్థుల లిస్టు ఆయా బ్రాంచ్ తాలూకు ప్రొఫెసర్లు అక్కడ నోటీసు బోర్డ్ లో పెట్టారు. అల్లా ఒక్కొక్క నోటీసూ చూసుకుని, ఎందులోనూ మా ఇద్దరి పేర్లూ లేకపోవడంతో ఎంపిక అయిన వాళ్ళ నవ్వు మొహాల్లో మేము ఏడుపు మొహాలు పెట్టుకుని వెళ్లిపోడానికి సామాను సద్దేసుకుంటూ ఉండగా ఆఖర్న ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ & ఫ్లూయిడ్ పవర్ బ్రాంచ్ వాళ్ళ లిస్టు వచ్చింది. ఎంపిక చేసిన ఐదుగురులో నా పేరు చూసి కళ్ళు తిరిగాయి. నా కంటే ఎక్కువగా గోవింద రాజులు కళ్ళు తరిగాయి. ఎందుకంటే నా కన్నా అన్ని విధాలుగానూ ఎక్కువ మార్కులు వచ్చిన అతని పేరు సీటు వచ్చిన వాళ్ళ లిస్టులో లేదు కానీ  ప్రొవిజినల్ లిస్టు లో ఉంది. అంటే సెలెక్ట్ అయినా ఐదుగురిలో ఒక వేళ ఎవరైనా చేరక పొతే ఆ ఖాళీలో అతను చేర వచ్చును అనమాట.

ఎక్కడో కాకినాడ నుంచి మా ఇద్దరిలో ఎక్కువ అర్హత ఉన్న గోవిందరాజులు బదులు  బదులు నాకు సీటు రావడంతో ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఇద్దరం ఆలోచనలో పడ్డాం. అప్పుడు నాకు ఓ ఐడియా వచ్చింది. వెంటనే ఆ ప్రొఫెసర్ గారి ఇల్లు ఎక్కడో కనుక్కుని ఆయన ఇంటికి వెళ్లాం ఇద్దరం. అప్పుడు రాత్రి 10:30. పాపం ఆయన కూడా పొద్దుటి నుంచీ ఇంటర్వ్యూలు చేస్తూ చాలా అలిసిపోయి భోజనానికి కూచుని మేము తలుపు కొట్టగానే తలుపు తీసి “ఎవరు మీరు?” అని అడిగాడు. “నాకు మీ బ్రాంచ్ లో సీటు ఇచ్చినందుకు కృతజ్ఞలు చెప్పుకుందాం అని వచ్చాం” అనగానే ఆయన ఆశ్చర్యం గా “నాకు మీ మొహాలు గుర్తు లేదు. అయినా ఇంత రాత్రి ఇలా రావడం ఎందుకు. రేప్పొద్దున్నే ఫీజు కట్టేసి చేరిపోండి” అన్నారు విసుగ్గా. “అది కాదు సార్. మే ఇద్దరం తూర్పు తీరం లో ఉన్న కాకినాడ నుంచి కలిసి వచ్చాం. మీరు నాకు ఒక్కడికే సీటు ఇచ్చారు. ఇతనికి ప్రొవిజినల్  గా బదులు క్లాసులో చేర్చుకుంటే మీ ఋణం తీర్చుకోలేం. ఇద్ద్దరం కలిసి చదువుకుంటాం” అని మా సమస్య వివరించాను. ఆయన ఇంకా ఎక్కువ ఆశ్చర్య పోయి “అసలు నువ్వే ఎవడివో నాకు తెలీదు. ఇంకోడిని రికమెండ్ చెయ్యడానికి అర్థ రాత్రి వచ్చావా?” అని కోప్పడి తెలుపులు వేసేసుకున్నారు. ఇంక చేసేది ఏమీ లేక ఇద్దరం ఆఖరి బస్సు పట్టుకుని మాటుంగా వెళ్లి పోయాం. మర్నాడు రైల్లో గోవింద రాజులు బెంగళూరు ఇండియన్ ఇన్స్ టిస్ట్యూట్ ఆఫ్ సైన్సెస్ లో ఇంటర్వ్యూ కి వెళ్ళిపోయాడు. ఇది 1966 జూన్ లో జరిగింది. ఆ తరువాత ఇప్పటిదాకా – అంటే 50 ఏళ్లలో  గోవిందరాజుల్ని మళ్ళీ చూడ లేదు.

ఇలా బొంబాయి IIT లో నాకు ఎడ్మిషన్ రావడం నా జీవితంలో చాలా పెద్ద మలుపు. అనుకోని, ఆశించని మంచి మలుపు. నేను చాలా అదృష్టవంతుడిని అని అనుకోడానికి ఒక దృష్టాంతం. అంతే కాదు. నాకు తెలిసినంత వరకూ కాకినాడ నుంచి బొంబాయి ఐఐటి లో చేరిన మొట్టమొదటి వాడిన నేనే! నా తరువాత మా డిపార్ట్మెంట్ లోనే చేరడానికి పరోక్షంగానూ, నా ప్రమేయం వలనా నా జూనియర్లు చాలా మంది అక్కడ చేరడం నాకు చాలా ఆనందం కలిగించే విషయం.

1966 నుంచి 1974 దాకా నా బొంబాయి జీవితం వివరాలు – త్వరలోనే….

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. AMBALLA JANARDHAN says:

    Very good Chitten Raju garu. Many thanks for writing about Aamchi Mumbai, where I am staying since my birth about 66 years ago. I look forward to your experiences from 1966 to 1974.

  2. వంగూరి చిట్టెన్ రాజు says:

    తప్పకుండా, సార్..నేను పవయ్ లో ఉన్న ఎనిమిదేళ్ళు జీవితం గురించి మరో మూడు నాలుగు వ్యాసాలలో వ్రాస్తాను….

మీ మాటలు

*